తక్కెడబాట్లు

-తగుళ్ళ గోపాల్

అయ్యా…వొంటి చేతిదాన్ని

తక్కెడబాట్లే నా చేతులు

కండ్లకు నల్లరిబ్బను కట్టుకొని

న్యాయాన్ని జోకుతున్న ధర్మదేవతను గాదు

వొట్టి కండ్లు లేని దాన్ని

పండ్లమ్ముకునే ముసలిదాన్ని

దినాం ఇక్కడే,ఈ నల్లఛత్రి కిందనే

కుళ్లిపోయిన పండ్లలాగ పడుంట

బతుకును కుప్పలుకుప్పలుగా పెట్టుకుంట

పెద్దకొడుకు పోయినప్పటిసంది

ఈ అంగడే నా పెద్దకొడుకు

ఈ తక్కెడబాట్లే ఇంతజీవగంజి

సారూ….నీకాల్మొక్కుత…

వొకచేతిలో పండ్లగంప పట్టుకొని

బస్సుకిటికీలెంబడి

రయ్యరయ్య ఉరుకలేనిదాన్ని

కారుఅద్దాల ముందు

‘పదికి మూడు,పదికి మూడు’ అని కూతేసి

వొంగి నిలబడలేనిదాన్ని

కన్నోడిపేరు,కొన్నోడి పేరు నిలవెట్టాలని

అడుక్కోలేక అమ్ముకుంటున్న

ఇన్ని పండ్లముందు కూసున్నమాటే గానీ

ఎన్నడూ వొక పచ్చగూడ

నోట్ల ఏసుకోవడం ఎరుగను

ఏ జంగమయ్య వొచ్చైనా దానమడిగితే

తిట్టుకోకుండా పెట్టినదాన్ని

సంచిలో చిల్లరపైసలు లేకుంటే

వొక పండు ఎక్కువేసినదాన్నేగాని

ఎవరిసొమ్ము వుంచుకోలేదు

ఆవులూ,మేకలూ

ఈ పండ్లచుట్టే ఈగల్లాగ తిరుగుతున్నా

కట్టెవట్టి కసిరించుకున్నదాన్నేగానీ

ఏనాడు చేయ్యెత్తి వొక దెబ్బగొట్టలే

గుడ్డబట్ట సక్కగలేని మాములుదాన్నే గానీ

‘మాములు’ అడుక్కునే దాన్నిగాదూ

మోరు మార్కెట్లొచ్చి

నడుముమీద తంతే

చావలేక గుడ్డికొంగోలే బతుకుతున్న

బ్యాంకులు దోసుకొని

దేశాలు తిరిగిన దొంగదాన్ని కాదయ్య

ఇగో..ముత్యమంత జాగకు

ఇరవైరూపాలిచ్చిన రశీదుకాయితం

అయ్యా…కోపమొస్తే

వీపుమీద ఓ దెబ్బగొట్టుండ్రి

నీకు సలాంజేస్త

తక్కెడబాట్లు గుంజుకొని

నా వొట్టికట్టెలాంటి చేతులిరువకుండయ్యా….

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.