ఉపన్యాసం-9

మీకెంత ధైర్యం?

వక్త: గ్రేటా థూన్ బెర్

స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి

నేపథ్యం:

మూడు రోజుల క్రితం …… సెప్టెంబర్ 23 న …..

అమెరికా ….. న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన “క్లైమేట్ ఆక్షన్ సమ్మిట్” లో …….

ముక్కుపచ్చలారని పదహారేళ్ళ స్వీడిష్ అమ్మాయి ….. గ్రేటా థూన్ బెర్ …. వందలాది ప్రపంచ దేశాధినేతలకు హెచ్చరికలు జారీచేసింది!

కేవలం ఓ సంవత్సరం క్రితం పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన ఈ అమ్మాయి ….. స్వీడన్ పార్లమెంటు ముందు తన నిరసన తెలియజేయడం మొదలుపెట్టింది. ఆమెతోపాటు మరెంతో మంది విద్యార్థులు ముందుకు వొచ్చారు. ఆమె స్పూర్తితో ….. ప్రతి శుక్రవారం రోజున ప్రపంచంలో ఏదో ఒక మూలన …… పర్యావరణ ముప్పుపై ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు లభించిన ఆదరణ వల్ల 2018 లో “క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్” లో ఆమెకు పాల్గొనే అవకాశం వచ్చింది.

“టైం” మాగజైన్ ఆమె ముఖచిత్రంతో ఓ సంచికను విడుదల చేసింది.

తిరిగి ఈ సంవత్సరం ….. సెప్టెంబర్ 23 న జరిగిన సమావేశానికి ఓ నెల రోజులు ముందుగానే … కాలుష్యం వెలువరించని విహారనౌకలో ప్రయాణం చేసి అమెరికా చేరుకొన్నది. ఈ నౌక సౌరశక్తితోనే గాక నీటిలో మునిగివుండి శక్తిని అందించే టర్బైన్ల ద్వారా నడుస్తుందట. 15 రోజుల ఈ ప్రయాణాన్ని ప్రపంచ మీడియా చాలా ఆసక్తితో గమనించింది.

ఇంట గెలిచి రచ్చ గెలవాలి కాబట్టి తన తలిదండ్రులతో ముందుగా మాంసం తినడం మానిపించింది గ్రేటా! అట్లాగే వారి “కార్బన్ ఫుట్ ప్రింట్” తగ్గించడానికి వారితో విమానప్రయాణాలు కూడా మానిపించింది.

ఆమె ప్రసంగాన్ని వినదలచుకొంటే ఈ కింది లింక్ నొక్కండి.
https://www.youtube.com/watch?v=TMrtLsQbaok

***
(ప్రసంగ పాఠం)
—————–

మేము మిమ్మల్ని గమనిస్తూవుంటాము…..అనేదే నా సందేశం.

ఇదంతా తప్పు, నేనిక్కడ వుండాల్సింది కాదు. నేను ఈ సముద్రానికి ఆవలి వైపున స్కూల్ లో ఉండాల్సినదాన్ని. అయినప్పటికీ …. మీరంతా మా వద్దకు….యువత వద్దకు … ఆశతో వస్తారు. ఎంత ధైర్యం మీకు?

మీ కల్లబొల్లి కబుర్లతో మీరు నా స్వప్నాలను చెదర గొట్టారు. నా బాల్యాన్ని దోచుకుపోయారు. అయినా కూడ ….. నేను అదృష్టవంతుల్లో ఒకదాన్ని. ప్రజలు బాధపడుతున్నారు. ప్రజలు చనిపోతున్నారు. సర్వ ప్రాణికోటి కకావికలమవుతున్నది. మనమంతా భూమ్మీదనుండి సమూలంగా తుడిచిపెట్టుకుపోయే ఆరంభదశలో వున్నాము. మీరేమో ….. అంతులేని ఆర్ధికాభివృద్ధి, డబ్బు అనే కాకమ్మ కధలు చెపుతారు. ఎంత ధైర్యం మీకు?

దాదాపు ముప్పై సంవత్సరాలుగా శాస్త్రవిజ్ఞానం తేటతెల్లంగా వున్నది. ఒకవైపు అవసరమైన రాజకీయ నిర్ణయాలు తీసుకుని ….. పరిష్కారాలు వెతకాల్సి వుండగా ….. మీరు ఎటో చూస్తూ ….. చేయవలసినదంతా చేస్తున్నామని చెప్పడానికి ఎంత ధైర్యం మీకు?

మేము చెప్పేది వింటున్నామని, అత్యవసర పరిస్థితిని అర్ధం చేసుకున్నామని మీరు చెపుతున్నారు. నేనెంత విచారంగా, కోపంగా వున్నా ఫర్వాలేదు ….. కాని ఆ మాటలు నేను నమ్మదలచుకోలేదు. ఎందుకంటే ….. ఒకవేళ మీరు పరిస్థితిని అర్థం చేసికొని కూడ ….. ఏమి చేయలేకపోతున్నారంటే మీరే అరిష్టం. అందువల్ల ….. నేను మిమ్మల్ని నమ్మడానికి నిరాకరిస్తున్నాను.

రానున్న 10 సంవత్సరాల్లో ….. పర్యావరణ హానికారకాలను 50% తగ్గిస్తే ….. మనము ఇప్పటికన్నా 1.5 డిగ్రీల సెల్సియస్ దిగువన ఉండగలిగే అవకాశం వున్నది. అలా అవుతే ….. మానవ శక్తి తిరిగి ఏమి చేయాడానికి వీలులేని ఆపదను ఆహ్వానిస్తున్నట్లే.
50 శాతం మీకు అంగీకారమే కావచ్చు. కానీ ….. అందులో …… మృతతుల్యమైన వాయుకాలుష్యం లేక సమతుల్యత, పర్యావరణ న్యాయము ….. మొదలైన అంశాలకు సంభందించిన ….. కీలకమైన, సున్నితమైన వివరాల గణాంకాలు లేవు. మా తరం గాలిలోనుండి పీలుస్తున్న బిలియన్ల టన్నుల కొద్ది కార్బన్ డై ఆక్సైడ్ ను కొలువలేని అరకొర సాంకేతికతపైనే ఆ గణాంకాలన్నీ ఆధారపడివున్నాయి.

ఫలితాలను అనుభవించేది మేమే కాబట్టి …… 50 శాతం ప్రమాదసూచన అనేది మాకు ఆమోదయోగ్యం కాదు.

ప్రపంచంలోని ఉష్ణోగ్రతల హెచ్చుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉంచగలిగి …… ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ సూచించినట్లుగా 67 శాతానికి ప్రమాదస్థాయిని తగ్గించగలిగితే ….. జనవరి 1, 2018 నాటికి 420 గిగాటన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వదలివేయబడివుండేది. ఈ రోజు ఆ సంఖ్య 350 గిగాటన్నులకు పడిపోయింది.

ఏదో కొన్ని సాంకేతిక పరిష్కారాలు చూపుతూ ….. యదాలాపమైన మాటలతో ఈ విపత్తును ఆపగలుగుతామని నటించడానికి మీకు ఎంత ధైర్యం? ఇప్పుడున్నట్లుగానే ….. ఈ

విషాలను మనము పర్యావరణంలోకి వదలడం ఆపివేయకపోతే …… రానున్న ఎనిమిదిన్నర సంవత్సరాలకన్నా ముందుగానే మనం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సివస్తుంది.
ప్రస్తుత గణాంకాల పరిష్కారానికి ఇంతవరకు ఎట్టి ప్రణాళికలు రూపొందించబడలేదు. ఎందుకంటే ఈ గణాంకాలు చాలా ఇబ్బందికరంగా వున్నాయి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే పరిపక్వత మీకు లేదు.

మీరు మమ్మల్ని విఫలుల్ని చేస్తున్నారు. కాని మీరు చేస్తున్న నమ్మకద్రోహాన్ని యువత అర్ధం చేసుకోవడం మొదలుపెట్టింది. రానున్న తరాల దృష్టి మీ పైనే వున్నది. మీరు మా వైఫల్యాలనే కోరుకొంటున్నట్లయితే ….. మేము మిమ్మల్ని ఎన్నటికి క్షమించలేమని హెచ్చరిస్తున్నాను.

ఏ పరిష్కారం చూపకుండా మీరు సమస్యను దాటివేస్తే ….. మిమ్మల్ని మేము వదిలిపెట్టము. ఇక్కడే ….. ఇప్పుడే మాకేం కావాలో మేము చెపుతున్నాం. ప్రపంచం నిద్దురనుండి లేస్తున్నది ….. మీరు అంగీకరించినా ….. లేకున్నా ….. మార్పు వస్తున్నది.

థాంక్ యూ.

***

ముగింపు:
————-

నాణానికి బొమ్మ బొరుసులాగ …… గ్రేటా థూన్ బెర్ పై ప్రశంసల వర్షంతో పాటు, విమర్శల జల్లులు కూడా కురుస్తున్నాయి!

ఆమె తలిదండ్రులు …… ఇంకా కొంతమంది పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వ్యాపారాలు చేయబోయే లబ్దిదారులు ఆమె చేత ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారని విమర్శలు తలెత్తాయి.

ఏది ఏమైనా ….. కాలమే మంచి చెడులను నిర్ణయిస్తుంది.

*****

ఉత్తరం-9

పూర్వపు యజమానికి ….. ఓ బానిస ప్రత్యుత్తరం

రచయిత: జోర్డన్ ఆండర్సన్

స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి

నేపథ్యం:

1864 వ సంవత్సరం ……
అమెరికా అంతర్యుద్ధపు రోజులు ……

జోర్డన్ ఆండర్సన్, అతని భార్య అమండా లను వారి 32 సంవత్సరాల బానిసత్వపు చెరనుండి ….. యూనియన్ ఆర్మీ సైనికులు విముక్తి గావించారు.

కొద్దిరోజులు టెన్నెస్సీలో పనిచేసిన జోర్డన్ ఆ తర్వాత తన కుటుంబంతో ఒహాయోలో స్థిరపడ్డాడు. అక్కడ …… పనిచేస్తూ ….. నాలుగురాళ్ళు సంపాదించే స్థితికి చేరుకొన్నాడు.

దాదాపు ఓ సంవత్సరం తర్వాత ….. పూర్వపు యజమాని, పాట్రిక్ హెన్రీ ఆండర్సన్ నుండి జోర్డన్ కు ఓ లేఖ వొచ్చింది. తన వ్యవసాయం, వ్యాపారం క్షీణ దశలో వున్నదని …… జోర్డన్ ను పనిలో చేరాలని కోరుతున్నానని …… ఆ లేఖ సారాంశం.

దానికి జవాబుగా ….. జోర్డన్ డిక్టేట్ చేసిన ఈ క్రింది ఉత్తరం ….. ఆ రోజుల్లో అమెరికా దినపత్రికల్లో ప్రచురించబడింది. అదో సంచలనం.

***

(ఉత్తరం)
————-

డేటన్, ఒహాయో,
ఆగస్ట్ 7, 1865

నా పూర్వపు యజమాని, కల్నల్ పీ.హెచ్. ఆండర్సన్, బిగ్ స్ప్రింగ్స్, టెన్నెస్సీ,

సర్,

మీ ఉత్తరం అందింది. జోర్డన్ ను మీరు మర్చిపోలేదు అనే విషయం నాకు సంతోషాన్నిచ్చింది. ఎవరూ చేయలేనంత సహాయాన్ని చేయగలనని ….. తిరిగివచ్చి, మీవద్ద పనిలో చేరాలని మీరు నన్ను కోరారు. మిమ్మల్ని చూస్తేనే ….. నాకు అదోలా వుండేది. మీరు వత్తాసు పలుకుతున్న తిరుగుబాటుదారులను మీ ఇంట్లో ఉన్నప్పుడు పట్టుకుని ….. ఈపాటికి మిమ్మల్ని యాంకీస్ (యూనియన్ సైనికులు) ఎప్పుడో ఉరితీసి వుంటారని నేను అనుకొన్నాను. గుర్రపుశాలలో వున్న సైనికున్ని చంపివేయమని మీరు కల్నల్ మార్టిన్ (తిరుగుబాటుదారుల సైనికాధికారి) దగ్గరకు వెళ్ళిన విషయం బహుశా వారు వినివుండకపోవచ్చు. నేను అక్కడినుండి రాక పూర్వం, మీరు నాపై రెండుసార్లు కాల్పులు జరిపినప్పటికీ ….. మీకు హాని కలిగిందని వినడం నాకు ఇష్టం లేదు. మీరు ఇంకా బ్రతికి వుండడం నాకు సంతోషంగా వుంది. ప్రియమైన ఆ పాత ఇంటికి మళ్ళీ వెళ్లి మిస్ మేరీ, మిస్ మార్తా, అలెన్, ఎస్తర్, గ్రీన్, లీ ….. వీళ్ళందరినీ చూడడం నాకు బాగుంటుంది. వాళ్ళను అడిగానని చెప్పండి. ఈ ప్రపంచంలో వీలుగాకపోతే, ఇంతకన్నా మంచి ప్రపంచంలో వాళ్ళను కలుస్తానని చెప్పండి. నేను నాశ్విల్లీ హాస్పిటల్ లో పనిచేసినప్పుడు, మిమ్మల్నందరినీ చూడాలనుకోన్నాను. కానీ ….. అవకాశమొస్తే మీరు నన్ను చంపాలని చూస్తున్నారని ఎవరో పొరుగువారు చెప్పారు.

ముఖ్యంగా ….. మీరు ఇవ్వదలచుకొన్న ఆ మంచి అవకాశమేమిటో నేను తెలుసుకోవాలనుకొంటున్నాను. ఇక్కడ నేను చాలినంత బాగా బ్రతుకుతున్నాను. భోజనం, దుస్తులతో పాటు నెలకు ఇరవైఐదు డాలర్లు సంపాదిస్తున్నాను. మాండి (జోర్డన్ భార్య ….. అమండా ముద్దు పేరు) కోసం ఇప్పుడు సౌకర్యవంతమైన ఇల్లు వున్నది. చుట్టుపక్కలవాళ్ళు ఆమెను మిసెస్ ఆండర్సన్ అని పిలుస్తారు. పిల్లలు….మిల్లీ, జేన్, గ్రండి __ …..స్కూలుకు వెళ్లి బాగా చదువుకుంటున్నారు. గ్రండి __ మంచి మతబోధకురాలు కాగలదని టీచర్ చెపుతున్నారు. వాళ్ళు ఆదివారపు బడికి వెళ్తున్నారు. మాండి, నేను క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నాం. మమ్మల్ని అందరూ దయతో చూస్తున్నారు. “ఆ నల్ల వాళ్ళు బానిసలు” అని అప్పుడప్పుడు వేరేవాళ్ళు మా గురించి అనే మాటలు మాకు వినపడుతుంటాయి. అలాంటి మాటలు విన్నప్పుడు పిల్లలు చాలా బాధపడతారు ….. కానీ టెన్నెస్సీలో కల్నల్ ఆండర్సన్ కు చెందిన వాళ్ళకు అది అవమానమేమి కాదని వాళ్ళకు చెపుతాను. నా లాగా ….. ఎంతో మంది నల్లవాళ్ళు మిమ్మల్ని యజమాని అని చెప్పుకోవడానికి గర్వపడతారు. ఇక ఇప్పుడు…..నాకు ఎంత జీతం మీరు ఇవ్వగలరో లిఖితపూర్వకంగా తెలియజేస్తే ….. మళ్ళీ మీ దగ్గరకు రావడం నాకు ఎంతవరకు లభాదాయకమో నేను నిర్ణయించు కోగలుగుతాను.

ఇక నా స్వేచ్చ…..మీరు నాకిస్తానంటున్న స్వేచ్చ…..నిజానికి పెద్దగా చెప్పుకోతగింది కాదు. 1864 లోనే డిపార్టుమెంటు ఆఫ్ నాశ్విల్లెకి చెందిన ప్రోవోస్ట్-మార్షల్-జనరల్ నాకు స్వేచ్ఛా పత్రాలు ఇచ్చారు. మమ్మల్ని న్యాయంగా, దయగా మీరు చూడగలరనే రుజువులు లేకుండా వెళ్ళలేమని మాండీ చెపుతున్నది. మీ నిజాయితీకి పరీక్షగా…..మేము మీ వద్ద చేసిన మొత్తం పనికి మాకు జీతాలు చెల్లించండి. అలా అవుతే పాత విషయాలను మరిచిపోయి…..మిమ్మల్ని మేము క్షమించగలము. అలాగే మీ న్యాయాన్ని బట్టి ….. మున్ముందు మీతో స్నేహంగా వుండగలము. నేను విశ్వసనీయంగా ….. మీకు 32 సంవత్సరాలు సేవ చేశాను. మాండీ 20 సంవత్సరాలు చేసింది. నాకు నెల ఒక్కింటికి ఇరవై అయిదు డాలర్లు ….. మాండీకి వారానికి రెండు డాలర్ల చొప్పున మాకు ఇవ్వవలసిన డబ్బు పదకొండు వేల ఆరువందల ఎనబై డాలర్లు అవుతున్నది. దీనికి ఆ డబ్బు మీరు వుంచుకొన్న కాలానికి వడ్డీ కలపండి. అందులో నుండి మా బట్టలకిచ్చిన డబ్బులు, నాకు మూడుసార్లు, మాండీకి ఒకసారి డాక్టర్ ఖర్చులు …. పోనూ మిగతావి మాకు న్యాయంగా చెందాల్సినవి. దయచేసి డబ్బును ఆడమ్స్ ఎక్స్ ప్రెస్ ద్వారా పంపించండి. మా విశ్వసనీయమైన పాత పనులకు తగినవిధంగా చెల్లించలేకపోతే ….. మీ భవిష్యత్ వాగ్దానాల పట్ల మాకు విశ్వాసముండదు. మీరు, మీ తండ్రులు ….. నాకు, నా తండ్రులకు చేసిన అన్యాయాల విషయంలో భగవంతుడు మీ కళ్ళు తెరిపించాడని మేము అనుకొంటున్నాము. కొన్ని తరాలుగా ప్రతిఫలము లేకుండా మేము మీ కోసం శ్రమ పడ్డాము. ఇక్కడ నేను ప్రతి శనివారం రాత్రి జీతం పొందుతాను. కాని టెన్నెస్సీలో నీగ్రోలకు…..గుర్రాలు, ఆవులు తప్ప….. జీతాల రోజు అనేది ఇంతవరకు లేదు. కూలీల శ్రమ దోపిడీ చేసేవారికి …. వారి తప్పుడు పనుల ఫలితం అనుభవించే రోజు తప్పకుండా వస్తుంది.

దీనికి జవాబు ఇచ్చేటప్పుడు…..మిల్లీ, జేన్ కు ఏ విధమైన రక్షణ కలుగజేస్తారో తెలియజేయండి. వాళ్ళిద్దరూ అందమైన అమ్మాయిలుగా ఎదుగుతున్నారు. పాపం…..మాటిల్డా, కేధరిన్ లకు ఏమి అయిందో మీకు తెలుసు. నా పిల్లల పట్ల యువ యజమానులు క్రూరమైన, హింసాత్మక చర్యలు చేసి ….. వారిని సిగ్గుతో తలవంచుకునేలా చేస్తే ….. ఆ విషయాన్ని నేను తట్టుకోలేను. అంతకన్నా ఇక్కడే ….. పస్తులుండి, చనిపోయినా సరే ఫరవాలేదు. అలాగే నల్లవారి పిల్లల కోసం మీ చుట్టుపక్కల ఏవైనా బడులు తెరిచారా చెప్పండి. ఇప్పుడు నా జీవితంలో ….. కోరిక ఒక్కటే ….. నా పిల్లలు విద్యావంతులు కావాలి ….. మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి.

జార్జ్ క్రేటర్ కు నమస్కారాలు చెప్పండి. మీరు నన్ను కాలుస్తున్నప్పుడు మీ దగ్గరినుండి పిస్తోలు లాక్కున్నందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేయండి.

***

ముగింపు:
————–

జోర్డన్ ఆండర్సన్ తిరిగి ఎప్పుడు టెన్నెస్సీ వైపు వెళ్ళలేదు. 81 సంవత్సరాలు పరిపూర్ణంగా జీవించి, 19౦7 లో తనువు చాలించాడు.

ఈ ఉత్తరం …… అమెరికన్ సాహిత్య ప్రపంచంలో ….. “స్లేవ్ హ్యూమర్” అనే శీర్షికన ప్రాచుర్యం పొందిన వాటిలో చోటు చేసుకున్నది. ఇందులోని వ్యంగ్యం ….. రచయిత మార్క్ ట్వైయిన్ రాసిన “డెడ్ పాన్” అనే ఒరవడికి దగ్గరగా వుంది అని కూడా పరిశీలకులు పేర్కొంటారు.

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.