గంగ ఎక్కడికెళుతోంది?

జయకాంతన్ తమిళ నవలకు జిల్లేళ్ళ బాలాజీ తెలుగు అనువాదం

 -పి.జ్యోతి

గంగ ఎక్కడికెళుతోంది?…. ఇది తమిళంలో వ్రాసిన “గంగై ఎంగే పోగిరాళి”? అనే జయకాంతన్ గారి నవలకు తెలుగు అనువాదం. దీన్ని జెల్లేళ్ళ బాలాజీ గారు అనువాదం చేసారు. 2017 లో విశాలాంధ్ర లో ఇది డైలీ సీరియల్ గా వచ్చింది. పుస్తక రూపంలో 2019 లో వచ్చిన రచన ఇది. 

జయకాంతన గారు చాలా ఏళ్ళకు ముందు “అగ్నీ ప్రవేశం” అనే ఒక కథ రాసారు. అందులో వచ్చే పాత్ర గంగ. ఆ కథలో ఆమె కాలేజీలో చదివే ఇక సాదారణ అమ్మాయి. ఒక రోజు కాలేజీ నుండి ఇంటికి రావడానికి బస్సు కోసం నిలబడిన ఆమెను కారు లో ఎక్కుంచుకుని ఒక వ్యక్తి అత్యాచారం చేస్తాడు. ఇంటికి వచ్చి జరిగిన సంగతి తల్లికి చెప్తే ఆమె కొంత బాధపడినా, ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దని, జరిగింది ఒక ఆక్సిడెంట్ అని మర్చిపొమ్మని, జీవితాన్ని మామూలుగా జీవించమని బిడ్డకు చెబుతుంది. 

ఆ కథలో వచ్చిన గంగ పాత్ర తరువాతి జీవితం గురించి  “సిల నేరంగళిల్ సిల మనిదర్గళ్” అని ఒక  జయకాంతన్ గారు ఒక నవల రాసారు. దాన్ని మాలతీ చందుర్ గారు “ కొన్ని సమయాలలో కొందరు  మనుషులు” అని తెలుగులోకి అనువాదించారు. ఆ నవలలో గంగ తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని కనుక్కుని అతని వద్దకు వెళ్ళడం. అతనికి అప్పటికే వివాహం అయి ఇద్దరు పిల్లలు ఉండడం. మేనమామ సహాయంతో గంగ చదువుకుని ఉద్యోగస్తురాలు అవడం. గంగపై  అత్యాచారం చేసిన వ్యక్తి పేరు ప్రభు. అతను దుర్మార్గమైన జీవితం జీవిస్తున్నా తరువాత గంగ స్నేహంతో పరిణితి చెంది ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మారడం, అతన్ని గంగ ప్రేమించడం ఈ నవలలో జరుగుతుంది. 

అయితే ప్రభు ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. తన కూతురు మంజు ఎంతో గంగ కూడా తనకు అంతే అని, తాను ఆమెను వివాహం చేసుకోలేనని కాని ఆమె జీవితం బావుండాలని కోరుకుంటాడు. తరువాత ఆమెను తండ్రిలా ఆదరించిన మేనమామ ఆమెను శారీరికంగా కోరుకుంటాడు. అయితే గంగ అతనిలోని ఈ పశు ప్రవృత్తిని అసహ్యించుకుంటుంది. గంగ తనను ఒక పురుషుడిగా ప్రేమిస్తుందని తెలుసుకుని ప్రభు ఆమెకు దూరం అవుతాడు. మేనమామ కూడా గంగ అవమానించిన తరువాత తనలోన్ వికారనికి సిగ్గుపడి ఇంటినుండి విళ్ళిపోతాడు. ఈ నవలలో మంచివాళ్ళు గా ఉండే మనుష్యులు కొన్నిసందర్బాలలో దుర్మార్గంగా ప్రవర్తించడం, దుర్మార్గులుగా జీవించిన వారు కొన్ని సార్లు ఎవరూ ఊహించని మంచితనం ప్రదర్శించడం కనిపిస్తుంది.  ఈ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అది సంపూర్ణమైన నవలగానే అందరూ పరిగణించినా గంగ పాత్ర పై ప్రేమ తో ఆ పాత్ర ముగింపు ఎలా ఉంటుందో అన్న ఉత్సాహంతో రచయిత ఆ మొదటి నవలకు మరో సీక్వెల్ గా “గంగ ఎక్కడికేళుతుంది” అనే ఈ  నవలను రాసారు. రచయిత మాటల లోనే “ ఒక కథ, సమకాలీనమైన కథ, వాళ్ళు ప్రాణంతో ఉన్నంతవరకూ ముగిసిపోయినట్టు మాత్రమే కాదు, ఆ పాత్రలు మధ్యలో విరక్తి చెంది, బాధితులుగా మిగిలిపోకూడదనుకోవటం మంచి ఆలోచనే అవుతుంది. ఈ మంచి గుణం ఏదో కరుణతో ఉప్పొంగినది కాదు. విరక్తీ. బాధా జీవిత్గంలో తాత్కాలికమే తప్ప అదే శాశ్వతం కాదు, ముగింపు కాదన్న భావన కలిగినవాళ్ళు, కళా రూపం కోసమూ, ‘కొత్తదనం’ కోసమూ ఒక మార్పు కోసమూ తప్పయిన మాటల్ని, అపనమ్మకపు విత్తనాలు నాటి పంట కోతకోసే నిర్ణయాలకు తమ సృష్టిని స్రుజించకూడదు. “…. ఈ ఆలోచనలతోనే జయకాంతన్ గారు రాసిన మరో నవల “గంగ ఎక్కడికెళుతుంది”? మొదటి నవలకు  మరో భాగం ఇది. ఇటువంటిది భారతీయ సాహిత్యంలోనే ఒక గొప్ప ప్రయోగం.  ఇది జయకాంతన్ గారి ప్రత్యేకత. 

ఇక ఈ నవల కథకు వద్దాం. గంగ పెద్ద ఉద్యోగస్తురాలవుతుంది. ఉద్యోగంలో గొప్పహోదా అనుభవిస్తూ ఉంటుంది. ప్రభు లేని లోటు ఆమెను మనశ్శాంతిగా ఉండనివ్వదు. మెల్లగా మద్యానికి అలవాటు పడుతుంది. అది లేకుంటే ఉండలేని స్థితికి వస్తుంది. అప్పుడే ఆమెను అసహ్యించుకుని ఇంటి నుండి గెంటేసిన అన్నకు పక్షపాతం వచ్చిందని తెలుస్తుంది. అన్న పరిస్థితి గమనించి అతన్ని అతని కుటుంబాన్ని ఇంటికి తీసుకునివస్తుంది గంగ. గంగ మేనమామ కాశికి వెళ్ళిపోయి అక్కడే మరణిస్తాడు. తన యావదాస్థిని గంగకు రాస్తాడు.. గంగ తన అన్న ముగ్గురి ఆడపిల్లలను చదివిస్తూ ఉంటుంది. ఒక రోజు రోడ్డు మీద ప్రభు కనిపిస్తాడు. అతన్ని తన ఇంటికి తీసుకుని వస్తుంది. ఆమె తాగుడు అలవాటు గమనించినా ప్రభు ఆమెని ఏమీ ప్రశ్నించడు. అతనితో పాటు కూర్చుని మధ్యం సేవించినప్పుడు ఇక తనకు ప్రభు ఉంటే చాలని మందు అవసరం ఉండదని గంగ అనుకుంటుంది. అలాగే ఆ అలవాటు ను మానుకుంటుంది.  ప్రభు ఆమె స్నేహితుడిలా వ్యవహరిస్తాడు. అతనికి అతని కుటుంబంలో పెద్ద సత్సంబంధాలుండవు. కూతురు మంజు మాత్రం తండ్రి ని అభిమానిస్తుంది. ప్రభు అలవాట్ల  వల్ల నలిగిపోయిన అతని భార్య పద్మ అతన్ని ద్వేషిస్తుంది. 

గంగ తన అన్న పెద్ద కూతురుకు మేనమామ మేనేజర్ కొడుక్కు వివాహం జరిపిస్తుంది. ఆస్తి విషయంలో మేనజర్ పన్నుతున్న కుట్ర అర్ధం చేసుకుంటుంది. తనకు మేనమామకు అక్రమ సంబంధం అంటగట్టే ప్రయత్నం జరుగుతుంటే ఆ అస్థి అంతా మేనేజర్ కు, మామ భార్యకు అప్పగిస్తుంది. వసంత గంగ అన్న రెండవ కూతురు. చాలా ఆలోచనా పరురాలు. వివాహం పై ఆమెకు పెద్దగా నమ్మకం ఉండదు.  “పెళ్ళి అన్నది ఒక అపవాదుకు భయపడి చేసుకునే కార్యమా? ఒక నెగెటివ్ ఆస్పెక్ట్గా ఎందుకు అయిపోయింది పెళ్ళి” అన్న ఆమె ప్రశ్న గంగను కూడా ఆలొచనలోకి పడేస్తుంది.  “పెళ్ళి అన్నది వేదాలు, శాస్త్రాలు, చట్టాలు, సంప్రదాయాలు చెప్పే భాష్యానికి, వ్యవహారంలో నిరూపణమయ్యే నిజాలకు చాలా తేడా ఉంది” అన్నది వసంత ఆలోచన. అసలు స్త్రీ తన జీవితం గురించి ఆలొచించాలంటే ఆమె జీవితంలో ఒక ప్రమాదమే జరగాలా? కొందరు స్త్రీలు ఈ పెళ్ళి అనే వ్యవస్థలో ఉండవద్దని కోరుకోవడం తప్పు కాదే అంటుంది వసంత. పెళ్ళి చేసుకోకుండా ఆడవాళ్ళ పక్కన నిలబడే అర్హత కూడా లేని కొందరు మగవారు ఆడదాని మీద అధికారం చెలాయించడం దానికి స్త్రీలు తల వగ్గ్గడం అందరికీ ఇష్టం కాకపోవచ్చు. అప్పుడు ప్రతి ఒక్కరిని ఈ పెళ్ళి అనే చట్రంలో బిగించాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్? ఆడా మగా విషయాలు ఒక సంతోషాన్ని కలిగించే విషయాలు అని నాకు అనిపించట్లేదు” అన్న వసంత వాదనలోని లోతు గంగకు అర్ధం అవుతుంది. ఇప్పటి తరంలో ఒక స్పష్టత ఉందని వారి జీవితాన్ని వారు నిర్ణయించుకోగలరని గంగ నమ్ముతుంది. 

ప్రభు తన పాత జీవితం వదిలేసి దూర ప్రాంతంలో ఒక కార్మికుడిగా బ్రతుకుతూ ఉంటాడు. ఒక మగపిల్లవాన్ని పెంచుకుంటాడు. మంజు కోరిక మీద ఆమె వివాహానికి వచ్చినా అక్కడే ఆ కుటుంబంతోనే కలసి ఉండిపోవాలనుకోడు. భార్య పద్మ అతనితో ఉండాలని కోరుకున్నా అతనికి ఆ దూరమే బావుంది అనిపిస్తుంది. ఎవరెంత మారినా వాళ్ళ క్వాలిటికి తగ్గట్టుగానే మారతారు. కాబట్టి దూరం ఉండడంలోనే శాంతి ఉంది అని నమ్ముతాడు. ఇప్పటి స్త్రీలు కూడా ఆధునికంగా కనిపిస్తున్నారు. కాని పురాణకాలం, వేదకాలం, ఆచారాలకంటా ప్రతినిధుల్లా ఉన్నారు. కాస్త ఐరోపా సాంప్రదాన్ని పై పూతగా పూసుకున్నారు అంతే’ అని ఒక సందర్భంలో గంగకు చెబుతాడు. వసంత కూడా ఒక సందర్భంలో తన శరీరం తనకు గౌరవానికి, మర్యాదకూ తగ్గ ఆబ్జెక్టివ్ అని తన శరీరం పై హక్కు తనదే అని పెళ్ళీ అనే పేరుతో ఆ హక్కుని మరొకరికి ఇవ్వలేనని స్పష్టం చేస్తుంది. ఒక పెద్ద డాక్టరుగా మరో మిత్రుడితో కలిసి హాస్పిటల్ పెట్టి తన జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుంటుంది. గంగ ఆమె పేరున తన ఆస్థినంతా రాసి తన రిటైర్మెంట్ తరువాత కాశిలో జీవితాన్ని గడపడానికి వెళ్ళిపోతుంది. ఎంత అభిమానం ఉన్నా ఒకరితో ఒకరు పెనవేసుకుని ఎంత కాలం ఉండగలం అంటూ తన కుటుంబం నుండి వీడ్కోలు తీసుకుంటుంది.

 “ఒక్కొక్కరికీ వాళ్ళూ చేయ్యదగిన పనులంటూ కొన్ని ఉంటాయిగా, దాన్ని రోజూ పూర్తిచేసి అమ్మయ్య అంటూ వెనక్కు వాలటమేగా జీవితమంటే. అంతే కాకుండా ఒక ప్రాయంలో ఉండే అనుబంధాలు ఇంకో ప్రాయంలో ఎవరితోనూ ఉండవు. ఉన్న అనుబంధమూ ఏదో ఒక జ్ఞాపకంలా ఉండటమే మంచిది” అంటూ అందినీ వదిలి ఒంటరిగా వెళ్లిపోవాలనుకుంటుంది.  ఆమెతో పాటు ఒక స్నేహితుడిగా ప్రభు కలిసి కాశి వెళ్ళిపోతాడు.  వెళ్ళేముందు పెంపుడు కోడుకుతో “జీవితాంతం ఎవరో గీసిన గీతలోనే నడిచి, అన్ని భాద్యతలనూ నెరవేర్చి శరీరం విశ్రాంతి కోరుకుంటున్నప్పుడు కొంతమందికే ఈ స్వేచ్చా స్వాతంత్రాలన్న రెక్కలు మొలుస్తాయి” ఆ స్వేచ్చ నాకు వచ్చింది. దాన్ని వినియోగించుకోనివ్వు అంటూ కొడుక్కు చెప్పి కాశి వెళ్ళిపోతారు గంగ, ప్రభులు. ఒకరి సాంగత్యాన్ని మరొకరు ఆస్వాదిస్తూ కలిసి కాశిలో జీవిస్తారు. అక్కడే ప్రమాదవశాత్తు గంగ గంగానదిలో  మునిగి చనిపోతుంది. 

గంగ పాత్రలో మనకి కనిపించే ఆధ్యాత్మిక ఎదుగుదలను గమనించడం అవసరం. నిస్సహాయమైన యువతిగా అగ్నిప్రవేశం కధలో మొదట దర్శనమిచ్చే గంగ చివరకు ఒక మహోన్నత వ్యక్తిత్వంతో  కనిపిస్తూంది. అన్ని బంధాలనుండి బంధనాల నుండి పరిణితితో విముక్తమవడం కనిపిస్తుంది. ఆమెపై అత్యాచారం చేసిన ప్రభు ఎందరో అమ్మాయులతో సంబంధం ఉన్నవాడు. కాని గంగ అతని జీవితంలో ప్రవేశించిన తరువాత అతని ఆలోచనలో పరిణితి వస్తుంది. అన్ని వ్యామోహాల నుండి దూరం అవడం నేర్చుకుంటాడు. జీవితమనే బాటలో తనలోని బలహీనతల పై ఒక్కొక్కటిగా విజయం సాధిస్తాడు. గంగ మేనమామ గంగ ను ఆదుకుని ఉద్యోగస్తురాలిని చేసినా ఆమెపై వ్యామోహాపడి ఆమెను శారీరికంగా అనుభవించాలనుకుని భంగపడి చివరకు అతనూ ఆధ్యాత్మిక బాటలోనే ప్రయాణించి వైరాగ్యపు స్థితికి చేరుకుంటాడు. 

తన కే మాత్రమూ సంబంధం లేని ఒక పమాదం గంగ జీవితాన్ని అతలాకుతలం చేస్తే దానికి భాద్యుడైన వ్యక్తి తో పాటు తనను ద్వేషించిన ప్రతి ఒక్కరికీ మార్గం చూపే ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా పరిణితి చేందే గంగ పాత్రలోని గొప్పదనం పాఠకులను కట్టిపడేస్తుంది. అయితే గంగ జీవిత ప్రయాణంలో ఆమె బలహీనతలనూ, ఆమె లోని మనో చంచలత్వాన్ని చూపడం జయకాంతన్ గారి నిజాయితీకి గుర్తు. ప్రతి మనిషిలో కొన్ని మనోవికారాలుంటాయి. వాటిని తీర్చుకోవాలనే తపన మనిషిని ఎన్నో పనులకు ఉసిగొల్పుతుంది. కాని వారి జీవిన ప్రయాణంలో వారు ఏ దిక్కుగా ప్రయాణించారన్నది ముఖ్యం. ఏ ఒక్క సంఘటనతో జీవితం ఆగిపోదు. మనిషి జీవితం ముగిసిపోదు. అన్నిటినీ గంగానదిలా తనలో ఇముడ్చుకుని తనను తాను పరిణీతి చేందించుకుంటూ ముందుకు సాగిపోవడమే గంగ చేసిన పని. అందుకే ఆ పాత్రలో కొన్ని బలహీనతలు, కొన్ని ఆశలు, కొన్ని మనోవికారాలు కనిపిస్తాయి. అయితే గంగ వీటిని అధిగమించి తన జీవితాన్ని నడిపించుకున్న తీరు ఆ పాత్ర పై గౌరవాన్ని కలిగిస్తుంది. చాలా తాత్వికంగా రాయబడిన ఈ నవల సాధారణ నవలల్తో పోలిస్తే కొంచేం అర్ధం అవడం కష్టమే కాని రచయిత ఆలోచింపజేసి మనలను గంగకు దగ్గర చేస్తారు. 

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.