మనిషితనం (కవిత)

-కె.రూప

ఒంటరితనం కావాలిప్పుడు 
 
నన్ను నాకు పరిచయం చేసే 
చిన్న చప్పుడు  కూడా వినపడని చోటు
ఏ వస్తువు కనబడని చోటు
నాలో  
మెదులుతున్న శ్వాసనుకూడా దూరం చేసేది
నన్ను నన్నుగా గుర్తించేది
 
౧ 
ఏ సంద్రపు ఘోషలు వినలేని నా మది 
నాకు వినపడేలా 
నాలో లేని తనాన్ని ఏదో వెతుక్కుని 
నాలో నింపుకోవలసిన సమయమిప్పుడు!
బిగుతై పోతున్న గుండె బరువుల నుండి 
సేదతీరాలనే సంకల్పంతో
ఉదయపు వేకువల చప్పుళ్ళనుండి మొదలు
రాత్రి వెన్నెలకు కురిసే తడి కూడా అంటనంత 
 
నా అడుగుల చప్పుడు కూడా నన్ను గుర్తించనంతగా
ఏ శబ్దమో ..
ఏ రాగమో ..
వినపడనంత దూరం
కొండవాలుగా జారే జలపాతం అంత లోతుగా గగనంలోకి జారిపోవాలి
ఏ గాలి చొరబడ కుండా ఇప్పుడేదైనా కప్పేసుకోవాలి
 
అంతగా..
చీకటి నిండిన దారులలో వెలుగుని వెతికే విశాలమైన మనసు కోసం ఓ ఒంటరి స్వరం నిశ్శబ్దంగా ఎదురుచూస్తోంది
 
మౌన ముద్రలోని అభ్యాసాలూ నాకేవో చెప్తున్నాయి.
 
నాలోని ఒంటరితనాన్ని మేల్కొలిపి .. చెదిరిన  నవ్వులకు ఆపన్నహస్తం అయ్యే మార్గాన్ని వెతికి పట్టుకోవాలి…మనిషితనాన్ని గుర్తించాలి
 

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

12 thoughts on “మనిషితనం(కవిత)”

  1. ఆలోచనాత్మకం,కవిత నిర్మాణం లో నూతనత్వం. బాగుంది

  2. నాలో ఒంటరితనాన్ని మేల్కొలిపి చెదిరిన నవ్వులలకు అపన్నాహస్తం అయ్యే మార్గాన్ని వెతికి పట్టుకోవాలి….. మనిషితనాన్ని గుర్తించాలి…. అవును నిజం బాగుంది కవిత….

  3. మనిషి తనం కోల్పోయిన ప్రతి స్వరం ఒంటరి స్వరమే..

  4. విశాలమైన మనసుకోసం ఓ ఒంటరి స్వరం. నిశ్శబ్దంగా ఎదురుచూస్తోంది. బాగుంది. మనిషితనాన్ని దొరకబుచ్చుకోవాలన్న మీ సిన్సియర్ పయత్నం సక్సస్ కావాలని ఆశిస్తున్నాను. 🌺

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published.