రాగో

భాగం-5

– సాధన 

పెద్ద బండను మీదికి దొబ్బినట్టె రాగోకు దిగ్గున తెలివైంది.

బండలు దొర్లిస్తున్నారు. గడ్డపారలతో బలంగా తవ్వుతున్నారు. గొడ్డళ్ళతో నరుకుతున్నారు. ఒకరూ, ఇద్దరూ కాదు. ఊరికి ఊరే మీద పడ్డట్టుంది. లోగొంతులో గుసగుసలుగా మాట్లాడుతున్నారు. ఆ అల్లరీ, హడావిడి అంతా దగ్గర్లోనే వినబడుతూంది.

లేచింది లేచినట్లే మద్ది చెట్టును పొదువుకుంది రాగో.

ఎవరై ఉంటారు? ఏమిటి అల్లరి? ఏం చేస్తున్నారు? తననే వేటాడుతున్నారా? తాను ఎక్కువ దూరం పరుగెత్తలేదా? దార్లోనే మొద్దు నిద్ర ముంచుకొచ్చేసిందా? ఇప్పుడు తన పుట్టి మునిగిందా? అనుకుంటూనే చెట్టు చాటు చేసుకొని ఆ అలికిడి దిక్కు కలియజూడసాగింది.

‘థాం! డాం’ అంటూ ఒకేసారి తుపాకులు పేలాయి. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపునే ఆ జనం పరుగులంకించుకున్నారు. తన వైపే ఉరికి వస్తున్న గుంపు కన్పించింది. మసక వెల్తురులో వాళ్ళు వేగంగా పరుగెడుతున్నారు. మొసతో ఉరుకుతూ తనని దాటిపోతున్నారు. వెనకబడిన స్త్రీలను – ‘సాండే సాండే’ (తొందరగా) అంటూ తొందరచేస్తూ బలంగా అడుగులు వేస్తున్న దాదలను స్పష్టంగా చూసింది రాగో..

తనకు తెలియకుండానే ఆ స్త్రీల వెనుకే పరిగెట్టింది రాగో కూడ.

వెనుక నుండి ఖాకీ డ్రస్సులు, అరుపులు, తిట్లూ గాలిలో దూసుకవస్తున్నాయి. గాలిలో కలసిపోతూ ఆ అరుపులు దూరమవుతుంటే అదేమీ పట్టించుకోకుండా గుంపు ముందుకురికింది. రాగో గుంపులో కలసింది. 

భళ్ళున తెల్లారింది. ఒకరికొకరు స్పష్టంగా పోల్చుకుంటున్నారు. కొత్త ముఖం కనపడేసరికి వెనక వచ్చే స్త్రీలు గతుక్కుమన్నారు. రాగో కూడా వారిని భయం భయంగానే చూస్తుంది. అంతా కొత్తే అయినా మాడియా అక్కలే కదా! అన్నట్టుంది. 

“దాదా! హే దాదా! రోమట్, రోమట్” (ఆగండి) అంటూ రాగో పక్కన నడుస్తున్న ఓ స్త్రీ ఠక్కున ఆగి ముందువాళ్ళను కేకేసింది.

 “కెమ్మెనే” (మెల్లగా) అంటూ మరో స్త్రీ వెనుదిరిగింది. మొత్తం గుంపు ఆగిపోయింది.

“ఇద్ బద్ బాయి! బగటదు అందు! బోన సంగె వాత్త!” (ఈమె ఎవరు? ఎక్కడిది? ఎవరితో వచ్చింది?) అంటూ రాగో ముఖం చూస్తూ ఒక్కసారే గడగడ ప్రశ్నలు వేసింది.

వాళ్ళ నాయకుడిక్కూడ రాగో ఎవరో తెలియడం లేదు. ‘తన వెంట వచ్చిన వాళ్ళలో ఈ ముఖం లేదే!” తనలో తాను అనుకుంటూనే ‘ఎక్కడైనా చూసి ఉంటారా’ అన్నట్టు ప్రశ్నార్థకంగా పక్కవాళ్ళ వంక చూశాడు. ఆయన ఆలోచనల్ని గమనించినట్టు మరో కంఠం “బద్నార్ నీవా” (ఏ వూరు నీది) అంటూ రాగోనే ప్రశ్నించింది.

రాగో బిత్తరపోయి నేల చూపులు చూడసాగింది.

“బాత పారల్ బాయి?” (ఏం పేరు) “వెహ బాయి” (చెప్పు అక్క) అంటూ మరో స్త్రీ బుదగరించినట్లడిగింది.

“రాగో” 

“కేర్దే బహ” – అన్నారెవరో గుంపులోనుండి.

“కల్ మట్” (నవ్వకండి) అంటూ గుంపు లీడర్ గట్టిగా అనేసరికి అందరు నిశ్శబ్దంగా ఉండిపోయారు.

“దట్! దట్! దాకడ! ఉసిరికీమట్” (పద, పద, పోదాం , ఆలస్యం చేయవద్దు) అంటూ ఆ గుంపులోని నడివయస్కుడు తొందర చేయసాగాడు.

“ఇంగో” అన్నారెవరో. గుంపు కదిలింది. 

రాగో కూడా వారితోనే నడుస్తుంది.

“బద్ నార్ అక్కా” (ఏ ఊరక్కా) అంటూ మాట కలిపిందొక స్త్రీ. ఏం చెప్పాలో తోచడం లేదు. తన సంగతంతా చెప్పితే ఎట్లా ఉంటుందో అనుమానం పీకుతుంది. పసుపు బట్టల రాగో వాలకం గుచ్చి గుచ్చి చూస్తూ ఆ పడుచు అడిగే ప్రశ్నల్ని తప్పించుకోవడం రాగోకి సాధ్యం కావడం లేదు.

“మా లోను వాంతినా” అన్న మరో పడుచు వైపు చూసి “ఇంగో” అంటూ రాగో ఆమె దగ్గరికి చేరింది. 

అందరూ వడివడిగా అడుగులు వేస్తున్నారు. నీళ్ళు కలసిన దగ్గర ఇన్ని మింగి మరిన్ని ముఖాలపై చల్లుకుంటున్నారు. కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి. ఎవరికీ నిద్రలేదన్నది వారి వాలకాన్ని బట్టి అర్థమవుతుంది. కొందరు నడుస్తూ నడుస్తూనే కూరుకుతున్నారు.

వాళ్ళ అందరి చేతుల్లో ఏదో ఒక ఆయుధం ఉంది. గొడ్డలి, బరిసె, పార, గునపంలతో పాటు కొందరి చేతుల్లో బర్మార్లు కూడా ఉన్నాయి. వాళ్ళెక్కడి నుంచి వస్తున్నారో, ఏం చేసి వస్తున్నారో రాగోకు అంతు చిక్కడం లేదు. రాగో ఇక ఉండబట్ట లేక తన్ను పిలుచుకున్న ‘రూపి’నే చిన్నగా కదిలించింది.

“బేకహంజి” (ఎక్కడి నుండి) అంటూ మెల్లగా అడిగింది. ఆవిడ పేరు “రూపి” అని తెలుసుకన్నా పేరు పెట్టి అడగడానికి ఇంకా ధైర్యం చేయలేదు.

తాము చేసిన పని గూర్చి మనసులోనే గొప్పగా మాట్లాడుకుంటున్న రూపికి రాగో ప్రశ్నతో కట్టలు తెగినట్టయింది. అంతే అడిగింది తడవుగా రూపి చకచకా రాగోతో పూసగుచ్చినట్లు అన్నీ చెప్పసాగింది. –

“ఊళ్ళల్ల పోలీసుల నిర్బంధం రోజు రోజుకు ఎక్కువైతుందనీ, జైల్లో పడ్డ మనోళ్ళని విడిపించుకోవాలనీ ఒక రోజు జిల్లా అంతా సంపు చేయాలనీ ‘దాదలు’ చెప్పిండ్రట. ముందటున్న ‘సీక్కల్’ దాద మాకు చెప్పిండు. చెట్లు నరకాలనీ, బొందలు తవ్వాలనీ, రోడ్డుమీద పోలీసుల జీపులు, కార్లు నడవకుండా చేయాలని అన్నాడు. ఇంటింటి నుండి అందరూ రావాలని గోటుల్ కాడ మీటింగ్ చేసి చెప్పిండు. ఎవల హతియార (ఆయుధం) వాళ్ళే తెచ్చుకోవాలన్నాడు. ఇయ్యాల మన జిల్లా గడచురోలి అంతా ఎక్కడికక్కడే అన్ని పనులు బందు పెడుతున్నారని చెప్పితే మేం కూడా మా ఊళ్ళె ‘పోల్వ’ తీరు చేసి పనికి ఎవరం పోలేదు. సీరని వెంబడి బర్మార్ పట్టుకున్నాడు మా అన్న. వాళ్ళు రోడ్డు మీద పోలీసులు రాకుండా సెంట్రీ చేస్తుంటే ఒక్కసారే థాం, ం అంటూ బర్మార్లు కొట్టి ఊరికి వచ్చి మమ్మల్ని హుషారు చేయంగానే ఇక మేమందరం ఎగపడ్డం” అంటూ కిల్లరకిల్లర నవ్వసాగింది.

మాటలు కలవడంతో మనసులోని రంధి వెనక్కిపోయి రాగో కూడా నవ్వులో కలసింది.

“కెమ్మెన్ డీ” (మెల్లగనే) అంటూ ముందున్న వారెవరో బిగ్గరగా అనడంతో రూపి-రాగోలు గమ్మునయిపోయారు.

అందరూ ఆగిపోయారు. ఎక్కడివాళ్ళక్కడే చెట్ల వెనక నిల్చుండిపోయారు. అలికిడి లేకుండా పరీక్షగా ముందుకి చూస్తున్నారు. ఎదురుగా ఉన్న పొలాల్లోనుండి ఇద్దరు స్త్రీలు వచ్చి సీర్కల్ తో ఏదో గుసగుసగా చెప్పారు.

“కామ్రేడ్స్! మా ఊరికి ఇప్పటికీ పోలీసులు ఎవరూ రాలేదట. మేము ఇక్కడ ఆగుతున్నాం. మీరు మీ మీ ఊళ్ళల్లకు పోండి. హుషారుగానే పోవాలి. అడవిలనే పోవాలెగానీ సడకు పట్టవద్దు. ఊళ్ళెకు పోయేముందు మంచి చెడ్డ అడిగి ఊళ్ళెకు చొర్రాలిగానీ ఎకాఎకి పోకుండ్రి. నేను అటెనుక కలుస్తా” అంటూ బిగిసిన పిడికిలి లేపడంతో అందరూ ప్రతిగా ‘లాల్ సలాం’ చెప్పి కదిలారు.

“బద్ నార్ బాయి” అంటూ రాగో అడగడంతో “మోరు స్కే” అని రూపి బదులు చెప్పింది.

“బద్ పట్టి అక్కా” అంటూ ఎన్నడూ వినని కొత్త ఊరు గూర్చి అనుమానంగా అడిగింది.

‘సూరాఘడ్ పట్టీ” అంటూ బదులు ఇచ్చిన రూపి తమ ఊరు మర్కనార్ మరో మైలు దూరంలో ఉన్నట్టు చెప్పింది.

* * *

రూపి ఇంట్లో తనకేమి లోటు లేకపోయినా ఎందుకోగాని విడిగా ఉండాలనే మనసు కోరుకుంది. ‘విడిగా ఉంటేనేం. రూపిని విడిచే ప్రసక్తే లేదుగా’ అన్న ధైర్యంతో తన వంట తాను చేసుకుంటూ కూలినాలి చేస్తూ విడిగా ఉంటూనే కాలం వెళ్ళబుచ్చుతుంది రాగో. రూపి తనకు వచ్చిన పాటలన్నీ రాగోతో పాడిస్తుంది. తను విన్న మాటలన్నీ గుర్తున్న మేరకు రాగోతో అనిపిస్తుంది. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం గట్టిపడుతూ తెలియకుండానే ఇరవై రోజులు గడిచిపోయాయి. గతాన్ని తవ్వి తీసే బాపతు ఎవ్వరూ తారసపడకపోవడంతో రూపి ఉన్నంతవరకు భయపడాల్సిన అవసరం రాదనే ధీమాతో రాగో క్రమంగా కలతదీరి బతుకు మీద భరోసా పెంచుకుంది.

అపుడపుడు సీర్కల్ కూడ వచ్చి మీటింగ్ పెట్టిపోవడం మరింత ధైర్యం పెరగడానికి ఉపయోగపడుతుంది.

వంట పనిలో మునిగిపోయి కూనిరాగాలు తీస్తున్న రాగో, రూపి పిలుపుతో ఒక్కసారే తేరుకుని “బాతల్” అంది.

“పక్కూల్లో పంచాయితి ఉందట. సీర్క దాద రమ్మని చెప్పిండు పోదాం. జెల్డి బువ్వదిను” అంటూనే తుర్రుమన్న రూపి మాట విని రాగో సంబరపడింది. త్వరత్వరగా పనులు ముగించుకొని అన్నం తినేసి రాగో రూపి వద్దకు పోయింది.

“వాత్తినా అక్కా” (వచ్చినవా అక్కా) అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన సీర్క దాద చనువుగా పలకరించాడు.

“ఇంగో! ” రాగో.

“హూడా అక్కా! (చూడు అక్కా) మనం ఒక్క వారం రోజులు ఈ చుట్టుపక్కల ఊర్లు తిరిగి సంఘం మీటింగ్లు పెట్టి జంగ్లాతుసంపు (సమ్మె) గూర్చి ప్రచారం చెయ్యాలని ‘దాదలు’ చెప్పంపారు. మాతోపాటు నువు రాగలవా” అంటూ తను వచ్చిన పనేదో చెప్పి “రూపి కూడ మనతోనే ఉంటది” అనడంతో రాగో ధైర్యంగా “ఇంగో” అన్నది.

ఊరూరు తిరగడం, పాటలు పాడటం, మీటింగ్లు పెట్టడం ఊరి వాళ్ళ పంచాయితీలు తపా చేయడం, గోడలకు కాగితాలు అంటించడం, ఆ కాయితాల్లో ఉన్నది వినిపించడం మొదలైన పనులతో పొద్దు తెలియకుండానే వారం రోజులూ ఒక్క రోజులో గడచినట్టయ్యింది. రాగోలో నూతన ఉత్సాహం మరింత పెరగసాగింది.

రాగో ఉంటున్న ఇంటావిడ సహజంగానే రాగో హుషారైన పిల్ల అని అర్థమై సంబరపడసాగింది. రూపితో స్నేహం చేస్తూ చలాకిగా తిరుగుతున్నందుకు మరీ సంతోషించింది. తనకు కూడ ఇంట్లో చిన్న పనికి, పెద్ద పనికి ఆసరా అవుతుంది. ఈడుమీద ఉన్న పిల్ల. అన్నీ బాగున్నాయి కానీ రూపితో పాటు సంఘం, సంఘం అంటూ తిరగడమే ఆవిడకు నచ్చనిది. అయినా తన మరిదికి సరిపోతుంది. వాడికి అంటగడితే ఏ చిక్కూ ఉండదు. ఊరూరా తిరిగే తిప్పలు తప్పుతుంది అని మనసులో పొద్దస్తమానం గింజుకొని చివరకు ఒకనాడు ఉండబట్టలేక ఆవిడ రాగోనే అడిగేసింది.

అంతే! రాగో ఇల్లు ఖాళీ చేసి మరో చోట మఖాం ఏర్పాటు చేసుకుంది. మరోసారి అలాంటి పిచ్చి మాటలు ఎత్తితే రూపక్కకు సీర్క దాదకు చెప్పి పంచాయితీ చేయిస్తానని బెదిరించడంతో ఆ తల్లి దవడలు దగ్గరపడ్డాయి.

రాగో ఆ ఊరు వచ్చి రెండు నెలలయింది. ఏ నోట విన్నా ‘దాదలు, దాదలు’ అంటూ ప్రతిదాన్లో అన్నల వూసే వింటున్నది తప్ప ఇంతవరకూ వారిని చూడలేదు. ఏ పని చేసినా అన్నలని చూడాలన్న ఆతురత వెంటాడుతూ ఉండేది.

చేతిలో కుండతో నీళ్ళకు పోయిన రాగోకు ఎదురుగా పెద్ద గుంపు రావడంతో ఆశ్చర్యమేసి, ‘ఎవరబ్బా’ అనుకుంటూ కుండ అక్కడే వదిలేసి రూప దగ్గరికి దౌడు తీసింది.

“రూపి! ఏయ్ రూపి” – రాగో. 

“ఇంగోరి! బాత కల్ల” (ఏమే ఏమల్లరి) – రూపి.

“శీర్క దాదల్, ఇంకా చాలామంది కలసి ఎవరినో కొడుతున్నారు. గోటుల్ దిక్కు కొంటపోతున్నరు. నడువు, నడువు. నేను పోతున్నా” అంటూ రాగో హడావిడిగా వచ్చినట్లే వెళ్ళిపోయింది. 

గుపికీ, గుపికి గుద్దులు, తన్నులు గుతపలు నాట్యమాడుతున్నాయి. పిల్లా, పెద్ద అంతా కలసి 50-60 వరకు ఉన్నారు. మోరుస్కీ వాళ్ళు కూడ వచ్చిండ్రు అని గుర్తించింది రాగో. ఆ తన్నులు తింటున్న వాడెవడో చూడడానికి చుట్టు చుట్టు తిరిగినా సందు లేకుండా ఉంది. గుంపులో నుండి ఎవరో “ఉదట్”, “ఉదట్” (కూచోండి) అంటూ ఎంత గోల చేస్తున్నా పట్టించుకోకపోవడంతో చివరికి సీర్క దాద ఒక్కొక్కరి రెట్ట పట్టి కూచుండబెట్టాడు. అల్లరి సద్దుమణగసాగింది. 

“హమ్మయ్య” అంటూ మొస తీసుకున్న రాగో గుంపు నడుమ నిల్చొని తన్నులు తింటున్న వాడిని చూసేసరికి వాడి పక్కనే చేతిలో గుతపతో రూపి అక్కడ ప్రత్యక్షమయింది. “అమ్మ దొంగ ఇదెప్పుడు చేరిపోయింది?” అంటూ ఒక్క ఉదుటున ఉరికి రూపి చేతిలోని కర్ర పుచ్చుకుంది రాగో.

“కామ్రేడ్స్!” అంటూ సీక్క విషయం మొదలు పెట్టాడు.

“వీడు జంలోడు! గార్డు. మనం సమ్మె చేసుడు వీనికి గిడ్తలేదు. వీడు అక్కడ మనతో ఉన్నట్టే ఉంటూ అన్నీ రేంజరకు అంటిస్తున్నాడు. చిట్టీలు రాసి పోలీసులకు పంపిస్తున్నాడు. సంఘపోల్లను పట్టిస్తానని కూడ అంటున్నాడట. ఇవన్నీ మనకు తెల్సినయ్. ఈ బద్మాష్ గాన్ని ఏం చేద్దాం! చెప్పండి” అంటూ అందరినీ అడిగి రూప, రాగోల దిక్కు చూసాడు సీర.

“హౌకట్! నైదున్” (చంపండి కుక్కను) అంటూ రాగో కర్ర లేపింది.

“మన్-మన్” (ఆగాగు) రూపి వారించింది.

“వీడు మన గొట్టోడే. బుద్ధి గడ్డి తిని గాడ్డి గొడుకు జంగలోని నౌకరి చేస్తుండు. మొత్తుకుంటే వినకపాయె. పోలీసు నౌఖరి, జంగంలోని నౌఖరి వద్దు బిడ్డా అంటే ఈ పోరగాండ్లు పట్టించుకోరు. మన కంట్లే మన వేలు పెట్టుడు మంచిది గాదురా అంటే సదువుకున్నోడెవ్వడూ తెడ్డా మీ ముసలోల్ల మాట ఇనేది అని ఎనుక ముందు సూడకుండ పోయి పుస్స పుస్స భర్తీ కాబట్రి. సావనీ లంజకొడుకులు” అంటూ ఓ ముసలి పెద్దమనిషి కోపంతో చేతికర్రను నేలకేసి గట్టిగా పొడిచాడు.

“ఈ తూకు (ఈసారి) ఇడిసిపెట్టి సర్కార్ పంచన పోనని ముక్కు భూమికి రాయిస్తే సరి” అంటూనే ‘ఈ సర్కార్ లంజకొడుకులు కూడ ఇంకే నౌకరి లేనట్టు మా మాడియోల్లందరిని గీటికీ పిల్వబట్టిరి. నీ అక్క. బుడ్డ హౌకిరి” అంటూ అటు విరుచుకుపడ్డాడు.

అక్కడున్న వారందరూ ఆ ముసలాయన తీర్పుకు “ఇంగో” అన్నారు. సీక్క తో పాటు రాగో, రూపలు ముందు నిలబడి ఆ తీర్పు అమలుచేశారు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.