జీన్స్ ప్యాంటు లో ఐఫోన్

(‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ)

-వడలి లక్ష్మీనాథ్

“రోజంతా బాగున్నారు కదా! తీరా 

బయలుదేరే ముందు ఏంటా పిచ్చి నడక. నడవలేనట్టు ఇబ్బందిగా” అంది పంకజం, అందరి వీడ్కోలు అయి కారు బయలుదేరాకా.

“అమ్మాయి పంపిందని ఆ జీన్స్ ప్యాంటు వేసుకున్నాను. కానీ, అడుగు తీసి అడుగుపడలేదే పంకజం” వాపోయాడు పరంధామయ్య.

“కొత్త బట్టలు ఇవ్వగానే, పూల రంగడిలా వేసుకొని, కొత్త ఐఫోనుతో ఫోటోలు తీసుకొని, అమ్మాయికి పంపినప్పుడు బాగానే ఉన్నారు కదా! బయలుదేరే ముందు ఏమయ్యింది” అడిగింది పంకజం. 

“నిన్న ఫోటోకని వేసుకున్నప్పుడు, కొంచం సేపేగా..

 తెలియలేదు. ఈరోజు భోజనాలయ్యి బయలుదేరేముందు, పంచ మార్చి కట్టుకున్నప్పుడు పడిన ఇబ్బంది అబ్బో” అన్నాడు. 

“అమ్మాయి ఆడపడుచు ఇల్లని  మొహమ్మాటానికి పెట్టినవన్నీ  తిన్నారు. కూతురు పంపిందని ఆ అమెరికా చాక్లెట్లు తెగ తిన్నారు. కూతురు పంపిన జీన్స్ ప్యాంటు, ఐఫోన్ చూసుకొని మురిసిపోయి ఆనందంతో ఒళ్ళు పొంగి పోయినట్టుంది” అంది మూతి తిప్పుతూ. 

“ఏంటోనే పంకజం! ప్యాంటు తెగ ఇబ్బంది పెడుతోంది” అన్నాడు.

“బడాయి కాకపోతే మరీను, మీకెప్పుడన్నా ఈ జీన్స్ ప్యాంటు వేసుకోవడం అలవాటుందా?” బుగ్గ నొక్కుకుంది పంకజం. 

“నీకెందుకంత ఈర్ష్య, అమ్మాయికి చెప్పి ఈసారి నీకూ ఓ జీన్స్ ప్యాంటు తీప్పిస్తాలే” నవ్వుతున్నాడు పరంధామయ్య. ఆ నవ్వు కూడా బాధతో కూడుకున్నట్టుంది. 

“అవ్వ! ఎవరైనా వింటే నవ్విపోతారు” అంటూ సిగ్గుపడింది పంకజం.

“అమ్మాయికి అమెరికా సంబంధం అన్నప్పుడే జీన్స్  కొనుకొందామనుకొన్నాను. అందరూ నవ్వుతారని కొనలేదు. నా కూతురు కదా! నా మనసులోని మాటను కనిపెట్టినట్టు, నాకు  కొని పంపించింది” కూతురిని తలచుకుని మురిసిపోయాడు.

“ఏమైనా పిల్లలు అమెరికాలో ఉంటే, ఆ ఇంట్లో వస్తువులే వేరుగా ఉంటాయండి. వాళ్ళ టీవీ చూడండి, నాజూకుగా హీరోయిన్ నడుములా వుంది. దాని రిమోట్ అరచేతిలో ఇమిడిపోయేంత అందంగా చిన్నగా ఎలక  పిల్లలాగా ఉంది. అబ్బో ఏమి వైభోగమది” అంది పంకజం. 

“అన్నీ బాగున్నాయి కానీ, ఈ  జీన్స్ ప్యాంటుతో డ్రైవింగ్ మహా కష్టంగా వుంది. ఏమైనా మన  లూజ్  ప్యాంటులో ఉన్న సుఖం దీనిలో లేదే “అన్నాడు ఇబ్బందిగా డ్రైవ్ చేస్తూ. 

“వేసుకొని బయలుదేరకుండా ఉండాల్సిందిగా,

అయినా అరగంటలో ఇంటికి వెళ్లి పోతాముగా”అంది

“ఊరిలో నేను కారు దిగేప్పుడు  నలుగురు వచ్చి నన్ను చూసి ఈర్ష్య పడాలి. నా కూతురు అమెరికా నుండి  పంపిన జీన్స్ ప్యాంట్ చూసి, ముఖ్యంగా ఆ ఎదురింటి అరుగు మీద కూర్చుంటాడే కాముడు వాడికి తెలియాలి. రేపు అమెరికా వెళ్ళినప్పుడైనా ఈ ప్యాంట్ అలవాటు చేసుకోవాలిగా” అన్నాడు పెళ్ళాం వైపు కన్ను గీటుతూ. 

“ఆ చాల్లే బడాయి, ఆ కొత్త ఫోన్ పెట్టుకొన్నారా?” అడిగింది. 

“హా, ఇదిగో మర్చిపోకుండా పెట్టుకున్నాను” అంటూ షర్ట్ జేబులోనుండి తీసిచ్చాడు. తెల్లగా మెరిసిపోతున్న ఫోన్ ని చూసి మురిసిపోతూ. 

అటు ఇటు తిప్పి చూసి “నాకు ఎలా వాడాలో కూడా తెలియట్లేదు. మన నోకియాలా లేదుగా ” అంది.

“అయ్యో! దాన్ని అలా వాడకూడదు. అసలే

 అమెరికా ఫోను. దాన్ని నువ్వు ఏమీ చెయ్యకు. నీకు ఇంటికెళ్ళేకా నేర్పిస్తాను” అంటూ తీసి మళ్ళీ జేబులో పెట్టుకొన్నాడు.

కొంత దూరం వెళ్ళేక “పంకజం ! ఒళ్ళంతా సలపరంగా వుంది. ఎందుకైనా మంచిది, చారీ డాక్టర్ ని రమ్మని కబురు చెయ్యాలి” అన్నాడు.

 “ఏదీ ఆ ఫోన్ లో ఒకసారి చారీ డాక్టర్ కి ఫోన్ కలిపి ఇవ్వండి. నేను మాట్లాడుతాను. మరో పది నిముషాల్లో ఇంట్లో ఉంటాం” అంది.

ఫోన్ తీసి ముందుకు వెనక్కి చూశాడు,”అప్పుడు అర్దం అయింది పంకజం!  ఇప్పుడు మర్చిపోయాను. ఈ ఫోన్ ఎలా వాడాలో” వాపోయాడు పరంధామయ్య.

“మీకు అన్నిటికీ తొందరే, ఇంటికి వచ్చాకా సిమ్ మార్చొచ్చు కదా” విసుక్కుంది పంకజం.

కారు ఇంటి ముందు ఆగేసరికి  పరంధామయ్యకి ఆయాసం వస్తోంది. కారు  అయితే ఆపాడు కానీ, మనిషి లేవలేని స్థితి. కాళ్ళు కదపలేకపోతున్నాడు. 

పరంధామయ్య పరిస్థితిని చూసి ఎదురింటి అరుగు మీద కూర్చున్న కాముడు పరుగు పరుగున ఇంట్లో ఉన్న కుర్రాళ్ళతో సహావచ్చి, ఎత్తి లోపల పడుకో పెట్టారు.

అప్పుడే ఆ వీధి గుండా వెళ్తున్న చారీ డాక్టర్ ఈ హడావుడి చూసి లోపలికి వచ్చాడు.

“అందరూ బయటకు వెళ్ళండి” అంటూ పరంధామయ్యని పరీక్షించి, తలుపు తీసి పంకజంతో “అమ్మా ఇంట్లో కత్తెర ఉంటే తీసుకొని రండి “అన్నాడు 

పరంధామయ్య ప్రాధేయపడుతున్నాడు” అది కొత్త ప్యాంటు, కూతురు పంపింది. ఎన్నో రోజుల కోరిక జీన్స్ ప్యాంటు తొడుక్కోవాలని” అని .

“తప్పదు కాళ్లు వాచిపోయి, ప్యాంటు ఇరుక్కుపోయింది. రక్త ప్రసరణ ఆగిపోయింది.  కత్తిరించి తీయాల్సిందే” అంటూ పంకజం చేతిలోని కత్తెర తీసుకొని తన చేతికి పని చెప్పాడు. 

అప్పుడే ఇంటి ముందు కారు ఆగింది. కారులోంచి దిగిన కూతురు ఆడపడుచు అనూష “మావయ్య గారు మీరు బయలుదేరాకా, నేను బయటకు వెళదామని నా ప్యాంటు చూసుకుంటే కనపడలేదు. అదే కొక్కానికి మీప్యాంటు ఫోన్ తో  సహా  పెట్టి మా ఇంట్లోనే మరిచిపోయారు. నా ప్యాంటు తీసుకొని మీ ప్యాంటు, ఫోన్ ఇవ్వడానికి వచ్చాను” అంది. 

“నా ఫోన్  నేను తెచ్చుకున్నాను. ఇదిగో ఎందువల్లనో పని చెయ్యట్లేదు” అన్నాడు పరంధామయ్య.

“అయ్యో రామా! అది మా స్మార్ట్ టీవీ రిమోట్. ఇల్లంతా వెతికాము, మీ దగ్గర వుందా? మరి నా ప్యాంటు సంగతి” అంది అనూష. 

దంపతులిద్దరూ తలదించుకొని  నీళ్లు నములుతున్నారు. కింద పడ్డ పీలికలు తన ప్యాంటువేనని చూసుకొన్న అనూష స్పృహ తప్పిపడిపోయింది.

****

Please follow and like us:

7 thoughts on “జీన్స్ ప్యాంటు లో ఐఫోన్ (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ)”

  1. తెన్నేటి శ్యామకృష్ణ, హైదరాబాద్
    ‘జీన్ ప్యాంటులో ఐ ఫోన్’ కథ ముగింపు చాలా నవ్వు తెప్పించింది. పరంధామయ్యగారి పరధ్యానం ఎంతపనిచేసింది! ‘కింద పడ్డ పీలికలు తన ప్యాంటువేనని చూసుకున్న అనూష స్పృహతప్పి పడిపోయింది ‘ అన్న ముగింపు వాక్యం చదివి పడి పడి నవ్వుకున్నాను.

  2. అమెరికా జినుపేంటు తెచ్చిన తంటా… మరి మనిషి గొప్పలకు పోయి సౌకర్యాన్ని కోల్పోతున్నాడు. కధ లో మనిషి నైజాన్ని చెపుతూనే కధ హాయిగా సాగింది రచయిత్రి కి అభినందనలు

  3. చాలా బాగుందండీ కధ. నేను ఒకసారి అలాగే, knee brace ఒకటి ఒక సైజు చిన్నది పెట్టుకుని, రక్త ప్రసరణ ఆగిపోవటమంటే ఎలా ఉంటుందో అనుభవించాను. వినటానికి నవ్వు గా ఉన్నా భరించినవాళ్ళకే తెలుసు ఆ నరకం.

    1. సూర్యకుమారి గారికి ధన్యవాదాలు.

  4. జీన్స్ ప్యాంట్లు ఈ ఫోన్ ‘ కథ హాయిగా జీన్స్ జీన్స్ ప్యాంట్లు ఐ ఫోన్ ‘ కథ హాయిగా చదువుకోతానికి చక్కగా ఉంది.ఎలాంటి టెన్షన్లు సమస్యలు లేకుండా easy going గా ఉంది. ఈ రోజుల్లో అమెరికా వస్తువులు సాధారణం ఐయిపాయినా ఒకప్పుడు అమెరికా వస్తువులు అంటే చాలా వ్యామోహం ఉండేది జనాల్లో. ప్రథమ బహుమతి పొందినందుకు రచయిత్రి కి అభనందనలు.

Leave a Reply to Vadali lakshminath Cancel reply

Your email address will not be published.