జేబు -అస్థిత్వపు జవాబు

(జేబు కథలపై సమీక్షా వ్యాసం)

   -వురిమళ్ల సునంద

 
లక్షల కోట్ల సంవత్సరాల క్రితం శూన్యంగా ఉన్న సమస్త శక్తి తన శూన్యత పై తనే ఆగ్రహించి ఒక్క విస్ఫోటనంతో విశ్వంగా రూపాంతరం చెందినట్లు-అనేక తరాలుగా అణిచి పెట్టబడిన స్త్రీ శక్తి కూడా అనేక పోరాటాలుగా విస్ఫోటనం చెంది అన్ని రంగాలనూ తన చేతిలోకి తీసుకుంటున్న యుగం ఇది.ఈ ఘర్షణలో మూడు సింహాల లాంటి తండ్రి,భర్త, కొడుకుల చేతిలో ఉన్న రాజ్యమూ-సంపదా, వాటికి సహకరించే మతమూ చట్టమూ  లాంటి వాటిని గెలుచుకునే క్రమంలో కొన్ని గాయాలు-కొన్ని విజయాలు మరికొన్ని ఓటముల సంకలనం- జేబు అని ప్రముఖ రచయిత్రి కవయిత్రి అయిన  పాటిబండ్ల రజని గారు తాను చూసిన, గమనించిన , చదివిన సంఘటనల్లో మహిళల జీవితాలు ఈ పురుష స్వామ్య, ఆధిపత్య సమాజంలో  ఎన్ని రకాలుగా వివక్షతను ఎదుర్కొంటున్నాయో  కళ్ళకు కట్టినట్లు చూపించిన కథలు ఇవి. 
 ‘పాలింకి పోవడానికి మాత్రలు ఉన్నట్టే- మనసింకిపోవడానికి మాత్రలుంటే బాగుండ’ని రాసిన ‘అబార్షన్ స్టేట్ మెంట్’ కవితతో పురుషాధిక్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన  ప్రముఖ కవయిత్రి  పాటిబండ్ల రజని గారు.
 ‘ స్త్రీ తన ఉనికి ప్రమాదంలో పడినప్పుడు శాయశక్తులా పోరాడుతూ తనలాంటి మహిళలకు మనోధైర్యం కలిగించే విధంగా ఇచ్చిన అస్థిత్వ జవాబులే ఈ జేబు కథలు.
కథల్లో ఎన్నో రకాలు ఉంటాయి. పిల్లల కథలు , పెద్దల కథలు, ఆధ్యాత్మిక కథలు.. ఇలా వాటి ఇతివృత్తాన్ని బట్టి అనేకానేక పేర్లతో పిలువబడుతుంటాయి. వాదాల్ని బట్టి అనేక కోణాల్లో కథలు రాయబడుతున్నాయి. అలాంటి  వాటిలో  ఒకటైన స్త్రీవాదం- మానవ హక్కుల చట్టంలో
స్త్రీపురుషులు సమానమేనని రాసినా ఆధిపత్య సమాజంలో, కుటుంబంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని కోల్పోతున్న హక్కుల్ని , స్త్రీ పురుషుల మధ్య ఉండాల్సిన సున్నితమైన అనుబంధాలను, వారు కుటుంబం, సమాజం నుండి ఏం కోరుకుంటున్నారో.. ఎంతో హృద్యంగా చిత్రీకరించి రాసిన కథలు ఇవి.
 ఇందులో 12 కథలు ఉన్నాయి.  ఇందులో ఒకటి ‘అత్యంత వైభవంగా జీవించే రాణిగారు ఏం కావాలని కోరుకుంటున్నారో  ‘జన్మ జన్మల బంధం’ కథ చెబితే మరో కథ ఉద్యోగినిగా పవిత్రత పేరుతో   వరుసలు,చుట్టరికాలు కలుపుకుని భ్రమల్లో బతకడం కాదు.వాళ్ళ మీద ఆధారపడకుండా ఆత్మ స్థైర్యంతో ఎలా నిలబడాలో చెప్పే  ‘అన్నయ్ గారు’
కథ..ఇలా పన్నెండు వైవిధ్యమైన అంశాలతో వాక్యాల వెంట కళ్ళను పరుగులు తీయిస్తూ సమాజ పోకడను చూపిస్తూ, మనిషిగా.. స్త్రీగా మనం ఏం చేయాలో స్పష్ట పరుస్తూ రాసిన కథలు ఇవి.
 ఇందులో ఈ కథా సంపుటి శీర్షిక అయిన జేబు కథను చూద్దాం.. ఉద్యోగం చేస్తున్నా తాను సంపాదించే జీతం మీద తనకెలాంటి హక్కులేక, ఏటీఎం కార్డు భర్త జేబులో ఉన్న  స్త్రీల గురించి.. వాళ్ళు ఏం చేయాలో చెప్పకనే చెప్పిన కథ ఇది. అతి సాధారణ స్త్రీ తాను జేబు కావాలని ఎందుకు కోరుకుందో  తాను జోబి రమణమ్మగా అదేనండి జేబు రమణమ్మగా ఎలా మారిందో చదువుతుంటే మనలో చాలామంది స్త్రీలకు ఆమె పాత్ర పట్ల ఆరాధనా భావం పెరుగుతుంది.అవును ఈనాటికీ  వేలు, లక్షల్లో సంపాదిస్తున్నా ఆర్థిక స్వాతంత్య్రం లేని మహిళలు కోకొల్లలు.కుటంబ పరువు కోసమో, పిల్లల కోసమో , భర్తతో గొడవలు కొని తెచ్చుకోవడం ఎందుకని.. సర్దుకు పోతున్న స్త్రీలు ఎందరో.ఎంతమంది తమ ఆర్థిక హక్కులను కోల్పోతున్నారో.. వారందరికీ కథానాయిక రమణమ్మే.
భార్యలకు వచ్చిన కూలి డబ్బులను భర్తలు వసూలు చేసుకోవడం.. తమకు ఇష్టమైన చీరో రెవికో కొనుక్కో లేని అస్వతంత్రత వారిది.అలాంటి వారికి రమణమ్మ ఓ స్ఫూర్తి. ఆమె తన చేలో పని చేసిన ఆడకూలీలకు వాళ్ళ డబ్బులను ..మేస్త్రీలతో గొడవ పడి ఆ స్త్రీల చేతుల్లోనే పెట్టించేది.
అలాంటి రమణమ్మ భర్త పిసినారిస అనారోగ్యంతో మంచంలో ఉండి కూడా ఆర్థిక పెత్తనం అంతా తన చేతిమీంచే నడవాలనే మనిషి.ఏ ఖర్చుకైనా అతని ముందు చెయ్యి చాపి అడగాల్సిందే..
ఆమె మాటల్లో ..’ఈ పాల కేంద్రాలు, కోళ్ల ఫారాలు వచ్చి ఆడోళ్ల నోళ్ళలో దుమ్ము కొట్టాయి పంతులమ్మా’ అంటుంది.అవి రైతులకు లాభమే కదా అంటే ‘అవును అవి మగ రైతులకు లాభమే..మరి ఆడోళ్ళ సంగతి’ ఇంతకు ముందు గుడ్లు, కోళ్లు, నెయ్యి అమ్మి నాలుగు డబ్బులు దాచుకుని మొగోళ్ళ ముందు చేయి చాపకుండా గుడ్డా,పెడ్డా కొనుక్కునే వాళ్ళం. రొచ్చు,రొష్టు కష్టం అంతా ఆడవాళ్ళది.. డబ్బు అందుకునేది మగవాళ్ళు” అంటూ స్త్రీ కుటుంబం లో ఎంత శ్రమ దోపిడికి గురవుతుందో.. ఆర్థిక స్వాతంత్య్రం లేక ఎంత విలవిలలాడుతుందో  ఆమె మాటల ద్వారా అర్థమై బాధ కలుగుతుంది. అలాంటి ఆమె బంగారం కొనుక్కోవాలని ఎందుకు కోరుకుంది.?. ఆమె  ఆ వూరి ఆడవాళ్ళకు ఎందుకు ఆత్మీయురాలు అయ్యింది?
తన కోడలుకు చెప్పిన మంచి మాటలు ..ఆమె ప్రాణానికి ఎలాంటి ముప్పు తెచ్చాయి..? వాళ్ళింట్లో అద్దెకు ఉన్న పంతులమ్మ ఆమెకు వారసురాలిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంది… ఇవన్నీ తెలుసుకోవాలంటే పాటిబండ్ల రజని గారి జేబు కథ తప్పకుండా చదవాల్సిందే. 
మరో కథ..
పొద్దున్నే లేచినప్పటి నుండి భగవన్నామస్మరణ చేస్తూ గుళ్ళో అర్చకుడిగా పనిచేసే అతడిలో నందివర్ధనాల స్వచ్ఛతను, నిలువెత్తు ధ్వజస్తంభంలా ఉన్న అతనిలో నిద్ర గన్నేరు సౌకుమార్యం ఉంటుందని మనసు గోడల మీద అందమైన ఆశలు చిత్రించుకున్న  ఆమె.. నిమిత్త మాత్రురాలిగా  నిర్లిప్తంగా ఉండటానికి ఎంత ప్రయత్నించినా.. కథలు కథలుగా ఆమె కన్న కలలన్నీ కుళ్ళు కొబ్బరి కాయలా బద్దలైపోయి శిథిల శిల అయిపోయిన గాయత్రి తన భర్త రామ శాస్త్రి ని  అక్కడ సత్యనారాయణ వ్రతం చేయించుకోవడానికి వచ్చిన దంపతులకు …సత్యనారాయణ వ్రతం అంటే ఏమిటో ఎరుక పరిచి తాను తీసుకున్న నిర్ణయం ..వేసిన అడుగు అక్కడున్న వారందరినీ నిశ్చేష్టులను చేసిన కథ ‘సత్యవ్రతం’ ఎన్నో కలలతో  కాపురానికి వచ్చిన గాయత్రిని భర్త ప్రవర్తన, వ్యాపార ధోరణి  ఎంతగా కదిలించాయో .. అనేక రకాల దోషాలంటూ భక్తుల భయాలు నమ్మకాలను సత్యనారాయణ వ్రతం పేరుతో దోచుకున్నా .. ఏమీ అనలేని నిస్సహాయతతో భరిస్తుంది. తన వేలికి ఉన్న ఉంగరంలోంచి ఊడిన నీలం రాయిని పెట్టించమని ఇస్తే ఆ రాయికి మహిమ ఆపాదించి అమ్ముకోవడం ఆమెను కలచివేస్తుంది. భర్త అధికారం ఆధిపత్యంతో నోరు మూయిస్తుంటే కన్నవారికి చెప్పుకొని ఉపశమనం పొందేందుకు వెళితే అక్కడా చుక్కెదురే.. తండ్రి అల్లుడి ఘనతను గొప్పగా చెప్పుకోవడంతో.. ఎక్కడా ఇమడలేని ఏకాకి తనంతో తిరిగి వస్తుంది గాయత్రి. ఇలాంటివెన్ని జరిగిన సహిస్తున్న గాయత్రి ….కొడుక్కి జ్వరం వస్తే కూడా పట్టించుకోని భర్తను.. కొడుకు మీద ప్రేమ ఉన్నా అంత కంటే ఎక్కువగా డబ్బు మీద ఉన్న ప్రేమతో జ్వరంతో కాలిపోతున్న కొడుకును హాస్పిటల్ కు తీసుకుపోవడం మానేసి సత్యనారాయణ వ్రతాన్ని చేయిస్తున్న భర్తను ఎదిరించి ఎలాంటి నిర్ణయం తీసుకుంది?..  .. అసలు కథలో అంతరార్థం ఏమిటి? వ్రతం అంటే ఆచరణ కదా మరి దేన్ని మానవుడు ఆచరించాలి.. శుక శౌనకాది మునులు చెప్పిన అసలైన ధర్మ సూక్ష్మం తెలుసుకున్న ఆమె  .. సామూహిక వ్రతం చేస్తున్న పందిరి కింద చేయిస్తున్న పురోహితుల వేదిక మీద ఉన్న మైకు అందుకొని చెప్పిన విషయాలు.. సత్యమే నారాయణునిగా నమ్మి సత్య మార్గంలో నడిచి ఆ వ్రత ఫలాన్ని ఎలా పంచాడో ఆలోచించమని.. తాను చెప్పదలచుకున్న దాన్ని తడబాటు లేకుండా నిర్భయంగా చెప్పి కొడుకును భుజాన వేసుకుని బయటకు నడుస్తుంది గాయత్రి.. ఆమెతో ఎవ్వరూ సాయంగా వెళ్ళడానికి రాకపోవచ్చు కానీ ‘ఆమె వెంట నారాయణుడున్నాడు. ఆమె నమ్మిన సత్యం రూపంలో..’
స్త్రీ అవసరమైనప్పుడు, తప్పని సరి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చెప్పిన ఈ కథ చదువుతున్నంత సేపు ఓ ఉత్కంఠ.ఆ గాయత్రి నిర్ణయం పట్ల ఓ ఆరాధన కలుగుతాయి.
 మరో కథ  ‘నాంతాడు’ ఉమ్మడి కుటుంబంలో అత్తా కోడళ్ళ మధ్య ఉన్న ఒకేఒక్క బంగారు నాంతాడు కుటుంబ పరువుకూ, అవసరాలకు ఎలా ఉపయోగపడుతుందో.. వస్తువు కంటే కుటుంబ బంధాలు ఎంత ముఖ్యమో చెప్పే కథ ఇది.  అత్యంత లౌక్యంగా అత్తగా మారిన అమ్మమ్మ వ్యవహరించిన తీరు చదువుతుంటే… దిగువ మధ్యతరగతి కుటుంబంలో కనిపించే ఇలాంటి వాటిని గమనించి కథగా రాసిన రచయిత్రికి పాఠకులు హృదయపూర్వక అభినందనలు తెలుపక మానరు.
తన మెళ్ళోని నాంతాడు తీసి ముగ్గురు కోడండ్లకు దాన్ని తిప్పి. మూడో కోడలు మనవరాలు అవడంతో అసలు విషయానికి వచ్చేసరికి.. తాను బిడ్డకు పెట్టిన బంగారం పంపమని అల్లుడికి కబురు చేయడం.. దానికి ధీటుగా కూతురికి ఇచ్చిన పొలం పంటతో సహా అప్పజెప్పమని  అల్లుడు తిరకాసు పెట్టడంతో ముసలమ్మ  మరొక్కసారి ఆ ఊసు ఎత్తక పోవడం. చదువరులను ఆకర్షిస్తుంది. ఆ దెప్పిన తండ్రి దగ్గర  బంగారం ఉందా అంటే అది ఎప్పుడో బ్యాంకు వేలంలో ఖర్చయిపోతుంది.
ఆ నాంతాడు ఆ కుటుంబం అవసరాలకే కాదు ఇరుగు పొరుగు వాళ్ళ పెళ్ళి పేరంటాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటిది వాళ్ళింట్లో వచ్చిన సమస్యకు పరిష్కారంగా నాంతాడు నడిచెల్లి పోయింది.
దాని మీద ప్రేమ పెంచుకున్న చిన్న కోడలు స్వర్ణ  క్రిష్టియన్ మతంలో చేరి  ఒంటిమీద అలంకరణలతో పాటు బొట్టు కూడా తీసేస్తుంది. విమర్శించిన తోటి కోడలు రాధ పసుపమ్మిన డబ్బులతో నాంతాడు  చేయించమని భర్తను అడిగినందుకు చావ బాదుతాడు.ఆ దృశ్యం చూసిన స్వర్ణ మరో తోటి కోడలు వరలక్ష్మి .”గా నాంతాడు కోసం అన్ని దెబ్బలు తింటావే? ఆ మాయదారి తాళ్ళేకపోతే సత్తావా? …చచ్చిన్నాడు నాలిక మీద బెట్టేది’ చిన్నమే’ ..అని తనకు తోచిన వేదాంతంతో రాధను సమాధానపరుస్తుంది.
 ఇక స్వర్ణ  తాను వెళ్ళే చర్చిలో కూడా మెళ్ళో బంగారు గొలుసులను బట్టే వాళ్ళకు ఇచ్చే గౌరవం చూసి…
సమాజంలో మనిషిని బట్టి కాకుండా బాబు దర్పం చూపించే డబ్బుతోనే గుర్తింపు అని తెలుసుకున్న స్వర్ణ  చర్చీకి వెళ్ళకుండా ఇంట్లోనే ప్రార్థన చేసుకోవడం ఓ విశేషమైతే… ఆ సమయంలో స్వర్ణ పక్కన  తనూ ప్రార్థన చేసేందుకు కూర్చున్న తోటి కోడలు వర్లక్ష్మి  వెనుక చేరిన రాధకు…ఇంత కాలం తమ వాహనాలతో సహా తామూ బోల్డన్ని నగలు దిగేసుకున్న  దేవుళ్ళ పటాలకు అలవాటు పడ్డ ఆ కళ్ళకు అక్కడి దేవుడి పటం కొత్తగా ఉంది అంటూ  ఇచ్చిన చక్కని ముగింపు చాలా గొప్పగా ఉంటుంది.
ఇక ‘ఎక్ స్ట్రా గ్రోత్’ కథలో ఆమె ఎందుకు ఇలా అనుకుంటుంది. చలం !చలం !ఏం చెప్పాడు చలం ? స్త్రీల గురించి.. అలాంటి చలం మళ్ళీ పుడితే బాగుంటుందని ఎందుకు అనుకుంటుంది.. ‘ఇప్పుడు పురుషులకు శరీరం మాత్రమే ఉంది- దాంట్లో కొంచెం హృదయాన్ని నింపాలి . మేథస్సు మాత్రమే ఉంది- కొంచెం మమత నద్దాలి! కామం చాలా ఉంది- కొండంత ప్రేమ నింపాలి! ఈ మాటలు పదే పదే మననం చేసుకుంటూ ఆమె…
ఆడ జన్మ ఎత్తినందుకు .. ఆశల్ని,కలల్నీ,నవ్వుల్నీ ,
పరుగుల్నీ పూడ్చుకుని సరసరా పాకుతున్న చదువును సగానికి తుంచితే ఓర్చుకుని,ఉన్న మార్కులతో చిన్న ఉద్యోగం సంపాదించుకున్న ఆమె సంపాదనా పరురాలు కాబట్టే సగం కట్నానికే ఒప్పుకున్నారంటే.. అదే గొప్ప అదృష్టంగా భావించిన ఆమెను.. నీ జీతం చూసే చేసుకున్నదని కరెన్సీ నవ్వు కరకరమంటే సర్దుకు పోయింది. ఏ ఫిగరూ దొరకనపుడు జరిగే అర్థరాత్రి ఆక్రమణల కలత నిద్ర తెల్లారాక.. ఎయిడ్స్ వ్యాధి భయం మిన్నాగులా పీక పట్టుకుంటే… పుట్టింటికి వచ్చిన ఆమెను పరువు కోసమైనా ఓర్చకోమనే తల్లి… నిజమైన ప్రేమికుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని గాలించిన ఆమెకు అన్నీ చేదు అనుభవాలే.. ఎవరిని చూసినా మూణ్ణిమిషాల సరదా తీర్చుకోవాలని అనుకునే వారే తప్ప సహ జీవన సౌందర్య దర్శనం చేయగల ఒక్కడూ తారసపడడు… పిల్లల కోసం, పరువు కోసం ,అమ్మ కోసం, మర్యాద కోసం ఏళ్ల తరబడి బలవంతాన అణుచుకున్న భావ పరంపరల ప్రతిరూపం ఈ ‘ఎక్ స్ట్రా గ్రోత్’ మెడమీద చిన్న చిన్న కాయలు గుత్తులు గుత్తులుగా.. అల్లోపతి
డాక్టర్ ను అడిగితే మెటాన్యూరో ఫైబ్రోసిస్ అని, ఆయుర్వేదం లో ధుర్మాంస ఖండ ఎదుగుదల అనీ, హోమియోపతి లో..ఎక్ స్ట్రా వార్టీ గ్రోత్స్ అని రకరకాల పేర్లతో చెబుతుంటే బాధ పడుతున్న తనపై.. కట్టుకున్న పతిలో.. చిందులు తొక్కే అసహ్యం…
మెడ,దవడ చెవి వెనుక.. వదిలించుకోవడానికి వీలు పడకుండా.. అచ్చం గా ఇది మొగుడి టైపే అనుకుంటూ.. ఇదంతా తన మంచికే.ఇప్పుడు అర్థరాత్రి ఒంటరిగా రోడ్డు మీద నడవగలదు. ఇక తనను చూసి జడుసుకునే వాడు తప్ప అల్లరి పెట్టేవాడు ఉండడని  సంబర పడుతూ అనుకున్న ఆమె మాటల్లో ఎంత దుఃఖం,ఎంత వైరాగ్యం మరెంత వేదన.. చదువుతుంటే కళ్ళు చెమరుస్తాయి. తను ఉపయోగించే  ‘ఫారిన్ ఫైబర్ దిండు బొత్తిగా తడి పీల్చట్లేదు! రేపు జీవిత కాలపు కన్నీళ్ళు పీల్చుకోగల మేడిన్ ఇండియా దిండు కొనాలి!’ ..ఈ వాక్యాలు గుండెను మెలిపెడతాయి. హృదయం బరువెక్కేలా చేస్తాయి. 
మరో కథ
 కొండలు గుట్టలు తొలిచి నిర్మించిన  ఫ్యాక్టరీలు, రోడ్లను నిర్మించిన పర్యావరణ నాశకులను గురించి నిరసిస్తూ.. వాటితో మనిషికి ఉన్న అనుబంధం గురించి మూడు తరాల మధ్య… సంభాషణా రూపంలో ప్రస్తుత కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ రాసిన కథ ‘వేదాద్రి’. ఇందులో తండ్రి తన కొడుకుతో నెమరేసుకుంటున్న బాల్యాన్ని గమనించి తన బాధ్యత ఏమిటో గుర్తెరిన ‌‌.. కొడుకు
తండ్రి గుండెల మీద వేదనాద్రిని తొలగించిన  కథ ఇది.  ఇంకా ఇందులో ‘గోగ్రహణం-2004’ కథ.. తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో..మరి అది తీరక పోవడానికి కారణమేమిటో చెప్పే ‘పున్నామ నరకం’ కథ.. ఆడపిల్లను పరాయి పిల్లగా భావించే తల్లితండ్రుల మానసిక స్థితిని చెప్పే..’పాయితోలే మనుషులు’ కథ…  ఆడవారి పేరున రిజర్వేషన్ అయిన పదవి కోసం భార్యను నిలబెట్టి పెత్తనం చెలాయించాలనుకునే  మగవారి ఆలోచనలకు అద్దం పట్టే కథ ‘బరి’. ఇలా పన్నెండు ఆణిముత్యాల్లాంటి కథలతో కూడిన సంపుటి ‘జేబు’.ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. తరాలు మారుతున్నా ఇంకా మారని మనుష్యులకు  చురకలే ఈ కథలు. మహిళలకు ప్రేరణ కలిగిస్తూ, సామాజిక బాధ్యతను గుర్తు ఎరిగిన రచయిత్రి వారు.  వారి కలం నుండి…చైతన్య పరిచే  ఇలాంటి కథలు మరెన్నో రావాలని కోరుకుందాం. ఇంత మంచి కథలను సమాజానికి అందించి, జేబు క్రింది గుండె చప్పుడు అంటూ తాను రాయడానికి కారకులు, ప్రోత్సాహకులకు కృతజ్ఞతలు తెలియజేసిన పాటిబండ్ల రజని గారికి మరొక్కసారి హృదయ పూర్వక అభినందనలు తెలియజేద్దాం.
 
*****
పుస్తకం పేరు: జేబు కథలు (కథల సంపుటి)
రచయిత:పాటిబండ్ల రజని
ప్రచురించిన సంవత్సరం: జూన్ 2004
వెల:40/రూ
ప్రతులకు:-
పి.రజనీ,
C/oపి.సీతాపతి రావు
శాంతి నగర్, తిరువూరు
విశాలాంధ్ర-అన్ని బ్రాంచీలు
నవోదయ బుక్ హౌస్
కాచీగూడ, హైదరాబాద్
నవోదయ పబ్లిషర్స్
ఏలూరు రోడ్, విజయవాడ
ప్రజాశక్తి బుక్ హౌస్
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.