షర్మిలాం “తరంగం”

నో (వరస్ట్ ) కామెంట్స్ ప్లీజ్ !

-షర్మిల కోనేరు 


   ఇన్నాళ్ళూ మనకి తెలియని మనుషుల మనస్తత్వాలు ఇప్పుడు బయటపడుతున్నాయి .
ఫేస్బుక్ ,ట్విటర్ వంటివి రాక ముందు మూక మనస్తత్వం , ఈ గ్రూపులు కట్టడాలు అంతగా తెలిసేవి కాదు .
మనుషులు తమ మనస్తత్వాలను  పుస్తకంలో పరిచినట్టు పరిచేస్తుంటే అవి చదివి ఇలా కూడా అలోచిస్తారా అని బెంగ , బాధ , కోపం అన్నీ వస్తాయి .
నువ్విలా వుండకపోతే నిన్ను చీల్చి చండాడతాం అన్న నిరంకుశత్వాన్ని ప్రదర్శించే గ్రూపులు తయారయ్యాయి .
 ఇది జరిగి చాలాకాలమైంది .
ఒక కలెక్టర్ తెలంగాణాలో అనుకుంటాను దళితులను మీ ఆహారపు అలవాట్లు కొత్తగా మార్చుకోవద్దు … అనాదిగా మీరు తినే గొడ్డు మాసం తినండి అని ఒక సందర్భంలో సూచించాడు .
ఎందుకంటే అది చౌకగా లభించే ప్రొటీన్ కాబట్టి శ్రమ చేసుకునే వర్గాలకి శక్తినిస్తుందని అలా చెప్పాడు .
ఇక చూస్కోండి కొన్ని వర్గాలు చెలరేగిపోయి అతన్ని తిట్టడం మొదలెట్టాయి .
ఇదే ఫేస్బుక్ లో ఎవరో పెడితే నేనో కామెంట్ పెట్టాను .
” ఎవరి ఆహారపు అలవాట్లు వారివి .
అనాదిగా వారు దాన్ని తింటున్నారు .
ఇతర దేశాల్లో బీఫ్ తినడం చాలా మామూలు .
నేను కూడా ట్రై చేద్దామనుకున్నాను గానీ మా అమ్మ ఆవుకి పూజ చేస్తుంది కాబట్టి నేను తినలేదు ” అని పెట్టా .
దానికి ఉన్మాదం తార స్థాయికి చేరిన ఒక గ్రూప్ వ్యక్తి అనుచితంగా  ” నువ్వు అసలు ఒక అబ్బ కి …..” ఇలా ఏదో కూశాడు .
నేను చాలా శాంతంగా ” నా పూజనీయమైన అమ్మని నీచంగా అనడం ఎంత సబబో నీ విజ్ఞతకే వదిలేస్తున్నా ” అని పెట్టాను .
ఇంతే కాదు స్త్రీల ఉద్యమాల్లో పనిచేసే నా స్నేహితులు భయంకరమైన ట్రోలింగ్ కి గురవడం చూసి భయమేసింది .
నిజంగా అవన్నీ తట్టుకుంటున్నందుకు చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపించింది .
ముఖ్యంగా స్త్రీలను గురించి మాట్లాడాలంటే వారి కేరక్టర్ గురించి అవాకులు చవాకులు పేలడం అనాదిగా వున్నదే .
కానీ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చదువుతుంటే జుగుప్సతో కంపించిపోతాం.
ఇంతకీ వాళ్ళు  ఏం ఘోరం చేశారని ఈ అవమానాలు !.
భర్తను కన్నవారే హత్య చేయిస్తే ఆ యువతి తన అత్తింట్లో వున్నందుకు ఆమెని సోషల్ మీడియా వేదికగా తిడుతున్నారు .
ఆ స్త్రీ ఉద్యమకారిణులు దీనిని ఖండిస్తూ ఆమె బతుకు ఆమెని బతకనివ్వండంటూ ఆ యువతికి మద్దతు పలికారు .
అదే వీళ్ళు  భరించలేకపోయారు .
నోటికి వచ్చిన తిట్లతో , వ్యక్తిగత దూషణలతో కామెంట్స్ పెట్టారు .
ఒక వ్యక్తి ఆ ఉద్యమకారిణిని ఉద్దేశించి “నువ్వు ఇన్ని నెగటివ్ కామెంట్స్ చూసి కూడా ఇంకా చావలేదా !” అని పెట్టాడు .
అది చదివి నాకు అనిపించింది ఉద్యమాలు చేసేవారి బాట ఎంత ముళ్ళ మయం !
ఇల్లూ వాకిలీ వదిలి ధరలు పెరిగితే , మన బిడ్డలు అత్యాచారాలకు గురైతే , కట్నాల్ కోసం చంపేస్తే , నడి రోడ్డు మీద వదిలేస్తే ఎండనకా వాననకా రోడ్ల మీదికొచ్చి పోరాడుతున్నందుకు ప్రతిఫలం ఇదా .

పైగా ” ఆ …ఏదో డబ్బులు రాకపోతే ఇవన్నీ చేస్తారా !” అని దీర్ఘాలు తీయడం .
పోనీ ఆ డబ్బుల కోసం మీరెవరన్నా పోలీసు లాఠీదెబ్బలు తినండి …కేసుల పరిష్కారానికి తిండి తింటం కూడా మరిచి పోయి పోలీస్ స్టేషన్లలోనూ , ఊళ్ళ వెంబడి  తిరిగి చూడండి .
మీ అభిప్రాయాలు  మీకు వుండొచ్చు … కానీ ఇది వ్యక్తపరచడానికి సంస్కారవంతమైన భాష వుంది .
వాళ్ళూ మనుషులే …వాళ్ళకీ కుటుంబాలుంటాయి .
మీ వ్యాఖ్యలు ఎంతబాధిస్తాయి ?
” నీ మొగుడు నిన్ను ఊరి మీదకి వదిలేశాడే !”
ఇది ఆ వ్యాఖ్యల్లో తక్కువ రోత పుట్టించేది.
అంటే అలోచించండి ఇంకొన్ని ఎంత దారుణంగా వుండి వుంటాయో ?
కానీ ఇవేమీ లెక్క చేయకుండా మనో నిబ్బరంతో ముందుకు సాగుతున్న ఆ అమ్మలకు “శతకోటి ఎర్రెర్ర వందనాలు !”
( వందల కొద్దీ వచ్చిన బూతు వ్యాఖ్యలను చూసి చూడవే వీళ్ళు … అని నవ్వేసే నా ప్రియ నెచ్చెలి పీవోడబ్ల్యూ సంధ్యకు)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.