అనుసృజన

నిర్మల

(భాగం-15)

అనుసృజన:ఆర్. శాంతసుందరి 

హిందీ మూలం: ప్రేమ్ చంద్

తోతారామ్ కి మాత్రం నిద్ర పట్టలేదు.’ముగ్గురు కొడుకుల్లో ఒక్కడే మిగిలాడు.వాడు కూడా చెయ్యిదాటిపోతే ఇక జీవితంలో చీకటి తప్ప ఏముంటుంది?తన వంశం నిలబెట్టేవాడే ఉండడు.రత్నాల్లాంటి పిల్లల్ని అన్యాయంగా పోగొట్టుకున్నానూ!’ అని బాధపడుతూ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. పశ్చాత్తాపంలో, గాఢాంధకారంలో ఒకే ఒక కాంతి కిరణం , కొడుకు తిరిగివస్తాడన్న ఆశ,ఆయన్ని పూర్తిగా కుంగిపోకుండా కాపాడుతోంది.

ఏడుస్తూనే మధ్యమధ్య ఆయన చిన్న కునుకు తీస్తున్నాడు.కానీ ప్రతిసారీ సియారమ్ వచ్చిన అలికిడైనట్టనిపించి ఉలిక్కిపడి లేస్తున్నాడు.

తెల్లవారగానే ఆయన మాళ్ళీ సియారామ్ ని వెతికేందుకు బైలుదేరాడు.ఎవరినైనా అడిగేందుకు మొహం చెల్లలేదు.నవ్విపోరూ? తనని చూసి ఎవరైనా జాలిపడతారన్న నమ్మకం ఆయనకి లేదు.పైకి అనకపోయినా మనసులో, చేసిన పాడుపనికి అనుభవించు! అనే అనుకుంటారు కదా? రోజంతా స్కూల్లో,పార్కులో, బజార్లలో, దుకాణాలలో తెగ వెతికాడు.రెండ్రోజులుగా పస్తున్న ఆయనలో అంత బలం ఎక్కణ్ణించొచ్చిందో ఆయనకే తెలియాలి.

రాత్రి పన్నెండు గంటలకి ఆయన ఇంటికొచ్చాడు.గుమ్మంలో లాంతరు వెలుగుతోంది.నిర్మల అక్కడే నిలబడి ఉంది.”చెప్పకుండా ఎప్పుడు వెళ్ళిపోయారు? అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందా?”అంది.

నిప్పులు చెరిగే కళ్ళతో ఆమెని చూస్తూ,”పో నా ముందునుంచి!లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు !ఇదంతా నువ్వు చేసిన నిర్వాకమే.నా బతుకు నరకం చేశావు.ఆరేళ్ళ క్రితం ఎలా ఉండేదీ ఇల్లు? పచ్చటి సంసారం నీవల్ల మోడుబారిపోయింది.నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తే గాని నీకు సంతృప్తి ఉండదేమో!పువ్వుల్లాంటి పిల్లల్ని ఇంటి నౌకర్లని చేసేశావు.నేనూ పట్టించుకోలేదు.అన్నీ చూస్తూ కూడా మూగవాడిలా,గుడ్డివాడిలా ఉండిపోయాను. వెళ్ళు, వెళ్ళి నాకింత విషం తెచ్చియ్యి.నువ్వు చెయ్యవలసిన పని అదొక్కటే మిగిలింది.అది కూడా చేసేశావంటే ఇక నువ్వు హాయిగా ఉండచ్చు!” అన్నాడు.

నేను దౌర్భాగ్యురాలినే,అది మీరు చెపితేనే తెలుస్తుందా నాకు? అసలు దేవుడు నన్నెందుకు పుట్టించాడోకానీ సియారామ్ ఇంటికి రాడని ఎలా చెప్పగలరు?”అంది నిర్మల ఏడుస్తూ.

తోతారామ్ తన గదివైపు వెళ్తూ,” నన్నింకా వేధించకు.వెళ్ళి పండగ చేసుకో! నీ కోరిక నెరవేరిందిగా?” అన్నాడాయన.

నిర్మల రాత్రంతా ఏడుస్తూనే ఉంది.ఇంత పెద్ద అపవాదా! జియారామ్ నగలు తీసుకువెళ్ళటం చూసినా తను నోరిప్పలేదు.ఎందుకు? సవతి కొడుకుమీద నేరారోపణ చేస్తోందని అమ్దరూ వేలెత్తి చూపిస్తారనేగా? మౌనంగా ఉన్నందుకే రోజు తనకీ శిక్షా? అప్పుడే జియారామ్ ని ఆపి ఉన్నా అతను అవమానంతో మొహం చూపించలేక ఇంట్లోంచి పారిపోయేవాడే.అప్పుడైనా తప్పు తనదే అనేవారుగా?

సియారామ్ ని మాత్రం తనేం బాధలు పెట్టిందని?పొదుపుచేదామనే ఉద్దేశంతోనే అతన్ని బజారుకి పంపేది. డబ్బుతో తనేమన్నా నగలు ఏయించుకోవాలనుకుందా?ఆదాయం అంతంత మాత్రంగా ఉంటే డబ్బు దాచేందుకు మరో మార్గమేముంది? చిన్నవాళ్ళ ప్రాణాలకే హామీ లేని రోజుల్లో వయసు పైబడిన వాళ్ళ మాట చెప్పేదేముంది? కూతురు పెళ్ళీడుకొస్తే డబ్బుకోసం ఎవరిముందు చెయ్యి చాస్తుంది?దాని బరువూ బాధ్యతా తనొక్కర్తిదే కాదుగా?భర్త బరువు తగ్గించేందుకే కదా పొదుపు చేస్తోంది? రేపు పిల్ల పెద్దయితే అన్నగా సియారామ్ కి మాత్రం బాధ్యత ఉండదా?తను పిల్ల కోసమే, భర్తా,సియారామ్ ఎక్కువ కష్టపడకూడదనే డబ్బు ఖర్చు చెయ్యటం దగ్గర అతి జాగ్రత్తగా ఉంటోంది.కానీ అయినా తననే తప్పు పడుతున్నారందరూతన తలరాత అలా ఉంది !

మధ్యాన్నమైనా ఇవాళ కూడా పొయ్యిలో పిల్లి లేవలేదు.తినటం కూడా జీవించటంలో ఒక భాగమే అనే ధ్యాస లేకుండా పోయింది వాళ్ళకి.తోతారామ్ బైట జీవం లేనట్టు పడి ఉన్నాడు.నిర్మల ఇంట్లో నీరసంగా పడుకునుంది. పాప లోపలికీ, బైటికీ తిరుగుతోంది.ఎవరూ దానితో మాట్లాడటం లేదు.మాటి మాటికీ సియారామ్ గది ముందు నిలబడి,’అన్నాఅన్నా…” అని పిలుస్తోంది పాపం !కానీ అక్కడ అన్నయ్య ఉంటే కదా జవాబిచ్చేందుకు?

సాయంకాలం నిర్మల దగ్గరని వచ్చి,”డబ్బులేమైనా ఉన్నాయా?” అని అడిగాడు తోతారామ్.

ఏం చెయ్యటానికి?” అంది నిర్మల కంగారుగా.

నేనడిగిన దానికి జావబు చెప్పు ముందు.”

మీకు తెలీదా ఉన్నాయో లేవో.నాకు మీరే కదా ఇచ్చేది?”

అబ్బ, డబ్బులున్నాయా లేవా? ఉంటే ఇయ్యి,లేకపోతే లేవని చెప్పు.”

అప్పటికీ నిర్మల సూటిగా జవాబు చెపలేదు.”ఉంటే ఇంట్లోనే ఉంటాయిగా? నేనెవ్వరికీ పంపించలేదు,” అంది.

తోతారామ్ ఏమీ అనకుండా బైటికెళ్ళిపోయాడు. నిర్మల దగ్గర డబ్బులున్నాయని ఆయనకి తెలుసునిజానికి ఉన్నాయి కూడా.లేవనీ,ఇవ్వననీ కూడా అనలేదామె.కానీ ఆమె మాట్లాడిన విధం, డబ్బులివ్వటం ఆమెకి ఇష్టం లేదనే అనిపించింది.

రాత్రి తొమ్మిది గంటలకి తోతారామ్ ఇంటికొచ్చాడు.రుక్మిణి దగ్గరకెళ్ళి,”అక్కయ్యా, నేను ఊరెళుతున్నాను. పెట్టే బేడా పనిమనిషిని కాస్త సర్దమని చెప్పు,” అన్నాడు.

ఆవిడ వంట చేస్తోంది.”నీ పెళ్ళాం తన గదిలో ఉంది.ఆవిడకి చెప్పరాదూ? ఎక్కడికెళ్తున్నావు?”

నేను నిన్ను కదా అడుగుతున్నాను? ఆవిడగారిని అడగాలనుకుంటే నీకెందుకు చెపుతాను?ఇవాళా నువ్వు వంట చేస్తున్నావేమిటి?”

మరి ఎవరు చేస్తారు? మీ ఆవిడ తల నొప్పితో పడుకుంది.ఇంత రాత్రి ఎక్కడికి హఠాత్తుగా ప్రయాణం? పొద్దున్న వెళ్ళచ్చుగా?”

అలా వాయిదా వేస్తూనే మూడు రోజులు తాత్సారం చేశాను.సియారామ్ ఎక్కడికి పోయాడో కాస్త వెతికి వస్తాను.వాడు ఎవరో సాధువుతో మాట్లాడుతూండగా చూశామని కొందరన్నారు.అతనే వీణ్ణి మభ్యపెట్టి వెంటపెట్టుకు పోయాడేమో?”

అయితే మళ్ళీ ఎప్పుడొస్తావు?”

చెప్పలేను.వారమో నెలో పట్టచ్చు.”

ఇవాళ మంచిరోజో కాదో ఎవరైనా పంతుల్ని అడిగావా?”

తోతారామ్ జవాబు చెప్పలేదు.భోజనానికి కూర్చున్నాడు.

నిర్మలకి బైటికి రాకపోయినా అన్నీ వింటూనే ఉంది.ఆయన్ని చూస్తే జాలేసింది.ఆమె కోపమంతా పోయింది.పిల్లని దగ్గరకి పిలిచి, వెళ్ళి మీ నాన్నగారు ఎక్కడికెళ్తున్నారో అడిగి రా,” అంది.

పిల్ల తలుపుదగ్గరే నిలబడి తల బైట పెట్టి,” నానారూ,ఎక్కలికెల్తున్నారు?” అంది.

చాలా దూరం వెళ్తున్నానమ్మా.నీకోసం ఏమైనా తెస్తాలే.నా దగ్గరకి రావేం?” అన్నాడాయన.

పాప నవ్వి దాక్కుంది. మళ్ళీ తొంగి చూసి,” నేను కూలా వత్తాను,”అంది.

నిన్ను తీసికెల్లను,” అన్నాడాయన పాపలాగే మాట్లాడుతూ.

ఎందుకు?”

నువ్వు నా దగ్గరకే రావుగా?”

పిల్ల తపతపా అడుగులేస్తూ వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుంది.కొంతసేపు పిల్ల ముద్దు ముచ్చట్లలో ఆయన తనా బాధ మర్చిపోయాడు.

భోంచేసి తోతారామ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు.నిర్మల చూస్తూ నిలబడింది.అనవసరంగా వెళ్తున్నారు, అనాలనుకుంది కాని అనలేకపోయింది.కాసిని డబ్బులిద్దామనుకుంది కానీ ఇవ్వలేకపోయింది.

చివరికి ఉండబట్టలేక రుక్మిణితో,” వదినా,కాస్త మీరైనా చెప్పకపోయారా.ఎక్కడికెళ్తున్నారాయన? నేను కల్పించుకోకుండా ఉండలేకపోతున్నాను. ఒక చోటంటూ లేక ఎక్కడెక్కడ వెతుకుతారు?” అంది.

రుక్మిణి ఆమెవైపు జాలిగా చూసి తన గదిలోకెళ్ళిపోయింది.

నిర్మల పాపని ఎత్తుకుని ఆలోచించసాగింది.వెళ్ళేముందు పాపని చూసేందుకు నా దగ్గరకి వస్తారేమోలే,అనుకుంది కానీ ఆమె ఆశ నిరాశే అయింది.సామను తీసుకుని తోతారామ్ టాంగా ఎక్కి కూర్చున్నాడు.

నిర్మల గుండెల్లో ఏదో అలజడి మొదలైంది.ఇక ఈయన్ని చూడలేనేమో అన్న భయం ఆమెని నిలవనీయలేదు.కంగారుగా గుమ్మంవైపు పరిగెత్తుకొచ్చింది.కానీ అప్పటికే టాంగా బైలుదేరి కొంతదూరం వెళ్ళిపోయింది.

*****

(ఇంకాఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.