బతుకు చిత్రం-3

– రావుల కిరణ్మయి

తండ్లాటెందుకు?పొర్లాటెందుకు?నువ్వే అంటివి గదెనే !చెట్టంత కొడుకని.అందుకే నిమ్మళంగున్న.సంకల ఆడే శాంతి పోరడయితే నేను సుత నీ లెక్కల్నే సూత్తును కావచ్చు.అన్నాడు మంచం మీద జేరి ఆవలించుకున్టనే.

గందుకే అంటాన,దున్నపోతు మీద వాన కురిసినట్టని…….అన్నది కోపంగానే.

ఏందే?ఏమో…దున్నపోతంటానవ్?పెయ్యెట్లున్నదే? అన్నాడు.

గీ బెదిరింపులకేం తక్కువ లేదు.”ఉన్న మాటంటే ఊర్లున్డనీయరన్నట్టు ..”దున్నపోతని ఉన్నమాటే  అన్న.

నీ వల్లనే కదా!ఆ ఊర్ల ఇడిశి పెట్టి అచ్చిన.నీకేమన్న ఇజ్జతున్నదా?పొల్లను సూడ వోయిన ఊర్లనే పొలగాన్ని ఇడ్సిపెట్టి వత్తే ఈని తాగుడు జూసి పొల్లను ఇచ్చెటోడు ఇత్తడా?గాయింత సోచాయించక పోతివి.నేను సోచాయించిన దాన్నిగనుకనే వద్దని మొత్తుకుంటిని.నీకు చెవుల పేను సుత పారక పాయే.ఈ తీర్గ పోరన్ని ఏదో గావురం ఎన్న గాస్క తిన్నదన్నట్టుగా జేసి తెర్లు జేత్తానవ్!అనుకుంటూ దుఃఖపడుతుంటే ….

అవ్వ పెట్టదు అడక్క తిననియ్యదన్నట్టు ,నువ్వు పండవ్ నన్ను పండనియ్యవానే?ఇప్పుడేందో సోది మొదలు పెట్టినవ్?ఆ పొల్లే కావాల్నని ఏమున్నది?దేశ మేమన్న గొడ్డు పోయిందా?అక్కడికి అదేదో పెద్ద అప్సరస అయినట్టు?అని ముసుగు తన్ని పడుకున్నాడు రాజయ్య.

ఛి …పాడు జన్మ.నా గండానికి గాకుంటే ఎందుకు పుట్టినట్టు?కొడుకును ఆజ్ఞల పెట్టడు ,నన్ను పెట్టనియ్యడు.లగ్గం జేత్తే ఈ పాటికి ఇల్లేదు పిల్లల తో ఇల్లు నిండేది.ఆ ఊసే లేదు.ఇంకా సుత దేశం గొడ్డు పోయిందా?అని ఎక్కడ లేని పోకట.అని గట్టిగానే భర్త ను మందలిస్తూనే పెద్దర్వాజాలో అలాగే కూలబడిపోయింది.చిన్న చిన్న చినుకులు సన్నగ ఆమెను తగులుతున్నా,లెక్క చేయక కొడుకు మీద ధ్యాస తో అలాగే తపస్సు పట్టినట్టు గా ఉండిపోయింది.

             ****

పాడుబడిన దేవాలయము కళ్యాణ గద్దెపై  కప్పు కింద ఉన్న సైదులుకు ఏ రాత్రో మెళుకువ వచ్చింది.కొంచెం దూరం లో ఇంకో పక్క జాజులమ్మ పడుకొని ఉండటం చూసి,

తనేవరు?నేను ఇక్కడికెలా వచ్చాను?అని గుర్తు చేసుకోసాగాడు.

అమ్మా నాయినలు బస్సెక్కి పోంగానే,అక్కడ గుడిసెలనే ఉన్న సారా దుకాణంలో తాను పైసలు ఒడిషి పోయేదాంక తాగి సోయి లేకుంట పంటే దుకానపోల్లు బంజేత్తమని బల్మిటికి లేపి బైటికి నెట్టేయంగా అటీటుపడుకుంటూ ,లేసుకుంటూ నడిశింది జ్ఘాపకమచ్చి ఒక్క క్షణం ఛి అనిపించినా’

ఈ ఊర్ల నేనెవరికి తెలువను కాబట్టి ఇజ్జతు వోయిందని బాధ పడే పని లేదనిపించింది.సైదులుకు.

తనకు తన సొంత ఊర్లో ఎంతో కొంత గౌరవం ఉందన్న ప్రగాఢ విశ్వాసం ఉండటం వల్ల.

లేచి ఇంటి దారి పట్టాలనుకున్నాడు.

చేతిలో చిల్లి గవ్వ కూడా లేదన్న సంగతి జ్ఙాపకం వచ్చింది.

మరెలా వెళ్ళటం?

ఈమెవరో,ఈమెనే అడుక్కుని వెళితే సరి.అసలు నన్ను ఇంత దూరం ఈమే తీస్కచ్చి ఉంటుందా?ఇలా ఎన్నెన్నో జవాబులు దొరకని ,కావలసిన ప్రశ్నలతో జాజులమ్మనే చూస్తూ కూర్చున్నాడు.

ఇంతలో జాజులమ్మ నిద్ర లోనే చల్ల గాలికి సన్నగా వనుకుతుండడం తో తను వేసుకున్న షర్టు తీసి ఆమెకు కప్పాడు.

ఇలా ఇద్దరూ ఒకే కప్పు కింద చెరో వైపు అతని షర్ట్ కప్పబడి జాజులమ్మ,ఆమె చీర పేలిక తలకు కప్పబడి సైదులు ,ఇద్దరూ తెల్లవారే వరకూ ఉంది పోయారు.

                                                                  ****

భూమిని చేరిన సూర్య కిరణాలు ఊరంతటిని నిద్ర లేపింది.కానీ సైదులు,జాజులమ్మమాత్రం లేవలేదు.        

జనమంతా ఈ ఇద్దరినీ చూడటానికి బెల్లం చుట్టూ ఈగల్లా బిల బిలమంటూ ఆ పాడుబడిన గుడి ఆవరణ లోకి చేరి ఎవరై ఉంటారు?వీళ్ళు?

దొంగ లా?దొరలా ?

ఆడా,మగా ఇద్దరూ ఒకరికి ఒకరు ఏమైనా బంధుత్వముండి ఉంటుందా?ఉంటే,ఎవరై ఉంటారు?

భార్యాభర్తలా?అన్నా చెల్లెల్లా?అక్కా తమ్ముళ్ళా?బావామరదళ్ళునా?ప్రేయసీ ప్రియులా?ఎవరు…?ఎవరు వీళ్ళు?

ఇలా ఎన్నో ధర్మ సందేహాలతో గుస గుసలు మొదలు పెట్టారు.

గ్రామ పెద్దలు కూడా అక్కడికి చేరుకున్నారు.అలా అక్కడ మొదలైన సందేహాల కోలాహాలానికి తేరా దించుతూ ముందుగా జాజులమ్మ మేల్కొని తన మీద కప్పిఉన్న షర్టు ను తననే చూస్తూ పోగైన జనాన్ని,అటు పక్కగా ఇంకా నిద్ర లోనే ఉన్న సైదులును తత్తరపాటు తో బిత్తర చూపులు చూస్తూ షర్టు ను తీసి విసిరేసి కొంగు నిండు గా సవరించుకొని తలదించుకొని నిలబడింది.

అక్కడి వాతావరణాన్ని ఎలా ఎదుర్కోవాలనే సందిగ్ధం లో.

ఇంతలో జజులమ్మ విసిరేసిన చొక్కా బలంగా సైదులు మొహమ్మీద తగలడం తో అతనూ ఇంచు మించు జాజులమ్మ మనో స్థితి లాగానే మానసికంగా అనిశ్చితికి లోనవుతూ నెమ్మదిగా పైకి లేచి చొక్కా తొడుక్కున్నాడు.అలాగే ఇద్దరూ కళ్యాణ గద్దె పై చెరో వైపు నిలబడి పోయారు.

ఎవరయ్యా మీరు?మీదేవూరు?ఈడ ఎన్ధుకున్నరు?గట్టి గా అజమాయిషీ చేస్తూ జనం లో నుండి ముందుకు వచ్చి అడిగాడు గ్రామ పెద్ద వరయ్య.

జాజులు చెప్తుందని సైదులు,

సైదులు చెప్తాడని జాజులమ్మ అనుకోని మౌనంగా ఉన్నారు.

ఏం మీకే?నేనడిగింది చెవికెక్కలేదా?ఎవరూ మాట్లాడరేంది?రెట్టించాడు మళ్ళీ.

వీళ్ళ వాలకం చూస్తే తప్పు చేసిన తప్పుడు మనుషులకు మల్లే ఉన్నారు.రాత్రంతా ఈ పవిత్ర మైన కళ్యాణ గద్దె పైనే ఉన్నారంటే,ఎంత నీచమైన పని చేసీ ఉంటారో!అందుకే నోరు తెరుస్తలేరు.వీళ్ళను చావ బాదడమే సరైన శాస్తి.అన్నాడు అతి గా ఆవేశపడే ఆ ఊరి యువకుడు చంద్ర.

అరె ఆగరా !నీ కన్నీటికీ తొందరే.ఇద్దరూ …ఈ ఊరి వాళ్ళు కాదనేది సచ్చెం.మరి ఎందుకీడున్నరో తెల్సుకోవాలెగని,  ..ఇంకా ఏదో చెప్ప బోతున్న వయసులో పెద్ద వాడైన కర్ణయ్య కు అడ్డు తగులుతూ చంద్ర ,

ఆపాపు.నీకు మల్లే ఇవరమడిగితే నియతి గా చెప్పే కాలమా ఇది?నాలుగు తన్నులు తన్ని దోపి ఇడిసి పెడితే వాళ్ళ తలలోని జేజమ్మ దిగి సత్యం పలుకుతరు. ఎన్కటికి నీలాంటోడు తాటి చెట్టు కింద ఏం జేత్తానవ్ ?అంటే,నిలబడి పాలు తాగుతాన !అన్నాడట.

అట్లనే వీ ళ్ళు  కూడా ,ఏవో దొంగ మాటలు జెప్తే మన మెట్లింటం?ఏం జెప్పిన రుజువు గావాలే.వీళ్ళను జూత్తే అవేవ్వి లెవ్వు.ఆడామెకు పెళ్ళైన దాఖలాలేం కనబడుత లెవ్వు.పోనీ రక్త సంబంధమేమన్న ఉంటే ఈ సరికే ఆ ముక్కైనా చెప్పెటోళ్ళు .ఇదంతా ఏదో తప్పుడు వ్యవహారం లాగే అనిపిత్తాంది.అన్నాడు చంద్ర మళ్ళీ.

అయినా,మీరిద్దరేoదయ్యా?నడుమిట్ల?

పెంక మీది పేలాలోతికే బగ్గా ఎగురుతాండ్రు?ఇఇడ ఇంత మందిమి ఉన్నం.పెద్ద మనుషులున్నరు.వాళ్ళేమంటారో నని ఇనేదున్నదా?లేదా?జరసేపాగుండ్రి .అన్నాడు నిదానం గా గుడి పూజారి మునేశయ్య.

అప్పుడు మళ్ళీ వరయ్య,ఆ ఇద్దరి తో మీరు మంచోల్లో,చెడ్దోల్లో అని మేము తెల్సుకోవాల్నంటే ముందుగాల మీరు నోరు తెరిచి ఏం జరిగిందో సెప్పుండ్రి…

బిడ్డా …!ఆడదానివి.సూత్తాంటే ఎంతో మానం గల దానివి లెక్కనున్నవ్ . 

ఏవూరు ?ఏం పేరు?ఊర్లకెందుకచ్చినవ్?అడిగాడు వరయ్య.       

వరయ్య  మాటలకు జాజులమ్మ తలెత్తి అందరి వైపు చూసింది.

అరె!ఇది మా పీరయ్య బిడ్డ,జాజులమ్మ.అన్నాడు గట్టిగా గుంపులో నుండి పోలయ్య.అందరూ అటు వైపు తిరిగారు.

అప్పుడు వరయ్య,ఎవరది?ఇట్లా రావయ్య.ఈమె ఎరికేనా?అని అడిగాడు.

ఎరికేయ్య.ఊరవతల ఉండే మా గుడిసెల పొల్లే.పేరు జాజులమ్మ.

అదేంది?నువ్వుండే ఊరవతల గుడిసెలల్లనే ఈ పొల్లుంటే మాకెవలకు ఎందుకు ఎర్కలేదు?

అవయ్య,ఈ పొల్ల అయ్య పీరయ్య ను సూస్కోటానికి ఒక రెండిండ్లల్ల పాచి పని చేసుడు తప్పితే బైటి పపంచం తెల్వని ఎడ్డి పొల్ల.అన్నాడు.

‘’భయం గళ్ళ కోడి బజార్ల గుడ్డు వెట్టిందని’’అంత సక్కటిదైతే ఈడికెందుకచ్చింది?అడుగుతాంటే ఏం సప్పుడెందుకు జేత్త లేదు?అన్నాడు వరయ్య.

అదెంత నా కెరుకలే.వీళ్ళయ్యను అర్సు కుంటే ఏదైంది ఏర్పాటైతది.అన్నాడు.పోలయ్య 

అదేదో నువ్వే తొల్క రాపో..!అన్నాడు వరయ్య.

వరయ్య మాటలకు జాజులమ్మ,

అయ్యా ..!అయ్యా..!మీకు దండంబెడుత.మా నాయన ను పిల్సుకు రాకున్డ్రి.పరువు గల్లోడు ఇట్లా పిల్సుకచ్చుడంటే గుండాగుతది.అసలుకే పాణం బాలేకుంట పీనుగోలె పడున్నడు.

అసలేం జరిగిందంటే మాయ్య నాకు లగ్గమైతలేదని మాటి మాటికి ఏడుత్తాంటే ఏ బాయిల్నన్న దూకాల్నని,సచ్చిపోవాల్నని రాత్రి పూట బైలెల్లిన.పిలవకుండానే సుట్టం లెక్కన చిటపట సినుకులు మెల్లంగ మెల్లంగ పెద్ద వానై కురువ బట్టినా తడుస్తూ నడుస్తనే ఉన్న.అట్లా నా బాటకు అడ్డుతగులుతూ ఈయన సోయి తప్పిన  వాడై న కాళ్ళకు అడ్డుపడ్డాడు.సూసిన.పాపమనిపించింది.సాటి మనిషని కాపాడాల్నని పాణం తొక్కులాడింది.

అట్ల మంచి,చెడు,మగ,ఆడ అని ఏం సోచాయించకుంట వానల్నే తిప్పలవడి ఈ గద్దె మీదకు జేర్చిన.ఆ పుల్లీపుల్లేరి నిప్పు రాజేసి మంట ఎగేసి ఈయనకు కాపిన.ఆయనకు కాపుకుంట ఉండీ… ఉండి అలసి పోయి చల్ల గాలికి వేడి వెచ్చగ తగిలి ఇట్నే ఈన్నే కన్నంటుకున్నది.

అంత సేపు ఈయనున్న పరిస్థితిని బట్టి మా నాయన యాదికచ్చిండు.రేప్పొద్దున నేను సచ్చిపోతే మాయన్నలు సూడకుంటే మా నాయన బతుకు సుత గింతే కదా!అని దిక్కు లేక ఆకలికి కుక్క సావే గతైతదని,మా అయ్య కండ్లల్ల కనపడంగ సావల్నన్న కాయిశు సంపేసి బతకాల్ననే ఎలుగు కనిపిస్తున్డంగా నిద్ర వొయిన.ఇగ అటెంక ఏమైంది నాకెరుక లేదు.అని ఏడ్సుకుంట,నన్ను బోనియ్యున్డ్రి.అని రెండడుగులు ముందుకు వేసింది. 

ఆగమ్మ,ఆగు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే మేమంతా ఎందుకు?అసలు ఇషయం పురాగ బైట వడ్డన్క మేమే సాగాదోల్తం తీ!…ఉండు…అని వరయ్య అంటున్డంగా…

చంద్ర..,ఎహే..,మీతోని పాము సావదు.కర్ర ఇరుగదు.వీళ్ళయవ్వారం పోలీసులకు జెప్తే వాళ్ళే సూసుకుంటరు.అని టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ జేస్తానని తొందర పడుతుండగా….

ఆ ఊరి పూజారి మునేశ్వరయ్య,

నువ్వుండయ్య…పిట్ట బుర్రు మంటే బట్ట సంకల పెట్టినట్టు మాటి మాటికి తొందర పడుకుంట,ఆగం గాకు.ఆగం జెయ్యకు.జరంత సోసు.అని సైదులు వైపుగా తిరిగి పెద్దమనుషులతోని..

ఈయన ఏమంటడో సుత అడుగుండ్రి.అన్నాడు.

అయ్యా ….!ఇన్నవు కదా ..!నీ ముచ్చట గూడ సెప్పు అన్నాడు వరయ్య.

సైదులు మెల్లగా,నేను ఈ ఊరికి పెళ్ళి చేసుకోను పిల్ల ను జూడడానికి వచ్చిన.మా అవ్వయ్యల తోని వచ్చిన.సూసుడు పని కాంగనే,మా వాళ్ళను బస్సెక్కించి నేను తాక్కుంట కూసున్న.అట్నే ఆన్నే పన్న.దుకాణం బంజేసే ముంగట సుత నేను లేవకుంటే,ఆల్లే నన్ను బజార్ల కీడ్శేసిండ్రు. కొద్ది దూరం నడిసిన గని ఇగ నడవలేక అడ్డం వడ్డ.అని చెప్పి తల దించుకున్నాడు.సైదులు.

ఎవరింటికి,ఎవరి పొళ్ళను సూడచ్చినవ్ ,అది సుతం సెప్పు,ఆల్లను కనుక్కుంటం.అన్నాడు వరయ్య.

అది…అది …నెత్తి గోక్కుంట గుర్తుకు రాక,దిక్కులు చూడసాగాడు.

అదంతా ఉత్త ముచ్చట.చేసుకునే పిల్ల ఇవరాలు పూర్తిగ తెల్వకుంటనే వచ్చినాడయ్య?ఊర్లకు?మన సెవులల్ల పొద్దురుగుడు పూలు పెడుతున్నడు.ఈ ముచ్చట ఇట్ల తెగది గని సర్పంచు సాబన్న వచ్చేదాంక వీళ్ళను గ్రామపంచాయితిలనే ఉంచుదం.ఉత్తగనే ఇడ్సి పెడితే రేపు ఇంకొగరు ఇట్నే చేత్తరు.మల్లెవ్వలు ఇసొంటి పని సెయ్యకుండ బుద్ది సెప్పాలే ….అని చంద్ర ఈసారి ఊరి బాగు కోసం నిమ్మళంగా చెప్తుండగా,

అక్కడి జనం లోనుండి జానయ్య ముందటి కి వచ్చి ,

వరయ్య  గారు ..!దండాలు.ఈ మగ మనిసి పేరు సైదులు.నిన్న మా పొళ్ళను సూడనీకే మా ఇంటికి వచ్చాడు.మా పొల్ల సుత నచ్చింది,గని ఇప్పుడే తెల్సింది ఈ మనిసి ఇంత తాగుబోతని.తాగి తడిసి బాటెంట పది పోయ్యేటోనికి పిల్లను ఇచ్చుడు కంటే,ఆడి  పొళ్ళను లగ్గం జెయ్యకుండ ఊకున్నా ఉత్తమమే.అన్నాడు జానయ్య .

అది సరేనయ్య ..!ఇవార్దాంక ఎవలీళ్ళు?అని మేము కింద మీదైతాంటే యాడవోయినవ్?తీరిపారి ఇప్పుడు సెప్తానవ్ ?అన్నాడు వరయ్య కొంచెం కోపంగా.

అది గాదు సామీ..!నేనిప్పుడే ఇటుదిక్కు పనుండి  అచ్చిన .సూసేటాళ్ళకు జనం మూగిండ్రు.ఎందో నని ఇటేటచ్చిన ఇవార్దాంక నేను ఈడ లేను .అన్నాడు సంజాయిషి గా.                     

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.