వెనుతిరగని వెన్నెల(భాగం-20)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-20)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన సంవత్సరం లోనే అబ్బాయి పుడతాడు.

***

ఉదయానే తలుపు చప్పుడయ్యి మెలకువ వచ్చింది తన్మయికి. బాబు మీద చెయ్యి వేసి, గురక పెట్టి నిద్రపోతున్నాడు శేఖర్.

పిల్లాడి మీద ఉన్న ప్రేమ తన మీద లేదెందుకోఅని నిట్టూరుస్తూ లేచి తలుపు తీసింది

ఎదురుగా అమ్మా, నాన్నా కనబడే సరికి ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారి ముంచెత్తాయి.

గభాలున తల్లిని కౌగలించుకుంది. కూతుర్ని అలాగే ఒడిసి పట్టుకుని వీపు నిమిరింది జ్యోతి.

తండ్రి లోపలికి వెళ్లి బాబుని శేఖర్ పక్క నించి లేవదీసి భుజమ్మీద వేసుకుని వచ్చేడు.

జీవితంలోని బాధలన్నీ భుజమ్మీద తల వాల్చగానే నిశ్చింత పడినట్లయ్యి కళ్లల్లోంచి ధారాపాతంగా దు:ఖం ముంచుకొచ్చింది తన్మయికి

ఏమైందమ్మా, మాకూ బెంగగానే అనిపించే వచ్చేసాం.” అంది జ్యోతి తనూ కళ్ళు తుడుచుకుంటూ.

అంతలోనేఏడీ, ఏడీ మా చిన్ని కన్నయ్య.. “అంటూ నిద్రపోతున్న చంటాడిని ఎత్తుకుని తల నిమురుతూ ముద్దాడింది.

పది నిమిషాల పాటుఅబ్బో ఎంత జుట్టు పెరిగిపోయిందో నాన్నారికి. ముక్కు చూడండి ఎంత అందంగా ఉందో ఇప్పుడు.” అంటూ ఒకటే మురిసిపోతున్న అమ్మా, నాన్నల్ని మురిపెంగా చూస్తూ

రాత్రి ఎప్పుడు బయలుదేరేరు? మొహాలు కడుక్కోండి. కాఫీ పెడతాను.” అంది తన్మయి.

శేఖర్ నిద్ర లేచి వచ్చిఎప్పుడొచ్చేరు మావయ్యా?” అంటూ పలకరించేడు.

అలా చిక్కి పోయేవేంటి బాబూ, బాగా పని ఎక్కువ ఉంటూందా ఉద్యోగంలో?” అన్నాడు భానుమూర్తి అల్లుడిని పలకరిస్తూ.

పని ఒత్తిడి కాదు మావయ్యా, మీ అమ్మాయి వంట మహిమఅన్నాడు నవ్వుతూ శేఖర్.

జ్యోతి వంటింట్లోకి వచ్చిపోన్లేమ్మా, ఇన్నాళ్లకి మంచి సౌకర్యవంతమైన ఇంట్లోకి మారేరు. ఇల్లు ఎంత బావుందో. అల్లుడు కూడా కాస్త మారినట్లున్నాడుఅంది సంతోషంగా.

తన మనసులోని వేదనలేవీ తల్లికి కనబడకుండా వెనక్కి తిరిగి స్టవ్వు మీద కాఫీ దించుతూఅవునమ్మా, మేం బానే ఉన్నాంఅంది తన్మయి.

తల్లిదండ్రులు రావడం వల్ల గొప్ప సంతోషం ఇంకోటుంది తన్మయికి. చక్కగా తను యూనివర్శిటీకి వెళ్లి రావొచ్చు.

అసలే మొదటి రోజు తర్వాత మళ్ళీ క్లాసులకి వెళ్లడం లేదు తన్మయి.

కనీస అటెండెన్సు లేనిదే సంవత్సరం చివర పరీక్ష రాయడానికి కుదరదని నిబంధనల్లో చదివింది తన్మయి.

శేఖర్ ఆఫీసుకి వెళ్ల గానేఅమ్మా, నేను యూనివర్శిటీకి వెళ్లొస్తాను. నే వచ్చేసరికి లేటైతే మీరు భోజనాలు చేసెయ్యండిఅంది తన్మయి నోటు పుస్తకం పర్సులో పెట్టుకుంటూ.

తండ్రి బాబునెత్తుకుని గేటు వరకూ వచ్చిఅమ్మకి టాటా చెప్పు నాన్నాఅన్నాడు.

తన్మయి సంతోషంగా ముందుకు కదిలింది.

ఇన్ని రోజుల నించీ మిస్సయిన నోట్సులన్నీ రాసుకోవాలి. లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తెచ్చుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్ కమ్  సర్టిఫికేటు తీసుకొచ్చి యూనివర్శిటీ లో సబ్మిట్ చేయాలి.” వడివడిగా నడుస్తూ లోపల్లోపల అనుకోసాగింది.

కాళ్లకి అడ్డం పడ్తూన్న బెంగాల్ కాటన్ చీరని వెనక్కి తిరిగి సర్దుకుంటూ పలకరింపుకి చటుక్కున తుళ్ళిపడి పక్కకి చూసింది

దివాకర్న్న..నమస్తేఅన్నాడు రెండు చేతులూ జోడించి.

నమస్తే, ఎలా ఉన్నారు?” అంది.

మ్మాఇల్లు అదే..” అన్నాడు దూరంగా చూపిస్తూ.

యూనివర్శిటీ క్వార్టర్సులా ఉందిఅంది తన్మయి.

.. అవునండీ, నాన్నగారు డి..డిస్టేన్సు ఎడ్యుకేషను డిపార్టుమెంటులో  క్  క్లర్కు గా పనిచేస్తారు.” అన్నాడు.

వెనకే ఎవరో పిలుస్తున్నట్లనిపించి ఆగేరు. కరుణ వచ్చి కలిసేడు.

పునర్దర్శనం ఇన్నాళ్లకన్నమాటఅన్నాడు తన్మయితో.

..చాల్లోవోయ్ ..నిన్నేగా కలిసేనుఅన్నాడు దివాకర్ తనననుకుని.

తన్మయి పక్కున నవ్వింది.

మీరిలా నవ్వుతూ ఉంటే చాలా చక్కగా ఉంటారండీ.” అన్నాడు ప్రశంసా పూర్వకంగా మెరిసే తన్మయి కళ్లల్లోకి చూస్తూ కరుణ.

అంతలోనే మాట మారుస్తూచూడండి, ఎంతలో వచ్చేసేమో డిపార్టుమెంటుకి ఇక అరక్రోసు దూరమేఅన్నాడు మళ్లీ.

..కరుణకి అన్నీ జోకులేమీ.మీరేవీ పట్టించుకోకండి అన్నాడు దివాకర్.”

లైబ్రరీ దగ్గిరికి రాగానే, “మీరు వెళ్లండి, నేను పుస్తకాలు లైబ్రరీలో ఇచ్చి వస్తాను. రా.. దివాకర్అన్నాడు కరుణ.

నిజానికి తనూ వెళ్లాలి లైబ్రరీకి. కానీ డిపార్టుమెంటు లోపలికి తనతో కలిసి రావడం బావుండదనుకుని అతను కావాలని అలా పక్కకి వెళ్తున్నట్టు అనిపించింది. తన్మయికి.

నిట్టూరుస్తూ ముందుకు కదిలింది

చెట్ల నీడల మధ్య నడుస్తూన్నా, సూదిగా గూచ్చుతున్న ఎండని తప్పించుకోవడానికన్నట్లు కొంగు భుజం చుట్టు కప్పుకుని ముందుకు నడిచింది.

చెంగుతో బాటూ ముందుకొచ్చిన పొడవైన జడని వెనక్కి వేసుకునే ప్రయత్నంలో డిపార్టుమెంటు మెట్లు దిగుతున్న వ్యక్తిని గమనించలేదు తన్మయి.

వెనకే వస్తున్న విద్యార్థులు వంగి నమస్కారాలు చెప్తుంటే గానీ తనకి అర్థంకాలేదు ఆయన డిపార్టుమెంటు హెడ్డని.

అయ్యో, తను నమస్కరించలేదు. ఏమనుకున్నారో ఆయనఅని మథనపడింది తన్మయి.

క్లాసులోకి అడుగు పెడ్తూనే అనంత దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని తనతో బాటూ తీసుకు వెళ్తూచంటోడేడీఅంది.

తన్మయి జవాబు వినిపోనీలే, నీకు కాలేజీకి రావడానికి కాస్త సమయం చిక్కింది. నా దగ్గిర పెద్దగా నోట్సులేవీ లేవు. రాసే పనంతా అక్కడఅంటూ నవ్వుతూక్లాసులో ముందు బెంచీలో కూచుని బుద్ధిగా ఏదో రాస్తున్న రాజుని చూపించింది.

అతన్నడిగిఒక నోట్సు పట్టుకొచ్చి, ఇంటికి పట్టు కెళ్లి, రాసుకున్నాక తీసుకురా, పర్లేదులేఅంది.

అప్పటికప్పుడు నోట్సు తెరిచి హడావిడిగా రాయడం మొదలెట్టిన తన్మయిని చూసి, “నువ్వూ బాపతేనన్నమాట. ఎంత అందమైన దస్తూరీ..” అని ముచ్చటపడింది అనంత.

వరసగా రెండు మూడు క్లాసులయ్యేక నోట్సు తీసుకెళ్లి రాజుకి ఇచ్చి, “థాంక్సండీ. రన్నింగు నోట్సులు చాలా బాగా రాసేరు. అనంత ఎటెళ్లిందో కనబడలేదు.” అంది తన్మయి.

అతను కళ్లు కిందికి దించుకుని కాస్త సిగ్గుగాపర్లేదండీ. మీకు ఎప్పుడు కావాలన్నా నోట్సులు తీసుకోండి. ఇలా హడావిడిగా ఇవ్వక్కరలేదు.” అన్నాడు.

ఇంత నెమ్మదస్తుడైన అబ్బాయికి, గడుగ్గాయి అమ్మాయికి  జత ఎలా కుదిరిందో అనుకుంది తన్మయి.

***

ఇన్ కం సర్టిఫికేటు  వల్ల  ఫీజు వందలోపే తెమిలిపోయింది.  “ఇన్నాళ్లకి శేఖర్ వల్ల ఒక ఉపయోగం కలిగింది తనకిఅనిపించింది తన్మయికి.

ఇక పుస్తకాలంటూ ఏవీ కొనుక్కోనవసరం లేని పెద్ద లైబ్రరీ ఉంది. క్లాసులకి వెళ్లలేక పోయినా ఎప్పటికప్పుడు నోట్సులు వచ్చే మార్గం ఉంది.

తన్మయికి జీవితం ఆశావహంగా కనిపించసాగింది.

జ్యోతిని వొదిలి తను మళ్లీ ఒస్తానని వెళ్ళేడు భానుమూర్తి.

శేఖర్ సారి కేంపుకి నెల రోజులకు వెళ్లిపోయేడు కాబట్టి ఎటువంటి ఇబ్బందీ లేదు తన్మయికి.

జ్యోతి పూర్తిగా ఇంటి పనులు, పిల్లాడిని చూసుకుంటూ కూతురికి చదువుకునే వీలు కల్పించింది.

త్వరలోనే డిపార్టుమెంటుతో గొప్ప అనుబంధం ఏర్పడింది తన్మయికి

ఎండా నీడలు దోబూచులాడే  యూకలిప్టస్ చెట్ల మధ్య విశ్వవిద్యాలయపు తెలుగు శాఖా భవనం, కవిత్వం భాసిల్లే తరగతి గదులు, ఏదో దివ్యలోకాలకు తీసుకెళ్లే పద్యాలు……  

అటజని ……అభంగ తరంగ మృదంగనాదాలేవో  చెట్ల మధ్య  విన్నట్లనిపించింది తన్మయికి

ఏదో కావ్యంలో చదివిన జ్ఞాపకంతెల్లవారిన ఆకాశంలో చంద్రుడు నాయిక  పాపిట గంధపు చుక్కలా ఉన్నాడట. ఆకుల పైని నిగనిగా మెరుస్తున్న సూర్య కిరణాల్ని కనురెప్పల మీద ఒడిసి పట్టుకుంటూ ఆకాశంలోకి చూసింది తన్మయి.

ఏవిటండీఉన్నట్టుండి ఆకాశంలో ఏం కనిపించింది?” అన్నాడు పక్కన నడుస్తున్న కరుణ.

ఉహూ.. అని తలాడించిందితన్మయి.

కనిపెట్టేను లెండి. మనస్సులో ఏవో కవితాత్మక భావనలు కదలాడుతున్నట్లున్నాయిఅని పుస్తకం చదివేరా? అనిమను చరిత్రచేతిలో పెట్టేడు.

అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. మొన్న క్లాసులో పాఠం విన్నప్పట్నించి పుస్తకం లైబ్రరీకి వెళ్ళి వెదకాలని ఆరాటపడింది.  “తన మనస్సుని ఎంత ఖచ్చితంగా చదవగలుగుతున్నాడితను!”

థాంక్సండీ.. అంది తడి మెరిసే కళ్లతో పుస్తకాన్ని గుండెలకానించుకుని.

పుస్తకం పట్ల తనకున్న అవ్యాజమైన ప్రేమని కనిపెట్టినట్లు  “మీకే పుస్తకం కావాలన్నా నాతో చెప్పండి. భూ నభోంతరాళాలలో ఎక్కుడున్నా తెచ్చిస్తాను.” అన్నాడు.

నవ్వుతున్న తన్మయి వైపు చూస్తూవేల చందురులు ఇచ్చోట విరబూసినట్లు …” అంటూఅబ్బే, ఇంత కవిత్వం వెల్లువై పొంగుతున్నా ప్రశంస లేకపోతే వ్యర్థంఅన్నాడు పెదవి విరిచి

లైబ్రరీ బయట చెట్ల కింద కూలబడ్డ దివాకర్, అనంత, రాజుల వైపు నడుస్తూ

కరుణ ఒక్కో పద్యాన్నీ రాగ యుక్తంగా చదివి అర్థం చెప్తూంటే తన్మయంగా అతని వైపు చూడ సాగింది తన్మయి.

ఇతనికీ జ్ఞానం ఎలా అబ్బింది?!” అనుకుంటూ.

అదే అడిగీంది. “హమ్మయ్య ఇప్పటికి ప్రశంస విన్నాను. ఏవుందండీ, బియ్యే ఓఎల్ చేసేం గా.. పైగా చిన్నప్పట్నించీ వేదాలు వల్లె వేసిన అనుభవమాయెఅన్నాడు తేలికగా కరుణ.

మేమూ చేసేం. కానీ మాకు అబ్బిందా? కరుణ టాలెంటే వేరు.” అంది మెచ్చుకోలుగా అనంత.

అంతలోనే రాజు ఉడుక్కోకూడదని కామోసుమా రాజుది మరొక టాలెంటు. ఒక్క సారి నోట్సు రాసేడంటే ఇక ఎప్పటికీ మరిచిపోడుఅంది.

నేనూ అంతే. ఎంత చదివినా గుర్తు ఉండదు. కానీ ఒక్కసారి రాసేనంటే ఇక ప్రత్యేకంగా పరీక్షలకు చదవక్కరలేదు.” అంది తన్మయి.

ఇవేళ్టికి మనుచరిత్రా పఠనమేనా? ఇంకేవైనా ఉందా?” అంది రాజు వైపు ఓరచూపు చూస్తూ.

బీచ్ కి వెళ్దాం.” అని లేచేడు రాజు.

సరే మరి, రేపు కలుస్తానుఅని తనూ లేచింది తన్మయి.

.... ఎక్కడికి? బీచ్ కి మనందరం వెళ్తున్నాంఅంది అనంత.

తన్మయి మనస్సులో ఆలోచనేదో కనిపెట్టినట్లు, “మీ అమ్మగారున్నారుగా బాబుని చూసుకుందుకు. గంటా, రెండు గంటల్లో వెళ్లిపోదాంఅంది అనంత.

కరుణ, సుధాకర్ రెడీ అయ్యి తన్మయి వైపు చూసేరు.

నిజానికి తన్మయికి కూడా వాళ్లతో వెళ్లాలనే ఉంది. సముద్రం చూసి ఎన్నాళ్లయ్యిందో కూడా.

 “కానీ అమ్మ ఎదురు చూస్తుందేమోపైగా బాబుకి పాలివ్వాలిఅంది అనంతని పక్కకి తీసుకెళ్లి.

మీరంతా తిన్నగా బీచ్ కి వెళ్లిపోండి. నేను తన్మయితో వాళ్ల ఇంటికి వెళ్లి  మరో గంటలో ఇద్దరం కలిసి అటే వచ్చేస్తాం.” అంటూ తన కైనటిక్ హోండా స్టార్టు చేసింది.

నువ్వొక బండి కొనుక్కోరాదూ. ఎప్పుడంటే అప్పుడు చంటోడిని మధ్యలో వెళ్లి చూసుకుని రావొచ్చు కదా.” అంది అనంత.

శేఖర్ మొన్నీ మధ్య ఎవరిదో సెకండ్ హాండ్ బండి తీసుకొచ్చి ఇంటి ముందు పార్కు చేసి పెట్టేడు.

మా ఆఫీసు క్లర్కు మా బాసుకి డబ్బులు బాకీ పడ్డాడు. తీసుకున్న డబ్బులు సకాలంలో తీర్చలేక  బండి చేతిలో పెట్టాడు. ఓనరమ్మ కి తెలిస్తే తనకి చివాట్లు తప్పవని బాసు ఇక్కడ పార్కు చేసుకోమన్నాడు. ఆవిడ అడిగితే నీదేనని చెప్పు అన్నాడు.”

శేఖర్ ఊర్నించి రాగానే బండి సంగతి అడగాలిఅనుకుంది.

ఇంటికి వెళ్లగానే పాకుతూ వచ్చి కాళ్లని చుట్టుకున్నాడు బాబు.

గబుక్కున ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది తన్మయి.

అనంత వాణ్ణి భుజమ్మీంచే ముద్దాడుతూ  “అబ్బో నవ్వితే వీడి బుగ్గల మీద సొట్టలు పడ్తున్నాయి.అదృష్టవంతుడుఅంది.

అమ్మా, బీచ్ కి అందరం వెళ్దాం తయారవ్వుఅంది తన్మయి.

నువ్వెళ్ళి రామ్మా, నాకు బయట తిరిగే ఓపిక లేదు. నేను బాబుని చూస్తానులే.”  అంది జ్యోతి.

బీచ్ లో ఆటో దిగే వేళకి మొక్క జొన్న కండెలతో రోడ్డు మీదే ఎదురు పడ్డాడు కరుణ.

మీ గురించే ఎదురు చూస్తున్నాను. హమ్మయ్య. ఎంతకీ రాకపోయేసరికి నేనిక్కడే జీవిత కాలం నిరీక్షించాల్సి ఉంటుందని అనుకున్నానుఅన్నాడు చిర్నవ్వు నవ్వుతూ.

 రోడ్డు కి ఒక పక్కగా కాళీ ఆలయం లో ఎవరో గంట మోగించారు. “అదిగో, సత్యంఅన్నాడు.

అందాల కెరటాల్తో ఎగిసిపడ్తూన్న సముద్రం వైపు చెప్పులు తీసి చేత్తో  పట్టుకుని నడవసాగింది తన్మయి.

కొద్దిగా ఎత్తి పట్టు కున్న చీర కుచ్చెళ్ళ కింద మెరుస్తున్న పాదాలకున్న చుట్లు, పట్టీలు చూస్తూఅబ్బా, ఎంత బావున్నాయి నీ కాళ్లుఅంది అనంత.

కరుణ కూడా చప్పున చూడడంతో గబుక్కున కుచ్చిళ్లు కిందికి విడిచింది తన్మయి.

మేమేమీ కావ్యాలు రాయబోవట్లేదు లెండి మీ పాదాల గురించిఅన్నాడు చిర్నవ్వుతో మెరిసే కళ్లద్దాల కంటే చురుగ్గా మెరుస్తు న్న కళ్లతో.

ఇతని దగ్గిర ఏదో ఒక గొప్ప ఆకర్షణా శక్తి ఉంది.” అనుకుంది తన్మయి.

రాజు కనబడగానే అనంత ముందుకు పరుగెత్తీంది. “కాస్సేపట్లో మళ్లీ కలుద్దాం తన్మయీఅంటూ

ఎండకాస్త తగ్గు ముఖం పడ్తూన్న  సాయం కాలపు వేళ సముద్రమూ, ఆకాశమూ నీలి రంగులో పోటీలు పడ్తున్నట్లు ఉన్నాయి.

అమాంతం ఒంటికి పూసుకోవాలని అనిపించే తెల్లని కెరటాల నురుగు. దిగంతం వరకూ పరుచుకున్న నీటి తళత్తళలు.

ఎంత హాయిగా ఉంది రోజు! ఎన్నో రోజులయ్యి పోయింది ఇంత ఆహ్లాదంగా ఒక్క రోజు గడిపి

చక్కని కవిత్వం, నచ్చిన స్నేహితులు, హాయైన సాయంత్రపు సముద్రం.

ఇసుకలో సున్నాలు చుడుతూ దూరంగా  ఉన్న ఓడల్ని చూడసాగింది తన్మయి.

ఇలా ఇసుకలో కూలబడడానికి కాదు వచ్చింది. రండి నీట్లోకిఅంటూ చెయ్యి అందించాడు కరుణ.

అతని చెయ్యి అందుకోకుండా తనంతట తను లేస్తూఉహూ, నాకు సముద్రంలోకి దిగడం కంటే నీటి పొరలు పాదాలు తడిపే మెత్తటి ఒడ్డు మీద నడవడం ఇష్టంఅంది.

అతని ముఖంలో చిన్న అసంతృప్తి గమనించినా  గమనించనట్లు చూపు కిందికి మరల్చింది.

పోనీ అదే చేద్దాం.” అని వెంట నడిచాడు కరుణ.

దివాకర్ నీట్లో ఆనందంగా ఆడుతున్నాడు.

ప్రేమ పక్షులు ఎక్కడికి వెళ్లేరోఅని చుట్టూ చూసేడు కరుణ

సర్లెండి. మనం అలా ముందుకెళ్లి వద్దాంఅన్నాడు తన్మయితో

దూరంగా ఒక వైపు ఆకాశంలో సగానికి ముసుగేసి సముద్రంలో దాచేసినట్లున్న డాల్ఫిన్స్ నోస్, సుదూరాన మరో పక్క అందంగా మలుపు తిరిగి ఆకాశాన్నందుకోవడానికి సముద్రం పైన మొలిచినట్లున్న  ఋషికొండ…

మనం ఇలా అందర్నీ వదిలి విడిగా నడవడం బావోదేమో!” సంశయంగా అంది తన్మయి.

సమాధానంగా నవ్వి దూరంగా చూపిస్తూ  “మిమ్మల్ని ఋషికొండ వరకూ తీసుకెళ్లను లెండి. పదడుగుల్లో అలా వెళ్లి, తిరిగి వస్తూ ఇక్కడిక్కడే నడుద్దాం. సరేనా? అదీ మీకు నీళ్లలో తడవడం ఇష్టం లేదు కాబట్టిఅన్నాడు.

అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్ల్లుఎన్నాళ్ల నించో ఒకటి అడగాలనుకుంటున్నాను…” అన్నాడు.

తన్మయి అతని ప్రశ్న విననట్లు ముఖం పెట్టిచూసేరా పక్షులు ఆకాశంలో కాగితప్పడవల్లా ఎలా తేలుతున్నాయో!” అంది.

తనూ!” అన్నాడు హఠాత్తుగా.

గబుక్కున కళ్లల్లోకి నీళ్లు వచ్చేయి తన్మయికి. చీర చెంగు కళ్లమీద పెట్టు కుంది.

ఎన్నాళ్ళుగానో అలాంటి పిలుపు కోసం బెంగటిల్లిన గుండె ఒక్కసారి లయ తప్పినట్లయ్యింది.

అయ్యయ్యో తప్పుగా పిలిచానా?”

ఉహూఅని తలాడించింది.

మరి?”

ఏం లేదు. నన్నలా పిలిచే వాళ్లే లేరు అందుకేఅంది తడి కళ్లతో.

భలే భయపెట్టేరు నన్ను.” అని తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు.

మా అమ్మ నన్ను చిన్నప్పుడు ఏవేవో ముద్దు పేర్లతో పిలిచేది. ఇప్పుడు అలా పిలిచేవాళ్లే లేరురెండక్షరాల పిలుపులు ఎంత బావుంటాయి నిజానికి చిన్నా, బుజ్జీ, చిట్టీ, పొట్టీ, కన్నా…” అంటూంటే పకపకా నవ్వింది తన్మయి.

హమ్మయ్య నవ్వేరుగామీకభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్నితనూఅని పిలుస్తాను అన్నాడు.

ఊహూఅని తలడ్డంగా తిప్పింది.

ఎందుకు?” అన్నాడు భృకుటి ముడివేసి.

నన్ను అలా పిలవాల్సిన వాళ్లు మాత్రమే పిలవాలిఅంది.

అర్థమైంది లెండిఅని చిరు కోపంగా ముక్కు పుటాలు ఎగరేసి “‘మయీఅని పిలవనా?” అన్నాడు.

అదేం పేరు?” అంది నవ్వుతూ.

మీ పేరులోనే రెండో భాగం. మీరు నన్నురుణా అనండి. ఎలా ఉన్నాయి మన కొత్త పేర్లుఅన్నాడు తను కూడా నవ్వుతూ.

షార్ట్కట్ పేర్లు అవసరమా?” అంది.

అవసరమైనప్పుడు ఆలోచించుకోవడం కంటే ముందే ఆలోచించుకుని పెట్టుకోవడమన్న మాట. అన్నట్లు మీ చిన్నప్పటి విశేషాలు చెప్పండి. ఎన్నాళ్లుగానో అడగాలనుకుంటున్నానుఅన్నాడు.

అంతా వినిమొత్తానికి పరమ భావుకులన్నమాట మీరు. నాకు మీ అంత గొప్ప బాల్యమేదీ లేదు. ఊహ తెలీక ముందే నాన్న పోయారుఅక్కయ్య నా పదోయేట జబ్బుతో చనిపోయింది. ఇక మిగిలిన అమ్మా, నేనూ, మా పూరిల్లు. నేనేదైనా సంపాదిస్తేనే గడిచే బతుకు బండి. కాలేజీ లో ఉన్న సమయం కాకుండా ఎక్కడే పని దొరికినా చేస్తూంటాను. జీవితాన్నెలాగైనా గెలవాలన్న కసి నాకు. అందుకే పట్టు దలగా ఎమ్మే చదువుతున్నది. బియ్యీడీలూ, టీచర్ పరీక్షలూ ప్రతీ సంవత్సరం రాస్తూనే ఉన్నాను. ఇంకా నా మీద భగవంతుడికి దయ రాలేదు….” అతి మామూలుగా చెప్పుకెళ్లిపోతున్న కరుణ గాథ తన్మయిని కదిలించి వేసింది.

ఏం భయపడకండి. మీ ఫీజులూ అవీ నేను కూడా సాయం చేస్తానుఅందినిజంగా అతను సరేనంటే ఏం చెయ్యాలో తెలిసినట్లు చేతి గాజుల వైపు చూసుకుంది.

అబ్బెబ్బే, సాయం తీసుకునేటంత స్థితికి ఇంకా రాలేదులెండి. ప్రస్తుతానికి నేను సంపాయించేవి నా ఫీజులకి, మా పొట్టలు నిండడానికీ సరిపోతున్నాయి. కాకపోతే నాకొక్క సాయం కావాలి మీ నుంచి. నాకు ఇంగ్లీషు అంత బాగా రాదు. నాకు నేర్పించగలరా?” అన్నాడు.

నీ మొహం. పల్లెటూరి మొహానివి నీకేం ఇంగ్లీషు వచ్చు? ఓనరమ్మ చాలా గొప్పగా ఇంగ్లీషు మాట్లాడుతుంది.” అన్న శేఖర్ మాటలు చప్పున గుర్తుకు వచ్చాయి.

తన్మయి తడబాటు చూసిఇంగ్లీషు పోయెమ్ కి తెలుగు లో మీరు చేసిన అనువాదం మీ నోట్సు చివరి పేజీలోచూసేను లెండి. అంత గొప్ప అనువాదం చేసిన మీకు ఎంత చక్కని భాషా జ్ఞానం ఉందో అర్థం చేసుకోగలను.” అన్నాడు.

ఏవిటో ఇంగ్లీషు అంటున్నారు?” అని వచ్చి చేరాడు సుధాకర్.

విషయం విని, “త్తతన్మయి గారూ! నాకూ ఇంగ్లీషు ట్యూషను చెప్పాలి మీరుఅన్నాడు.

సంతోషంగా తలూపింది తన్మయి. ప్రపంచాన్ని జయిస్తున్న తొలి మెట్టుని ఎక్కినట్లు సంబర పడింది.

అనంత, రాజు వచ్చి కలిసేరు. సిగ్గుల మొగ్గలా ఉన్న అనంత ముఖాన్ని చూస్తూఏంటి కథ?” అని కనుబొమలు ఎగరేశాడు కరుణ.

అతన్ని తరుముతూ వెంట పరుగెత్తింది అనంత.

***

ఇంటికి వచ్చేక కూడా కరుణ మాటలు మరిచిపోలేకపోతూంది తన్మయి.

బియ్యం ఏరుతూమయిఅని రాసింది అప్రయత్నంగా.  

తనలో తను నవ్వుకుంటూన్న కూతురి వైపు ఆనందంగా చూసింది జ్యోతి.

కాలేజీ లో చేరిన తర్వాత సంతోషంగా ఉన్న తన్మయిని చూసి ఆనందపడ్తూన్నా, అల్లుడు ఎక్కడ ఇవన్నీ భరించలేక గొడవ చేస్తాడోనని భయపడసాగింది.

అయితే మరో కారణంతో శేఖర్ ఊరి నుంచి వస్తూనే ముఖం చికాకుగా పెట్టేడు. శేఖర్ క్యాంపు నించి వచ్చిన మొదటి రోజెప్పుడూ ఇలా చికాగ్గానే ఉంటాడు. అది చూసి తల్లి ఎక్కడ బాధ పడ్తుందోనని మథన పడసాగింది తన్మయి.

 శేఖర్ చికాకు గమనించో, మరేమో జ్యోతి బట్టలు సర్దుకుంది. “అక్కడ ఊళ్లో పనులన్నీ ఆగి పోయాయి బాబూ, సాయంత్రం బస్సుకి వెళ్తానుఅంది.

వచ్చే నెలలో బాబు పుట్టినరోజు ఉంది కదా. మళ్లీ వస్తాంలే.” అంది తన్మయితో.

మొదటి మనవడి పుట్టిన రోజు ఎంత గ్రాండ్ గా చేస్తారో మీ ఇష్టం.” అన్నాడు శేఖర్.  

జ్యోతి ఏదో మాట్లాడే లోగామా అమ్మ మీకు ఫోను చేసి లిస్టు  చెపుతుంది. పిల్లాడి పుట్టినరోజుకి ఎవరెవరికి బట్టలు పెట్టాలో, ఏమేమి మర్యాదలు చెయ్యాలో మీరూ మీరూ మాట్లాడుకోండిఅన్నాడు.

సాయంత్రం  వెళ్లే వరకూ జ్యోతి ముక్కు చీదుకుంటూ కూచుండిపోయింది.

నీ కొడుకు పుట్టినరోజు ఎలా చెయ్యాలో తల్లీఅని గాభరాగా గొణగసాగింది.

శేఖర్ బయటికి వెళగానే తన్మయిఅమ్మా, మీ వల్ల కాదని చెప్పేసెయ్యి. అతనడిగినవన్నీ చేస్తూంటే మరీ లోకువ అయిపోతూంది.” అనేదో సర్ది చెప్పడానికి ప్రయత్నించింది

చాలు తల్లీ, చాలు. కావాలని నువ్వు పట్టుబట్టి చేసుకున్నందుకు మాకు జరుగుతున్న క్షోభ చాలు. ఏం నువ్వు చెప్పలేవా అతనికి? అంటే అన్నిటికీ నేనే చెడ్డ దాన్ని కావాలా?” అని ఎదురు ప్రశ్న వేసింది.

ఎన్నో విషయాలలో తనని ఎంతగానో అర్థం చేసుకున్నట్లు కనబడే తల్లి శేఖర్ విషయంలో అతన్నీ, తననీ ఒక గాటని కట్టి ఎందుకు మాట్లాడుతుందో అర్థంకాదు తన్మయికి.

అతను చేసే ప్రతీ పని వెనకా తన కుట్ర కూడా ఉందన్నట్లు  మాట్లాడుతున్న తల్లి మాటలకి విపరీతంగా దు:ఖం వచ్చింది తన్మయి

తల్లిని బస్సెక్కించగానే శేఖర్ తోబాబు పుట్టిన రోజు మా అమ్మ వాళ్లు ఎందుకు చెయ్యాలి? సాధ్యమైతే చేద్దాం. లేకపోతే మానేద్దాం.” అంది.

తన్మయి వైపు ఈసడింపుగా చూసినేనేవైనా నా పుట్టినరోజు చెయ్యమన్నానా? వాళ్ళ మనవడి పుట్టినరోజేగా. బొత్తిగా తెలివి లేదు నీకు. నువ్విలాంటి వెర్రి మొహానివి కాబట్టే మీ వాళ్ల ఆటలు అలా సాగుతున్నాయి. నీకు ఇవన్నీ అర్థం కావు గానీ మా అమ్మ చెప్పినట్లు విను.” అన్నాడు

పిల్లాడి పుట్టిన రోజు పేరుతో జరగబోతున్న రణరంగాన్ని తల్చుకుని తన్మయి గుండెల్లో రైళ్ళు పరుగెత్త సాగాయి.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.