అబలల ఆర్తనాదాలకు అక్షర రూపం “ఎర్రగాలు”

-సరోజన

ఇది ఒక అమీన కథ
ఇది ఒక వేశ్య గాథ
ఇది ఒక విధవ వ్యథ
ఇది మనువు మాయాజాలపు ఉరులకు చిక్కి ఉక్కిరిబిక్కిరవుతున్న ఉవిదల కన్నీటి ఊట. 
ఇది పురుషాధిక్యపు కబంధ హస్తాల్లో యిరికి అతలాకుతలమౌతున్న అతివల పదునెక్కినతూట.
ఇది అడుగడుగునా దగా పడుతున్న అతివల ఆక్రందనలను బాపే, ఆక్రోశాల అక్షరాల మూట
 
అభ్యుదయ కవి కూకట్ల తిరుపతన్న రాసిన ఎర్రగాలు కవితా సంపుటిలో అబలల అంతరంగ వ్యథను, అతివలపై జరుగుతున్న అరాచకాలను, ఎంతో ఆవేదనతో కళ్ళ ముందుంచాడు. అనాదిగా అంగలారుస్తున్న అంగనలు ఏకమై అకృత్యాలపై, అనాచారాలపై, తిరుగబడాలని మేల్కొల్పుతారు. ఇది మహిళలపై తనకున్న గౌరవానికి, సానుకూలతకు ఓ…నిదర్శనం.
“అమీనా”లు పేరుతో తిరుపతన్న రాసిన కవితను ఒకసారి పరిశీలిద్దాం. 
“మన్సు నిండారుగ 
గూడు కట్టు కున్న గుడ్డి నమ్మకం..
కుచేలా సంతానాన్ని కుప్పలుగా
ఇరుకింట్ల బరీపూల్ గా పండించింది..
ఆకలి కడుపు నింపని
కడు గారీబ్ కొంపల
బేలగా మానవతా చూపులు”.(ఇంకా ఉంది)
 
పాత బస్తీ నిరుపేద మహ్మదీయ మహిళల దీనస్థితికి అద్దం పడుతుంతుంది ఈ కవిత.
ఇది ఒక ముక్కు పచ్చలారని అమ్మాయి అమీన బాధ. ఇది ఎనలేని పసి పిల్లల వ్యథ కూడా. నిత్యం అమీనాలాగే నేలరాలే పసి మొగ్గలు ఎందరో కదా! అని కవి అక్కరాలతో దుక్కశీలుతాడు.
గంపెడు మంది సంతానం. వారిని పోషించడమే భారం అనుకునే తల్లి దండ్రులకు వాళ్ళ వివాహం చేయలేని దీనస్థితి. ఇదే అదనుగా భావించి 
డబ్బున్న దుబాయి షేకులు,ఈ పసి పిల్లల తల్లిదండ్రులకు కాసుల వల వేస్తరు.
రంగుల ప్రపంచాన్ని ఎరగా చూపి, ఆ పసి హృదయాన్ని బేరం పెడతారు. ఇలా అభంశుభం తెలియని ఆడపిల్లల జీవితాలను ఛిద్రం చేయడం అమానవీయం. ఆ పసివాళ్ళ తల్లిదండ్రులు పేదరికం అనే అడ్డును తొలిగించుకొని, హాయిగా బ్రతుకాలే అన్న ఆత్యాశతో వాళ్ళను అంగట్ల సరుకుల వోలె ఆ షేకులకు అమ్మేసే అకృత్యాన్ని కూకట్ల తిరుపతన్న దృశ్యమానం చేశారు. ఇగ కాటికి కాలు చాపిన మూడు కాళ్ళ ముసలి వాళ్ల దగ్గరి నుండి మొదలై వాళ్ళతో కామదాహం తీర్చుకునే వారు ఎందరో ?
వాళ్ళ అవసరం కోసం నిఖా (పెళ్లి)చేసుకొని , అవసరం తీరిన తరువాత వాళ్ళను చిత్ర హింసలకు గురి చేయడం పరిపాటే. తలాక్ పేరుతో వాళ్ళను వదిలించుకునే వాళ్ళు.ముస్లీం వాళ్లలో నిఖా అంటే ఒక ఒప్పంద పత్రం. రెండు నిండు జీవితాలకు సంబంధించిన పవిత్ర బంధం. ఆ అంగీకార పత్రం పెళ్లి కొడుకు, పెళ్లి కూతరు, పెళ్లి పెద్ద దగ్గర ఉంటుంది.ఇద్దరికి అభిప్రాయ బేధాలు ఏర్పడి నప్పుడు త్రిపుల్ తలాక్ తో విడాకులు తీసుకోవచ్చు.
కానీ ఇది కూడా కొన్ని షరతులతో కూడి ఉంటుంది. 
మద్యం మత్తులోనో, కోపంతో వున్నప్పుడో ఆడవారు ఋతుక్రమంలో వున్నప్పుడు గాని ఇలా ఇంకా కొన్ని సందర్భాలలో తలాక్ చెప్పారాదు. కామాంధులైన కొద్ది మంది దుబాయ్ షేకుల వల్ల ఈ వివాహ బంధం అభాసుపాలవుతున్నది. వీళ్ళ ఆచారం ప్రకారం మూడు సార్లు తలాక్, తలాక్, తలాక్ అంటే వాళ్లకు విడాకులు అయినట్టేనట!. ఇక్కడ చట్టంతో కూడా పని లేదు.అందుకే ఈ దురాచారం వల్ల ఎందరో అభాగ్యుల జీవితాలు బలయినాయి. ఇలా తలాక్ పేరుతో, డబ్బును ఎర వేస్తూ…అతివల జీవితాలతో ఆడుకుంటూ…ఎంత మందినైనా నిఖా చేసుకుంటూ…వాళ్ళను వాడు కొని, అమ్ముకొని, ఎంతో మంది పేదరికపు పసిబాలల జీవితాలను నాశనం చేశారో ? తలచుకుంటేనే ఒళ్ళు కంపరం వేస్తున్నది. మనసు కలచి వేస్తున్నది. ఈ మధ్యనే ఈ దురాచారం నుండి ముస్లీం మహిళలకు విముక్తి కలిగిందనుకుంట. వాళ్ళ హక్కులకు రక్షణ కల్పించే సంచలనాత్మక తీర్పును వెలువరించి, వాళ్ళకు న్యాయం చేసింది సుప్రీం కోర్టు.
 
యుగయుగాలుగా మగువల జీవితాలతో చెలగాటం ఆడుకున్న దురాచారాలు కోకొల్లలుగానే ఉన్నాయి. వాటిలో సతీ సహగమనం, కన్యాశుల్కం, బాల్య వివాహాలు స్త్రీల జీవితాలను ఛిన్నాభిన్నం చేశాయి. దేవదాసీ, జోగినీ, ఉంపుడు, వేశ్య వ్యవస్థలు ఆడవారి జీవితాలతో ఆటలాడుకున్నాయి. ఇలాంటి దురాచారాల నిర్మూలనకు సంఘసంస్కరణవాదంతో అనేక రచనలు వెలువడ్డాయి. ఇపుడు కూకట్ల తిరుపతన్న కలం నుండి పురుడోసుకున్న “మసి గాయాలు” అనే రచన కూడా ఆ కోవకు చెందినదే. 
“మూఢనమ్మకం ముసుగేసిందో..?
కుల కస్పిగ తలవంచిందో..?
విధి వంచించిదో.?
కడుపు మంట కడతేర్చుటకో.?
పసి కాయం
అంగడి బొమ్మ అవతారం” (ఇంకా ఉంది)
ఎనకట మూఢ నమ్మకాలతో దేవుని పేరు మీద కొంత మంది ఆడపిల్లలను ఇడిసి పెట్టేది. బలవంతంగా దేవునితో పెండ్లి చేసి, దేవదాసీని చేసేవారు. ఇక ఆమె బ్రతుకు ఊరుమ్మడి గొడ్డులా తయారయ్యేది. కామాంధుల ఇండ్లల్ల దాసీలను ఏర్పాటు చేసుకునేవారు. ఇది కాక వేశ్యవృత్తి కులవృత్తిగా ఉండేది. ఊరిలోని “భోగం” ఇండ్లల్ల ఈ పనిని చేసేవారు.ఈ పడుపువృత్తి దూరాచారామే అయినా వాళ్ళ బ్రతుకు దెరువు కోసం నిర్వహించేవారు.
వాళ్లు వైవాహిక వ్యవస్థకు దూరంగా ఉండేవారు.
అప్పుడైనా, ఇప్పుడైనా,ఎప్పుడైనా డబ్బే మనుషుల జీవితాలతో ఆడుకుంటుందనేది వాస్తవం. 
పొట్ట కోసం, బట్ట కోసం వాళ్ళు చేసుకోవడానికి వేరే పనిలేక ఈ నీచ వృత్తినే చేయడం విషాదకరం.
పైగా ఆ కాలంలో అంటరానితనం అమితంగా ఉండేది. క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర అని సమాజాన్ని విభజించి పాలించిన తీరు నీచమైనది. ఇప్పటికీ మీది చిన్నకులం, మాది పెద్దకులం అంటూ మానవుల మధ్యన విభజన రేఖలు గీయడం, మానవత్వపు విలువలు లేకుండా మసలుకోవటం చూస్తూనేవున్నాము. పడుపునే వృత్తిగా చేసుకొని ఆ రొంపిలో వుండే వాళ్ళు కొందరు అయితే, పొట్టకూటి కోసం ఇంకొందరు బలవంతంగా ఈ రొంపిలోకి లాగబడతారు. ఏదియేమైనా ఈ దురాచారాన్ని దునుమాడ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 
పసి పిల్లలను ఎత్తుకపోయి ఇలాంటి ఇండ్లలో అమ్ముకునే పాపిష్టి వాళ్ళ ఆగడాలను అరికట్టాల్సిన బాధ్యతను మనం విస్మరించకూడదు. ఇగనన్నా ఆ చీకటి బ్రతుకులు వాళ్ళ జీవితాలను చిధిమేయకుండా చూడాల్సిన అవసరముంది.
 
“మల్లెలు జల్లిన చీకటి
పల్లేరు గాయల పాన్పు”
నిజంగ మస్తు జెప్పినవు అన్నా!
శరీరాన్ని చిత్ర హింసలు పెడుతూ,నరకం చూపిస్తూ,
ఒంటిని ముద్దాడే వాడి సిగరెట్టు గాయాలు.
అన్నీ మరిచి, లేని చిరునవ్వు మోకానికి రుద్దుకోవడం
ఎంతటి నరక ప్రాయం అబల జీవితం. ఇలా 
కామ దాహానికి కాలి పోతున్న బ్రతుకులు ఎన్నో ?
ఇంకా ఇలా ఎందరి బ్రతుకులు బుగ్గి పాలు అవుతాయి ? ఆడంబరాల కోసం కాదు, ఆస్తుల కోసం కాదు, రాజకీయం చేసి, రాజ్యమేలడానికి కాదు.
కడుపు నింపు కోవడానికి, తన జీవితాన్ని తానే దహించు కుంటూ, రోగాల పాలవుతూ,
తనను తానే బలి తీసుకోవడం బాధాకరం. బలవంతంగా ఆడపిల్లలను ఈ మురికి కూపంలోకి దింపుతున్న గుంట నక్కల భారతం పట్టాల్సిన అవసరముంది. ఇటీవలనే యాదగిరిగుట్ట నేలమాలిగలలో ఆడపిల్లలను దాచిన వ్యభిచార రాకెట్టు గుట్టు రట్టయ్యిన సంగతి గమనార్హం. ఇప్పటికైనా చట్టాలు చట్టు బండలు కాకుండా, కట్టుదిట్టంగా అమలు పరచాలి. ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని కాపాడుకోవలసిన గురుతర బాధ్యత ఈ సభ్య సమాజంపైనే ఉంది. 
 
కూకట్ల తిరుపతన్న లిఖించిన అనుభూతివాద కైత “అమ్మ ఆనవాళ్లు”లో ….
“తాళి కట్టిన వాడు
తనువు చాలించగానే……”
భార్యను విధవరాలుగా మార్చడం
మన సమాజంలో అనాదిగా వస్తున్న మూఢాచారం.అది ఇప్పటికీ కొనసాగుతుండడం కడు దయనీయం. భర్త చనిపోగానే, భార్య మెడలోని నల్ల పూసలగుండ్లను పెరికేయడం, కాలి మెట్టలు ఊడ బెరకడంతో పాటు, అతివకు అలంకార ప్రాయమైన గాజులు, బొట్టు, పువ్వులు తీసేయడం ఎలా సంస్కారమవుతుంది. భర్త బ్రతికి ఉంటేనే అన్ని లేకుంటే ఏదీ లేదు. ఇదెక్కడి సమధర్మం ? ఇంకెన్నాళ్ళీ మనుధర్మం ? ఇంకా ఒకప్పుడు ఘోరాతిఘోరమైన సతీ సహగమనం ఉండేది. భర్త చనిపోతే అదే చితిలో భార్యను కూడా మూర్ఖంగా సజీవ దహనం చేసేవారు. కొంత మంది పెద్దవాళ్ళు దాని కోసం పోరాటం చేయగా, ఇప్పుడు ఆ దురాచారం మాసిపోయింది. ఇగ భర్త చనిపోయిన మహిళను విధవరాలు (ముండ, ముండబొడ్డి) అని పిలవడం కడు హేయనీయం. భర్త చనిపోతే తను జీవితాంతం మళ్ళీ వివాహం చేసుకోకుండా అలాగే ఉండడం. గుండు కొట్టుకొని, తెల్లచీర కట్టుకొని, శుభ కార్యాలకు దూరంగా ఉండడం. ఆమె ఎదురు వస్తే ఆపశకునమని, మగువ జీవితాన్ని మళ్ళీ చిగురించకుండా తుంచేశారు. రాజా రామ మోహన రాయ్ లాంటి సంఘ సంస్కర్తల ఉద్యమం ఫలితంగా వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది. మహిళలకు కొంత ఊరట నిచ్చింది. ఆచారవ్యవహారాలు అంటూ, పాత రోతనే పట్టుకొని కూర్చోకుండా కొంతలోకొంత మార్పు భర్తను కోల్పోయిన వారికి మళ్ళీ పెళ్లి చేసి, న్యాయం చేయడం ఆరంభమైంది. 
“ఇంతులారా !
ఇకనైనా మేలుకోండి” 
ఈ సమాజాన్ని మేల్కొలిపే ఈ కవి పిలుపును
అందరూ అందుకొని, ఆడపుట్టువడితో వచ్చిన నొదుట సిందూరం, చేతుల గాజులు, సిగల పువ్వులను అలంకార ప్రాయాలు గానే భావించాలి. ఆచారం ముసుగులో కొనసాగుతున్న దురాచారాలను దునుమాడుదాం. ఇగనన్నా వాటిని అలాగే ఉంచే, సంస్కారం మనందరిలో రావాలి. “ఇంటి దీపం” కవితలో కవి సహచరి లక్ష్మి జీవితాన్ని, “అమ్మ” కైతలో తన తల్లి అంకవ్వ పాయిరాన్ని స్వభావోక్తిలో అక్షరీకరించన తీరు పాఠకులను ఆలోచింప చేస్తుంది. ఇంకా ఈ సంపుటిలో అన్నీ ప్రస్తావనార్హమైన కవితలే ఉన్నాయి. స్థలాభావం వలన అవి పాఠకుల ఇచ్ఛకే వదలివేస్తున్నాను. స్త్రీల సాధకబాధకాలు ఇతివృత్తంగా కూకట్ల తిరుపతన్న మునుముందు మరిన్ని కవితలు రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
 
*****
Please follow and like us:

One thought on “అబలల ఆర్తనాదాలకు అక్షర రూపం “ఎర్రగాలు””

  1. ఎర్రగాలు కవిత్వ లోతుల్లోకి వెళ్ళి, ధీటైన ఘాటైన వ్యాసం రాసిన సోదరి సరోజ గారికి అభినందనలు. అచ్చేసిన నెచ్చెలి సంపాదక వర్గానికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.