బొట్టెట్టి  

-అనురాధ నాదెళ్ల

‘’బొట్టెట్టి’’ కథల పుస్తకం రచయిత్రి చంద్రలతగారికి పరిచయం అక్కరలేదు. తానా వారు 1997లో మొదటిసారిగా పెట్టిన నవలల పోటీలో ఆమె రాసిన ‘’రేగడివిత్తులు’’ నవల బహుమతి పొందిందన్నది ఆమె పేరు పరిచయమున్న అందరికీ తెలిసున్న విషయం. 

ఆమె నడుపుతున్న ‘’ప్రభవ’’ పిల్లల ప్రపంచానికి ఒక కానుక. పిల్లల సహజ కుతూహలాల్ని అర్థం చేసుకుంటూ ప్రకృతి ఒడిలో వారి ఎదుగుదలకు పునాదులు వేస్తున్న సరికొత్త ప్రపంచం అది. 

బొట్టెట్టి కథా సంపుటిలో పదమూడు కథలున్నాయి. 2007-2020 సంవత్సరాల మధ్య వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలివి. 

పి. సత్యవతిగారు, మధురాంతకం నరేంద్రగారు ముందుమాట రాస్తూ కథలను  పరిచయం చేసారు.

ప్రతి కథలోనూ సమస్యలున్నాయి, బాథలున్నాయి, బాథితులున్నారు. సమాజంలోని అన్ని స్థాయులలోనూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వస్తున్న రకరకాల సన్నివేశాల్ని ఈ కథల్లో చూస్తాము. సహజంగానే ఈ నలుగుబాటుకు గురయేది బలహీనవర్గమే. అది స్త్రీలేనన్నది చాలా కథల్లో కనిపిస్తుంది. తనున్న పరిస్థితులని అవగాహన చేసుకుని, తన పరిధిలో సమస్యతో ధైర్యంగా పోరాడేందుకు నడుం కట్టే స్త్రీ మూర్తులను కొన్ని కథల్లో చూస్తాం. సమాజం ఇచ్చిన ఆధిక్యబలంతో నూరుశాతం ప్రవర్తించే పురుషులను చూస్తాం. వారి తప్పొప్పులను ప్రశ్నించే హక్కు, అధికారం జీవితాల్ని పంచుకున్న భార్యకు కూడా లేకపోవటం చూస్తాం. తమ జీవితాలపైన పెత్తనాన్ని మౌనంగా సహించే స్త్రీలను చూస్తాం. అయినా తమదైన నేర్పుతో జీవితాన్ని నడిపించుకుపోయే వారి ప్రయత్నం కూడా చూస్తాం. ఇవన్నీ మన మధ్య కనిపించే జీవితాలే. 

మొదటి కథ @అమ్మమ్మ లో తన పిల్లలను పెంచే క్రమంలో అదొక బాధ్యతగా కాక ఒక అపురూపమైన అవకాశంగా భావించి, వారితో పాటు తానూ బాల్యంలోకి వెళ్లి ఆప్రపంచంలోని ఆనందాన్ని, హాయిని పంచుకుంటూ పెంచి, వాళ్లకి కావలసిన చదువులు చెప్పించి, మంచి జీవితాలనిచ్చిన ఒక అమ్మ, అమ్మమ్మ స్థానంలో నిలబడినప్పుడు పడిన వేదన చూస్తాం. తన చేతుల్లో పెరిగిన పిల్లల దృష్టిలోనే దోషిగా చూడబడటాన్ని ఓర్చుకోలేక మౌనంగా కన్నీళ్ల పర్యంతం అవటం చూస్తాం. అమ్మమ్మగా మనవల బాధ్యతను ఇష్టంగానే తలకెత్తుకుని కూడా పిల్లల విమర్శలు ఎదుర్కోవలసి రావటం, ఆ ఆవేదనను పిల్లలు గుర్తించకపోవటం కనిపిస్తుంది. అయినా చిరునవ్వుతో ప్రపంచానికి కనిపించే ఆ పెద్ద మనసుల అమ్మమ్మలు ఎందరున్నారో ఈ లోకంలో?! 

పెద్దయ్యాక కెరీర్, సంపాదనల్లో నిత్యం సతమతమవుతూండే పిల్లలు తమ బాల్యాన్ని, అమ్మ ప్రేమలోని తీపిని మరిచేపోతారీ కథలో. బాధ్యతలు తీరి, విశ్రాంతి తీసుకోవలసిన వయసులో తమ పిల్లల సంరక్షణ భారాన్ని అప్పగించి, అది సరిగా అందుతోందో లేదో అన్న అనుమానంతో తల్లి మనసుని గాయపరుస్తున్న వారి స్వార్థం కనిపిస్తుంది. వాళ్లని తమ చిన్ననాటి రోజుల్లోకి తొంగిచూసుకునే సమయాన్ని కేటాయించమని, అమ్మ ఒడిలో కథలు వింటూ గోరుముద్దలు తిన్న జ్ఞాపకాలను ఒక్కసారి నెమరువేసుకోమని ఎవరు చెబుతారు? చెప్పవలసిన పరిస్థితి ఎందుకొస్తోంది?  పాతరోజుల్లోని మాధుర్యాన్ని మరిచిపోయేలా చేస్తున్నది కాలమా? వ్యక్తుల స్వార్థమా?

ఈ కథా సంపుటిలో ‘’సొ’’ కథ ప్రత్యేకమైనది. కథ ఒక పొడుపు కథతో మొదలవుతుంది. ‘’వంకరటింకర ‘’సొ’’, వానికి తమ్ముడు ‘’అ’’, నల్లగుడ్ల ‘’మి’’… అంటూ. చాలా ఏళ్ల తరువాత తమ టీచర్ ను కలుసుకుందుకు ఇద్దరు యువకులు వస్తారు. చిన్నప్పుడు బడిలో వాసుని తోటిపిల్లలు వెక్కిరించినపుడు సొట్టకాలు శారీరక వైకల్యమనీ, దానికి మనమేం చెయ్యలేమని, మనోవైకల్యం మాత్రం మనుషులు తెచ్చిపెట్టుకునేదని చెబుతూ పుణ్య టీచర్ ‘’సొ’’ అంటే సొబగు, సొంపు’’ అని ధైర్యం చెబుతుంది. వాసు మనసులో ఒక ఆత్మవిశ్వాసాన్నికలిగిస్తుంది. వాసుతో పాటు విష్ణు పుణ్యక్క చెప్పిన పాఠాలు తమ ఆలోచనల్లో ఎలాటి ఆశావహ దృక్పథాన్ని నాటాయో, అవి తమ జీవితాలనెలా తీర్చిదిద్దుతూ వస్తున్నాయో చెబుతాడు. 

చిన్ననాడు పుణ్యక్క తరగతి గదిలో చేసిన ప్రయోగం ద్వారా చీకటిలో ఉన్న మొక్క కూడా వెలుగువైపే ఎదుగుతుందన్న పాఠం తాము మరవలేదని, మొక్కలకున్న వివేకం తమని చైతన్యవంతుల్ని చేసిందని చెబుతారు. చిన్న వయసులో ఉండగానే తండ్రులను పోగొట్టుకున్న ఆ ఇద్దరు తమ తల్లులు ఆత్మవిశ్వాసంతో ఎక్కడా చేయి చాచకుండా ఎలా నిలదొక్కుకున్నదీ చెప్పుకొస్తారు. వాళ్లు మట్టితోనూ, మొక్కలతోనూ తమ నర్సరీ ‘’సొ’’ లో చేసిన ప్రయోగాలలో వంకరటింకర చెట్లకున్న గిరాకీ గురించి గర్వంగా చెబుతారు. కథ పొడవునా ఆర్ద్రత చదువరిని చుట్టుకుంటుంది. పుణ్యక్క వాళ్ల జీవితాలను చూసి ఆశ్చర్యపోతుంది. వాళ్ల అమ్మలు తమలాటివారికి ఆదర్శమంటూ చెప్పి అలాటి స్త్రీల్లాగానే అపరాజిత పూలతీగెలు కూడా ఎలాటి ఆర్భాటాలు లేకుండానే ఒట్ఠి ఆత్మాభిమానాన్ని నమ్ముకుని పైపైకి పాకుతాయంటూ ఆ పూలతీగలను తమ తల్లులకు ఇవ్వమంటూ ఇద్దరి చేతిలోనూ పెడుతుంది. అదే ఆత్మాభిమానంతో తన జీవితంలోని విషాదాన్ని మాత్రం తనలోనే దాచుకుంటుంది పుణ్యక్క.

మరొక కథ ‘’బొట్టెట్టి’’. ఇదే పేరును ఈ కథా సంపుటికి కూడా పెట్టారు. ఆడపిల్లకు పుట్టింటి మీద ఉండే మమకారం ప్రతి ఆడపిల్లకూ అనుభవమే. దానికి కారణం ఆ ఇంటినుంచి ఏవో సంపదలు పొందాలన్న ఆశ కాదు. చిన్ననాట ఆ ఇంట ఆడిన ఆటలు, పొందిన ప్రేమ జీవితాంతం తనను వెన్నంటి ఉండే ఆత్మీయ, మమకారాలు, చిరునవ్వుతో జీవితాన్ని ఎదుర్కొనే ఆత్మధైర్యాన్నిస్తాయి. పుట్టింటి నుండి పిలుపు అంటే అది బొట్టెట్టి పిలవనక్కరలేదు. మాట మాత్రం చాలదా? ఇదే ప్రశ్న అడుగుతుంది కథలో రమణి తన భర్తని. సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా పడుతూ లేస్తూ పుట్టింట జరిగే అనేక వేడుకలకి నిరంతరంగా ప్రయాణాలు చేసి చేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని కూడా వెళ్లేందుకు సిద్దపడుతూనే ఉంటుంది. 

పుట్టింటి నుంచి ఆస్తులు తెచ్చుకోవాలన్న ఆశతో వెళ్తోందంటూ చుట్టుపక్కలవాళ్లు హేళన చేస్తున్నారంటూ అత్తగారు, ఆడపడుచు విసుక్కున్నా పట్టించుకోదు. పిల్లలతో చేసే ప్రయాణాలు, ఆనక ఒంటిగానూ అన్ని దశల్లోనూ రకరకాల అసౌకర్యాలను భరిస్తూనే ఉంటుంది రమణి. భర్త విమర్శిస్తే అయినవాళ్లు మన అవసరాలకి, మన ఇంట్లో అక్కరలకీ రావద్దామరి? అని అడుగుతుంది. ఆమె అన్నట్టుగానే భర్త పోయినప్పుడు పుట్టింటివారొచ్చి అవసరమైన కార్యక్రమాలన్నీ జరిపిస్తారు. 

ఆనక పుట్టింట్లో జరిగిన శుభకార్యాలకు అలవాటుగా వెళ్ళినా ఆమెను అశుభమంటూ దూరం పెడతారు. అన్నీ భరిస్తూనే ఉంటుంది. తన పిల్లల పెళ్లిళ్లకి ఇరుగుపొరుగులే అన్నీ అయి ఆదుకుంటారు. ఆరోగ్యం పోగొట్టుకుని, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థిక సమస్యల మధ్య వైద్యం చేయించుకుంటుంది. అప్పుడూ వెళ్తుంది పుట్టింటికి. 

స్నేహితురాలు సుధ సహించలేక ‘’నీరాక పట్ల గౌరవం, నీ పట్ల సానుభూతి లేని చోటుకి అనారోగ్యంతో ఎందుకా ప్రయాణాలు?’’ అని గట్టిగా అడిగినప్పుడు, ‘’అవునులే. నా ఆరోగ్యం పట్ల శ్రధ్ధ తీసుకుంటాలే’’ అని చెబుతూనే రమణి తన బ్యాగ్ లోంచి నెయ్యి గుబాళింపుతో ఉన్న చలిమిడిని తీసి స్నేహితురాలికి పెడుతుంది. ఆపైన కొబ్బరిపుల్లకి గుచ్చిన బొగడపూలను చూబిస్తూ ‘’బొగడచెట్టు నాన్న నాటిందే’’ అని చెప్పి మురిసిపోతుంది. పుట్టింటి పెరట్లోంచి తెచ్చిన ముద్దబంతులు, కారబ్బంతులు బ్యాగ్ లోంచి తీస్తుంది. ఏటి ఒడ్డున ఏరుకొచ్చిన మెరిసేరాళ్లను కూడా చూబిస్తుంది. ఇంకా, పెళ్ళినాడు నాన్న అమ్మకి బహూకరించిన శరత్ నవల అమ్మ పదేపదే చదవగా పసుపు రంగులోకి మారిందంటూ తీసుకొచ్చి చూబిస్తుంది. నాయనమ్మ పుట్టింటి నుంచి తెచ్చి నాటిన రాతి ఉసిరి చెట్టు కాయలూ తెస్తుంది. 

‘’అమ్మమ్మ వడికిన రాట్నం ఈసారి వెళ్లినప్పుడు అడిగి తెస్తాలే.’’ అని చెబుతుంది. స్నేహితురాలికి నోట మాటరాదు. ‘’పుట్టీంటి నుంచి చీరెసారెలేం తెచ్చుకున్నావ్?’’ అని విసుగుతో అడగాలనుకున్న ఆమె గొంతు మూగబోతుంది.

అన్నన్ని మాటలు పడుతూ, అన్నన్ని వ్యయప్రయాసలకి ఓరుస్తూ పుట్టింటికెళ్తోందని అందరూ వింతపడినా ఆమె పసిమనసు పొందుతున్న అపరిమిత ఆనందం ఎవరికి అర్థం అవుతుంది? పుట్టింటి ఆలోచనతోనే, ఆఇంటి చెట్టూ, పుట్టాతోనే ఆత్మీయతనల్లుకున్న రమణి ముఖంలో వెలిగే ఆ సంతోషం ఎవరికి అవగాహనకొస్తుంది?! అందమైన కథ.

‘’తట్టు’’ కథలో పల్లెల్లో చిన్నపిల్లలకు అందించాల్సిన వ్యాధి నిరోధక కార్యక్రమాలకు మూఢవిశ్వాసాల వలన ఎలాటి అవరోధం కలుగుతోందో, దాని ఫలితంగా ఎంతమంది మృత్యు వాత పడుతున్నారో వివరంగా చెబుతారు. పైగా ఈ ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు పూనుకోవలసిన వారిలో ఉపేక్షాభావం కూడా తప్పుడు రిపోర్ట్ లనే పైవారికి అందజేస్తోంది. ఇవన్నీ ఇంత తీవ్రంగా కంటికెదురుగా కనిపిస్తున్నా బాధ్యత మరిచిన డాక్టర్ల నిర్లక్ష్యం, ఉదాశీనత ఈ సమాజాన్ని ఎటు తీసుకెళ్తోందన్న వేదన కనిపిస్తుందీ కథలో. అయితే వ్యవస్థంతా చెడిపోలేదు. ఎక్కడో ఒకచోట మొదలు పెట్టి ఇలాటి అలసత్వాన్ని రూపుమాపవలసిన బాధ్యతని ఇష్టంగా చేపడుతున్న ఆదర్శవంతులైన వ్యక్తులూ ఉన్నారీ వ్యవస్థలోనే. వారి చేతుల్లో దేశ భవిష్యత్తు సురక్షితమేనన్న ఆశను కలిగిస్తుంది.

భర్త, పిల్లలే తన లోకంగా జీవించిన స్త్రీ అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడిన భర్తకు వైద్య సేవలు చేయిస్తూ, ఆ దీర్ఘకాల అనారోగ్యంతో అతన్నావరించిన మానసిక అశాంతి, డిప్రెషన్ల నుండి అతన్ని బయటపడేసేందుకు ఆమె పడిన ఆరాటం, తన అనారోగ్యాన్ని గోప్యంగా ఉంచాలన్న భర్త ఆజ్ఞను పిల్లలతో సహా అమలు పరచిన సహనం… ఒక స్త్రీకున్న శక్తిని స్పష్టంగా చూబిస్తుంది. అయితే అతన్ని దక్కించుకోలేకపోయిన ఆమె అసహాయతను అతని ఇంటి సభ్యులే అర్థం చేసుకోక నిందించినపుడు పడిన వేదన చదువరి కంట తడి పెట్టిస్తుంది. ఒక పక్షి గూడు చెదిరిపడిపోయినపుడు తల్లిపక్షి పడే ఆరాటం, ఆ గూడును పదిలపరుచుకుందుకు అది చేసే ప్రయత్నం కూడా మనిషి ఆరాటానికంటే ఏమీ తక్కువవి కావు. ఇది ‘’మాయమ్మ ‘’కథ.

కథల సంపుటికి ముందు ‘’గుట్టెనుక’’ కథ గురించి ఆచార్య మధురాంతకం నరేంద్ర గారు చెబుతూ ఇది జీవితం నుంచి నేరుగా తీసుకున్న శకలమని చెప్పారు. నిజమే. నేటి సమాజ రూపును స్పష్టంగా చూబించిన కథ ఇది. ప్రకృతితో మమేకమై సహజీవనం చేసే ఒక తరం వ్యక్తికి జీవితానికి కనీసావసరాలను మించి మరేవైనా కావాలేమో అన్న వివరమే తెలియదు. తన ప్రపంచంలో తృప్తిగా, ఆనందంగా జీవించటమే తెలుసు. ఆ తరువాత తరానికి జీవితం పట్ల బోలెడు కలలు. ఆ కలల్లో చుట్టూ కనిపించే వినిమయ ప్రపంచం రంగురంగుల దృశ్యాలను ఆవిష్కరిస్తూ ప్రలోభపెడుతుంటే, కంటెదురుగా సాక్షాత్కరించిన ప్రకృతిని ఏయే విధాల దోచుకోవచ్చో నన్న ఆలోచన, ఇంకేమేమి పొందవచ్చన్న దురాశ, ఆ ఆరాటం చివరికి తనని వినాశనానికే నడిపిస్తుందన్న వివేకం లోపించి, పెద్దల మాటలను కొట్టిపారేసి పరుగెత్తి పరుగెత్తి జీవితాన్నే కోల్పోయిన వైనం. ఈ పరుగులో కుటుంబాన్ని, మానవసంబంధాలని మరిచి మాయలోకపు వ్యసనాలకు బానిసై అట్టడుగు స్థాయికి జారిపోయిన బతుకుని చూసుకుని అప్పుడు భోరుమంటే…కన్నవారిని, తను కన్నవారిని కూడా క్షోభకు గురిచెయ్యటమే.

ప్రకృతికి దూరమైనకొద్దీ పొందే దుఃఖ స్వరూపం ఇదంతా.

‘’శ్రీ#మతి’’, ‘’ఆ ఆరుగురు’’ కథల్లో కుటుంబ వ్యవస్థలో ఉంటూ పురుషులు ఎంత నమ్మకంగా భార్యలను నమ్మించి తమ వ్యసనాలకు శలభాలైపోయారో చూస్తే సమాజంలో సజీవంగా ఉన్న పితృస్వామ్యపు ధోరణి అర్థమవుతుంది. తీరా వారి పెడధోరణులు వారి జీవితాల్ని బలి తీసుకుంటే నింద మాత్రం అతనితో జీవితాన్ని పంచుకున్న స్త్రీ మూర్తులపైనే. తల్లిస్థానంలో ఉన్నస్త్రీ కోడలి పట్ల తోటి స్త్రీ అన్న సహానుభూతి చూపక, నిందించటం, తన కొడుకు చేసిన తప్పును కూడా సమర్థించుకు రావటం సహించలేనివిగా అనిపిస్తాయి. కానీ యదార్థాన్ని మించి ఏం మిగిలింది ఆ జీవితాల్లో?

‘’పిల్లలెక్కిన పడవ’’ కథ లో మనుషుల్ని ఇంకా రకరకాలుగానూ, వర్గాలుగానూ విడదీసి చూసే వ్యవస్థలోని ఒక పార్శ్వం కనిపిస్తే, దానిని తోసిరాజని మనుషులందరం ఒక్కటే అనీ, అందరూ కలిసి,మెలిసి మసిలినప్పుడు మాత్రమే వైవిధ్యంలో ఉన్న ఏకసూత్రం అర్థం అవుతుందని మరో పార్శ్వం నమ్మకంగా చెబుతుంది. సముద్రాన్నీ, ప్రకృతినీ మచ్చిక చేసుకుని జీవిస్తూ కూడా తమలో తాము భిన్నభిన్న వర్గాలమంటూ నమ్మే అమాయకత్వం, మూర్ఖత్వంతో కొందరు ఒకవైపు తమలో తాము ఘర్షణలు పెంచుకుంటూ విడిపోతుంటే, చదువు తెచ్చిన వివేకంతో, విశాలమైన మనసులతో ఎక్కడెక్కడి మనుషుల పట్ల, పిల్లల పట్ల మమకారాన్ని, ప్రేమని చూబించే మరికొందరు. న్యాయం ఎటు ఉంటుందో, గెలుపు ఎవరిని వరిస్తుందో విడిగా చెప్పవలసిన అవసరముందా? మనుషుల్ని కలుపుకోవటంలో ఉన్న బలం, ఆనందం దగ్గరవుతేనే కదా తెలుస్తుంది! వైరుధ్యాలలో అంతఃసూత్రంగా కనిపించే అందాన్ని ఆస్వాదించటంలోని సుఖం విడి బతుకుల్లో ఎలా కనిపిస్తుంది? ఇప్పడు వర్గాలు, కులాలు, మతాలుగా విడిపోయిన సమాజం నేర్చుకోవలసింది ఈ కథలో చాలా ఉంది. 

‘’అమిత్రం’’ కథలో ఒక డాక్టర్ వృత్తిలో భాగంగా తన దగ్గరకొచ్చే స్త్రీ పేషెంట్లకు నమ్మకాన్ని, భద్రతని అందించాల్సిన స్థానంలో ఉండి కూడా తన కుటుంబ జీవితానికి ఎలాటి ముప్పొస్తుందో అన్న భయంతో భర్త ప్రోద్బలంతో, అబధ్ధపు మాటలతో వారిని మభ్యపెడుతుంటుంది. ఆ స్త్రీలను కుటుంబపు వ్యవస్థలో వంచిస్తున్న భర్తల తప్పులను దాచిపెడుతుంటుంది. భర్తల ద్వారా వారికి సంక్రమిస్తున్న రోగాలను, అవి వారి ఆరోగ్యాలపై చేస్తున్న దాడులను వారికి తెలియకుండా చేస్తుంది. డాక్టర్ తమ క్షేమాన్నే కోరుతోందని ఆస్త్రీలు నమ్ముతుంటారు. ఈ వ్యవహారాన్ని అర్థం చేసుకున్న ఒక పేషెంట్ సూటిగా ప్రశ్నించకుండానే ఆ ప్రస్తావన తెస్తుంది. డాక్టర్ తన అపరాధ భావాన్ని ఇన్నాళ్లుగా లోలోపల తొక్కిపెడుతున్నదల్లా, ఇక దానిని ఇముడ్చుకోలేని స్థితిలో తాను నిజాయితీగా నిలబడవలసిన సమయం వచ్చిందని అనుకుంటుంది. సంసారం నిలబెట్టుకుందుకు స్వార్థంతో తన వృత్తికి తాను చేస్తూ వచ్చిన అన్యాయాన్ని ఇకపై చెయ్యకూడదని నిర్ణయించుకుంటుంది.  స్వేచ్ఛాస్వాతంత్రాలతో తన నిర్ణయాలను తానే తీసుకోవాలనుకుంటుంది.

ఆఖరి కథ ‘’అదృశ్యపదం’’ ఒక కొత్త ప్రయోగం. ఒక సమావేశంలో కలిసిన ప్రొ. అలెన్ గారు చెప్పిన కథను రచయిత్రి తనదైన శైలిలో చెప్పారు. సాదాసీదా జీవితంలో ఉన్న హాయిని, లేనిపోని శక్తులు ఆపాదించి పరిమిత చట్రంలో బిగించిన జీవితానికి ఉన్న వ్యత్యాసాన్ని ‘’అదృశ్యపదం’’ చక్కగా చెబుతుంది. చిన్న కథ సరదాగానూ, ఆలోచనరేకెత్తించేదిగానూ ఉంది.

రచయిత్రి చంద్రలత గారు మంచి భావుకులన్న విషయం కథలు చదువుతున్నప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఉదాః

‘’సన్నని పాల తుంపరులు ఎగిసెగిసి పడే జలపాతపు వడి ఆ మాటల్లో’’

‘’పడవ సాగిన అలలపై చిప్పిల్లిన నీటి తుంపర్ల జల్లు, పిల్లల అల్లరి నవ్వులతో పోటీగా తుళ్ళిపడుతోంది.’

‘’వాళ్లు వెలుగుల బుడగలతో బంతులాటలు, దాగుడుమూతలు ఆడుకుని, ఆడుకుని అలిసిపోతారు. ఏమాత్రం వ్యవధి దొరికినా పకపక నవ్వుల పువ్వుల పొట్లాలు చుడుతుంటారు. కలల పరుపులెక్కి, కథల దుప్పట్లు కప్పుకొంటారు.’’

‘’పారిజాతం మౌనంగా తన హృదయాకారాపు కాయలను నేలపై రాలుస్తుంది. ఎంత కృతజ్ఞతో దోసెడు నీళ్లు అందించిన భాగ్యానికి.’’

ఒక మంచి పుస్తకం చదివిన భావం కలుగుతుంది పుస్తకం పూర్తయేసరికి.

పుస్తకంలో అచ్చుతప్పులు ఎక్కువ లేకపోయినా ఆ మాత్రం కూడా లేకుండా చెయ్యచ్చు అనిపించింది శ్రధ్ధగా, అందంగా అచ్చేసిన పుస్తకాన్ని చూస్తే. ఎడిటింగ్ అవసరం ఉంది. రచయిత్రి తరువాత తీసుకొచ్చే పుస్తకం మరింత బావుంటుందని నమ్ముతున్నాను. 

‘’ప్రభవ’’ పబ్లికేషన్స్ ద్వారా సెప్టెంబరు, 2020 లో ప్రచురించబడింది ఈ పుస్తకం.

*****
Please follow and like us:

One thought on “బొట్టెట్టి (చంద్రలత కథలు)”

Leave a Reply

Your email address will not be published.