నారిసారించిన నవల-13

వట్టికొండ విశాలాక్షి

-కాత్యాయనీ విద్మహే 

  7    

స్త్రీలది ఇంటి సమాజం, పురుషులది బయటి సమాజం అయిన వ్యవస్థలో సామాజిక సాహిత్య రంగాలు , ఉద్యమాలు అన్నీ పురుషులవిగానే ఉంటాయి. ఆయా రంగాలలో స్త్రీలను వెతికి వెతికి పట్టుకోవాల్సి వస్తుంటుంది. స్త్రీలకు ఇంటి గడపదాటి సామాజిక జీవితం ఏర్పరచుకొనటం సాధారణమైన విషయం కాదు. ఆమెను గడప దాటించటానికే సంస్కరణోద్యమాలు వచ్చాయి. విద్య స్త్రీలకు అవశ్యం అని ప్రచారం అవుతున్నా ఊళ్ళో బడిలో నాలుగైదు తరగతుల వరకు చదవటమే ఎక్కువ. పెళ్ళికే ప్రాధాన్యత. ఆడపిల్లల చదువుపట్ల కాస్త శ్రద్ధ, వెసులుబాటు  ఉన్నవాళ్లు పిల్ల  పెళ్లి అయి కాపురానికి వెళ్ళేలోపల ఇంట్లో ప్రత్యేకంగా మాష్టారును ఏర్పాటుచేసి చదువు చెప్పించేవాళ్ళు. సంసారం మొదలయ్యిందంటే మళ్ళీ జీవితం ఇంటికే పరిమితం కావటం సర్వసాధారణం. ఈ పరి స్థితులలో జాతీయోద్యమంలోకైనా, కమ్యూనిస్టు ఉద్యమంలోకైనా స్త్రీలు రావటం ఎలా జరిగింది?   జనాభాలో సగమైన మహిళలు లేకుండా ఏ ఉద్యమమూ అర్ధవంతం కాదన్న అవగాహనతో ఆయా పార్టీలు, నాయకత్వం మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని తీసుకొన్న  విధాన నిర్ణయం వలన. పార్టీ సభ్యులుగా వున్న పురుషుల పై  తమ ఇళ్లల్లో స్త్రీలను ఉద్యమంలోకి వచ్చి పనిచేసేట్లు చూచే బాధ్యత ఉంచబడటం వలన. పురుషులు ఉద్యమాలలో ఉన్న ఇళ్లనుండే  ఎక్కువమంది స్త్రీలు ఉద్యమాలలోకి రావటం దానినే సూచిస్తుంది. ఈ నేపథ్యంలో నిష్కామయోగి నవలలో   ఇటు జాతీయోద్యమంలోకి, అటు కమ్యూనిస్టు ఉద్యమంలోకి స్త్రీలు ప్రవేశించిన తీరును వాళ్ళ సంసిద్ధతలలోని  వైవిధ్యాన్ని,  పరిమితులను  చిత్రించింది వట్టికొండ విశాలాక్షి. ఒక రకంగా ఇది స్త్రీల కోణం నుండి ప్రజాస్వామిక ఉద్యమాలలోని పితృస్వామ్య స్వభావాన్ని విమర్శకు పెట్టటం. స్త్రీవాద రాజకీయాల చర్చ విస్తృతమై, అధ్యయనాలు జరిగి, అవగాహన పెరిగిన గతనలభై  యాభై ఏళ్ల  చరిత్రలో మనకు ఇది కొత్త విషయంగా కనిపించకపోవచ్చు కానీ అంతకు ఒకటిరెండు దశాబ్దాలకు ముందే స్వీయ అనుభవాలనుండి ఒక మహిళ నవలా రూపంలో చేసిన సాధికార విమర్శగా దీనికి చారిత్రక  ప్రాధాన్యత  వుంది.   

ఈ నవలలో కాంగ్రెస్ నాయకత్వంలో జాతీయోద్యమ రాజకీయాలలో పాల్గొన్న పాపాయమ్మ, చిట్టెమ్మ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో మహిళా ఉద్యమంలో ,సాహిత్య ఉద్యమంలో పాల్గొన్న లైలా ఉన్నారు. ముగ్గురూ  తెలుగు,హిందీ సంస్కృత భాషలు నేర్చుకొన్నవాళ్ళు. పాపాయమ్మ ముగ్గురిలోకీ పెద్దది. పెళ్లయి కాపురం చేస్తున్న స్త్రీ. చిట్టెమ్మ పెళ్లయి సాంసారిక జీవితం చెడిపోయి పుట్టిల్లు చేరిన స్త్రీ. ఆమె చెల్లలు లైలా.  

పాపాయమ్మను జాతీయోద్యమ రాజకీయాలలోకి ప్రవేశపెట్టినవాడు ఆమె భర్త అచ్చయ్య. అయితే ఆయన కాంగ్రెస్ రాజకీయాలలో  ఉన్న మనిషేమీ కాదు. ఖద్దరు కట్టటంతో మొదలుపెట్టి తాను అక్కడే ఆగిపోయినా  ఆమె పికెటింగ్ లలో పాల్గొని జైలుకు వెళ్ళటానికి ప్రోత్సహించాడు. ఒక సారి జైలుకు వెళ్ళివచ్చాక పాపాయమ్మకు   రాజకీయాలు వృత్తి ,ప్రవృత్తి అయిపోయాయి. మొదట్లో ఖద్దరు కట్టటానికే గునిసి, భర్త అధికారానికి, ఆజ్ఞకు తలవొగ్గి కట్టిన పాపాయమ్మ  స్వాతంత్య్రం వచ్చేవరకు కాంగ్రెస్ ను అంటిపెట్టుకొని జాతీయోద్యమంలో భాగస్వామి కావటం ఎలా సాధ్యమైంది? దానివెనుక ఆమె పడిన సంఘర్షణ  ఏమిటి? 

స్త్రీల జీవితం భర్త ల అధికారం మీద,  దయమీద ఆధారపడి ఉందన్నది ఎంత  సామాజిక  వాస్తవమో దానిపట్ల స్త్రీలు అసంతృప్తితో రగిలిపోతుండటం కూడా అంతే వాస్తవం అనటానికి నిదర్శనం  పాపాయమ్మ జీవితం. ఆమె ఏ చీర కట్టాలో నిర్ణయించేది ఆమెభర్త అచ్చయ్య. పండగ కు  మరుసటిరోజు పండుగకు చీర తీసుకురావటం గురించిన వాళ్ళిద్దరి సంభాషణ దగ్గరే నవల ప్రారంభం అవుతుంది. ఆడవాళ్ళ అభిరుచులతో సంబంధం లేకుండా చీరలు తెచ్చే భర్త అల వాటు పట్ల ఆమె విచారం వ్యక్తంచేస్తుంది కూడా. ‘నీకేచీర బాగుంటుందో నాకంటే నీకెక్కువ తెలుసా? అన్నది అతని అహం. 

పండుగరోజు ఉదయం మడతవిప్పిన కొత్తగుడ్డ మంచంమీద వేసివుంటే చూసి దుప్పటి లాంటి  ఆ గుడ్డ తన కోసం  తెచ్చిన చీర కాదుగదా అని పాపాయమ్మ సందేహిస్తుండగానే భర్త దానిని ధృవీకరించాడు. దుప్పటి లాంటి ఆ గొల్లంచుల చీర తాను కట్టనని పాపాయమ్మ నిరసన వ్యక్తం చేస్తే ఆమె చదివిన చదువును, ఆమె పాండిత్యంతో పాటు ఆమె తండ్రి పాండిత్యాన్ని హేళన చేసి మాట్లాడుతూ అక్షరం ముక్క రాని తన జ్ఞానమే ఎక్కువదని చెప్తూ ఈ రోజు నుంచీ మనం ఇద్దరం ఈ ఖద్దరు గుడ్డలే కడుతున్నాం అని తన నిర్ణయాన్ని ప్రకటించి పండగపూట తిట్లు తినక నేను చెప్పినట్లు కానీ అని హెచ్చరించి బయటకు పోయాడు. తిరిగివచ్చేసరికి ఆమె ఆ చీర కట్టుకుకొక పోవటం చూసి ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. అంత ముతక చీర ఎట్లా కట్టుకుంటారని అన్న ఆమె మాటలు చెవినపడటంతో ఇక పట్టలేక చేతికందిన తుంటే చీపురు తీసి ఆమె మీదికి విసిరేసాడు. నీళ్లు తిరిగిన కళ్ళతో చీర అందుకొని కట్టుకొని రావటం ఆమెకు తప్పనిసరి అయింది. అహింసా వాది  అయిన గాంధీ చెప్పిన ఖద్దరు ధారణ ఉద్యమం లోకి స్త్రీల సమీకరణ  హింసాయుతంగా జరగటం ఒక పెద్ద వైరుధ్యం. 

 తినే తిండి కట్టుకొనే బట్ట విషయంలోనైనా  ఇతరుల జోక్యం లేకుండా ఉంటే ఫరవాలేదనుకొన్నది పాపాయమ్మ. కానీ ఏ భార్యకైనా  ఆ పాటి స్వతంత్రం కూడా అనుభవం లో ఉండదు.  పాపాయమ్మ దానికి మినహాయింపు కాదు. తనకు మాంసాహారం అంటే అసహ్యమైనా భర్తకు ఇష్టం కనుక దగ్గరుండి వండించాల్సి వస్తుంది. తనకు ఇష్టమైన చిలగడదుంపలు కొనుక్కొని కాల్చుకు తిందామంటే ‘కడుపులో నొప్పి కడుపులో నొప్పి అని నా ఇంట్లో మూలిగావా అంటే ఊరుకొనేది లేదు’ అని ఆయన  గదమాయిస్తే ఆగిపోవలసిందే. సురభి కంపెనీ వాళ్ళు వచ్చి డ్రామాలు వేస్తుంటే, వూళ్ళో హరికథలు చెప్తుంటే ‘నిద్రలేకపోతే జబ్బుచేస్తుంది’  అంటూ  చూడటానికి, వినడానికి హద్దులు పెడుతుంటే అభిరుచులను అణచుకొని ఇంటివద్ద ఆగి పోవలసిందే. ప్రతిచిన్న విషయానికీ ఇతరుల ఇష్టం  మీద ఆధారపడటం లోని కష్టం తెలిసిన స్త్రీగా  పాపాయమ్మ ఆడవాళ్లను భగవంతుడు ఆలా  ఎందుకు సృషించాడా అని ఆవేదన పడుతుంది. మగవాళ్ల అదృష్టానికి అసూయ పడుతుంది. ధిక్కరించి పోవాలను కొన్నా మరొక ఆశ్రయం లేక జీవితాన్ని కళ్ళుమూసుకొని గడిపెయ్యటానికి అలవాటు పడ్డ ఆడవాళ్ళకు ప్రతినిధి అయిన పాపాయమ్మ కు జాతీయోద్యమ కార్యక్రమం స్వేచ్ఛాప్రపంచంలోకి తలుపులు తెరిచింది. 

సామాజిక జీవితమైనా, జాతీయోద్యమంలో క్రియాశీల భాగస్వామ్యం అయినా పాపాయమ్మ కు భర్త దయవల్ల లభించినవే అన్న విషయం మరువరాదు. మగవాళ్ళు తమకు ఏది మంచి అనిపిస్తే దానిని ఆచరణలో పెట్టటానికి సిద్ధమవుతారు. తమ అధికార పరిధిలో ఉన్న వాళ్ళకు కూడా అదే మంచిదని నిర్ణయిస్తారు. అది తమకు మంచి అవునో కాదో స్వయంగా ఆలోచించి నిర్ణయించుకొనే వెసులుబాటు స్త్రీలకు ఉండదు.  ఖద్దరు కట్టుకొనటం తనకు ఆదర్శం అయింది కనుక అచ్చయ్య ఆ ఆదర్శాన్ని  గద్దించి మరీ పాపాయమ్మ మీద రుద్దగలిగాడు. జాతీయోద్యమ ప్రయోజనాల రీత్యా అయినా సరే దానిని  స్వీయ ఆదర్శంగా చేసుకొనే శిక్షణ స్త్రీలకు ఇయ్యటానికి బదులు శిక్షగా అమలుచేయడంలో పనిచేసిన పితృస్వామిక అధికార వ్యవస్థ లక్షణం అది. కష్టంగా ఖద్దరు చీర కట్టటం మొదలు పెట్టిన పాపాయమ్మకు త్వరలోనే అది ఇష్టం అయిపొయింది. అలవాటు వల్ల నైనా  కావాలి, వూళ్ళో ఖద్దరు కట్టిన మొదటి స్త్రీగా లభించిన ఒక గుర్తింపువల్ల నైనా కావాలి. 

హిందీ చదువుకొనటానికి ఇష్టంగానే సిద్ధపడింది పాపాయమ్మ. అందుకు కారణం పెళ్ళికి ముందే ఆమె చదువుకున్నది కావటం. చదువుల పట్ల అభిరుచి ఆమెలో వేరూనుకొని ఉండటం. కాంగ్రెస్ పిలుపును అందిపుచ్చుకొని అచ్చయ్య వూళ్ళో యువకులతో పాటు పాపాయమ్మ కూడా హిందీ నేర్చుకొనటానికి మాస్టర్ని పిలిపించి ఏర్పాటు చేసాడు. అయినా గడపలోపల తలుపుచాటున ఎవరికీ కనబడకుండా కూర్చొని ఆమె హిందీ నేర్చుకొన వలసి రావటం గమనించదగిన అంశం. ఆడవాళ్ళ జీవితం ఇంటిలోపలిది అని నొక్కిచెప్తుంది ఈ సందర్భం. ఇలాంటి పరిస్థితుల నుండి పాపాయమ్మ గడపదాటి బయటకు ఎలా రాగలిగింది ? జాతీయ గీతాలు పాడుకొంటూ ఊళ్లోకి వచ్చి,  కరపత్రాలు పంచిన ఆడవాళ్ళ ప్రభావంవల్లనా? ఇల్లిల్లు తిరిగి ఆడవాళ్ళకు   జాతీయఉద్యమంలో  పాల్గొనమని ప్రబోధించిన ఆమె ప్రభావం వల్లనా? అంటే కాదు. అవన్నీ అచ్చయ్య మీద ప్రభావం చూపాయి. ఆ ప్రభావం నుండే ఆయన పికెటింగ్ లో పాల్గొని జైలుకు వెళ్ళటానికి పాపాయమ్మ ను సిద్ధం చేసాడు అన్నది గమనించవలసిన అంశం. 

అందుకు సిద్ధమయ్యే క్రమంలో పాపాయమ్మ పడిన ఘర్షణ కూడా తక్కువది కాదు. తలుపుచాటు సమాధానాలు, తలుపుచాటు చదువులు, వీధిలో మగవాళ్లకు ఎదురుపడకుండా ఒదిగి ఒదిగి తిరగటాలు, లేదా మగవాళ్ల ముందు నుండి పోవలసివస్తుందంటే అసలు పోవటమే మానెయ్యటాలు – ఇలాంటి వాటి మధ్య గడిచిన జీవితం పాపాయమ్మను  జండా పట్టుకొని వీధుల్లో తిరగటం గురించిన ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేయటం సహజమే మరి. అయితే ఆమె దానినుండి తేరుకొని జైలుకు వెళ్ళటానికి నిశ్చయించుకొన్నది. ఆమె ఆ  నిర్ణయానికి రావటానికి కారణం  జాతీయోద్యమ ఆదర్శాలు కాదు. కొంతకాలమైనా ఇంటిని తప్పించుకోవాలన్న గాఢమైన ఆకాంక్ష మాత్రమే. జైలుకి వెళ్తే ఒక తిండి విషయం తప్ప మిగతావేవీ ఇక్కడికంటే అక్కడ తనను బాధించవు అని అనుకోగలిగిందంటే ఇల్లు అనేది స్త్రీల పాలిట ఎంత అసమాన, అస్వతంత్ర స్వభావంతో ఘనీభవించి అణచివేత నిర్మాణంగా స్థిరపడిందో అనుభవంలో తెలిసిరావటం వల్లనే. 

జైల్లో పెడితే రాబోయే ఇబ్బందులగురించి తలపోస్తున్న  పాపాయమ్మ  ‘జైల్లో  పెట్టిన తరువాత ఎక్కడికీ పోనివ్వరన్న ఆలోచన కలిగి వెనువెంటనే ఎక్కడికీ పోనివ్వరనుకోటానికి ఇక్కడ  మాత్రం ఎక్కడికి పోతున్నది తాను? అన్నప్రశ్నవేసుకొంటుంది.  ఇల్లు వదిలి పుట్టినింటికి కూడా అనుకున్నప్పుడు  పోలేని తన అస్వతంత్రత గురించిన స్పృహ నుండి వచ్చిన  ప్రశ్న అది. గడిచిన ఏడాదిలో పుట్టినింటికి పోవాలని మూడుసార్లు తానుచేసిన ప్రయత్నాలను భర్త పడనియ్యక పోవటం  గుర్తుకువచ్చి ఆమె తనను భర్త అలా ఆపటానికి తగిన కారణాలు కూడా ఏమీ కనిపించవు అనుకొంటుంది. మరుక్షణం కేవలం ప్రతిచిన్నవిషయంలో భర్త అనుగ్రహం పై ఆధారపడి ఉండవలసిన తనలాంటివాళ్ళు కారణాలను గురించి ఆలోచించనే కూడదని అనుకొంటుంది. సంసారం అనేది స్త్రీకి ఎంత ఊపిరాడని నిర్బంధ జీవితంగా ఉందో  పాపాయమ్మ అంతరంగ ఆలోచనా ప్రపంచ ప్రదర్శన ద్వారా వాస్తవికంగా నిరూపించింది విశాలాక్షి. ఈ పరిస్థితులలో బయటి స్వాతంత్య్ర ఉద్యమం లోలోపల, ఇంటి లోపాలు స్వాతంత్య్రం కోసం తహతహ లాడుతున్న స్త్రీల ఉద్వేగాల ఒత్తిడికి ఒక ‘సేఫ్టీ వాల్వ్’ గా అందుబాటులోకి వచ్చింది. పాపాయమ్మ జైలుకు వెళ్ళటానికి సిద్ధపడటంలో ఆ రకంగా కుటుంబం నుండి విముక్తి అనేది ప్రధాన ప్రమేయం అయింది. 

జైలు నుండి వచ్చాక బయటి ప్రపంచానికి సంబంధించిన ఏ పనీ లేకపోవటం పాపాయమ్మకు పెద్ద లోటు అయింది. దానిని పూరించుకొనటానికి భజనలకు పోవాలనుకొన్నది. వాటివల్ల ప్రయోజనం లేదని అచ్చయ్య అనుకొన్నాడు గనుక ఆమెకు అనుమతి లభించలేదు. తన జీవితం మీద ఆయన ఇష్టాల పెత్తనం, ప్రభావం ఎటువంటిదో మరొకసారి తెలిసి వచ్చిన  ఆ క్షణాన ఆమెకు ‘దేశం అంతా కలిసి ఎంత బానిసత్వం అనుభవిస్తుందో, నేనొక్కదాన్నే అంత బానిసత్వం అనుభవిస్తున్నాను’ అనిపించింది. ‘ఈ బానిసత్వాన్నుంచి నేను విముక్తి చెందితేనే నా దేశం కూడా విముక్తి చెందేది’ అని భావించింది కూడా. బానిసత్వం , దాని నుండి విముక్తి అనే రెండింటికి సంబంధించిన స్పష్టత ఆమెకు ఎప్పుడైతే వచ్చిందో ఆ క్షణం నుండి ఆమెకు పదేపదే చూచుకొని మురిసిపోయే వంటి మీది నగల పైకి దృష్టి పోలేదు అంటుంది రచయిత్రి. స్త్రీలను బానిసలుగా సంసారానికి కట్టిపడేసే సంకెళ్లు నగలు అన్న చైతన్య లక్షణం అది. ఇక ఇక్కడి నుండి పాపాయమ్మ భర్త ఆదేశాలకు, అనుమతులకు ఎదురు చూసే స్థితిని దాటేసింది. 

భజనలు కాదన్న తరువాత పాపాయమ్మ జైల్లో నాటకాలు వేసిన అనుభవంతో ఆడవాళ్లను కూడగట్టి నాటకాలు వేయించాలన్న ఒక కార్యక్రమం తీసుకొన్నది. ప్రదర్శన ఆడవాళ్లకు మాత్రమే. అత్తవారిళ్లకో, పుట్టిళ్లకో వెళ్లాల్సిన అవసరం కలగటం వంటి ఆడవాళ్ళ పరాధీనతలు, పరిమితులు నాటక ప్రదర్శనకు అవరోధం అయినాయి.  ఏమిచేయాలో తోచక కొట్టుకొంటున్న ఆమెకు కాంగ్రెస్ హరిజనోద్యమ కార్యక్రమాలు, ఎన్నికల కార్యక్రమాలు, అసహాయోద్యమ ప్రచార కార్యక్రమాలు మళ్ళీ చేతినిండా పని ఇచ్చాయి. తాను చేసే పని గురించి, ఎప్పుడు పోయేది, ఎప్పుడు వచ్చేది చెప్పటమే తప్ప  ఆయన  కార్యక్రమాన్నిఇయ్యటం , ఆమె  అనుసరించి పోవటం అనే పాత అలవాటు ఇప్పుడు వాడుకనుండి జారిపోయింది. ఒక రకంగా ఇది పాపాయమ్మ విముక్త మహిళ అవుతున్న క్రమాన్నే సూచిస్తుంది.   

పాపాయమ్మ తో పాటు జైలుకు వెళ్లిన మరొక స్త్రీ చిట్టెమ్మ. ఆమె పెళ్లయి భర్త ఆస్తి అంతా పాడుచేస్తే మరొక మార్గం లేకనో ఏమో పుట్టిల్లు చేరింది. ఇల్లుదాటి బయటకు పోని చిట్టెమ్మకు రాట్నం వడకమన్న గాంధీ పిలుపు శిరోధార్యం అయింది. సంసారం లేని స్త్రీగా తల్లి బాధను , లోకం జాలి చూపులను భరించలేని ఊపిరాడనితనమేదో  అనుభవం అవుతూ జైలుకు వెళ్ళటానికి సిద్ధపడ్డ పాపాయమ్మ స్ఫూర్తి తో తానూ జైలుకు వెళ్ళటానికి సిద్ధపడింది. వెళ్ళింది. ఆ తరువాత హరిజన సేవా కార్యక్రమాలలో పాల్గొన్నది. హరిజనవాడలకు వెళ్లివచ్చి స్నానమన్నా చేయరా అని లబలబ లాడుతూ తల్లి అన్న మాటను ‘సింగినాదం’ అని తిరస్కరించగల చైతన్యం కనబరిచింది. అంతకు మించి ఆ తరువాతి జాతీయోద్యమ కార్యకలాపాలలో పాల్గొనే చొరవ చూపలేని వ్యక్తిత్వ పరిమితి ఆమెది. 

8

చిట్టెమ్మ చెల్లెలు లైలా. పాపాయమ్మ, చిట్టెమ్మ జైళ్లకు వెళ్ళినాటికి పదేళ్ల పిల్ల. వాళ్ళతో పాటు హరిజనవాడలలో తిరగటంవరకే జాతీయోద్యమంలో ఆమె పాత్ర. కాంగ్రెస్ గురించి, జాతీయోద్యమం గురించి చిట్టెమ్మను పాపాయమ్మ ను చూస్తూ అభిమానం పెంచుకొన్నది. కానీ ఆమె అసలైన  రాజకీయ జీవితం కమ్యూనిస్టు పార్టీతో కలిసి వికసించింది. అత్తవారి ఇంటికి వెళ్ళాక ఆమెకు భర్త వైపు బంధువులు, స్నేహితుల ద్వారా పార్టీ గురించి తెలియటం, పరీక్షలు రాయటానికి బస్తీకి పోతూ భర్త మోహనరావు పొద్దుపోవటం కోసం వూళ్ళో జరుగుతున్న రాజకీయ పాఠశాలలో పాల్గొనమని చెప్పి పోవటం కమ్యూనిస్టు  రాజకీయపరిజ్ఞానాన్నిపెంచుకొనటానికి ఆమెకు తక్షణ అవకాశాలు అయ్యాయి. తాను కాంగ్రెస్ లో పుట్టి కాంగ్రెస్ లో  పెరిగినా కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి, కమ్యూనిస్టుల నిబద్ధత, త్యాగాల గురించి తెలిసేకొద్దీ రెండింటినీ పోల్చి చూసి కమ్యూనిస్టు పార్టీ వైపున నిలబడింది. మహిళా సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించటంలో ఉత్సాహం చూపింది. సాహిత్యం పట్ల అభినివేశం ఉన్నది కనుక కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సాహిత్య సంస్థలోనూ సభ్యురాలైంది.  అయితే స్త్రీల ఆసక్తులు, ఉత్సాహాలు  ఏవైనా భర్తలు అనుమతించిన వరకే అన్న స్థిరపడిన లౌకికనీతికి  లైల జీవితం కూడా మినహాయింపు కాకపోవటమే విషాదం. 

మోహనరావుకు కమ్యూనిస్టు రాజకీయాలు అవగాహన చేసుకొనటం వరకు, ఆ రాజకీయ భావ జాలంతో కవిత్వం వ్రాయటం వరకు ఇష్టం. ఆ మేరకు అతని ఆచరణ ఆ పార్టీ భావజాలానికి అను కూలమైన రచయితల సంఘంలో చేరి పనిచేయటానికి పరిమితం. దానికి అనుగుణంగానే భార్య లైలాను  రాజకీయాలు అవగాహన చేసుకొనటానికి పదిమందిలోకి పోవటానికి  ప్రోత్సహించాడు.కానీ ఆ పదిమంది నుండి మహిళా సంఘానికి,  పార్టీకి,  రచయితల సంఘానికి కూడా విస్తరించిన మనిషి.  మోహనరావు తనకు రచయితల సంఘంతో భేదాభిప్రాయాలు వచ్చేసరికి  దాని నుండి వైదొలగుతూ తన భార్య కూడా దాని నుండి తెగతెంపులు చేసుకొని రావలసిందే అనుకొన్నాడు. రాక ఎక్కడికి పోతుంది అనుకొన్నాడు. “ ఆడవాళ్ళ దేముంది? అందులోనూ భార్య! నేను ఊరుకున్నాను గనుక వెళ్లి పని చేస్తూ ఉంది. వెళ్ళక్కరలేదంటే మానుకుంటుంది.” అన్న నిశ్చితాభిప్రాయం గల మగవాడు అతను. ఆడవాళ్లను బయటకు వెళ్లనియ్యటమైనా , వద్దని ఆపెయ్యటమైనా స్విచ్ వేసి లైట్ వెలిగించటం, ఆర్పేయటం వంటిది అతని దృష్టిలో అని రచయిత్రి వివరణ కూడా ఇచ్చింది. 

మోహనరావు తాను ఉన్న రచయితల సంఘానికి రాజీనామా చేయదలచుకున్న సంగతి అర్ధమవుతుంటే లైలా ఇక తన మీద రాబోయే ఒత్తిడి ని వూహించగలిగింది. మోహనరావుకు సంఘంతో అభిప్రాయభేదం వచ్చింది కనుక అతను రాజీనామా చేయవచ్చు. తనకు పార్టీ తో గానీ, మహిళాసంఘంతో గానీ, రచయితల సంఘం తో గానీ తెగతెంపులు చేసుకోవాలన్నంత సంఘర్షణ ఏమీ లేనప్పుడు రాజీనామా చేయవలసిన అవసరం తనకేమిటి? అన్నది ఆమె ప్రశ్న. కానీ అది నిలబడదని ఆ సంఘాలతో, పార్టీ తో తనకేవిధమైన సంబంధం ఉండరాదని భర్త శాసిస్తాడని తెలిసి ఆందోళన పడుతుంది. ఒక్క మోహనరావే కాదు, భర్తగా భార్యపట్ల ఏ పార్టీకి చెందినవారయినప్పటికీ పురుషులందరూ అట్లాగే ప్రవర్తిస్తారని లైలకు తెలుసు.

స్వేఛ్చను కోరుకొనే పురుషులు స్త్రీలు కూడా అటువంటి స్వేఛ్చను కోరుకొంటారని గుర్తించనిరాకరిస్తున్న వైనం అర్ధమైన లైల స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి ఇన్నాళ్లు ప్రబోధించిన తానే ఒక బానిసగా ఇంటికి బందీకావటం ఎట్లా అన్న విచికిత్సలో పడింది. మోహనరావును ఎదిరించటం అంటే అతనితో సంబంధం వదులుకొనటానికి సిద్ధపడటమే అని ఆమెకు తెలుసు. లొంగిపోతే జీవితమంతా వెన్నాడే అసంతృప్తి, అవమానం.  ఎదిరిస్తే ఎన్నో బాధలు.. తల్లిదండ్రుల దగ్గరనుండి అందరూ తప్పు పడతారు. బాధపడతారు. అది తనకూ బాధే. శాంతి  లేని జీవితం గడపాలి. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి అని లోలోపల మధన పడింది. చివరకు సంసారంలో ఉన్నా లేకున్నా శాంతి, సంతృప్తి ఇక తనకు ఉండవు అని రూఢి అవుతుంటే  ఎదిరిస్తే ఆత్మాభిమానం అయినా నిలుపుకోగలను కదా !అన్న నిర్ణయానికి వచ్చింది. రాజీనామా పెట్టటానికి అంగీకరించలేదు. దాని పరిణామం మోహనరావు ఆమెను   తీసుకువచ్చి పుట్టింట దించి ‘సంఘం పని మానకపోతే కలిసి ఉండటం అసాధ్యమని’  ఆమె  పరోక్షంలో  తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళటం. ఒప్పుకోమని లైలా మీద వాళ్ళు ఒత్తిడి తెస్తే దానికి ఆమె  లొంగిందా విజయం తనదే. ఒప్పుకోలేదా లోక రీతిని, పురుష నీతిని బట్టి తప్పు తనది కాకుండా లైలాదే అవుతుంది అని మోహనరావు అంచనా 

ఈ విధమైన వ్యతిరేక పరిస్థితులతో ఒంటరి పోరాటం చేయటానికి  లైలా  పడిన సంఘర్షణ తక్కువది కాదు. ఆత్మవంచన లేకుండా స్వాభిమానంతో హక్కుల కోసం, అభిప్రాయాల కోసం నిలబడే స్త్రీలు ఎంత హింసపడాలో అంత హింసపడింది. తల్లి అల్లుడు చెప్పినట్లు వినమని బతిమిలాడింది. చెప్పినమాట వింటే నగలు, డబ్బు ఇస్తానని ఆశ పెట్టింది. వినకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటానని ఒత్తిడి పెట్టింది. నీకు రెండుపూటలా తిండేవరు పెడతారని బెదిరించింది.  ఇల్లువదిలి అన్నగారింటికి వెళ్లి అన్నాహారాలు మానేసి నిరసన ప్రకటించింది. ఆ రకంగా తల్లి తాను హింసపడుతూ తనను పెట్టె హింస, ఆడవాళ్లకు ఆత్మాభిమానం, ఆదర్శాలకన్నా భర్తకు వొదిగి ఉండటమే న్యాయం అని  చెప్పకనే  చెప్పేతల్లి ప్రవర్తన, లోకం సలహాలు, విమర్శలు  లైలా ముందు చాలా ప్రశ్నలను నిలిపాయి.  ఒకరికి ఏది కష్టమో, ఏది సుఖమో మరొకరు నిర్ణయించటం సరైన పద్ధతేనా?  ఆస్తి హక్కులు లేక పోషణకై తల్లిదండ్రుల దయ మీదనో భర్త దయ మీదనో ఆధారపడిన ఆడవాళ్లు అభిమానాన్ని, ఆదర్శాలను చంపుకొని బతకవలసిందేనా? ప్రేమ ఎదుటివాళ్లను తమకు ఇష్టమైన పద్ధతిలో నడిపించటానికి అడ్డం పెట్టుకొనే ఉద్వేగం మాత్రమేనా? ఈ రకమైన ప్రశ్నలతో కాగి కాగి చదివి ఏ డిగ్రీనో సంపాదించి ఉద్యోగం చేస్తూ స్వతంత్ర జీవనాన్ని ఏర్పరచుకొనాలని నిర్ణయించుకొన్న మనిషి రచయితల సంఘానికి రాజీనామా చెయ్యాలన్న ప్రసక్తి లేకుండా భర్త తనతో రమ్మని అన్నప్పుడు వెళ్ళిపోయింది. ఇంట్లోనూ బయటా కూడా  ఆదరాభి మానాలతో అనునయించే మనిషి లేక పడిన ఒంటరి యాతన నుండి విముక్తి కోసమో, లేక పుట్టిల్లు చేరినప్పటి నుండి తాను ఎలాగు మహిళా సంఘానికి, పార్టీకి దూరమైంది కనుక రచయితల సంఘానికి రాజీ చెయ్యాలన్న షరతును భర్త ఉపసంహరించుకొన్నప్పుడు తాను రాజీ పడటం తప్పదని అనుకొనటంవల్లనో ఆమె అందుకు సిద్ధపడింది. 

ఈ మొత్తం క్రమంలో రాజీనామా చేయవలసిన అవసరం లేకుండానే లైలాను  మహిళా సంఘానికి, పార్టీకి, రచయితల సంఘానికి కూడా  దూరం చేసిన మోహనరావు ఎత్తుగడ, నియంతృత్వం లైలా కు తెలియనివి కావు. వ్రాతల ద్వారా తప్ప చేతల ద్వారా కమ్యూనిస్టు పార్టీ మనిషిగా ఆమె ఉండకూడదు అన్న ఆంక్షలమధ్య, అధికారం కింద ఆమె జీవితంలోని బాధను   ‘రైలుకింద పడిన మనిషి పొందే బాధతో పోల్చి చెప్పింది రచయిత్రి. లైలా అంతరంగంలో భార్య లకు లేని స్వేఛ్చ గురించిన చింతన నిత్యం నిరంతరం. సమానత్వం గురించి మాట్లాడే పార్టీలు గానీ, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే పురుషులుగాని కుటుంబంలో సమానత్వం గురించి, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించరేమి? ఆచరించరేమీ అన్నవి ఆమెను వెంటాడే సందేహాలు. 1956 లో గత ఉద్యమాల అనుభవం నుండి లైల కు కలిగిన ఈ  సందేహాల దగ్గర  ఆగిన నవల   ఆ తరువాత పాతికేళ్ళకు తెలుగునేల  మీద  ఆ సందేహాలకు సమాధానాలు అన్వేషించే నూతన స్త్రీవాద ఉద్యమంగా  ప్రారంభమై కొనసాగుతున్న చరిత్ర. 

వట్టికొండ విశాలాక్షి స్వీయ జీవిత అనుభవాలు, సంఘర్షణలు నిష్కామయోగి నవలలో లైల పాత్ర సృష్టికి పరిణామానికి ముడిసరుకు అయింది కనుక దీనిని  ఆత్మచారిత్రాత్మక నవల అని కూడా చెప్పవచ్చు.

 (ఇంకా వుంది) 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.