వెనుతిరగని వెన్నెల(భాగం-12)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-12)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియేట్ చదువుతున్న తన్మయిని  చుట్టాల పెళ్ళిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది. ఇద్దరికీ పరిచయమవుతుంది. పెద్ద వాళ్లు  ఒప్పుకుని  ఇద్దరికీ పెళ్లి చేస్తారు. తన్మయి, శేఖర్ విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. 

***

అసలే అక్కడ ఒడ్డు ఏటవాలుగా ఉంది. కెరటం ఉధృతంగా లాగేసరికి ఉక్కిరిబిక్కిరవుతూ శేఖర్ వైపు చూస్తూ గట్టిగా అరిచింది తన్మయి. మునిగి పోతున్న క్షణంలో శేఖర్ ఒక్కంగలో తన్మయి చీరని ఒడిసి పట్టుకున్నాడు. ఒక్క నిమిషంలో తన్మయిని దృఢమైన చేతుల్తో గట్టిగా పట్టుకుని ఒడ్డుకి తీసుకొచ్చాడు.
గుండె దడ హెచ్చి అర్థం కాని అయోమయమైపోయింది కాసేపు తన్మయికి. ఒడ్డుకి వచ్చి కూచున్నా ఒణుకు తగ్గలేదు.
“శేఖర్ తన దగ్గర్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. తను చీర కట్టుకుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే…” ఆలోచించడానిక్కూడా భయం వేసింది తన్మయికి. అప్పటిదాకా ఆహ్లాదంగా కనిపించిన సముద్రం ఒక్కసారిగా వెయ్యి నాలుకల మృత్యువుగా తోచింది. పక్కనే కూచున్న శేఖర్ భుజమ్మీద తల వాల్చి గట్టిగా ఏడ్చేసింది. చుట్టూ బంధువులంతా మూగారు.
“శేఖర్ తనని కాపాడకపోయి ఉంటే? బాబోయ్, ఊహించుకోవడానికే ఒళ్ళు జలదరిస్తూంది.”
ఒక్కసారిగా తన్మయి హృదయం అతని పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. తనంతట తానుగా అతన్ని ఎప్పుడూ ఏ విషయానికి బాధ పెట్టకూడదు.
శేఖర్ పట్ల ఉన్న ప్రేమ రెండింతలైంది. మరింత దగ్గరగా జరిగి కళ్లు మూసుకుంది.
తన్మయి కాస్త తేరుకుని, చుట్టూ ఉన్న వాళ్లంతా మళ్లీ ఆటలో పడగానే “ఇలా చూడు,ఆడదానికి ప్రాణం కంటే మానం చాలా విలువైంది. నువ్వక్కడ అలా వేషాలెయ్యడం, మునిగిపోవడం వల్ల ఇప్పటికే లక్ష మంది చూసేరు నీ అవతారాన్ని. నువ్విలా తడిసి పోయి అడ్డదిడ్డమైన చీరతో ఇక్కడే కూచుంటే నా పరువంతా పోతూంది. బయలుదేరు. పిన్ని వాళ్లకేదో సాకు చెప్పొస్తాను.” అన్నాడు శేఖర్ ఈసడింపుగా.
కెరటం తనని ఎందుకు తీసుకెళ్లలేదా? అన్న దు:ఖం మొదలైంది తన్మయికి.
“అతను తన ప్రాణదాత. తనని బాధ పెట్టకూడదు.” కన్నీళ్లు తుడుచుకుంది.
ముఖం లో భావాలు అంత త్వరగా మార్చుకోవడం చాతకాదు తన్మయికి.
బండి స్టార్టు చేస్తూ “ఎక్కు, ఆ ఏడుపు మొహవేంటి? నాకిలా దాపురించావేవిటే?” అన్నాడు గట్టిగా అరుస్తూ.
గుడ్ల నీళ్లు కక్కుంటూ, బండి వెనక పట్టుకుని అతనికి తగలకుండా కూచుంది.
అప్పుడప్పుడే మసకబారుతున్న వెల్తురు వల్ల, తీరంలో తేమ వల్ల, కంట్లో నీళ్ల వల్ల కలల నగరం
అంతా మసకబారిపోయి పాడుబడినట్లు కనిపించసాగింది.
“మిత్రమా! ఇవేళ నువ్వు నన్ను కాపాడేవు కదూ! నాకు తెలుసు. నువ్వే శేఖర్ అయ్యి నన్ను కాపాడేవు. మరి నా దు:ఖాన్ని తుడిచేలా శేఖర్ తో సాంత్వన చేకూర్చే నాలుగు మాటలు ఎందుకు మాట్లాడించలేక పోతున్నావు? అంటే నువ్వు నువ్వేనా? శేఖర్ వి కావా?” తనలో తను లోపల్లోపల మాట్లాడుకుంటూ కూచుంది తన్మయి.
ఇంటికి వచ్చి తలారా స్నానం చేసినా కాళ్లలోంచి ఒణుకు తగ్గనట్లు అనిపించసాగింది. కాళ్లలో
బలమంతా పోయినట్లయ్యింది.
శేఖర్ బయట ఎవరితోనో బాతాఖానీలో ఉన్నాడు. గదిలో చాప మీద నిస్త్రాణగా వాలిపోయింది.
అంతలో పొత్తి కడుపులో బాగా మంట మొదలైంది. మరో వైపుకి తిరిగింది. ఉహూ..తగ్గదే!
అరగంట దాటుతూన్నా అలా మంట వస్తూనే ఉంది. బాత్రూముకి వెళ్లొచ్చింది. యూరిన్ కి వెళ్లగానే భయంకరమైన మంట.
లోపలికి వచ్చి మూలుగుతూ ఇలా జేరబడిందో లేదో కడుపులో మంటతో బాటూ, నిప్పుల్తో కాలుస్తున్నట్లు జ్వరం వచ్చేసింది.
తన్మయికి తను గట్టిగా మూలుగుతున్నట్లు అర్థమవుతూంది. కానీ ఏమీ అర్థంకాని అశక్తత.
అంతా బీచ్ నించి తిరిగొచ్చిన పదినిమిషాల తర్వాత హైమ ఎందుకో లోపలికి వచ్చింది.
దగ్గరికి వస్తూనే “అనుకున్నంతా అయ్యింది, అయ్యో! ఒళ్ళు బాగా కాలిపోతూంది.” అంటూ శేఖర్ ని గట్టిగా పిల్చింది.
హాస్పిటల్ కి ఆటోలో ఎలా ఎక్కించేరో తెలీదు. దార్లో వాంతు కావడం వరకే జ్ఞాపకం ఉంది.
కళ్లు తెరిచే సరికి చిన్న ఆసుపత్రి గదిలో పైన తిరుగుతున్న సీలింగు ఫ్యాను శబ్దం తప్ప ఏ శబ్దమూ లేదు. దాహంతో గొంతు పిడచకట్టుకు పోతూంది. పక్కనెవరూ లేరు మంచి నీళ్లు అడుగుదామంటే.
పక్కకి ఒత్తిగిలదామని చూసింది. కడుపులోఇంకా మంటగానే ఉంది. నిస్సత్తువగా గుమ్మం వైపు
చూడసాగింది.
వస్తున్న ఆవిణ్ణి ముందెప్పుడూ చూసినట్టు లేదు. స్టెతస్కోపు మెళ్లో ఉంది కాబట్టి డాక్టరనుకోవాలి. సాదా సీదా చీరలో హౌస్ వైఫులాగా ఉందావిడ.
లోపలికి వస్తూనే “మెలకువ వచ్చిందా? మా ఇల్లే హాస్పిటల్. శేఖర్ నాకు చిన్నప్పట్నించీ తెలుసు. మా తమ్ముడు శేఖర్ స్నేహితుడు. ఇప్పుడెలా ఉంది?” అంది.
తను తలూపగానే, తర్వాత ప్రశ్న అర్థమైనట్లు “శేఖర్ భోజనానికెళ్లేడు, నీకు సముద్రంలో మునగడం వల్ల బాగా హైఫీవర్ వచ్చినట్లుంది. తగ్గిపోతుందిలే.” అంది చిన్నగా నవ్వుతూ.
ఇంకా ఇబ్బందిగా ఉన్న తన్మయి ముఖంలోకి చూస్తూ “ఏవిటీ?” అంది కడుపు మీదున్న చేతిని పరీక్షగా చూస్తూ.
పరీక్ష చేసిన తర్వాత “నీకు ఎప్పట్నించి ఉంది ఇలాగ? శేఖర్ ని కూడా పరీక్ష చేయాలి.” అంది.
డాక్టరు బైటికి వెళ్లగానే ఉబికి వస్తున్న దు:ఖాన్ని పట్టుకోలేక పోయింది తన్మయి.
“తనకు సుఖవ్యాధా? శేఖర్! నన్నెందుకు ఇలా శిక్షిస్తున్నావు?” ఒళ్లంతా సలసలా రక్తం
మరుగుతున్న కోపం తో ఒణికి పోయింది.
“అసలేం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఒక పక్క తనకి ఒంట్లో బాలేక హాస్పిటల్ లో ఉంటే తనని
ఒక్కదాన్నీ బిక్కుబిక్కుమని ఈ హాస్పిటల్ లో ఒదిలేసి భోజనానికెళ్లడానికెలా మనసొప్పిందసలు?”
ఒక పక్కకి ఒరిగి దిండు తడిసిపోయేలా ఏడుస్తూ ఎంతసేపుండిపోయిందో తెలీదు.
శేఖర్ డాక్టర్ తో బాటూ లోపలికి వచ్చేడు.
“అదేవిటి డాక్టర్! నాకు ఏవీ లేదే. నన్నెందుకు పరీక్ష చేయించుకోమంటున్నారు?” అన్నాడు.
తన్మయి ఒక్కసారిగా విసురుగా చూసిందతని వైపు. అంటే ఈ వ్యాధి తనకి ఎలా సోకినట్లని అతని
అభిప్రాయం?
తన మీద తనకే అసహ్యం వేసింది. అతనితో మాట్లాడడం కూడా ఇష్టం లేనట్లు కళ్లు మూసుకుంది.
“ఇద్దరూ కోర్సు వాడాలి. ఒక్కొక్కసారి ఎవరు బలహీనంగా ఉంటే వాళ్లకి ముందు బయటపడుతుంది” అంది డాక్టరు.
ఇంతలో బిలబిలామంటూ శేఖర్ చుట్టాలు లోపలికి వచ్చారు.
తన్మయికి సిగ్గుతో చచ్చిపోయినట్లుంది.
వస్తూనే “కాస్త జ్వరానికే ఆసుపత్రిలో జాయినయ్యిపోయేరా? పెళ్ళాం ఎలా చెబ్తే అలా వినడం
మానెయ్యాలిరా నువ్వు” అని ఉచిత సలహా ఇచ్చింది అతని పిన్ని.
“హాస్పిటల్ లో చేరినది బానే ఉంది ముఖం తేటగా. నీ కళ్లేవిట్రా లోతుకుపోయేయి. అసలేమైనా
తిన్నావా, లేదా?” అంది మరొకామె.
తన్మయికి వాళ్ల మాటల వల్ల మరింత బాధ పెరిగింది.
అంతా వెళ్ల బోతూంటే శేఖర్ “నేనూ వస్తాను.” అని వాళ్లని సాగనంపడానికి వెళ్లేడు.
శేఖర్ తాతయ్య మాత్రం “నేను తర్వాత వస్తాను” అని చెప్పడం వింది.
తన్మయి పక్కకి స్టూలు జరుపుకుని కూచున్నాడు తాతయ్య.
మంచం మీద పడుకుని కళ్ళు దించుకుని గోళ్లవైపు చూసుకుంటున్న తన్మయి తో
“అమ్మాయ్, వీడు అనుకున్నంత పనీ చేసేడన్న మాట. డాక్టరు ఇందాక నాతో చెప్పింది.
ఎలా వేగుతావో ఏవిటో, వీడు మంచోడు కాదమ్మా, కాస్త అదుపులో పెట్టే బాధ్యత నీదే ఇక.”
అన్నాడు.
ఆ మాత్రం మాట్లాడే వాళ్లే కనబడక తన్మయి కి దు:ఖం తన్నుకు వచ్చింది.
“ఏడక, ఏం చేస్తావు మరి! సర్దుకుపోవాలి. గుడ్డిలో మెల్ల ఏవిటంటే ఇది కోర్సు వాడగానే తగ్గిపోతుందని చెప్పింది డాక్టరు. జీవితాంతం తగ్గనివి కూడా ఉంటాయి కొన్ని. అలాంటివేవీ కానందుకు సంతోషించాలి.” అన్నాడు.
తన్మయి ఏడవడం తప్ప, మాట్లాడక పోవడం చూసి
“ఊరుకో, ఊరుకో” పెద్ద నిట్టూర్పు విడిచి బయట గుమ్మం దగ్గిరికి వెళ్లి నిలబడ్డాడాయన.
“శేఖర్కి ఇతర స్త్రీలతో సంబంధాలా? తనమీద తనకే కంపరం పుడుతోంది. ఎంత అపురూపంగా ప్రేమించింది తను! అందుకు అతనిచ్చిన బహుమానం ఇదా! అతన్ని ఇక తను ఎప్పటికైనా
ముట్టుకోగలదా?” తెరిపిన పడని దు:ఖానికి, తెగని ఆలోచనలకి బందీ అయ్యి విలవిల్లాడుతూంది తన్మయి మనసు.
బయటి నుంచి కాస్సేపటిలో తిరిగొచ్చేడు శేఖర్. “తాతయ్యని దించి వస్తాను.” అని గోడ వైపు తిరిగి ఏవీ మాట్లాడకుండా ఉన్న తన్మయి చేతికి జేబులో నించి ఒక ఉంగరం తీసి తొడిగాడు.
ఫ్రెండు దగ్గిర చీటీ కట్టిన డబ్బులొచ్చేయి. “బావుందా?” అన్నాడు.
అప్పటికీ తన్మయి ఇటు తిరగక పోవడం చూసి, “నా ఖర్మ, ఏం చేస్తాను? నాబతుకింతే. అన్నిటికీ ఎదవ అలకలు. ఏం మునిగిపోయిందిపుడు?” విసుక్కుంటూ వెళ్లిపోయేడు.
“ఏం మునిగిందా? నన్నే ముంచావు.” తన్మయి కి గట్టిగా అరవాలని ఉంది. గోడల్ని చీల్చి అతని గుండెని బాది అడిగే పదమేదైనా ఉంటే దానితో అరవాలని ఉంది.
ఒక్కతే మిగిలి ఉన్న ఆసుపత్రి గదిలో ఒంటరిగా తిరిగే ఫ్యాను తన్మయిలాగే గొణుక్కుంటున్నట్లు చిన్నగా శబ్దం చేస్తూంది.
ఏడుస్తూనే ఎంత సేపు నిద్రపోయిందో తెలీదు. శేఖర్ వచ్చి లేపేడు.
తన్మయి వైపు చూస్తూ “ఇంటికి మీ నాన్న ఫోను చేసేరు. మీ అమ్మమ్మకి సీరియస్ గా ఉందట.”
అన్నాడు.
ఒక్క సారిగా గాభరాగా లేచింది తన్మయి.
“అదేవిటీ, ఏవైంది? అంది దు:ఖంగా.
అసలతని తో మాట్లాడకూడదనుకుంది. కానీ ఇంకేమీ తన్మయి మనస్సులో తట్టడం లేదు.
తన్మయి సంతోషమే తనదని అనుకునే నరసమ్మ హాస్పిటల్ లో ఉన్నట్లు అనిపించగానే తన్మయికి జ్వరం ఇంకాస్త ఎక్కువైనట్లనిపించింది. అయినా ఎక్కడ లేని ఓపిక కూడదీసుకుని కూచుంది.
తన్మయి ఏదో అనబోతుండగా “డాక్టరుతో మాట్లాడి డిశ్చార్జి చెయ్యమని అడుగుతాను.
ఆ మందులేవో నీతో పట్టుకెళ్లు. ఫస్ట్ బస్సుకి బయలుదేరు. నిన్ను దించి రావడానికి
పెద్ద మావయ్య వస్తారు. నాకు ఇక్కడ చాలా పనుంది.” అన్నాడు.
అయిదారుగంటల ప్రయాణం ఎలా చేసిందో అర్థంకాలేదు తన్మయికి.
దారంతా ఏడుస్తూనే ఉంది. వెనకెక్కడో సీటులో కూచున్న శేఖర్ మావయ్య బస్సు దిగుతున్నపుడు “ఏడకమ్మా, ఏం చేస్తాం?” అన్నాడు.
బస్టాండుకి వెళ్లకుండా వీథి చివరే బస్సు దిగేసేరు.
దూరం నించి ఇంటి ముందు అంత మంది జనాన్ని చూడగానే తన్మయి మనసు కీడు శంకించింది. ఒక్క పరుగున వచ్చి పడింది.
వాకిట్లో నరసమ్మ శవాన్ని చూడగానే భోరున మీద పడింది. అసలే జ్వరంగా ఉందేమో వొణుకుతో కూడిన దు:ఖం తో కుమిలి కుమిలి ఏడ్చింది.
అప్పటి వరకూ నిశ్సబ్దంగాఉన్న జ్యోతి కూతుర్ని పట్టుకుని తనూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది.
తన్మయి కోసం బస్టాండుకి వెళ్లేడు భాను మూర్తి. వీళ్లు వీథి చివరే బస్సు ఆపుకుని దిగిపోయినట్లు
చెప్పడానికి శేఖర్ మావయ్య మళ్లీ బస్టాండుకి బయలుదేరేడు.
బంధువులు అంతా వచ్చేరని రూఢి కాగానే శవయాత్ర మొదలైంది.
తన్మయి తన గుండె ని ఎవరో తీసుకెళ్ళిపోతున్నట్లు విలవిల్లాడింది.
***
పెళ్లైన దగ్గర్నించీ ఎదురవుతున్న అపశకునాలూ, ఉపద్రవాలూ ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చి బాధ
పదింతలయ్యింది. కళ్ళల్లో జీవం లేకుండా ఒక్క రోజులో పది లంఖణాలు చేసినట్లు,అన్నీ కోల్పోయిన
దానిలా నిస్తేజంగా తయారైంది తన్మయి.
మూడో రోజు కి మొత్తం బంధు గణం వచ్చేరు.
దేవి వస్తూనే “ఎలా ఉన్నారమ్మా? శేఖర్ కి పనుందట తర్వాతెప్పుడైనా వస్తాడు.” అంది
దగ్గరికి వచ్చి.
తన్మయి మౌనంగా విని ఊరుకుంది.
తన్మయికి ఊహ తెలిసాక ఇంట్లో మొదటి మరణం అది.
“బతికున్నంత సేపూ అమ్మమ్మ వెచ్చని శరీరం చనిపోగానే ఎంత చల్లగా అయిపోయిందో తల్చుకుంటే ఒళ్ళు జలదరిస్తూంది. అదే గామోసు జీవం లేకపోవడమంటే. మరణం అంటే బూడిదగా మిగలడమేనా? శరీరమంటే ఒకనాడు నిప్పుల్లో కాలిపోయేదేనా?” ఆలోచనలతో తన్మయికి తల వేడెక్కి పోతూంది.
“నరసమ్మ బతికున్న చివరి క్షణాలన్నీ మనవరాలినే కలవరించింది పాపం”
“రాత్రనగా ఫోను చేస్తే పిల్లని మధ్యాహ్నానికి పంపించేడు. పిల్ల చివరి చూపు అందుకోలేకపోయింది.” జ్యోతి ఈసడింపు గా అనడం విని
“మీ అమ్మాయిని అబ్బాయి కూడా పంపడం మానేసి ఇక్కడే ఉంచుకోకపోయేరా మరి?” అని అంటించింది దేవి.
ముక్కు చీదుతున్న జ్యోతిని ఊరడిస్తూ “అయిపోయిందానికి ఏడ్చి ఏం ప్రయోజనం?” అని హితవు చెప్పేరెవరో.
చుట్టూ ఎవరేం మాట్లాడుతున్నా తన్మయి చెవికి ఏవీ ఎక్కడం లేదు. మతిపోయినదానిలా కూచుని హాల్లో అమ్మమ్మ ఫోటోని చూస్తూంది.
***
పదకొండో రోజుకి అంతా నరసమ్మ ని మరిచిపోయినట్లు, మరణం అతి సహజమైనదన్నట్లు కనిపించేరు తన్మయికి.
ఆ రోజు పెద్దరోజు కావడంతో అటూ ఇటూ తిరుగుతూ వంటల దగ్గర పురమాయిస్తూంది జ్యోతి.
తల్లి లేకపోతే విపరీతంగా దిగులు పడిపోతుందనుకున్న జ్యోతి అంత త్వరగా తేరుకోవడం తన్మయికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
పది రోజులుగా ఏవీ సరిగా తినక, తన్మయి తల స్నానం చేసొచ్చి నీరసంగా గోడకి జేరబడింది.
ఇంటి నిండా సాంబ్రాణి, అగరొత్తుల పొగ నిండి పోయింది.
తన్మయి ముఖంలో విచారం, బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. నరసమ్మ పటం వైపే చూస్తూ కూచుంది.
“పూల దండ, పెద్ద కుంకుమ బొట్టు. అమమ్మ ముఖానికి బొట్టు ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఫోటోకి బొట్టు పెడితే అమ్మమ్మ ముఖం ఎంతో బావుంది.
జీవితమంతా అలిసిపోయిన ముడుతల చెంపలు, మనుషుల మనస్సుల్ని చదవగలిగే చురుకైన కళ్ళు. తన కళ్ళు అచ్చు అమ్మమ్మవే అని అందరూ అంటూంటారు.”
చిన్న పిన్ని పక్క గదిలో సామాన్ల లో తిరుగుతూ నరసమ్మ పెట్టెని తీసి చూసి “దీంట్లో అన్నీ కొత్త చీరలే ఉన్నాయర్రా” అని బైటికి పట్టుకొచ్చింది.
నిమిషంలో “ఇది నాకు, అది నీకు” అంటూ అంతా పంచేసుకున్నారు.
ఎప్పటి నుంచి దాచిందో ఏమో, అన్నిటికన్నా అడుగున చిన్న డబ్బు సంచీలో అన్నీ కొత్త నాణేలు పోగు చేసింది. జ్యోతి వచ్చి నవ్వుతూ లోపలికి పట్టుకెళ్లింది.
ఆ కింద తన్మయి, శేఖర్ ల పెళ్ళి ఫోటో ఉంది. అది చూడగానే తన్మయి మళ్లీ కన్నీరు
మున్నీరయ్యింది.
భానుమూర్తి కూతురి దగ్గరకు వచ్చి “మరీ అంత బాధ పడకమ్మా, పెద్దవాళ్లన్నాక ఇవన్నీ సహజం” అన్నాడు అనునయంగా.
సాయంత్రం పంపకాల తంతు మొదలయ్యింది.
బంగారాలూ, ఆస్తులూ పంచడానికి కుల పెద్దలు వచ్చేరు.
“ఈ గొలుసు కన్నా గాజులు బరువున్నాయి, ఈ ఇంటికంటే చిన్న కొట్టు విలువైంది, అక్కడ భూమి నాకొద్దు” రకరకాల మాటలు తన్మయి చెవిన పడ్తూ ఉన్నాయి.
పటం ముందు దీపం వెలుతురుగా, అగరొత్తుల పొగగా మారిపోయిన నరసమ్మని చూస్తూ దు:ఖపు కళ్ళతో వెక్కి వెక్కి పడ్తూన్న తన్మయికొక్కదానికే నరసమ్మ బంధువైనట్లు, తమకేమీ కానట్లు అంతా గట్టి గొంతులతో డబ్బు పంపకాల కీచులాడుకుంటూన్నారు.
తన్మయికి జీవితం అంటే ఇంతేనన్న స్పృహ మొదటిసారి కలిగింది. “జీవించి ఉన్న కాలంలో ఎన్నెన్ని అనుభవాలూ! చనిపోగానే ఏదీ తనది కాని ఈ ప్రపంచంలో కాస్త జీవితానికి ఎందుకీ పోట్లాటలు?”
పదకొండో రోజుకి కూడా శేఖర్ తల్లి వచ్చింది కానీ శేఖర్ రాలేదు. బంధువులంతా అడగడమే.
“మంచి రోజు చూసి మా ఇంటికి పంపించండి. మా కోడలు మా ఇంట్లోనూ నాలుగు రోజులు గడపాలిగా. మా అబ్బాయి తీరికైనప్పుడు వచ్చి తీసుకెళ్తాడు. అన్నట్లు మంచం లేక
బాగా ఇబ్బంది పడ్తున్నారు.” అని సాగదీసింది దేవి.
ఆవిడలా వెళ్లగానే జ్యోతి ముక్కు చీది ఏడవడం మొదలు పెట్టింది. “మహాతల్లికి చావింట్లో కూడా సారె గురించే ఆలోచన. ఈ మనిషికి అప్పుడనగా చెప్పేను. ఆ మంచం, కుంచం వాళ్ల ముఖాన పడెయ్యమని. ఎవరో స్నేహితుడి దుకాణవంట. కూతురికి డాబుగా మంచం చేయించాలట. ఏదో ఒక మంచం చేయించి పడెయ్యరాదూ!”
“నేనేం చేసేను మధ్యలో” అని కండువా దులుపుకుని బయటికెళ్ళి పోయేడు భాను మూర్తి.
తన్మయికి ఇవేవీ వినాలన్న ఉత్సాహమూ, ఆసక్తీ లేవు.
ఒక్కతే డాబా మీదికి వెళ్ళి సన్నజాజి పందిరి లో కూచుంది.
“ఎన్నో కలలతో మొదలు పెట్టిన తన జీవితం చేదు గుళికగా మారింది. ప్రాణంగా ప్రేమించిన శేఖర్ తనని మోసం చేసేడు. ప్రాణమైన అమ్మమ్మ చచ్చిపోయింది. తల్లిదండ్రులు, అత్తమామలు సారెల గోలతో ఇంకిలాగే తిట్టుకుంటూ ఉంటారు. ఇంకేం మిగిలుందీ ప్రపంచంలో.”
కళ్ళు మూసుకుని కూచుంది.
“శేఖర్ తనతో ప్రేమ నడుపుతూనే ఇతర స్త్రీలతో తిరుగుతున్నాడన్న మాట ఇంత కాలం.
తనెంత మోసపోయింది! అమ్మా,నాన్నలకి కూడా ఇష్టం లేని పెళ్లి ఇది.”
మనస్సులో ముళ్ళు గుచ్చుతున్నట్లు బాధకలుగుతూంది. తన్మయి పరిస్థితి ఎవరికీ
చెప్పుకోలేని దయ్యింది.
తల్లితో పొరబాటున ఇవన్నీ చెప్పినా” నేను ముందే నెత్తి మొత్తుకున్నాను. ఆ కుర్రాణ్ణి ఇంటికి రానివ్వొద్దని…అంటూ మొదలుపెడ్తుంది.”
“పోనీ… తను కూడా చచ్చిపోతే!”
ఆలోచన రాగానే నడుములో వణుకు మొదలయ్యింది. సముద్రంలో మునిగిపోయినప్పుడు భయం గుర్తుకొచ్చింది.
“విగత జీవురాలైన అమ్మమ్మ స్థానంలో తనని ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. అయినా సరే. నిర్ణయం మార్చుకోకూడదు. ఈ పనికిమాలిన జీవితం కంటే చావే మేలు.” దృఢంగా అనుకుంది.
పక్కనే ఉన్న పుస్తకం తెరిచి “అజ్ఞాత మిత్రమా!” అని మొదలు పెట్టింది.
ఎంతసేపైనా అసలు అక్షరం కూడా రాయలేక పోయింది.
చివరికి పెద్ద అక్షరాలతో పేజీ అంతా నిండేలా “సెలవు” అని రాసింది.
చచ్చిపోదామని నిర్ణయించుకున్నాక మనసు తేలిక పడింది.
ముందున్న సమస్యలన్నీ చిన్నవిగా కనబడసాగేయి. హమ్మయ్య తనకి విముక్తి దొరకబోతూంది. చిన్న సంతోషం కలిగింది.
డాక్టరు ఇచ్చిన మందుల వల్ల వారంలో తనకి పూర్తిగా నయమయ్యింది.
అయినా చచ్చిపోవాలనుకున్నపుడు శరీరం ఏవైపోతే తనకేం? ఎలాగూ బూడెదయ్యేదేగా.
తను చచ్చిపోతే ఎవరెవరు బాధ పడేవాళ్లున్నారా అని ఆలోచించింది.
శేఖర్ కి తన మీద ఎలాగూ ప్రేమ లేదు. కించిత్ కూడా బాధ పడకుండా మరో పెళ్ళి చేసుకుంటాడు. అమ్మా, నాన్నా కొన్నాళ్లు బాధ పడ్తారు. తర్వాత మర్చిపోతారు. వనజ బాగా బాధపడ్తుంది. కానీ
తన జీవితం తనకూ ఉంది కాబట్టి తను కూడా మర్చిపోగలుగుతుంది.
వీళ్లందరికీ ఎలా ఉన్నా, తను ఈ ప్రపంచం నుంచి బయట పడుతుంది.
తను కలలు గన్న పీహెచ్ డీ లక్ష్యమూ.. ఇవన్నీ శేఖర్ తో ఎలాగూ తీరేవిగా లేవు.
ఎప్పుడూ లేనిది పూల వాసనకి కడుపులో బాగా తిప్పుతున్నట్లు అనిపించసాగింది. కిందకు రాగానే పెద్ద వాంతి చేసుకుంది.
“పది రోజుల్నించీ ఏవీ తినడం లేదు మరి- అని ఇలారా” అని పక్కకు తీసుకెళ్లింది జ్యోతి.
ఏవేవో ప్రశ్నలడగడం, తన్మయి చెప్పడం పూర్తయ్యాక డాక్టరు దగ్గిరికి యూరిన్ పరీక్షకి తీసుకెళ్లేరు తన్మయిని.
శుభవార్త తో ఇంట్లో అంతా సందడి నిండి పోయింది తన్మయి హృదయంలో తప్ప.
“చచ్చిపోవాలని నిర్ణయించుకున్న తన కడుపులో బిడ్డ ఎదుగుతూందా?” నిస్త్రాణగా కూచుండిపోయింది.
పొట్ట మీద తడుముకుంది. ఒక్క సారిగా మనసు, శరీరం తెలీని ప్రేమతో నిండిపోయాయి.
“తను చచ్చిపోతే నిష్కారణంగా…. ఛీ…. ఛీ…. .తనంత దుర్మార్గురాలు కాదు.
ఇక తను ఆలోచించవలసింది జీవంపోసుకుంటూన్న బిడ్డ గురించి ఇక మరే విషయం గురించీ కాదు.”
లేచి ముఖం కడుక్కుంది. కళ్లకి కాటుక పెట్టుకుని, తిలకం దిద్దుకుంది. జుట్టు దువ్వుకుని వదులుగా జడ వేసుకుంది.
కూతురిలో మార్పు చూడగానే బుగ్గలు పుణికింది జ్యోతి “అమ్మమ్మ నీ కడుపున పుట్టబోతూంది.”
దేవికి ఫోను చేసి చెప్పింది జ్యోతి.
వార్త తెలిసినట్లుంది. రాత్రి నిద్ర పోవడానికి ముందు శేఖర్ ఫోను చేసేడు.
“నీకు ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు. కనీసం ఇక్కణ్ణించైనా బాగా తిను. నాకు కొడుకు పుట్టబోతున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఊరికే మేడ మీదికి కిందికి తిరగకు. అడ్డమైన రాతలు మానెయ్యి …”
అవతల్నించి ఎంతో సంతోషంగా వినిపిస్తున్న శేఖర్ స్వరం వింటున్నా తన్మయికి ఉత్సాహం కలగడం లేదు.
“నువ్వెప్పుడొస్తున్నావ్?” అంది గొంతు పెగుల్చుకుని.
“నేను మీ వాళ్లు సారె ఇచ్చేంత వరకూ రాకూడదని నిర్ణయించుకున్నాను. రేపో, ఎల్లుండో మా ఇంటి నించి ఎవరైనా వచ్చి నిన్ను తీసుకెళ్తారు. మా అమ్మ ఈ వార్త విన్నప్పట్నించీ కోడల్ని తన దగ్గిర ఉంచుకుని కొన్నాళ్లు చూసుకోవాలని ముచ్చట పడ్తూంది.” అన్నాడు.
ఓపిక లేనట్లు కూలబడింది తన్మయి మళ్లీ.
***
మర్నాడు నిద్ర లేచే సరికి తల తిరగడం మొదలయ్యింది.
ఏం వాసనా పడడం లేదు. ఏం తాగినా బయటకు వచ్చేస్తూంది.
తన్మయికి ఇష్టమని జ్యోతి కమ్మగా వేయించిన బియ్యంతో నూకల జావ తీసుకు వచ్చింది. కాస్త
తాగగానే మళ్లీ కడుపులో తిప్పడం మొదలైంది.
దేవి కోడల్ని తీసుకెళ్లడానికి వస్తామని ఫోను చేసింది.
“తన్మయిని ఈ పరిస్థితుల్లో పంపడం ఇష్టం లేదమ్మామాకు. నాలుగో నెల వచ్చి, వేవిళ్ళు తగ్గేక
పంపుతాంలెండి.” అంది ఖరాఖండీగా జ్యోతి.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.