అనేక ఆకాశాలు- స్త్రీల కథలు

-వురిమళ్ల సునంద

అనేక ఆకాశాలు ఈ ఒక్క మాట చాలు..ఆలోచింప జేయడానికి, అందులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం కలగడానికి…  సమాజంలో స్త్రీలను ఏ దృష్టితో చూస్తున్నారు వారి పట్ల ఎలా స్పందిస్తున్నారు. స్త్రీలు తాము గడుపుతున్న జీవితం ఎలా ఉంది. వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.. ఆధిపత్య సమాజంలో  అనేకానేక అసమానతల నడుమ అస్తిత్వం కోసం  వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు,
ఏం మార్పు రావాలని కోరుకుంటున్నారో ఈ కథల్లో  ఆవిష్కరించారు. ఇందులో ఉన్న కథలన్నీ కాల్పనికాలు కావు.  సమాజంలో మనకు కనిపించే స్త్రీల వ్యథార్త గాధలు.
ఇందులో ఉన్న రచయిత్రులు అందరూ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక లోని సభ్యులు. కథలకు సంబంధించిన కార్యశాల నిర్వహించుకుని కథ స్వరూప స్వభావాలను అధ్యయనం చేసిన తర్వాత సమాజాన్ని , పర్యావరణం,రాజకీయం, మానవ సంబంధాలు, సమాజంలోని స్త్రీలు శ్రామిక,ఉద్యోగ, కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఇతివృత్తాలుగా తీసుకుని రాసిన కథలివి.
ఇందులో ఇరవై ఒక్క మంది రచయిత్రులు రాసిన కథలు ఉన్నాయి.
ఒక్కో కథ  ఒక్కో పార్శ్వం లో రాయబడింది.
 మొదటి కథ అమర జ్యోతి గారు రాసిన
 ‘నల్ల ఖాళీ సీసా’ ఎత్తుగడలోనే ఓ ఉద్యోగిని నలభై ఆరేళ్ల జీవితాన్ని కళ్ళముందు ఉంచుతుంది. కథకు సంబంధించిన శీర్షికలోని అంతరార్థాన్ని తెలుపుతుంది. ‘పైకి ఒక దేహం.. దానికి ఒక చీర, జాకెట్టు, కొంత అలంకరణ.. లోపలంతా ఖాళీ.. ఒట్టి డొల్ల.. ఈ వాక్యాలు చదువుతుంటే ఇందులోని కోమల జీవితం పైకి ఏదో ఉన్నట్లు మెరుస్తూ కనిపించేంత అందమైనది కాదని లోపలంతా శూన్యమని  ఈ కథను చదివే పాఠకులకు అర్థం అవుతుంది.  
కన్నతండ్రి బలవంతంగా ఒప్పించి చేసిన పెళ్ళి. మనిషి వికారమైన సర్దుకు పోవచ్చు కానీ మనసు వికారం.. అతని ఆలోచనలు, చేష్టలు అన్నీ వికారాలే… ఆదాయం కోసం చేయమన్న టీచర్ ఉద్యోగం.ప్రతి క్షణం నరకం చూపే అనుమానం.. భయంకరమైన భార్యా భర్తల అనుబంధానికి పుట్టిన బిడ్డ.. మంచి మార్గంలో నడిపించాల్సిన తండ్రిగా  తన బాధ్యతను వదిలేస్తాడు. అతి స్వేచ్ఛ ఇవ్వడమే కాకుండా ఎవరితోనో లేచి పోతే కట్నం మిగిలిందని ఆనంద పడిన భర్తను తలుచుకుంటే అసహ్యం వేస్తుంది కోమలకు.  రోడ్డు ప్రమాదంలో కాళ్ళు విరిగిన కొడుకు, ఇవన్నీ భరిస్తున్న ఆమెకు మరో పిడుగు పాటు భర్త కాళ్ళు చేతులు పడిపోయిన వార్త..  ఆమె జీవితం శూన్యం ఆవహించిన నల్ల సీసా.. బంధాలను వదులుకోలేక  స్త్రీ  పడే కష్టాలను చదువుతుంటే కళ్ళు చెమరుస్తాయి.
కాత్యాయని విద్మహే గారు రాసిన కథ ‘రెండు గోతులు’   కొందరి స్వార్థ పరుల వల్ల ధ్వంసం అవుతున్న పర్యావరణం గురించి  ఆవేదనతో రాసిన కథ ఇది.  కొండ అనే పదం మనుషుల జీవితాలతో ఎలా పెనవేసుకున్నదో రచయిత్రి తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ చెబుతారు. అమ్మ బంగారు కొండా అని ముద్దు చేసినప్పుటి నుండి ఆ కొండ అనే పదమే కాదు ప్రత్యక్షంగా ఇంటి వెనక కొండ ,ఆ కొండ మీద చెట్లు చెట్ల మీద పిట్టలు ఆ వెనుక కదిలే చందమామ మనసులో నాటుకు పోయిన తీయని జ్ఞాపకం కొండ అని, ఆ కొండ  అంటే గొప్ప జీవిత విలువ అని అర్థమయ్యింది అంటారు. అలాంటి కొండను, అరకు లోయ అందాలను అక్కడ ఔషధ మొక్కలు గురించి సర్వేకు  విద్యార్థుల బృందంతో కలిసి ఎక్కుతున్నప్పటి సంభాషణల సమాహారమది.  అక్కడ ఉండే  నాగరాజు అనే వ్యక్తి  గాలి కొండ, రక్త కొండల గురించి చెబుతూ వుంటే ఆసక్తిగా వింటూ ఉంటారు. ఎక్కడానికి వీలుగా గట్టి కొమ్మలు విరిచి వాటి సాయంతో ఇబ్బంది లేకుండా ఎలా ఎక్క వచ్చో చెబుతూ రకరకాల ఔషధ మొక్కల గుణాలను తెలుపుతుంటే చదివే వారికి చాలా ఆసక్తికరంగా,మన ఇండ్లలో పెద్దవాళ్ళు వంటింటి చిట్కా వైద్యం గుర్తుకు వస్తుంది. వాళ్ళు అలా  వెళుతూ ఉంటే పక్క పక్కనే చతురస్రాకారంలో తవ్విన రెండు గోతులు కనిపిస్తాయి.  ఆ గోతుల పక్కనే  మహా వృక్షంలా నిల్చున్న వ్యక్తి కనిపిస్తాడు.ఆ గోతులను తవ్విన దేశం కాని వాడూ,ఆ తర్వాత మన వాడూ అనుకున్న వాడు కూడా ఆ కొండల్లో దొరికే బాక్సైట్ రాయి కోసం తవ్వకాలు జరిపారనీ చెబుతాడు.   కొండెక్కడానికి  వచ్చిన పశుల కాపర్లు, మనుషులు పశువులు అక్కడ గోతులు ఉన్నవి తెలియక అందులో పడి ఎందరో చనిపోయారని అవి  సంపద బావులు కాదు దుఃఖపు బావులని, ఆవేదనతో అనే మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తాయి.కొండల్లో బతికే గిరిజనులకు అవి ఎంత ప్రాణాధారమైనవో , కొండలతో పెనవేసుకున్న వారి జీవన విధానాలను ఛిద్రం చేసిన శక్తులపై పోరాడటానికి సిద్ధంగా ఉన్న సత్తెం తాత లక్ష్యం సఫలం కావాలని చదివిన ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారు. 
ఇక మానస ఎండ్లూరి గారి కథ ‘బొట్టు’ ఇందులో ఇంకా ఈ సమాజాన్ని చీడలా పట్టి పీడిస్తున్న కులమత వివక్షతలను ఎత్తి చూపుతూ రాసిన కథ ఇది. రచయిత రచనల పట్ల పెంచుకున్న అభిమానం అతడి కులం పేరు తెలియగానే తుడిచిపెట్టుకు పోవడం, వాళ్ళ అమ్మాయికి ఆ కారణంగానే  కాలేజీలో సీటు లేదనే అబద్ధం  చెప్పడం.. మన సమాజం ఎటు పోతోంది..
మంచి చెడులు రెండే కులాలు అన్న గురజాడ మాటలు ఎప్పటికీ కలేనా… పాతుకుపోయిన ఈ వివక్షత తొలగేది ఎప్పటికి …. మనిషిని మనిషిగా చూడని అమానవీయ సమాజంలో ఇలాంటివి జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
అనిశెట్టి రజిత గారు రాసిన కథ జీవన భృ (మృ)తి.. ఆలోచించాల్సిన కథ. కని పెంచిన వారి పట్ల పిల్లలకు ఉండవలసిన బాధ్యత గురించే కాకుండా సీనియర్ సిటిజన్ల పట్ల ప్రభుత్వం, అధికార గణం, రాజకీయ నాయకులు, మేధావులు, మనసున్న ప్రతి వారి బాధ్యత స్పందన ఏమిటని ప్రశ్నిస్తుంది ఈ కథ. చాలీ చాలని జీవన భృతి కోసం పిల్లల మీద ఆధారపడటం, సర్కారు ఇచ్చే వృద్ధాప్య పింఛన్ల కోసం తడి ఇంకిపోయిన కండ్లతో  ఎదురు చూడటం చాలా దుర్భరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు రాకూడదని వృద్ధుల  వేదనా భరిత జీవితాల గురించి, సమాజంలో కొడిగడుతున్న  మానవీయ విలువల గురించి, సామాజిక న్యాయం గురించి రాసిన ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తుంది.
సుందరీ నాగమణి నండూరి గారి ‘నేను సైతం’ కథ  ఆడవారి బాత్ రూమ్ సమస్య గురించి  రాసిన కథ ఇది. పబ్లిక్ ప్లేసుల్లో కూరగాయలు పండ్లు, మరి వస్తువులు అమ్మే స్త్రీలు  మూత్ర విసర్జనకు సరియైన వసతి లేక  ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో స్వయంగా ఆ బాధ అనుభవించిన సువర్చల అనే ఉద్యోగిని  పదవీ విరమణ చేసేముందు తీసుకున్న నిర్ణయం ఇంట్లో భర్తకు మిగిలిన స్టాఫ్ కు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ తర్వాత ఆమె చేసిన మంచి పని మరి కొందరికి స్ఫూర్తిగా నిలిచి నగరంలో మరికొన్ని శౌచాలయాలు ఏర్పడటంతో పాటు తనతో విభేదించిన సహ ఉద్యోగి రిటైర్ అయ్యాక కలిసి పని చేస్తానననే ముగింపు బాగుంది.
ఇక డాక్టర్ మాధురి గారు రాసిన “విడ్డూర నామ సంవత్సరం” ఓట్ల కోసం రాజకీయ పార్టీలు పడే పాట్లు ,ఆ ఎలక్షన్లు శ్రీరామ నవమి పండుగ సమయంలో రావడం ,ఒక్కో పార్టీ వాళ్లు వచ్చి మీ ఓట్లు మాకేనంటు వాళ్ళు ఇచ్చే బహుమతులు, గిఫ్ట్స్  పిండివంటలు,పూజా సామాగ్రి, ఇలా రకరకాలుగా ఓటర్లను కాకా పట్టే తీరును వ్యంగ్యంగా మలిచిన తీరు కడుపుబ్బా నవ్విస్తుంది. .
సుమన కోడూరి గారి ‘ఒక్కోయ్’ కథ పల్లెటూరి  కుటుంబాల్లో మొగ బిడ్డ కోసం కోడండ్లను ఇబ్బంది పెట్టడం, ఆడపిల్ల పుడితే కొడుక్కి మరో పెళ్ళి చేస్తానని, ఇంటికి వారసుడు కావాలని  పట్టుపట్టటం. ఆడపిల్ల పుట్టడానికి స్త్రీనే కారణమనే అపోహను తొలగించేందుకు డాక్టరమ్మ ఆసుపత్రిలో వేయించిన డేరాట  గంగమ్మ మనసు మారుస్తుంది..
శాంతి ప్రబోధ గారు రాసిన “బాల్యం మోస్తున్న విషాదం’ కథలో ఎయిడ్స్ వ్యాధి వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ రాకేశ్ అనే బాలుడి కథ. హోమ్ లో చేరిన రాకేశ్  మిగిలిన పిల్లల్లా సెలవుల్లో ఎటూ పోలేని స్థితిలో వాడి మానసిక స్థితిని, వాడి బాధను దగ్గరగా గమనించి రాసిన కథ. పిల్లలు అందరూ ఉన్న ఆరోగ్య కరమైన వాతావరణంలో పెరిగితే బాగుంటుందని  , ఇలాంటి విషాదాలకు కారకులెవరని ప్రశ్నించారు రచయిత్రి.
 స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడి గురించి సరోజినీ దేవి బులుసు గారు రాసిన ‘వక్రదండం’ కథలో  మరుసకు అక్క , ఆమె భర్త స్థానం లో ఉన్న వ్యక్తి చేసే లైంగిక వేధింపులు,అటు భర్తకు చెప్పుకోలేక పడిన వేదన చివరకు సాహసంతో తీసుకున్న నిర్ణయం ఈ కథకు చక్కని ముగింపు.   
ఇవే కాకుండా ఊపిరాడని సంసార బాధ్యతలు, కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ కథ. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఆమె విలువ అర్థం కాని భర్త ఆమె ఇంట్లోంచి ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఆమె విలువ తెలిసి కలిసి నడిచేందుకు సిద్ధమైన ఆమె భర్త గురించి రాసిన కథ “స్వయం సిద్ధ”..
ఇవే కాకుండా పర్యావరణం లో భాగమైన పిచ్చుకలు అంతరించిపోతున్న క్రమంలో వాటి గురించి బాల్యపు జ్ఞాపకాలను తడుముకుంటూ రాసిన కథ  కరుణ తాయమ్మ గారి’ పిచ్చుకల పిచ్చి’ కథ.  మల్లీశ్వరి గారి కథ ‘రూబా’ కుక్క పిల్ల కథ, ‘అతి సర్వత్ర వర్జయేత్’  కవిని ఆలూరి గారి కథ లో ఫేస్ బుక్ ను అధికంగా వాడడం వల్ల వచ్చిన అనర్థాలు కుటుంబంలో జరిగే విషయాలు పట్టించుకోకుండా ఉన్న సగటు ఇల్లాలు లో వచ్చిన మార్పు. సాంకేతిక సంబంధాల కన్నా మానవ సంబంధాలే మిన్న అని తెలుసుకున్న కథ ఇది.
ఇంకా ఇందులో విజయ భండారు గారి కథ  ‘ఎలుగు బిం’ తాగుడు అలవాటు మానేసి మంచి మార్గంలో నడిచేందుకు యాదమ్మ చేసిన ప్రయత్నం.  గిరిజన జీవితాలను గురించి రాసిన_’ నా మగడు కోవర్టెట్లయితడు? విజయ భాను కోటే గారు రాసిన కథ
 కథ కోవర్ట్ ఆపరేషన్స్ చేసే సమయంలో  ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదే అనే సామాజిక న్యాయం గురించి రాసిన కథ ఇది. శ్రామిక మహిళా జీవితాలపై అధికార పూర్వక దౌర్జన్యం చేసిన ‘లాఠీ కర్ర’ కథ.అసహాయులపై  నిత్యం లాఠీలు ఎలా దుర్మార్గానికి తలపడతాయో చెప్పే కథ. దారిద్య్రం,పీడన, నిస్సహాయతతో అల్లాడే శ్రామిక మహిళా సమస్యలను దృశ్యమానం చేసిన కథ వనజ తాతినేని గారు రాసిన ‘లాఠీ కర్ర’  ఇంకా ఇందులో ఆలూరి విజయలక్ష్మి గారి ‘కేతనం’ కథ, శోభారాణి కొలిపాక గారు రాసిన ‘క్రీ(నీ)డ’  కథ, మృత్యు కుహరం, నాన్నంటే పాపకు దీపం లాంటి కథలు విభిన్న కోణాల్లో మహిళలు, పిల్లలు పడే బాధలు, ఎదుర్కొనే ఆధిపత్య వేధింపులు మొదలైన వాటిని సృజించాయి. 
ఇరవై ఒక్క మంది రచయిత్రులు తమ తమ కోణాల్లో చూసిన అనేకానేక  సంఘటనలు , జీవితాలను స్త్రీ వాద కోణంలో కథా రూపంలో మలవడంతో ఈ సంకలనం ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు.
 ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ద్వారా మరిన్ని సామాజిక చైతన్య సంకలనాలు రావాలని కోరుకుందాం.
తేదీ:02-02-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
సమీక్షా వ్యాసం
పుస్తకం పేరు: అనేక ఆకాశాలు– స్త్రీల కథలు
సంపాదకులు: డా.పుట్ల హేమలత, డా. కె.ఎన్.మల్లీశ్వరి గార్లు
ప్రచురించిన సంవత్సరం:2016
వెల:150 /రూ
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
 శీర్షిక: అనేక ఆకాశాలు– యథార్థ గాథల ఆవిష్కరణలు
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.