వెనుతిరగని వెన్నెల(భాగం-18)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-18)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన సంవత్సరం లోనే అబ్బాయి పుడతాడు.

***

అడ్మిషను హాలు నించి తమ ఇంటి వైపున్న యూనివర్శిటీ గేటు వరకూ దాదాపు పదిహేను నిమిషాల పాటు నడవాలి. అక్కణ్ణించి బాబుని తీసుకొచ్చుకోవడానికి మరో పదిహేను నిమిషాలు.

బాబు నిద్రలేచేలోగా ఇంటికి వెళ్లగలనో, లేదో.” తన్మయి మనసులో ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి

మాటిమాటికీ గడియారం వైపు చూసుకుంటున్న తన్మయి వైపు చూస్తూఏదైనా ప్రాబ్లమా?” అనడిగేడు కరుణ.

లేదండి నేనర్జంటుగా ఇంటికి వెళ్లాలి. ఇప్పటికే ఆలస్యమైంది. థాంక్సండీ, యూనివర్శిటీ లో ఎక్కడేమున్నాయో.. ఎన్నో విషయాలు చెప్పేరు.” అంది తన్మయి.

ఎక్కడుంటారు మీరు? ” అన్నాడు.

సందేహిస్తున్న తన్మయితోమీకభ్యంతరం లేకపోతే చెప్పండి, ఏం లేదు మీకు దగ్గిర దారి చెబ్దామనిఅన్నాడు.

తన్మయి సమాధానం విని, “ఏవిటీ పెద్ద బంగళానా?” అని ఆశ్చర్యంగా నవ్వేడు.

అతనంతగా ఎందుకు ఆశ్చర్యపోతున్నాడో అర్థం కాలేదు. అదే అడిగింది.

చూసేరా? ప్రపంచంలో ఎన్ని వింతలున్నాయో! మీ ఇంటినానుకుని ఉన్న ఒక పెద్ద గోడనెప్పుడైనా చూసేరా?” అన్నాడు.

అవునన్నట్లు తలాడించింది. బంగళా వీధికి చివర ఉంటుంది. దానినానుకుని ఉన్న పెద్ద గోడ, ఒక మూలగా ఉన్న చిన్న గేటు, అందులో నుంచి ఏపుగా పెరిగిన గడ్డి మాత్రమే కనిపిస్తుంటాయి.

అదే మా హాస్టలుఅన్నాడు నవ్వుతూ.

అది యూనివర్శిటీ హాస్టలా? మరి గడ్డీ, అదీ ….” సందేహంగా అంటున్న తన్మయి మాటలకు అడ్డువచ్చి

ఏదో పాడుబడ్డ ప్రదేశంలా ఉంటుంది కదూ, అది హాస్టలే కానీ  ప్రైవేటు హాస్టలు. యూనివర్శీటీ హాస్టళ్లలో సీటు రావాలంటే కావాల్సిన  రిజర్వేషన్లు ఏవీ లేని దౌర్భ్యాగ్యుణ్ణి.” అన్నాడు.

తన్మయి ముఖంలో ఆలోచన చూసిఏదోలెండి, తలదాచుకుందుకి ఇంత చోటు, అంతే. అందుకే రోజంతా లైబ్రరీలలో గడుపుతాను. మీకు పుస్తకం కావాలన్నా నాకు చెప్పండి. తెచ్చి పెడతాను. అన్నట్లు మీరు త్వరగా ఇంటికి వెళ్లాలంటే దగ్గిర దారేమీ లేదు. ఆటో ఎక్కడం తప్ప. బస్సులో వెళ్లినా మళ్లీ సగం దూరం నడవాల్సిందే కదా!” అని వెళ్లొస్తానన్నట్లు నమస్కరించేడు.

తన్మయి కూడా ప్రతి నమస్కారం చేసి, “సరేనండీ, మళ్లీ తరగతులు ప్రారంభం అయ్యేక కలుద్దాంఅంది.

——-

గబగబా నడవడం వల్ల చెమట్లు ధారాపాతంగా కారసాగేయి తన్మయికి

విశాఖపట్నంలో, అందునా యూనివర్శిటీ చుట్టుపక్కల ఒక చోటి నించి ఒక చోటికి వెళ్లాలంటే దూరాలు తక్కువైనా విపరీతంగా అలసట వస్తుంది. దాదాపు ప్రతీ రోడ్డు కొండ ఎక్కడమో, దిగడమో అయి ఉంటుంది.

యూనివర్శిటీ ఎత్తున ఉన్నందువల్ల చుట్టుపక్కల వీథులన్నీ దిగువకి. కిందికి సముద్రం వరకూ విస్తరించి ఉంటాయి

సముద్రం తాలూకు తేమగాలిలో ముఖం ఎప్పుడూ జిడ్డోడుతూనే ఉంటుంది

చీర చెంగుతో ముఖం తుడుచుకుంటూ, పరుగులాంటి నడకతో బాబు దగ్గిరికి వచ్చి పడింది తన్మయి.

వచ్చేవా అమ్మా, ఇడిగో మీ అబ్బాయి. ఇందాకట్నించి ఏడుస్తూంటే సముదాయించలేకపోతున్నానుకో.”  అంది శేఖర్ పిన్ని.

పైకి ముఖాన నవ్వు పులుముకున్నా స్వరంలో వెనక వినిపిస్తున్న విసుగుని ఇట్టే పసిగట్టింది తన్మయి.

బాబుని చంకనేసుకుని, వాడి సంచీ, తన పర్సు భుజాన తగిలించుకుని మాడే ఎండలో ఇంటికి తిరిగి వచ్చింది.

ఉదయమెప్పుడో కాస్త వేపుడు జావ తిని బయలుదేరింది.

విపరీతంగా ఆకలేస్తూంది. కానీ పిల్లాడు అంత కంటే ఆకలితో ఉన్నట్లు ఎత్తుకుంటే భుజం చీకుతున్నాడు

బాబుని పక్కనేసుకుని పాలిస్తూ నిస్త్రాణగా పక్క మీద కూలిపోయింది.

కడుపు నిండిన చిరునవ్వుతో వాడు అయిదే నిమిషాల్లో ఆట మొదలు పెట్టేడు.

బొజ్జ నిండిపోగానే పాలు చీకడం ఆపి, అమ్మ ముఖంలోకి చూసి నవ్వడం, మళ్లీ చీకడం మొదలు పెడతాడు.

అమ్మ దొంగా, అప్పుడే బొజ్జలు నిండిపోయాయా? ఆటలు మొదలు పెట్టేవు?” అని మురిపెంగా తల నిమిరింది తన్మయి.

అమ్మ ఇవేళ యూనివర్శిటీ లో జాయినయ్యిందిరా కన్నా, నువ్వు నాకు సాయం చెయ్యాలి గానీ, ఇలా పేచీ పెడితే ఎలా చెప్పు?” అంది వాడి చిన్ని అందమైన నల్లని కళ్లల్లోకి చూస్తూ.

సమాధానంగా కేరింతలు కొడుతూ…” అన్నాడు బాబు.

లేచి వంట చేసుకునే ఓపిక లేదు తన్మయికి. పైగా ఇంట్లో కూరగాయలేవీ లేవు, ఉల్లిపాయలు తప్ప

శేఖర్ సాయంత్రం వచ్చేసరికి ఏం వండాలో!” అనుకుంటూ  పొద్దున్న మిగిలి జావలో కాస్త మజ్జిగ పోసుకుని తిని, కడుపు నింపుకుంది.

సాయంత్రం బయట కాస్త చల్లబడగానే చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని ,చూపురు తీసుకుని బయటకు వచ్చింది

వరండా లో చాప పరిచి బొంత వేసి బాబుని పడుకోబెట్టింది

ముందు రోజే తుడిచినా, దారంతా పరుచుకున్న ఆకులనూ, రాలిన పూలనూ తుడిచి పోగులు పెట్టింది.

మధ్య మధ్య బాబు వైపు చూస్తూ ఉంది

ఉన్నట్టుండి బాబు బోర్లా పడి మూలుగుతుండడం చూసి ఒక్క పరుగున వచ్చి వెనక్కు తిప్పింది.

అరే నాన్నా, నీకు వెనక్కు తిరగడం వచ్చేసిందేవిట్రా?” అంటూ లేవదీసి ముద్దులు కురిపించింది.

బోర్లా పడితే బొబ్బట్లు, పాకడం వస్తే పాకం గారెలు, కూర్చోవడం వస్తే…” అన్నీ పంచిపెట్టాలిరా కన్నా.

అమ్మమ్మకి విషయం చెప్పాలి. ఫోను చేసొద్దామా?”  అంది నవ్వుతూ.

ఇది వరకు ఉన్న ఇంటిలాగా వీథి మొదట్లో శ్ట్డ్ బూత్ లేదిక్కడ. ఏం చేద్దాం మరి?” అంది సాలోచనగా కేరింతలు కొడ్తున్న బాబుతో.

శేఖర్ సాయంత్రం వస్తూనే చాలా చికాగ్గా కనిపించాడు. తన్మయి మనస్సంతా పొద్దుట్నించీ జరిగినవన్నీ శేఖర్తో  పంచుకోవాలని ఉవ్విళ్లూరుతూంది. కానీ అతను బయటి నించి ఇలా చికాకుతో వచ్చినపుడు ఇటువంటివి ఏకరువు పెడితే మరింత విసుక్కుంటాడు

బాబుని ఉయ్యాలలో వేసి, బయట వరండాలో కొచ్చి చాప మీద చతికిలబడింది. చీకట్లో ఆకాశం లో మిణుకు మిణుకు మనే అందాల నక్షత్రాలు, చూడచక్కని తదియ నాటి చంద్ర రేఖ.

చల్లగా ఆహ్లాదంగా వీస్తున్న గాలికి లతలుగా అల్లుకున్న తీగెలు అలల్లాగా కదులుతున్నాయి.

ఔట్ హౌస్ గేటు నించి వెనక్కి తిరిగి ఉండడం వల్ల బయటి వాళ్లెవరూ ఇక్కడికి కనిపించరు. ఇంటి వాళ్లకి  కూడా కనిపించదు ఔట్ హౌస్ ముఖ ద్వారం. “ ఇల్లు భలే ప్రత్యేకంగా, అందంగా, ఆహ్లాదంగా ఉంది నా మనస్సుకి సరిపడినట్లు.” అనుకుంది తన్మయి.

అన్నం పెట్టేదుందా, లేదా?” అన్న గద్దింపుకి లోకంలోకి వచ్చిపడింది.

ఏమైంది?” అంది మెల్లగా అతని ముఖంలో ఇంకా చిరాకు తాండవించడం చూస్తూ.

ఆడదానివి, నీకేం అర్థమవుతాయి నా ఉద్యోగం బాధలు?” అనిఅవునూ, ఉదయం యూనివర్శిటీ నించి ఎప్పుడొచ్చేవు?” అన్నాడు

కొంచెం ఆలస్యమే అయ్యిందిఅంది.

నీకు మొదటే చెప్పేను. మా పిన్ని ఏదో పుణ్యానికి చూసి పెడతాదని. నువ్విలా ఆలస్యాలు చేసేవనుకో. చదువు వద్దు, చట్టుబండలు వద్దు. శుభ్రంగా ఇంట్లో పిల్లోణ్ణి చూసుకో చాలు. అయినా నీకెందుకే చదువు? ఒక ఇంగ్లీషు వాక్యం మాట్లాడడం రాదుఅన్నాడు.

నాకు ఇంగ్లీషు మాట్లాడడం రాదని నీకు చెప్పేనా? అసలెప్పుడైనా విన్నావా నేను మాట్లాడేటప్పుడు?” అంది చటుక్కున ఉక్రోషంగా తన్మయి.

నువ్వా? ఇంగ్లీషులోనా? నీ పల్లెటూరి ఇంగ్లీషూ ఇంగ్లీషే! మన ఇంటిగల ఓనరమ్మ మాట్లాడుతాది మరి, ఎదుటోళ్లు అర్థం చేసుకోలేనంత స్పీడుగా, దొరల ఇంగ్లీషులాగా మాట్లాడుతాది. పొరబాటున ఎప్పుడేనా నీ ఇంగ్లీషు పాడిత్యం చూపించేవు గనక. నవ్వుతారు అందరూఅన్నాడు వ్యంగ్యంగా.

తన్మయికి బాధ కళ్లల్లోకి తన్నుకు వచ్చింది

మొదలెట్టేవా శనిగొట్టు ఏడుపు? నీ దరిద్రపు ముఖం చూడడం కంటే సెకండ్షో సినిమాకి పోవడం నయం. తలుపేసుకో.” అని విసురుగా వెళ్లిపోతున్న శేఖర్ వైపు నిస్తేజంగా చూస్తూ ఉండిపోయింది.

యూనివర్శిటీ లో ఇన్ కమ్ సర్టిఫికేటు పెడితే ఫీజు తగ్గింపు ఉంటుందని చెప్పేరు ఆఫీసు వాళ్లు. దానికి కేస్ట్ సర్టిఫికేటు చేరిస్తే ఇంకా మంచిదట.

ఎలాగూ లక్ష్మిని కూడా కలిసి రావాలి. రెండు పన్లూ చక్కబెట్టుకుంటే సరి. బయటికి వెళ్దాం వస్తావా కన్నాఅంది బాబుతో తన్మయి.

శేఖర్ కేంపుకెళ్లేడు

పొద్దున్నే కాస్త వండుకు తిని బాబునెత్తుకుని బయట పడింది.

వీధి చివరకి రాకుండానే ఆటో ఎదురుపడింది. ఎక్కి కూచుని అడ్రసు చెప్పింది.

అమ్మ ఇచ్చిన బట్టల డబ్బుల్లో ఇంకా రెండు వందలే మిగిలాయిలోపల్లోపల అనుకుంది పర్సులో చెయ్యి పెట్టి.

కరెంటు బిల్లు, పాత కాస్ట్ సర్టిఫికేటు లాంటివి పర్సులో మడతబెట్టి పెట్టుకుంది.

తామున్న ఏరియా రెవెన్యూ కేంద్రానికి వెళ్లింది.

వాళ్లిచ్చిన ఫారాలు పూర్తు చేసి, తెచ్చిన కాగితాలు జెరాక్సు తీయించి క్లర్కుకి ఇచ్చింది. ఇదంతా కనీసం మూడు గంటలు పట్టింది. ద్వారం దగ్గర డబ్బులిమ్మని అటెండరు వెనకే వచ్చేడు

ఇప్పటిదాకా చంటి పిల్లాడితో నానా కష్టాలూ పడి లైనులో నిలబడ్డప్పడు కనీసం మంచినీళ్లు తాగడానికి వెళ్లలేక ఎంతో ఇబ్బంది పడింది. అప్పుడీ అటెండరు ఏమయ్యేడో!

వరండా మెట్లు దిగుతూనే కనబడ్డ బల్ల మీద కూలబడి పది రూపాయలు బయటికి తీసి ఇచ్చింది. “ఇదేంటమ్మా, బొత్తిగా. మీకు ఇన్ కమ్  సర్టిఫికేటు వస్తే ఫీజులన్నీ మిగులే కదాఅన్నాడు నీళ్లు నములుతూ.

ఇక లేవు మరి నా దగ్గిరఅంది చెమట తుడుచుకుంటూ.

ఒళ్లో పిల్లోడి వైపు చూస్తూ  “పదికి పాలసీసా అయినా వస్తందా?” అని గొణుక్కుంటూ నోటు తీసుకుని వెళ్లిపోయేడు.

మరో పదిహేను రోజుల తర్వాత కనబడమన్నారు. అప్పటికి మళ్లీ చార్జీలుండొద్దూ? ఏం నాన్నా, నువ్వే చెప్పు.” అంది బాబు తల నిమురుతూ.

వాడి చిక్కటి తల వెండ్రుకల్లో చెమట పట్టేసింది. “అయ్యో, చెమట్లు పట్టేసేయిరా నాన్నా.”  అని భుజానేసుకుని కాస్త నీడున్న చోట మరో చోట కూలబడి, పాలసీసాలో పోసి తెచ్చిన నీళ్లు పట్టించింది.

అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. అక్కణ్ణించి పదిహేను నిమిషాలు నడిచి, బస్సు స్టాండుకి చేరుకుంది

కట్టుకున్న పాలిష్టరు మిక్సు చీర కొంగు తీసి పిల్లాడి తలమీదుగా కప్పింది.

బస్సు దిగి కొండ మీద ఉన్న పాతింటి వైపు అడుగులేసింది. వీధి చివర శ్ట్డ్ అతను పలకరింపుగా నవ్విబావున్నారా?” అన్నాడు.

ఇంటి బయట స్టీలు గిన్నెలు బేరమాడుతున్న లక్ష్మి దూరం నించి తన్మయిని చూస్తునే పరుగెత్తుకొచ్చింది.

చంకలో పిల్లాణ్ణి చేతుల్లోకి తీసుకునిఅమ్మో, ఎంత ముద్దుగా ఉన్నాడో తల్లీ నీ కొడుకుఅంది ఆనందంగా.

అప్పటికప్పుడు పోపులు  వేయించి, కొబ్బరి పచ్చడి రుబ్బడానికి సిద్ధపడ్తున్న లక్ష్మిని వారిస్తూవీడు కడుపులో ఉన్నప్పుడు తినాలనిపించిన కోరికలేవీ ఇప్పుడు లేవు. మీకు శ్రమ దేనికి?” అంది తన్మయి.

శ్రమేవిటి తన్మయీ! అప్పుడు నీ కొడుకు కోసం, ఇప్పుడు నీ కోసంఅంది.

భోజనాలయ్యేకమేమిక్కడే ఉంటే ఎంత బావుండేది! నేనిప్పుడు యూనివర్శిటీకి వెళ్లాలంటే పెద్ద సమస్య తయారయ్యింది. వీణ్ణి  చూసి పెట్టే వాళ్లు లేరు.” అంది తన్మయి.

వీలు లేకుండా చేసేడుగా మీ ఆయనఅంది లక్ష్మి.

ప్రశ్నార్థకంగా చూస్తున్న తన్మయి దగ్గిరికి వొంగి  “మీ ఆయన నీకు చెప్పలేదన్నమాట.” అంది లక్ష్మి.

ఊహూ— “అని తలాడించి, ఏవిటి విషయమన్నట్లు ఆసక్తిగా చూసింది తన్మయి.

ఏం చెబ్తాడులే. చేసిన ఎదవ పన్లు. నువ్వెంత బంగారానివో, అంతటి త్రాష్టుడు మీ ఆయన. నువ్వెలా పెళ్లాడేవో గాని. నువ్విలా కాంపుకి వెళ్లేవో లేదో నేనూ ఊరెళ్లేను నెల రోజులు.

వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్లు ఒకటే గుసగుసలు చెప్పుకోవడంఅని రహస్యంగా గొంతు తగ్గించి, “మీ ఆయన రాత్రుళ్లు ఆడోళ్లని తెచ్చుకునీ వోడంటఅంది.

తన్మయి అప్రయత్నంగాఛీ, ఛీ..” అంది. అంతలోనే గొంతు పెగుల్చుకునివాళ్లకి చుట్టాలు చాలా మంది ఉన్నారు. ఎవరైనా వచ్చేవారేమోఅంది లక్ష్మి తో సర్ది చెప్పబోతూ.

నువ్వింత మంచిదానివి కాబట్టి అతని ఆటలలా సాగుతున్నాయి. నేను కళ్లారా చూసేను. ఒకరోజు తప్పతాగి ఆడదాని ఒంటి మీద వాలిపోయి వచ్చేడు. ఇద్దరూ చేసిన యాగీ ఆంతా ఇంతా  కాదు.”

తెల్లారి ఇంటిగలాయనకి ఎవరు చెప్పేరో మరి. ఇల్లు తక్షణం  ఖాళీ చెయ్యమని కూచున్నాడు.

మధ్యాహ్నమే మీ ఆయన ఆటోలు పట్టుకొచ్చి సామాన్లు  సర్దుకుని వెళ్లిపోయేడులక్ష్మి గబగబా చెప్పుకుంటూ వెళ్లిపోతూంది.

తన్మయికి ఊగిపోతూ కోపం, ఆపుకోలేని దు:ఖమూ వచ్చేయి.

లక్ష్మీ, ఇంకోసారి వస్తాను. ఇక నాకేం చెప్పకు. నా మీద నాకే అసహ్యం వేస్తూంది.” అని చివాలున లేచింది.

వెనక నించి లక్ష్మి వచ్చి, “మొగోళ్లు వొట్టి ఎదవలు. మీ ఆయన ఎదవల్లోకి ఎదవ. అనవసరంగా నీ  మనసు కష్టపెట్టినట్లున్నాను. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోమాక. బాగా చదువుకో. పిల్లోడి ముఖం చూసుకుని బతుకు. ఏం చేస్తావు మరి!” అని ఆటో ఎక్కే ముందు నచ్చచెప్పింది.

వొళ్ళంతా అవమానంతో దహించుకుపోతూంది తన్మయికి.

ఇంటికి వస్తూనే గోడకి వేళ్లాడుతూన్న శేఖర్ ఫోటోని నేలకేసి కొట్టింది. “ఛీ.. ఛీశరీరం తప్ప, మనసులేని పశువుపెళ్లికాకముందు ఎలా తిరిగాడో  అనవసరం, కనీసం పెళ్లయ్యాకనయినా స్థిరంగా ఉన్నాడనుకుని నమ్మిందిన్నాళ్లూ. తనక్కడ కడుపుతో నానా కష్టాలు పడ్తూంటే, ఇతనిక్కడ వెలగబెట్టిన సంసారం ఇది. పశువుని కట్టుకున్నందుకు తనకి శాస్తి జరిగింది.”  గోడకి జేరబడి కూచున్నదల్లా కోపంతో అప్రయత్నంగా తలని గోడకేసి గట్టిగా కొట్టుకుంది. కసిదీరా తలని బాదుకుని తల నెప్పి వచ్చేస్తుంటే నేల మీద వాలి పోయి కుళ్ళి కుళ్లి ఏడవడం ప్రారంభించింది.

పిల్లాడు లేచి ఏడుస్తున్నా వినిపించని అర్థంలేని దిగులేదో పట్తుకున్నట్లు నేల మీద పడుకుని పిచ్చిదానిలా గది లో పడి రాత్రంతా ఏడుస్తూనే ఉంది.

నేనేం తప్పు చేసానని నన్నిలా శిక్షిస్తున్నావు శేఖర్నన్ను పెళ్లి చేసుకుని నా జీవితం సర్వ నాశనం చేసేవు. ఎందుకు? ఎందుకు?” 

మధ్య మధ్య పిల్లాడి ఏడుపుకి మెలకువ వచ్చినపుడల్లా దగ్గరకు జరుపుకుని పాలిస్తూ  తను మాత్రం  తిండీ తిప్పలు మానేసి అలానే పడి నిద్రపోయింది తన్మయి.

రాత్రంతా కలత నిద్దర. శేఖర్ తనని పర్వతమ్మీంచి సముద్రంలోకి తోసేస్తున్నట్లు కల నించి దిగ్గున లేచింది.  

తెల్లారి పిల్లాడి పనులు తప్పనిసరయ్యి చేసింది. దేని మీదా ఆసక్తిలేదు. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లనిముక్కు ని కొంగుతో అద్దుకుంటూ రోజల్లా అలానే కూచుంది గోడకి జేరబడి.

ఉక్రోషంతో మనసు రగిలిపోతూంది

మర్నాడు తెలార గట్లకి  శేఖర్ వచ్చేడు. మనస్సంతా కాగిపోతున్న కోపోద్రేకంతో చివాలున లేచి కూచుంది.

ఏవిటే తాచుపాములా లేచేవు? సరిగా నిద్రపోలేదా?” అన్నాడు నవ్వుతూ.

నేను డెలివరీకి వెళ్లినపుడు ఏం చేసేవు? ఇల్లు నువ్వు ఖాళీ చేసేవా? వాళ్లు ఖాళీ చేయించేరా?” అని గట్టిగా అరిచింది.

అసలు నువ్వెందుకెళ్లేవు అక్కడికి? నిన్నెవడెళ్లమన్నాడు అక్కడికి మళ్లీ?” అని తిరుగు ప్రశ్న వేసేడు.

వెళ్లబట్టే తెలిసింది నీ అసలు రూపం. నువ్వు చెప్పకపోతే నాకు తెలీదనుకున్నావా?” అంది రోషంగా.

రాత్రంతా రిజర్వేషను లేకండా జనరల్ లో నానా కష్టాలు పడి, నిద్ర లేక కళ్లు వాసిపోయి ఇంటికొచ్చిన మొగుడికి ఇదన్న మాట పెళ్ళాం చేసే మర్యాద.” అన్నాడు వెటకారంగా.

ఆహా. ఇక్కడ నేనేవన్నా సుఖంగా నిద్రపోయేననుకున్నావా? పిల్లాడు ఉండిపోయేడు. లేకపోతే ఉరేసుకుందామనుకున్నాను.”అంది గొంతు పూడుకుపోయి.

వేసుకోక పోయేవా? ఎదవ గోల వొదిలిపోయేది నాకు.” అన్నాడు పిల్లాణ్ణి దగ్గరకు లాక్కుని ముసుగు తన్ని పడుకోబోతూ

ఛీ. ఛీ. నీలాంటి మనిషి కోసం ఛస్తే నాకే అవమానంఅంది.

ఏవిటే తెగ రెచ్చిపోతన్నావు? ఆడదానివి నోరుమూసుకుని పడి ఉండు. మొగోణ్ణి నేను, లక్ష చేస్తాను. కష్టపడి సంసారం ఈదుతున్న దానికి మెచ్చుకోలు లేదు గానీ, అదేదో పెద్ద తప్పులాగా నిలదీసి అడుగుతున్నావేటి?” అని అటు తిరిగి పడుకున్నాడు.

వస్తూనే అతను తెచ్చిన స్వీట్ల పేకెట్టుచీర, జాకెట్టు సంచీ తీసి నేలకేసి కొట్టింది.

గదిలో ఉండలేనట్లు బాత్రూములోకి వెళ్లి తలుపేసుకుంది. ఆలోచించడానిక్కూడా ఓపిక లేదు. తలంతా వేడిగా అయిపోయి, చెమటలు ధారాపాతంగా కారుతున్నాయి. చల్లని నీళ్లు తలమీంచి పోసుకుంది.

బయటకు వచ్చేసరికి తెల్లగా వెల్తురు వస్తూంది. తడి ఆరని తలని అలాగే వొదిలేసి ఇంటి తలుపు తీసుకుని బయటకు అడుగు పెట్టింది.

ఎటు వెళ్లాలో తెలియదు. సముద్రం వైపు నడక మొదలు పెట్టింది.

నిజానికి తమ ఇంటి నించి దిగువకి దాదాపు మైలు నడిస్తే సముద్రం కనిపిస్తుంది కానీ, చివర్లో కంచె వేసున్నందు వల్ల అంతా చుట్టు తిరిగి దాదాపు నాలుగైదు మైళ్లు వెళ్లవలసిందే

నడిచి నడిచి కాళ్లు నొప్పులు పెడ్తూండగా కనబడ్డ బస్టాండులో కూలబడింది. చిన్న బడ్డీ కొట్టు దగ్గిర టీలు తాగడానికి వచ్చి పోయే వాళ్లు తనని వింతగా చూడడం గమనించింది. చెమటకి తడిసిపోయి, నలిగిపోయిన కాటన్ చీరవిరబోసుకున్న జుట్టు, ఏడుపుతో ఉబ్బిన కళ్లు

అసలు తనెందుకు బయటికి వచ్చిందో అర్థం కావడం లేదు. ఇంటిలో మాత్రం ఉండాలని లేదు అంతే. నిస్త్రాణగా బల్లమీద కూలబడి తలని వంచుకుని కూచుని కళ్ళు మూసుకుంది

ఉన్నట్టుండి మోచేతి మీద చివ్వున కాలడంతో కెవ్వున కేక వేసి పక్కకు పడింది బల్ల మీద.

తన బాధలో తను ఉండి, పక్కనే చివర్లు వెలిగించి ఉంచి వేళ్లాడుతున్న కొబ్బరి తాడుని గమనించుకోలేదు తను

కానీదానికీ, తనకూ చాలా దూరమే ఉందే ! ఎలా కాలిందబ్బా!” అని మోచేతిని తడుముకుంటూ చుట్టూ చూసింది. బడ్డీ వెనక నించి వెకిలిగా నవ్వుకుంటూ ముందు కొచ్చేడు పిచ్చోడొకడు. బడ్డీ వాడు ఒక కర్ర తీసుకుని అతణ్ణి తరిమికొట్టేడు . కానీ తన్మయి అప్పటికే భయంతో  కొయ్యబారిపోయింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.