పునాది రాళ్లు-11

-డా|| గోగు శ్యామల 

కుదురుపాక రాజవ్వ కథ

భూమి మీద హక్కు కోసం  పోరాడిన  కుదురుపాక గ్రామ మహిళల చరిత్రను ఆధునిక కోణంలో అధ్యయనం చేయాలి.   మూలవాసి చరిత్రలో భాగంగా  రాజవ్వ, బానవ్వా, కనుకవ్వల జీవిత  చరిత్రలు వెలుగులోకి రావాలి. ఈ  నేపధ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే,  సబాల్ట్రన్ అస్తిత్వాల చరిత్రలో  వెలివాడ  స్త్రీలను కేవలం స్త్రీలుగానే కాకుండా వారి కమ్యూనిటీ, కుటుంబ, సాంస్కృతిక, వృత్తి, నైపుణ్య నేపధ్యాలను కూడా అధ్యాయనం చేయాల్సి ఉంది.  రాజవ్వ మరియూ మిగితా ఇద్దరు స్త్రీల  దృష్టికోణం నుండి అధ్యయనాలు జరగాల్సి ఉంది. సుదీర్ఘ కాలంగా వీరు భూమి కోసం  చేస్తున్న  పోరాటం ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అంతే కాక,  వీరు భూమిని మాత్రమే ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అని  ప్రశ్నించుకుంటే   భూమిని  వ్యవసాయోత్ప్త్తత్తి వనరు గా మార్చే నైపుణ్యం,  వ్యవసాయపు పంటలు పండించ గలిగే పరిజ్ఞ్యానం, నైపుణ్యం, పనితనం  వీరినట్టిపెట్టుకోనున్నదనేది స్పష్టమౌతుంది.   కుటుంబం  మొత్తం సభ్యులకూ, గ్రామంలోని సబ్బండ వృత్తి  పని పాట  కమ్యూనిటీలకు ఈ నైపుణ్యం  వర్తిస్తుంది. అంతె గాక  గ్రామ సబ్బండ  కమ్మునిటీ సభ్యుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య మానవ సంబంధాలు మరియూ ఉత్పత్తి సంబధాలు అన్నీ  భూమి, వ్యవసాయ పంట ఉత్పత్తి  ప్రాతిపదికనే ఏర్పడుతాయి, కొనసాగుతాయి. కనుకనే  కుదురుపాక  ప్రజలు అందులో మాదిగ మాల స్త్రీల నుండి  భూమి కావాలనే  డిమాండ్ ప్రధానంగా  ముందుకొచ్చిందని  చెప్పాలి.  రాజవ్వతో పాటు మిగితా అందరూ తమ జీవితకాలమంతా భూమికోసమే  తాపత్రయ పడ్డారు.  1970సం.లో మొదలైన పోరాటం 2015సంవత్సరం వరకు  భూమి కోసం వేదన పడుతూనే ఉన్నారు.  ఇందులో భాగంగానే రాజవ్వ చివరి రోజుల్లో 2015 సంవత్సరంలో పోరాటం ప్రారంభమైన 45సంవత్సరాలకు  తనను పలు మార్లు  నేను మాట్లాడాను. నేటికి  పోరాటం వయసు నాలుగున్నర దశకాలైతే,  రాజవ్వ వయసు దాదాపు 95, 96 సంవత్సరాలు కావచ్చు, వృద్దాప్యంలో ఉన్న రాజవ్వ మాట్లాడి తన గ్యాపకాలను రాబట్టడo కష్టమైపోయింది. ఇదిలా ఉంటె, నాకు ఆసక్తికరమనిపించిన రెండు విషయాలనిక్కడ చెపుతాను. ఒక రోజు ఉదయం కరీంనగర్ నుండి  మిత్రులతో కలిసి కారులో కుదురుపాక చేరుకోవడం జరిగింది.   గ్రామం లోకి  మా కారు ప్రవేశించింది. చుట్టూ పక్కల  కనిపించిన వారిని రాజవ్వ ఇల్లెక్కడ అడుగుదామని కారునాపినాము. అంతలో అటుగా పోతున్న ఒకామె  ‘చిట్యాల రాజవ్వ ఇల్లు గావలేనా ?  ఈ దారిన వెళ్ళండి’ అని చూపించింది. ‘మేo  అడగకముందే మీరు మాకు సమాచారం ఇచ్చి సహాయం చేశారు.  రాజవ్వకోసం వచ్చామని మీకెట్లా తెలుసు’ ?  అని నేను ఆవిడను ఆశ్చర్యంగా అడిగాను. ఇందులో  ఆశ్చర్యం ఏమున్నది అన్నట్లు నాముఖం చూసి ఆమె వెళ్ళిపోయింది.  తరువాత తెలిసింది. కుదురుపాక గ్రామంలోని రెండు ఇండ్ల ముందుకు మాత్రమే కార్లు పొయ్యేవట. ఒకటి   రాజవ్వ ఇల్లు ఐతే, రెండోది దొర ఇల్లు. ఇది సరే ! ఎవరు ఏంటికి పోతారు అనేది  కూడా ఆ ఊరు ప్రజలకు తెలుసునట. పరిశోధకులు, పాత్రికేయులు, ఉద్యమకారులతో పొయ్యే కార్లు రాజవ్వ ఇంటికి పోతాయట. దొర చుట్టాలు, కులపోల్లు, అధికార పార్టీల నాయకులతో వచ్చేకార్లు దొర ఇంటికి పోతాయట. (ఇపుడైతె  దొరలేడు  చనిపోయిండు.  కానీ నేటికీ  కూడా దొర వారసులే  సర్పంచ్ గా కొనసాగుతున్నారు.) అంతె కాదు, ఆ కారులో వచ్చేవారి వస్త్రధారణ, మాటతీరును పట్టి ఎవరి కారు  దొర  ఇంటికి  పోతదో,  ఎవరి కారు రాజవ్వ ఇంటికి పోతదో కూడ ఇట్టె చెప్పగలరట.  అందుకే  మమ్ములను ఆ ఊరామె మీకు  రాజవ్వ ఇల్లు కావలెనా అని అడిగిందట. కుదురుపాక దళితులకు  ఇప్పటి వరకు భూమిరాలేదు, ఊరులో దొరతనం పోలేదు. కానీ మనుషులను అంచన వేయడం, ముఖ భావాలను, మనిషి కదలికలను  పసిగట్టే జ్ఞ్యానానo , అనుభవo  దక్కిందిదనే చెప్పాలి. ఇక ఈ  సందర్భంగానే  రాజవ్వ ఇంటికి చేరుకున్నాం. ఇంటిముందున్న వేపచెట్టు పచ్చటి పందిరై వాకిలిని మొత్తo కప్పేసింది.  వాకిలంతా పేడ అలికి, ఎర్రమన్ను తో ఇడుపుల అలికి ముగ్గు లేసి ఉన్నాయి. అవన్నీ చూసి  రాజవ్వకు ధైర్యం వీరత్వమే ఉన్నాయనుకున్నాము, ఈస్తటిక్స్ సౌందర్యం కూడా ఉన్నాయనిపించింది. మమ్ములను చూసి పక్క దర్వాజలో నుండి రాజవ్వ కోడలు వచ్చి ఇప్పుడేనా రాకడ? అని పలకరించింది. రాజవ్వ ఎక్కడుంది అని మేము అడుగుతూనే ఉన్నాం  మా గొంతులు సపుడిని లోపలినుండి బైటకొచ్చింది. ఆమె కూడా మమ్ములను ముందే పరిచయం ఉన్నట్లు ఇపుడే వస్తిరా, ఎట్లొస్తిరి అని తనయాసలో అడిగింది.  మమ్ములనే కాదు  తమ దగ్గరకు ఎవరొచ్చినా వారి మరియాదా పలుకరించే పద్దతి ఇలాగే  గౌరవంగా ఆప్యాంగా  ఉంటుందని తరువాత నాకర్థమైంది. వారి దగ్గరకు ఎవరొచ్చినా తమ పోరాటానికి సంఘీ భావంగానే మా దగ్గరకు వస్తారని వారి కున్న బలమైన నమ్మకం, కనుక ఎవ్వరినీ అపరిచితులను చేసి మాట్లాడరని కూడా అర్థమైంది. 95 ఏండ్ల రాజవ్వ వృద్దురాలైనప్పటికీ చురుకుగానే మాట్లాడింది. అట్లా ఆమె తో  సాగిన ముఖాముఖి సంభాషణలో  నేను అడిగిన ప్రశ్నల్లో కొన్నిటికీ తన స్పందన.
ప్రశ్న1,రచయిత:  బాగున్నావా రాజవ్వా, ఆరోగ్యం బాగుందా ?
 రాజవ్వ : యాడ బాగున్నా. బాగలేను. కండ్లు మసక లైనాయి,  కంటి చూపు రోజు రోజుకు తగ్గిపోతుంది.
2, ర : నీ వయసెంతా? నీ కిపుడెన్ని సంవత్సరాలుంటై  రాజవ్వా ?
రాజవ్వ : 95 సంవత్సరాలు దాటి ఉంటై. కీళ్ల నొప్పులు , చీలమండల నొప్పులై తున్నాయి. సిరిసిల్ల  కరీంనగర్లలో డాక్టర్ల దగ్గర చూపించుకున్నాను , మందులు వాడినప్పటికీ  తగ్గినట్లులేదు.
3,ర : నీకు పెన్షన్ ఏమైన వస్తదా ? ఎంత వస్తున్నది. ?
రాజవ్వ: ఎన్నో దినాలు  ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి పెన్షన్ తెచ్చుకున్నా. అవొస్తున్నై నెలకు 200 రూపాయలు. ఇగ గవ్వి ఆధారమైతున్నయి.
4.ర: నీవు ఎం ఎల్ పార్టీ ( సంఘం )ల పనిచేసిన జ్ఞపకాలు కొన్ని చెప్పు రాజవ్వ?  
రాజవ్వ :  గొప్ప జ్ఞ్యాపకాలు  ఏమీలేవు.’ పొయ్యి ఒయ్యి  బోళ్ళు మిగిలినయ్ ‘ అన్నట్లు న్నది బతుకు. వంటగదిలో అసలైన పొయ్యి పోయింది కానీ వంటగిన్నెలు మిగిలినయ్. పోయ్యి లేనిది వంట పాత్రాలేమిటికి? అన్నట్లు. అసలు పోయినై మీది మీదివి మిగిలినయ్. భూమి రాలేదు, గాయాలు, గోసలు మిగిలినయ్. అవే నా   జ్ఞ్యాపకాలు.  అని చెప్పుకొచ్చింది రాజవ్వ. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.