ఇంత దూరం గడిచాక

డా.సి.భవానీ దేవి కవితా సంపుటి పై సమీక్ష

-వురిమళ్ల సునంద

ఇంత దూరం గడిచాక కూడా మనసులోని బరువును దించుకోక పోతే ఎలా….మాటల మూటను విప్పుకోక పోతే ఎలా.. నలుగురితో పంచుకోకపోతే ఎలా..? ..ఏమో మనం దిగే స్టేషన్ ఎప్పుడు వస్తుందో… అందుకే  ఇంత కాలం మనతో కలిసి మెలిసి ప్రయాణించిన వారందరికీ తడి కళ్ళతో ధన్యవాదాలు చెప్పుకుంటూ.. వీలయినంత హాయిగా అందరితో గడిపేస్తూ… నా తర్వాత కూడా ప్రయాణించే వాళ్ళందరికీ/ నా గురించిన అందమైన స్మృతుల పుష్పగుచ్ఛాన్ని/ అందించి పోవాలనుకుంటున్నాను… ఓం తాత్విక దృష్టితో ఆలోచిస్తూ…. జనన మరణాల మధ్య  గల మన జీవన యానాన్ని   దృశ్యమానం చేసిన కవయిత్రి డా. సి.భవనీదేవి గారు.. ఇలాంటి కవితలు 
ఈ సంపుటిలో చాలా ఉన్నాయి.
తాను నడిచే దారిలో ఎదురైన అనుభవాలు , అనుభూతులు, సామాజిక సందర్భాలు, జ్ఞాపకాల పరిమళాలను తనదైన శైలిలో కవితా రూపంలో అద్భుతంగా  అందించారు. 
తెలుగు సాహిత్యంలో జగమెరిగిన కవయిత్రి వీరు.  కవితలు, కథలు,నవలలు, నానీలు,వ్యాస సంపుటాలు,బాల సాహిత్యం, అనువాదం, సంపాదకత్వం.. ఒకటేమిటి అనేక ప్రక్రియల్లో
బహుముఖీన సేవ చేసిన లబ్ధప్రతిష్టులు వీరు.
 ప్రస్తుత కవితా సంపుటి ‘ఇంత దూరం గడిచాక’ కవితా సంపుటిలో చోటు చేసుకున్న 88 కవితలు ఏ దానికి అదే సమాజానికి ప్రత్యేక సందేశాన్ని ఇస్తాయి.
  తన మాట.. కవిత్వంతో నేను అని తన 42 సంవత్సరాల నిరంతర ప్రయాణాన్ని గురించి చెబుతూ కవిత్వం ఓ ‘హృదయ కళ’ అంటారు. 
కవులు రాసే కవిత్వానికి ఒక పొయిటిక్ డిక్షన్ ఉంటుంది. తమదైన వ్యక్తీకరణ శైలి ఉంటుంది.
తమదైన హృదయ స్పందన ఉంటుంది. వారి స్పందించే తీరులో తమదైన ముద్ర ఉంటుంది. ఒక తాత్విక భావన ఉంటుంది.  వీటన్నింటినీ  చూడాలంటే ఈ కవితా సంపుటి చదవాల్సిందే..
 ‘అమ్మ నిజం చెప్పదు’ కవితలో
‘డాలర్ల తోటలోకి నెనెగిరి పోతున్నప్పుడు…. ‘త్వరలో వచ్చేస్తాను గానీ భయపడుతున్నావా’ / అడుగుతున్న నాకేసి సూటిగా చూడకుండా/ కళ్ళు వాల్చేసినప్పుడూ… నువ్వు నిజం చెప్పలేదు అని తల్లి గురించి నిష్టూరంగా అంటున్న కొడుకు ఇంకా ఏమంటాడంటే
 ‘వృద్ధుల శరణాలయ దేవాలయం లో/ ఒంటరి దివ్వెలా నువ్వు మిణుకు మిణుకు మంటూ/కళ్ళనిండా కోటి విమాన శబ్దాల్ని పరుచుకుని…
‘రంగు వెలసిన బొమ్మ లాంటి నీ అమృత హస్తాన్ని/ స్పర్శ లేని తనంతో కృతకంగా రాస్తూ/ అమ్మా నీకిక్కడ అంతా బాగుంది కదా’/ ‘ ఏమీ ఇబ్బంది లేదు కదా’… తలవంచుకుని నేను అడిగినప్పుడు కూడా.. నువ్వు నిజం చెప్పలేదు/ అవును .. నువ్వు ఎప్పుడూ నాకు నిజం చెప్పలేదమ్మా!’  అంటున్న కొడుక్కు  కనబడుతున్న ప్రత్యక్ష నిజాన్ని ఆత్మ వంచన చేసుకుంటూ చూస్తూనే అడుగుతున్నప్పుడు ఇంకేం నిజం చెబుతుంది.. ఏం తల్లి అయినా పిల్లల ఎడబాటు కోరుకోదు. పిల్లల భవిష్యత్తు కోసం, కుటుంబం కోసం బతుకంతా వెచ్చిస్తుంది. కనీసం అవసాన దశలో అయినా  వారి దగ్గర ఉండాలన్న ఆశ ఆవిరైపోయినంక ఇంకేం చెబుతుంది.అవును… అమ్మ  నిజం చెప్పదు. కవిత ఆసాంతం మాతృమూర్తి మహిళా హృదయమెలాంటిదో చూపి కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తారు కవయిత్రి.
‘రెండో రెక్క’ కవితలో ‘ ‘తల్లి చెట్టుకు కూడా తన జాతి పువ్వుల్ని/ ప్రసవించాలంటేనే కొండంత వ్యతిరేకత…. అవును ఈ సమాజంలో ఆడతనానికి రక్షణేది. నిత్యం అత్యాచారాలు, హత్యల్లో ఆహుతై పోతుంటే..
‘అసమాన నిష్పత్తి సుడిగుండంలో/ మనిషి అంతరించే ప్రమాద ఘంటికలు వినిపిస్తాయా?.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ‘అస్తిత్వానికి సవాలయిన/ కఠిన సమాజ కంటకాలపై / క్రమశిక్షణా కరవాలం ఝళిపించక పోతే/ వాలిపోతున్న రెండో రెక్క రాలిపోతోంది సుమా! అని ఆవేశంతో హెచ్చరిస్తారు. 
‘దారం’ కవితలో తాత్వికత దర్శనమిస్తుంది ‘ … నా జీవితకాలం/ కనిపించేవి దారానికి రెండు కొసలే.. మధ్యలో కనిపించని దారం నేనే! మనిషి  జనన మరణాల నడుమ కనిపించేవి రెండే కొసలు మధ్యలో ఎదగడం, వెలుగుతూ మిగలడం ఆ మిగిలేదే మనిషి చరిత్ర’ ఈ చిన్న కవితలో జీవన సందేశాన్ని అందించారు కవయిత్రి.
ఇక  మృత్యువును ‘సహచరి’ గా భావిస్తూ రాసిన కవితలో ‘ బతికినంత కాలం/  వదలకుండా వదలకుండా వెంట తిరిగేది/ మృత్యువే అయినప్పుడు/ ఆ జీవన సహచరిని/ ప్రేమించకుండా ఎలా ఉండగలం?.. అవును జననం మరణం ఒకటే అనుకున్నప్పుడు రెంటినీ ప్రేమించాలనే  కవయిత్రి మాటల్లో  కనిపించే తాత్వికత ఇది. ‘ఆమె ఒక దీపం’ కవితలో  కదిలించే వాక్యాలివి. ‘చదివేసిన న్యూస్ పేపర్ ను/ ఎవరు మాత్రం పట్టించుకుంటారు? అని.. ఆడపిల్లగా ఈ లోకంలో కళ్ళు తెరిచిన స్త్రీ మూర్తి  అవసానంలో ఒకరి దయాదాక్షిణ్యాలపై బతికే దుర్భర క్షణాలు.. మలుగుతున్న దీపం కదా.
‘ఇప్పుడామె ఎంత పిలిచినా/ పలకడానికి ఎవరికీ తీరిక లేదు.. / రేపటి పొద్దున ఎవరెంత ఆక్రోశించినా/ బదులు పలకడానికి ఆమే ఉండదు!.. ఇక నైన కన్నవారిని ఆదరించండి ఓ చిన్న ప్రేమ పూర్వక పలకరింపు చివరి క్షణాలను ఆనందంగా మారుస్తాయని .. ఇస్తున్న సందేశమిది.ఇలాంటి కవితే ‘ఇవి చాలురా’.. వృద్ధాప్యం లో తల్లి శారీరక మానసిక అశక్తత ను ఈసడించుకుంటుంటే ఆవేదనతో పలికే మాటలు ‘ ‘చివరి రోజులు దురదృష్ట ఫలాలుగా/ మిగిలిపోవటం నాకిష్టం లేదు / రెండు మాటలు.. అప్పటి స్పర్శ/ ఆరిపోని దీపంలాంటి ఆ చిరునవ్వు ఇవి చాలురా../ మనసారా హంస ఎగిరిపోవడానికి.. నేటి ఎందరో వృద్ధులైన అమ్మల వ్యధా భరిత జీవితాలను ఈ అక్షరాల్లో దృశ్య మానం చేశారు కవయిత్రి.
‘తడి ఇసుక’ కవితలో ‘తొలి శ్వాస ఎగరేసిన గువ్వ/ మా అమ్మ మాట’ ‘ నా చుట్టూ ఆవరించిన నీడల్ని నులిమేసి/ తోడయి నడిచిన ఊపిరి దీపం/ మా ఊరి మాట!’.. . ‘మా గురువు పలుకు బడి’ ‘బాల్యం తినిపించిన గోరుముద్దల పాట’ .. ‘నాతో పాటు ఎదిగొచ్చిన నా మాటని’.. ‘ఒక నది.. మరో నదిని/ కలుపుకున్నంత లాలనగా/ పలుకు తేనెల్ని/ పరిమళాలతో ఇంకించుకున్న/ తడి ఇసుక లాంటి దాన్ని!’.. ఈ వాక్యాలు చాలు మాతృ భాషపై ఉన్న మమకారం ఎంతటిదో మరి ఆ మాతృ భాషను మట్టి మూలాల్లోంచి నడిపిస్తున్న ప్రాణశక్తిని వదిలేస్తే/ ఆత్మ దీపాన్ని ఆర్పేసుకున్నట్లే కదా./ మన అస్తిత్వ కవచాన్ని/ ఆగం చేసుకున్నట్లే గదా.. మన ఉనికికి ఊపిరులు ఊదిన మాతృభాషకు ఋణపడి ఉందామని ఇచ్చిన సందేశం.. పరాయి భాష మోజులో పడి మాతృ భాషను నిర్లక్ష్యం చేస్తున్న వారికో  చురక లాంటిది ఈ కవిత.. 
‘నా విజయాల హరివిల్లులు/ నయన దీపాలైతే/ చెమర్చేవి ఆ కళ్ళే’… ‘నా ఆరాటం లోని ప్రతి స్ఫూర్తీ/ నాన్న నడక లోంచి వికసించిందే/ స్మృతుల ఆల్బం నిజంగా గాలమే…. ఇప్పటికీ నాన్ననోసారి చూడాలనిపించి నప్పుడల్లా/ మంచి పద్యాన్ని/ మరోసారి చదువుకుంటాను’.. నాన్న ఇచ్చిన మనో బలాన్ని..ఆ బంధాన్ని అక్షరాల్లో ఒదిగించి నాన్నపై ప్రేమను  మంచి పద్యంతో పోల్చారు.అవును పద్యాలెప్పుడూ మనిషిని మనిషిగా తీర్చిదిద్ది సమాజంలో ఉన్నతంగా నిలబెడతాయి..అటు నాన్నను ఇటు పద్యాల గొప్పతనాన్ని జమిలిగా చెప్పిన తీరు అద్భుతం. ఇందులో చాలా కవితలు మహిళ గొప్ప తనం, మహిళా సాధికారత, ఆమె హృదయావేదన.. ఇలాంటివి తానో స్త్రీ మూర్తి గా అనుభూతించిన ఆవేదన పడిన,ఆనందపడిన కవితలు ఎన్నో ఉన్నాయి. 
ఇంకా ఇందులో ‘ఆంధ్రా పెరల్ బక్’ గా వాసిరెడ్డి సీతాదేవి గారికి రాసిన నివాళి కవిత, ‘బాల మురళీయం’ శీర్షికతో గాన మాధుర్యం తో ఓలలాడించిన మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారికి, కొంటె బొమ్మల బాపు గారికి, ‘అసలు భారతీయుడు’  శీర్షికతో ‘మిస్సైల్ మాన్’ ప్రజా రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి,మహర్షి మండేలా, రాజేష్ ఖన్నా కు నివాళులు అర్పిస్తూ రాసిన కవితలతో పాటు సచివాలయంలో మిగిలిన ఓకే ఒక ప్రాచీన కట్టడం సైఫా ప్యాలెస్ ను వర్ణిస్తూ: సర్వహిత కవిత’ ఇలా ఎన్నో  స్మృతులను కవితలుగా అక్షరీకరించి పాఠకుల అందించారు… అమరుడైన సైనికుడి భార్య  హృదయ వేదనను’ ‘కన్నీటి కావ్యం’ కవితలో చదివినప్పుడు గుండె బరువెక్కక మానదు. ‘ ప్రజల కోసం పనిచేసే వాడి బతుకు/ తుపాకీ మోతల్లో తెల్లారు తుంది/ మరి అతనితో అల్లుకున్న బంధమైన  భార్య  పరిస్థితి..  ఒళ్ళో పాలకేడ్చే పసిపాప కన్నా/ అనాధ సతీ శరీరంపైనే కదా..అందరి చూపుల కాట్లు.. అందుకే ఆమె కన్నీటి కావ్యాన్ని/ మనసు పేజీల్లోనే రాసుకుంటున్నది/ తన బతుకే ఒక వేదనా వ్యాఖ్యానంగా..‌ ఈ పదాలు భర్తలను కోల్పోయిన సైనికుల భార్యల జీవితాలను కళ్ళముందుంచి ఏడిపిస్తాయి.
 కవయిత్రి మంచి అనువాదకురాలు. ఇందులో  ‘మనిషి మూలం’, ‘నేను నేనుగా’ లాంటి అనువాద కవితలు చదువుతుంటే అనువాదం లా అనిపించవు ఆ భాష నాడిని పట్టుకుని హృదయాంతరాలాల్లో ఆవాహన చేసుకుని రాసినట్టుగా ఉంటాయి… ఇంకా తాను శ్రీలంక టూర్ వెళ్ళినప్పుడు తనను ఆకర్షించిన శ్రీలంక అందాలు, అండమాన్ జైలును దర్శించినప్పుడు అక్కడ మిగిలి ఉన్న ప్రాచీన వృక్ష రాజం గురించి ‘జాతి ధ్వజం’ పేరుతో రాసిన కవిత’ కాలాపాని లాంటి కవితలు మనల్ని అక్కడికి  చేయిపట్టుకుని నడిపించి దృశ్య మానం చేస్తాయి.’బువ్వ దేవుడు’ ఈ శీర్షిక చూడగానే ఎవరో అర్థం చేసుకోవచ్చు.. ఆయనే నిరంతరం ప్రకృతితో పోరాడే మట్టి మనిషి ..నేనూ మీరు మనందరం ఆ అరచేతి ముద్దలు తింటేనే గదా.. ఇంత దూరం నడిచొచ్చాం  ..మరి అలాంటి దేవుడికి బతుకు మీద రవంత ఆశ కల్పిద్దాం.ఆత్మ హత్యలను నివారిద్దాం ఇది అందరి బాధ్యత..   తన హృదయ లోతుల్లోంచి పెల్లుబికి వచ్చిన సందేశాత్మక కవితలను చదివి మనం కూడా ఆ దిశగా స్పందిస్తూ..ఆచరణ అడుగులు వేసేందుకు ప్రయత్నం చేద్దాం…
  సాహిత్యాన్ని సమాజ హితాన్ని కోరేవారందరూ ఈ కవితా సంపుటి  చదవాల్సిందే. వారి అక్షర రమ్యతకు భావజాలానికి, నిరంతర సామాజిక బాధ్యత గల వారి నిత్య చైతన్య శీలతకు హృదయాభివందనాలు తెలియ జేద్దాం. వారి కలం నుండి మరికొన్ని కవితా సంపుటాలు రూపుదిద్దుకోవాలని కోరుకుందాం.
*****
Please follow and like us:

One thought on “అనేక ఆకాశాలు- స్త్రీల కథలు”

  1. చాలా చాలా చక్కగా వ్రాశారు శుభాభినందనలు సునంద గారు

Leave a Reply

Your email address will not be published.