ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-6

సలీం

-డా.సిహెచ్.సుశీల

 
స్త్రీల సమస్యల గురించి రచయిత్రులే కాక పురుష రచయితలు కూడా కవిత్వం, కథలు ద్వారా తమ సహ అనుభూతిని తెలియజేస్తున్నారని చెప్పుకుంటున్నాం కదా. ఇక నవలల విషయానికి వస్తే ప్రఖ్యాత రచయిత ‘సలీం’ రాసిన ‘వెండిమేఘం’ ముఖ్యమైనది.
        నవల పేరు వెండిమేఘం లో ‘వెండి’ ఉన్నా, నవలలో వన్నె తరగని ‘బంగారమే’ ఉంది. నాయిక పేరు ‘అన్వర్’. అన్వర్ అంటే ఉర్దూలో ‘అందం’. ఈ అన్వర్ అంటే ‘మంచి స్వభావం’, ‘అణకువ’ –  అన్నిటి సమన్వయం. అందుకే అన్వర్ పేరు సార్థకం. ‘వెండి’ స్వచ్ఛతకు పరోక్ష చిహ్నం అయితే, ‘మేఘం’ మయూరానికి నాట్య ప్రేరకం. పాఠక హృదయ మయూరానికి సరికొత్త భంగిమల్లో అనుభూతిని మిగిలిస్తుంది. 
      పేద ముస్లిం స్త్రీల జీవితాలను విస్తృతంగా చిత్రిస్తూ తెలుగులో వెలువడిన మొట్టమొదటి ముస్లిం స్త్రీవాద నవల ఇది. చిన్న వయస్సులో పెద్దపెద్ద సమస్యల్ని తలకెత్తుకుని, తీవ్రమైన వేదనని గుండెల్లో దాచుకొని, ఆదర్శాన్ని నిజం చేసుకోవాలనే తపన అన్వర్ లో కనిపిస్తుంది. ఏ సమాజంలో నైనా,ఎక్కడైనా  స్త్రీకి కట్టడి తప్పలేదు. కానీ ముస్లిం స్త్రీకి ఇంకో మోతాదు ఎక్కువ.  వెండిమేఘం ఒక అసాధారణ స్త్రీ మూర్తి కథ. ముస్లిం జీవన విధానంలో స్త్రీ పాత్ర ప్రాధాన్యతను, పండగలు పబ్బాలు, ఆచారవ్యవహారాలను వివరంగా మనకు తెలియజేసిన తొలి తెలుగు ముస్లిం నవల ఇది. స్త్రీవాదాన్ని ‘వాదం’లా కాకుండా, సున్నితంగా చెప్పటం ఇందలి విశేషం. 
       స్త్రీ పురుషుల వివాహ బంధం లో వయోభేదం తెచ్చిపెట్టిన చిక్కులు – తెలిసీ తెలియని పదకొండేళ్ళ వయసులో అన్వర్ కి 35 ఏళ్ల బాషాతో పెళ్లి జరగటం అనే అసంబద్ధత తో ఈ కథ మొదలైంది. దానివల్ల అన్వర్ జీవితాంతం వ్యక్తిగా చితికిపోయి, ఒక శక్తిగా ఎదిగే క్రమంలో ఆటుపోట్లు, సవాళ్లు, కన్నీళ్లు, నిజాయితీ, నిబద్ధత సవివరంగా చెప్పారు సలీం. 
   ఇందులో చర్చించిన మరో సమస్య పేదరికం. అన్వర్ కు వివాహం చేయటం – చాలీచాలని సంపాదనతో ఉన్న తండ్రి మీరాసా కు గగనం అయినా, తండ్రిగా తన బాధ్యత నిర్వర్తించుకోవాలి అనుకొని, కొడుకు కోడళ్ళ ఒత్తిడితో 35 ఏళ్ల భాషా కు ఇచ్చి వివాహం చేయక తప్పలేదు. అన్వర్ పక్షం వహించిన మరో అన్న రహమతుల్లా రోషంతో ఇల్లు వదిలి వెళ్ళాడు. అన్వర్ వాళ్ళ అమ్మ గుడ్లనీరు కుక్కుకుంది తప్ప నోరెత్త లేకపోయింది.
     ఆమె అభిప్రాయానికి ఇంట్లో విలువ లేదు భర్త మీరాసా చెప్పింది వినడం తప్ప ఆమె ఎప్పుడూ మారు మాట్లాడి ఎరుగదు. మగవాళ్ళ నిర్ణయానికి తలవంచడం తప్ప సొంత అభిప్రాయం చెప్పే అవకాశం ఆమెకు ఎప్పుడూ లేదు. బాధ కలిగితే మౌనంగా భరించింది తప్ప ఇది అన్యాయమని, ఇది న్యాయమని ఆమె ఎప్పుడూ నోరెత్తి అనలేదు.
     చటాయి మీద నిద్రపోతున్న అన్వర్ ను తట్టిలేపి “బాషా మీయాసే నిఖా కబుల్ హై?” అని అడిగితే, ఆ నిద్ర కళ్ళతోనే ‘కబుల్ హై” అంది. అలా  కుదిపి కుదిపి మూడుసార్లు అనిపించి, నిఖా పక్కా చేశారు. నల్లపూసలని వాళ్ల అమ్మే అన్వర్ మెడలో వేసింది. అలా వేస్తున్నప్పుడు ఆమె చేతులు వణికాయి. గుండె బరువెక్కింది. కళ్ళు జలపాతాలు అయినాయి. ‘ఛీ, ఆడజన్మ’ అనుకుంది. ప్రాణమున్న కట్టెలా ఆమె ఆ దిగులు తోనే పొగిలి పొగిలి పోయింది. జీవితాంతం నలిగిపోయింది.
     స్త్రీలకు – ముఖ్యంగా ముస్లిం స్త్రీలకు మరో సమస్య విద్య లేక పోవడం. అది ఎన్ని అనర్థాలకు, ఎన్ని విపరీతాలకు దారి తీస్తుందో చెప్తూ,  ముఖ్యంగా దాని విలువ తెలియని ముస్లిం యువత ఎందుకు ఎదగడం లేదో సలీం సోదాహరణంగా వివరిస్తారు. ఒక స్త్రీ చదువుకుంటే ఆమే కాదు, ఆమె కుటుంబం, ఆమె ఊరు ఎంతగా లబ్ధి పొందుతుందో ‘అన్వర్’ ద్వారా నిరూపించారు సలీం. ఆమె చిన్నప్పుడు చదివిన అరబ్బీ, ఉర్దూ ‘మతం’ మీద గౌరవం పెంచితే, వెంకటరత్నం పంతులుగారి ఔదార్యంతో “మెట్రిక్యులేషన్” – విద్య యొక్క విలువను తెలుసుకొని, తన చుట్టూ ఉన్న ముస్లిం మహిళలకు విద్య యొక్క విలువను ఎలా పంచిందో, ఎలా విలువను పెంచిందో సలీం గొప్పగా చెప్పారు.
        ఆర్థిక స్వాతంత్రం లేని స్త్రీ కి ఎక్కడా స్వాతంత్రం కనుచూపు మేరలో కనిపించదు. అన్వర్ అత్త   కుల్సుంబి – భర్త చనిపోయినా అంత నిబ్బరంగా ఉండటానికి కారణం తన పేర ఉన్న ఐదెకరాల మసీదు మాన్యం. అదే ఆమెకు కొండంత ధైర్యం. అందుకే కొడుకు బాషా కొరగాని వాడైనా, వ్యసనపరుడైనా ధైర్యాన్ని వదులుకోలేదు. బాషా అన్వర్ కి చేసిన అన్యాయాన్ని దుమ్మెత్తిపోసింది. అన్వర్ ని కోడలిగా ఎప్పుడూ చూడలేదు. సొంత కూతురిలా కళ్ళల్లో వత్తులు వేసుకుని రక్షించింది. అత్తా కోడళ్ళంటే  ‘ఆరళ్ళు’ గుర్తుకొచ్చే కుటుంబాల కంటే భిన్నమైన బంధం వారిది. అన్వర్ పాత్రతో పోటాపోటీగా నడిచిన ఆదర్శవంతమైన పాత్ర కుల్సుంబి.
(సలీం ఎన్నుకొన్న పాత్రల పేర్లు కూడా అర్ధవంతంగా ఉంటాయి. మక్కా నుండి పారిపోయి వచ్చిన మహమ్మద్ ప్రవక్తకు కుబా లో తొలి ఆతిథ్యం ఇచ్చిన అంధుడు, సచ్ఛీలుడు, గొప్ప ధైర్యవంతుడు   ‘కుల్సుం ఇబిన్ హదమ్’.) అంతేకాదు అన్వర్ చిన్న కొడుకు ‘జిలాని’ కూతురు పేరు కూడా కుల్సుం. అన్వర్ అత్త కుల్సుం మనసు పండిన పుష్పం అయితే, అన్వర్ మనుమరాలు కుల్సుం-  వారి ఆశయాలు గుప్పుమనే పరిమళ పరిరంభం.
అన్వర్ భర్త బాషా ‘సైదాబీ’ అనే దూదేకుల స్త్రీ తో అక్రమ సంబంధం లో ఉంటూ, ఒకసారి అన్వర్ మీద కోపంతో ఆమెను నిఖానామ చేసుకుంటాడు. ఈ సైదాబీ తమ్ముడే ఆదం. అన్వర్ ని అక్కలా గౌరవించి, ఆమె దగ్గర మత ధర్మాలను, మర్మాలను తెలుసుకుంటూ తన జాతికి జవాన్ని జీవాన్ని ఎలా ఇవ్వాలో నేర్చుకుంటాడు. ఎందుకు వీరిని ‘ఆదా ముస్లిం’ లని చులకనగా చూస్తారో రచయిత వివరంగా చెప్తారు. 
    బాషా లోని న్యూనతాభావం అడుగడుగున వికృతరూపం దాల్చి అన్వర్ చిన్ననాటి స్నేహితుడైన నజీర్ ముఖ కవళికలను తనకు, అన్వర్ కి పుట్టిన జిలాని లో చూడటానికి ప్రయత్నించిన నీచుడు. ఎప్పుడో చిన్నప్పుడు పకీరు గా మారి,  అన్న కూతురు అన్వర్ ను చూడటానికి వస్తే తట్టుకోలేని అభాండం వేశాడు. దుఃఖాన్ని, అవమానాన్ని, గాద్గద్యంలో దిగమింగుకున్న అన్వర్  సహనం అందరికీ సాధ్యం కాదు. అనుమానం పెనుభూతమై బాషా మనసును, ఆలోచనను పచ్చివిషం తో నింపుతుంది. రఫీకి అన్వర్ “సవతితల్లి” అని నూరిపోసి వారి మధ్య మొదటి నుంచి చిచ్చు పెడతాడు. భర్త చివరి కోరికను తీర్చడానికి, అత్తను ఒప్పించి, మసీదు మాన్యం రఫీ కి వ్రాయించి, తాను బికారిగా మారిన అన్వర్  త్యాగాన్ని మాటలతో కలవలేం.
    సమాజంలో గౌరవ ప్రదంగా బ్రతకడానికి ఎవరిని ఆశించకుండా ఒళ్ళు వంచి పని చేయటం అనే మంత్రం అన్వర్ ద్వారా నేర్చుకోవచ్చు.  ఐ. ఎల్. టి. డి. లో పనిచేసినా, తన పొలాన్ని తానే కౌలుకు తీసుకొని, చెమటోడ్చినా ‘అభిమానం’ రెపరెపలాడించి ఆదర్శంగా బ్రతికింది. తన అందాన్ని ఆబగా అనుభవించాలనుకొన్న ‘సూపర్వైజర్’ బారినుండి ఆదెమ్మ సాయంతో బయటపడి, చివరకు తానే సూపర్వైజర్ కావటం కాకతాళీయం కాదు – కష్టానికి ఫలితం. ఒక స్త్రీ ఆర్థికంగా బలంగా ఉంటే ఎవరి మీద ఆధార పడకుండా ఉండవచ్చు. అదే స్త్రీ స్వాతంత్రానికి, స్త్రీ వ్యక్తిత్వానికి ఒక సంకేతం అని ‘వెండిమేఘం’ సూచిస్తుంది. అందుకు కుల్సుం  మంచి ఉదాహరణ, ప్రేరణ.
       నజీర్ తో మాట్లాడుతున్న అన్వర్, 18 ఏళ్లకే వేదాంతిలా మాట్లాడటం చూసి ‘నీకు చదువు లేదు. అయినా…’  అంటుంటే అందుకుని, “చదువుకోకపోతేనేం! జీవితానికి మించిన పుస్తకం ఏముంది!” అన్న వాక్యం ఎంత లోతైనదో కదా! 
   ఏ చదువూ లేని ముస్లిం స్త్రీ తలాక్ తర్వాత ఎలా బతుకుతుంది? కుల్సుంబీ అన్వర్ తో అన్నమాటలు నిజమైన ముస్లిం స్త్రీవాదానికి ప్రతీకలే. ” ముస్లిం స్త్రీకి చదువు లేకపోవడం ఆర్థిక స్వావలంబన లేకపోవడం వల్ల మగవాడి దాష్టీకానికి లొంగవలసి వస్తోంది. ఈ ఇల్లు, పొలం నా పేరు మీద ఉండబట్టే ఒక్క పూట తింటున్నా, అభిమానంతో తలెత్తుకొని బ్రతగ్గలుగుతున్నాం. లేకపోతే వాడు ఛీ అన్నా, ఛా అన్నా, కాళ్లతో తన్నినా,  మొహం మీద వూసినా, గుప్పెడు మెతుకుల కోసం వాడి కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన గతి పట్టేది.ఇదిగో అన్వర్, ఇప్పుడే చెప్తున్నా, విను. నీకు కూతురు పుడితే దాన్ని బాగా చదివించి ఉద్యోగం చేయించు. మన ముస్లిం పేటలో రఫీ బడికి వెళ్ళిన మొదటి కుర్రాడు అయినట్లే, నా మనవరాలు మొట్టమొదటి ఉద్యోగస్తులైన ముస్లిం యువతి కావాలి. నేను బ్రతికి లేకున్నా నా మాట మాత్రం మర్చిపోవద్దు”… ఆమె మాటల్లో స్త్రీలని చెప్పు కింద చీమల్లా తొక్కి పెడుతున్న మగజాతి మీద అంతా నిండి ఉంది. స్త్రీ స్వాతంత్రాన్ని ప్రసాదిస్తూ, మధ్యమధ్యలో ముస్లిం స్త్రీ స్వాతంత్రాన్ని అన్వర్ మనవరాలు కుల్సుం తో చెప్పించడంలో సలీం హృదయం ఆవిష్కృతమైంది.
   “మంచి లాయర్ గా మన ముస్లిం స్త్రీల హక్కుల కోసం పోరాడాలని నా కోరిక…” అంటే –
    ” ముస్లింల ఆలోచనా ధోరణి లో మార్పు రావాల్సిన అవసరం ఉంది దాదీమా! ఫర్ ఎగ్జాంపుల్ పరదా సిస్టం ఉంది కదా. దానిని బలవంతంగా ముస్లిం స్త్రీల మీద రుద్దాలి అనుకోవడం తప్పు. ఈ మధ్య కొన్ని ముస్లిం ఉగ్రవాద సంస్థలు, పరదా పాటించని యువతుల ముఖాల మీద యాసిడ్ చల్లుతాం… అని బెదిరిస్తున్నారు. మౌలికమైన మత సూత్రాలు పాటించటం వరకు సరే, కానీ ఇలాంటి విషయాల్లో మన స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలి” అంటూ తన స్వతంత్ర భావాలని పంచుకుంటుంది చిన్న కుల్సుం.
    “అంతెందుకు దాదీమా! ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లు టీవీని, సంగీతాన్ని, సినిమాల్ని, చిత్రలేఖనాన్ని, ఎత్తుమడమల చెప్పులు, ప్రకాశవంతమైన రంగు రంగు దుస్తులు వేసుకోవడాన్ని నిషేధించారు. నెయిల్ పాలిష్, లిప్ స్టిక్ తో పాటు చెస్, బిలియర్డ్స్ లాంటి ఆటలు కూడా నిషేధించారు. దారుణం కదా. ఒక అమ్మాయి తన వేలి గోళ్ళకి మెరుగులు పెట్టుకొన్నదని ఆమె బొటనవేలి మొన కొట్టేశారట. మనం 20 వ శతాబ్దం లో ఉన్నామా లేక ఇంకా ఆటవికయుగం లోనే ఉన్నామా అన్న అనుమానం వస్తూ వుంది దాదీమా!…. నా ఉద్దేశంలో ఏ మతం లోనైనా హింసకు, అన్యాయానికి, దౌర్జన్యానికి బలయ్యేది స్త్రీలే. అందునా మన ముస్లిం స్త్రీలు మరీ అధ్వాన్న పరిస్థితిలో ఉన్నారు” అంటుంది.
     మామూలుగా నాటకాల్లో భరతవాక్యం నాయకునితో పలికించడం ఆనవాయితీ. కానీ ఈ నవలలో భరతవాక్యం పలికింది నాయిక. కథానాయిక అన్వర్ మాటలతో నవల ముగుస్తుంది – “నీలాంటి చదువుకున్న, అభ్యుదయ భావాలున్న ముస్లిం స్త్రీల వల్లే సాధ్యపడుతుంది. మీ తరం స్త్రీలు తప్పకుండా సాధించుకుంటారన్న నమ్మకం నాకుంది”.
     అన్వర్ అనే పల్లెటూరి అమ్మాయి బేసహారాగా ఉన్న అమ్మాయి – ఆదర్శవంతమైన మహిళగా, ధైర్యంగా, ఎంతగా ఎదిగిందో, జీవితంలో ఎలా ఒదిగిందో – ఒక అద్భుతంగా, ఒక ఆదర్శంగా, ఒక సంస్కారవంతంగా, సరళ సుందరంగా సలీం కలం “వెండిమేఘం” నవల మనకు అందించింది. ఇంకా ఇటువంటి ప్రజోపయోగ స్త్రీవాద ఆమోద సాహిత్యాన్ని పాఠక హృదయాలకు సన్నిహితం చేయాలని కోరుకుందాం.

*****

Please follow and like us:

2 thoughts on “ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-6 సలీం కథలు”

  1. చాలా గొప్ప విశ్లేషణ అందించారు డా. సి.హెచ్. సుశీల గారికి,సలీం గారికి అభినందనలు… కరీముల్లా

  2. మంచి నవలకు చక్కటి విశ్లేషణ. సలీం గారికీ, సుశీలగారికీ అభినందనలు..

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published.