అంగార స్వప్నం 

(ఊర్మిళ కవితా సంకలనంపై సమీక్ష)

   -వి. విజయకుమార్

ఊర్మిళ పలవరించిన అందమైన రంగులకల ఈ అంగార స్వప్నం! ఈ నులివెచ్చని కల దొంగిలించబడిందో లేదో తెలీదు కానీ, దొంగిలించిన కలని భుజాన వేసుకొని అటు తిరిగే పరిశుద్ధాత్ములు ఎందరో, అంటిన మరకలు తుడుచుకొంటో ఎప్పటిలాగే యీ ‘నేను’ లు ఎందరో! 

అటుచేతిరాతలు పోయాయ్, అనుభూతుల్ని కవిత్వీకరించుకొని, ఉల్లిపొర కాగితపు హృదయం మీద అందంగాపరిచి, అందించిన వాటిని ఆప్యాయంగా స్పృశించి, అమ్మలా హత్తుకుని గీతల్ని మార్చిన చేరా తలూ పోయాయ్! చిలుకలు వాలిన చెట్లు ఎగిరిపోయాయ్, చెట్ల మీద వాలిన చిలుకలూ ఎగిరిపోయాయ్. రహస్త్రంతుల్ని డిసైఫర్ చేసేవారు కరువై, త్రిపురనేని శ్రీనివాస్ లు కూడా వెళ్ళిపోయాక కవితా గమనాల్ని అక్కున చేర్చుకొని సమీక్షించి ఆదరించిన ఆనవాళ్లు అంతంత మాత్రమే అయ్యాయ్!

గీతలూ, నిర్మలలూ, మహాజబెన్లూ షాజహాన్లూ  ఇంకా నిరుడు కురిసి తనువంతా తడిపేసి, స్త్రీత్వాన్నీ, స్త్రీ తత్వాన్ని, స్త్రీ తాత్వికతనీ పొదవి పట్టి నీలి మేఘాల్లో వర్షించిన ఋతు వెళ్లిపోయి ఏళ్లకు ఏళ్లే మరుగైపోయాయ్! భద్రంగా దాచుకున్న ఆల్బమ్ అనుభూతులే తప్ప ప్రచురించుకు మురుసుకున్న ప్రాత జ్ఞాపకాలను పంచుకుంటూ, అడపా దడపా ఆన్ లైన్ కవిత్వాలు తప్పించి, ఆప్యాయంగా అరుసుకుని హత్తుకున్న రోజులే కరువయ్యాయి! మధుర వాణి నవ్వుల్తో, క్షితిజ ఛాయల్లో, కాళ రాతిరినీడల్లో, చీకటి రాతిరిలో, ఆనవాలు లేని సమాధి తలపులతో, దోసిలితో తీరని దాహంతో, శిలువకు పూసిన యాదిలో ఒక అనాశ్రితలా బంగారు కలల్ని కనకుండా అద్వైతిగా అంగార స్వప్నాల్ని ఆవిష్కరిస్తూ అందమైన ప్రేమలేఖ అచ్చుల్తో అంగార స్వప్నం వచ్చేసి అప్పుడే నాలుగు వసంతాలు అయ్యేపొయ్యాయ్!

చెప్పేసుకొని,మనసు విప్పేసుకొని,భారం దించేసుకుంటే కవిత్వమెందుకు? చెప్పేసుకోవడానికి, తనలాంటి మనిషి ఎదురుగా లేక, వున్నా చాలక, చెబుతున్నా వినిపించుకోక ఇంక చేసేదేమీ లేనప్పుడు ఏదో రాసి, ఒక రాశిగా పోసి, సీసాలో పడేసి జన సంద్రంలో విసిరేసి ఏ తీరంలోనో కాలికి తగులుకున్న అనామకుణ్ని, తన తలపేదో పంచుకోమని చెప్పడమే కదా కవిత్వ లక్ష్యం?…ఎంత హృద్యంగా చెప్పాడు అంగార స్వప్నానికి అందమైన  నెమలీకని కొప్పులో తురుముతూ రోహిత్!

అనుభూతులన్నీ శతక పద్యాల్లా అందరికీ అర్ధం అయిపోతే, అలజడి చేయకుండా టీకా తాత్పర్య    సహితంగా గుండెల్లోకి దూరిపోతే, అభ్యంతర తలపుల అంతఃపుర మందిరంలోకి తలుపులు బార్లా తీసి స్వాగతించడం కాదూ! గుండెల్ని మెలిపెట్టే వేదనతో వేచిచూడటంలోని అనుభూతిని మరచిపోవడం అవదా! అపరూప రొమాంటిక్ కవిత్వానుభూతులన్నీ ఇంకప్పుడు చౌకబారు రసికప్రియ పుస్తకాలైపోవూ!

కలర్ ఫోటోలో అందం వెతుక్కోమని చెప్పడం కాదు కవిత్వం, ఎక్స్-రే ఫిల్ములో ఉరః పంజరం వెనుక ఛాయా మాత్రంగాకూడా ద్యోతకమవ్వని గుండె చప్పుళ్ళు పట్టుకోవడం కవిత్వం! లబ్ డబ్ ల గుండె సవ్వళ్ళు వినగలిగేవాడు వైద్యుడే కాదు, కవితాత్మ తెలిసినవాడు కూడా! అందుకే ఏవో ఇమేజరీల జరీ ముసుగుల్లో దాచి, కొంచెం అందేలా, ఇంకొంచెం అందంగా, అందీ అందకపోయే చేలాంచలాల విసరుల కొసగాలుల్లా అందించడమే కవిత్వం! 

కవితా సుషుప్తిలో పలవరించిన అందమైన ఊర్మిళ కల అంగార స్వప్నం అదిగో అచ్చంగా అలానే వొచ్చింది! ‘కల’గానే కాదు ‘కళ’ గా కళాత్మకంగానూ అది ఆనందమయం. కుంచె తగిలిన మోడు సైతం అపరూప కళాకృతై పూచినట్లు, స్వప్నించిన ప్రతి అనుభూతిని నులివెచ్చని అగ్నితో వ్రేల్చి, హృదయాలను రాగ రంజితం చేశారు ఊర్మిళ! స్త్రీ కి కూడా హృదయం ఉందని చలం చెప్పినప్పుడు పురుషలోకం స్పృహ తప్పికూడా ఎనభై యేళ్ళ పైమాటే! స్త్రీవాద కవిత్వాల్ని ఋతురాగ కవిత్వాలుగా ఈసడించిపారేసి కూడా ముప్ఫై నలభై ఏళ్ల పైమాటే! అప్పటికే మగాడు తన కోసం సృష్టించిన నిషిద్ధ పదకోశాలూ, రిపర్టరీలు తప్ప వేరే దారిలేని స్త్రీ తన్ను తాను వ్యక్తీకరించుకోవడం కోసం వాటినే వాడుకోవడం అనేది కొందరికి బూతైతే మరికొందరికి ‘బోల్డ్ నెస్’ అయింది.

Audre Lorde అన్నట్టు “I write for those women who do not speak, for those who do not have a voice because they were so terrified, because we are taught to respect fear more than ourselves. We have been taught that silence would save us, but it won’t”

ఊర్మిళకు కావాల్సినంత ధైర్యం, వ్యక్తీకరించుకొనేందుకు వలసినంత భాషా మెండుగా ఉన్నాయి కాబట్టే పొదవి పట్టుకొని మోయలేని భావాల్ని భాస్వరంలో మండించి, నివురు కప్పి చేతికందించారు. చేతులు కాల్చుకోవడంలో వున్న ఆనందాన్ని వెచ్చగా అందిస్తూ! కొన్నిచోట్ల అగ్ని తాకుతుంది! కొన్నిచోట్ల శూన్యం పాకుతుంది! ఇంకొన్ని చోట్ల అగాధాలు… విండో పేన్ మీద రహస్యంగా జారే వాన… ఇంకొన్ని చోట్ల అసలు అంతుచిక్కని వింత బింబప్రతిబింబాలు…తాళపు చెవులు ఎక్కడ దాచారో తెలియని అసందిగ్ధ స్థితి! పేజీ చివర్లో కురిసిన రహస్య వానలో సిద్ధార్థ అన్నట్టు ఏ పాదం లోనో కవి దాచిన తాళం చెవి దొరక బుచ్చుకొని, మెలితిప్పి, ద్వారం తెరిచి, తెరిపిన పడే అవకాశం ఉంటుందా? ఏమో దొరకని సందర్భాలూ తప్పవ్. 

Moments of Being లో అనుకుంటా, “ఎక్కడో లోతుల్లో దాగున్న, దైనందిన జీవితానికావల, చెప్పనలవిగాని గాఢమైన కాంక్ష నాకుంది అంటుంది అందంగా వర్జీనియా ఊల్ఫ్! I have a deeply hidden and inarticulate desire for something beyond the daily life.” అలాంటి కాంక్షల తాలూకూ అనుభూతుల్ని స్వప్నపు ఉపరితలం మీదకు తెచ్చి అందించేరు ఊర్మిళ ఇందులో!

జీవితాన్ని తప్పించుకుంటూ వెళితే నీకు శాంతి దొరకదు, కొంచెం డబ్బూ, ఓ ఏకాంతపు గదీ సొంతంగా లేనంతకాలం ఏం రాయగలవ్? నీ గురించి నువ్వే నిజం చెప్పుకోలేకపోతే, ఇతర్ల గురించి అసలేం చెప్పలేవ్” అంటూ భుజం తట్టిన ఊల్ఫ్ భరోసా నిండారా నింపుకున్న హృదయం ఆమెది.

అందుకే చిత్రిక పట్టినట్టు,

ఎప్పుడో ఒకప్పుడు ఆకాశపు అంచుల్లోనో

అగాథాలలోనో పాతుకుపోతామని తెలుసు

అయినా నేస్తం

త్రిశంకు స్వర్గంలో

తురాయి కొమ్మనెలా పట్టుకొని వేలాడతావ్ 

అని అడుగుతారు గడుసుగా!

ఒక్కొక్క రాతిరిలో ఒక్కోరకమైన అనుభూతుల్ని ప్రోది చేసుకొని

వయసు తొడిగిన కుచ్చుల గౌనై

వాంఛ తీరని కోరికనై

సవ్వడిలేని కాలి అందెనై

నిషిద్ధ ఫలాన్ని మునిపంట కొరికి

జ్ఞాన సుందరి నై సృష్టి కావ్యం రచిస్తానని 

మధుర వాణి నవ్వుల్లో సాహసంగా పలికిస్తారు ఊర్మిళ.

కదల లేని నా నిస్సహాయతే

నీ విజయ సంకేతం

అసహాయపు నా ఆక్రందనే

నీ పైశాచిక కార్యానికి ప్రతిరూపం

 ఒక వాంపైర్ దాడికి ప్రతీ అర్ధరాత్రీ రక్తమాంసాల్ని మాత్రమే ఇచ్చి మాలిన్యం అంటకుండా బయటపడే స్త్రీ ని థూ సిగ్గు లేదూ ! అంటూ ఛీత్కరిస్తారు ఊర్మిళ.

ఈసడించడమే కాదు 

దూరంగా సందు మలుపులో

ఋతువులన్నీ మోసుకు పోయే నువ్వు కోసం

రాలిన రేకుల్ని ఏరుకోవడం మానేసి

నేల పై ఒలక బోసిన రంగుల హేళికలా,

సంధ్యా సంగమ గీతికలా  

గృహాంతఃపురాన్ని నిప్పుతో తోమి

కుబుసం విడిచేసి

బారెడేసి అంగలేసి పరుగుతీసే పారవశ్యం కూడా ప్రకటిస్తారు ఊర్మిళ!

అంతేనా! 

దడిన పాకిన ఎండిన తీగలా

సన్నగా చుట్టేసిన పసిరికలా

తుమ్మచెట్టు మొదట్లో

ముళ్ళన్నీ మోస్తున్న రక్తచారికలా

అనుభవాల గుత్తుల్ని

దాచిపెడుతూ

రేపటికి నిలిచే

ఆ చిత్తరువు గురించి ఎంత వేదనగా చెబుతారో పసిరిక లో

అమ్మ కోసం ఆవేదనగా, ఆర్తిగా ఒక చెక్కిలిపై జారిన కన్నీటి చుక్కై ఎంత హృద్యంగా అంటారో చూడండి!

 

హృదయం గాయపడి

ఒళ్లంతా తడిమి తడిమి

కన్నీటి చారలు తప్ప…

ఒక మాటైనా పెగిలి రాక

అమ్మని తలుచుకొని

క్షమించు అమ్మా

నేను నీవుగా మారినప్పుడు గాని ఎరుక కాలేదు

అమ్మంటే బడ బాగ్నులు మోసే

అమృత భాండాగారమని

అంగార స్వప్నం ఒక అమలిన శృంగార కావ్యం. అయిష్టంగానే అంటిన మరకల ఆవేదన తాలూకూ జ్ఞాపకం కూడా! యింకో చోట సంపెగలూ, ఆల్చిప్పలూ, మధువులూ, మంచు కుప్పలూ, కుంకుమపూల సుగంధాలు పూచిన ఉద్యానవనం. వనసీమలో విహరించేప్పుడు అక్కడక్కడా అరిపాదాల్లో చురుక్కున దిగబడే తుమ్మ ముళ్ళు సైతం ఈ స్వప్నం! దోసిలి పట్టి తీర్చుకొనేందుకు చాలని మధురానుభూతుల పరవశం కూడా!

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.