కనక నారాయణీయం -11

పుట్టపర్తి నాగపద్మిని

తెలుగు సాహిత్య చరిత్రలో మునుపెన్నడూ వినని కనని సందర్భమిది!! ఒక కవి, తాను వ్రాసిన కావ్యాన్నే, తాను విద్యార్థిగా చదవి, పరీక్ష వ్రాయవలసి రావటం ఎప్పుడైనా జరిగిందా?? ఈ వార్త క్షణాలమీద ప్రొద్దుటూరు సాహిత్య లోకంలో పాకి పోయింది. ఏమిటేమిటీ?? పుట్టపర్తి నారాయణాచార్యులనే యువ కవి వ్రాసిన కావ్యం, విద్వాన్ పరీక్షకు పాఠ్యాంశంగా ఉండటమేమిటి?? అతడు ప్రొద్దుటూరు వాసి కావడమేమిటి?? పైగా అతడే విద్వాన్ పరీక్షలు హాజరుకాబోతుండటమేమిటి?? అన్నీ ఉత్కంఠభరితమైన ప్రశ్నలే!! ప్రశ్నలమీద ప్రశ్నలు!! ఈ వార్త, తక్కినవారి వలె, పుట్టపర్తికీ కొత్త వార్తే!! కారణం, కావ్య రచన మాత్రమే తమ పని అనీ, దాని భావిని నిర్ణయించేది, ఆ కావ్య ప్రమాణాలేనన్న దృఢ విశ్వాసం గలవారు పుట్టపర్తి కావటమే!! కాకపోతే, వారికి ఇది భగవంతుని లీల వలె మాత్రమే తోచింది!! వారి పెదవులపై ఒక సన్నని చిరునవ్వు మా త్రమే తొంగిచూసింది!!

ఇక ప్రొద్దుటూరు పండిత వర్గాలలో ఒక కంట ఉత్సుకత, మరో కంట, ఉదాసీనత! నిన్న మొన్న ఇరవై వసంతాలు నిండిన నూనూగు మీసాల నూత్న యవ్వనవంతుడు, ఎక్కడో అనంతపురం జిల్లా నుండీ పెళ్ళి పేరుతో ఇక్కడికి వచ్చి, తెలుగు పండితుడిగా స్థిరపడటమేమిటి?? ఇంత చిన్న వయసుకే రెండు కావ్యాలు వ్రాసి ఉండటమేమిటి?? అందులో ఒకటైన షాజీ, పారశీక వాసనల రచన మదరాసు ఇంటర్ పరీక్షలకు పాఠ్యాంశంగా ఉండటమేమిటి?? ఇప్పుడు మళ్ళీ, మరీ లేత ప్రాయాన, పన్నెండు పదమూడేళ్ళ వయసులో వ్రాసిన ‘పెనుగొండ లక్ష్మి ‘ అనే కావ్యం, ఏకంగా విద్వాన్ పరీక్షకే పాఠ్యాంశంగా ఉండటమేమిటి?? ఇక్కడింతమంది తలలు పండిన పండితోత్తములుండగా, యీ కుర్రవాడికీ మహర్దశ ఏమిటి??’

“ఆ..పోనిండు..అదేమన్నా గొప్పనా ఏమిటి?? విద్వాన్ పరీక్ష స్థాయి అంతే అనుకోవాలి..’

ఇటువంటి మాటలు, సవసవగా చెవిలో పడుతున్నా, పుట్టపర్తిలో చలనమేమాత్రమూ లేదు.

శిరోమణి పూర్తవలేదు. ఇంతలో వివాహం తాలూకు, రెండు అనుభవాలు. పుట్టపర్తికిదే అశాంతిని కలిగించే విషయం. కానీ, యీ రెండు అసంతృప్తుల మధ్యా, రెండు కావ్యాల ప్రచురణ. రెండూ ఒకటి ఇంటర్ కు, మరొకటి విద్వాన్ కూ పాఠ్యాంశాలు. ఇవి చాలవన్నట్టు, అప్పుడప్పుడూ మదరాసుకు రేడియో ప్రసంగాలకు వెళ్ళి వస్తుండటం. వేరే కవి ఎవరైనా, రొమ్ము విరుచుకుని నడిచే పరిస్థితి. కానీ, అదేమిటో, పుట్టపర్తికివేవీ, అంతటి మహత్తర విషయాలుగా తోచటం లేదు.

కారణం, ఎప్పుడూ వారి మనసులో అలజడే!! అసంతృప్తే!! సంస్కృతాంధ్ర పూర్వకవుల సాహిత్యాన్ని పఠిస్తుంటే, ఎంత సంభ్రమమో!! అంతే కాదు, కన్నడ, తమిళ, పాళీ, అర్ధ మాగధీ, మాగధీ, పైశాచీ వంటి భాషాసాహిత్యాలలో ఎంత మంది గొప్ప కవులు?? ఇది కాక, ఆంగ్ల సాహిత్య పరిచయం వల్ల కీట్స్, షెల్లీ, షేక్స్ పియర్ వంటి వారలతో దోస్తీ వల్ల, వీరందరి రచనా సృష్టి ముందు, తన స్థానమేమిటి?? అన్న విచికిత్స. తిరుపతిలో శిరోమణి సమయంలో, ప్ర భాత వేళ తక్కిన విద్యార్థులంతా వ్యాకరణ, అలంకరశాస్త్రాలను భట్టీయం వేస్తుంటే, పుట్టపర్తి బైబిల్ చదువుతూ కనిపించేవాడని, వారి బాల్య స్నేహితులు శ్రీనివాసాచార్యులవారో వ్యాసంలో వ్రాశారు. అంటే, తాను తెలుసుకున్న దానికంటే, భిన్నంగా, ఏదో కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న తపనే వారిలో ఉండేదన్న మాటే కదా!! అందువల్ల కూడా, యీ సంఘటన తాలూకు ప్రభావం పుట్టపర్తి మీద అంతగా పడలేదనే చెప్పుకోవాలి.

కాలం ఆగదు కదా!! అందరూ ఎదురు చూస్తున్న విద్వాన్ పరీక్షలు రానే వచ్చాయి. పుట్టపర్తి లో విద్యార్థులకుండవలసిన ఉత్కంఠ, అందోళనా ఏమాత్రం లేవు. అర్ధాంగి కనకవల్లికి, యీ సంగతి అర్థం కావటమే లేదు. కానీ ఒక సంగతి మాత్రం నిజం. భర్త నారాయణాచార్యుల కావ్యం, పెనుగొండ లక్ష్మి తానూ చదివింది. అందులోని పద్యాలన్నీ రస గుళికలే!!

స.గండపెండేరంబు, ఘలుఘల్లుమన దాన

ములతోడ దేశాక్షి బలుకునాడు,

సులతానులెల్ల దలవంచి, కల్కి తు

రాయీల నిను బూజ సేయునాడు,

ఆదివరాహ ధ్వజాంతరంబుల నీడ

నీ కీర్తి పరునీసడించునాడు,

గుహలలోపల దూరికొన్న యా గజపతి

తలపైని నీ కత్తి గులుకునాడు,

గీ. నీదు కన్నుల వెలి చూపు నేడలోన

జీమ యును హయిగా నిద్రించునాడు,

గలుగు నాంధ్రుల భాగ్య సాకల్య గరిమ,

బూడిదను బడి, నీతోడ బోయె దల్లి!!

గండపెండేరం రాయలు పెద్దనకు తొడిగిననాడు, దేశాక్షి రాగం మృదు మధురంగా వినిపించిందట!! సులతానులందరూ తలవంచి, తమ కలికి తురాయీలు, నేలనంటుతుండగా, నిన్ను పూజించునాడు, విజయ నగర ధ్వజం మీద కొలువైన ఆది వరాహస్వామి చల్లని నీడలోని నీ కీర్తి, ఇతర రాజులను ఈసడించే తరుణాన, నీ శౌర్య పరాక్రమాలకు భయపడి, గజపతి గుహలోపల దాక్కుని ఉండగా, అతని తలపైననే నీ కత్తి కులుకుతూ ఉన్న నాడు..నీ తెల్లని చూపుల నీడలో చీమ కూడా హాయిగా నిద్రిస్తున్ననాడు, మాలో కలిగిన ఆ గొప్పదైన భాగ్య గరిమ, నేడు బూడిద పాలై, నీతోనే పోయిన్నదమ్మా!!’

ఈ పద్యంలో తక్కిన అన్నిటికన్నా దేశాక్షి రాగ ప్రసక్తి ఆమె మనసును ఒక్క కుదుపు కుదిపింది. దేశాక్షి రాగంలోని ఆ ప్రత్యేకత ఏమిటి?? గండపెండేరం తొడిగేవేళ ఆ రాగం నారాయణ లేఖినికి వినబడటమేమిటి?? అంటే, ఆ రాగంలో అంత భవ్యత ఉన్నదన్న మాట!!దాన్ని గురించి భర్తనడిగి తెలుసుకోవాలి.

అంతే కాదు, పెనుగొండలక్ష్మి లో చాలా చోట్ల , హిందోళ వంటి రాగ ప్రసక్తి, సంగీత సంబంధ విషయాల ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఈ రచన వారు పన్నెండేళ్ళ ప్రాయంలో చేసినది. కానీ దానిలో, ఆ లేత వయసుకు మించిన, అసాధ్యమైన, ఊహాతీతమైన చిక్కని భావాలు ఎన్నెన్నో అమె మనసును వశీకృతం చేసుకున్నాయి. బహుశా, యీ విశేషాలవల్లే యీ పెనుగొండలక్ష్మి కావ్యం, విద్వాన్ పరీక్షకు కూడా పాఠ్య పుస్తకమయ్యే యోగ్యతను సాధించుకున్నదనిపిస్తుందామెకు!!

ఈ భావాలన్నీ భర్తతో పంచుకునే చనువు తీసుకుందామంటే, యేదీ?? ఆయన చూపులెప్పుడూ, ఏదో నిశీధిలో అన్వేషణ చేస్తున్నట్టుగా…సుదూరంగా, నిశ్చలంగా!! మాటలెప్పుడూ, ఏదో మంత్రజపం క్లుప్త గంభీరంగా ఉచ్చరిస్తున్నట్టు. .నిక్కచ్చిగా!! ఆ గంభీరతముందు, మాటే పెగలదు కదా!! (పుట్టపర్తి వారికీ, వారి శ్రీమతికీ ఏడు సంవత్సరాల తేడా ఉంది. పెళ్ళి నాటికి పుట్టపర్తికి 21, వధువుకు 14 ఏళ్ళు.)

అటు పుట్టపర్తి దినచర్యలో మార్పులేదు.

పరీక్షలు వచ్చేశాయి.

అప్పట్లో మదరాసు విద్వాన్ పరీక్షలకు తిరుపతి కూడా కేంద్రమేనట!! అక్కడే పుట్టపర్తి విద్వాన్ పరీక్ష వ్రాశారు. పెనుగొండలక్ష్మి పాఠ్యాంశంగా ఉన్న ప్రశ్న పత్రం లోని ప్రశ్నలన్నింటి ఒక సారి పరికించి చూశారు.ఒక చిన్న ప్రశ్న దగ్గర వారి దృష్టి ఆగింది. (……) వంచిన తలెత్తకుండా, మూడు గంటల కాలవ్యవధి ముగిసేవరకూ రాస్తూనే ఉన్నారు. అదనంగా దాదాపు నలభై పేపర్లు తీసుకున్నారట కూడా!!

వ్యవధి ముగిసింది.

ప్రొద్దుటూరుకు కు తిరుగు ప్రయాణం.

తిరుపతినుండీ, పరీక్ష వ్రాసి, తిరిగి వచ్చిన భర్తను పరీక్ష ఎలా వ్రాశారు.. అని అడగాలని చాలా ప్రయత్నించారు వారి శ్రీమతి కనకవల్లి. కానీ ఏదో బెరుకు..!!

ఏదో సందర్భంలో ఇంటికి వచ్చిన పెద్దలెవరితోనో పరీక్షలు బాగా వ్రాశాను..’ అని చెబుతుండగా విని, తృప్తి చెందిందామె ! పరీక్షలో భర్త ఉత్తీర్ణత సాధించటంలో తృప్తి కలగటమొక్కటే కాదిప్పుడు!! ఆర్థికంగా మరింత వెసులుబాటు కలగబోతున్న తృప్తి కూడా దక్కుతుంది. కారణం, ఇప్పటిదాకా, భర్త జీతం తక్కువవటం వల్ల, అభిమానవతి కావటం వల్ల ఎవరి ముందూ చేయి చాచి అడగటమన్న అలవాటు లేదు. మరీ అవసరమనిపిస్తే, తల్లి శేషమ్మను ఆశ్రయించటం తప్ప మరో దారి లేదు.

భర్తకు వ్రాసుకునే కలాలూ, పేపర్లూ వంటి అవసరాలతో పాటూ, బీడీలు విపరీతంగా తాగే సుగుణం వల్ల కూడా ఇల్లు నడపటం పై ఆ వ్యయం తాలూకు ఒత్తిడిని తట్టుకోవలసిన అవసరం ఉంటుంది.

ఇవన్నీ భర్తతో చర్చించే అవకాశమే ఉండేది కాదామెకు !! ఇరవై నాలుగు గంటలూ, సుదీర్ఘ సారస్వతోపాసనలోనే గడిపే వారితో, సంసారానికి సంబంధించిన విషయాలు చర్చించ బుద్ధయేది కాదామెకు!!

పాఠశాల కు వెళ్ళి రావటం, వెంటనే అదేదో నియమానికి కట్టుబడి ఉన్నట్టే, గ్రంధాలలో తల దూర్చటం మాత్రమే ఎప్పుడూ నారాయణాచార్యులవారి దినచర్య. ఇంటి పనంతా తానే చేసుకునేదామె అప్పట్లో!! పాఠశాలలో చెప్పిన పాఠం అర్థం కాలేదంటూ ఇంటికి వచ్చేవారిని, పుట్టపర్తి, మరోమాట లేకుండా, శ్రీమతి వద్దకు వాళ్ళని పంపేవారు. కారణం, ఇదివరకే చెప్పుకున్నట్టు, ఆమె అప్పటికే వారి పితామహులవద్ద తెలుగు పంచకావ్య పఠనం పూర్తి చేసి ఉండటమే!! వాళ్ళు కూడా ‘అమ్మా.. అమ్మా..’ అంటూ తనవద్దకు వస్తుంటే, గుండెలోనుండీ, మాతృభావన ఉప్పొంగుతుంటే, ప్రేమతో వారి సందేహాలు కూడా తీర్చే పనిలో పడేదామె!!

వీటనిటి మధ్య, విద్వాన్ పరీక్ష వరకూ బాగానే భర్త వ్రాశారని తెలిసి మహదానందపడిందా నేదరి ఇల్లాలు !!

ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. విద్వాన్ పరీక్ష ఫలితాలొచ్చాయి. అది విని కనకవల్లి దిగ్భ్రాంతి చెందింది.. ఇంతకూ ఏమిటా వార్త?

****

ఫోటో వివరాలు :

బాల కనకవల్లి (ఎడమ) మధ్య మాతామహులు శ్రీ  ధన్నవాడ దేశికాచార్య, వారి ఒడిలో మా పిన్నమ్మ అలమేలమ్మ

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.