“అడుగులు” కథా సంపుటి పై సమీక్ష

 -జయంతి వాసరచెట్ల

ఆధునిక సాహిత్యం లో ఎన్నో ప్రక్రియలు ఉన్నా కథాప్రక్రియకు విశిష్ట స్థానం ఉంది.  మన కళ్ళ ముందు అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని క్రమంగా అక్షరీకరిస్తే కథ అవుతుంది.  ఆసక్తికరంగా ఉండి కొంతనిడివితోనే చెప్పవలసిన అంశం చెప్తే అది కథానిక అవుతుంది.

సాహిత్యంలో కథానిక ప్రక్రియ కు ప్రత్యేక స్థానం ఉంది. పాశ్చాత్య సాహితీ సంప్రదాయం నుండి ఆకర్షించబడి మన భాష లోకి వచ్చిన ప్రక్రియ కథానిక. ఆంగ్లంలో “షార్ట్ స్టోరీ” ని మనం కథానికగా పిలుచుకుంటున్నాం.

ఒక నవల రాయడం కన్నా ఒక మంచి కథను రాయడం చాలా కష్టం ఎందుకంటే ఇందులో చెక్కవలసిన శిల్పం ఎక్కువ గా ఉంటుంది అని 

ప్రముఖ రచయితలు అంటారు.

జీవితం చాలా చిన్నది ఈ జీవన సమరంలో ఎదురయ్యే సంఘటనలతాలూకు ప్రతిస్పందనలు ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఉంటాయి. ఏ సమస్య లేకుండా సాఫీగా సాగితే అది జీవితం ఎట్లా అవుతుంది?

ఎన్ని సమస్యలున్నా ఎదురునిలిచి లక్ష్య సాధనకై నిరంతరం శ్రమిస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడమే తెలివైన వాళ్ళు చేసే పని .

“కథను ఏ రూపంలో రాసినా కథ ద్వారా పాఠకులకు ఒక సంస్కారాన్ని ఒక దృష్టి నీ  కలిగించడం ముఖ్యం”( గోపీచంద్)

 మన నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఫలితమే కథలు గా రూపాంతరం చెంది రాబోయే తరాల వారికి కథయొక్క కాల మాన 

పరిస్థితులు ,స్థితిగతులు తెలియజేస్తాయి .ప్రస్తుత సమాజంలోని సంఘటనలను ఆధారంగా చేసుకొని డాక్టర్ దేవేంద్ర రాసిన మొదటి కథల సంపుటి “అడుగులు” 11 కథలతో రూపొందిన ఈ సంపుటిలో మొదటి కథ “అడుగులు” చివరిది “నిర్భయ నుంచి దిశావరకు “కథలన్నీ దేనికవే ప్రత్యేకతను సంతరించుకొని ప్రస్తుత  సమాజాన్ని అద్దం పడతాయి.

*అడుగులు అనే కథలో చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన మాలతి చదువులో చురుకైన అమ్మాయి.అర్థాంతరంగా భర్తను కోల్పోయిన మాలతి తల్లి ఉన్న కొద్దిపాటి ఆస్తిని అమ్మి నలుగురు సంతానంతో తల్లిదండ్రుల ఇంటికి వస్తుంది. బీడీలు చేసి వచ్చిన ఆదాయం తో తన పిల్లలను ఏ లోటు లేకుండా చదివిస్తుంది. మాలతి పదవ తరగతి లో ఉండగానే చాలా సంబంధాలు రావడం వల్ల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కట్నం లేకుండా పెళ్లి కుదరడం వల్ల గత్యంతరం లేక పెళ్లి కి తల వంచచవలసి వస్తుంది. పెళ్లి తర్వాత చదివిస్తానని పెళ్లి కొడుకు నరేష్ మాట ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇంటర్మీడియట్ 

రెండవ సంవత్సరం వార్షిక పరీక్షల సమయంలో నిండు గర్భిణీ పురుటినొప్పులు వస్తున్నా లెక్కచేయక పరీక్ష రాసి తరువాత డెలివరీకి వెళుతుంది మాలతి.బాబుకు జన్మనిస్తుంది పరీక్ష అత్తెసరు మార్కులతో  పాస్ అవుతుంది. డిగ్రీలో పాప పుడుతుంది. అలా తన చదువు కొనసాగిస్తూనే ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది.తనకు ఇష్టమైన మాథ్స్ సబ్జెక్టు వదులుకొని సాహిత్యం వైపు దృష్టి సారించి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తన పీజీ పూర్తి చేసుకుంటుంది.  కష్టపడి చదువుకుని ఉద్యోగం చేసి భర్తకు చేదోడు వాదోడుఅవుదామని అధ్యాపక పరీక్ష కోసం కష్టపడి చదువుతుంది. పరీక్ష ఫలితాలలో తన పేరు లేదు అయినా మాలతి నిరాశ పడలేదు తన ప్రయత్నం ఆపలేదు తన ముందు ఎంచుకున్న లక్ష్యమే కనిపిస్తుంది.  పై కథ నేటి యువత చదివి ఆదర్శంగా తీసుకోవాలి. ఎంతో గొప్ప జీవితం అనుభవించాల్సిన యువత చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు కుటుంబానికి మానసిక క్షోభ మిగులుస్తున్నారు .అలాంటి వారికి అడుగులు కథ స్పూర్తిగా ఉంటుంది. 

*మరో కథ” కొత్తపల్లి ” ఈ కథలో కమ్మరి పని చేసే విశ్వనాథం హఠాత్తుగా చనిపోతే భార్య వనజ ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు నవీన్ ను 

బీడీలు చుట్టి ,గుడిలో శుభ్రం చేసే  పని చేసి ఆ వచ్చే డబ్బుతో పిల్లలను కష్టపడి చదివిస్తుంది. ఎం.సీ.ఏ లో నవీన్ కు సీటు వస్తే చదివించడానికి చేతిలో డబ్బులేదు ఉన్న ఇల్లు తాకట్టుపెట్టి చదివిద్దామనుకుంటుంది వనజ. ఏతాకట్టు లేకుండా నవీన్ కు చదువుచెప్పిన ఉపాధ్యాయుడు నర్సయ్య సార్ సాయం తో   నవీన్ బాగా చదువుకుంటాడు. మధ్యలో చెల్లెలి ఆరోగ్యం పాడైపోతే ఉన్న ఇల్లు కాస్త తాకట్టుపెట్టి హాస్పిటల్ లో చూపిస్తారు.అయినా చెల్లెలి ఆరోగ్యం కుదుట పడదు. నవీన్  నిరాశ పడకుండా ఉద్యోగ ప్రయత్నం చేసి మంచి ఉద్యోగం సంపాదించి ఆత్మస్థైర్యంతో తన  చెల్లి ఆరోగ్యం బాగు చేయిస్తాడు.తన చదువు కు కారణమైన నర్సయ్య సార్ కు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి కొత్తపల్లికి నూతనోత్సాహంతో బయలుదేరుతాడు నవీన్ . ఎన్ని కష్టాలు వచ్చినా మొక్కవోని ధైర్యంతో కృషిచేసి కన్నతల్లి కలలను నెరవేర్చి తనఎదుగుదల కు కారణమైన నర్సయ్య సార్ గర్వపడే విధంగా తిరిగి వచ్చాడు నవీన్.

*నారుమడి అనే కథలో పల్లె జీవన చిత్రాన్ని వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని ,వ్యవసాయానికి వాడే పనిముట్ట అవసరాన్ని కళ్లకు కట్టారు రచయిత్రి .నేడు ఐఐటీ, ఎంబిబిఎస్, లాంటివే చదువులు అన్నట్లు మిగతావన్నీ చదువులు కావు అన్నట్లు చిన్నచూపు చూస్తున్న నేటితరం తల్లిదండ్రులకు వ్యవసాయం” అగ్రికల్చర్ “చదువు కూడా గొప్ప చదువు అని తన కథ ద్వారా  సూచన  ఇచ్చే ప్రయత్నం చేసారు రచయిత్రి .వ్యవసాయానికి వాడే పనిముట్లు పద్ధతులు అన్నీ ఈ కథలో ప్రస్తావించింది .తెలంగాణ పల్లె యాస సొగసును అద్ది ఆప్యాయతలు ఎలా ఉంటాయో.  వారు తెచ్చుకున్న సద్ది మూట విప్పి ఒకరికొకరు పంచుకొని తినడం లో కనిపిస్తుంది .మరచిపోయిన పల్లె తనాన్ని నారుమడి కథలో కళ్లకు కట్టారు రచయిత్రి .

*రంగయ్య అనే కథలో లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్ర నుండి తిరిగి వచ్చిన కార్మికుడు రంగయ్యకు కరోనా  ఉందేమో అన్న అనుమానం తో గాంధీ ఆస్పత్రిలో పరీక్ష కోసం చేరితే పాజిటివ్ వచ్చింది. ఇంకా తన కుటుంబాన్ని కాలుస్తానో లేదో అనే అనుమానం కలుగుతుంది. క్వారెంటైన్ లో ఉండి జబ్బు తగ్గిన తర్వాత కాలినడకన సొంతూరు చేరుకుని తన కుటుంబంతో తనకు కరోనా వచ్చిందని  ఆసమయంలో డాక్టర్లు చేసిన సేవ గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా గురించి చెప్తాడు. ఇకనుంచి అందరం ఒకే దగ్గర ఉందాం కలిసి పనిచేసుకుంటూ ఉన్నంతలో బతుకుదాం అని భరోసా ఇచ్చుకుంటారు .కరోనా లాక్డౌన్ వల్ల వలసకార్మికులు పడిన కష్టాలను వారి కుటుంబాల్లో అనుభవించిన బాధలను రచయిత్రి చక్కగా చిత్రించారు .

మరో కథ “వసుధ “ఈ కథలో ఉన్నతమైన చదువులు చదువుకొని డిగ్రీ లెక్చరర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాసుధకు 35 సంవత్సరాలు. ఇంకా వివాహం కాలేదు. ఇద్దరి ఆలోచనలు కలిసిపోయి ఇష్టపడిన రవి తో పెళ్లి జరుగుతుంది వాసుధకు. తండ్రి లేని రవి తల్లి పై ఉన్న ప్రేమతో ఆమె మాటను కాదనలేక భార్యను సపోర్ట్ చేయలేక సతమతమవుతుంటాడు. 

భార్య తనను వదిలి వెళ్ళిపోయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు.

వసుధ అన్నింటినీ మౌనంగా భరించి తాను కలలుకన్న లక్ష్యాన్ని చేరుకుంటుంది.  తల్లి తోనే ఉండిపోతాడు రవి.కూతురు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అర్థం చేసుకుని  భర్త, అత్త తన ఇంటికి రావడంతో కథ సుఖాంతమౌతుంది. పై కథ నేటి ఆధునిక సమాజం లోని 90 శాతం మంది గృహిణులు ఎదుర్కొంటున్న సమస్య నే కానీ రచయిత్రి వసుధ పాత్రను ఔచిత్యం తో చిత్రించారు. పెద్దలకు ఎదురు చెప్పకుండా మౌనం తో సమాధానం చెప్పవచ్చని ఓర్పుతో కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని ఈ కథ ద్వారా సూచన ఇచ్చారు. 

*మరో కథ “కాన్గిరి బడి” ఈ  కథలో నరసింహాచారి తన చిన్నప్పుడు ఓనమాలు దిద్దించిన కాన్గిరి బడి పంతులు బట్టు రామరాజు ను గుర్తు చేసుకుని గురుపూజోత్సవం నాడు వారి బాల్య స్నేహితులు అందరూ వాట్సాప్ గ్రూపులో చర్చించుకుని 80 ఏళ్ళు వృద్దాప్యంలో  ఉన్న వారి గురువు గారికి ఆర్థికంగా కరోనా కాలంలో సహాయం చేయాలనుకునిడబ్బు పోగు చేసి అందరూ కలిసి పంతులును కలిసి శాలువా కప్పి ప్రోగు చేసుకున్న డబ్బును వారికి  ఇచ్చి వారి గురుభక్తి ని  చాటుకుంటారు.ఈ కథ ద్వారా జీవితాన్ని రచయిత్రి ఒక్కసారిగా మనల్ని బాల్యానికి తీసుకొని వెళ్లారు. అప్పుడు మన గురువులు నేర్పించిన సంస్కారాన్ని గుర్తు చేశారు. ఇలా అడుగులు కథాసంపుటిలోని కథల్లోని పాత్రలన్నీ మనచుట్టూ తిరుగుతున్న భావన  కలుగుతుంది .ఇంకా సంకల్పం, సుదర్శన చక్రం ,వెండి గిన్నె ,గురితప్పొద్దు, కథలు కూడా ఉన్నాయి. దేనికదే విభిన్నంగా ఉన్నాయి. బి.ఎస్.రాములుగారు, ముదిగంటి సుజాతా గారు, పెద్దింటి అశోక్ కుమార్ గార్ల ముందుమాటలతో పూలకు పరిమళాలు అద్దినట్లుగా అయ్యింది. అలాగే ” డాక్టర్ వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం -2020 ” కూడా అందుకుంది. మున్ముందు విభిన్న కోణాల్లో పరిశీలించి స్పూర్తిదాయకమైన  మరెన్నో కథలు రాసి తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ ఉండాలని త్వరలోనే మరో కథా సంపుటితో మనముందుకు రావాలని   కోరుకుంటూ దేవేంద్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

ప్రతులకు: విశాల సాహిత్య అకాడమీ

ఫోన్:08331966987

డాక్టర్.ఎం.దేవేంద్ర

9490682457

 

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.