నా జీవన యానంలో- రెండవభాగం- 14

‘గాజుపళ్లెం కథ’ గురించి

-కె.వరలక్ష్మి

నేను కథారచన ప్రారంభించాక మొదటిసారిగా అవార్డును తెచ్చిపెట్టిన కథ గాజుపళ్ళెం. 1992లో ఏ.జి ఆఫీస్ వారి రంజని అవార్డు పొంది, 28.2.1992 ఆంధ్రజ్యోతి వీక్లీలో ‘ఈవారం కథ ‘గా వచ్చిన ఈ కథ తర్వాత చాలా సంకలనాల్లో చోటు చేసుకుంది. బోలెడన్ని ఉత్తరాలొచ్చేలా చేసి చాలామంది అభిమానుల్ని సంపాదించిపెట్టింది. 2013లో వచ్చిన ‘నవ్య నీరాజనం’ లోనూ, 2014లో వచ్చిన ‘కథ-  నేపథ్యం’ లోనూ ఈ కథనే తీసుకున్నారు.

ఈ కథలోని గంగ నాకు బాగా తెలిసిన అమ్మాయి. మా వీధి చివర ఓ పూరింట్లో తల్లిదండ్రులతో కలిసి వుండేది. వ్యవసాయపు పనులేని రోజుల్లో ఆ కుటుంబం ప్రతి ఏటా ఇంటికి తాళం వేసుకుని రాళ్ళ క్వారీల్లో పనులకోసం వలస వెళ్ళేవారు. ఓ సంవత్సరం గంగ లేకుండా తిరిగొచ్చారు. క్వారీల దగ్గర గంగకి పెళ్ళైపోయి అత్తవారింటికెళ్ళిపోయిందని అందరికీ చెప్పారు.

ఓసారి రాజమండ్రి గోదావరి స్టేషన్లోంచి బైటికొస్తూంటే ఆనెం కళా కేంద్రం గోడనానుకుని గోనెపట్టాలో కట్టిన గుడిసెల్లో కనిపించింది. ‘అక్కా’ అంటూ దగ్గరకొచ్చింది. దూరంగా ఉన్న వాళ్ళాయన మొదటి పెళ్ళాన్ని, నలుగురు పిల్లల్ని చూపించింది. బొద్దుగా ఉండే పిల్ల చిక్కింది. చకచకా తన కష్టసుఖాల్ని వెళ్ళబోసుకుంది. ఇంటికెళ్తూనే ఆమె గురించి కథ రాసాను. కానీ, ఎవరికీ నచ్చదేమో అనే సంశయంతో ఏ పత్రికకూ పంపలేదు.

మా గీత రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో, నూతలపాటి హాల్లో, ఆనెం కళాకేంద్రంలో, బొమ్మూరు తెలుగు యూనివర్శిటీల్లో జరిగే సాహిత్య సభలకీ, సెమినార్లకీ వెళ్తూ ఉండేవాళ్ళం. గౌతమీలో సన్నిధానం శర్మగారు నన్ను సొంతసోదరిలా ఆదరించేవారు.

1991లో గోదావరి పుష్కరాలకు ముందు ఆనెం కళాకేంద్రంలో జరిగిన సభకు వెళ్ళినప్పుడు ఇదివరకు నేను చూసిన గంగవాళ్ళ గుడిసెలన్నీ తీసేసి, అక్కడి దృశ్యం కథలో నేను చెప్పినట్టుగా ఉంది. ఆనెం కళాకేంద్రానికీ, సుబ్రహ్మణ్య మైదానానికీ మధ్య వేసిన రాళ్ళగుట్టమీద గర్భవతి అయిన ఒకమ్మాయి వెనక్కి వాలి మంచి ఎండలో సేదతీరుతోంది. పక్కనే చిన్నపిల్లవాడొకడు సొట్టలు పడిన సత్తుగిన్నెని రాళ్ళమీద కొట్టి ఆడుకుంటున్నాడు. కథకు మొదలు స్ఫురించింది. ఇంటికెళ్ళగానే ఆ దృశ్యాల్ని కూడా చేర్చి కథను తిరిగి రాసాను. దాన్ని రంజని పోటీకి పంపాను.

చిత్రంగా చిన్న చిన్న సెంటిమెంట్లు కూడా స్త్రీల జీవితాల్లో ముఖ్యపాత్ర వహిస్తుంటాయి. అమ్మ ఇచ్చిన పచ్చడి రాచ్చిప్పనో, అమ్మమ్మ ఇచ్చిన రాగిపాత్రనో అపురూపంగా జీవితాంతం కాపాడుకున్న వాళ్ళు నాకు తెలుసు. అనుకోకుండా అవిపోతే కృంగి కృశించిపోయి, అలా పోగొట్టిన వాళ్ళను వేధించుకు తిన్నవాళ్ళను నేను చూసాను. మా చెల్లి అత్తగారైతే ఎప్పట్నుంచో ఉన్న ఉప్పుజాడీ పగలగొట్టిందని మా చెల్లిని పుట్టింటికి పంపేసింది.

ఏ వర్గంలోనైనా స్త్రీలు పీడితులే. భర్తనుంచో, బంధువర్గం నుంచో, సమాజం నుంచో స్త్రీలు ఎదుర్కొంటున్న పీడనవారికే పూర్తిగా అనుభూతిలో కొస్తుంది. స్త్రీ కనిపిస్తే చాలు తినేసేలా చూసే పోర్టరు గన్నిగాళ్ళు, వయసుతో నిమిత్తం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకునే తాగుబోతు రాజయ్యలు, ఆర్థికపరమైన వెసులుబాటు లేక ఎవర్ని ఎవరూ పట్టించుకోని (ఉన్నా పట్టించుకోని) జనాలు కోకొల్లలు. ఈ కథ రాయబడిన కాలానికీ, ఇప్పటికీ జనాల్లో మార్పేమీ రాలేదు. గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు స్త్రీకి వచ్చే కలలు, బిడ్డ కదలికల కళలు ఇంకా భూమి మీదకి రాని బిడ్డ పైన తల్లి చూపించే ఏకాగ్రత అవన్నీ స్వీయానుభూతులు.

అట్టడుగు వర్గం గురించి ఆలోచించగలిగితే ఇప్పటి తరానికి కూడా ఈ కథ నచ్చుతుందనుకుంటున్నాను.

గాజు పళ్ళెం

“రెండు బుల్లి చేతులు వింటిని ఎక్కు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి ఎప్పట్నుంచో. హమ్మయ్య! ఆ చేతుల ప్రయత్నం ఫలించింది. బాణాన్ని వింటికి సంధించి లాగి.. లాగి వదిలేసాయ్, అబ్బా!”

మూడంకెవేసి ముణగదీసుకు పడుకున్న గంగ కడుపులోని బిడ్డ కదలికకి ఉలిక్కిపడి కలలోంచి మెలుకువలో కొచ్చింది. సూదుల్లా గుచ్చుతున్న కంకర గట్టుమీద భారంగా వెల్లకిలా తిరిగింది. ఎర్రని అగ్నిపూల గుత్తుల మధ్య నుంచి ఎండ నిప్పుకణికలా కళ్ళలోకి దూకింది. చటుక్కున మోచేతిని కళ్ళమీద కప్పుకుంది. ఏదో అనుమానం వచ్చి మోచెయ్యి సందునుంచి స్టేషను గేటువైపు చూసింది. గేటు కవతల ఫెన్సింగు కానుకుని పోర్టరు గన్నిగాడు బీడీ తాగుతూ ఆకలి కళ్ళతో గంగని తినేసేలా చూస్తున్నాడు.

‘ఛీ ఎదవా’ అని తిట్టుకుని అటు తిరిగిపోయింది గంగ. ఆమెకి వాడి చూపులేం కొత్తకాదు. ‘ఎప్పుడూ అదే యావ ఎదవ సచ్చినోడికి ‘ అనుకుంది. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి ఆమెచేత తల మొయ్యా చివాట్లు తిని కేవలం చూపులోనే తృప్తిపడుతున్నాడు ప్రస్తుతం గన్నిగాడు.

పొద్దుట్నుంచి టీ నీళ్ళైనా పడని ఖాళీ కడుపులో బిడ్డ ఆకలికి కాబోలు లుంగలు తిరుగుతోంది. చీర పొత్తిళ్ళల్లో చెయ్యిదూర్చి పొత్తికడుపునోసారి తడుముకుంది గంగ. చేతి మీద చాచి తన్నిన బిడ్డ కాలుని అందుకోవాలని విఫల ప్రయత్నం చేసింది. కొంతసేపు ఇటుపట్టుకోబోతే అటు, అటుపట్టుకోబోతే ఇటు కదులుతున్న బిడ్డతో ఆడింది.

కొంతసేపటికి విసుగొచ్చి ఆట మానేసింది.

సన్నగా మంటలాగా ఆకలి మొదలయింది కడుపులో. లేవడానిక్కూడా ఓపికలేనంత నిస్సత్తువగా ఉంది. ఆకల్తో బాటు గంగని పశ్చాత్తాపం కూడా కొంచెం కొంచెంగా తినడానికి సిద్ధమైంది.

అసలా బోడిదాన్తో తగువు పడకుండా ఉండాల్సింది. వాగి వాగీ దాని నోరే నెప్పెట్టి రెండు చేతులా మూసుకునేది. తగువుపడి మాత్రం తను సాధించిందేం వుంది?

చెయ్యి వెనక్కి చాచి తలకిందున్న గుడ్డల మూట మధ్యలో పదిలంగా పాతకోకలు చుట్టిపెట్టిన గాజుపళ్ళాన్నోసారి తడిమి చూసుకుంది. ఆ బోడిది విసిరిన విసురుకు గాజుపళ్ళెం భళ్ళుమనేదే, సమయానికి సరిగ్గా పట్టుకునుండకపోతే, అప్పటికీ అంచు మీద చిన్న పెచ్చూడిపోయింది. తన ప్రాణం గిలగిలా కొట్టుకుంది. అసలా బోడిదానికి తనని ఆళ్ళకూడా తీసుకెళ్ళడం ఇష్టంలేకే కొంత నాటకమాడింది.

నెమ్మదిగా లేచి చెట్టుకు చేరబడి కూర్చుంది గంగ. ఒళ్ళంతా పచ్చి ముద్దలాగుంది. చేతులు ముందుకు చాపి చూసుకుంది. అది గోళ్ళతో గీరిన చారలు రక్తాలు పేరుకుపోయినై. దుబ్బులాగున్న తన జుట్టుని చేతికి చుట్టుకుని వంగదీసి వీపుమీద గుద్దిన గుద్దులకి తన ప్రాణం కడెక్కిపోయినట్టైంది. రోగిష్టిదాన్లా ఎప్పుడూ మూలుగుతా వుండే బోడిదాని చేతుల్లో అంత బలం ఎక్కణ్ణుంచొచ్చిందో!

పొద్దున్నే జరిగిన గొడవ గుర్తుకొచ్చిన గంగకి ఏడుపొచ్చింది. బోడమ్మ నలుగురు పిల్లల్నీ అటిద్దర్నీ ఇటిద్దర్నీ వేసుకుని గాఢనిద్దట్లో ఉన్న గంగ, చెవులు హోరెత్తిపోయే కేకలు ఏడుపుల మధ్య తుళ్ళిపడిలేచి కూర్చుంది. తూర్పింకా తెల్లబడలేదు. గోదావరి స్టేషన్లోకి ఏదో బండొచ్చి ఆగినట్టుంది, స్టేషనంతా సందడిగా ఉంది. గుడిసెల్లోని జనం అటు ఇటూ పరుగులెడుతూ గిన్నెలూ తపేలాలూ మూటలు కట్టుకుంటున్నారు. గుడ్డి సూరయ్య తాత తడుముకుని తడుముకుని పొయ్యిలో సగం కాలి ఆరిన కట్టెపుల్లల్ని కాలకుండా మిగిలిన రెండు పుల్లల్తోనూ కలిపికడుతున్నాడు. అటు పక్క స్టేషన్లోంచీ ఇటు పక్క కళా కేంద్రం ఆవరణలోంచీ లైట్లు పట్టపగల్లా వెలుతుర్ని కురిపిస్తున్నాయి. బండి దిగిన జనం బద్ధకంగా స్టేషన్లోంచి బైటికొస్తున్నారు.

ఏం జరుగుతూందో కొంతసేపటివరకూ గంగకి అర్ధం కాలేదు.

గుడిసెలపైన ఆచ్చాదనగా వేసుకున్న ఆకుల్నీ, గోనెపట్టాల్నీ ఆదరాబాదరా విప్పి పోగులు పెట్టుకుంటున్నారు కొందరు. కుండల్నీ, గిన్నెల్నీ గోనె సంచుల్లో వేసి మూటలు కడుతున్నారు మరికొందరు.

“ఏయే గుడిసే…న…! కళ్ళంపడతాలేదేటి? రాజా గోరల్లే తొంగున్నావ్. నెగు నెగు, నెగిసి గుడ్డా గుడుసూ అన్నీ మూటలు గట్టు, తెల్లారిందంటే మునిసిపాలిటీ మొగుళ్ళొచ్చేస్తారు. ఇయ్ కూడా దక్కకుండా తరివేత్తారు”

బోడమ్మ గుడిసెలో పడుకునే అరుస్తోంది.

గంగ చివుక్కున లేచి నిలబడింది. ఆ వూపులో ఎడం మక్కె పట్టేసినట్టయ్యింది. అసలే నిద్ర చాలని బద్దకం. ఒళ్ళు మండుకుపోయింది.

”గుడిసెలోంచి కాళ్ళు సగం బైటికి సాసి గుమ్మానికడ్డంగా తొంగున్నావు. నేనేటి సేసేది? ముందు నువ్వు నెగిసి బైటికిరా”

మున్సిపాల్టీ వాళ్ళు ముందురోజు సాయంకాలం వచ్చి అందరి పేర్లు రాసుకుని వెళ్ళారు. సారంగధరుడి మెట్ట దగ్గర, క్వారీల పక్కన అందరికీ గుడిసెలేసుకోడానికి స్థలాలిస్తారట. పుష్కరాలకు ఊరిని అందంగా కనిపించేలా చెయ్యాలని మున్సిపాలిటీ వారి తాపత్రయం. పట్నం ఒంటిమీది ‘గాయాల్లాంటి’ మురికి గుంటల్ని ఓ పక్క తాత్కాలికంగా పూడ్చుకొస్తున్నారు. ఆ పైన ‘కురుపుల్లాంటి’ ఆక్రమిత పూరిగుడిసెల్ని (ఈ పైత్యం పత్రికా విలేఖర్లది) సమూలంగా పెకలించెయ్యదల్చుకున్నారు. అలా పెకలించేసరికి ప్రత్యక్షమైపోతాయని వారికి అనుభవపూర్వకంగా తెలీడం వలన ప్రత్యామ్యాయంగా ఊరికి దూరంగా గుట్టల మధ్య ఒక్కొక్క కుంటుంబానికి నాలుగడుగుల స్థలాన్ని కేటాయించారు.

‘మనిషి చస్తేనే ఆరడుగుల నేల కావాలే, నాలుగడుగుల జాగాలో గుంపులు గుంపులుగా పిల్లా జెల్లలతో ఎలాగ బ్రతకాల్రా నా కొడకల్లారా’ అని ఎవరూ అడగలేదు. అడగరు ఎందుకంటే పేరుకి ఓ గుడెసంటూ ఉంటుందే కానీ, వాళ్ళల్లో ఎవరూ రోజంతా గుడిసెలో ఉన్న పాపాన పోరు. ఆడామగా అంతా కూలీనాలీ చేసుకోడానికి పోతూ ముసలాళ్ళనీ, అంగవైకల్యం వున్నవాళ్ళనీ, అయిదేళ్ళు దాటని పసివాళ్ళనీ ఖాళీ డబ్బాలిచ్చి ఏ రైల్వేస్టేషన్లోనో, ఏ గుడిముంగిటో, ఏ మసీదు వాకిట్లోనో కూర్చోబెట్టి పోతారు. రాత్రికంతా గుడిసె దగ్గరికి వస్తూ వస్తూ తమ సంపాదనలోంచి దార్లో దొరికిందేదో కొనుక్కు తినేసి కడుపునింపుకుంటారు. ఏ చేపల పులుసు తినాలనిపించినప్పుడో తప్ప అక్కడి పొయ్యిలు రాజుకోవు.

వయసులో ఉన్న పెళ్ళికాని మగకుర్రాళ్ళు ఏ ఫ్లాట్ ఫారం మీదో తెల్లారేదాకా ఓ కునుకు తీసేస్తారు. తోడున్న జంటలు మాత్రం కాళ్ళు లోపలికి తీసుకుంటే తలలూ, తలలు ముడుచుకుంటే కాళ్ళూ బైటికొచ్చే ఆ గుడిసెల్లో ముడుచుకుపోయి కాపురాలు చేసేస్తుంటారు, తలుపూ ద్వారం లేని ఆ గుడిసెల్లో తమ కదలికలు అందరికీ బట్టబయలేనన్న విషయం తెలిసికూడా ఏ దుప్పటి ముసుగులోనో బహిరంగంగా రహస్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు.

ప్రస్తుతం అక్కడి వాళ్ళంతా కొత్త చోటికి చేరబోయే ఉత్సాహంలో ఉన్నారు. ఇప్పుడెళ్ళబోయే స్థలాన్ని గవుర్మెంటు తమకి నికరంగా పట్టాలు రాసిచ్చేస్తాదని రాత్రి కథలు కథలుగా చెప్పేసుకున్నారు. అంతదూరం నడవలేని ముసలాళ్ళు మాత్రం “మీకేం పిచ్చేటల్లా మనవేం ఆళ్ళ సుట్టాలవా బందుగులవా, మనకాడ ఒక్క పైసా ఉచ్చుకోకుండా ఉత్తినే మనకి తలాలు రాసిచ్చెయ్యటానికి? అదీగాకుండా పుష్కరాల్లో గోదారమ్మకీ, ఊరికీ దూరంగా పోయి మనం చేసేదేటంట? నాలుగు డబ్బులొచ్చీ ఏళకి ఇయ్యేం పొయ్యీకాలం బుద్ధులొచ్చాయిరా మీకు? ఆళ్ళిచ్చే తలాన్ని నెత్తినెట్టుకుపోతారేటి ఎవులైనా? అయినా మనకి ఏరోజుకారోజు పొట్టలోకి కూడుండాలగానీ, ఇల్లూ వాకిళ్ళూ మనవేం చేసుకుంటాం. ఇయ్యాలిక్కడుంటాం, రేపెక్కడుంటావో ఆ పరమాత్ముడికే ఎరక. అందుకని ఆళ్ళు సూపిచ్చే మోసేతి మీద తేనె సుక్కని నమ్ముకుని అరసేతిలోది అవతల పారేసుకోకండి. టేసనుకి ఈ పక్కనుంచి పొమ్మంటే ఆ పక్కకెళ్ళి గుడిసేసుకోవాల. ఆ పక్కనుంచి పొమ్మంటే మళ్ళీ ఈ పక్కకొచ్చెయ్యాల” అని హితవులు చెప్పారు.

గేటుకి చేరబడి బీడీ కాల్చుకుంటున్న స్వీపరు ఏసోబు మాత్రం ఆరిపోయిన బీడీ ముక్కని తుపుక్కున ఉమ్మేసి “ఓరి ఎదవల్లారా! రాజమండ్రికి ఇదేవన్నా ఉత్తుత్తి సోకనుకుంతన్నారేటి? పుస్కరాల సోకు. కళ్ళు జిగేల్మని పోవాలని మునిసిపాలాపీసులో అయ్యగార్లు సెప్పుకుంతంటే ఇన్నాను. తెల్లారేతలికల్లా మీరిక్కణ్ణుంచి కదలకపోయారో ఇంకంతే, మీకు గోనిసంచులూ గుడ్డముక్కలూ కూడా దక్కవు. నామాటినుకుని మంచిగా ఎలిపోండి. పుస్కరాలైపోయిన మర్నాటికెలాగా మీరిక్కడికి రాకా తప్పదు, ఆ బాబులందరూ సూసీ సూణ్ణటూరుకోకా తప్పదు” అన్నాడు.

ఆ మాటలకి అందరూ కట్టుబడిపోయారు.

మురిక్కాలవల్ని జల్లెడపట్టే మా లచ్మి మాత్రం ఏవెరగనట్టు ఏసోబు పక్కకెళ్ళి నుంచుని బొడ్లోంచి మడతలుపడి మాసిపోయిన రూపాయి కాయితం ఒకదాన్ని తీసి వాడి చెయ్యందుకుని రహస్యంగా వాడి గుప్పిట్లో కుక్కింది. “ఓరే ఏసోబూ, నా కొడకా! పుస్కరాలెల్లిన మర్నాడు తెల్లారిపాలికల్లా నేనూ, నా కుర్రోళ్ళూ ఇక్కడుంటాం. ఈసోటు మాత్రం ఎవురూ అక్కరమించెయ్యకుండా సూసిపెట్టు నాయన్నాయనా, సచ్చినీ కడుపునుడతాను” అని బతిమాలింది.

ఏసోబు కుదరదని కొంచెం సేపు బెట్టుచేసి, మరో రూపాయి చిల్లర డబ్బులుచ్చుకుని ‘సరే’నని అభయమిచ్చాడు.

బోడమ్మ కాళ్ళు ముందుకు జరుపుతూ గుడిసెలోంచి బైటపడింది. ఇంకా నిద్రలో వున్న నలుగురు పిల్లల్నీ నాలుగంటించి లేపి కూర్చోబెట్టింది.

బోడమ్మ బైటికొచ్చిన కంతలోంచి గంగ లోపలికి దూరింది. ఒక పాతకోక పరచి, వున్న నాలుగుగిన్నెలూ, చట్టిలూ సర్దడం మొదలుపెట్టింది. ఈలోపల బోడమ్మ గుడిసె పైన వేసిన గోనె ముక్కలు రెండూ లాగి పక్కన పడేసి, మూడువేపులా నిలబెట్టిన తడిక ముక్కల్ని జాగ్రత్తగా పెకలించమని పిల్లలకి పురమాయించింది. పిల్లలు ఆ తడికల్ని గుంజడం మొదలుపెట్టారు. అదిగో అక్కడే అనుకోకుండా గొడవ మొదలైంది.

తడికకి చేరబెట్టిన గాజుపళ్ళెం తడిక గుంజడంతో ముందుకు పడి పోయింది. పడీ పడ్డమే అంచు మీద అంగుళం మేర పగులిచ్చింది. ఆ గాజుపళ్ళెం గంగకి ప్రాణం. తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఏకైక సామాగ్రి అదే. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. ఆ పళ్ళానికి అంచుపగిలి పోగానే గంగకి గుండెలో ఎవరో కత్తి దింపినట్లైంది.

ఉక్రోషం పట్టలేక తడిక గుంజుతున్న పేరిగాణ్ణి పట్టుకుని వీపుమీద ఛెళ్ళుమని ఒక్కటేసింది. అది చూసి బోడెమ్మకి ఉడుకెత్తిపోయింది.

“ఓసి నీ సేతులడిపోనూ, రంకునాసైతి! నీకేం పొయ్యీకాలవొచ్చిందే ఆణ్ణంత దెబ్బ కొట్టీసేవూ” అంది కాళికావతారం ఎత్తేసి. “కొడతానా సంపేత్తానా ఎదవని. సచ్చినోడు నా గాజుపళ్ళేన్ని..” గంగని మాట పూర్తి చెయ్యనీకుండా బోడమ్మ అందుకుంది.

“ఓ లబ్బో గాజుపల్లెం. అమ్మగారింటి కాణ్ణుంచి అట్టుకొచ్చేసింది అరణం. నాకు మండుకొచ్చిందంటే నేలకేసి కొట్టేసి నాలుగు సెక్కలు సేసీగల్ను జాగర్త” గాజుపళ్ళాన్ని గంగమీదికి విసిరేసింది బోడమ్మ.

“ఏదీ, సెయ్ నంజా, నాలుక్కాదు రెండు ముక్కలు సెయ్ సూద్దాం. నీ బుర్రకూడా రొండు సెక్కలైపోద్ది దెబ్బకీ” ఆ పక్కనే పడున్న కట్టె పేడునోదాన్ని చేతిలోకి తీసుకుంది గంగ.

గంగ చేతిలో కట్టేపేడు చూడగానే బోడమ్మ వీథెగిరి పోయేటట్టు రాగం లంకించుకుంది. “ఓలమ్మో ఈ దొంగలం.., ఈ దొమ్మరి సాని, నా మొగుణ్ణివల్లో ఏసుకుని నా కాపురంలో నిప్పులేసింది, నా మొగుణ్ణి పొట్టనెట్టేసుకుంది కాకుండా ఇక నన్ను సంపెయ్యడానికి తయారైందిరా బాబో” కూర్చుని నెత్తిన రెండుచేతులూ పెట్టుకుని రాగాల్తీసి రాగాల్తీసి మొగుణ్ణి తల్చుకుని ఏడుపు మొదలు పెట్టింది. అది చూసి బిత్తరపోయిన గంగ కట్టెని కింద పడేసింది.

కట్టినైతే పడేసింది కానీ, పొంగుకొస్తున్న ఉక్రోషాన్ని ఆపుకోలేకపోయింది.

“పోపోయే రోగిష్టినంజా! నువ్వు పనికిరాని డొక్కు నంజవనే కదా ఆడు నన్ను తెచ్చుకున్నాడు” అంది బోడమ్మని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేనని మురిసిపోతూ.

ఆమె మురిపెం ఎంతోసేపు నిలవలేదు. బోడమ్మ దెబ్బతిన్న పులిలాగ క్షణంలో ఎగిరి దూకి గంగజుట్టు పట్టేసుకుంది. ఆ జుట్టును చేతికి మెలిపెట్టుకుని వంచి, వీపుమీద గుభీ గుభీమని గుద్దింది. గంగకెంత సేపూ రెండు చేతులూ అడ్డంపెట్టుకుని తన గర్భం మీద దెబ్బపడకుండా కాపాడుకోడానికే సరిపోయింది. కొట్టి కొట్టి బోడమ్మా, దెబ్బలు తిని తిని గంగా సొమ్మసిల్లిపోయారు.

తెల్లారి ఆరుగంటల వేళకంతా అందరూ మూటల్తో సిద్ధమైపోయారు.

ఎలాగో ఓపిక చేసుకుని గంగ కూడా తన గుడ్డల్లో గాజుపళ్ళెం జాగ్రత్తగా పెట్టి మూట కట్టుకుంది. ఆనెం కళాకేంద్రం గోడ పొడవునా గుడిసెలు పీకేసిన ఆనవాళ్ళు తప్ప మరేం మిగల్లేదు.

కేన్ తో టీలమ్ముకునే కుర్రాడొస్తే అందరూ టీ నీళ్ళు కడుపులో పోసుకున్నారు. తనూ టీ తాగుదామని గంగమొల్లో వెతుక్కుంటే బొడ్లో దోపుకున్న అర్థరూపాయి బిళ్ళ కనపళ్ళేదు. చెట్టు వెనక్కెళ్ళి గబగబా చీరకుచ్చిళ్ళన్నీ పీకేసి చూసుకుంది. ఉహూ, ఇందాకటి కొట్లాటలో ఎక్కడో పడిపోయినట్టుంది. ఆశచావక చాలాసేపు వెతుక్కుంది గంగ. దొరకలేదు. పోనీ ఎవరైనా ‘ఈ టీనీల్లు తాగు ‘ అంటారేమోనని చూసింది. ఎవరూ అనలేదు. టీ కుర్రోడు అరువివ్వనన్నాడు “ఇక్కణ్ణుంచి ఎల్లిపోతున్నారు కదా” అన్నాడు.

ఆ మాట విని బోడమ్మ గయ్యిమని లేచింది మళ్ళీ.

“అదెక్కడికొత్తది నాసవితి? దానికెపుడూ బొట్టెట్టి భూములియ్యలేదు. నా మొగుడికి నేను నీతైన పెళ్ళాన్ని కాబట్టి గవుర్మెంటోడు నాకూ, నా బిడ్డలకీ ఇచ్చాడు. ఇలాంటి అడ్డవైన గుంట ముండలకీ ఇచ్చెయ్యటానికి ఆడేం తెలివిలేనోడుకాడు”.

“నీ టీ నీల్లు తాగాపోతే నేనేం సచ్చిపోన్లే, ఎల్లెల్లు” అని అనవసరంగా టీ కుర్రాణ్ణి కసురుకుని అటు తిరిగి కూర్చుంది గంగ, ఏడుగంటలకంతా మున్సిపాలిటీ వాళ్ళ మనిషొచ్చి అందరూ ఎక్కడికెళ్ళాలో చెప్పేసి పోయాడు. వరసగా పేర్లు చదివేటప్పుడు ఆ లిస్టులో బోడమ్మ పేరుందికానీ, గంగ పేరులేదు.

నాలుగైదు రోజుల క్రితం అందరూ పేర్లిస్తావుంటే బోడమ్మా, పిల్లలూ ఎక్కడుంటే తనూ అక్కడే కదా అనే ధీమాతో గంగ తన పేరివ్వలేదు.

ఆ, ఇయ్యన్నీ మాములే, ఇలాంటి గొడవలు ఎన్నిసార్లు జరగలేదు. ఈ బోడిదానికసలే ఒళ్ళొంగదు. నేను లేకపోతే దీనికి తిండి పెట్టేవాళ్ళెవరు అనుకుంది ధీమాగా.

నెలరోజుల క్రితం అతిసారం వచ్చి రాజయ్య పోయినప్పట్నుంచీ గంగే ఆ కుటుంబానికి మొగదిక్కులా నిలబడింది. నలుగురు పిల్లల్నీ వెంటేసుకుని బజార్లోకి పోయి పచారీ దుకాణాలకి మూటలూ, గంపలూ మోసి రోజుకి అయిదార్రూపాయలు సంపాదించుకొస్తోంది. నూకలు కొనుక్కొచ్చి, ఏ వేళైనా పొయ్యి రాజేసి గంగ వండిపొయ్యాల్సిందే. 

బోడమ్మ మాత్రం ముణగదీసుకు పడుకుని కదలదు. ఇక్కడి పూచికపుల్ల తీసి అక్కడ పెట్టదు. ‘ఏవం’టే రోగం అంటుంది.

“వేళకి లేచి గిన్నెడన్నం ముప్పొద్దులా తినేదానికి ఏం మాయరోగవో ” అనుకుంటుంది గంగ.

బెట్టు చేస్తూ అటు తిరిగి కూర్చున్న గంగనొదిలేసి వెళ్ళిపోయేరంతా. ఆశ చావని గంగ వాళ్ళు కనుమరుగయ్యే వరకూ చూస్తూనే ఉంది. తను పెంచిన ఆఖరోడైనా వెనక్కొచ్చిచిన్నమ్మా, నువ్ రాయేఅంటాడేమోనని. అలా జరగలేదు. అప్పుడు పొంగుకొచ్చేయి గంగకి గోదావరన్ని కన్నీళ్ళు. ఒక్కసారి ఆకాశంలో మబ్బులు కమ్ముకొచ్చాయి. సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి.

భారంగా లేచి, మూట చంకనేసుకుని ఒక్క నిముషం ఆలోచింది గంగ. అటు స్టేషన్లోకి పోదామా, ఇటు కళాకేంద్రం ఆవరణలోకి పోదామా అని. తను నుంచున్న గోడ వెనకే ఉన్న కళాకేంద్రమే దగ్గరగా తోచింది. అదీగాక స్టేషన్లో గన్నిగాడి పోరొకటి.

చుట్టు తిరిగి గేట్లోంచి తిరిగొచ్చి కళాకేంద్రం మెట్లన్నీ ఎక్కేసరికి అలుపొచ్చింది గంగకి. ఆయాసపడుతూ స్తంభానికి చేరబడి కూర్చుండిపోయింది.

మొట్టమొదటిసారి రాజమండ్రి రావడం గుర్తుకొచ్చింది.

చిల్లు గిన్నెలకి మాట్లెయ్యడానికి తమ ఊరొచ్చిన నలభై ఏళ్ళ రాజయ్య నెల్లాళ్ళ పాటు తమ గుడిసెలోనే వున్నాడు. చుట్టూ అడివి. కొండలూ. రోజూ కొంత కొంత మేరకి కొండల్ని పగలకొడుతూ రాళ్ళు కొట్టే జనం. ఆ గుడిసెల్లో ఉండే జనాలకి కాస్త గంజి కాచుకుని తాగడం, మళ్ళీ రాళ్ళు కొట్టే పనిలో మునిగిపోవడం తప్ప మరో వ్యాపకం వుండేది కాదు. ఊహ తెలిసినప్పట్నుంచీ అదే ప్రపంచంగా పదహారేళ్ళు ఒంటిమీదికి తెచ్చుకున్న గంగకి రాత్రి తన తండ్రితోబాటు కల్లు ముంత ఖాళీ చేసి చిలవలు పలవలుగా రాజయ్య చెప్పే రాజమండ్రి కబుర్లు కడుపు నింపేసేవి.

గోదావరి ఒడ్డునే గుళ్ళూ గోపురాలూ, గోదావరి మీద బ్రిడ్జీలూ, కడతాకడతా ఉన్న మూడో బ్రిడ్జి స్థంభాలు, సినిమాహాళ్ళూ, కాపీ ఒటేళ్ళూ – ఒకటేంటి, రాజమండ్రి అంటే స్వర్గం అనిపించేది గంగకి. నెలగడిచేసరికి కల్లు ముంతల స్నేహం ముదిరి, గంగ రాజయ్యనిష్టపడే వరకూ వచ్చింది.

తల్లి పదహారేళ్ళ గంగని చాటుకి పిల్చి చివాట్లేసింది. “ఆడివయస్సెక్కడ నీ వయస్సెక్కడ? నీ బాబంత వయసోడాడు. ఆణ్ణి కట్టుకుని నువ్వేం సుకపడతావే పిచ్చిమొకవ, ఆళ్లి సేసుకోనని సెప్పు”

కానీ, గంగకి తల్లి మాటలు చెవికెక్కలేదు. ముందు ఆ రాళ్ళ ప్రపంచం నుంచి బైట పడితే చాలనుకుంది. ఈ ఛాన్స్ వదిలేసుకుంటే అక్కడే రాళ్ళు కొట్టే ఏ ఎర్రోడికో తనని కట్టబెట్టేస్తారు. మరో ప్రపంచం అనేది చూడకుండానే ఈ రాళ్ళ మధ్యనే తన బతుకు వెళ్ళమారిపోతాది. రాజయ్య చేత మెళ్ళో పసుపుకొమ్ము కట్టించుకుని ఆడి వెంట వచ్చేసింది. కాణీ కట్నం అడగలేదు సరికదా, అత్తగారికో జనతా చీర, మావగారికో జనతా పంచె కొని పెట్టిన రాజయ్య దేవుళ్ళాగా కనిపించాడు వాళ్ళకి. ఆ రాత్రి కల్లుముంతల పార్టీ చేసాక అక్కడున్నోళ్ళందరికీ దేవుళ్ళాగే కనిపించాడు. పుట్టింటివాళ్ళు గంగకి ఒక కొత్తకోకైనా కొనలేక పోయారు.

రాళ్ళు కొట్టిన డబ్బులు దాచుకుని అటుగా వచ్చిన కావిడి సామాన్ల వాడి దగ్గర చిన్నప్పుడెప్పుడో ముచ్చటపడి కొనుక్కున్న బాతులూ, లతలు ముద్రించి ఉన్న అన్నం కంచమంత గాజుపళ్ళాన్ని మాత్రం గంగ పదిలంగా తనవెంట తెచ్చుకుంది. మొదటిసారిగా రైలు బండెక్కించిన రాజయ్య గంగకళ్ళకి ఆడు చెప్పిన సినిమాకథల్లోని హీరోలా కనిపించాడు.

ఇప్పట్లాగే ఆరోజు సన్నటి చినుకులు పడుతున్నాయి. గోదావరి స్టేషన్లో దిగి ఏదో ప్రపంచంలో తేలిపోతూ గాలిలో నడిచొచ్చిన గంగకి నేలమీద బోర్లాపడిపోడానికి ఎంతోసేపు పట్టలేదు.

గుడిసె గుమ్మం దగ్గరే ఎంగిలి గిన్నెలు కడుక్కుంటున్న బోడమ్మ రాజయ్యని చూస్తూనే తిట్లకి లంకించుకుంది. “ఇన్నాళ్ళూ ఎక్కడికిపోయా? ఎదవ సచ్చినోడా, ఇక్కడ తిండీ నీళ్ళూ లేకుండా మేం సచ్చినా నీకేం పరవాలేదన్నమాట” అంటూ.

“ఇదెవత్తీ నీ ఎనకాల? మెళ్ళో కొత్త పసుపుతాడుంది, అమ్మో అమ్మో, నా గొంతుక్కోసేసేడల్లో. ఈ ఆడంగిరేకులెదవ ఇంకెవత్తో రంగసాన్ని ఎంటబెట్టుకొచ్చేసేడల్లో” అంటూ గుడిసెలెగిరిపోయేట్టు రాగాలెట్టింది. “ఆడికి సిగ్గులేకపోతే నీకూ నేదంటే? ఆడి వయసెక్కడ? నీ వయసెక్కడ?” అంటూ గంగని బుగ్గల్లో పొడిచింది.

అప్పుడర్థమైంది గంగకి రాజయ్యకిదివరకే పెళ్ళాం పిల్లలూ ఉన్నారనీ, రాజయ్య హీరోకాదనీ పెళ్ళాం ముందు పిల్లి అనీ, ఏం చెయ్యాలో తోచని గంగ కొంగు బొడ్లో దోపుకుని బోడమ్మ చేతిలోని ఎంగిలి గిన్నెలందుకుంది. కాస్సేపట్లోనే గుడిసెంతా అలికి ముగ్గులేసి అద్దంలా తయారుచేసింది. సాయంకాలం పెద్దపిల్లలు ముగ్గురికీ స్టేసను కుళాయి దగ్గర రుద్ది రుద్ది స్నానాలు చేయించింది. చిరుగుల లాగూలకి కుట్లు వేసి తొడిగింది. చంటోడికి తాటాకుల మంట మీద వేణీళ్ళు మరిగించి నీళ్ళుపోసి, శుభ్రమైన పాతగుడ్డల్లో పడుకోబెట్టింది. వంటంతా కానిచ్చి, అలిగిపడుకున్న బోడమ్మకి పాదాలు ఒత్తింది. ఇన్ని చేసినా వారం రోజులకి గాని బోడమ్మ కోసం చల్లారలేదు.

ఆ తర్వాత బోడమ్మ మహారాణీ, గంగ దాసీ పిల్లా అయారు. రాజయ్యకి బోడమ్మ ఎదుట నోరెత్తే ధైర్యమేకాదు, కన్నెత్తే ధైర్యం కూడాలేదు.

ఎప్పుడైనా బోడమ్మ ఏ సినిమాకెళ్ళినప్పుడో తప్ప రాజయ్య గంగని తాకే వాడు కూడా కాదు. ఒకట్రెండు సార్లు గోదావరతల ఊళ్ళకి మాట్లెయ్యడానికి వెళ్తూ వండి పెట్టడానికి గంగని తన కూడా పంపమని రాజయ్య బోడమ్మని అడిగాడు. ఒంటికాలిమీద లేచిన బోడమ్మ నోటికి ఝడిసి ఆ తర్వాత ఆ ఊసెత్తడం మానేసాడు.

గంగకి మాత్రం ఆ చుట్టు గుడిసె స్వర్గంగానూ గోదావరి నీళ్ళు అమృతంగానూ అనిపించేవి. పనంతా చేసేసి, బజార్లో రెండురూపాయలు చేతిలో పడగానే మేట్నీ సినిమాకెళ్ళిపోయేది. చిరంజీవి ఆమె కలల రాజకుమారుడు. కళాకేంద్రంలో తరచుగా జరిగే కార్యక్రమాల్లో ఏ నాట్యమో, నాటకమోవుంటే సీనారేకు డబ్బామీదికెక్కి గోడమీది నుంచి, బోడమ్మ తిట్టేవరకూ చూస్తూనే ఉండేది. గంగకి బతుకులో కష్టం అనే పదానికర్థం తెలీదు. ఆమె కళ్ళకీలోకం ఎప్పుడూ రంగుల్లోనే కనిపిస్తూ ఉండేది.

రాజయ్య వెంట వచ్చిన నాలుగేళ్ళకి నెలతప్పిందని తెలిసినపుడు సంతోషించిన వాళ్ళెవ్వరూ లేకపోయారు. చిత్రంగా గంగకి ఇన్నాళ్ళకి తల్లి గుర్తుకొచ్చింది. ఏమైనా సరే తల్లికాబోయేవేళకి తన తల్లి దగ్గరుండాలని అనుకుంది. ఆ మాటే రాజయ్యతో అంటే “నీకేవైనా పిచ్చేటే, అంత దూరవెల్లాలంటే సార్జీలకి ఎంతుండాలో తెలుసా?” అన్నాడు.

“ఆ అడవిలో ఏటుంటాది? ఇక్కడే మంచి ఆడ డాకటేరుకాడ పురుడుపోయిత్తాను.”

అది జరిగేపని కాదని గంగకెపుడో అర్ధమైంది. రాజయ్య సంపాదించిన కొద్దోగొప్పో వాడి తాగుడుకే ఖర్చైపోతోంది. గంగ రెక్కలు ముక్కలు చేసుకుని ఆ కుటుంబాన్ని పోషించాల్సి వస్తోంది. వేణీళ్ళకి చన్నీళ్ళుగా ఉంటాయని ముక్కు పచ్చలారని కుర్రాళ్ళకి కూడా పావలో అర్థో సంపాదించడం నేర్పింది. గంగకి ఏడోనెల వచ్చాక రాజయ్య అర్థాంతరంగా కన్నుమూసాడు. అప్పుడు కూడా గంగ బెంబేలెత్తిపోలేదు. చుట్టూ మనుషులుంటే చాలు, ఆమె రెక్కలే ధైర్యం. బోడమ్మకీ, పిల్లలకీ గంగే ధైర్యం చెప్పింది. ఆ గుడిసెల్లోని నలుగురూ కలిసి శవాన్ని మోసుకుపోయాక పదిగుడిసెల్లోంచీ పది గుప్పెళ్ళ బియ్యం అడిగి తెచ్చి, అన్నం వండి ఆ తల్లి పిల్లలచేత తినిపించింది.

అలాంటి గంగకీ రోజు ఈ ఒంటరితనం బెంబేలెత్తిస్తోంది. నాలుగేళ్ళ నుంచి ఇక్కడే బతికినా, ఊరేంటో పరాయిదిగా అనిపిస్తోంది. తెలిసున్న ముఖం ఒక్కటీ లేనట్టు అనిపిస్తోంది.

క్రమంగా చినుకులు పెద్దవై వాన జోరందుకుంది.

కళాకేంద్రం ముందు వెంకటేశ్వరాలయం కడుతున్న కూలీలంతా వరండాలోకి పరుగెత్తుకొచ్చి పడ్డారు. అలా మొదలైన వాన సాయంకాలం వరకూ ఎడతెరిపి లేకుండా కురుస్తూనే వుంది.

వాళ్ళందర్నీ చూస్తే గంగకి ఏదో ఆశకలిగింది. మేస్త్రీ దగ్గరకెళ్ళి రేపట్నుంచి తనకి కూడా పని ఇప్పించమని అడిగింది.

మేస్త్రి ఆమెను ఎగాదిగా చూసి “నువ్వు చేసేపనికాదులే ఇది, ఎల్లెల్లు” అన్నాడు. “అయినా పొద్దున్న రేడియోలో సెప్పారు, ఈ వాన ఇప్పుడప్పుడే తెరిపియ్యదంట”

ఆ వానలో తడుస్తూనే క్రమంగా అందరూ వెళ్ళిపోయారు. గంగ మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయింది.

నిన్న బజార్లోనూ ఇదేవరస. తను బరువులు మొయ్యలేకపోతూందని, త్వరగా నడవలేకపోతూందని షావుకారు కేకలు పెట్టాడు. “మా ప్రేణం తియ్యకపోతే ఆ బరువేదో దింపుకున్నాక రారాదూ” అన్నాడు తన కడుపుకేసి చూస్తూ.

“ఆ సచ్చినోడలా వాగితే మాత్రం నాకిది బరువెలా అవుతాది? నా బిడ్డ నా రగతంలో రగతం, ఇకమీద ఈడే కదా నాకు తోడూ నీడా” అనుకుంది ఆప్యాయంగా కడుపువేపు చూసుకుంటూ. “ఆడికి అన్నం తినే వయసొచ్చాక గాజుపళ్ళెంలోనే అన్నం తినిపించాలి” అనుకుంది గర్వంగా. అందర్లాగా ఆడు సత్తుగిన్నెల్లో తినడు.

టైమెంతైందోగానీ మబ్బులు దట్టంగా మూసేసి పొద్దుగూకినట్టే ఉంది. కడుపులో కదిలి కదిలి ఇక ఓపిక లేనట్టు ఆగిపోయింది బిడ్డ. పొత్తికడుపు బిగబట్టుకు పోయినట్టుంది. ఆకలికి శోషాచ్చినట్టై పోతోంది. గంగని తన కడుపులో ఆకలికన్నా, బిడ్డ కడుపులో ఆకలి ఎక్కువ బాధిస్తోంది. ఏ వేడి గంజో పోసి బిడ్డని లేపాలి. కడుపులో బిడ్డ కదలకపోతే ప్రమాదం అని బుచ్చిది చెప్పిన మాట గుర్తుకొచ్చి వణికిపోయింది.

ఎవరైనా అడిగితే గుప్పెడన్నం పెడతారేమో అనిపించింది కానీ, దరిదాపుల్లో ఎక్కడా ఇళ్ళేలేవు.

పగలంతా పడుకున్న అప్సరా లాడ్జి గదులు రాత్రికి లైట్లతో సింగారించుకుంటున్నాయి. ఆ పక్క హోటల్లోంచి వస్తున్న కమ్మని పోపుల పరిమళానికి గంగకి నోట్లో నీళ్ళూరిపోతున్నాయి.

ఇంకా పొద్దుగూకితే వాచ్ మెన్ అక్కడుండనియ్యడని గంగకి తెలుసు. హోరున కురుస్తున్న ఆ వర్షంలో మూటని పైలంగా గుండెకి హత్తుకుని మెట్లు దిగింది గంగ. కళాకేంద్రం గేటుముందుండే తోపుడు బళ్ళ దుకాణాల జాడే లేదు. ఎటుపోవాలో దిక్కుతోచక తడుస్తూ గేటు ముందు ఆగిపోయింది. పాత పోలీస్ క్వార్టర్స్ వైపు వెళ్ళి కాస్త గంజి అడుక్కుందామని నిశ్చయించుకుంది. అగ్నిపూల చెట్ల కిందికొచ్చాక కాలు కదలక అలా నిలబడిపోయింది.

వీధుల్లో ఎక్కడా జనసంచారం లేదు. నిన్న ఈ సమయానికి అక్కడ జన నివాసాలుండేవి అంటే ఎవరూ నమ్మరు. అప్పుడే పశువుల సంత ముగిసినట్టుంది ఆ ప్రాంతమంతా వదిలేసిన చింకిపాతలూ, పగిలిన కుండ పెంకులూ, పెంటపోగులో వానకి తడిసి పరమరొచ్చుగా ఉంది. గుడ్డితాత ఇటికల పొయ్యి మాత్రం నదిలో సగం మునిగి ధ్యానంలో ఉన్న యోగిలా ఉంది.

గంగ మనసు మార్చుకుని కుడి పక్కకి తిరిగి స్టేషన్లోకి నడిచింది. అడుగు తీసి అడుగేస్తూంటే కుడి డొక్కలో కలుక్కుమంటోంది. అది ఆకలి నొప్పని ఆమెకి తెలుసు. పస్తులుండడం ఆమెకి కొత్తేమీకాదు. కానీ, ఈరోజు ఈ ఆకలి దుర్భరంగా ఉంది. బిడ్డ కదలని స్పృహ ఆమె గుండెని నొక్కేస్తోంది. కొత్తగా కట్టిన స్టేషను ఆవరణలోకి అడుగుపెడుతూనే ఒక నిర్ణయానికి వచ్చి ఆమెకళ్ళు గన్నిగాడికోసం వెతికాయి. ఈ చివరి నుంచి ఆ చివరిదాకా కాళ్ళీడ్చుకుంటూ తిరిగింది గంగ. ‘ఒకవేళ అవతల ప్లాట్ ఫాం మీదున్నాడేమో’ అనుకుంది. బ్రిడ్జి ఎక్కిదిగే ధైర్యం చెయ్యలేకపోయింది.

ఏదో బండొస్తున్నట్టుంది. స్టేషన్లో అలజడి పెరిగింది.

ఆ జనం మధ్య పిచ్చిదాన్లా తిరుగుతోంది గంగ. మధ్య మధ్య క్రీనీడలో నిలబడి కడుపు తడివి చూసుకుంటోంది. ఊహూఁ , బిడ్డలో చలనం లేదు. ఆమె అమ్మమనసు తలడిల్లిపోతోంది. ఇంకా నేలమీద పడని, రూపం కూడా తెలీని బిడ్డకోసం ఆమె హృదయం ఒకటే కొట్టుకుంటోంది. ఇప్పుడింక వాణ్ణి బతికించుకోడానికి ఏం చెయ్యడానికైనా సిద్ధమే.

టీ తాగే డబ్బులైనా దొరుకుతాయేమోనని ప్రయాణీకులు ఒకళ్ళిద్దరి దగ్గర చెయ్యి చాపబోయింది. అలవాటులేని పని – ఆమె చెయ్యి వెనక్కి వచ్చేస్తోంది. బండొచ్చే తొందర్లో ఎవరూ గంగని పట్టించుకోవడం లేదు.

ఒకళ్ళిద్దరు పోర్టర్లని గన్నిగాడికోసం అడిగి చూసింది. పొద్దుపోయాక ఆణ్ణెవరూ చూళ్ళేదన్నారు. అన్నోరంగాడైతే “ఏంటి సంగతి?” అని కన్ను కొట్టి వెకిలిగా నవ్వాడు. దిక్కుతోచక గుడ్ల నీళ్ళు కుక్కుకుంటూ క్రీనీడలో అలాగే చతికిల బడిపోయింది.

వానకొంత తెరిపిచ్చింది. ‘తొమ్మిదో పదో అయ్యుంటాది’ అనుకుంది గంగ. పాతబ్రిడ్జి మీంచి రోకలి బండలాగా పాక్కుంటూ వచ్చిన బండి కీచుమని గోలపెడుతూ స్టేషన్లో ఆగింది. ఆగిన బండిలోంచి రెండు సూట్ కేసులు నెత్తిన పెట్టుకుని దిగే గన్నిగాడు.

“ఇంటికెళ్ళి కూడు తిని వస్తన్నాడన్నమాట” అనుకుంది.

సత్తుకంచంలో తెల్లగా మల్లెపూలలాగా విచ్చుకున్న అన్నం కళ్ళముందు కదిలింది. గంగకి ఆకలి రెట్టింపయ్యింది.

బండెళ్ళిపోయాక స్థిమితంగా గంగ కూచున్న చీకటి స్థంభం దగ్గరి కొచ్చాడు గన్నిగాడు. “సందేల నుంచి నన్నడుగుతున్నావంట, ఏంటి సంగతి?” అన్నాడు కళ్ళు చికిలించి చూస్తూ, వెలుగులో నిలబడి ఉన్నవాడికళ్ళు ఎర్ర జీరలో చిరతపులి కళ్ళలా మెరుస్తున్నాయి. వాడు తాగి ఉన్నాడని అర్ధమైంది గంగకి.

“ఏటి సెప్పవేటి?” అన్నాడు వాడు విసుగ్గా. పొద్దున్న గంగ చూసిన చీత్కారపు చూపింకా మర్చిపోలేదు వాడు.

వీలైనంత అణుకువని గొంతులోకి తెచ్చుకుని జాలిగా అంది గంగ.

“ఏంలేదూ.. ఆకలి.. ఆకలేత్తావుంది. ఒక బన్నూ, కాసిన్ని టీ నీళ్ళూ కొని పెడతావేమోనని..” గంగ పరిస్థితి అర్ధమైంది గన్నిగాడికి. ఆకలెలాంటిదో వాడికి బాగా తెలుసు.

“సరే, కొనిపెడతాననుకో, నాకేటి లాబం.” అడిగాడు కసిగా.

గంగ ఒక్క నిముషం మౌనంగా ఉంది. తర్వాత తెగించిన దాన్లా అంది. “నీకేం కావాలో తీసుకో” ఆమె స్వరం కీచుగా జీరబోయింది.

“అవితే నాతోరా” ఎగిరి గంతేసినంత హుషారుగా అన్నాడు గన్నిగాడు.

లేచివాడి వెనకే నడిచింది గంగ. ఇంకా తవ్వుతూ తవ్వుతూ ఉన్న అండర్ గ్రౌండు గుయ్యారంలోకి వాడు దారి తియ్యడం చూసి ఆగిపోయింది.

“ఉప్పుడు కాదు.. ముందు నాకు తిండికావాల”

గన్నిగాడు వెనక్కి తిరిగి నోట్లో బీడీని తపుక్కున ఉమ్మేసాడు.

“అదేం కుదర్దు. ముందు నా అవసరం తీరాకే నీ ఆకలి తీరతాది” నిర్ణయించుకో అన్నట్టు నిర్లక్ష్యంగా చూసాడు. వాడి గొంతులోని పట్టుదల అర్థమైంది గంగకి.

నిస్సహాయంగా కదిలింది. మోకాళ్ళలోతున్న వాన నీళ్ళలోంచి చీకట్లోకి నడిచి నాలుగేళ్ళుగా పెంచుకున్న కసితో ఒక్కసారిగా పులిలా మీదికి లంఘించిన గన్నిగాడి బరువుకి మొదలు నరికిన చెట్టులా వెల్లకిలా పడిపోయింది గంగ.

వెన్నుల్లో ఫటిల్లుమని ఏదో చిట్లినట్టైంది.

పదిలంగా గుండెలకి హత్తుకున్న గాజుపళ్ళెం విరిగి వెయ్యిముక్కలైంది.

******

(రంజని ఎవార్డ్, 28.2.92 ఆంధ్రజ్యోతి, కౌముది సౌజన్యంతో-)

Please follow and like us:

One thought on “నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-3 గాజుపళ్లెం కథ”

Leave a Reply

Your email address will not be published.