మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

దొమితిలా జీవితం- సైగ్లో – 20

గృహిణుల సంఘం

జరగబోయే సంఘటనలపట్ల కొందరు వ్యాకులపడ్డారు. ఏం జరగబోతోందో తెలియని అమోయమంలో ఎన్నెన్ని ఘోరాలు జరిగాయని! కటావి సంఘటన వింటే గుండె చెరువవుతుంది. సెలవులు గనుక భర్త ఎటో ప్రయాణమయి వెళ్ళిపోయాడు. కాల్పులూ, ఘర్షణలూ – ఈ గందరగోళమంతా చూసి భార్య తన పిల్లల్ని మంచంకింద దాచింది. మా దగ్గర ఇది ఒక అలవాటు. కాల్పులు జరిగేటప్పుడు పిల్లల్ని మంచాల కింద దాచి పెట్టాలనీ, చుట్టూ తివాచీ కప్పాలనీ, అలాచేస్తే తుపాకీ గుళ్ళు వాళ్ళను తాకవనీ ఆ జనం నమ్ముతారు. ఐతే దీంట్లో ఒక నిజం కూడా ఉంది. నిజంగానే తుపాకి గుండు ఊలులో ఇరుక్కుపోయి లోపల ఉన్న పిల్లలదాకా చేరదు. ఇంతలోనే సైనికులు వచ్చారు. వాళ్ళు తలుపు బాదితే ఆవిడ తలుపు తెరవదలచుకోలేదు. చివరికి వాళ్లు తలుపులు విరగ్గొట్టి ఇంట్లోకి వెళ్ళారు. ఈ అల్లరికి మంచంకింది నుంచి పిల్లలు ఏడవడం మొదలెట్టారు. సైనికులు మంచంకింద ఎవరినో దాచిందని ఆవిడను తిడుతూ మూడు వరకు లెక్క పెట్టేలోగా వాళ్లు బయటికి రావాలని హెచ్చరించారు. పిల్లలు మరింత భయపడి బయటికి రాలేదు. ఓ సైనికుడు ఒకటి.. రెండు… మూడు… అని లెక్క పెట్టాడు. అప్పుడా తల్లి “వాళ్ళు నా పిల్లలు…. మీకు దండం పెడతాను… దయచేసి వాళ్లనేమీ చేయకండి..” అని వాళ్ల కాళ్లు పట్టుకుంది. అయినా ఆ కఠినాత్ములు కాల్పులు జరపమనే ఉత్తర్వు ఇచ్చారు. ఆమెకాళ్లు పట్టుకోవడానికి కిందికి వంగితే, తుపాకి గుంజుకోవడానికి వంగుతున్నదని భయపడి ధన్…ధన్… మని ఆమెను కాల్చేశారు. పిల్లల్ని కూడా కాల్చేశారు. మేం వెళ్ళేసరికి మంచంకింద ఆ చిన్నారి పాపల మృతదేహాలు పడి ఉన్నాయి. ఆ కార్మికుడు తిరిగివచ్చేసరికి భార్యాలేదు, పిల్లలూలేరు. రెండు కాళ్ళూపోయి అవిటిదైన పెద్దకూతురు మాత్రం ఆ దారుణానికి సాక్షిగా మిగిలి ఉంది.

మరో ఇంట్లో తలుపు మూసి ఉంటే సైనికులు దబదబా బాదారు. ఇంటావిడ తలుపు తీయడానికి వస్తుండగా తలుపులు బదాబదలు చేసి ఆవిడ్ని తుపాకులకెరజేశారు.

ఓ కార్మికుడు రాళ్ళగుట్ట ఎక్కి తప్పించుకుందామనుకున్నాడు. మా ఇంట్లో నుంచి ఓ సైనికుడు అతణ్ని చూడనే చూశాడు. ఇంకేముంది? మా వాకిట్లో నిలబడి రాళ్ళగుట్ట పైకి కాల్పులు జరిపాడు. తుపాకి గుండు కాచుకునే ప్రయత్నంలో కార్మికుడు గుట్టమీది నుంచి జారి కిందికి పడి చచ్చిపోయాడు.

మరో కార్మికుడు ఎప్పుడూ దేనితోనూ సంబంధం లేనివాడు. ఎన్నడూ ఏ సభముఖమైనా చూసి ఎరగనివాడు. ఊరికే తన వాకిట్లో నిలబడి ఉన్నాడు. ఐతే సైనికులొచ్చి వెళ్ళి పొమ్మనగానే ‘లోపలికెళ్ళలేదు. “నేనేమీ చేయలేదండి” అని మర్యాదగా జవాబిచ్చాడు. “దొంగవెధవా! ఎదురు చెప్తావా? రా బయటికి” అని బయటికి లాగి అతణ్ని విపరీతంగా కొట్టారు. నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టారు. సైగ్లో-20 మొత్తం ఒక మిలిటరీ పాలిత ప్రాంతంగా ప్రకటించబడింది. కర్ఫ్యూ విధించబడింది. రాత్రి ఎనిమిదింటి వరకు మాత్రమే బైట తిరగొచ్చు. మేం కాలకృత్యాలకు బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడల్లా సైనికులు మా వెంట ఉండేవాళ్ళు. బయట పరిస్థితి నిర్బంధ శిబిరంకన్న ఘోరంగా ఉండేది. ప్రతి ఇంటి ముందూ ఓ సైనికుడు నిలబడి ఉండేవాడు. ఇంట్లో ఏ చిన్న చప్పుడైనా వెంటనే వాళ్ళు “ఏం జరుగుతోంది” అని అడిగేవాళ్ళు. వెంటనే మేం “బైటికెళ్ళాల్సి ఉందండీ – వెళ్ళమంటారా” అని అడిగేవాళ్ళం. వాళ్ళు సరే నంటే తలుపు తెరిచి వెళ్ళేవాళ్ళం. అక్కడిదాకా వెళ్ళి, వెనక్కి తిరిగొచ్చేదాకా వాళ్ళు మా పక్కనే ఉండేవారు. మళ్ళీ వెంటనే తలుపు వేసుకోవాలి. ఇంట్లో లైట్ల గురించి కూడా ఇదే సమస్య. రోజూ ఒక నిర్దిష్ట సమయానికి ఊరు చీకటి కోణమై పోవాల్సిందే. ఎవరైనా లైట్ ఆర్పకపోతే వెంటనే గాలిలోకి తుపాకి పేల్చి “లైట్ ఆర్పేయండి. ఇంకా ఏం చేస్తున్నారు?” అని గర్జించే వాళ్ళు.

ఈ మారణకాండ జరిగాక కొన్నాళ్లకి సైగ్లో 20కి శాంతాక్రజ్ నుంచి మాంచెగో రెజిమెంట్ వచ్చింది. ఆ రెజిమెంట్లోని వాళ్లందరూ పశ్చిమ బొలీవియా నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్లకు పర్వత ప్రాంతాల్లో ఎలా ఉంటుందో తెలియదు. ‘కొచబాంబా వెల్దాం పదండి!’ అనగానే ఉత్సాహంగా వచ్చేశారు. పాపం! వాళ్లెన్నడూ శాంతాక్రజ్ దాటి ఎరగరేమో అన్షియా చేరుకునేసరికి వణకడం మొదలు పెట్టారు.

వాళ్లు సైగ్లో-20 చేరగానే వాళ్లకేం చెప్పారో తెలుసా? “మీరిప్పుడు సైగ్లో-20లో ఉన్నారు. ఇది బొలీవియా మొత్తం మీద ప్రసిద్ధ ఎర్రగ్రామం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కమ్యూనిస్టులే. ఇక్కడ మీరు ఎవ్వరినీ నమ్మడానికి వీల్లేదు. మీరిక్కడ ఎవరితోనూ, చివరికి పిల్లలతోనైనా మాటలు కలపకండి. ఇక్కడ చిన్న పిల్లలక్కూడా డైనమైట్లు పేల్చడం వచ్చు. వాళ్లు డైనమైట్లు పేల్చారా, మీరు ముక్కలు ముక్కలై గాల్లో కలిసిపోతారు. మీరెంత ఘోరంగా చచ్చిపోతారో తెలుసునా? అప్పుడు మేం మీ శవపు ముక్కల్ని చెంచాలతో కూడా పట్టుకోలేం.”

ఆ రోజు ఉదయమే ఈ రెజిమెంటును వెంట పెట్టుకుని అధికారులు ఏరివేత కార్యక్రమం ప్రారంభించారు. వాళ్ళు క్యాంపులోని ప్రతి ఇల్లూ తిరిగారు. ప్రతీది వెతికారు. కనబడ్డ ప్రతిదాన్నీ పగలగొట్టారు. కింద నేలమీద పరిచిన చెక్కల్నికూడా ఊడబెరికి ప్రతిదీ గాలించారు.

“ఆయుధాలెక్కడున్నాయి? డైనమైట్ ఎక్కడుంది? కమ్యూనిస్టు ప్రచారం చేస్తారుగదూ మీరు!? రాజకీయాలు మాట్లాడతారు గదూ?” ఇలా వాళ్లు అడగనిదేముంది? వాళ్లు కెలకనిదేముంది? వాళ్ల క్షాళన కార్యక్రమమంతా అదే. మేం ఏమీ చేయలేక పోయాం, సాక్షులుగా ఉండిపోయాం. వాళ్లు విప్పకుండా మా పెట్టెల్ని మేం ముట్టుకోనైనా ముట్టుకోలేకపోయాం. మేం ఎప్పుడూ సాయుధంగా ఉంటామని వాళ్ల అపోహ. ఓ నాడు నేను దుకాణం నుంచి వస్తోంటే “ఏయ్-ఏయ్ నీ దగ్గరున్నవేమిటి” అంటూ ఓ సైనికుడు తోవలోనే నన్నా పేశాడు. నాదగ్గరున్న వస్తువులన్నీ వెతికాడు. తిండి సామాన్లు తప్ప మరేమీ లేవని చూసి వెళ్లి పొమ్మన్నాడు. మా దగ్గర ప్రతి ఒక్కరూ ఇలాంటి అవమానాల్ని ఎదుర్కొన్నారు. – భోజనాల సమయానికి రెజిమెంట్లోని పెద్దలందరూ తినడానికి వెళ్లేవారు. మామూలు సైనికులు మాత్రం మా వాకిళ్లలో దిగాలుపడి పడిగాపులు కాస్తుండేవారు. ఏమీ ఫలహారం కూడా చేసి ఉండేవాళ్లు కాదేమో ఆకలితో నకనకలాడే వాళ్ళు.

జనం ఎంత అమాయకులు! ఎంత నిష్కల్మషులు! ఒక్కోసారి ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తారు! ఆ సైనికులే వాళ్లని చంపేస్తారు. వాళ్ల శరీరాల్ని తుపాకీ గుళ్లతో జల్లెడ చేస్తారు. వాళ్ల చుట్టూ రక్తాలు ప్రవహింపజేస్తారు. ఇంతలో కాల్పులు ఆగిపోతాయి… అప్పుడు స్త్రీలు తమకున్న కొద్దిపాటి తిండిలోంచే ఈ మామాలు సైనికులకి కొంత పంచి ఇవ్వడానికి బయటికొస్తారు. ఇది చూసి నాకు వొళ్లు మండేది. నేను ఉద్రేకంగా “మీకిట్లా చేయడానికి ఎట్లా మనసొప్పుతోంది? మనల్ని కుక్కల్లాగ కాల్చేసిన వాళ్లకు మీరు ఎట్లా కృతజ్ఞత చూపగలరు?” అని అడిగేదాన్ని.

“అది కాదమ్మా! ఇలా చూడు – వీళ్ళందరూ మనకొడుకులు. కొడుకుల్లాంటి వాళ్ళు. నిజానికి ఉత్తర్వులిచ్చేది ఎక్కడో పైనున్నవాళ్ళు. అది ఈ పిల్లల తప్పుకాదు. రేపు ఇదే పరిస్థితి నాకొడుకుకయినా రావచ్చు. వాణ్ని సైన్యంలో చేర్చుకుంటే ఎక్కడో ఓ చోట జనాన్ని చంపడానికే పంపుతారు. అలాంటప్పుడు వాళ్లకింత తిండి పెట్టకుండా ఎలా ఉండగలం?”

ఈ జవాబే నేను ప్రతి ఒక్కళ్ల దగ్గరా విన్నాను. కొంచెం ఆలోచించి నేని సంగతి అర్థం చేసుకోగలిగాను. నాకప్పుడు నా ప్రజలకీ, శత్రువులకీ తేడా అర్థమైంది. నిజంగా నా ప్రజలెంత తెలివైన వాళ్లు! వీళ్లలో ఏ ఒక్కర్నీ వదలకుండా చంపేయాలన్న పిచ్చికసి వాళ్లకెందుకు? వాళ్లేంత భయంకరమైన మనుషులు! ఎంత దుర్మార్గులు! నా ప్రజల్ని ఇన్ని బాధలకు గురిచేసే వాళ్లదెంత రాతిగుండె!

ఓ సారి ఒక స్త్రీ ఒక సైనికుడు తన మేనల్లుడని గుర్తించింది. అతన్ని దగ్గరికి తీసుకుని భోజనానికి రా నాయనా’ అని పిలిచింది. కాని ఆ సైనికుడందుకు ఒప్పుకోలేదు. సైగ్లో-20 మనుషులు తమకు విషం పెడతారని తన అధికారులు చెప్పారని ఆ యువకుడు చెప్పాడు. మొదట వాళ్లందరూ అంతే! మా దగ్గరికి రావడమంటేనే భయపడేవారు. మెల్లమెల్లగా వాళ్లు మేం ఇచ్చేవి తీసుకోవడం మొదలు పెట్టారు.

మాంచెగోలు తమ బ్యారక్ లకు తిరిగి వెళ్లి రేంజర్లతో “ఇంత మంచి వాళ్లని, ఈ నిష్కల్మషుల్ని చంపడానికి మీకు చేతులెట్లా వచ్చాయి? వాళ్ళు మాతో చాలా బాగా ఉంటున్నారు. మాకెన్నెన్నో ఇస్తున్నారు. మీరు అడవి మనుషులా ఏం? నిజంగా జరిగేదేమిటో మీరు అర్థం చేసుకోలేరా?” అని ప్రశ్నించే వాళ్ళు.

అధికారులకు ఈ సంభాషణలు రుచించలేదు. అప్పుడు వాళ్ళు శిక్షగా మాంచెగోలని కొండ పైకి తీసుకెళ్లి, అక్కడ కొందరు యువ సైనికులకు వాళ్ల ప్రాంతపు దుస్తులు తొడిగించి వదిలారు. ఆ ఉష్ణ ప్రాంతపు బట్టలు ఇక్కడి వాతావరణానికి సరిపోక వాళ్లలో చాల మంది చలికి చచ్చిపోయారు. తట్టుకొని మిగిలిన వాళ్లను వాళ్లెక్కడికో తీసుకెళ్ళారట.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.