రమణీయం

బుద్ధుని జీవితం-ధర్మం-3

-సి.రమణ 

 

మానవుని సంపూర్ణ సుఖశాంతుల కొరకు నిర్దేశించబడిన మార్గమే అష్టాంగమార్గం. బుద్ధుడు, సామాన్యుల నుండి మేధావుల వరకు, భిన్న పద్ధతులలో, విభిన్నమైన మాటలతో, వారి ఆలోచన, అవగాహన  స్థాయిని బట్టి, వారి వారి ఆచరణ సామర్థ్యాన్ని బట్టి, అష్టాంగ మార్గాన్ని బోధించాడు. అవి ఎనిమిది అంగాలుగా ఉండటం వలన అష్టాంగ మార్గం అయినది.బౌద్ధ గ్రంథాలలో ఉన్న వేలకొలది ఉపదేశాల సారాంశం అష్టాంగ మార్గంలో ఉన్నది.

 

1.సమ్యక్ వాక్కు          (సమ్మా  వాక్)

2.సమ్యక్ కర్మ             (సమ్మా  కమ్మ)

3.సమ్యక్ జీవనము     (సమ్మా  ఆజీవ)

4.సమ్యక్ వ్యాయామం  (సమ్మా  వాయామా)

5.సమ్యక్ సతి             (సమ్మా  సతి)

6.సమ్యక్ సమాధి        (సమ్మా  సమాధి)

7.సమ్యక్ సంకల్పము   (సమ్మా  సంకప్ప)

8.సమ్యక్ దృష్టి            (సమ్మా  దిట్టి)

 

సమ్యక్ = సరైన            Bracket (కుండలి) లో ఉన్నవి పాళి భాష పదాలు

ఇవి అన్నియు వరుసక్రమంలో ఆచరించవలసిన అవసరం లేదు. ఎవరికి వారు వారి యొక్క మనో ధర్మాన్ని బట్టి, సమర్థతను బట్టి, ఒకే సారి అయినా, కొంచెం వెనకా ముందుగా అయినా, సంపూర్ణంగా సాధించాలి.

ఆర్య అష్టాంగ మార్గము మూడు విభాగాలుగా చెప్పబడినది. అవి 1. శీలము (భౌతిక చర్యలు) 2.సమాధి

 (మనసును లగ్నం చేయడం, ధ్యానము ) 3. ప్రజ్ఞ ( అన్నిటినీ తాత్విక దృష్టితో చూడటం ) 

ఎవరైతే శీలాన్ని పాటిస్తూ, సమాధి ద్వారా మనసును నిగ్రహిస్తూ, సాధన చేస్తారో, ప్రజ్ఞ ద్వారా అన్నిటినీ తాత్విక దృష్టితో చూస్తూ, మనసును నిర్మల చేసుకుంటారో, వారు దుఃఖ విముక్తులయి, నిర్వాణం (ఆరాటాలు సమసిపోవటం) పొందుతారు. 

శీలము :  శీలము అంటే నైతిక ప్రవర్తన. శీలవ్రతం బుద్ధుని బోధనలలో ప్రముఖమైనది. మాటల ద్వారా, చేతల ద్వారా, దుష్కర్మలు చేయకుండా, వాటి బారిన పడకుండా, వాటికి దూరంగా సదాచార జీవనాన్ని గడపడమే శీలం. అష్టాంగ మార్గం లోని మొదటి మూడు అంగాలు శీలానికి సంబంధించినవి.

1.సమ్యక్ వాక్కు : అంటే  ఎప్పుడూ  నిజాన్ని మాట్లాడాలి. మాటలు మృదువుగా, అర్థవంతంగా, స్నేహ సామరస్యం కలిగించేవిగా ఉండాలి.సరి అయిన సందర్భంలో సరి అయిన మాటలు మాట్లాడాలి. మాట్లాడవలసిన అవసరం లేకపోతే మాట్లాడరాదు.ఏది మాట్లాడినా కరుణ, ప్రేమ, పవిత్రతతో కూడి ఉండాలి. చాడీలు చెప్పటం, పరుషంగా మాట్లాడటం, అసభ్యకరమైన, ద్వేష పూరితమైన మాటలు చెప్పడం, పనికిరాని ఊసుపోని కబుర్లతో కాలం గడపడం చేయరాదు.ఇవి అన్ని మనవాక్కును కలుషితం చేస్తాయి. ఈ కల్మషాలనుండి మనవాక్కును కాపాడుకుంటే తనకుతనే, వాక్కు పవిత్రతను సంతరించుకుంటుంది..

2. సమ్యక్ కర్మ : సమ్యక్ కర్మ అంటే సత్ ప్రవర్తన. సరైన వాక్కుని అనుసరించి చేసే పనులు కూడా సభ్యత కలిగి, శాంతియుతమై ఉంటాయి. మనం చేసే ప్రతికర్మ పవిత్రంగాను, శుద్ధంగాను వుండాలి. ఏ ప్రాణినీ హింసించ రాదు. దొంగతనం, అక్రమ కామ కలాపాలు చేయకూడదు. మత్తు పదార్థములు సేవింప రాదు. తనకు గాని  ఇతరులకు గాని చెడు కలిగించే పనులు చేయరాదు. ఇతరులతో నిజాయితీగా, గౌరవపూర్వకంగా ప్రవర్తించాలి. ఉత్తమమైన జీవనానికి విరుద్ధంగా ఉండే పనులు వదిలివేయాలి.

3.సమ్యక్ జీవనము:  మంచి మార్గాలలో జీవనోపాధి కల్పించుకోవాలి. తనకు, తన తోటివారికి ఉపయోగపడేవి అయినటువంటి, గౌరవప్రదమైన వృత్తులు,వ్యాపారాలు చేయాలి  ఇతరులకు హాని కలిగించే , మోసపూరితమైన వృత్తులు, ఆయుధాలకు సంబంధించి, మత్తుపదార్థాలకు సంబంధించి వ్యాపారాలు చేయరాదు . అద్భుత శక్తుల ప్రదర్శన, జాతకాలు చెప్పడం, మంత్ర  తంత్రాలతో కూడిన వృత్తులు విడనాడాలి..

సమాధి:  అన్ని రకాల మలినాలను, చెడు విషయాలను అంతం చేసే ధర్మాచరణను పాటించేవారు, బాహ్య ప్రవర్తననే కాక, అంతర్గత ఆలోచనలలో కూడా ప్రక్షాళన గావించాలి

4.సమ్యక్  వ్యాయామం: మన శారీరక ఆరోగ్యానికి వ్యాయామం ఎంత అవసరమో, అంతే అవసరం యుక్తమైన మానసిక పరిశ్రమ కూడా. ఇక్కడ మానసిక పరిశ్రమ అంటే, అకుశలమైన (చెడు) ఆలోచనలు తలెత్తకుండా నిరోధించడం.  ఇప్పటికే ఉత్పన్నమై ఉన్న చెడుఆలోచనలు తొలగించుకోవడం. కుశలమైన (మంచి) ఆలోచనలు ఉత్పన్నం చేసుకోవటం, ఇప్పటికే ఉన్న, కుశలమైన మానసిక స్థితిని వృద్ధి చేసుకోవడమే మానసిక పరిశ్రమ. అష్టాంగ మార్గ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించకుండా మనసును స్వాధీన పరచుకోవాలి.

5.సమ్యక్ సతి: సమ్యక్ సతి  అంటే, ప్రస్తుత క్షణం పట్ల అప్రమత్తత, ఎరుక కలిగి ఉండటం. శారీరక సంవేదనల పట్ల మరియు మనసులో కలిగే ఆలోచనలు భావనల పట్ల ఎరుక కలిగి ఉండటం. రాగద్వేషాలకు అతీతంగా ద్రష్టాభావంతో  (ఉన్నది ఉన్నట్లుగా చూడటం) సావధానత కలిగి ఉండాలి. 

6.సమ్యక్ సమాధి: సమాధి అంటే ఏకాగ్రత. సమ్యక్ సమాధి అంటే సరైన ఎకాగ్రత. ప్రస్తుత క్షణం పట్ల ఎరుక కలిగి, సాధ్యమైనంత ఎక్కువసేపు కొనసాగిస్తే, ఏకాగ్రత కలిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమాధిని సరైన రీతిలో పరిపుష్టం చేసుకోవడానికి ఈ క్షణపు ఎరుక కలిగి వుండాలి అని తెలుసుకున్నాము. అందుకోసం, కల్పనా రహితమైన ఒక ఆలంబన కావాలి. అదే ఆనాపానసతి (శ్వాస రాకపోకల ఎరుక). శాంతంగా, నిలకడగా ప్రయత్నిస్తే, సమ్యక్ సమాధి (సరైన ఏకాగ్రత) పొందగలం. 

ప్రజ్ఞ:  సరైన సంకల్పం, సరైన దృష్టి కలిగి వుండటమే ప్రజ్ఞ. శీలము, ప్రజ్ఞ అష్టాంగమార్గంలో వేరు వేరు అంగాలు. అయినా శీలము లేని ప్రజ్ఞ, ప్రజ్ఞ లేని శీలము బౌద్ధ ధర్మంలో గోచరించదు. 

7.సమ్యక్ సంకల్పం:  సరైన ఆలోచనలతో, మనసును నడిపించటమే సమ్యక్ సంకల్పం. స్వార్ధం, కోపం,  దురాశ, ద్వేషం, హింసా ప్రవృత్తిని కలిగించే ఆలోచనలు, ఉత్పన్నం చేసేది మనసే. కావున చెడు భావాలను తొలగించుకొని, మంచి ఆలోచనలకై సాధన చెయ్యాలి. భవబంధాలను  పరిత్యజించే ఆలోచనలు వృద్ధి చేసుకోవాలి. స్వార్థరహిత పరిత్యాగం, సకల జీవరాసులపట్ల ప్రేమభావనలను పెంపొందిస్తుంది. మానవ జీవితంలోని దుఃఖాన్ని సమూలంగా అంతం చేయడమే, జీవితపరమార్ధంగా ఎంచుకొని, ఆ దిశలో సత్యశోధనకు సంకల్పించాడు గౌతముడు. ఆ మహాసంకల్ప ఫలితమే బౌద్ధ ధర్మం అని మన అందరికి తెలిసిన సత్యమే !!

8. సమ్యక్ దృష్టి: సరైన దృష్టి. ఉన్నది ఉన్నట్లుగా చూడటం, ఉన్నది ఉన్నట్లుగా  తెలుసుకోగలగడం, నాలుగు ఆర్యత్యాలను సరైనరీతిలో అర్థంచేసుకోవడమే సరైన దృష్టి. ఊహాజనితమైన సిద్ధాంతాలను, మూఢనమ్మకాలను, నిరాధారమైన విశ్వాసాలను విడనాడి సరైన దృష్టి కలిగి వుండాలి. 

నాలుగు ఆర్య సత్యాలు (1.దుఃఖం ఉన్నది 2.దుఃఖానికి హేతువున్నది 3.దుఃఖ నివారణ ఉన్నది. 4.దుఃఖ నివారణ మార్గమున్నది.)  తెలిపే, వాస్తవికతను అర్థం చేసుకుని, మనసు గురించి  పరమార్థ సత్యాలను తెలుసుకుని, ప్రతి ఒక్కరూ అనుసరించదగిన ,ఆచరించవలసిన జీవన మార్గాన్ని అవగతం చేసుకుంటాము. మనసు, మాట, శరీరంతో చేసే అన్ని చర్యలను, క్రమశిక్షణతో తీర్చిదిద్దు కుంటాము. ప్రక్షాళన చేసుకుంటాము. 

మానవ జీవన ప్రస్థానంలో  ఏ అంకంలో నైనా హేతు వంతమైన, సత్య వంతమైన, మహోన్నతమైన ధర్మాచరణ ( అష్టాంగ మార్గాల ఆచరణ ) ప్రారంభించవచ్చు. జీవించినంత కాలం ప్రశాంతంగా, సంతోషంగా, తేజస్సుతో  జీవిస్తాము.  

స్వీయ శక్తిలో సంపూర్ణ విశ్వాసం ఉంచుకుని, ఏ విధమైన గురువు అవసరం లేకుండానే ,ఏ ఒక్కరి సాహచర్యం కోసం చూడకుండానే, ఏకాంతంగా, మహోన్నతమైన, మేధా సంబంధమైన తన లక్ష్యాన్ని సాధించాడు గౌతముడు. మానవుల సకల రుగ్మతలను (దుఃఖాలను)  నివారించే మహా వైద్యునిగా సంబుద్ధత్వాన్ని పొందాడు. మానవ నైజంలోని సద్గుణాలకు ప్రత్యక్ష ప్రమాణం అయ్యాడు.  బుద్ధ ధర్మంలోని ప్రధాన  సిద్ధాంతాలైన  కరుణ, ప్రజ్ఞలకు  ఆయనే ఒక సమగ్ర స్వరూపం.

 తధాగతుడు తాను దేవుని అవతారమని,  దైవాంశ సంభూతుడునని, దేవదూతనని, రక్షకుడునని, ఎప్పుడూ ఎక్కడ ప్రకటించలేదు. తాను కేవలం మానవుడునని, తనకు ఏవిధమైన మానవాతీత శక్తులు లేవని చెప్పేవాడు. స్వయంకృషి, అకుంఠిత దీక్ష, జ్ఞానపరమైన సాధనతో, తనలో అంతర్ భూతంగా నిక్షిప్తమై ఉన్న అనంత శక్తులను వెలికితీసి ,ఉన్నత శిఖరాలను ఎవరైనా అధిరోహించవచ్చని పదే పదే చెప్పేవాడు. మానవుడు తనకు తానే, ప్రజ్ఞతో , కృషితో, తనలోని జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలని, ఎవరి పైన ఆధారపడకూడదని బోధించాడు. గురువులు కేవలం తమ బోధనద్వారా మార్గాన్ని చూపగలరు, ప్రయాణాన్ని ఎవరికి వారే చేసి, గమ్యాన్ని చేరాలని,  ధర్మానువర్తులుగా చరించాలని బుద్ధుడు ఉపదేశించాడు. 

దుఃఖ రహితులు కావాలంటే అష్టాంగమార్గాన్ని అనుసరించాలని తెలుసుకున్నాము. ఇక సంపూర్ణమానవునిగా పరిపక్వత చెందాలంటే వుండవలసిన మానవీయ సద్గుణాలేమిటో చూద్దాం. అవే దశపారమితులు. వాటిగురించి తదుపరి సంచికలో తెలుసుకుందాం.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

One thought on “రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-3”

  1. బుద్ధుని అష్టాంగ మార్గం గురించి సమగ్ర సమాచారం చదివి చాల తెలుసుకున్నాను. సులభం గా అర్థం అయ్యేలా , చదివించేలా వుంది. ప్రతి భారతీయుడు బుద్ధుని , ఆయన బోధనలను , మానవాళికి ఆయన చేసిన కృషి తెలుసుకోవాలి

Leave a Reply

Your email address will not be published.