నిష్కల – 4

– శాంతి ప్రబోధ

పుట్టింట్లో నలుగురు అన్నల ముద్దుల చెల్లెలు సుగుణమ్మ.  ఆమెను బాగా గారాభం చేసింది మాత్రం ఆమె తండ్రి, పెద్దన్న రాజారాం.  
దీంతో రాను రాను సుగుణమ్మ చాలా అహంభావి గా మారిపోయింది.  
సుగుణమ్మ ఇంట్లో సర్వాధికారం ఆమెదే.  భర్త సాధు స్వభావి.  
పెళ్లయిన మొదట్లో అత్తమామల మధ్య ఉన్న సుగుణమ్మ లోని అహం అడకత్తెరలో  పోకచెక్కలా 
పెళ్ళైన మొదట్లో భర్త మెతకదనం కనిపెట్టిన ఆమె అతన్ని ఏనాడూ మాట్లాడ నిచ్చేది కాదు, ఏ విషయంలోనూ గెలవ నిచ్చేది కాదు.  
.  
భార్య మనస్తత్వం తెలుసుకున్న అతను ఆమె తాన అంటే తందాన అనడం అలవాటు చేసుకున్నాడు. 
జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలంటే అలా ఉండడమే మంచిదనుకుంటాడు. లేదంటే ఇంట్లో ప్రతిరోజూ ఘర్షణ. ప్రశాంతత కరువైపోతుంది.  తానే తగ్గి ఉండటం అలవాటు చేసుకున్నాడు.

భర్తకు, కొడుకుకు  కనీసం మాట చెప్పకుండా అన్న కూతురిని కోడలిగా చేసుకుంటానని కొడుకు చిన్నప్పుడు అన్న దగ్గర మాట తీసుకొచ్చింది ఆమె.

అన్న బిడ్డను చేసుకుంటే అన్న ఆస్తిపాస్తులన్నీ తనకు కలిసి వస్తాయి అనుకుంది. 
చారడేసి కళ్ళతో అందంగా ఉన్న శోభ పుట్టినప్పుడు తన కొడుకుకు  చేసుకుంటా అని అందరికీ చెప్పేది.
పిల్లలు చిన్నవాళ్లు. పిల్లలు పెరిగినప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే అన్నాడు అన్న.
ఉహు .. , అట్లా కుదరదు.  నువ్వు మాటివ్వాల్సిందే.  నీ  బిడ్డను నా యింటికే కోడలిగా పంపిస్తానని అంటూ మారాం చేసింది సుగుణమ్మ.
చెల్లెలంటే ఆ అన్నకు అమిత ప్రేమ.  తన చేతుల్లో పెరిగిన పిల్ల.  చిన్నతనంలోనే పెళ్లి చేసి అత్తారింటికి పంపినప్పటికీ అన్న దగ్గర గారాలు పోవడం, మారాము చేయడం మాత్రం పోలేదు సుగుణమ్మకు.
చెల్లిని చూసి మనసులోనే నవ్వుకున్న రాజారాం, చెల్లి ని సంతృప్తి పరుస్తూ అలాగే లేవే అన్నాడు. 
సుగుణమ్మ కొడుకు సుధాకర్ ఎప్పుడూ శోభని ఎత్తుకుని తిరిగేవాడు. ఇద్దరికీ తొమ్మిదేళ్లు తేడా.
పిల్ల పుట్టినప్పటి నుండి రాజారాం పట్టిందల్లా బంగారమైంది .
ఆస్తి అంతస్తు పెరిగిపోతున్నది.  గ్రామ సర్పంచ్ నుంచి  తమ నియోజక వర్గ శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రోజు రోజుకీ అందనంత ఎత్తులోకి ఎదిగి పోతున్నాడు. 
ఇక తన కొడుక్కి కూతుర్ని చెయ్యడేమోననే భయం సుగుణమ్మ లో మొదలైంది.
ఎలాగైనా అన్నతో సఖ్యత నెరపుతూ ఆ ఇంటి పిల్లని తన ఇంటి కోడల్ని చేసుకుంటే కోరినంత కట్నం, అందమైన పిల్ల  తమ పరమవుతునాయి. అన్న అండదండలు పుష్కలంగా ఉంటాయి అని ఆలోచన చేసేది సుగుణమ్మ. 
ఊళ్ళో ఉన్న తాతలనాటి ఇల్లు చూడడానికి పెద్దదే. మండువా ఇల్లు . జీర్ణ దశలో ఉన్న ఆ ఇల్లు ఇవ్వాళో రేపో అన్నట్టుంది.  ఆ ఇంటిని సుగుణమ్మ మామలు నలుగురు పంచుకున్నారు.  వాళ్ళ మామ నుంచి ఆయన ఇద్దరు కొడుకులకు వారసత్వంగా వచ్చింది .  నలుగురు సంతానం ఉన్న సుగుణమ్మ కుటుంబానికి ఆ ఇల్లు సరిపోవడం లేదు.  ఎటూ కాకుండా ఉన్న ఆ ఇల్లు సుగుణమ్మకి అసలు నచ్చడం లేదు . 
అన్న ఇంటికి వెళ్లి వచ్చినప్పుడల్లా తన ఇంటిని చూసుకొని మరింత బాధ పడిపోయేది.  
 
 ఉండడానికి సరైన ఇల్లు ఏర్పరచుకోవాలని కోరిక ఆమెలో రోజు రోజుకు పెరిగి పోతున్నది.
 
చెప్పుకోవడానికి డెబ్భై ఎకరాలు ఉన్నా అందులో పండేది పదెకరాలు కూడా లేదు .
ఆమె భర్త కష్టజీవి . భూమి తనఖా బ్యాంకు లో లోను పెట్టి మెట్టభూముల్ని మాగాణులుగా మార్చే ప్రయత్నం చేసాడు .  కాలువ నీళ్ళు వస్తే తన డెబ్బై ఎకరాల్లో బంగారం పండిస్తానని కలలు కన్న రైతు .  కాలువ నీళ్లు తమ దాకా రాలేదు .  మొదట్లో ఉన్న బావిలో బోర్లు వేశాడు. అవి ఎత్తేశాయి . గొట్టపు బావులు తవ్వాడు . కొన్ని నీళ్లు పడీ పడక ,   కొత్తరకం హై బ్రీడు విత్తనాలతో పాటు వచ్చిన కొత్త కొత్త ఎరువులు , పురుగు మందులు . తడిసిమోపెడైన వ్యవసాయపు ఖర్చు ..
 పెరిగిన  అప్పులు ..
పండే పంటకి అయ్యే పెట్టుబడికి పొంతన లేదు . ఎప్పుడూ నష్టమే .
భర్తకు వ్యవసాయం తప్ప మరో పని తెలియదు .  ఎంతసేపూ చేను ,
అలాగే చేసుకొచ్చాడు .  ఏదో పూట గడుస్తున్నది . కానీ ఎదుగూ బొదుగూ లేని జీవితం.
నాకేంటి రత్న మాణిక్యాల  లాంటి ముగ్గురు కొడుకులు. ముత్యమంటి కూతురు అని గర్వపడే సుగుణమ్మలో ఎదుగుతున్న పిల్లల చదువు లెట్లా అని దిగులు మొదలైంది.

పెద్ద కొడుకు ఇంజినీరింగ్ చదువుతానంటున్నాడు.  అంత ఖర్చు చేసే తాహతు తమకు ఎక్కడిది ..  సుధాకర్ వెనక ప్రభాకర్ , రవీందర్  ఆ వెనక సరళ ఉన్నారు . వాళ్ళ చదువు కూడా చూడాలి.

అన్న దగ్గరకు వెళ్లి మొర పెట్టుకుంది .
ఎట్లాగూ నా అల్లుడేగా .. ఆ చదువు ఖర్చు నేను పెట్టుకుంటాలే అన్నాడు శోభ తండ్రి రఘురామ్.
సుధాకర్ మెరిట్  స్టూడెంట్
మంచి మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.  తర్వాత గేట్ రాసి ఐఐటీ లో ఎంటెక్ చదివాడు. మేనమామ ఆర్థిక సహకారం వల్ల సుధాకర్ ఎక్కడ ఇబ్బంది పడలేదు .  సుధాకర్ తో పాటు అతని తమ్ముళ్ల చదువుకి కూడా అవసరమైన సహకారం అందిస్తున్నాడు రఘురామ్.
వాళ్ళు తన మేనల్లుళ్లు. రేపు తన కూతురు ఆ ఇంటికి వెళ్తుంది .  తన హోదాకు తగ్గట్టు ఆ ఇల్లు , ఇంటి వాళ్ళు ఉండాలి కదా అని ఆలోచించేవాడు రఘురామ్ .
రఘురామ్ భార్య స్వరూప ఏనాడు నోరు విప్పి తన అభిప్రాయం చెప్పేది కాదు .
భర్త ఎంత అంటే అంత .  ఆవిడ ఎప్పుడు పూజలు , పునస్కారాలల్లో మునిగి తేలేది .
సుధాకర్ సింగపూర్ లో ఉద్యోగం వచ్చి అక్కడికి వెళ్ళాడు.
పెళ్లి చేసుకు వెళ్ళమని గోల చేసింది సుగుణమ్మ . రఘురాం కూడా అదే మంచిదనిపించింది . కానీ మరో నాలుగు నెలల వరకు పెళ్లిళ్లు లేకపోవడంతో ఏమి అనలేకపోయారు .
పదో తరగతిలో ఉన్న శోభకి బావను చూస్తే సిగ్గు . మెలికలు తిరిగి పోయేది .  దొంగచాటుగా బావని చూసేది . అతని మాటలు వినేది . కానీ ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడేది కాదు .  సరళ, శోభ ఒక వయసు వాళ్ళు. ఇద్దరు పదవ తరగతిలో ఉన్నారు .
 సుధాకర్ మళ్ళీ వచ్చినప్పుడు పెళ్లి పెట్టుకుని అనుకున్నారు .
ఇదంతా పెద్దవాళ్ళ ఆలోచనలే కానీ , సుధాకర్ అవేమీ పట్టించుకోలేదు . సింగపూర్ వెళ్లే ఉత్సాహంలో ఉన్నాడు .  
 
పదో తరగతి అయిన తర్వాత ఇంట్లో ఉండి ఏం చేస్తుందని కరీంనగర్ లో ఆడపిల్లల హాస్టల్ లో ఉంచి కాలేజీలో చేర్చారు .  శోభ కి తోడుగా ఉంటుందని సరళని కూడా కాలేజీలో చేర్చి హాస్టల్ లో పెట్టాడు రఘురాం . 
అల్లుడు సింగపూర్ లో ఉన్నాడు . అమెరికా వెళ్లాలని ఆశ పడుతున్నాడు . ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు . అల్లుడు కి తగ్గట్టుగా కూతురు ఉండాలి . బయట దేశాల్లో మాట్లాడాలంటే ఇంగ్లీష్ అవసరం అని ఇంగ్లీష్ కోచింగ్ ఇప్పించాలనుకున్నాడు . 

త్వరలో ఎన్నికలు ఉండడం వల్ల , శోభకి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉండడం వల్ల అప్పటికప్పుడు పెళ్లి చేయడం కష్టమని అనుకున్నారు .

మరుసటి ఏడాది శోభ తన ఇంటి కోడలైనది .  అంత వరకే తన పాత్ర . 
కానీ తర్వాత జరిగిన దానికి తాను బాధ్యురాలు ఎలా అవుతుంది .  ఆ పిల్ల కాకికేం తెలుసు ఏదో సాగుతుంది అని మనవరాలిని తిట్టుకుంది . 
 
                                                                  ***                                                              
 
కూతురు జీవితంలోకి వచ్చిన అగాధం ఏమిటోనని ఆలోచనలతో ఉన్న శోభకి అకస్మాత్తుగా ఆ రోజు చూసొచ్చిన రైతు భార్య కావేరి కళ్లముందు మెదిలింది. 
 
డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉండగానే పెళ్లయిన కావేరి ఏడాదిన్నర గడిచేసరికి చంటి బిడ్డతో ఒంటరిదై పోయింది .. అందుకు బాధ్యులెవరు? 
బిడ్డడు కడుపులో పడిన ఆనందంతో ఉన్న సమయంలో, పుట్టబోయే సంతానం గురించి ఎన్నెన్నో ఊహలతో ఆనందంగా ఉన్న సమయంలో అనుకోని అతిథిగా వచ్చి పడింది లాక్ డౌన్. 
 
ఎంతో మంది ఉపాధిని  మింగేసింది.  అప్పటివరకూ సజావుగా సాగుతున్న కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చి చేరాయి.  చేతిలో చిల్లి గవ్వ లేక అగచాట్లు ఎక్కువయ్యాయి. కుటుంబ పోషణ బరువైంది. రోజు గడవడం కష్టమైంది.  
కావేరి కుటుంబం కూడా అందులో ఒకటైంది. 
అప్పు పుట్టడం కష్టమై పోతున్నది.  అటువంటి సమయంలో ఫోన్ లో వచ్చిన మెసేజ్  కావేరి భర్త లోకనాథ్ కి గొప్ప ఊరట నిచ్చింది.   ఎవరో ఏంటో తెలియకుండా అప్పు ఎలా ఇస్తాడని ఆశ్చర్యపోయాడు . 
సరిగ్గా అదే సమయంలో స్నేహితుడొకడు  లోన్ ఆప్ లో అప్పు తీసుకున్నట్లు తెలిసింది. ఆ యాప్ లోకనాథ్ కి ఆపద్భాంధవిలా కనిపించింది.  వడ్డీ ఎక్కువేమో నని వెనక ముందు చేశాడు . 
ఈ లోగా మరో ఆప్ నుండి ఫ్రీ లోన్ ప్రాసెస్ అని మెస్సేజ్.  అడగకుండానే వెంటపడి ఫ్రీ గా అప్పు ఇస్తామని వెంటపడుతున్నారని ఆశ్చర్యపోయాడు. ఏమీ కుదువ పెట్టకుండానే లోన్ ఇస్తానని వెంట పడుతున్నప్పుడు తీసుకుంటే నష్టమేమిటి .  తన అవసరం తీరుతుంది అని ఇక ఆలోచించకుండా అప్పు తీసుకున్నాడు. 
  
ఆన్లైన్ లోన్ ఆప్ కాష్ మామా  ద్వారా 5000 తీసుకుంటే 3, 800 మాత్రమే ఇచ్చారు. అదేమంటే వడ్డీ  ప్రాసెసింగ్ ఫీ కింద కట్ చేశామని అన్నారు.   వారం రోజుల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది,  లేదంటే ఓవరు డ్యూ చార్జీ ఉంటుందని చెప్పారు.
అయినా సరే లోకనాథ్ వెనుకాడలేదు. 
లోకనాథ్ లానే చాలామంది అంతంత వడ్డీ కట్టగలరా లేదా అని చూడకుండా లోన్ తీసుకోవడానికి ఒకరిని చూసి ఒకరు ఎగబడ్డారు. 
ప్రస్తుతం ఆ పూట గడిస్తే చాలు. ఎలాగో ఈ గడ్డుకాలాన్ని ఈదితే చాలు అనే ఆలోచన అతనితో ఆ అప్పు చేయించింది.  
దానికి తోడు భవిష్యత్ పై నమ్మకం ఉంది అతనికి.  చేతిలో డిగ్రీ ఉంది . పని చేసిన అనుభవం ఉంది. ఏదో ఒక ఉద్యోగం రేపటి రోజు దొరకకపోదు. తీసుకున్న అప్పు అణా పైసలతో సహా లెక్కకట్టి చెల్లించేస్తాడు అనే ధీమాతో ఉన్నాడు లోకనాథ్. 
 
కానీ, అనుకున్నట్టుగా జరగలేదు. కరోనా పోలేదు. ఉద్యోగం రాలేదు. చిన్న చితకా పనులు కూడా దొరకలేదు.  
తల్లిదండ్రులు ఇచ్చిన ఎకరం భూమిలో వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. పెట్టుబడికి చేతిలో చిల్లి గవ్వ లేదు. 
ఎలా..  ఏం చేయాలి?  అమ్మా నాన్నలను అడగలేక పోతున్నాడు.  ఇప్పటికే వాళ్ళు తన మీద చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళు చెప్పినట్లు మేనకోడల్ని పెళ్లి చేసుకోకుండా మతాంతర వివాహం, కులాంతర వివాహం చేసుకున్నాడని రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి చెయ్యి చాచ లేకపోయాడు లోకనాథ్ . 
 
మరో ఆలోచన లేకుండా మరొక ఆప్ లో ఇరవై వేలు లోన్ తీసుకున్నాడు.  సమయానికి తీర్చలేక పోవడం వల్ల దాన్ని మరొక లోన్ గా మార్చారు.   అప్పు మీద అప్పు . అప్పుల మీద మరో అప్పు.
ఒక అప్ లో లోన్ తీర్చడానికి మరో ఆప్ ధని ఇండియన్ బుల్ లోన్ ఆప్..  అవి తీర్చడానికి ఇష్ట రూపీ, అది తీర్చడానికి స్టార్ లోన్ అలా రకరకాల ఆప్ లలో చాలా లోన్ లు తీసుకున్నాడు .  రోజుకు 200 పెనాల్టీ వేస్తున్నారు ఒక్కో ఆప్ వాళ్ళు.    జలగ లాగా పీల్చుకు తినడం మొదలు పెట్టారు.  
టార్చర్ పెడుతున్నారు. తిడుతున్నారు. రోజు రోజుకి పెరిగిపోతు కొండచిలువలా చుట్టేస్తూ మెలి పెడుతున్న ఆ బాధల నుండి తప్పించుకోవడం కోసం ఉన్న ఎకరం పొలం అయిన కాడికి అమ్మేశాడు లోకనాథ్.   6 లక్షల పైనే చేసే పొలానికి మూడు లక్షలకే అమ్మేశాడు.  తీసుకున్న రుణం అసలు పోనూ ఇంకా బాకీ మిగిలే ఉంది . ఇదేంటి ఇంకా ఎందుకు అప్పు మిగిలిందో లోకనాథ్ కి అర్థం కాలేదు. చెల్లించని రుణాన్ని మరో రుణంగా మార్చేస్తూ , వడ్డీ మీద వడ్డీలు వేస్తూ నడ్డి విరగ్గొట్టారని అర్థం చేసుకున్నప్పటికీ జరగవలసిన నష్టం అంత జరిగిపోయింది.  
 
మిగిలిన రుణం తీర్చే మార్గం కనపడడం లేదు.  అది తీర్చలేదని రుణం ఇచ్చిన వాళ్ళు  మాట్లాడే భాష చాలా మనస్థాపానికి గురి చేసింది.
టెలీకాలర్ ద్వారా ఫోన్ చేసి పదే పదే అడిగేవారు
తర్వాతర్వాత బూతులు తిడుతూ స్నేహితులు , బంధువులు, కుటుంబ సభ్యులకు అందరికి ఫోన్ చేసి, మెసేజ్ చేసి  వేధిస్తున్నారు .
వాట్సాప్ లో లోకనాథ్ ఫోన్ లో ఉన్న నంబర్స్ తో ఒక గ్రూప్ చేశారు .  ఆ గ్రూప్ లో మా లోకనాథ్ ఫోటో పెట్టి పాన్ కార్డు , ఆధార్ కార్డు పెట్టి అందరికీ పంపించారు .
లోకనాథ్ మంచోడు కాదని , అతను అప్పు తీసుకుంటే తిరిగి ఇవ్వడని , మీరు ఇవ్వకండని రకరకాల మెసేజ్ లతో రచ్చ చేశారు .
    
అది చూసిన బంధుమిత్రుల మధ్య అవమానం మాములుగా తీసుకోలేక పోతున్నాడు. మరో వైపు నిండు నెలల భార్య. ఆమెను ఆసుపత్రిలో చేర్చాలి.  
నేను లేకపోతే ఆమె తల్లిదండ్రులు ఆమె బాధ్యత తీసుకుంటారేమో అనుకున్నాడు.  నిండు గర్భిణీ అయిన భార్య ఒడిలో తల పెట్టి రుణ ఆప్ ల వాళ్ళు సిగ్గు తీస్తున్నారని తన గోడు వెళ్లబోసుకున్నాడు.   పురిటికి పుట్టింటికి వెళ్లాలనిపిస్తే వెళ్ళమని చెప్పాడు.  ఆమె ససేమిరా వెళ్లనని చెప్పింది. 
కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న ప్రతి అమ్మాయి పేరు చెప్పి చండాలంగా మాట్లాడుతున్నారు. అది తెలిసి మరింత కుంగిపోయాడు లోకనాథ్.  
 
మరణం తప్ప మరో మార్గం లేదని భార్యని క్షమించమని కోరుతూ ఉత్తరం రాసి 
రుణ ఆప్ ల వేధింపులకు తట్టుకోలేక, ఆ విష వలయం నుంచి బయటకు రాలేక తానే బలయ్యాడు కావేరి భర్త.  
భర్త మరణం బిడ్డ జననం ఒకటే రోజు . ఏడవాలో సంతోషించాలో అర్థం కాని స్థితిలో కావేరి.  ఇరుగు పొరుగు సహాయంతో పురుడు పోసుకున్న  కావేరి బాధల ముందు తమ కష్టాలు ఏపాటివి .. తేలిగ్గా పరిష్కరించుకో గలవి . 
తాను ఒంటరి అయినప్పుడు తనకి తల్లిదండ్రులు  ఉన్నారు . అత్త మామ ఉన్నారు . ఆస్తి అంతస్తు ఉంది . కులం ఉంది మతం ఉంది .  
ఇప్పుడు తన కూతురికి చదువుంది . ఉద్యోగం ఉంది . తెలివితేటలున్నాయి .  ఒక సమస్య వస్తే వివిధ కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకునే విచక్షణ ఉంది .  
 
కానీ కావేరి.. నిషి కంటే చిన్నది .  ప్రేమ పేరుతో కులాంతర , మతాంతర వివాహం చేసుకుంది.  అయినవాళ్ళకి దూరమయింది .  ఇప్పుడు మొగుడు లేని తనం .. కొడుకుని దూరం చేసిందన్న అత్తమామల ఆరళ్ళు ఒకవైపు,  తల్లిదండ్రులను కాదని పోయిందిగా తగిన శాస్తి జరిగిందని పుట్టింటివాళ్ల శాపనార్ధాలు మరో వైపు మోస్తూ  ఈ అమాయకురాలు. 
నిరంతర అవమానాలే పాములై చుట్టుకుంటూ.. ఇకనుండి ఎంత మంది ఓరల్ రేపులు చేస్తారో ..  ఎంతమంది శీలాల లెక్కలు వేస్తారో .. 
ఆమెను బజార్ లో పెట్టి పురుషాహంకారం నిర్లజ్జగా ప్రదర్శించుకుంటారో .. 
 
కావేరి భర్త చనిపోయినప్పుడు కాదు, ఇప్పుడు దిగజారుతున్న మనుషుల ప్రవర్తనతో చచ్చిన శవంలా మారుతుంది , భర్త మరణం చేసిన గాయం కంటే తోటి వాళ్ళు చేసే అవమానాలు , గాయాలు ఎంత కుంగదీస్తాయో ..  ఇంటాబయటా .. ఆ మానసిక క్షోభ .. ఎట్లా తట్టుకుంటుందో .. 
 
మనిషిగా బ్రతకడం తెలియని వాళ్ళకి తోటి మనిషిని గౌరవించడం ఏం తెలుస్తుంది? . 
మొరుగుళ్లు పట్టించుకోకుండా కర్ర తీసుకుని అదిలించుకుంటూ ముందుకు నడవ గల స్థైర్యం కావేరికి ఉందా ..!
నడి సముద్రంలో ఉన్నది. ఒడ్డుకి చేరాలి. అది ఆమె మాత్రమే చేయగలదు.  ఆ ప్రయత్నంలో ఎన్నెన్ని ఆటు పోట్లో .. తప్పదు ఆ ఆటు పోట్లకు ఎదురీదాలి. ఆ మధ్యలో వచ్చి ఢీ కొనే విష పురుగులు ఎన్నో కాటేయడానికి కాచుకు కూర్చుంటాయి .  అమాంతం మింగేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.  ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి లాగే వాళ్ళు,  తాటాకు చప్పుళ్ళు చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. మానసికంగా  చంపే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో కావేరి ఏం చేస్తుంది? బతుకు నావను ఒడ్డుకు చేర్చగలుగుతుందా .. లేక భర్త బాటనే ఎంచుకుంటుందా?  
అయ్యో .. చచ్చిపోతే ఎలా .. పసి బిడ్డ పరిస్థితి ?!
నో .. కావేరి నో ..అలా జరగడానికి వీల్లేదు గత రెండు రోజులుగా కావేరి జీవితం గురించి ఆలోచిస్తున్న శోభ అనుకుంది. 
కావేరీ.. నువ్వు సిగ్గులేని మనుషుల్ని నిగ్గదీసి అడగాలి. 
జీవచ్ఛవాల్లా కళ్లప్పగించి చూస్తున్న వాళ్ళని అగ్గితోటి కడగాలి. 
ఇబ్బంది పెడితే తోలు తీయడం మానకు.   నీ వల్ల కాకపోతే నాతో చెప్పు. మేం చూసుకుంటాం అని ధైర్యం చెప్పాలి.  
తరాలు మారుతున్నాయి. తలరాతలు మాత్రం మారడం లేదు అన్న ఆలోచనలో శోభ. 

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.