తెలుగు చదివి ఏం చేస్తారు?” 

-డా||కె.గీత

(“తెలుగు సాహిత్యం-సమకాలీనత” అనే అంశంపై  వి .యస్. ఆర్ & యన్. వి. ఆర్ కాలేజి ,తెనాలి తెలుగు శాఖ వారు నిర్వహించిన వెబినార్ లో ఆత్మీయ అతిథి ప్రసంగం-)

తెలుగు చదివి ఏం చేస్తారు?” 

అని నన్ను ఎమ్మే చదివేటప్పుడు ఒక  లెక్చరర్ అడిగేరు. ఆ నిరాశాపూరిత ప్రశ్న నన్ను ఎప్పుడూ వెంటాడేది.

నిజమే తెలుగు చదివి ఏం చెయ్యాలి?

బి.యీ.డీ   చేసి తెలుగు టీచర్ గా పనిచేయాలా?

ఒకవేళ  బి.యీ.డీ చేసినా టీచర్ పోస్టులు ఎప్పుడు పడతాయో తెలియదు. ప్రయివేట్ కాలేజీలో  లెక్చరరు గా పనిచేయాలంటే అప్పటికే తెలుగు బదులు సంస్కృతం సెకండ్ లాంగ్వేజీగా మారుతున్న రోజులు. ఇక గవర్నమెంటులో కనీసం ప్రైమరీ లెవల్లో తెలుగు టీచర్ గా పనిచెయ్యాలన్నా పోస్టులు ఎప్పుడు పడతాయో తెలియదు. 

తెలుగు చదివి ఏం చేస్తారు?” అనే  ప్రశ్న కు ఒక సరైన గొప్ప సమాధానం చెప్పాలనే తపనే నన్ను ఎమ్మేలో టాప్ ర్యాంకర్ ని చేసింది. నన్ను  JRF సెలక్టు అయ్యేటట్టు చేసి, పి హెచ్ డీ చేసేటట్టు చేసింది. 

గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ అయ్యేటట్టు, ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు  అందుకునేటట్టు చేసింది. అమెరికాలో ప్రపంచంలో మొదటి, రెండు స్థానాల్లో ఉన్న కార్పొరేట్ సంస్థల్లో తెలుగు భాషా నిపుణురాలిగా ఉద్యోగం చేసేటట్టు చేసింది.

నేను ముందు గూగుల్  లో తెలుగు భాషా నిపుణురాలిగా పనిచేసేను. ఏడాదిక్రితం నుంచి ప్రస్తుతం 

ఆపిల్ కంపెనీ లో కంప్యుటేషనల్ లింగ్విస్ట్ గా పనిచేస్తున్నాను. 

ఇక్కడ ఇందరు  తెలుగు విద్యార్థులు, పట్టభద్రులు, నిపుణులను చూడడం  చాలా సంతోషంగా ఉంది. అయితే  మీరు ఎక్కడా నిరాశపడవలసిన  పనిలేదు. 

తెలుగు చదువుకోవడం వల్లనే అత్యుత్తమమైన  స్థానంలో ఉన్నాను నేను. 

ఒక సంస్థలో  ఇంజనీర్లు  చాలా మంది ఉంటారు. కానీ  భాషా నిపుణులు చాలా తక్కువగా, వేళ్ళమీద పెట్టగలిగిన వారు మాత్రం ఉంటారు. 

అమెరికా వచ్చిన కొత్తలో తెలుగుకి అవకాశాలు పూర్తిగా మూసుకునిపోయిన దశలో ఎక్కడా నిరాశపడకుండా నా జ్ఞానాన్ని నలుగురికి పంచడమే ధ్యేయంగా ఎక్కడ తెలుగుకు ఎటువంటి వాలంటీరు అవకాశం ఉన్నా చేస్తూ వచ్చాను. అందులో భాగంగా తెలుగు చదువుకోవాలన్న తపన ఉన్న విదేశీయులకి ఉచితంగా పాఠాలు చెప్తూ వచ్చాను.  అలాగే అమెరికా మొత్తంమీద తానా వారి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగు పాఠశాలలు  దాదాపు 60  స్కూళ్ళకి కరికులం డైరక్టరుగా సేవలు అందజేస్తూ  వస్తున్నాను. 

ఇంటర్నెట్ ఒక సముద్రం.

ఆన్ లైనులో నిఘంటువులు, అనేక అరుదైన పుస్తకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో సేకరించి తెలుగు పరిశోధకుల కోసం  ఒక బ్లాగులో (http://21stcenturytelugu.blogspot.com/) ఉంచాను. 

అలాగే గత ముప్ఫయి ఏళ్లుగా కవయిత్రిగా, రచయిత్రిగా స్ఫూర్తిని కొసాగించడం కోసం కాలిఫోర్నియా లో వీక్షణం అనే రచయితల వేదికను నడపడం ప్రారంభించాను. నెలనెలా సమావేశాలు జరుపుకునే ఈ వేదిక ఇప్పుడు 97వ సమావేశాన్ని జరుపుకుంటున్నది. 

“తెలుగు రచయిత” అనే అంతర్జాల రచయితల భాండాగారాన్ని గత అయిదేళ్లుగా నడుపుతూ ఉన్నాను. 

ఇందులో తెలుగులో రాసే ప్రతీ రచయిత జ్ఞాపికల్ని, రచనల్ని పొందు పరుస్తు న్నాం. 

“నెచ్చెలి” అంతర్జాల వనితా మాసపత్రికను సంస్థాపించి, సంపాదకురాలిగా నడిపిస్తున్నాను. 

ఇలా నా సమయాన్ని పూర్తిగా తెలుగు భాషా సేవకు అంకితం చేశాను.   ఈ ఎక్స్పీరియన్ సెస్ అన్నీ  నాకు ఏదో ఒక విధంగా నా  ఉద్యోగ జీవితంలో ఉత్తమ స్థానానికి చేరడానికి ఉపయోగపడ్డాయి. 

ఇక ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ తెలుగు చదివితే ఏం చెయ్యొచ్చు?  అనే   ప్రశ్నకు  సమాధానానికి  వెళ్లే  ముందు  తెలుగుని ఎలా చదవాలన్నది తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రతీ విషయాన్ని కూలంకషంగా నేర్చుకోవడం మొదలుపెట్టాలి. మీరు సాహిత్యం పాఠ్యాంశంగా  చదువుతున్నపుడు ఆ  పాఠ్యాంశాల పూర్వాపరాలు కూడా తెలుసుకోవాలి. ముందు, వెనక కథలు తెలుసుకోవాలి. రచయితల జీవిత విశేషాలు, ఇతర రచనలు కూడా తెలుసుకోవాలి. కథకి సంబంధించిన సందర్భంతోబాటూ, సమాజ పరిస్థితిని తెలుసుకోవాలి.

ఇక భాషా శాస్త్రం గురించి చదువుకుంటే భాషలోని అన్ని అంశాలు తెలుసుకోవాలి. అక్షరాలతో ప్రారంభించి, పదాలు- వ్యుత్పత్తి, వాక్యనిర్మాణం, వ్యాకరణాంశాలు కుదిరితే తులనాత్మకంగా నేర్చుకోవాలి. అంటే ఇంగ్లీషు, హిందీ వంటి  ఇతరభాషల్లో భాషాంశాలు, తెలుగుతో పోలిస్తే ఎలా ఉన్నాయో అన్నీ తెలుసుకోవాలి.  

ఒకప్పుడు తెలుగు చదివితే మనకు టీచింగ్, జర్నలిజం, గ్రూప్ ఎగ్జామ్స్ వంటి పరిమితమైన అవకాశాలు మాత్రం ఉండేవి.  ఇప్పుడు ప్రపంచం మారింది.  భాష డిజిటలైజ్ అయ్యింది. ఎన్నో కొత్త అవకాశాలు వచ్చాయి.

అయితే వాటన్నిటి గురించి కూడా కూలంకషంగా తెలుసుకుంటే Data Annotator, Data Evaluator, Modeller, Linguist, Asst Linguist, Language Analyst, Creative Strategist, Creative Writer, Content writer, Translator, Language Specialist, Linguist వంటి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయి. అవన్నీ మీకు మరెప్పుడైనా స్పెషల్ లెక్చర్ గా చెప్తాను. చదువుకునే రోజుల నుంచే ఎక్స్పీరియన్స్ కూడా సంపాదించాలి.  ఎక్స్పీరియన్స్  అంటే ఉద్యోగమే  చెయ్యవలసిన పనిలేదు. సొంతంగా ability ని డెవలప్ చేసుకోవాలి. English language లో కూడా తగిన  ప్రావీణ్యం సంపాదించాలి.  

ఇక ఇవేళ్టి సదస్సు లోని ప్రధానాంశం “తెలుగు సాహిత్యం- సమకాలీనత”  గురించి కొన్ని మాటలు చెపుతాను. మనకు ఆదికవి  నన్నయ్యతో ప్రారంభించి దాదాపు వెయ్యి  సంవత్సరాల  సాహిత్య చరిత్ర ఉంది. ఆ తరువాత  వచ్చిన, శివకవులు, తిక్కనాదులు, ఎఱ్ఱన, శ్రీనాథుడు, పోతన, ప్రబంధయుగం, నాయకరాజుల యుగం, ఆధునిక యుగంలో కందుకూరి తో ప్రారంభించి గురజాడ, బండారు అచ్చమాంబ, మన రాయప్రోలు, దేవులపల్లి, నాయని, విశ్వనాథ  మొ.న భావ కవులు, జాషువా గారు, శ్రీశ్రీ, పఠాభి, శిష్ట్లా , కుందుర్తి వంటి  అభ్యుదయ కవులు,  దిగంబర కవులు, విప్లవ కవులు, స్త్రీవాద, దళిత ఉద్యమాలు, మైనారిటీ ఉద్యమం, పోస్ట్ మోడర్నిజం మొదలైన ధోరణులు, ఉద్యమాలు.   అలాగే కథ, నవల, గల్పిక, ఖండకావ్యం  వంటి ప్రక్రియలు, అనాదిగా మనతో ఉన్న జానపద సాహిత్యం ఇవన్నిటినీ తలుచుకుంటూ సమకాలీన సాహిత్యాన్ని విశ్లేషణ చేసుకునే ఈ సదస్సు  అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. సాహిత్యం సమకాలీన సమాజానుగుణమైన అంశాల్ని ప్రతిభింభించినప్పుడే అది ఎప్పటికీ బతికి ఉంటుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.