రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం

శశికళ కథలు

                                                                – కె.శ్రీదేవి

ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ కథ వస్తు, రూప పరంగా మిగిలిన ప్రాంతీయ కథలకు ధీటుగా వెలువడుతూ వచ్చింది. 190ల నుంచి ఇప్పటిదాకా రాయలసీమలో అనేక ప్రాంతాలలో విస్తరించివున్న రచయితలు ప్రథమంగా రాయలసీమ సాహిత్యాన్ని తద్వారా మొత్తం తెలుగు సాహిత్యాన్ని శక్తివంతంచేసే కృషిలో భాగమయ్యారు. ఈఆరు దశాబ్దాల కృషిలో సింహభాగం పురుషులదే అయినప్పటికీ, స్త్రీల పాత్రను నిరాకరించటం అనేది లేక గుర్తించలేకపోవటం అనేది వాస్తవాన్ని విస్మరించటమే అని అనడానికి ఎటువంటి సంకోచం అవసరంలేదు. ఎందుకంటే, రాయలసీమ జిల్లాలలో పదులకొద్దీ వున్న స్త్రీ రచయితలు గణనీయమైన సంఖ్యలోనే కథారచన చేశారు. ఈ కృషిలో ఈ ప్రాంతంలో పుట్టిపెరిగిన వాళ్ళేగాక ఈ ప్రాంతానికి ఉద్యోగాన్వేషణలో వచ్చి స్థిరపడిన వాళ్ళు కూడా వున్నారు. వీళ్ళందరి వైయక్తిక,  సామూహిక కృషి ఫలితంగా సీమ సాహిత్యం లోని స్త్రీల కథాసాహిత్యం పరిగణింప దగిన స్థాయిలోనే రూపొందింది.

రాయలసీమ ప్రాంతంనుండి స్త్రీరచయితలు పంతొమ్మిది వందలా ఇరవై నుండి కథలు రాస్తున్నప్పటికి,  గత మూడు నాలుగు దశాబ్దాల నుండే కథలు ఎక్కువగా రాయటం కనిపిస్తుంది. శతాబ్దాలుగా స్త్రీలు అప్రకటిత నిషేదాల ద్వారా రచనా రంగం నుంచి దూరం చేయబడ్డారు. ఆధునిక యుగంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిందనడానికి ఆస్కారం లేదు. ఇలాంటి భూసామ్య సాంస్కృతిక వాతావరణం గల రాయలసీమలో అసలు స్త్రీలు రచన చేయటమే విశేషాంశం. పురుష రచయితలు తీసుకున్న కథా వస్తువులతోపాటు వాళ్ళకు సాధ్యపడని, స్త్రీలు మాత్రమే రాయగలిగిన, విశ్లేషించగలిగిన అంశాలను శశికళ తన కథల్లో సృజించారు. స్త్రీలపట్ల, ఆడపిల్లలపట్ల చూడబడుతున్న అసమాన  ప్రతిఫలనాలను నిర్దిష్టమైన దృష్టికోణంతో విశ్లేషించి, సోదాహరణంగా చర్చించటం శశికళ కథల ప్రత్యేకత. మొత్తం ఇప్పటిదాకా రచనారంగంలోకి వచ్చిన రచయిత్రుల  రచనలన్నింటిని  పరిశీలిస్తే, ఒక స్పష్టమైన అవగాహనతో రచనలు చేసిన వారిలో రాయలసీమ నుండి శశికళ ఒకరు కాదు. ఒక్కరే. రాయలసీమ రచయిత్రుల రచనలని కేంద్రం చేసుకోని ఈమె కథల్ని విశ్లేషించటం అవసరమే అయినప్పటికి, శశికళ విషయంలో ఈ మినహాయింపు అనవసరమనిపిస్తుంది. 

శశికళ వృత్తిరీత్యా స్కూల్ ప్రిన్స్ పాల్. ఆమెది పిల్లల ప్రపంచం. ఒక రచయిత అధ్యాపకవృత్తిలో వుండటం వలన కలిగే మేలు వారి వృత్తిజీవితం – రచనా జీవితం పరస్పరం ఎలా వెలిగించుకుంటాయో శశికళ కథలు చదివితే తెలుస్తుంది. ఆమె రెండు సంకలనాలలో ముప్ఫై ఐదు కథలలో దాదాపు అన్ని కథలు పాఠశాల నేపధ్యంలో రాసినవే. స్త్రీలు, పిల్లల జీవితమే ఆమె కథల ముడిసరుకు. నిరంతరం పిల్లల చుట్టూ తిరగడమే కాకుండా వాళ్ళ  జీవితం లోలోపలికి చూడగలిగారు. అందుకే ఆపిల్లల వ్యక్తిగత  కుటుంబనేపధ్యాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, అంచలంచలుగా, పొరలు పొరలుగా చుట్టుకొన్న బాల్య జీవితంలోని జైవిక వైవిధ్యాన్ని కథలుగా మలిచారు. ”చెదిరిన పిచ్చికగూడు”,” మా తుజే సలామ్” పేరిట రెండు కథాసంకలనాలు వెలువరించారు. చాలా కవితలు రాశారు. ఆంగ్లం నుండి అనువాదాలు చేశారు. వ్యాసాలు రాశారు. అనంతపురం రచయితల  సంఘంలో, విరసంలో ఇప్పటికీ కొనసాగుతున్న సుధీర్ఘ కాల సభుయురాలు. సామాజిక సమస్యలపై సదస్సులు, చర్చావేదికల నిర్వహణ బాధ్యతలు లాంటి కార్యక్రమాలను కూడా ముందుండి నడిపిస్తుంటారు. కడపజిల్లా ఈమె జన్మస్థలం. వివాహమైన తరువాత స్థిరపడ్డ కారణంగా కడపజిల్లా వాస్తవ్యాన్ని ఎవరైనా గుర్తుచేస్తే తప్ప గుర్తురానంతగా అనంతపురంజిల్లాలోఇమిడిపోయారు, ఎనభై దశకంలో ఏ.పి.సి.ఎల్.సి. సారధ్యంలో ,జి. నిర్మలారాణి, చంద్రశేఖర్ మొదలైన వారితో సహా జిల్లాలో పలుమార్లు పర్యటించారు.విపరీతమైన వరుస కరువులలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న సంధర్భంగా జిల్లారచయితలంతా రైతులకు భరోసా ఇచ్చేందుకు  జరిపిన పర్యటనలు చేశారు. శశికళ దృష్టిపథంలో నిలిచిన దారుణమైన సంఘటనలు ఆమె ఉపాధ్యాయ జీవితాన్ని వెంటాడాయి. దాని ఫలితంగా రూపుదిద్దుకున్న కథలు “డ్రాప్ వుట్” , “తారాబాయి – తాజ్ మహల్” మొదలైనవి.

ఏ ప్రాంతమైనా, ఏ అభివృద్ధైనా, ఏ విధ్వంసమైనా దాని ప్రభావానికి మొట్టమొదట గురయ్యేది వృద్ధులు, పిల్లలు, స్త్రీలు అన్న సామాజిక విశ్లేషకుల అభిప్రాయాలకు ఊతమిస్తాయి ఈమె కథలు. “తారాబాయి – తాజ్ మహల్” నిరుపేదలైన రాయలసీమ తాండా వలసకూలీల జీవితాన్ని చిత్రించిన కథ. తారాబాయి కొడుకు కుటుంబంతో సహా పనులకోసం పట్టణానికి వలసపోతాడు. కుటుంబం మొత్తం పనికెళ్ళాల్సిన దుర్భర స్థితిలో పల్లెలోనే కళ్ళు , కాళ్ళు పనిచేయని తల్లిని వదిలేస్తాడు. కనీసం మలమూత్రాల విసర్జనకు కూడా లేవలేని నిస్సహాయ స్థితి. దాహంవేసినపుడు, ఆకలేసినపుడు తన కేకలతో, ఇరుగుపొరుగు దయాదాక్షిణ్యాలతో కాలం వెళ్ళబుచ్చుతుందే కానీ, తనను నిర్దయగా కొడుకు ఊరుమీద వదిలేసాడన్న కోపం ఆమెకే మాత్రం లేదు. కారణం తనస్థితి కొడుకుకు బారంతప్ప అతని ప్రేమలేమితనం కాదని తారాబాయికి తెలుసు.  అందుకే తమస్థితికి కారణమైనవి భౌగోళిక ఆర్థికాంశాలేనన్న అవగాహన తారాబాయి అనుభవానికుంది, 

ఈకథ శీర్షిక విషయానికొస్తే, తారాబాయికి పెళ్ళైన తరువాత తనకు భర్త  చేయించిన కాళ్ళకడియాలను అంత దారిద్ర్యంలో కూడా తీయదు. కారణం తనను తనస్థితిని ఏమాత్రంలెక్కచేయకుండా, అత్యాచారం జరగక మునుపు ఆమెను ఎలా కోరుకున్నాడో, ఆ సంఘటన జరిగిన తరువాత కూడా ఆమెపట్ల సోమ్లానాయక్ అభిప్రాయం మారదు.ఆమెను పెళ్ళాడి తాండా వాళ్ళ జాలి చూపుల్నుండి తారాబాయిని రక్షించి, జీవితాన్నిచ్చాడన్న కృతజ్ఞత. అందుకే భర్త మరణానంతరం సోమ్లా నాయక్ ప్రేమతో చేయించిన కాలి కడియాల్ని అతని సమాధి నిర్మాణానికి మాత్రమే ఉపయోగించాలనుకుంటుంది. షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన ఆమె సమాధి (తాజ్ మహల్) కంటే తారాబాయికి సోమ్లానాయక్ ప్రేమ చిహ్నంగా నిర్మించే సమాధి గొప్పదన్న రచయిత స్పురణ “తారాబాయి – తాజ్ మహల్” కథావస్తువు. దుర్భర దారిద్ర్యంలో కూడా తన ప్రేమను నిలుపుకోవడం కోసం ఆమె చేసిన ప్రయత్నం, ఆమె మరణానంతరం మనవడు సోమ్లానాయక్ బడికి వెళ్ళడం, భర్త సోమ్లానాయక్ సమాధి కట్టడం ఈరెండు అంశాలు తారాబాయి స్థితికి కన్నీరు కార్చిన పాఠకుల హృదయ భారాన్ని తేలిక పరుస్తాయి.

రాయలసీమ నుండి కరువు పైన చాలా కథలే వచ్చాయి. స్త్రీలు కూడా పరిగణింపదగిన సంఖ్యలోనే రాశారు. కరువుకున్న బహుపార్శ్వాలను ముఖ్యంగా స్త్రీలు, పిల్లలపైన ముఖ్యంగా ఆడపిల్లలపైన అది చూపుతున్న ప్రభావాలను  విశ్లేషిస్తూ, ఆర్. శశికళ రాసిన “ డ్రాపవుట్” అనేకథ ప్రధానమైనది. ఒక రకంగా ఈ కథ రాయలసీమ కరువు మహిళపై పడిన ప్రభావం, దాని వలన ఎలాంటి కొత్త సమస్యల్ని రాయలసీమ స్త్రీలు ఎదుర్కోవలసి వచ్చిందో సమగ్రంగా చిత్రించిన కథ. రాయలసీమ స్త్రీలు మిగిలిన ప్రాంతాల స్త్రీలు ఎదుర్కొంటున్న  సమస్యలను ఎదుర్కొంటూనే, రాయలసీమ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకంగా ఉన్న సమస్యలను అదనంగా ఎదుర్కొంటున్నారు. ఈ అదనపు సమస్యల సమగ్ర చిత్రపటాన్ని ఆర్. శశికళ తన “డ్రాపవుట్” కథలో శక్తివంతంగా ప్రతిఫలింపజేశారు.

       ఈ కథలో కరువు బారినపడి పంటచేతికి రాక, చేసిన ఆప్పులు తీర్చలేక బ్యాంకు వాళ్ళ ఆస్తులు జప్తుచేస్తున్నారని తెలిసిన క్రిష్ణప్ప అనే సన్నకారురైతు పురుగుల మందు తాగుతాడు. ఆయన ఆత్మహత్య చేసుకోవటంతో, అతని భార్య కాంతమ్మ  కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తుంది. బ్యాంకు వాళ్ళ జప్తుతో పొలం, ఇల్లు ఆప్పు కింద చెల్లింపు అవుతుంది. కాంతమ్మ దొరికీ, దోరకని కూలిడబ్బులతో ముగ్గురి ఆకలి తీర్చడానికి సరిపోకపోవడంతో, కూతురు రమాదేవి కూడా బడిమానేసి కూలికెళ్తుంది. అప్పటికే ఊర్లో చాలామంది కరువులతో వలసలు వెళ్ళారు. కుటుంబ  భారాన్ని మోస్తున్న కాంతమ్మ ఊరొదిలి వెళ్ళి కూలిపని సంపాదించుకోలేని స్థితి ఆమెది.

కరువు వలన ధ్వంసమయ్యే బ్రతుకులు ధ్వంసమవుతుంటే, ఆ కరువు పరిస్థితులనే అవకాశంగా తీసుకొని వృద్ధి ఆయ్యే దుర్మార్గులు, నేరస్థులు కూడా ఆ పల్లెలోనే ఉన్నారు. ఇదే మన సమాజంలో వున్న వైరుధ్యం. కరువు పరిస్థితులను  ఆసరాగా చేసుకొని ఆడపిల్ల శరీరంతో  వ్యాపారంచేసే రాకెట్లు                      రాయలసీమ కరువును వెన్నంటే వచ్చాయి. అమాయకులైన ఆడపిల్లలను ప్రేమ పేరుతో, పెళ్ళి పేరుతో మోసం చేసే ఒక పరంపర పల్లె, పట్టణమన్న తేడాలేకుండా అభివృద్ధి చెందుతున్న క్రమాన్ని  శశికళ ఈ కథలో చిత్రించగలిగారు. ప్రేమకు, పెళ్ళికి లొంగని అమ్మాయిలను, ఇంటి పని పేరుతో బిస్కట్లు, మందుల ఫ్యాక్టరీలలో  పని చూపుతామని ఆశపెట్టి  వారిని వేశ్యాగృహాలకు రవాణా చేసే సంస్థలు, వాళ్ళకు పల్లెల్లోగల దళారులు కలిపే లింకులు  ఇలాంటి వారివలన ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో ఈ కథలో రచయిత సమర్థవంతంగా  వివరించారు. డబ్బును ఎరగావేసి ఆమాయకపు ఆడపిల్లలను బొంబాయి, పూనా, గోవా, ఢిల్లీ నగరాలకు రవాణా చేసే ముఠాలు పల్లెల్ని ఆవరించి వున్నాయి. అలాంటి దళారీల మోసపూరిత కుట్రను “డ్రాపవుట్” కథలో రచయిత బహిర్గతంచేసింది. 

అయితే, అలాంటి  రాకెట్ కు చెందిన వ్యక్తి దృష్టి కాంతమ్మ కూతురు రమ మీద పడినపుడు అదే ఊర్లోని వెంకటలక్ష్మి అనే అమ్మాయి కూడా వారం నుండి కనిపించకపోవడంలోని అమానుషత్వాన్ని స్నేహితులైన రమ – సరోజ ఇద్దరూ నిశ్శబ్దంగా ఆఊరిలో  వసున్న మార్పుల్ని, ఆడపిల్లలు మాయమౌతున్న విషయాన్ని మాట్లాడుకొన్నట్లు చిత్రించటం ద్వారా ప్రజలకు ఈ సమస్య పట్ల అవగాహన వుందనే విషయం అర్థమవుతుంది. కానీ కరువు పరిస్థితిలో అంతకంటే మంచి జీవితాన్ని ఆశించడానికి, ఆలోచించడానికి కూడా తాహతులేని జీవితాలు వారివి. అయితే ఆ సమస్యను ఎలా నిర్మూలించవచ్చో ఈ కథ లో రచయిత చెప్పటం జరిగింది. ఉదాహరణకు..రమ సరోజల మధ్య జరిగిన సంభాషణను ఇక్కడ గమనించవచ్చు….

 “పెన్నప్ప మామ పెద్ద బిడ్డ గంగమ్మను ఇంట్లోకి రానీయలేదంట” అంటుంది సరోజ. వీళ్ళ మాటల వలన అప్పటికే గ్రామంలో ఎయిడ్స్ బారినపడిన వారి గురించి కూడా ఈ కథలో చర్చించ బడుతుంది. అలాగే రమ కుటుంబం తిండికి బట్టకు అవస్థ పడుతున్నప్పుడు, జ్వరం వచ్చిన తమ్మునికి మందులిప్పించలేని స్థితిలో తాను దళారి వెంకటరమణ ద్వారా పనిలోకి పోతాన న్నప్పుడు రమ తల్లి కాంతమ్మ ఇలా అంటుంది.

“థూ దొంగనాయాలు.. వాడుత్త లోఫరోడు. ఇద్దరాడపిల్లలను బొంబాయి కెత్తి కమీషన్ తింటాడని సెప్పినారు వూర్లో. మొదట వానికేముందే.. ఇప్పుడు చేతులకు నాలుగుంగరాలు, చైను, వాచీ వాని దర్జా మోటరు బైకూ..”. దళారీల రాకెట్  విలాసవంతమైన జీవితం గడపటం కోసం అమ్మాయిల అమ్మకానికి వెనుకగల ప్రవృత్తిని కారణాలతో సహా చిత్రించారు. ఇలా కారణాలను  కాంతమ్మ పాత్ర ద్వారా శశికళ వ్యక్తం చేయడం పాఠకుల చైతన్యానికి ఈకథ దోహదం చేయాలన్న ఆర్తికి, ప్రజల చైతన్యంపట్ల రచయిత్రికి గలబాధ్యతకు  ఒకింత ఆందోళన కూడా తోడవ్వడం మూలంగా కథనంలో సుదీర్ఘత్వం కనబడుతుంది.

  ఆడ పిల్లల చదువు కరువు కాటకాల బారినపడి సంక్షోభంలో కూరుకు పోతున్న వైనాన్ని ఈ కథలో రచయిత చెప్పగలిగారు. కరువు వలన స్త్రీల జీవితాల్లో పరచుకొంటున్న నీడలను వాటి ప్రతిఫలనరూపాలైన మహిళల రవాణా, ఎయిడ్స్  ఇలాంటి సమస్యలను కూడా శశికళ ఈ కథలో చెప్పడం జరిగింది.  రమ జీవితాన్ని దళారులైనా వెంకటరమణ,  మస్తాన్ వలీ బారి నుండి కాపాడుకోగలుగుతుందే కానీ బిడ్డలకు కడుపునిండా తిండి పెట్టలేక పోతుంది కాంతమ్మ. నాలుగురాళ్ళు వెనుకేసుకున్నారన్న ఒకే ఒక కారణంచేత ముప్ఫై ఏళ్ళు పైబడినవాడు, భార్యను కాల్చిచంపిన గంగులప్ప చేతికి రమ జీవితాన్ని అప్పజెప్పటంలో వున్న దైన్యాన్ని ఈ కథ వివరిస్తుంది.

రమాదేవి- కాంతమ్మల పరిస్థితి రాయలసీమ జిల్లాల్లో కరువుకాటకాలతో అలమటిస్తున్న గ్రామీ ణ  మహిళల దీనస్థితి, యదార్థరూపంలో కనిపిస్తుంది. ఒంటరిస్త్రీలుగా వారు ఎదుర్కొంటున్న సమస్యల వలయాన్ని ఈ కథలో చిత్రించే ప్రయత్నం చేశారు.

   “డ్రాపవుట్” అంటే “స్కూల్ డ్రాపవుట్” అన్న అర్థమే వస్తుంది. ఆడపిల్లలు చదువుకోవడంలోనే వారికి రక్షణ, పోషణ దొరుకుతుందన్న వాస్తవాన్నిఈ కథలో తెలియజెప్పారు. అంతేకాదు చదువు మానేసిన ఆడపిల్లలు అసలు వారి జీవితం నుండే “డ్రాపవుట్” అవుతారన్న అర్థంలో అమ్మాయిల చదువును సమర్థిస్తూ రాసిన కథగా  చెప్పవచ్చు.  ఏది ఎమైనా “డ్రాపవుట్” అన్న పేరు ఈ కథకు పెట్టడం  రచయిత యొక్క స్థూలదృష్టికి నిదర్శనం.

అయితే, డ్రాపవుట్ పదానికున్న విస్తృతార్థం పాఠకులకు అందితే,  ఈకథకు సాహిత్య ప్రయోజనం సిద్ధించినట్లే. కరువు ప్రభావాన్ని, దాని సాంస్కృ తిక ప్రతిఫలాలను ఇంత చక్కగా చెప్పగలిగిన రచయిత కాబట్టే ఈకథా కథనంలో కరువు వల్ల ఆడపిల్లల జీవితమే జారిపోతుందన్న అర్థం స్పురించే విధంగా కథనాన్ని నడిపారు. ఏది ఏమైనా రచయితగా శశికళ చేసిన ఈ ప్రయత్నం వస్తురీత్యా, రాయలసీమ గ్రామీణ స్త్రీల సమస్యాత్మక, సంక్షుభిత జీవితాలలో, కరువు ద్వారా సంభవించే మానవీయ విలువల విద్వంసాన్ని స్త్రీ దృక్పథం నుండి మొట్టమొదట చెప్పిన గౌరవం ఈకథకు దక్కింది .

 ”డ్రాపవుట్’ కథతో పాటు మరోకథ “అనంతగాయం” అనే కథలో కూడా ఎయిడ్స్ వ్యాధి వలన కుప్పకూలిపోతున్న జీవితాలను సామాజిక, ప్రభుత్వసంస్థల ఆసరాతో అర్థవంతంగా, ఆశావహంగా నడిపించుకునే అవకాశం వుందన్న ఊరడింపు ఈకథలో అందించే ప్రయత్నం చేశారు. 

రాజ్యహింస పట్ల చాలా స్పష్టమైన వైఖరిలో “ అంతా ప్రశాంతం” కథలో ప్రభుత్వ యంత్రాంగం యొక్క ద్వంద్వ వైఖరిని స్పష్టంగా  చెప్పిన రచయిత, ’అనంతగాయం’ కథలో ప్రభుత్వ సంస్థలు, సామాజిక సంస్థలు అందించే సహాయ కార్యక్రమాలను సమర్థించటం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. 

రాయలసీమ కథాసాహిత్యచరిత్రను పరిశీలించినపుడు లేక రాయలసీమ స్థానీయతలోని ప్రత్యేక అంశాల్ని నమోదుచేసే సంకలనాలను వేసేటపుడు, విశ్లేషించే సంధర్భంలో రచయిత్రులు ఎంత విస్మరణకు గురయినారో చాలా స్పష్టంగా అవగతమవుతుంది. చరిత్ర లోతుల్లో కెళ్ళకుండానే ఇటీవల కాలంలో వెలువడిన సంకలనాలలోనూ స్త్రీలు విస్మరించబడినారు. ఉదాహరణకు ౨౦౦౪ సంవత్సరంలో నూకా రాంప్రసాద్ రెడ్డి  సంపాదకత్వంలో వెలువడిన “ సీమ కక్షల కథలు”లలో కూడా కేవలం ఒక స్త్రీ రచయిత మాత్రమే కనిపిస్తుంది. నిజానికి అప్పటికే ఐదారుగురు పైగా శక్తివంతంగా రాయగలిగిన స్త్రీ రచయితలు వున్నారు. ఆ సంకలనం ప్రధానంగా ఫ్యాక్షన్  సంబంధిత ఇతివృత్తాలకు కేటాయించబడింది. ఆ ఇతివృత్తాన్ని పురుష రచయితలే కాక స్త్రీలు కూడా వస్తువుగా స్వీకరించారు. ఉదాహరణకు  ఆర్. శశికళ ఆమె రాసిన “కలుపు మొక్కలు”అనే కథ ఫ్యాక్షనిజం పిల్లల ప్రవర్తనపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో సోదాహరణంగా నిరూపించిన కథ. ఆ కథకు పై సంకలనంలో చోటు దొరకలేదు. ౨౦౦౬ సంవత్సరంలో ప్రచురించిన “ రాయలసీమలో ఆధునిక  సాహిత్యం సామాజిక సాంస్కృతిక  విశ్లేషణ”చేసిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య లాంటి మంచి సామాజిక విమర్శకుని దృష్టికి కూడా వీళ్ళు కనబడలేదు. సీమ సాహిత్యానికి స్త్రీలు చేసిన కృషి గురించి విశ్లేషించలేదు. ఆంధ్రజ్యోతిలో బండినారాయణస్వామి రాయలసీమ వ్యవసాయ కథపై రాసిన వ్యాసంలో కూడా శశికళతో పాటు మిగిలిన  స్త్రీల  కథలకు స్థానం కల్పించలేదు. వర్తమాన రాయలసీమ రచయితల సరసన రచయిత్రుల పేర్లను కూడా ప్రస్తావించలేకపోయారు. స్త్రీలను విస్మరించిన ఈ క్రమం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని అనుకోవటం అమాయకత్వమే అవుతుంది.(యం. హరికిషన్ సంపాదకత్వంలో వెలువడిన రాయలసీమ రచయిత్రుల కథలు” ఒక మినహాయింపు మాత్రమే.)

వర్జీనియాఉల్ఫ్ భావించినట్లుగా, కేవలం వాళ్ళ ఊహల్లో మాత్రమే స్త్రీకి అత్యంత ప్రాముఖ్యత వుంది. ఆచరణాత్మకంగా చూసినప్పుడు ఆమెకు ఎక్కడా  గుర్తింపులేదు. కానీ సాహిత్యంలో ఆమె సర్వవ్యాపకంగా వుంటుంది. చరిత్రలో ఆమెకే మాత్రం స్థానం లేదు. వర్జీనీయా ఉల్ఫ్ అభిప్రాయం ఐరోపా సాహిత్య సందర్భాన్ని గురించి మాట్లాడినప్పటికీ, దానికి  విశ్వజనీనమైన విలువ ఉంది. ఎందుకంటే, మిగతా ప్రపంచంలోనూ స్త్రీల స్థితి ఏమాత్రం భిన్నంగాలేదు. భారతదేశానికి కూడా ఇది వర్తిస్తుంది. ఆ విషయాన్ని అలా వుంచితే, రాయలసీమలో సాహిత్యం రూపొంది, వృద్దిచెందడంలో రచయిత్రుల కృషిని గుర్తించటం, విశ్లేషించటంలోని వ్యాసకర్తల అలసత్వం శశికళ కథల విషయంలో కూడా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీల పట్ల అమలవుతున్న వివక్ష స్త్రీల రచనల పట్ల కూడా జరుగుతున్నందుకు నిదర్శనం.

*****

Please follow and like us:

2 thoughts on “కథాకాహళి- శశికళ కథలు”

  1. శ్రీదేవి గారు శశికళ గారి కథల్ని చాలా లోతైన విశ్లేషణ చేశారు. అభినందనలు. శశికలక్క మా విరసంలో సీనియర్ రచయిత్రి .మాకు అందరికీ శశికళ గారంటే ఎంతో ప్రేమ, గౌరవం…సామాజిక అసమానతలపైన ,సమకాలీన సంక్షోభాల పైన శశి కళక్క ఎప్పటికప్పుడు స్పందించి కథ రాసేపద్దతి మాకు ఆదర్శం . కథా రచయిత్రి అయిన శశికళ గారు రాసిన కథల్లో చాలా వస్తు వైవిధ్యం ఉంది పిల్లల సమస్యలను చాలా బాధ్యతగా సాహితీకరించారు
    మతమైనా ,ఫ్యాక్షనిజం అయినా పిల్లలపై ఎలాటి చెడు ప్రభావాన్ని చూపుతుందో తనకథల్లో చెప్పారు. రాయల సీమ,కరువు,ఫ్యాక్షనిజం, ప్రపంచీకరణ, మతోన్మాదం ,పిల్లలు,స్రీలు,రైతులు కేంద్రంగా అద్భుతమైన లోతైన అవగాహనతో రాసారు
    అయితే మీరన్నట్లు సామాజిక బాధ్యతతో ఇంత కాలం నుంచి శశికలగారు రాస్తున్నా రాయలసీమ సాహిత్య ప్రపంచంలో శశికళ గారి పేరు కావాలని మరుగు పెట్టబడిందనిపిస్తుంది. కావలసినంత చర్చ జరగలేదు. సాహిత్య లోకం నుంచి ఈ వివక్ష రచయిత్రులు ఎదుర్కోవడం శతాబ్దాలుగా కోనసాగుతున్నది వర్జీనియా వూల్ఫ్,టోనీ మారిసాన్, అమృతా ప్రీతం,ఇస్మ థ్ చుగతాయిలాంటి గొప్ప.రచయిత్రులు ఈ వివక్షలను ,రాజకీయాలను ఎంతో ధీటుగా ఎదుర్కొన్నారు.
    అయినా శశికళ గారి కథలు ఎవరిని చేరాలో వారిని చేరుతున్నాయి.అది రచయత్రి ప్రతిభను తెలియచేస్తుంది.ఎంత అనిచివేసినా…నిరంతరం రాస్తూ పోవడం అనే ప్రక్రియ ద్వారా మాత్రమే వివక్షను ఎదుర్కోగలం.వివక్ష మరీ శృతి మించినప్పుడు రచయత్రులందరు సంఘటితమవడం తప్ప మరో దారి లేదు. మంచి విశ్లేషణ చేసినందుకు శ్రీదేవి గారికి, మంచి సామాజిక ప్రయోజనం ఉన్న కథలు రాస్తున్నందుకు శశి కళ అక్కను అభినందిస్తున్నాను.

Leave a Reply to గీతాంజలి Cancel reply

Your email address will not be published.