సంతకం సాహిత్య వేదిక సమావేశ విశేషాలు

-వైష్ణవి శ్రీ

సంతకం సాహిత్య వేదిక రెండవ ఆన్లైన్ జూమ్ సమావేశాన్ని జూన్7, 2020 ఆదివారం నాడు జరుపుకుంది. ఆ సమావేశ విశేషాలు నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా:-

జీవితమంటేనే రాజకీయం. అలాంటి రాజకీయంలో డబ్బు, మానవ సంబంధాలు,విద్య ఆరోగ్యం, ఇవన్నీ ఉంటాయి. సాహిత్యానికి వీటికీ అవినాభావ సంబంధం కూడా ఉంది.
కరోనా సమయంలో వలస కార్మికులు ..వలస జీవితాలు పడిన బాధలు అన్నీ ఇన్నీ కాదు.
వీటితో పాటు ఈ సమయంలో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇదే సమయంలో అమెరికాలో ఈ మధ్య జార్జ్ ఫ్లాయిడ్ పై చూపించిన వర్ణ వివక్ష ప్రభావం..దాని పోరాటం, ఇంత దారుణమైన పరిస్థితుల్లోనూ అమెరికా ఆరోగ్యం..కన్నా ఆర్ధిక రంగానికి ప్రాముఖ్యత నివ్వడం ఈ అంశాలను కేంద్ర బిందువుగా తీసుకుని సాహిత్య దిగ్గజాలు వారివారి విలువైన స్పందనను ఎంతో లోతుగా విశ్లేషించిన తీరు చాలా హర్షణీయం..నిన్న సాయంత్రం ( 07.06.20)గం. 5.30 నుంచి 9.20 ని లవరకూ నిరంతరాయంగా ఎక్కడా బోర్ అనిపించకుండా నాలుగు గంటలు పాటు కదలనీయకుండా ఓ రకంగా ఆ నాలుగ్గంటల కాలం అందరినీ జూమ్ కు కట్టిపడేసిందనే చెప్పాలి.
ప్రతి అంశం లోనూ కొత్తకొత్త చర్చలు..కొత్త ఆలోచనలు..కొన్ని పరిష్కారాలతో ముందుకు సాగింది.

కొండేపూడి నిర్మల గారు పరిచయ కర్తగా, శ్రీనివాస్ వాసుదేవ్ గారు సమన్వయ కర్తగా పైన సూచించిన నాలుగు అంశాలను పలువురు వక్తలు చర్చించడంతో పాటు పలు సూచనలు ఇవ్వడం జరిగింది.

ఇవే తీసుకున్న నాలుగు అంశాలు –
1.కార్మికులు – వలసలు- వక్త – రాజారాం తూముచర్ల గారు
2.కరోనా నేపథ్యంలో మానవ సంబంధాలు-వక్త- ప్రసేన్ గారు
3.అమెరికాలో జాతి వివక్ష వ్యతిరేక పోరాటం -వక్త – నారాయణ స్వామి వెంకటయోగి గారు
4.ఆరోగ్యం – ఆర్థికం; అమెరికా దేనికి ప్రాధాన్యం ఇచ్చింది- వక్త – డా|| కె. గీత గారు

ప్రముఖ స్ర్తీ వాద కవయిత్రి, నిర్మల కొండేపూడి మేడం సభను ప్రారంభిస్తూ సంతకం సభ్యులు కేవలం కవిత్వానికే పరిమితం కాకుండా అనువాదాలు ,కవిత్వ నిర్మాణ పద్ధతులు, జూమ్ ప్రయోగాల ద్వారా మరింత ముందుకు సాగుతున్నారనీ , సమాజంతో ముడిపడిన మనిషి జీవితమూ రాజకీయమేనని కాబట్టి ఇప్పుడు నడుస్తున్న వర్తమానాన్ని ఒడిసి పట్టుకోవలసిన అవసరమూ కవులందరిపై ఉందని ..ఆ దిశలోనే సంతకం గ్రూ ప్ ముందుకు సాగుతోందని వివరించారు.

1.వలస కార్మికులు..వారి జీవితాలు ..మొదటి అంశంలో భాగంగా…ముందుగా రాజారాం తూముచర్ల సర్ మాట్లాడుతూ వలసకార్మికుల వెతలు చెప్పనలవి కాని వన్నారు .”కూటి కోసం కూలి కోసం పట్టణానికి బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం” అనే కంట.తడి పెట్టించే శ్రీ శ్రీ పాటను గుర్తుచేశారు. కరోనా సంక్షోభ సమయంలో లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో, ప్రాణాలను గుప్పెట్లో పెట్టు కుని ఎలాగొలా తమ సొంత ఊరికి చేరితే చాలని వేల మైళ్ల దూరాన్ని లెక్క చెయ్యకుండ..పాదాలు రక్తమోడుతున్నా ఆకలి కడుపులతో నడిచిన తీరుకు హృదయం ద్రవించని వారుండరేమో అన్నారు. అంతే కాదు ఈ సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు అండగా నిలుచున్నారని ..మానవత్వాన్ని చాటుకున్నారన్నారు.

ఈ మాటలకు
ప్రముఖ కవి శ్రీ డా.రాధేయ.గారు స్పందిస్తూ ఆకలిని మించిన భయంకరమైనదేదీ ఉండదని చెబుతూ వలస కార్మికులపై మంచి కవిత చదివి వినిపించారు..పేదరికాన్ని మించిన విపత్తు మరేదీ ఉండదని
రోడ్డుమీద నడిస్తే పోలీసులు కొడతారని రైల్వే ట్రాక్ను ఆసరా చేసుకోవడంతో ప్రాణాలు కోల్పోయిన వాళ్లను చూశామన్నారు..ఇన్ని జరిగినా, చూసి చూడనట్లు వారి ప్రాణాలను గాలికి వదిలేయడం ప్రభుత్వం హేయ చర్యకు నిదర్శమని తన బాధను తెలిపారు..

ఇదే అంశంపై కవి సమ్మెట విజయ గారు మాట్లాడుతూ మనం పక్క వీధిలోకి వెళ్లడానికే నడవలేం ..అలాంటిది వేలమైళ్ళ కాలి నడకను చూసి మనసు ద్రవించిపోయిందన్నారు. విజయ మేడం కూడా శ్రీ శ్రీ గారి కూటికోసం కూలికోసం పాటను..ఎప్పుడొస్తవు లేబరీ పాటలను గుర్తుచేశారు..
వలసకార్మికుల వెతలపై రాసిన పలువురు కవులను వారి కవితలను తెలుపడంతో పాటు…రక్తనాళాలు ఆగని జ్వాలలు ..అనే తన కవిత చదివి వినిపించారు.

ప్రముఖ కవి శ్రీరాం గారు తన స్పందనను వినిపిస్తూ.. నాగభూషణం గారి..”అటునుంచి ఇటు నుంచి”కవితను గుర్తు చెయ్యడంతో పాటు భారత దేశ ముఖచిత్రమంతా వలస కార్మికుల వ్యధలే ఉన్నాయన్నారు. 2018లో తమ హక్కుల కోసం బొంబాయి కి వేల రైతులు కాలి నడకన వెళ్లారనీ,
అప్పుడూ ఇప్పుడూ అదే నడక పెద్ద తేడా ఏం లేగని చెప్పారు. UP మైగ్రేట్ కమిషన్ తీసుకొస్తే వలసల కష్టాల నుంచి బైట పడతారని చెప్పారు.

ప్రముఖ కవి ..మువ్వాశ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. నేడు మానవ సంబంధాలే ఒక పెద్ద రాజకీయమని, ప్రస్తుత సమాజంలో కవిత్వం చదివే వాళ్లు కొద్ది మంది మాత్రమే ఉన్నారనీ, అందులో ఎంత మంది చదివి అనుకరిస్తారో తెలియదన్నారు. కవి రాయడానికి మాత్రమే పరిమితం కాకుండా సమస్య మూలాలలను వెతికే దిశగా ముందడుగు వెయ్యాలని చెప్పారు.

2.రెండో అంశం మానవ సంబంధాలు కరోనా పై ప్రముఖ కవి ప్రసేన్ సర్ స్పందిస్తూ… మానవ సంబంధాల్లోనూ. ప్రపంచంలో ప్రతి అంశమూ రాజకీయమే అన్నారు. పరిస్థితులను బట్టి వాతావరణాన్ని బట్టి అవి ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటాయని, నమ్మితీరాల్సిన నిజమని, మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని బల్లగుద్ది చెప్పిన మార్క్స్ ని మనమంతా ఒకసారి గుర్తుతెచ్చుకోవాలని చెప్పారు. ప్రతి సంక్షోభంలోనూ మనిషి వికృత రూపం బైట పడిందని ..పడుతుందని, ఈ కరోనా సమయంలోనూ ఇరుగు పొరుగులు, పోలీసులు ఇలా చాలామంది తమ విశ్వరూపాన్ని ప్రదర్శించాయని బాధను వ్యక్తం చేశారు. ఇంకో విషయమేమంటే వీటిల్లో మంచి, చెడూ రెండూ ఉన్నాయని చెప్పుకొచ్చారు. నాగరికత ముందుకు సాగాలంటే మానవ సంబంధాలే మూల ఇంధనమని గట్టిగా చెప్పారు. షేక్ హ్యాండ్ కన్నా ఆలింగనంలో ఎక్కువ దగ్గరితనం ఉంటుందని ఈ కరోనా అంత గొప్ప సంస్కృతిని దూరం చేసిందని,. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని..వారిని కలిసిన వారినీ వెలివేసినట్లు చూడటం చాలా దారుణమని బాధను వ్యక్తం చెయ్యడమే కాకుండా, తొలినాళ్లల్లో పరీక్షలు చేసిన ప్రభుత్వం ..సెకండరీ కాలంలో పట్టించుకోకుండా వదిలేసిన నిర్లక్ష్య.ధోరణిని వివరించారు. ఇదే సమయంలో పేదవాళ్లకు ..నిరాశ్రయులకు బియ్యం నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి ముందుకు రావడంలో చాలా మంది శ్రద్ధ చూపారు.కరోనా రావడానికి మర్కజ్ వెళ్లి వచ్చిన ముస్లింలే కారణమంటూ వాళ్లను మానవ సమూహాల నుంచి పక్కకు తోసెయ్యడం చాలా అమానుషని తెలియజేసారు..మానవ సంబంధాలు పూర్తిగా చెడిపోలేదు కానీ కొన్ని కర్కశత్వాలు, మూర్ఖత్వాలు వాటంతటవే ఈ కాలంలో బైటకొచ్చాయని దీని నుంచి ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకోవాలని చాలా మంచి విషయాలను స్ర్పృశించి అంతటా ఆసక్తిని రేకెత్తించారు.

స్పందనగా…రామానుజరావు గారు మాట్లాడుతూ కరోనా తీవ్రతను అరికట్టడం అసాధ్యమని. మరణాలు తప్పవని, చాలా దేశాల్లో 80ఏళ్ళు దాటిన వృద్ధులను ఆదుకోవలసింది పోయి వారి మానానికి వాళ్లను వదిలేయడం చాలా అమానుషమైన చర్యని చెప్పారు.

ప్రముఖ కవయిత్రి భవాని గారు స్పందిస్తూ.. కరోనా సమయం నాణేనికి రెండు వైపులా ఉన్నట్లు. మంచికి మంచి..చెడుకు చెడూ రెండూ ఉన్నాయని చెప్పారు.  కుటుంబమంతా ఒక చోట ఉండటం మంచికి సూచనైతే, అదే సమయంలో ముస్లిం సోదరులపై చూపిన వివక్ష.చాలా దారుణమైందని చెప్పారు. అంతే కాకుండా అద్దెకు ఉంటున్న వైద్యుల్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పిన చాలా మంది ఇంటి ఓనర్ల ప్రవర్తన హేయమైనదని, అన్నింటినీ మించిన హృదయ విదారకమైన దృశ్యం వలస కార్మికుల కాలినడని , కవులు ఇలాంటి సమయంలోనే ఎక్కువగా స్పందించాలని చెప్పారు.

ప్రముఖ కవయిత్రి శాంతిప్రభోద గారు తమ కవితని వినిపించారు. జీవితమిప్పుడు గతంలోలా లేదు అంటూ…మానవ సంబంధాలపై తన స్పందనను కవిత రూపంలో తెలియజేశారు.

3.మూడవ అంశం “అమెరికాలో జాతి వివక్ష వ్యతిరేక పోరాటం” గురించి ప్రముఖ కవి నారాయణ స్వామి వెంకటయోగి గారు మాట్లాడుతూ ప్రస్తుత సందిగ్ధ కాలంలో చాలా విచిత్రమైన మార్పులు జరిగాయని చెప్పారు. అమెరికా, చైనా, ఇటలీలో విపరీతమైన మరణాలు సంభవించాయన్నారు. బ్రెజిల్  లో కరోనాను కట్టడి చెయ్యలేము మరణాలు సంభావించాల్సిందేనంటూ 80 ఏళ్లు దాటిన వృద్ధుల పట్ల ప్రభుత్వం ఎంత కర్కశంగా ప్రవర్తించిందో ఆయన మాటల్లో వివరించారు. మున్నుందు బలహీనులను పక్కకు నెట్టేసి, బలంగా ఉన్న వాళ్లకు మాత్రమే ప్రభుత్వం గారెంటీ ఇస్తుందా? పల్లెటూళ్ల నుంచి కేవలం కార్మికులే కాదు. ఇక్కడ జీవనోపాధి దొరకక పొట్టచేత పట్టుకుని చాలా మంది వలస పోతున్నారు. దీంతో పట్టణాల్లో జనాభా పెర్టిగి కాలుష్యమూ పెరుగుతోంది. అంతేకాదు కాలుష్యం కారణంగా అనేక రోగాలు, బాధలూ, అవస్థలూ పెరుగుతాయని చెప్పారు. కరోనా కారణంగా వారికి భరోసా ఇవివకపోవడంతో కార్మికులంతా వెళ్లిపోయారు. తిరిగి వస్తారన్న నమ్మకం లేదంటూ తన బాధను వ్యక్త పరిచారు. కంపెనీల పనిదినాలు తగ్గి సప్లై తగ్గిపోయింది. ఆర్ధిక మాంధ్యం దేశాన్ని కుంగదీసే ప్రమాదం పొంచి ఉంది. దీని భారం ప్రపంచం మొత్తం మీదా పడుతుంది. కిట్ లూ వాక్సిన్లూ తయారు చేస్తున్నారన్నది వినడానికి బాగుంది కానీ రాబోవు కాలం ఎలా ఉంటుంది ఊహించలేం. భౌతిక దూరం పాటించాలంటున్నారు. ఉలాంటి పరిస్థితుల్లో విద్యార్ధులు ఎలా స్వేచ్ఛగా  బడిలోకి అడుగులు వేస్తారు..వేసినా వారి మధ్య సత్సంబంధాలు ఇంతకు ముందులా కొనసాగుతాయా? ఇలాంటి ఎన్నో సందేహాలను..లేవనెత్తారు వెంకట యోగి సర్..ఇవన్నీ నేటి వ్యవస్థకు చాల అవసరమైన విషయాలు..వలస జాతుల నివాసమైన అమెరికాలో నల్ల జాతీయుల పట్ల వివక్ష చూపడాన్ని, ఏషియన్ అమెరికన్స్ గా స్థిర పడిన భారతీయులు కూడా వారినెలా వ్యతిరేకిస్తున్నారో వివరించారు.జార్జ్ ఫ్లాయిడ్ హత్య పై వెల్లువెత్తిన నల్ల జాతి ప్రభంజనాన్ని తన మాటల్లో వ్యక్తం చేశారు.

దీనికి స్పందనగా ప్రముఖ కవయిత్రి రేణుక అయోలాగారు నలుపు రంగు భారత దేశంలోనూ వివక్షకు గురౌతోందని..బిడ్డ పుట్టగానే ముందుగా నలుపా తెలుపనే కుతూహలాన్నీ..ఒక రకమైన వివక్షను అందరూ చూపుతున్నారని చెప్పారు.. అమెరికాలోని భారతీయులు నల్లవాళ్ళపై వివక్ష చూపుతున్నారని చెప్పారు. సమస్య ఎక్కువైనప్పుడు మాత్రమే అక్కడ స్పందిస్తాన్నరని చెబుతూ తన కవిత “నీ నీలి చూపుల ఊపిరి……”చదివి వినిపించారు. 

ప్రముఖ కవి అరణ్యకృష్ణ గారు మాట్లాడుతూ సోవియట్ యూనియన్ – అమెరికాల మధ్య జరిగిన సోషలిస్టు-కెపటలిస్ట్ శిబిరాల ప్రచ్ఛన్న యుద్ధం 1990ల తొలినాళ్లలో సోవియట్ కుప్పకూలటంతో ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ విజృంభణ పెరిగిందని చెప్పారు. ఆయా వ్యవస్థలలో దోపిడీని యథాతథంగా ఉంచటం రైట్ వింగ్ లక్ష్యమని, దానిలో భాగంగానే అంతర్జాతీయంగా జాతుల మధ్య వైరాలు, అణచివేత, హింస దేశాల మీద యుద్ధాలు, అంతర్యుద్ధాలు సంభవించగా మన దేశంలో కులం, మతం, జాతి హింసలు ప్రేరేపించబడ్డాయన్నారు. అక్కడ నల్లవారైనా, ఇక్కడ దళితులు, మైనరిటీలైనా అదే దౌష్ట్యానికి గురవుతున్నారని తనవిలువైన స్పందనను తెలపడంతో పాటు..చూపు అనే కవితను చదివి వినిపించారు.

4 అంశం ఆరోగ్యం -ఆర్థికం -అమెరికా: ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” అంతర్జాల మహిళా పత్రిక  అధినేత్రి డా||కె. గీత గారు మాట్లాడుతూ అమెరికా ఆరోగ్యం కంటే ఆర్ధిక వ్యవస్థ మీదే ఎక్కువగా దృష్టి పెట్టిందని, అమెరికాలో కేసుల సంఖ్య 2 మిలియన్ల పై చిలుకేనని, మరణాలు 110 వేలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్యతో పోలిస్తే ఇది మూడొంతులు ఎక్కువ. అక్కడ లాక్డౌన్ ని “షెల్టర్ ఇన్ ప్లేస్” అని అంటారని, అమెరికా ఆర్థికంగా నష్టపడకూదనటానికి వెనకాల చాలా రాజకీయకారణాలు ఉన్నాయన్నారు. ఒక  పెద్ద కారణం రాబోతున్న ఎన్నికలని , అధ్యక్షుడి అడుగుజాడల్లోనే దేశమూ నడుస్తుందని , పరిస్థితిని సీరియస్ గా తీసుకోకపోవడం, ఏమీ కాదన్న నిర్లక్ష్య ధోరణి, గర్వంతో కూడిన మూర్ఖత్వం కూడా విఫలతకు కారణాలే అని అన్నారు. ఇక ఇన్సూరెన్స్ విధానాల్లో కూడా లోపాలున్నాయని చెప్పారు. కార్పొరేట్ ఆర్థిక లబ్ధికి తోడ్పడే ఇన్సూరెన్స్ విధానాలు ప్రవేశపెట్టడంతో బాటు ఒబామాకేర్ రద్దు యత్నాలు జరుగుతూ ఉన్నాయన్నారు.  $2 ట్రిలియన్ల డాలర్ల సహాయక నిధిలో 5 వ వంతు కంటే తక్కువ ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కోవడానికి ఉపయోగింపబడింది. కార్పొరేట్ సంస్థలకి ప్రాధాన్యతనిస్తూ మాంసం ఉత్పత్తి కేంద్రాలు కోవిడ్ వ్యాప్తికి నిలయాలుగా ఉన్నా తెరచి ఉంచడానికి అనుమతులు ఇచ్చారన్నారు. ఆరోగ్య పరంగా రాష్ట్రాల్ని సమన్వయం చెయ్యలేకపోవడం, ఆరోగ్యపరమైన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం, స్థానిక ఫ్యాక్టరీలు మెడికల్ కిట్లని సకాలంలో అందజేయకపోవడం, వెంటిలేటర్లు, మెడికల్ కిట్లని చవకగా ఇతరదేశాల నుండి దిగుమతి చేసుకోవడంపైనే ఆధారపడడం, ఖరీదైన దేశీయ మెడికల్ మాస్కులని ముందుచూపు లేకుండా ఎగుమతి చెయ్యడం, మహమ్మారులు వచ్చినపుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, పేద ప్రజల ఆరోగ్య ప్రమాణాల పట్ల మొదట్నుంచి శ్రద్ధ వహించకపోవడం, ఆసుపత్రులలో అత్యవసర విభాగాల కొరత వంటి ఇతర విషయాల గురించి సోదాహరణంగా వివరించేరు.

చంద్రశేఖర శాస్త్రి గారు,గట్టు రాధిక మోహన్, నేను స్పందనలో భాగంగా వలస కార్మికులు, జాతి వివక్షత కవితలు చదివారు. సుభాషిణి తోట, అనిల్ డ్యానీ గారు కూడా పాల్గొన్నారు. 

“సంతకం సాహిత్య వేదిక” ముగింపు కార్యక్రమంలో భాగంగా అరణ్య కృష్ణ సర్..”చావు వాసనేస్తోంది” కవితను రాజారాం తుముచర్ల సర్ చదివి వినిపించారు.

కొండేపూడి నిర్మల గారు మాట్లాడుతూ..ఈ వేదిక సమయాన్ని కూడా పట్టించుకోకుండా, విషయానికే ప్రాముఖ్యత ఇచ్చిందని చెప్పి కార్యక్రమాన్ని ముగించారు.

 

*****

Please follow and like us:

2 thoughts on “సంతకం సాహిత్య వేదిక సమావేశ విశేషాలు”

Leave a Reply

Your email address will not be published.