“నెచ్చెలి”మాట 

బీ గుడ్ – డూ గుడ్

-డా|| కె.గీత 

“బీ  గుడ్ – డూ గుడ్ ” 

మంచిగా ఉండడం- 

మంచి చెయ్యడం- 

వినడానికి ఎంత మంచిగా ఉందో 

పాటించడం అంత కష్టం కదా! 

పోనీండి!

ప్రతి రోజూ

ప్రతి క్షణం 

మంచి చెయ్యలేకపోయినా   

“ఎప్పుడో ఓసారి

అనుకోకుండా  

మనకు తెలియకుండానే చేసిన 

కాస్తో కూస్తో  మంచి కూడా 

ఏదో విధంగా  మనల్ని  తిరిగి కాపాడుతుంది!” 

వినడానికే కాదు 

పాటించడానిక్కూడా బావుంది కదూ! 

అవును 

మనం చేసే మంచే మనల్ని కాపాడుతుంది!

మనం చేసే చెడే మనకి కష్టాల్ని తెచ్చిపెడుతుంది!

ఇంకొంచెం క్లియర్ గా  చెప్పుకుంటే 

మనం చేసే మంచి మనకు విజయాల్ని తెచ్చిపెట్టకపోయినా 

మనం చేసే చెడే మనకి అపజయాల్ని  తెచ్చిపెడుతుంది!

అంతెందుకు 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 

డెమాక్రటిక్ పార్టీ గెలవడం వెనుక 

ఆ పార్టీ అభ్యర్థి గొప్పతనం ఉందా? 

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పట్ల 

వ్యతిరేకత ఉందా?

ఏమో దేవుడికెరుక అంటారా?

పోనీ 

ఆసియన్లకి పీకేల్దాకా కోపం తెప్పించిన

“చైనా వైరస్” వంటి ఎత్తిపొడుపు మాటలు-  

అక్రమ వలసల పేరుతో

గోడ కట్టించడంతో ఆగకుండా 

సౌత్ అమెరికన్లకి బాగా మంట తెప్పించిన

పిల్లల్ని, తలిదండ్రుల్ని  వేరు చెయ్యడం 

పసిపిల్లల్ని కూడా జైళ్లలో వెయ్యడం వంటి పన్లు –

పోనీ 

నిబంధనల కఠినతరం పేరుతో 

పొరబాట్న స్వదేశానికి వెళ్లిన మధ్యాసియా పౌరుల్ని 

వెనక్కి రానివ్వక పోనివ్వడం-

భారతీయుల వీసా కోటాలకి మొత్తానికే కళ్లేలు వెయ్యడం-

అన్నిటికంటే ముఖ్యంగా 

“బ్లాక్ లైవ్స్ మేటర్ “  అంటూ 

నెలల తరబడి 

రోడ్లపై నినదించాల్సిన 

పరిస్థితులు 

అసలే కోవిడ్ దెబ్బకి 

పెద్దపెట్టున నమోదవుతున్న మరణాలు

ఉద్యోగాల్లేక అల్లకల్లోలమవుతున్న జీవితాలు

ఒకటేమిటి

అన్ని వైపుల్నించి చుట్టుముట్టిన  

ఆగ్రహావేశాలన్నింటికీ  

కారణం  

“బీ  గుడ్ – డూ గుడ్”  అన్నది 

మర్చిపోవడమేనా? 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.