సన్న జాజులోయ్

-ఎన్నెల

పెళ్ళప్పుడు మా అమ్మ నన్ను అప్పగిస్తూ మా వారితో…’ అమ్మాయి సెవెన్ జాస్మిన్ హయిటు నాయనా, జాగర్త గా చూసుకో ‘ అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది. మా వాళ్ళందరూ అయోమయం గా మొహం పెట్టి,” పాపం బాధలో ఏదో మాట్లాడుతోందిలే పిచ్చి తల్లి” అని సర్దుకున్నా, తర్వాత చుట్టూ చేరి, ” మీ అమ్మ గారు ఏమన్నారు ఇందాకా అప్పగింతలప్పుడూ” అని నన్నడిగారు.”అదా….సెవెన్ జాస్మిన్స్ హయిటు అనగా ‘ఏడు మల్లెల ఎత్తు’ “అని కన్నులు తుడుచుకుని కల కల నవ్వాను.

నాలుగు రోజుల తరువాత సడెన్ గా మా వారు “మీ ఊళ్ళొ ఏం పూలు పూస్తాయి” అనడిగారు.నేను ఉత్సాహంగా ”మల్లెలూ,చామంతులూ, బంతులూ..” అని లిస్ట్ చదవడం మొదలు పెట్టా.”ఆగాగు,మల్లెల్లో ఏ రకాలు…సన్న జాజులా, బొండు మల్లెలా”? ప్రశ్న వినగానే ఏదో స్ఫురించింది..సమాధానం ఇవ్వలేదు నేను.
“మీ ఊరు వెళ్ళొద్దామా ఒక సారి” అన్నారు..నా మనసు మేఘాల్ని తాకిందీ ‘హై హైలెస్సా’ అంటూ. మా చిన్నాడు లోపలికొస్తూ ‘ ఏంటీ ప్రయాణం అంటున్నారు ఎక్కడికీ’ అన్నాడు..’నువ్వు కూడా బయల్దేరు చిన్నా, ప్రాజెక్టుకి ఏవో వింతలు విశేషాలూ కావాలన్నావుగా. మీ వదినా వాళ్ళ ఊళ్ళో వింత పూలు పూస్తాయిట. నా అభిప్రాయం ప్రకారం వీళ్ళ ఊరిలో పూచే మల్లెలేవో గిన్నిస్ బుక్ కి ఎక్కాల్సిందే’ అని నా వైపు తిరిగి ” మీ అమ్మ గారి లెక్క ప్రకారం ఏడు మల్లెలు డెబ్భయి కిలోలు ఉంటే, ఒక్కొక్క మల్లె పూవు కనీసం పది కిలోలైనా ఉంటుందేమో కదూ…అంత పెద్దగా పూస్తాయా మీ ఊళ్ళో మల్లెలు” అని మనసులో వెటకారం బయట పెట్టేసారు. అవాక్కయి చూసా నేను, నలుగురిలో ఏమీ అనలేక. అదిగో అప్పటి నించీ గుర్తొచ్చినప్పుడల్ల సన్నజాజీ, మల్లెతీగ, నాగమల్లీ అని పిలుపులొకటీ..

ఏదోలే, మా అమ్మని తలచుకొన్నట్టుంటుందని ఆ పిలుపులన్నీ లయిట్ తీసుకున్నా..కానీ ఆ పిలుపులకి తగ్గట్టే ఆ మల్లె పూల బరువు మరీ ఎక్కువ కాకుండా రోజుకి కొన్ని గ్రాముల చొప్పున అవలీలగా పెరిగింది బంగారం ధర పెరిగినట్టు…అప్పటి నుంచీ మల్లెల ప్రస్తావన వచ్చిన ప్రతి సారీ, ‘ఇలా అంటే నేను అన్నం తిననంతే ‘అని గారాలు పోయా…మా అత్తగారు కల్పించుకుని…’ఏవిట్రా అదీ, పిల్లని తిననీకుండా…పిల్లల్ని కనాల్సిన పిల్ల దిష్టి పెట్టకు అని వెనకేసుకొచ్చారు.
పైగా’ వాడి ముందు తినకు ‘అని వారు లేనప్పుడు రెండు మూడు రోజులకి సరిపడా ఒక డోసులో పెట్టేసి తినిపించేసేవారు. పాపం పెద్దావిడ అంత ప్రేమగా పెట్టినప్పుడు కాదనడం ఎలాగ మీరే చెప్పండి?

ఉమ్మడి కుటుంబంలో పిల్లల సంఖ్య పెరిగాక, ఇంట్లో పిల్లలందరికీ అన్నం పెట్టడం నా వంతు…యీ పిల్లల్ని పెంచడమేమో కానీ, ప్రతి పూటా వాళ్ళ కోసం అన్నం కలపడం…వాళ్ళు తినకపోతే అయ్యొ వేస్టు అయిపోతుందే అని బాధ పడి అలా నోట్లో పడేసుకోడం. అంతే కాక పిల్లలు సగం తిని వదిలేసిన బిస్కట్లూ, చాక్లెట్లూ,అరిశెలూ, అప్పచ్చులూ…….మరి సన్నజాజులు, విర జాజులు రూపాంతరం చెంది బొండుమల్లెలవక ఛస్తాయా!!!

మాకు ట్రాన్స్ఫర్ వచ్చి ఇంకో ఊరు చేరాక, ఉమ్మడి కుటుంబంలో ఉండే సుఖాలన్నీ ఉష్ కాకీ..
పిల్లలని స్కూల్ లో వేసాక, ఇంటి పని ముగించుకుని, పిల్లలని బడిలో దింపే పరుగుల్లో…పొద్దున్న హడావిడిగా ఏమీ తినకుండా ఆఫీసుకి వెళ్ళిపోయి, లంచుకి తీసుకెళ్ళిన చిన్ని డబ్బాలో వస్తువుని నలుగురితో పంచుకుని తినడం వల్ల, పోనీలే ఏదో డయటింగు చేస్తున్నా అని ఫీలింగు వచ్చేది. ఆది వారం ఆరు రోజులకి సరిపడా లాగించేసినా… అబ్బ పోదురూ.. ఆ మాత్రం తినకపోతే ఎలా అసలు!!


కాల క్రమేణా అవేవో డయిటింగులవీ వచ్చాయి కానీ నేను పట్టించుకోలేదు. కానీ “ఒకే సారి తినకండి, కొంచెం కొంచెంగా చాలాసార్లు తినమని” డాట్రు గార్లు, డయిటీషియన్లూ టీవీల్లో అరచి అరచి మరీ చెప్తారు కాబట్టి వాళ్ళని ఇన్సల్ట్ చేసి వాళ్ళ మనసు బాధ పెట్టడం బాగుండదు కనుక , రెండు బ్రేకులు, ఒక లంచూ , డెస్క్ దగ్గర తినడానికి చిరు తిండీ, పళ్ళూ, ఫలాలు ( డ్రయి ఫ్రూట్స్ అన్నమాట) పట్టికెళ్ళేదాన్ని. ఈ మధ్య అన్ని ఆఫీసుల్లో కాఫీ మిషన్లు ఉద్దరగా ఉండడంతో మధ్య మధ్యే పానీయాల తో మల్లె తీగ కళ లాడిపోతోంది.

ఇక పోతే వారంలో ఒక్కటంటే ఒక్క రోజు.. అదే శనివారాలు అందరికీ ఫుడ్ తెప్పిస్తారు ఆఫీసులో. (ఏబీవీపీ ..ఎవడి బిల్లు వాడే పే చేసే ప్రాతిపదికన) ఏదో నలుగురితో నారాయణ… తినక పోతే బాగుంటుందా మీరు చెప్పండి! ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు తినడమే మానేసాను, మీరు నమ్మాలంతే,నమ్మక పోతే నా మీదొట్టు.

కాస్త మోకాళ్ళు నెప్పిగా ఉన్నాయి ఎవరి పనులు వాళ్ళని చేసుకోమంటానో లేదో “అమ్మా జిమ్ముకి వెళ్ళచ్చు కదా” అని పిల్లలుమొదలెట్టారు.
“ఛీ ఊరుకోండిరా,గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట, నాకు అవన్నీ ఎందుకు? బోలెడు పని ఇంటా బయటా. ఇంట్లో పనే నాకు పెద్ద జిమ్ము తెలుసా ? పొద్దున్న లేచినప్పటి నుంచీ ఎంత పని. వంట, ఇల్లు-వాకిలీ, తుడుపుళ్ళు-కడుగుళ్ళు, అబ్బో “అంటూ, ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలో ముత్యాల ముగ్గు కథానాయిక చేసిన పని లెవెల్లో చెప్పి చెప్పి ఊదరగొట్టేసా.
ఇంక మల్లెలు, మల్లె తీగలు విషయాలు ఎప్పుడైనా డిస్కషన్ కి వచ్చాయంటే, గబ గబా ఫోను కలిపేసి,అత్తయ్యా…ఊ..ఊ.. అని షికాయత్ లు. అక్కడి నుండి వార్నింగులు…హహహ..మరి ఏటనుకున్నారు మనమంటే!!

“అసలు ఆడాళ్ళు ఇంట్లోనే పదమూడు కిలో మీటర్లు నడిచేస్తారట తెలుసా! ఇంటి పని చేసుకుంటె 1000 క్యాలరీలు కరుగుతాయట”! లాంటి ఆశ్చర్యకరమైన నిజాల్నిసేకరించి ఎప్పటికప్పుడు మా ఇంట్లో అందరి మెదడు బోర్డ్ మీద స్క్రోల్ అయ్యే సదుపాయం కల్పించేసాను నేను . ” నిను చూస్తూ మేముండలేమూ” అని వాళ్ళు., ” తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్…” అని నేనూ హోరా హోరీ “ఇది సంగీత సంగ్రామమూ ” అనే ప్రోగ్రాం పెట్టేసుకున్నాం. విజేతనైన నేను ఒక పక్కా, వాళ్ళ నాన్న ఒక పక్కా ఎక్కువెక్కువ తిండి కుక్కి కుక్కి పెట్టేస్తున్నామని ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా పిల్లలు అందరి దగ్గరా కంప్లెయింట్లు చేసారు. వీలు దొరికినప్పుడల్లా స్కూల్లో నేర్చుకున్న హెల్తీ ఫుడ్ హాబిట్స్ గురించి చిన్న చిన్న క్లాసులు పీకడం, ఎవరితోనైనా పీకించడం వృధా అని వాళ్ళకి త్వరలోనే అర్థం అయ్యింది…దాంతో అందరూ చెప్పినంత చెప్పి, మా వల్ల కాదు బాబోయ్ అని చూసీ చూడనట్టు వదిలేసారు.

మరి ఎవ్వరూ పట్టించుకోకపోతే ఎలా అండీ..అలా పట్టించుకోడం మానేసారని నేను తెగ బెంగ పెట్టుకున్నాను తెలుసా! మొన్న మా రాజీ ఫోన్ చేసినప్పుడు చెప్పింది “ఎవరయినా బెంగ పెట్టుకున్నా, మానసికంగా ఆందోళనకు గురి అయినా బరువు పెరుగుతారంట”..చూసారా? ఇప్పుడు చెప్పండి మీరు అసలు నా సమస్యకి కారణమేంటో!!

యీ మధ్య అద్దంలో చూసుకుంటూ..”ఏంటో, మొహమంతా కళ తప్పింది,జుట్టు నెరిసి పోతోంది,కళ్ళ కింద నల్ల చారలొచ్చేసాయ్,బరువు పెరిగి పోయిందీ..చాలా డిప్రెసుడు గా ఉందీ…ఏమైనా కాంప్లిమెంటు ఇవ్వొచ్చుగా” అని అడిగా…”పోనీలే,అన్నీ ఎలా ఉన్నా నీ కళ్ళు మాత్రం చాల పర్ఫెక్టుగా పని చేస్తున్నాయనుకుంటా” అన్నారు. మనసు చిన్నబోయింది, కానీ మల్లె తీగ మాత్రం బాగా వృద్ధి చెందిందండోయ్!

అలా దిగులు(వృద్ధి) చెందుతూ చెందుతూ ..దేవుడిని ప్రార్థించడం మొదలు పెట్టా…’లావొక్కింతయు లేదు…ధయిర్యము విలోలంబయ్యె’,,ఆగండాగండి ….’అమ్మా నాగ మల్లీ..నీ ప్రార్థనలో యేదో దోషములున్నవి సరి చూసుకో తల్లీ ‘ అని దేవుడు ఖంగారు పడ్డట్టనిపించింది ఎందుకో. ‘అర్థం కావట్లేదు స్వామీ’ అన్నాను.. కానీ ఆయన పలకలేదు. ఎంత అడిగినా మవునమే సమాధానం. .. ఏమయ్యుంటుదబ్బా అని ఎంత ఆలో… చించినా అర్థం కాలేదు.

ఒక చిన్ననాటి స్నేహితురాలు కలిసిందీ మధ్య. ” మా దగ్గర పూజలు చేస్తున్నారు రాకూడదూ” అంది. ” రానే , దేవుడికీ నాకు కటీఫ్ అయ్యింది ” అన్నా.. ఆమె ఆతృతకి తట్టుకోలేక ఇలా ఒక పద్యం చదివితే దేవుడు ఏదో సరి చేసుకోమన్నాడనీ, ఏం సరి చేసుకోవాలో చెప్పలేదని , అదే పద్యం రోజూ చదువుతున్నాననీ చెప్పా. ఇంతకీ ఏం పద్యమది అని అడిగి, ” లావొక్కింతయు లేకపోవడమేంటే, నీ మొఖం .. నీకు వచ్చు కదా అని ఏదో ఒకటి చదివితే మరి దేవుడు మాత్రం ఖంగారు పడడా ?” అంది.. ‘అదేంటీ చిన్నప్పటి నించి చదివే పద్యమే గా దేవుడి సిలబస్ మారిందా ” అనడిగా అమాయకం గా.. ఒసేయ్ మొద్దూ, వద్దు వద్దు దేవుడిని నువ్వు కంఫ్యూస్ చెయ్యకు’ అని మందలించి “నీ సమస్యకి ఆ పద్యం కాదు ఈ మంత్రం చదివాలి” అని చెప్పి మంత్రోపదేశం చేసింది.

యీ మంత్రం నాకు బాగా నచ్చేసింది…మీకు కూడా నచ్చుతుందనీ, మీరు కూడా ప్రార్థిస్తారనీ తలంచి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను…ముందుగానే చెప్పాను కదండీ మంచి మంచి వన్నీ మీతో పంచుకుంటానూ అని…అదన్న మాట విషయం…(అదిగో, మీరు మెచ్చుకుంటున్నారని నాకు తెలుసు..ఎక్కువ మెచ్చుకోకండే..యీ మధ్యనే మంత్రం పని చేస్తోందండీ…మళ్ళీ మీరు మెచ్చుకున్నారన్న ఆనందం తట్టుకోలేక ఉబ్బి తబ్బిబ్బయిపోతే..ఇంక మబ్బుల్లో నివసించాల్సి వస్తుంది మరి!)సరే, ఇప్పుడు క్రింది మంత్రం ప్రతి రోజూ 108 సార్లు చదవండి…ఇంక ఆనందమానందమాయెనూ..అని పాడుకుంటారు నాలాగే.


సన్నగా ఉన్నవారు యీ మంత్రాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి చదువుకోవలసిందిగా విన్నపం..లేకపోతే తేడాలొచ్చేస్తాయండోయ్!! మంత్రాన్ని కస్టమైజ్ చేసుకునే విషయం లో ఎవరికి వారే బాధ్యులు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు బాధ్యత లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. క్షమించెయ్యండి యీ మంత్రాన్ని తెలుగు లోకి అనువదించడం నాకు చేత కాలేదు.

////Dear God: For 2020 and there on, all I ask for is a big fat bank account, and a slim body. Please do not mix up the two like you did last year. Amen////

****

Please follow and like us:

2 thoughts on “సన్న జాజులోయ్ (కథ)”

Leave a Reply

Your email address will not be published.