నిర్భయాకాశం కింద 

అనిశెట్టి రజిత కవితాసంపుటిపై  సమీక్ష

-వురిమళ్ల సునంద

 
కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేదే కవిత్వమన్న శ్రీ శ్రీ గారి మాటలకు కొనసాగింపు ఈ కవితా సంపుటని చెప్పవచ్చు.
పీడిత తాడిత ప్రజల పక్షాన నిలిచి ఆధిపత్య అరాచక వర్గాలపై తిరగబడిన అక్షరాయుధాలు.ఈ  దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో జరుగుతున్న  దుర్మార్గాన్ని ఎదిరించడానికి
గళమెత్తిన కలం తాలూకు ధర్మాగ్రహం ఇది.
 యావత్ ప్రపంచాన్ని నివ్వెర పరిచిన నిర్భయ  ఘటన ఆ తర్వాత జరిగిన దిశ ఘటన.. అంతటితో ఆగకుండా  నిన్న మొన్నటి హథ్రాస్ దారుణం తెలంగాణ లోని నర్సమ్మ  సంఘటన ఇలా చెప్పుకుంటూ పోతే  దేశ వ్యాప్తంగా జరుగుతున్న అనేకానేక అత్యాచారాలు దాడులు మహిళలను మానవతా వాదులను  భయకంపితులను చేస్తుంటే
 ఇక  ఆడపిల్లలు మహిళల జీవితాలు ‘నిర్భయాకాశం కింద’ నిశ్చింతగా ఉండాలని కోరుకునే కవయిత్రి ఆశ  ఆకాంక్ష  ఇప్పట్లో తీరేనా..?
చర్విత చరణంగా జరుగుతున్న అత్యాచారాలపై వరంగల్ కవుల నిరసన కవిత్వాన్ని సేకరించి ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగ కూడదని “ఉద్విగ్న”  కవితా సంకలనాన్ని  తీసుకుని వచ్చిన కవయిత్రి అనిశెట్టి రజిత గారు ఆ తర్వాత జరిగిన సంఘటనలకు చలించి తీసుకుని వచ్చిన స్వీయ కవితా సంపుటి ‘ ‘నిర్భయాకాశం కింద’ . ఇందులో అరవై ఒక్క కవితలు ఉన్నాయి. 
 వీరు ఈ సంపుటిలో 1984 నుండి 1990, 2000 తర్వాత 2015 వరకు ఆయా సందర్భాలలో రాసిన కవితలను ఇందులో చేర్చానని  కవయిత్రి చెప్పారు.
ఇందులో కొన్ని అనువాద కవితలు కూడా ఉన్నాయి.
పై సంవత్సరాలలో జరిగినవన్నీ కూడా ఆయా ఉద్యమాలకు సంబంధించి కలచి వేసిన సందర్భాలు.
ప్రస్తుతం ఉన్న అభద్ర సమాజంలో కవులుగా రచయితలుగా, సామాజిక కార్యకర్తలుగా,ఉద్యమ కారులుగా కోరుకునేది ఒక్కటే మన అందరి తలల మీద నిర్భయాకాశాన్ని.. అందుకే ఈ కవిత సంపుటికి ఆ పేరు పెట్టానని అంటారు. 
ఇందులో మొదటి కవిత ” గులాబీలు జ్వలిస్తున్నాయి”. ఈ కవిత రాసిన కాలం 1984  నాటిదని..  కాత్యాయని విద్మహే గారు రాసిన ముందు మాట వలన తెలుస్తుంది. అప్పట్లో రజిత గారు తెచ్చిన తొలి చిరు కవితా సంపుటి లోనిది ఈ కవితలో..
చలింపజేసే సౌందర్యం తమ సొత్తని… చిదిమి వేయబడి అత్తరు కావడమే/ వాటి జీవిత ధ్యేయం కాబోలని/ అందరి వలె నేనూ భావించిన… తను అనుకున్న భావనలను వమ్ము చేసిన పూల గురించి చెబుతూ…
సహించుటయే తెలిసిన ఆ సొగసందనాలు/ నేడు దహించుక పోతూ/ జ్వలిస్తున్నాయి/ గులాబీలు విప్లవిస్తున్నాయి… అని ఎంత  సున్నితంగా ఉన్నా … ఆత్మాభిమానం దెబ్బ తినే సమయంలో  గులాబీల్లాంటి సుకుమార సుమాలు కూడా తిరగబడతాయనడానికి ప్రతీకగా రాసిన కవిత ఇది.
 ఆడపిల్ల జన్మించడం ఈ లోకంలోకి రావడం ఎవ్వరికీ ఇష్టం లేదు సరికదా దేవుళ్ళు సైతం .. ఈ సమయాన దేవుళ్ళంతా/ ఈ భూమ్మీది నుండి వలసబోయారు.. (Inside the Family) అనే ఆంగ్ల కవితా సంకలనం నుంచి తీసుకుని తెలుగులో అనువదించిన  కవిత ఇది.
ఇందులో చాలా కవితల్లో గేయ కవితా లక్షణాలు కనిపిస్తాయి. పాడుకోవడానికి అనుకూలంగా రాగ తాళ లయబద్ధంగా ఉన్నాయి.
 “కలం సైన్యం” అనే శీర్షికతో రాసిన కవితలో ఒక అందమైన దయతో గానయోగ్యంగా ఉంది.
కలాం సైన్యం కలాం సైన్యం వస్తూంది/ కలం గొంతుతో కొత్త పాటలే రాస్తుందీ/ అనే పల్లవి తో
అక్షరాలు కల్లెర్ర జేస్తూ/ 
భాష తాను బరిసై లేస్తూ/…
కళ్ళెర్ర చేస్తూ అక్షరాలు… విప్లవం వర్ధిల్లాలంటూ   రాసిన గేయం పాడిన గేయ కవితలో
ఈ ధిక్కరించిన కళం గళం .. ప్రజల చరిత్రకు ప్రాణం పోసి…
బుద్ది జీవులను,బూర్జువాలను… విదేశీ తొత్తులు వ్యాపారులను / ఎండ గడుతూ దుయ్య బడుతూ / దడదడ గడగడలాడించేందుకు కలాల సైన్యం వస్తుందని ఆ  సైన్యం సామాజిక బాధ్యత కలిగిన కవులు రచయితలదే.. ఈ కవిత ప్రతి ఒక్కరినీ ఉత్తేజ పరిచే  గేయ కవిత..
‘శతాబ్దాల శృంఖలాలు’ కవిత లో స్త్రీని బానిసకొక బానిసగా చేసి ఆమెకు పాతివ్రత్యాన్ని, సహనం,శాంతం ..అబలత్వం ,అర్పణం లాంటి శృంఖలాలు..
 కురుచ పాదాల కోసం పసిపిల్లల పాదాలు కట్టేసిన చైనీయులు, సతీ సహగమనం పేరుతో చనిపోయిన భర్తతో చితిలోకి తోసే  భారతీయులు,… అనేక రకాల పీడనలతో  వాడ బడుతున్న స్త్రీ.. తరతరాల సంకెళ్ళు ఛేదించుకోవాలని.స్వేచ్ఛా సమరానికి ఉద్యుక్తురాలు కావాలని..అసమానతను అంతం చేసే/ కదనరంగంలో కత్తి పట్టి కాలూనుతున్నది.. మహిళ తనను తాను చైతన్య పరచుకునేందుకు .. రాసిన ఉత్తేజ పూరిత కవిత… ఇందులో ఇంకా ఎంత కాలం పీడనాన్ని భరిస్తావనే ప్రశ్న ఉదయిస్తుంది..
కూలీ పని చేసే చెల్లెళ్ళు, వ్యవసాయ రైతు కూలీ  మహిళల దీనావస్థ గురించి, దిక్కూ మొక్కూ లేని వారి జీవితాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఊరూ అడవీ అందరిదీ ఊరుమ్మడి సొత్తని ‌… చెట్టూ చెరువులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పే గేయ కవిత..పాడుకునేందుకు అనుకూలంగా ఉంది.. మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎన్ని తెలివితేటలు ఉన్నా వంచనకు బలై పోతున్న స్థితి నుంచి..ఉద్యమ చరిత్ర గుర్తు చేసుకోవాలనీ.. హక్కుల పోరాటంలో చేయి కలిపి చరిత్ర తిరగరాసిన మహిళకు.. ‘ శతాబ్ది స్వేచ్ఛా గీతమైన ఓ మహిళా నీకు/ శతవందనాలు అర్పించెను ప్రపంచమే నేడు..అనే ప్రబోధాత్మకమైన ఈ కవిత గేయం మహిళలకు ఎంతో స్ఫూర్తి ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
“అమ్మ నీకు..” ఈ కవితలో అమ్మలందరిని పేరు పేరునా తలుస్తూ కూలి తల్లులకు దండమంటూ. అంటూ రాసిన ఈ గేయంలో.‌.మళ్ళీ జన్మ ఉంటే నేను/ నీకు తల్లిగ పుట్టుతాను /.. అమ్మ నీకు దండమే/ భారతమ్మ నీకు దండమే..  చదువుతుంటే ఆర్ద్రత తో కళ్ళు చెమ్మగిల్లుతాయి.
తెలంగాణ కోసం ఎవరెవరు  ప్రాణాలను పణంగా పెట్టారు..  వీరులను కన్న ఈ తెలంగాణ తల్లి గురించి చెబుతూ. పచ్చనీ ప్రాంతాన్ని జీవగడ్డగ జేయ/ ప్రాణ శక్తులు ధారబోయాలిరా . నేడు.. ‘జీవగడ్డగ చేయ’ కవితలో మన భాష మన దేవతలు , వీరుల గురించి రాసిన గేయ కవిత.’పాట పుట్టిన ఊరు ఉయ్యాలో” ఈ గేయ కవితలో ఉయ్యాలో అనే తూగుతో చక్కగా  బతుకమ్మ పాటలా పాడుకునే పాట . తెలంగాణలో కాకతీయుల కాలాన్ని , సమ్మక్క సారక్క పౌరుషం, చిట్యాల ఐలమ్మ ఆత్మాభిమానం, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, బమ్మెర పోతన..ఇలా వారి కాలం నుండి తెలంగాణా ఏర్పాటుకి కావలసిన తెగువను ఇచ్చిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ బతుకమ్మను తెలంగాణ వచ్చేలా దీవించమని కోరుకునే పాట..ఓ చారిత్రక గాధను అవసరానికి ముడిపెట్టి రాసిన ఈ పాట తెలంగాణ సాధనకు పోరాడుతున్న రోజుల్లో ఎంతో స్ఫూర్తి కలిగించింది.ఇలాంటిదే తెలంగాణ మార్చ్ కవిత. ఇలా ఎన్నో కవితాత్మకంగా వర్ణించిన గేయాలు ఇందులో ఉన్నాయి. ‘పాట పూచిన చెట్టు రా నా తెలంగాణ గట్టురా’,నరుడా వినరా “జై జై తెలంగాణ జై కొట్టు”అబ్బబ్బో సర్కరోడా’ లో తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి  చేస్తామని మోసం చేసి తెలంగాణను వల్లకాడుగా మార్చిన వలస వాదులపై ఇక తిరుగు బాటు తప్పదని రాసిన గేయం,  పూల కవాతుల జాతర అంటూ బతుకమ్మను కొలుస్తూ తెలంగాణ కోసం కదం తొక్కుతూ కవాతు చేస్తూ చేసిన పోరు గురించి,ఇలా ఇందులోని ప్రతి పాట మనసును కదిలించి అన్యాయాన్ని ఎదిరించడానికి ఎక్కుపెట్టిన తూటాలా ఉండటం…తెలంగాణా రావడం కోసం కవయిత్రి పడిన ఆరాటం,ఆర్తి ఇందులో కనబడతాయి. ‘మనిషిగా మారిపో’ కవితలో నీలో మృగం చావకుంటే /పుట్టగతులు నీకుండయి/ మనిషిగ మారకుంటే/ మనిషి ఉనికే అంతమవ్వును/  విర్ర వీగు మూర్ఖులారా..అతివ అస్త్ర ధారిణియై తిరగబడితే ఏమవుతుందో ఆలోచించి ‘మనిషిగా మారిపో’ అని హెచ్చరించారు. 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగే నష్టం అమాయకులైన అడవి బిడ్డల పచ్చని జవజీవ ఆవరణమనీ ..అడవి దుఃఖాన్ని గ్రహించకుండా అభివృద్ధి పేరిట చేస్తున్న మోసాన్ని వేలెత్తి చూపుతూ పోల వారం ఎవరికయ్యా వరం. అడవి బిడ్డను మాట్లాడుతున్నానంటూ పోల వరం ముంపు వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి
 రాసిన ఆరు కవితలు  ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసి  పాలకులపై ఆవేశాన్ని రగిలింప చేస్తాయి.
ఇందులో  చారిత్రక విషాద సంఘటనలు ప్రతి ఒక్కటీ కవయిత్రి కలంలోంచి  కవితా రూపం సంతరించుకొన్నాయి. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ పై మతోన్మాద శక్తుల దాడులు, అభ్యుదయ రచయితలు హేతువాదుల హత్యలు చూసి చలించి కలత చెందిన హృదయంతో ‘మళ్ళీ ఒక బొటన వేలు ‘ కవిత, సద్దాం హుస్సేన్ ను ఉరితీసిన ప్పుడు  “ఆ క్షణాలు” అనే కవితలతో పాటు చెరువులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ‘చెలిమి చెరువులు’ ఊరికి బతుకు చెరువు..అనే కవితల్లో ఆనాటి వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం చెరువులు ఎలా అయిపోయాయి.. వాటిని  పూడికలు తీసి పయిలంగ బంగారు/ ధాన్యాన్ని పండించుకుందాం’ అనే కవితలు కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. సాటి మనిషిగా నేనెప్పుడూ/ జనం మనమేనంటూ ప్రజా పోరునే/ నాదెప్పుడూ ఉద్యమాల కదనరంగమే..అని కవయిత్రి తానేంటో పాఠకులకు అర్థమవుతుంది.
“అవును మౌనాన్నే మాట్లాడుతున్నాను” ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ . శతాబ్ది గాయమైన నేను / పచ్చిగా మాట్లాడుతున్నా.. కన్నీట తడిపిన ప్రశ్నల్ని/ కత్తుల్లా సంధిస్తూ నిలదీస్తున్నాను/… బాష్పవాయువుల్ని ఢీకొనే/ నినాదాలుగా పేలుతున్నాను../.. పుట్టుకతోనే ఆయుధాలిమ్మని/ సృష్టిని వేడుకుంటున్నాను../ విప్లవించిన స్త్రీగా ఆయుధ ధారినై/ ప్రకటిత మవుతాను నేను…
 అవును అంతా మహా నిశ్శబ్దమైన వేళన/ మౌనాన్నే.. మాట్లాడుతున్నాను/ మరో ప్రపంచపు శంఖారావం చేస్తున్నాను.. ఎంతో  ఆవేశాన్ని జోడించి ఆవేదనతో రక్తం నూనెగా పోసి వెలిగించిన.. నిత్య గాయాల జ్యోతిగా మండుతూ/ ఉద్యమ భాషనై మాట్లాడుతున్నా.. అంటూ 2012లో జరిగిన నిర్భయ అత్యాచార ఘటనలో దేశమంతా వెల్లువెత్తిన నిరసన ఉద్యమంలో తానో ఉద్యమ ప్రతినిధిగా
రాసిన ఈ కవిత  మనసులను, మనుషులను కదిలించక మానదు..
 ‘నిలవ నీడలేని ఈ దేశంలో మహిళ ఆక్రందనను.. అనాది దేవతలుగా కొలువున్న దేశంలో ..మాతగా నాతిగా పూజలందుకున్న స్త్రీమూర్తులు, రాజ్యాలను ఏలిన రాణులు,సర్వ మానవాళినీ తన కుటుంబాన్ని/ రెక్కల గూటిలో పొదుముకుని/ కమ్మని ప్రేమలు పంచు/ పట్టుగొమ్మనైన అమ్మను…. స్త్రీని ఆటబొమ్మగా అంగట్లో సరుకుగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంటుంటే ఇక నిర్భయాకాశం ఎక్కడ ఉంది..ఎటు చూసినా అభద్రతతో  నిలువ నీడ లేని మహిళ ఆక్రందిస్తుంది… ‘నిర్భయాకాశం కింద ఆనందంగా బతికే రోజులు రావాలనీ ఆకాంక్షిస్తూ రాసిన కవితా శీర్షిక ను ఈ సంపుటికి   నిర్భయాకాశం కింద అనే పేరు పెట్టారు కవయిత్రి అనిశెట్టి రజిత గారు.
ఇందులో తెలంగాణ ఉద్యమం గురించి పదిహేడు కవితలు, అలాగే కాళోజీ గారి గురించి జజ్జెనకరె కాళన్నా,మనసు వెన్న కాళన్నా కవితల్లో కాళన్నా  అంతరంగాన్ని ఆవిష్కరించారు.అలాగే , పర్యావరణం పై,చిందు ఎల్లమ్మ పైన ప్రత్యేక కవిత‌. నిత్యావసర వస్తువులైన ఉల్లిగడ్డ, కందిపప్పు ధరలు పెరిగిన సందర్భాన్ని సామాన్యులకు అందకుండా
 కందిపప్పు ఎక్కిరించె, ఉల్లిగడ్డ ఉట్టికెక్కె కవితలు.. పాటకు సంకెళ్ళా..  అది వాళ్ళ తరం కాదంటూ పాటను చంపాలని చూసే రాజ్యం గట్టున చేప కాక తప్పదని హెచ్చరించారు.
ఇందులో ప్రతి కవితా  ఉద్యమానికి ఊపిరి పోసే అక్షర శరం..తన ముప్పై ఏళ్ల ఉద్యమ సాహిత్య ప్రయాణం ఇందులో కనిపిస్తుంది. ఇలాంటి ఉద్యమ కారులు వేసే మొదటి అడుగు వెనకాల వేల అడుగులు అనుసరించి ఉద్యమాన్ని తమ భుజాలపై ఎత్తుకుని విజయవంతం చేస్తాయి.. అందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ఉదాహరణగా చెప్పుకోవచ్చు..
కవిత్వం అనేక మంది అనేక కారణాలతో రాస్తారు కానీ ఉద్యమమే ఊపిరిగా జీవించి , సమాజంలో మంచి మార్పు కోసం తపించి రాసేవారు చాలా అరుదుగా కనిపిస్తారు.అందులో మొదటి స్థానంలో నిలిచిన కవయిత్రి అనిశెట్టి రజిత గారు. వారి కలం గళమై మరిన్ని సామాజిక అంశాలపై   నినదించాలని ధిక్కార స్వరమవ్వాలని..వారి  కోరుకుందాం.
 ఈ పుస్తక ప్రతుల కోసం నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్,నవ తెలంగాణ బుక్ హౌస్, అన్ని బ్రాంచీలు,నవ చేతన పబ్లిషింగ్ హౌస్ అన్ని బ్రాంచీలు, విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని బ్రాంచీలలో దొరుకుతాయి.


*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.