నారిసారించిన నవల-20

                      -కాత్యాయనీ విద్మహే         

లత  రాగజలధి నవల తొలి ప్రచురణ 1960 లో వచ్చింది. దాని లోపలి కవర్ పేజీలో ‘ ఈ రచయిత్రి నవలలు’ అనే శీర్షిక కింద ఆరు నవలలు పేర్కొనబడ్డాయి. వాటిలో ఒకటి ‘జీవనస్రవంతి’.  మూడుతరాల జీవితాన్ని చుట్టుకొని నవల ఇతివృత్తం ప్రవర్తిస్తుంది. 1900 సంవత్సరంలో రాజా పుట్టుకతో ప్రారంభమై అతని కూతురు పెళ్లయి ఒక కొడుకు తల్లి అయిన కాలంలో ముగుస్తుంది ఈనవలలో కథ.నలభై యాభై ఏళ్ల కాలం మీద విస్తరించిన కథ ఇది. రాజాకు ఐదేళ్లు , 1910, నాన్ కో ఆపరేషన్ మూమెంట్లో చదువు మానెయ్యటం, మొదలైన  ప్రస్తావనల ద్వారా కథాగమనంలో కాల సూచన చేస్తూ వచ్చిన రచయిత్రి భారతదేశానికి స్వాతంత్య్రం రావటాన్ని ప్రస్తావించలేదంటే ఈకథ 1947 లోపలే ముగిసి ఉంటుంది అనుకోవాలి. రాజా,  రాజా తండ్రి ప్రసాదరావు , ఆయన తండ్రి క్రిష్ణయ్య ఇవి మూడుతరాలు.  ఈ మూడుతరాల  పురుషులకు  స్త్రీలతో ఉన్న సంబంధాలలోని ప్రత్యేకతను  గుర్తిస్తూ వ్యాఖ్యానించే వెంకటరత్నం రాజాకు మేనత్త కొడుకు. 

1900 నాటికి ఇద్దరు యుక్తవయసు కొడుకుల తండ్రి  క్రిష్ణయ్య.పెద్దకొడుకు ప్రసాదరావు కు పెళ్లయింది.ఒకకూతురు. ఇప్పుడు రెండవ కానుపుకు కొడుకు.చిన్నకొడుకు చదువు కుంటు న్నాడు పెళ్లి  కూడా కుదిరింది. ఆవయసులోనూ ఆయన జీవితంలో శృంగారానికి ప్రాధాన్యత ఉంది.భార్య రామమ్మ పట్ల ఆకర్షణ,ప్రేమ పుష్కలమే అయినా ఆయనకు సభారంజని అనే వేశ్య తోనూ  సహజీవనసంబంధం ఉంది. ఆమె పట్ల అనురాగం, ఆకర్షణ పసివాడ లేదు. ఆమె తో సంబంధం రామమ్మకు తెలిసిందే. సభారంజని అతనికోసం ఇంటికి వస్తుంటే సాదరంగా ఆహ్వానిస్తుంది.అతిధి సత్కారం చేస్తుంది. సభారంజని అతనికి నిబద్ధురాలు.ఒకకొడుకును కానీ డాక్టర్ ను చేసింది. క్రిష్ణయ్య  అవసాన వేళ చూడటానికి వచ్చి అతనికాళ్ళ మీదనే ప్రాణాలు వదిలింది. క్రిష్ణయ్య ఇటు భార్య రామమ్మతోనూ, అటు సభారంజని తోనూ జీవించిన పద్ధతిని ఆకర్షణీయంగా చేసి ఆయన రసికతకు, సామర్ధ్యానికి గుర్తు అన్నట్లుగా చిత్రించిన తీరులో అది అనుసరణీయం అన్న భావన కనబడుతుంది. భార్యనీ, ప్రియురాల్నీకూడారెండు కళ్లలా చూసుకొన్న మహోన్నతుడు అని ఆయన గురించి చెప్పి వెంకటరత్నం దానిని వాచ్యం చేయనే చేసాడు.

ప్రసాదరావు తన కులంకాని అమ్మాయి భాషా ను ప్రేమించి, తన మిత్రుడికి  ఆ అమ్మాయిని వధువుగా ఆమె తండ్రి నిర్ణయించాడని తెలిసి లోలోపల కుమిలిపోయి, తీరా ఆమె నేను నిన్ను ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకుందాం అనివస్తే సాహసం చేయలేక ఆమెను కోల్పోయాడు.తల్లిదండ్రులు చేసిన పెళ్ళికి కట్టుబడి సంసారం చేసి బిడ్డల తండ్రి అయ్యాడు కానీ భాషా మీద ఆంతర్యంలో చెదరని ప్రేమ కారణంగా భార్యను మనసు లోతుల నుండి అభిమానించలేకపోయాడు. కోడలు చనిపోయాక మనుమడు వెంకటరత్నం దగ్గర ‘ప్రసాదం కూడా దానిమీద అభిమానంనటించాడు గాని, అభిమానించలేదు’ అని రామమ్మ అనటం దానిని ధృవీకరిస్తున్నది.

ఇక రాజా వరాలు ఆకర్షణలో పడ్డాడు.ఆమెతో గడిపాడు. తల్లితండ్రులు కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు. అక్కడా అతను ఆగలేదు. కొత్తకొత్త స్త్రీలతో , పరిచయాలు, అనుబంధాలు అతని సరదాలైనాయి. అవి అతనిని తాగుడు వైపు, మత్తు పదార్ధాలవైపు తీసుకొని వెళ్లి అతని జీవితాన్నిధ్వంసం చేశాయి. 

తాత, మేనమామ చనిపోతే రాజా ను కనిపెట్టుకు చూసి అతనిమరణానంతరం అతని బిడ్డను పెంచి పెళ్లిచేసే బాధ్యతను మోసినవాడు వెంకటరత్నం. ఈమూడుతరాల జీవిత నాటాకానికి తాను ప్రేక్షకుడిని అనుకుంటాడు అతను. ఈముగ్గురిలో మేనమామ దురదృష్టవంతుడు అనితీర్పుకూడా ఇస్తాడు.స్త్రీతాలూకు మాధుర్యం తండ్రీ కొడుకు అనుభవించినట్లు ఆయన అనుభవించ లేకపోయాడని పాతకీ క్రొత్తకీ మధ్యఉన్నఅగడ్తలో పడి అర్ధవిహీనంగా బతుకు గడిపేస్తున్నాడని జాలిపడ్డాడు.సానుభూతి చూపించాడు. ఈ ప్రేక్షకత్వ పాత్రను అతనుఎందుకు స్వీకరించాడో అర్ధం కాదు. రచయిత కావటం వల్లనా? అంటే సంతృప్తికరమైన సమాధానం లేదు. అతనా పాత్ర స్వీకరించటం వల్ల కుటుంబంలో ఎదుర్కొన్న ఘర్షణ కూడా ఏమీలేదు. మేనమామ , బావ రాజా తమజీవితాన్ని కథగానో, నవలగానో వ్రాయమని  పదేపదే  అతనికి చెప్తుంటారు.వాళ్ళ జీవితాలలో  సాహిత్యం కాదగినంత ఘర్షణ ఉన్నదా అన్నది మరొక ప్రశ్న. వెంకటరత్నం తాను చేయలేని పని  పాపను చేయమని కోరటం నవల ముగింపు. 

మగవాళ్ల శృంగార లీలలు, ప్రేమ వ్యవహారాలూ, వైఫల్యాలు, విశృంఖలత సంగతి అలా ఉంచితే వీటి ప్రభావం స్త్రీల జీవితాల మీద ఎలా ఉంటుంది అన్నది అసలు కథ కావలసిన విషయం. ఆ స్పృహ రచయిత్రికి ఉన్నట్లే కనిపిస్తుంది. క్రిష్ణయ్య భార్య రామమ్మ శృంగార ప్రబంధాలు,  రామాయణ భారతాలు బాగా చదువుకున్నమనిషి అని,  భర్త అంటే ఆవిడకు ప్రాణం అని మాహారసికుడైన ఆయనతో కాపురం ఆమెకు నిత్యనూతనం అని, ఆయన వలన తాను ఏనాడు కష్టపడలేదని  రచయిత్రి కథనం.హుందాతనం, రాజసం ఆమె ముఖంలో, నడకలో ఉన్నాయని కూడా చెప్పబడింది. అయితే కథనంలో భాగంగానే  ఆ వంశం చూపించే మిధ్యా గౌరవాల ఆడంబరం మీద ఆమెకు అంతులేని అసహ్యమని , చిన్నకొడుకుకు పెళ్లికుదిరితే రాబోయే కోడలి దురదృష్టానికి ఆమె,  ఆమెతో పాటు పెద్దకోడలు రాజ్యలక్ష్మీ కూడా రహస్యంగా నిట్టూర్చారని చెబుతుంది రచయిత్రి. ఈవైరుధ్య స్థితికి కారణాలు ఏమిటి  “ పైకి కనిపిస్తున్న ఈ సుఖశాంతులకి పునాదిగా ఎంత అశాంతి గూడుకట్టుకుని  ఉందో ఆ స్త్రీలిద్దరికీ తెలుసు కాని ఆ సంగతి ఎవరికీ తెలియకుండా  జాగ్రత్తపడ్డారు” అని అత్తా కోడళ్ళిద్దరినీ సమస్థాయిలో , ఒకే అనుభవం  దగ్గర నిలిపి చెప్పిన మాట తాళం చెవిగా కథలోనైనా , జీవితంలోనైనా స్త్రీలు హృదయపు తలుపులు మూసి లోలోపల కుక్కేసిన బాధల సంచులు తెరావాల్సే ఉంది. 

 భర్త  అంటే  ఆవిడకు ప్రాణం కావచ్చు , కానీ  ఆయన మరొక స్త్రీతో  బహిరంగంగా  సంబంధం పెట్టుకొని,   ఇంటికి, పడక గదికి  యథేచ్ఛగా  వచ్చి పోయేంత  చనువు ఆమెకు ఇస్తే రామమ్మ ప్రాణం విలవిలలాడదా !? అయినా భర్త రాసిక్యతను ఆమె హర్షించాలి. ఆమోదించాలి. ఆమె పట్ల అసూయను అణచుకోవాలి. అతని ప్రవర్తన వల్ల కలిగే బాధను దిగమింగుకోవాలి. అందువల్ల కలిగే అశాంతిని మరుగుపరిచి అంతా సుఖంగా ఉన్నట్టు , జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నట్టు నటించాలి. ఆ నటన యొక్క పరాకాష్ఠ హుందాతనాన్ని, రాజసాన్ని తన మోహంలో నడకలో సదా వ్యక్తీకరిస్తూ ఉండటం , భర్త వైపు శృంగారం గా చూడటం. తద్వారా నువ్వు ఎంతమంది స్త్రీలతో ఉన్నా నీ  యందు  నా అనురాగం తగ్గలేదు అని నిరూపించుకొనటమే  సంసార  స్త్రీ జీవితావసరంగా ,అనివార్య ధర్మంగా సూచించబడింది. 

అలాగే ప్రసాదరావుకు భాషా తో ఏర్పడిన సంబంధం తండ్రి క్రిష్ణయ్యకు పూర్తిగా తెలియదు అనుకొనటానికి వీలులేదు. ఆమె గురించిన బెంగతో తీవ్రంగా జ్వరపడిన కొడుకును , ఆ కారణంవల్లనే  చదువు మానేసిన కొడుకును ఆయన ఏమిటిదని ఆరా తీయకుండా ఉండటం అసహజం. తెలిసి  కూడా రాజ్యలక్ష్మిని వెతికి తెచ్చి కొడుకుకు పెళ్లి చేసాడు అంటే అది వంశ ప్రతిష్టకు , కుటుంబ గౌరవానికి సంబంధించిందే అయివుంటుంది. దాని పట్ల రామమ్మకు విశ్వాసం లేకపోవటం ఎందువల్ల ? మగవాడికి బయట ఎన్ని సంబంధాలైనా  బహిరంగంగానో , రహస్యం గానో ఉండవచ్చు కానీ కుటుంబానికి వంశ వారసులను ఇయ్యగలిగిన కులకాంత ఒకరు మాత్రం ఉండాలన్న సామాజిక రీతి లోని మిధ్య అర్ధం కావటం వల్ల . సభారంజని తో అతని సంబంధం బహిరంగాగానే సాగుతూ ఆమె ముప్ఫయి ఏళ్లుగా భార్య కంటే అధికంగా అతనికే కట్టుబడి ఉండటం అతని ఔన్నత్యంగా లోక మన్నన పొందుతుంటే వంశ గౌరవాలు, కుటుంబ ప్రతిష్టలు ఎంత బోలువో, ఎంత భ్రమాన్వితమో కాస్త ఆలోచన ఉన్న వాళ్లకు ఎవరికైనా అర్ధం అవుతుంది.రామమ్మ అందులోనూ బాగా చదువుకున్నమనిషి. సానికి అయినా సంసారిని అనినిరూపించుకొనటమే గౌరవకరం అని  అభిప్రాయపడే సమాజంలోని ద్వంద్వ లైంగిక నీతి పట్ల ఏహ్యత రామమ్మ అంతరంగంలో దాగి వున్నాయి కనుకనే ఆమెకు సభారంజని పట్ల అసూయ పడవలసిన  అనవసరం లేకపోయింది. తనలాగే ఆ ఇంటికి కోడలై వచ్చిన రాజ్యలక్ష్మి పట్ల రామమ్మకు సానుభూతి కూడా అందువల్లే. 

రాజ్యలక్ష్మి కూడా తనభర్త ప్రసాదరావు మనసు తనది కాదని గ్రహించే ఉంటుంది. ఆ విషయం తెలియనట్లే..అతను తనను అభిమానిస్తున్నాడు అని నమ్ముతున్నట్లు నటిస్తూనే ఆమెజీవితం గడిచిపోయి ఉంటుంది. అందరి అవసరాలు కనిపెట్టి తీరుస్తూ ఒకవంశోద్ధారకుడిని  కని ఉత్తమ గృహిణి అనిపించుకొంది . ఆమె ఆమె చనిపోయాక రామమ్మ మనుమడితో అన్న మాటలు గమనించదగినవి. “ ఈ దిక్కుమాలిన  కొంపలో అది ఏం సుఖపడిందో ఆ భగవంతుడికే తెలియాలి.ఈ ఇంటికి చాకిరీ చేసింది.మీ అమ్మా, పిన్నులూ అన్నఎత్తిపొడుపులన్నీపడ్డది ….. ఇంకోటేమిటంటే ప్రసాదం కూడా దాని మీద అభిమానాన్ని నటించాడు గానీ, అభిమానించలేదు.” వాళ్ళ నటనలకు తగ్గట్టుగా ప్రేమ పొందుతున్నట్లుగా, జీవిత సాఫల్యం అనుభవానికి వస్తున్నట్లుగా ఆడవాళ్లు నటించటం మీద వెలిగే వంశ గౌరవాల మీద,  కుటుంబం పరువు మీద ద్వేషం రామమ్మకైనా, రాజ్యలక్ష్మికైనా, ఆమె కోడలికైనా మరే స్త్రీకి అయినా కలగటంలో తప్పేమీ లేదనిపిస్తుంది. వీళ్ళ జీవితాలను ఇలా చిత్రించటం ద్వారా, అంతరాంగాలను ప్రదర్శించటం ద్వారా  కోడళ్ల అణచిపెట్టుకొన్న దుఃఖాలు, లోలోపలి నుండి పెట్టె శాపాలు కుటుంబంలో పైకి కనిపించే ప్రశాంతత మాటున దాగిన బడబాలనం అని లత చెప్పినట్లయింది.

బాల్య వివాహాలు, వైధవ్యాలు, వాళ్ళ శరీర అలంకరణ మీద, వాళ్ళ తిండి మీద వంశప్రతిష్టకు హానికరం అని పునర్వివాహాలను నిషేధించి లైంగికత మీద  బ్రాహ్మణ కుటుంబాలలో అమలయ్యే నియంత్రణ స్త్రీల జీవితాలను లోలోపలి నుండి ఎంత హింసకు గురిచేస్తుందో..ఎంతటిహైన్యానికి దిగజారుస్తుందో రాజ్యలక్ష్మి కూతురు పూర్ణ అనుభవం నుండి నవలేతివృత్తంలో భాగం చేసి చెప్పింది లత. పూర్ణకు జుట్టు తీయించాలని అన్నందుకు అమ్మమ్మ వరుస వైదేహమ్మ గొంతు పిసకబోయిన రాజా ఆ తరువాతెప్పుడూ ఆమె జీవితంలో సుఖశాంతుల గురించి ఆలోచించినట్లు కనబడదు. మళ్ళీ పెళ్ళిచెయ్య సాహసించలేని  తండ్రి ఆమె తిరుగుళ్లను గురించి ప్రశ్నించ లేకపోయాడు .  మొదట్లో  వెంకటరత్నం  ఆరాధనకు ,అభిమానానికి  నోచుకొన్న పూర్ణ చివరికి అతని అసహ్యానికి  గురికావాల్సి వచ్చిందంటే అది  ఆమె స్వయంకృతం లాగా  కనిపించినా ఆ వైపుకు ఆమెను నడిపించినవి దుష్ట సామాజిక సంప్రదాయాలే అని మనం గుర్తించాలి.  

నీలి నీడలు నవల కూడా  రాగజలధి లోపలి కవర్ పేజీలో పేర్కొనబడిన లత ఆరు నవలలో ఒకటి. చలానికి అంకితం ఇచ్చినట్లు తెలుస్తున్నది. కానీ తరువాతి ముద్రణలలో  ఎందుచేతనో అది చేరలేదు ( చూడు ;2013, సాహితీ ప్రచురణ )  విదేశాలలో చదువుకొని వచ్చి స్వదేశంలో దేశరాజధాని నగరం ఢిల్లీ లో ఉన్నతోద్యోగాన్ని సంపాదించి ఎస్.ఆర్ త్రివేదిగా మారిన త్రివేదుల సీతారామశాస్త్రి ఎనిమిదేళ్ల క్రితం కాపురానికి వచ్చి,  ఇద్దరు పిల్లల తల్లి అయిన  భార్య  ఇప్పుడు పల్లెటూరి చదువురాని, నాగరికత ఎరుగని మనిషి అని గ్రహింపుకు వచ్చి తనకు తగనిది అని వదిలించుకొనటానికి నిర్ణయించుకొనటం దగ్గర  నీలినీడలు నవలలో కథ మొదలవుతుంది. పుష్పతో ప్రేమ, పెళ్లాడాలన్నకోరిక,  ఒక భర్తకు భార్య, కొడుకుకు తల్లిఅయిన చంచల్ పై వ్యామోహం ఈరెంటిమధ్యా సతమతమవుతూ చివరకు ఏదీ పొందలేని ఒక భీభత్స సందర్భంలో అతనూ.. భర్త కు ఆమోదయోగ్యురాలిగా కోడలిని  తయారుచేయాలని మామగారు చదువుకు మద్రాసు పంపగా భర్త తనకు అలభ్యుడు అన్న ఆంతరంగ ఆందోళన, పిల్లలను వదిలి ఉండలేని మాతృత్వ ఉద్విజ్ఞత కలిసి మానసికంగా బలహీనపడి ,మూర్ఛలు పోతూ శ్రీరామధ్యానంలో పడి అన్నిటికీ అతీతంగా ఆధ్యాత్మిక పథంలోకి ప్రవేశించిన అద్భుత సందర్భంలో ఆమె సమాంతర రేఖలుగా మిగిలిపోవటాన్నిచిత్రించింది ఈ నవల. ప్రేమ, ఆకర్షణ, వ్యామోహం , సౌందర్య లాలస అన్నీతాత్కాలికాలే అనీ, ప్రవృత్తుల వెంబడి పడి పోవటం జీవితాలను విధ్వంసం పాలు చేస్తుందని హెచ్చరిస్తుంది ఈనవలలో లత.స్త్రీపురుషుల్ని ఒకటిగా చేసి సాఫీ అయిన జీవితాన్నికల్పించేది వివాహం, అదే సత్యం అని  క్లబ్ డాన్సర్ సితారా చేత చెప్పించిన లత ఆ సత్యానికి పెడముఖం  పెడితే ఏవో నీలినీడలు పరుచుకొని జీవితాలు మసకబారుతాయి, అర్థరహితంగా మారిపోతాయి అని సూచిస్తుంది.

రాగజలధి లోపలి కవరు పేజీలోని మరొక నవల వారిజ.  అంటే ఇది  కూడా 1960 నాటికి ప్రచురించబడినదే . స్త్రీల లోని జీవన లాలసను, శారీరక మానసిక ఉద్విగ్నతలను , ఉద్రేకాలను అవి సృష్టించే బాహిర ఆంతరిక కల్లోలాలను భిన్న కోణాలనుండి  పరిశీలించటం, నవలా వస్తువుగా చేసుకొనటం పై లతకు బహు ఆసక్తి .  దానినుండీ రూపొందిందే  ‘వారిజ’ నవల . వారిజ అనే  యువతి జీవితం  ఈ నవలకు ప్రధాన వస్తువు. వారిజ గురించి వినబడే కథలకు వ్యాఖ్యాత రామలక్ష్మి అనే రచయిత్రి. వారిజ జీవితాన్ని కథగా వ్రాసింది కూడా ఆమె. ఆ రకంగా రామలక్ష్మి ఈ నవలలో ఒక ప్రధాన పాత్ర. ఆమె  లత కన్నా మరొకరు కాదు.  వారిజతో పాటు  అనేకమంది  స్త్రీల అనుభవాలు కూడా ఇందులో భాగం అయినాయి.  వర్తమానం నుండి గతానికి , అక్కడి  నుండి  మళ్ళీ వర్తమానానికి కదులుతూ కథ ఆకారం తాల్చటం చూస్తాం. 

రామలక్ష్మి ద్వారా వారిజను పరిచయం చేసి వారిజ జ్ఞాపకాల నుండి గతాన్నికదిలించి వర్తమానంలో మోహనరావు కు ఆమెకు మధ్య సంగీతం మాధ్యమం గా ఏర్పడిన ఆకర్షణ  అనేక సంఘర్షణల తరువాత ఎలా పరిష్కారం అయిందీ అన్నది కథా సూత్రం. వారిజ   తల్లి సంప్రదాయ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబపు ఇల్లాలు. ఇద్దరు కొడుకుల తల్లి . బలవత్తరమైన ఆకర్షణకు లోనై సంసారాన్ని వదిలి ఒక వ్యక్తితో వెళ్ళిపోయి త్వరలోనే  అతను  తనను వదిలేసి అస్సాం తేయాకు తోటలో కూలీగా నిర్లిప్త జీవితం గడుపుతున్న ఆమె టీ  తోటల్లోకి ఉద్యోగిగా వచ్చిన  ఒక ఫ్రెంచ్ దొర ఆకర్షణను , ఆకాంక్షను ఆమోదించి సహజీవనం చేసిన దాని ఫలితంగా పుట్టినబిడ్డ వారిజ. తండ్రి పెట్టిన పేరు వర్జీనియా..తల్లి పిలుపు వారిజ..తల్లి అంటే ద్వేషం.

తండ్రి మరణం తరువాత ఆయన ఇచ్చిన ఆస్తులన్నీ అమ్ముకొని మద్రాస్ వచ్చిన తరువాత వారిజ జీవితం ఈ నవలలో అసలు కథ. ఆమెను అక్కడ ఆకర్షించిన పురుషుడు శాస్త్రి. కాస్త నీతి శీలలు వదులుగా ఉన్నఅమ్మాయి అనిపించినా ఆమె పట్ల గౌరవాన్ని, స్నేహాన్ని, గాఢమైన అనురక్తిని పెంచుకున్నాడు. బ్రాహ్మణ స్త్రీకి, ఫ్రెంచ్ పురుషుడికి జన్మించిన వారిజను హిందూ సంఘం తనకిచ్చే స్థానం గురించిన న్యూనతా భావం ఒకటి  అంతరాంతరాలలో వేధిస్తున్నది.అదే ఆమెను ‘తనకి తనే ఒక మహా సమస్య’ అనుకొనేట్లు చేసింది. స్త్రీపురుషుల సహజ దైహిక వాంఛా తీవ్రతలను తప్పు ఒప్పు అని తీర్పు చెప్పటం సరైంది కాదు అనే అతని దృక్పథం, సంభాషణలలో దాని వ్యక్తీకరణ   ఆమెకు  ఆ మహా సమస్య నుండి  కొంత కొంత బయటపడే నైతిక బలాన్ని ఇచ్చింది.ఆ క్రమంలో అతని సమక్షంలో అనుభవానికి వచ్చిన భద్రత  అతనిని విడిచి ఉండలేనంతగా ఆమెను మలిచింది. అలాంటి మనిషి హటాత్తుగా  శాస్త్రికి చెప్పకుండానే రాత్రికి రాత్రి  మద్రాసు వదిలి ఎందుకు వెళ్ళింది? దానికి తరువాతఎప్పుడో ఒకసమాధానం దొరుకుతుంది. తల్లిచనిపోతూ వీళ్ళు నీ అన్నలు అని పేర్లు రాసి పంపిన ఉత్తరంలో శాస్త్రి పేరు ఉన్నందున అతను సోదరుడే అయితే తానొక మహాపచారం చేయకుండా  తనని తాను  కాపాడుకొనటానికి  వెళ్ళిపోయింది . 

విజయవాడలో  మహా సంగీత విద్వాంసుడైన మోహనరావు కు ఆమెకు మధ్య కలిగిన ఆకర్షణ చుట్టూ  ఆ తరువాతి  కథ విస్తరించింది. అతను పాడటం , ఈమె వినటం .. ఈమె  నేర్పటం , అతను అభ్యసించటం  ఇదీ వాళ్ళ వ్యవహారం.  శాస్త్రిని  వదిలి వచ్చినా  వదలని అతనిపట్ల మైత్రి మోహనరావుతో సాన్నిహిత్యం పెంచుకొనటానికి , సంబంధం ఏర్పరచుకొనటానికి అవరోధం అయింది . శాస్త్రి కావాలి, మోహనరావు  కావాలి ఎవరిని ఎంచుకోవాలి అన్న సంఘర్షణ లో ఒక నిర్ణయానికి రాలేని దశలో ఆమె పడిన వేదన సామాన్యమైంది కాదు. మోహనరావు వారిజను తీవ్రంగా కాంక్షిస్తూనే సన్నిహితం కాలేకపోయాడు. ఆమె పట్ల చొరవ చూపలేకపోయాడు. శాస్త్రిపై వారిజ కు వున్న భ్రమ సంగతి తెలిసిన వాడిగా ఆమె పట్ల చొరవ చూపలేకపోయాడు.కానీ ఆమె లేనిదే తనకు బ్రతుకు లేదన్నట్లుగా బాధపడుతున్నాడు. ఆ పరిస్థితుల్లో    రామలక్ష్మి అతనిని మందలిస్తూ వారిజ  ఎవరిని ఎంచుకొంటుంది? అన్నది కాదు ప్రశ్న. ముగ్గురూ కలిసి బ్రతకటానికి “ ఎందుకు ప్రయత్నించరు” అని విసుక్కుంటుంది.  పెళ్లయి భార్య ఉన్న మోహనరావు తో జీవితాన్ని పంచుకొనటానికి వారిజ సిద్ధపడినప్పుడు ఆమెను మరొక పురుషుడితో  పంచుకొనటానికి మోహనరావు ఎందుకు సిద్ధపడరాదు అన్నది రామలక్ష్మి తర్కం. మగవాడికి ఎంతమంది స్త్రీలతో నైనా సంబంధాన్ని సహజంగా తీసుకొనే సమాజం స్త్రీకి ఒకరిని మించి పురుషులతో ఏక కాల సంబంధాన్నివూహించటానికి కూడా ఇష్టపడక పోవటంలోని ద్వంద్వత్వాన్ని లత 1960 నాటికే సవాల్ చేయటం గమనించవచ్చు. 

శాస్త్రి కావాలనిపిస్తూ అయినా అతనితో కలిసి వెళ్లిపోలేక సంఘర్షణ పడుతూ ఉన్న  వారిజ  మోహనరావు మరణపు అంచులకు వెళ్ళినప్పుడు గానీ  తాను అతను లేకుండా బతకలేనని గ్రహించుకోలేకపోయింది. తామిద్దరికీ మధ్య సంగీతం ఒక బలమైన లంకె అని గ్రహించిందా అన్నట్లు తనకోసం చనిపోవాలనుకొన్న మోహనరావుకు తన  సర్వస్వాన్ని అర్పించుకొనటానికి అతనిని బతికించు కొనాలన్నా వెర్రి వాంఛతో వీణపై మోహనరాగం ఆలపిస్తుంది. “ మోహనమూర్తి కళాత్మక సాహచర్యంలో వారిజ జీవితాన్నే తిరిగి పొందగలిగింది” అనుకొంటుంది రామలక్ష్మి.  

శాస్త్రి స్నేహితులుగానో , బంధువులుగానో , రోగులుగానో మరికొందరు స్త్రీలు ఈ నవలలో  పాత్రలు గా వస్తారు. స్త్రీపురుష  ఆకర్షణలు ,అనుబంధాలు ఎంత వైవిధ్యంతో వేటికవిగా  ప్రత్యేకంగా ఉంటాయో , అవి తర్కానికి , సామాజిక నీతికి అతీతంగా కూడా ఎలా వుంటాయో ఈ పాత్రల ద్వారా నిరూపించే పని ఈ నవలలో జరిగింది. వాళ్లందరి పట్ల సానుభూతితో స్పందిస్తాడు శాస్త్రి. పతిత అని ఏ స్త్రీ తిరస్కరించ గలిగింది కాదని అతని అభిప్రాయం. ఆచరణ.  స్త్రీత్వం, మాతృత్వం కలగలసిన స్త్రీ మూర్తిని అతను అనుమానించలేడు. అవమానించలేడు. వాళ్ళు అట్లా  కావటానికి వెనక ఉన్న కారణాలను సానుభూతితో అర్ధం చేసుకొనటానికి ప్రయత్నిస్తాడు. చిన్న తనంలో తమను, ఇంటిని వదిలివెళ్ళి పోయిన తల్లి నైతికత  గురించి లోకం ఇచ్చిన తీర్పును తట్టుకొని  నిలబడటానికి కావలసిన ఒక ఉదార సంస్కారాన్ని అతను ఆ విధంగా అభివృద్ధి చేసు కొన్నాడని అనుకోవచ్చు. 

 బ్రాహ్మణ స్త్రీకి, ఫ్రెంచ్ పురుషుడికి జన్మించిన వారిజ తనది అక్రమ సంబంధమైన జననం అని న్యూనతను ఆపాదించుకొన్నప్పుడు వారించటంలోనూ,  ఆమె తల్లి ప్రవర్తనను ఆమె అవసరం నుండి అర్ధం చేసుకొనటానికి ప్రయత్నించాలని సూచించటంలో వ్యక్తుల మీద తీర్పులు ఇచ్చే సంఘనీతి విశాలం కావలసి ఉందని అభిప్రాయపడటంలోనూ శాస్త్రి ఆ సంస్కారాన్నే ప్రదర్శించాడు. స్త్రీల ప్రవృత్తులపై , ప్రవర్తనలపై తీర్పులు ఇయ్యటం కాక వ్యాధికారకాలను గుర్తించే వైద్యుడుగా వాళ్ళ సమస్యలలోని ప్రత్యేకతను గుర్తించి స్నేహ సానుభూతుల ప్రదర్శన ద్వారా వాళ్లకు ఊరట ఇయ్యటం అతను సహజంగా స్వీకరించిన పని. సేవాభావం పుష్కలంగా ఉన్న నర్సు   కాత్యాయనిని తాగుడుకు బానిస, స్వేఛ్ఛా ను వర్తిని అని అవమానించి దూరం పెట్టలేకపోయాడు.ఆమెతో స్నేహం చేశాడు. ఆమె బాధకు కారణాలు మాతృత్వం నుండి, స్త్రీత్వం నుండి వంచితురాలు కావటం అని తెలిసి  ఆమెను ఆ అలవాట్లనుండి  తప్పించాలని తహ తహ లాడాడు.  తనపట్ల అనురాగం చూపే ఆమె ఒక వాంఛ తనలో ఉవ్వెత్తున లేచిపడుతున్న తరుణంలో తటస్థపడితే సంతోష పెడదామని దగ్గరకు తీసుకొన్నాడు. అది ఆమెలో జీవితం పట్ల వాంఛ కలిగించి అతను  ఇన్నాళ్లూ  ఎంతగా చెప్తున్నా మానుకోని తాగుడు లాంటి అలవాట్లను తనంతట తానే మానుకొన్నది. మళ్ళీ పెళ్లిచేసుకొని మాతృత్వాన్ని పొందింది. 

యవ్వనంలో ఒక విచిత్ర మానసిక స్థితిలో తనకన్నా ముప్ఫయి రెండేళ్లు పెద్దవాడైన వ్యక్తి ఆకర్షణలో పడి అతని తో పాటు వెళ్లి ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరి తీరా  ఆయన దేశభక్తి తో కాక కొడుకు అందులో చేరాడని తానూ అక్కడ వంటమనిషి గా చేరిన యాభై ఏళ్ల స్త్రీకోసం ఆజాద్ హింద్ ఫౌజ్ లో  చేరాడని తెలిసి ఒంటరి తనానికి లోనైన నీలఉదంతం మరొకటి. నేతాజీ  పటాలం విచ్ఛిన్నమైన తరువాత ఆయనతో పాటు  దేశానికి తిరిగి వచ్చింది కానీ అతనిని పెళ్లిచేసుకొనటానికి ఆ స్త్రీ అవరోధం అయింది.  ఆ స్త్రీ  మరణం తరువాత ఆయన సన్యసించి వెళ్తూ రాసిన ఉత్తరం ద్వారా నీల ఒక ఇంజనీరు దగ్గర పర్సనల్ సెక్రటరీ గా చేరి ఒంటరి తనం తో చేసే యుద్ధంలో అనేక స్నేహాలు చేసి అపవాదులు మూటగట్టుకొని టిబి వ్యాధిన పడి ఆసుపత్రికి చేరింది. ఆమె ప్రేమరాహిత్యం అనే వ్యాధితో బాధపడుతున్నాడని గుర్తించిన వాడు  శాస్త్రి. ప్రేమను అందించే పని తాను చేయలేక పోయానే  అని ఆమె మరణానికి తాను బాధ్యుడినేమో నని బాధ కూడా పడ్డాడు. స్త్రీలు ఆశించే ప్రేమ సానుభూతి లభించకపోవటమే అనేక రుగ్మతలకు మూలం అని అతని నిశ్చితాభిప్రాయం.

వారిజ నవల చదువుతుంటే చాలా సందర్భాలలో బుచ్చిబాబు వ్రాసిన చివరకు మిగిలేది నవల గుర్తుకు వస్తుంది. ‘తల్లి పాపం పిల్లల్నివెంటాడినప్పుడువాళ్ళేం చేస్తారు’ అన్నవిచికిత్స ఆనవలలో లాగే ఈ నవలలోనూ కీలకం. వారిజ లో అది తల్లిపట్ల ద్వేషంగా వ్యక్తమైతే శాస్త్రి విషయంలో అది తల్లి పట్ల ఆరాధనగా రూపం తీసుకున్నది. స్త్రీలందరూ దయగా చూడవలసిన వారు,  సానుభూతితో అర్ధం చేసుకో వలసిన వారు అన్న అవగాహనను అతనికి ఇచ్చింది. స్త్రీల పట్ల ఆరాధనగా అది పర్యవసించింది. ఆ రకంగా శాస్త్రి చివరకుమిగిలేది నవలలోని దయానిధిని గుర్తుకుతెస్తాడు. సౌందర్య రాహిత్యం ఒక జబ్బు అని చివరకుమిగిలేది లోని దయానిధి అనుకున్నట్లుగానే శాస్త్రి ప్రేమరాహిత్యం ఒక జబ్బు అనుకుంటాడు. ఆనవలలో లాగానే తల్లి పాపం పిల్లలను వెంటాడటం అనే సమస్యను చర్చించి పరిష్కరించ లేకపోయిన సాహిత్య కళాఖండంగా హామ్లెట్ నాటక ప్రస్తావన వారిజ నవలలోనూ వుంది.  

లత వ్రాసిన 1960 నాటి మరొక నవల ‘మిగిలిందేమిటి’.అది కూడా ‘చివరకుమిగిలేది’ని గుర్తుచేసేదే .                                                          

*****

( ఇంకా ఉంది ) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.