దూరంగా అతను‌!

                                                                – మనోజ నంబూరి

అబ్బ…ఈ మల్లె తీగ మళ్ళీ చిగురులేస్తుందనీ, జీవంతో నవనవలాడుతుందనీ  అస్సలు అనుకోలేదబ్బా‌….అచ్చం నాలాగ!. నాలాగే కదూ బుల్లి బుల్లి లేత చివుళ్ళ పాపలూ……బుజ్జి బుజ్జి….చిట్టి చిట్టీ..తీగని కదిలిస్తూ, ముద్దు చేసింది దీప‌. 

వెంట ఎవరైనా పడితే గాని నువ్వు వేగం అందుకో లేవు…….అన్నట్టుగా ఉన్నట్టుండి ఆమె జీవితం లో ఒక వేగం, ఒక  క్రమం,  ఓ ఉత్కంఠ, ఓ పరిమళం కలగలిసి, ఉదయాలన్నీ ఓ కొత్త రోజుగా ఊరిస్తూ, ఉసిగొల్పుతూ ,ఆమె జీవితంలోకి తమను ఆస్వాదించమంటూ రావటం మొదలు పెట్టాయి.. ఈ కొత్త జీవన స్పర్శ దీప అసలు ఊహించని అనుభవం. 

ఆ ఫ్లాట్ కి వచ్చి సుమారుగా ఆరు నెలలు. ఎంతో ఇష్టంగా పూలకుండీలు అమర్చుకున్న తన  వాష్ ఏరియాలోనే ఇంట్లో ఉన్న సమయంలో సింహభాగం గడపటం మొదలు పెట్టిందంటే కారణం అతనే…అతను అంటే “దూరంగా..అతను!” అని. 

పాపని నిద్ర పుచ్చుతూ, పాపని ఆడిస్తూ, ఆ పూల కుండీలలో నీరు పోస్తూ.‌..వాలుగా అటే చూస్తూ….ఆమె మర్చిపోయిన నవ్వులు తిరిగి పోగుచేసుకుంటూ….తనకే తను ఏంటేంటో చెప్పుకుంటూ‌……ఏదో కొత్త  సజీవ స్పర్శ అలవోకగా ఊహల్లో దర్శిస్తూ….. ఎదురుగా, కూతవేటు దూరంలోనే ఉన్న అపార్ట్మెంట్ బాల్కనీలో నిలబడే ‘అతన్ని’ తన దినచర్య లో భాగం చేసుకుంది దీప. 

దీప జీవితంలో ముగిసిన ఓ కథ మూడేళ్ల కూతురిని జ్ఞాపకంగా మిగిలిస్తే….ఇక ఈ ‘దూరంగా అతను’…ఆమె జీవనచిత్రంలో ఏవేం రంగులు విసరబోతున్నాడో చూడాలి అని ఇరు అపార్ట్మెంట్ల మధ్య గల పెద్ద జాగాలో నిటారుగా ఉన్న ఓ మామిడి చెట్టు తలాడిస్తూ రెండు కథలనూ కుతూహలంగా పరికిస్తూ ఉంది. 

    ఒక  అతి సాధారణమైన మన రోజును గొప్ప ఎదురుచూపుగా ప్రారంభించి, ఆపై ఓ మధుర జ్ఞాపకం గా మలచటానికి ….ఓ మనసు చేసే నిశ్శబ్ద సవ్వడీ, గాలిని చీలుస్తూ చొచ్చుకొచ్చి తడిమే ఓ అపరిచితుని మౌన వీక్షణం…ఏదైనా  కారణం కావచ్చు. 

రోజూ సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ క్రెచ్ నుండి తన మూడేళ్ల కూతుర్ని తీసుకు  చంకన వేసుకొని, అదిరే గుండెలతో తాళం తీస్తుంది‌ దీప‌. పాపను దించి, తాళం చేతిలో ఉండగానే వాష్ ఏరియా కి ఉరుకుతుంది.

అవును ఆమె ఊహించినట్టే…అతను‌‌! అతను .‌.అక్కడ… ‘అప్పుడూ’ ఉంటాడు!. 

లేవగానే  వాష్ రూమ్ కాదు, ముందుగా వాష్ ఏరియాకే వస్తుంది‌.

అతను…. ‘అప్పటికే’ …. అక్కడ ఉంటాడు! 

రాత్రి పది వరకు వాష్ ఏరియాకి ఓ అడుగు వేస్తూనే ఉంటుంది‌.

‘అప్పుడు కూడా ‘….అతను అక్కడే ఉంటాడు!

ఇటే చూస్తూ…ఇటు మాత్రమే చూస్తూ ! అలాంటపుడు ఎవరి  మనసైనా  ఎందుకు తన యజమాని మాట వినాలి??! 

ఓ మనిషి మనకోసం… మన మీద అంత అటెన్షన్ పెట్టాడు అనే విషయం అవతలి మనిషికి ఎంతో ఆసక్తిని, మరింత బలాన్ని ,తెగింపుని కూడా ఇస్తుందనీ, అందుకు అతీతులుకాని వారిలో తానూ ఒకటని దీప మనసుకు తెలుసు.

***

పనమ్మాయి  రమణక్క ఆ రోజు తన ఏరియాలో తచ్చాడుతున్న దీపను ఓరకంట గమనిస్తూ , గిన్నెలు పరా పరా తోముతూ అడిగింది.‌

“అమ్మా..మీ అత్తా, మామైనా రావొచ్చుగా ఇంటికి రామ్మా అని పిలవటాకీ?!”….అని. 

హు..ప్రాబ్లెమ్ లేపిందే వాళ్ళుకదా…ఐనా అంతా అయిపోయాక ఎందుకు పిలుస్తారు మన పిచ్చిగానీ….దీప విరక్తి గా జవాబిచ్చింది. 

అదేంటమ్మా…అలగంటారు.‌ ఆడపిల్ల, పసిపిల్ల అనీ లేదాండీ ఆరికీ…..పిల్ల నానేడి…నానేడి..‌అంటది కదా రేపైనానూ….అంది సానుభూతిగా. 

హు… ఆరేళ్ల కాపురం ఇచ్చిన చనువుతో, బీరువాలో పదివేలు ఉండాలి చూసారా అన్న ఒక్క మాటకు  రాజుకున్న నిప్పు , అత్త ,మామ

ఆడబిడ్డల  ప్రమేయంతో దావానలమై…చివరికి తీసిందెవరో ఋజువవ్వకుండానే విడాకులు మంజూరయే వరకు పోయింది. ఇంకా ఏం మిగల్లేదు రమణక్కా…అతను పెళ్ళికూడా చేసుకున్నాడట‌. విన్నాను. 

ఐనా…ఎదో అవ్వాలి గనుక పెళ్ళి. చెయ్యాలి గనుక కాపురం..కనాలి గనుక పిల్లలూనూ!…అంతకు మించి ఏం లేదు నిజానికి నా గతంలో! 

వచ్చిన కొత్తల్లో నీడల్లే వెన్నంటి నడిచిన   బాధతాలూకూ నలుపు ఛాయ మళ్ళీ దీప ముఖంలో లీలగా కనిపించి, అంతలోనే  సర్దుకుంది‌. ఆ సర్దుబాటు కు అందమైన ‘కారణం’ సమీప దూరంలో ‘నిలుచుని’ ఉందని తెలుసుకోలేనిది కాదు రమణక్క. 

“ఏంటమ్మా అటేపు సూత్తన్నారు?” అంది ఏమీ తెలీదన్నట్టూ… 

“అదా‌..అదీ…అతను‌‌….అతను కొంత కాలంగా ఇటే చూస్తుంటాడు రమణక్కా….నిత్యం…అదే పనిగా..ముఖం క్లియర్గా కనిపించదు గానీ…ఇటే చూస్తాడని మాత్రం చెప్పగలను”.

కనుచూపు మేరకు చివరంచున లీలగా కనపడే అతని ముఖాన్ని మరోసారి ఆసక్తి గా చూస్తూ చెప్పింది దీప. 

“ఆయన ఇటేపుకే ఎందుకు చూత్తాడూ అంటారా??…మన వాషింగు ఏరియాకి కిందేపూ… మామిడి చెట్లున్న జాగా ఆయిందే కదమ్మా…సూసెరా ఎపుడైనా..ఇక్కడే భరీ ఆయనగారి….. రమణక్క మాట మధ్యలోనే ఉంది. 

“నాయనోయ్…పాప మంచంమీంచి పడినట్టు ఉంది” అంటూ ఒక్క గెంతులో లోపలికి వెళ్ళింది దీప. 

పని ముగిసాక ఒక్క క్షణం ఎక్కడా నిలబడదు  రమణక్క..పాపను ఊరుకోబెడుతున్న దీపతో వస్తానని చెప్పి బయటపడింది. 

*** 

రెండోరోజు మరికొన్ని వివరాలు సేకరించింది దీప. రమణక్క నుంచి.

ఆయనమో బేంకీ అండి. మన పక్కని ఖాళీ జాగాకూడా ఆరిదేనంట….బాగా మోతుబరులంట. పాపం ఆరి భార్యాగారిని ఒంటిగా చూసి పంపులేసే ప్లంబరునా కొడుకు దోర్జన్యం చేసి చంపేసి నగలొలుసుకు పోయాడంట.

అప్పటి సంది ఆయన పిచ్చోడిలాగ తయారయి….ఏదో విగారస్సు అంట..బేంకీకి అదిచ్చేసి ఇంటికే బందీ అయిపోయినడు.

ఔనా..‌అదీ విఆరెస్సు లే. అయ్యో.‌ చాలా విషాదమే…ప్చ్. ఇంకెవరూ తోడులేరా పాపం??! 

లేరమ్మా…వంటకి ఒకరూ…పనికి నేనూను‌..కడగటం ముగించి కర్రు,కర్రు మని చీపురుతో వాష్ ఏరియాని కడిగి ..బయలుదేరింది రమణక్క.

కదలకుండా నిలుచుండి పోయిన దీపని తప్పించుకుని. 

ఆ రాత్రి బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాకే పడుకుంది దీప మాగన్నుగా‌.

నీ హృదయ రహస్యాలు గాలితో ఎందుకు నా చెవిలో చెప్పుకో నేస్తం‌….రేపు వస్తున్నా కదా..నా హృదయం పరవటానికి నాకేమాత్రం బెరుకు లేదు తెలుసా‌….. 

మన ఒంటరి చేతులను జతచేసుకుందాం…మరుక్షణం జరిగే హృదయ  అంకితాలను ఆపగలమా‌‌…!! ఇలా ఏవేవో…పొంతనలేని పలవరింతలతో తెల్లవారింది. 

దీపకు మగతతో లేవాలనిపించలేదు…కానీ ఆరింటికే ఊరినుంచి వచ్చిన ఫోన్ ఊరికి పరిగెత్తించింది. రమణక్క నంబరు తీసుకోనందుకు చాలా సార్లే తనను తాను తిట్టుకుంది దీప. పోయిన తల్లికి దినవారాలు పూర్తి చేసి, పదిహేను రోజుల కు ఫ్లాట్ కి చేరింది దీప.

పాపకి చాకోస్ తినిపించి, వరండాలో పడున్న పేపర్లను సర్దుతుంటె ఎలా తెలిసిందో గానీ రమణక్క వచ్చేసింది.

ఇది చూసావా‌.

“భార్య హంతకుడికి శిక్ష పడిన రోజే భార్యను చేరుకున్న భర్తట‌”!. దీప బాధగా అని.‌.పొద్దున్నే ఈ చావు కథలు మన వల్లగాదు గానీ పద..పద‌‌ మంచి కాఫీ పెడతా అంటూ చేతిలో పేపరు పక్కన పడేసి లేచింది. 

తను  అడగాలనుకుంటున్న విషయం…అతి మామూలుగా అడగటం కోసం దీప చేసే ప్రయత్నం రమణక్క కి అర్ధం అయింది. 

అవునూ మీ కుండీలన్నీ బాగున్నాయాండీ అంది వాష్ ఏరియాకు నడుస్తూ..రమణక్క. 

భలే గుర్తుచేసావు పద అంటూ వెనుకే వచ్చింది దీప.

ప్చ్‌..చూసావా కొత్త చిగురు…ఎలా వాడిపోయిందో మళ్ళీ.. అంది దీప బాధగా.. 

అవునూ అతనూ…అతను కనపడటంలేదేమిటబ్బా…ఎపుడూ పనిలేనోడల్లే అక్కడే ఉండేవోడుగా అంది పెదాల్లో లేని అనాశక్తిని పదాలపై అద్దుతూ. 

ఆయనా లేడండి!.‌ఆయనింట్లో పనీ లేదండిక నాకు అంది రమణక్క.

ఏం ఏమయ్యాడు తనూ??!! గాభరాని దాచిపెట్టే ప్రయత్నమే మానేసి అడిగేసింది దీప.

‘ఆయనా‌. అయినా’…మొక్కల కుండీల మధ్య తలపెట్టి కిందికి చూసి నిట్టూరుస్తూ…

ఆయన మూడు నాళ్ళ క్రితమే అమేరికా కి ఎళ్ళారమ్మా‌..మళ్ళీ మాఘానికే ఎనక్కి మళ్ళేది…అంది రమణక్క. 

సరే నువెళ్ళు మరీ…చేతిలో తెలుగు కేలండర్ పట్టుకుని ఒణికే చేతులతో తొందర తొందరగా తలుపేసుకుంది దీప.

మెట్లు దిగుతూ చెమరించిన కళ్ళను చీర చెంగుతో పొడి చేసుకుని, తడారనంటున్న గుండెతో గట్టిగా చెప్పుకుంది రమణక్క. 

“దూరంగా నిలుచుని, నీ మనసుకు బాగా దగ్గరైన ‘అతనే’… ఇందాక నీ చేతుల్లో వార్తగా చేరాడని గాని, 

నీ మల్లె తీగ కిందుగా ఉన్న భార్య సమాధిని తదేకంగా చూసుకుంటూ, నిత్యం పిచ్చిగా మాట్లాడుకునే వాడని గానీ….‌‌ 

చివరాకరికి ….మీ పంచకే చేరి…..భార్య పక్కనే మరో తెల్లని సమాధిలో బొజ్జున్నాడని గానీ….

పారపాటున కూడా నిన్ను ఎపుడూ కన్నెత్తి చూడలేదని కానీ….ఏనాటికీ నా నోటితో చెప్పనే చెప్పను దీపమ్మా నీకు…చెప్పను… 

***

మల్లెతీగ ఏపుగా సాగి, గుబురుగా ఎదిగి కూతురి పిలకల్లోకి పూలదండ ఇస్తోంది. 

ఏదో మాసం అన్నావ్…బోల్డు మాసాలెళ్ళాయ్. ఏడీ పాపం. రాలేదే?? 

ఇక్కడి ఆస్థులన్నీ చీకటికొదిలేసి అమెరికాలో ఎందుకు కుర్చోడం???

ఆయన పేరు తెలుసా రమణక్కా నీకు ?? 

దీప రోజుకో ప్రశ్న..‌.పొదుపుగా, రమణక్కకి పలుచనవకూడదని అదుపుగా…సంధించేది.

రమణక్క చివరి ప్రశ్నకి సమాధానం ఇచ్చింది.

సూర్య పెకాశవంటండీ..

సూర్య ప్రకాశ్…సూర్యప్రకాశ్..  పలుకుతూ లోనికి వెళిపోయింది దీప‌. 

తెల్లారి అంట్లపుడు దీప నిద్రలేమి కళ్ళూ, మాపటేళ అంట్లపుడు దీప వాచిన కళ్ళూ గమనించి తల్లడిల్లుతోంది రమణక్క స్త్రీ హృదయం. కానీ పెదవి కదిపి దీపని ఇంకా నలిపేయటం భావ్యం కాదనేది రమణక్క సిద్ధాంతం.

అమ్మా పాపని శుభ్రం గా పెంచుకోండి‌..ఆళ్ళ నాన్నా, నాయనమ్మలు ముక్కున వేలేసుకుండిపోవాల అంటూ వేధించేది  రమణక్క.

కొన్ని మాఘాలూ, ఇంకొన్ని కార్తీకాలూ పరిగెత్తాయి. 

ఒకసారి పాప వాష్ ఏరియా గ్రిల్ ఎక్కబోయింది‌.

“రమణక్కా దాన్ని లాగేయ్..అటేపు సమాధులున్నాయి కదా…..జ్వరం వస్తుంది.  పొద్దుపోయిందంటే నాకే ఇటు మసలటానికి  దడబ్బా”…అంది అటు వాలిన తన ప్రియమైన  మల్లెతీవె నుండి పాపం కోసం పూలు తెంపుతూ‌.

ఇంకా చీకటి పడలేదు. ఆకాశానికి ఎవరో కుంచె తో పసుపు రంగు అద్దినట్టు శోభిల్లుతుంది.

ఆకాశపు రంగులు ‘దూరంగా అతన్ని’ గాఢంగా గుర్తుకు తేగా ఏమరుపాటుగా పూలగిన్నె గ్రిల్ నుండి జారవిడిచింది దీప. పూలన్నీ ఆ కొత్త సమాధిపై సూర్య ప్రకాశ్‌‌…జననం.‌.మరణం..అని మెరిస్తున్న అక్షరాల మీదుగా జారి కుప్పగా సమాధి గుండెలపైకి కూలాయి‌‌. జారి పడిన స్టీల్ గిన్నె సున్నితంగా శబ్దం చేసి, లోపల నిద్రిస్తున్న మనిషికి ఏదో ముఖ్యమైన విషయం చెప్పి, గిరి గిరా కాసేపు  తిరిగి స్తబ్దుగా అయిపోయింది. 

“రమణక్కా ప్లీజ్ గిన్నె తేగలవా?? లేదంటే ఒదిలేద్దామా??” దీప  అంటుండగానే మీరిక్కడే ఉండండి అంటూ రమణక్క  కిందికి పరిగెత్తి పక్క స్థలం గేటు తీసుకుని  పూలగిన్నె తీస్తూ,తల పైకెత్తి వాష్ ఏరియాలో దీపనుద్దేశించి  గట్టిగా  అరిచింది… 

“దీపమ్మా…ఇక్కడేదో రాసుంది చదవండి కుంచెం ఒంగితే కనపడతాది. పోయినాయి బొమ్మ కూడా ఉండాది” అని.

“నోర్మూసుకుని పైకి రా….వెళ్ళిన పనేంటీ. నీ పెత్తనాలేంటీ! నాకు అటుదిక్కు చూడ్డమే దడ అంటూంటే”.. కసిరింది దీప అసహనంగా. 

***

పాపని పెంచే పనిలో సహజంగా నో, అవసరంగా నో పూర్తిగా మునిగిపోయింది దీప.

అయితే…నీలి వర్ణపు ఉదయాలూ, సింధూర వర్ణపు సాయంత్రాలూ దీపని వాష్ ఏరియాకి పిలుస్తూనే ఉన్నాయి. 

“నీ మనసుని పాడే పాటగాని ఉనికి అడుగు దూరం మాత్రమే నేమో గమనించమంటూ!‌” సూచిస్తూనే ఉన్నాయి‌. 

గాలి వంకతో మామిడి చెట్టు ‘దగ్గరికి చేరిన అతన్ని’ దీపకు చూపించాలని అటు తల వంచి గుస,గుసలాడుతూ గస పెడుతూనే ఉంది. 

కానీ ఆ సమయాల్లో దీప మాత్రం ఆ నిశ్శబ్ద సౌధం వైపు నిలబడి చూస్తూనే ఉంటుంది. అచ్చం అప్పటి ‘దూరంగా అతను’ మాదిరిగానే!!.

*****

ఆర్ట్ : మన్నెం శారద

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.