షర్మిలాం “తరంగం”

ఇండియా వెలిగిపో !!

-షర్మిల కోనేరు 

దేశమంతా లాక్డౌన్ కాగానే హాస్టళ్ళ నుంచి పిల్లలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వర్క్ ఫ్రం హోం లని ఇళ్ళకి చేరితే…అబ్బ ఇళ్ళన్నీ మళ్ళీ కళకళలాడుతున్నాయ్అనిఅనుకున్నాను.

మరో రెండువారాలకు ఆ ఇంటిఇల్లాలు చాకిరీతో అలిసి వెలవెలబోవడం చూసి ఏంటా అని ఆరాతీశా…

పిల్లలు యూట్యూబుల్లో చూసి రకరకాల కేకులనీ, కుక్కీలనీ వాళ్ల తలకాయనీ వంటలుచేయడం…

ఆ బండెడు సామాను తోమలేక వాళ్ళ అమ్మ సతమతం అవ్వడం.

పోన్లే పిల్లలు రాకరాక వస్తే ఈమాత్రం చేయలేనా అని అనుకున్న తల్లులు రెండువారాలకే చేతులెత్తేశారు.

అసలు తెల్లవారుజామున లేచి చదివితే చదువు బుర్రకి ఎక్కుతుందనేది మా నాయనమ్మ. తెల్లారుజామునే లేవడం సంగతి అటుంచి తెల్లారాకా పడుకునే పిల్లల గురించి ఆవిడ అప్పుడు ఊహించి వుండదు.

తెల్లారగట్ట రోజూ నాలుగింటికే లేచి బర్రుబర్రుమంటూ తాటిచీపుర్లతో ముంగిలి వూడ్చేది.

సెలవులకి ఊరెళ్ళినప్పుడు కాస్త ఏడింటి వరకూ పడుకుందామంటే మాతాత తిట్లదండకం. ఇప్పుడు గనక మాతాత వుంటే? తిట్ల దండకం కాదు తిట్ల పురాణమే విప్పేవారేమో !

ఈ కరోనా లాక్డౌన్ విన్యాసాలు అన్నీఇన్నీ కాదు. ఈ లాక్డౌన్తో ఒక కొత్త దినచర్య అమలులోకి వచ్చింది.

అదేంటయ్యా అంటే ఏ ఇంట్లోనూ పిల్లలు బ్రేకుఫాస్టు అనే మాటే మరిచిపోయారు. ఏకంగా మధ్యాన్నం ఒంటిగంటకి మంచం దిగి బ్రష్ చేసి ఏకంగా లంచ్ కానిచ్చేస్తున్నారు.అప్పుడే అమ్మానాన్నలకు వాళ్ళ దర్శనం!

ఆ తినేదేదో తినేసి మళ్ళీ ఆన్ లైన్ క్లాసెస్  అంటూ గదిలోకి వెళ్ళిపోతారు.

సాయంత్రాలు యూట్యూబ్ కుకింగ్…

ఆ బట్టర్, మైదా, పంచదార్లకే సగంజీతం అయిపోతోదన్న మొగుడి సణుగుడు మరోవైపు.

రాత్రి భోజనాలయ్యాకా టీవీల్లో నెట్  ఫ్లిక్స్  సిరీస్ నో, మళయాళం సినిమానో చూసి గదుల్లోకి వెళ్తారు.

అసలు కత అక్కడ మొదలు.ఒరేయ్ చంపెయ్యరా! పారిపోరా ! పరిగెట్టరా !! ఇలాంటి కేకలు…వున్నట్టుండి నవ్వులు…పిచ్చాసుపత్రా? ఇల్లా కాసేపు అర్ధంకాదు. అది పబ్జీ ఆన్ లైన్ గేమ్. పబ్జీ బ్యాన్  చేశారని ఎగిరిగంతేసేలోగా ఇంకో ఆట ఫౌజీ వస్తోందట.

కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు పిన్నాపెద్దా సెల్ ఫోన్ కి అతుక్కుపోయిపుట్టారేమో!ఫోన్  చూసుకుని చూసుకుని రాత్రికి ఏ నాలుగింటికో పడుకుంటారు … నిద్ర పట్టేసరికి అయిదు.

సూర్యోదయం అవుతుండగా నిద్రలోకి జారుకుంటారు. పిల్లలకి ఇదే దినచర్య అలవాటు అయితే ఇక దేశంఏమైపోతుందోనన్న బెంగ ఈమధ్య నన్ను తెగపీడించేస్తోంది.

యువత రాత్రంతా లేచి పగలంతా పడుకుంటే దేశ ఆర్ధిక వ్యవస్థ , ఉత్పాదకత ఏమైపోతుంది?

ఆ! నాకో ఐడియా వచ్చింది. కాలేజీలు, ఆఫీసులు రాత్రులు పెడితే సరి! ఇక దేశం వెలిగిపోతుంది !!

*****

Please follow and like us:

One thought on “షర్మిలాం“తరంగం”-15”

  1. Beautifully described, Sharmila Garu! The world’s not just going through a disruptive digital transformation but a curious blend of freedom and frenzy unleashed in a hurry; resulting in an upheaval of the social fabric and emergence of the seemingly bizarre behavioral patterns in the society; even as one tends to believe that prime ministers and bureaucrats, chief ministers and people’s representatives; public health functionaries and educators; religious leaders and politicians; and importantly, the fourth estate and the media- all have been affected in some proportion by the pandemic factor . Truth is stranger than fiction! Nature’s revelations and lessons come during the most unexpected moments.

Leave a Reply

Your email address will not be published.