మాకూ ఊపిరాడటం లేదు

-జె. గౌతమ్

నల్ల సముద్రం మళ్లీ గర్జిస్తోంది

నల్ల హృదయం ఉద్విగ్నంగా ఎగసి పంజా విసురుతోంది

నల్ల ఆకాశం దావానలమై రగులుతోంది

నల్ల నేత్రాలు నెత్తుటి మెరుపులతో ఉరుముతున్నాయి.

నల్ల పర్వతాలతో కొన్ని తెల్లమేఘాలూ చేతులు కలిపాయి.

 

శ్వేత సామ్రాజ్యపు విద్వేష సౌధంపై

కణకణమండే పిడుగులవాన కురుస్తోంది

తెల్ల తోడేలు భయంతో కాస్సేపు

బంకర్లో తలదాచుకుంది.

 

గుండె పగిలిన మానవత్వం మోకాళ్ళపై నిలబడుతోంది

ప్రపంచ పీడితుల జెండాపై అజెండాలా

దుఃఖ గాయాల ధర్మాగ్రహం రణన్నినాదమైంది

‘I can’t breathe…I can’t breathe..

I can’t breathe.

 

జార్జ్ ! మీలాగే మాకూ

ఇక్కడ ఊపిరాడటం లేదు

 

మేము దున్నిన నేల ఊపిరి పీల్చుకుని మొక్కల్ని సాకింది.

మేము నాటిన మొక్క ఊపిరి పీల్చుకుని పంటనిచ్చింది.

మేము తవ్విన కాలువ ఊపిరి పీల్చుకుని ఊరికి అన్నం పెట్టింది.

మేము తొలిగా నడిచినబాట ఊపిరి పీల్చుకుని రహదారైంది.

మేము ఎత్తిన ఇటుక ఊపిరిపీల్చుకుని మహానగరమైంది.

 

అయినా ! జార్జి ! మీలాగే

మాదేశం ఎందుకో మమ్మల్ని ప్రేమించడం లేదు.

ఇక్కడ మాకూ ఊపిరాడటం లేదు.

 

కరోనా కల్లోలంతో నెత్తురు చిమ్ముతూ మా పాదాలు

భూమ్యాకాశాల సరిహద్దులదాకా నడుస్తున్నాయి

మాకన్నా మానీడ వేగంగా పరుగెడుతోంది

మానీడకన్నా వేగంగా మాప్రాణాలు పైకి చేరుతున్నాయి

 

వలసబతుకు మిగిల్చిన మహా విషాదపు పాదయాత్రలో

నెత్తిన మోయలేని బరువులున్నవాళ్ళకే కాదు

చంకలోని పిల్లలకీ, గర్భంలోని పిండాలకీ

ఎదురుచూసే బంధాలకీ, అనుబంధాలకీ 

ఇక్కడ ఊపిరాడటం లేదు.

 

చివరకు రైలుపట్టాలపై దేహాలు రెండుముక్కలై 

నెత్తురుతో పెనుగులాడుతున్న మా ఆత్మలకూ

ఇక్కడ ఊపిరాడటంలేదు.

 

అయినా ! జార్జి! మీలాగే

మాదేశం ఎందుకో మమ్మల్ని ప్రేమించడం లేదు

తరతరాలుగా మాకూ ఊపిరాడటంలేదు.

 

మా నాన్న వెలివాడలో ఊపిరాడకుండానే కన్నుమూసాడు

మా అమ్మ ఊపిరాడకుండానే వయస్సుమళ్ళి వెళ్ళిపోయింది

మా పూర్వీకులంతా ఊపిరాడకుండానే సమాధులయ్యారు.

 

అయినా ! జార్జి మీలాగే

మేము మా దేశాన్ని అమితంగా ప్రేమిస్తున్నాం.

 

దైవ దర్శనాలపై ఇంకా వెలివేతలు కొనసాగుతున్నా

తీర్ధప్రసాదాలిచ్చే అర్హతలపై బహిష్కరణలు అమలవుతున్నా

మా ముక్కోటి దేవతల్ని మేము ప్రేమిస్తున్నాం.

 

మా ఉచ్వాస నిస్వాసాలపై నిత్యం ఉరితాళ్ళు వేళ్ళాడుతున్నా

విద్వేషాలు రూపంమార్చుకుని కొత్త బానిసలుగా చేస్తున్నా

 

మేము మా దేశాన్ని , ముక్కోటి దేవతల్ని

అమితంగా ప్రేమిస్తున్నాం.

 

మళ్లీ మళ్లీ మేము నేలను దున్నుతాం

మొక్కలు నాటుతాం… రహదారుల్ని..

మహనగరాల్ని నిర్మిస్తాం.

 

మా పిల్లలైనా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారని

మాకొన ఊపిరితో పోరాడుతూ 

ప్రాణాలొడ్డుతాం

 

జార్జ్ ! నీ కూతురు జియన్నా జోస్యం చెప్పినట్టు

నువ్వు నిజంగానే ప్రపంచాన్ని మారుతున్నావ్.

 

జార్జ్ ! మీ నల్ల సముద్రంలాగే

మళ్లీ మళ్లీ మేము ఊపిరి పీల్చుకుని 

పైకిలేస్తాం

 

మా స్వేచ్ఛా ఊపిరి గొంతునులుముతున్నచోట

మా హక్కుల శాసనంతో మేమూ గర్జిస్తాం

 

మా బానిసత్వాన్ని కోరుకునే మెదడులున్నచోట 

మా రాజ్యాంగమే ఆయుధంగా మేమూ ఉద్యమిస్తాం.

 

జార్జ్ ! మీ నల్ల సముద్రంలాగే

 

సమస్త విద్వేషాలను బోనులో నిలబెడతాం

సమస్త అణచివేతలను బంకర్లోకి తరుముతాం.

*****

Please follow and like us:

2 thoughts on “మాకూ ఊపిరాడటం లేదు(కవిత)”

  1. అన్న జైభీమ్ లు. కవిత్వం దృశ్యమానంగా వుంది. జన్మదినోత్సవ శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published.