నిజాయితీపరుడు

-అనసూయ కన్నెగంటి

               ఒకరోజు భూపాల రాజ్యపు రాజు భూపాలుడు తన ముఖ్యమంత్రితో కలసి మారువేషంలో గుర్రపు బగ్గీ మీద రాజ్యమంతా తిరగసాగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా .. సాయంత్రం అయిపోయింది. 

   ఇక రాజప్రాసాదానికి వెళ్ళిపోదాము అనుకుంటూ ఇద్దరూ వెనక్కి తిరిగారు. దారిలో బాగా పెరిగిన పచ్చటి పొలాలు, పండ్ల తోటలూ వారిద్దరికీ  కనువిందు  చేయసాగాయి.  

     రాజ్యంలో పండే రకరకాల పంటలు, వాటిలోని నాణ్యత, రాజ్యంలోని అవసరాలు..వాటి ధరలు, రైతుకి వచ్చే ఆదాయం వంటి అనేక విషయాలు ముఖ్యమంత్రి రాజుకి వివరిస్తున్నాడు. 

    రాజు వాటిని ఆలకిస్తూ చుట్టూ పరిశీలిస్తున్నాడు. 

అలా వెళుతూ వెళుతూ  ఉండగా…దారిలో..వారికి ఒక రైతు నడవలేక నడవలేక నడుస్తూ  రాజూ, మంత్రి  వెళ్ళే దిశగా నడవ సాగాడు..

     అతన్ని చూస్తే  రాజుకి జాలేసింది. దాంతో..

   “ పాపం ఎవరో పెద్దాయన. ఉదయం నుండి  పొలంలో పని చేసి ,చేసీ అలసిపోయినట్టున్నాడు. నడవలేకపోతున్నాడు. అతన్ని మన గుర్రబ్బగ్గీలో ఎక్కించుకుని అతని ఇంటి వద్ద దించుదామా?” అన్నాడు మంత్రితో. 

    “ అటులనే మహారాజా!” అన్నాడు మంత్రి. 

   గుర్రపు బగ్గీ అతని దగ్గరకంటా అపి “ ఓ పెద్దయ్యా..ఓ పెద్దయ్యా…నిన్నే !” అని రెండుసార్లు పిలిచాడు గుర్రపు బండి నడిపే ఆయన . ఎంతకీ పలకకపోయే సరికి ఈసారి మంత్రి పిలిచాడు. అయినా పలకకుండా అదేపనిగా నడుచుకుంటూ వెళ్ళిపోసాగాడు ఆ రైతు. 

     రాజుకి ఆశ్చర్యం వేసింది. దాంతో బండిని ఆపమని రాజు కిందకి దిగి అతన్ని చేరుకుని..వెనక నుండి అతని వీపు మీద తట్టి.. “ పెద్దాయనా..! ఇంటికేనా? రా నిన్ను మీ ఇంటిలో దిగబెడతాము “ అన్నాడు .

   రైతు నవ్వి వద్దన్నట్టుగా ముందుకి సాగిపోయాడు. మళ్ళీ మళ్ళీ అడిగినా అదే  జవాబు రావటంతో చేసేది ఏమీ లేక  రాజూ , మంత్రి గుర్రపు బండి దగ్గరకి చేరుకోబోతున్నంతలో ఆ వెనకే వస్తున్న మరో రైతు కలగచేసుకుని..

    “మీరెవరో కానీ ఈ ప్రాంతానికి కొత్తలా ఉన్నారు.అతని గురించి మీకు తెలియదులా ఉంది. మీరు ఎన్ని సార్లు రమ్మన్నా రాడు. నేను నడవగలుగుతున్నాను కదా. నడవలేని వాళ్లు మరొకరు ఎవరైనా ఎక్కుతారులే అని ఎక్కడు. మరొకరి అవకాశం నేనెందుకు పోగొట్టాలి అనుకుంటాడు. ఈ విషయంలో ఎవరు ఎంత చెప్పినా వినడు..” అన్నాడు ఆ ఇద్దర్నీ ఎగాదిగా చూస్తూ..

    అది విన్న రాజూ,మంత్రి చాలా ఆశ్చర్యపోయారు ఇలాంటి వారు కూడా ఉన్నారా అని. 

       అయితే  సరదాగా అతన్లోని ఈ సుగుణాన్ని  మరింతగా పరిశీలించదలచారు. ఆ దిశగా రాజూ, మంత్రీ బాగా ఆలోచించి ఒక ఉపాయం పన్నారు.   అందులో భాగంగా..

       కాస్తంత ముందుకు పోయాకా..దారిలో ఒక బంగారు నాణేన్ని అతనికి కనిపించేలా రోడ్దు మీద ఉంచారు. అలా ఉంచి అతని కంటే ముందు నెమ్మదిగా వెళుతూ గుర్రబ్బండిలో నుండి అతన్నే గమనించసాగారు.

      ఆ రైతు ఆ నాణేన్ని చూసాడు. అక్కడే ఒక నిమిషం ఆగి..దాన్నే చూస్తూ..

     ” ఇది నాకెందుకు? నాకు తినటానికి తిండి ఉన్నది. ఈ దారిలో బాగా ఉన్నవారు, ఒక మాదిరిగా ఉన్నవారు వాళ్ల వాళ్ల వాహనాల్లో వెళతారు. కాబట్టి వారికి ఇది కనిపించే అవకాశం లేదు. నడిచి వెళ్లేవాళ్ళు తప్పక పేద వాళ్లై ఉంటారు. ఎవరైనా ఇటుగా నడిచి వస్తే వారికి దొరుకుతుందిలే “ అనుకుని అది నడిచే వాళ్లకు బాగా కనిపించేలా ఉంచి ముందుకి సాగిపోయాడు. 

    అది చూసి తెల్లబోయారు రాజూ, మంత్రి. 

  అతనికి మనసులోనే నమస్కరించి..మరో ఆలోచనతో వేగంగా ముందుకి పోయి గుర్రపుబగ్గీ నడిపే ఆయన్ని బిచ్చగానిగా మారమని  దారి పక్కన కూర్చోమని చెప్పి..రైతు వచ్చినా కనిపించకుండా ఉండే విధంగా దూరంగా బండితో సహా వెళ్ళిదాక్కున్నారు.

   కాసేపటికి రైతు వచ్చాడు. బిచ్చగాణ్ణి చూసి ఎంతో బాధపడిపోయాడు. తన దగ్గర వెయ్యటానికి ఏమీ లేదని చింతించాడు. అలా చింతిస్తున్నంతలో అతని మనసులో బంగారు నాణెం మెదిలింది. దాంతో..

      ”ఇతనికి ఇక్కడ తినటానికి ఏమీ లేదు. అక్కడ అనవసరంగా బంగారు నాణెం పడి ఉన్నది. దానిని తీసుకు వచ్చి ఇతనికి ఇస్తాను.కొద్ది రోజులైనా కడుపునిండా తింటాడు” అని తలచి..బిచ్చగాని దగ్గరకంటా వెళ్ళి ..

     ” అయ్యో..! నువ్విక్కడే ఉండు. ఇప్పుడే వస్తాను.” అని వెనక్కి నడచి వెళ్ళాడు బంగారునాణేన్ని  తేవటానికని.

   అతనలా వెళ్లగానే రాజూ, మంత్రి   వచ్చి ఏమన్నాడని అడిగారు.

    జరిగింది చెప్పాడు బండినడిపే వాడు. 

   ఇద్దరూ ఒకళ్లని చూసి ఒకరు నవ్వుకుని..అతన్ని దగ్గరకు రమ్మని మెల్లగా చెవిలో ఏదో చెప్పి వెనక్కి వెళ్ళి దాక్కున్నారు. దాంతో దూరాన్నించి ఆ రైతు రావటం గమనించి  అక్కడి నుండి లేచి కొద్ది దూరంలో ఉన్న పొదల్లో దాక్కున్నాడు బిచ్చగాని వేషంలో ఉన్న బండి నడిపేవాడు. 

      కాసేపటికి అక్కడికి వచ్చిన రైతు ..అక్కడ బిచ్చగాడు లేకపోవటం చూసి..

  ” అయ్యో..! ఇంకొంచెం వేగంగా నడచి ఉండాల్సింది. ఎక్కడికో  వెళ్ళిపోయాడు “ అనుకుని మనసులో బాధపడిపోతూ వెనక్కెళ్ళి ఆ బంగారు నాణెం ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టేసి వచ్చాడు. తీరా చూస్తే రైతు వచ్చేసరికి బిచ్చగాడు అక్కడ కూర్చుని కనిపించాడు. మళ్ళీ బాధపడిపోతూ..” ఇంతకు ముందు వచ్చి చూసాను. ఇక్కడ లేవు. ఎక్కడికి వెళ్ళావు? “ అనడిగాడు. 

    “ దాహం వేసిందయ్యా! నీళ్ళు తాగటానికి వెళ్ళాను “ అని అబద్ధం చెప్పాడు బిచ్చగాడు.

   “ సరే అయితే! ఇక్కడే ఉండు ఎక్కడికీ వెళ్ళకు. ఇప్పుడే వస్తాను” అని వెళ్ళి మళ్ళీ బంగారునాణెంతో వచ్చాడు.

మళ్ళీ బిచ్చగాడు అక్కడ కనిపించలేదు.   దాంతో వెనక్కెళ్ళి ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టేసి వచ్చేసరికి మళ్ళీ బిచ్చగాడు కూర్చుని కనిపించాడు. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. అయినా వెనక్కి తగ్గలేదు రైతు.

    ఈసారి ఒకటికి వెళ్ళానని చెప్పాడు బిచ్చగాడు. అలా మరోసారి జరిగాకా…

   “ ఈ రైతు ఎంత నిజాయితీ పరుడు! మన రాజ్యంలో ఇలాంటి వారు  ఉండటం మనకు గర్వకారణం. “ అని రాజు మంత్రితో అని..మారు వేషాలను తొలగించి రైతుకి ఎదురుపడి నమస్కరించారు. 

    తెల్లబోయి చూశాడు రైతు వాళ్ల ముగ్గుర్నీ..

    జరిగినదంతా అతనికి వివరించిన రాజు..”…అసలే అలసిపోయి ఉన్న తమను  మరింత అలసటకు గురి చేసినందుకు మన్నించండి. మీ నిజాయితీని మెచ్చి మీకు తగు బహుమతినీయదలచాము. మాతో రండి “ అన్నాడు రాజు. 

    “ క్షమించండి మహారాజా! మీరు మెచ్చుకున్ననూ, మెచ్చుకొనకపోయినను..నేను నేనే.నాలో మార్పురాదు. అంతేకాదు..నాకు ఉన్నది నేనూ, నా కుటుంబం బ్రతకటానికి చాలు. కాబట్టి  మీరు కోరిన విధంగా మీ బహుమతిని స్వీకరించలేను. మన్నించండి “ అన్నాడు తన దారిన తాను వెళ్ళబోతూ..

       దాంతో..మంత్రి ముందుకు వచ్చి “ ఆగండి మహాశయా..! ఒక్కమాట వినండి. మీ నిజాయితీని పరీక్షించే క్రమంలో మిమ్మల్ని అన్నిసార్లు తిప్పి శ్రమ పెట్టాము. మాకు చాల బాధగా ఉంది.  మిమ్మల్ని ఇంటిదగ్గర దింపాలని ఉంది. మీరు అంగీకరిస్తే మిమ్మల్ని దింపి మేము బాధ నుండి విముక్తులము అవుతాము.కనీసం ఇదైనా అంగీకరించండి “ అన్నాడు.

   అందుకు కూడా అంగీకరించలేదు రైతు. 

    దాంతో ముగ్గురూ అతనికి మరోసారి నమస్కరించి రాజప్రాసాదానికి తిరిగి వెళ్ళిపోయారు. 

   ఆ మర్నాడు రాజు తన వేగుల ద్వారా  ఆ రైతు ధాన్యం  పంట పండిస్తున్నాడని  తెలుసుకుని,  ఆ పంటకు రాజ్యం మొత్తం అంతటా ధరను పెంచటమే కాక,  నిలువెత్తు ధనం ఇచ్చినా తీసుకోని ఆ రైతు నిజాయితీ  పదిమందికి ఆదర్శం కావాలని..అతను పండించిన వరి రకానికి ఆ రైతు పేరు పెట్టి రాజు తనను, తన రాజ్యాన్ని గౌరవించుకున్నాడు.   

           చూశారా పిల్లలూ..!  ఒక్క రైతులోని నిజాయితీ రాజ్యంలో ఉన్న  మొత్తం రైతులకు ఎంత మేలు చేసిందో. అలా ఎవరో చేసిన మంచిపనులే మనం ఇలా సంతోషంగా ఉండటానికి కారణం అవుతాయి. మరి ఇతరులు సంతోషంగా  ఉండాలంటే మనమూ నిజాయితీగా ఉంటూ..మంచి పనులు చేయాలి కదా? చేద్దామా?

           *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.