వెనుతిరగని వెన్నెల(భాగం-23)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-23)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన సంవత్సరం లోనే అబ్బాయి పుడతాడు. తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే చదువుతూ ఉంటుంది.

***

దేవి విశాఖపట్నం వెళ్ళొద్దనే సరికి  రోజంతా తన్మయికి తన జీవితమేమిటో తనకే అర్థం కాని అయోమయ పరిస్థితి పట్టుకుంది

ఎప్పటికప్పుడు తనెంత విధేయంగా ప్రవర్తిస్తూందో అంతకు అంతా శేఖర్, అతని తల్లిదండ్రులూ సమస్యలు తెచ్చి పెడ్తున్నారు

అసలు విశాఖపట్నమే వెళ్లొద్దనేంత తప్పు పని తనేం చేసింది? తనే ఒక సమస్యా వీళ్లకి?” 

ఒక పక్క  కుటుంబం  మన్ననలు పొందలేకపోతున్న బాధ. మరో పక్క శేఖర్ ప్రవర్తనతో పుట్టుకొస్తున్న  విసుగు. అన్నిటినించీ ఊరట నిస్తున్న ఒకే ఒక్క ఆధారంబాబు“.

ఒక్క క్షణం తన పక్కన  ఆద మరిచి నిద్రపోతున్న పసివాణ్ణి గట్టిగా హత్తుకుంది. విశాఖపట్నం తిరిగి వెళ్ళలేకపోతే ఎమ్మే ఇక ఆగిపోయినట్లే. తన జీవితానికి ఏదో ఒక త్రోవ దొరుకుందనే ఆశతో ఎన్నో కష్టాలకు ఓర్చి ఎమ్మే చదువుతూంది. నిద్దట్లో బుగ్గలు సొట్టలు పడేట్లు నవ్వుతున్న పసివాణ్ణి చూస్తూ, “నాన్నా! నాకు ధైర్యాన్ని ఇవ్వరా. అమ్మ చదువు తప్పకుండా పూర్తవుతుందని చెప్పు.” అంది. కళ్లు మూసుకుని ఏవేవో పెదవులు కదుపుతూ తనలో తను మాట్లాడుకుంటూ నిరాసక్తంగా నిద్దట్లోకి జారుకుంది.

తెల్లర గట్ల పక్కనే పరిచయమైన  శేఖర్ వొంటి వాసనకి ఉలిక్కి పడి లేచింది. తన్మయి మీదుగా ఒంగి బాబుని ముద్దాడుతున్నాడు.

తన్మయితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒంటి మీద చెయ్యి వేసేడు. మారు మాట్లాడకుండా ఒళ్లప్పగించింది. మనసులో సుళ్లు తిరుగుతున్న బాధ ముందు శరీరం బాధ చాలా చిన్నది.

అతను నిద్రకుపక్రమిస్తూండగా  “మనం వైజాగు ఎప్పుడు వెళ్తాం?” అంది.

ఏం? చదువు ములిగిపోతందా నీకు?” వెటకారంగా అని, “ వైజాగు కాదు. నెల్లూరులో బిజినెస్సు పనిబడింది నాకు. సాయంత్రం బండికి వెళ్దాం. బట్టలు సర్దుకో.” అన్నాడు.

వారంలో కాలేజీ తెరుస్తారు. ఇప్పుడు  మరెక్కడికో ప్రయాణం అంటే  కాలేజీ పోయినట్లే. అయినా తమాయించుకుని, “మరి అక్కడ ఉద్యోగం?” అంది.

అణా, కాణీ పోగేసే ఉద్యోగం ఉంటే ఏంటి? ఊడితే ఏంటి? దేవుడి దయ వల్ల యాపారం కుదురుకుంటే ఇలాటి ఉద్యోగాలు నేనే నలుగురికి ఇవ్వగలను.” అన్నాడు.

పొద్దున్నే దేవితన్మయినీ, పిల్లాణ్ణి ఒదిలెళ్ళరా…” అనేదో అనబోయింది.

నా కొడుకుని చూసి చాన్నాళ్లయ్యిపోయింది కదే  అమ్మా. పైగా అక్కడ హోటలు తిండికి  నాకు ఆరోగ్యం పాడయ్యి పోతంది. రానియ్యిలే.” అన్నాడు.

ఎన్నాళ్లు అనే ప్రశ్న కూడా అడిగే ఉత్సాహం కూడా లేదు తన్మయికి.

విశాఖపట్నం లో ఇల్లు ఉంచేడో, ఖాళీ చేసేసేడో  మాత్రం అడిగింది.

ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేస్తే మా బాసుకు అనుమానం రాదూ? ఎదవ తెలివి ఏడిసినట్టే ఉంది. అయినా నెల్లూరులో ఒప్పందం కుదరనీ మొదట.” అన్నాడు.

సాయంత్రం బండి ఎక్కి, తెల్లారగట్ల నెల్లూరులో దిగి, బస్సు ఎక్కేరు. అక్కణ్ణించి జీపులో కొంత దూరం. దాదాపు యాభై  ఇళ్లు ఉండే సముద్ర తీరపు బెస్త పల్లెకి  పదకొండు గంటల వేళకి చేరుకున్నారు.

ఏదో ఇంటి ముందు జీపు దిగే సరికి మధ్య వయసు ఆవిడ వచ్చి పలకరించింది. తెలుగు యాస మొదట అర్థం కాలేదు తన్మయికి.

శేఖర్ కి బయటే వాకిట్లో చిన్న నులక మంచం వాల్చి, అలిసిపోయి ముఖం పీక్కు పోయిన తన్మయినిభుజాన నిద్రపోతున్న పిల్లాడిని లోపలి గదిలోకి రమ్మని తీసుకెళ్లింది. అది ఒకే ఒక్క గది, వసారా ఉన్న గవర్నమెంటు కట్టిచ్చిన పేదల పథకానికి చెందిన ఇల్లులా ఉంది. కింద గచ్చులేదు.

బయట వాకిట్లో కూడా ఇసుకే ఉంది. సముద్రానికి దగ్గరగా ఉన్నట్లు హోరు వినిపిస్తూ ఉంది.

బాబుని పడుకోబెట్టమని లోపల చిన్న నవారు మంచమ్మీద బొంత వేసింది.

ఇంటి వెనక చిన్న దడి చూపించి బాత్రూముకి వెళ్లమని చెప్పింది. మూడు వైపులా  తాటాకుల దడి మధ్య  ఒక చిన్న రాతి పలక ఉంది. చుట్టూ కాళ్ల కింద ఇసుక.

ఒక మూలగా మరో చిన్న పలక మీద చిన్న ఎర్ర సబ్బు ముక్క ఉంది.

చుట్టూ సొట్టలుండి సన్నని రంధ్రం నించి నీళ్లు కారిపోతున్న  చెంబు, దాదాపు విరిగిపోతున్న డబ్బా రేకు బకెట్టు.

తన్మయి ముఖం కడుక్కుని వచ్చే సరికి ఇంటి ముందు వాకిట్లో  ఒక పక్కగా ఉన్న పొయ్యి ముందు కూచుని, పొగ ఊదుతూ కనబడింది ఇంటావిడ.

నీ మొగుడు ఎప్పుడొస్తాడు చెన్నమ్మా?” అన్నాడు శేఖర్.

సముద్రం వైపు చూపిస్తూరేత్తిరికిఅంది.

ఆవిడ దగ్గర్లో ఉన్న పీట మీద కూర్చుంటూనేను సాయం చెయ్యనా?” అంది తన్మయి.

మొహమాటంగా  “వద్దన్నట్లు తల అడ్డంగా ఆడిస్తూ తన్మయి వైపు నవ్వుతూ చూసింది.

గార పట్టిన పళ్లు. ఎప్పటి నుంచో తైల సంస్కారం లేనట్లు పీచు జుట్టు ముడి. మాసిపోయిన చీర.

చెన్నమ్మ ఎవరో, చెన్నమ్మ భర్త ఎవరో శేఖర్ ని అడిగే ఆసక్తి  లేదు తన్మయికి. అసలేదీ అడిగే ఆసక్తి  లేదు. తన జీవితం తన చేతుల్లో లేదు. తను అనుకున్నట్లు ఏదీ జరగదు

అసలు కాలేజీ తెరిచే సమయంలో తను ఇక్కడ ఏం చేస్తోంది? అసలిక్కడ నుంచి తిరిగి ఎప్పుడు విశాఖకు వెళ్లగలదు? ప్రశ్నకూ సమాధానం లేదు. అసలు తన జీవితం ఎటు పోతుందో తనకే తెలీదు

మనసులో మెదులుతున్న ఆలోచనలతో చెన్నమ్మ చేస్తూన్నది నిశ్శబ్దంగా చూడసాగింది తన్మయి.

చుట్టు పక్కల పిల్లలు ఇద్దరు ముగ్గురు వచ్చి వీళ్లని తొంగి చూసి పారిపోయారు.

అంతా పేదరికంలో మగ్గుతున్నట్లు వాళ్ల ఒంటి మీదఅరకొరగా వున్న బట్టలు, మాసిన ముఖాలు చూస్తే అర్థం అవుతున్నాయి.

శేఖర్ ఆమెతో పరిచయం ఉన్నట్లు మాట్లాడుతున్నాడంటే, ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి ఉండాలి.

ఎపుడూ ఎక్కడికీ తీసుకెళ్ళని తనని ఇక్కడికి ఊరికి అసలు ఎందుకు తీసుకు వచ్చాడో అర్థం కాలేదు.

నెల్లూరు అని చెప్పి తలుపూ ద్వార బంధంలేని బెస్త పల్లెకి తీసుకు వచ్చేడు శేఖర్

 అయోమయంగా ఎటో కొట్టుకొచ్చిన జీవితం. దూరంగా వినిపిస్తున్న సముద్ర తీరానికి చేరి ఇసుకలో చతిక్ల బడి ఆకాశాన్ని తాకే సముద్ర కెరటాల మీద వేళ్లాడే దిగంతం పగిలేలా అరిచి గట్టిగా ఏడవాలనుంది తన్మయికి

లోపలికి వచ్చి, బాబు పక్కన నడుం వాల్చి కళ్లు మూసుకుంది.

మరో గంటలో బాబు నిద్ర లేచేడు. తడి గుడ్డతో ఒళ్లు తుడిచి, సంచీ లోంచి శుభ్రమైన బట్టలు తీసి తొడిగింది. కింద వదిలే సరికి ఇంటి వాకిట్లో ఇసుకలో కూర్చుని, నెత్తి నిండా ఇసుక పోసుకున్నాడు.

సముద్రం హోరు వింటున్న కొలదీ సముద్రాన్ని చూడాలన్న ఉత్సుకత బాగా ఎక్కువ కాసాగింది తన్మయికి.

కడుపులో ఆకలి నకనక లాడుతూంది.

ఇంకో గంట వరకూ అక్కడ వంట తెమిలేటట్టు లేదు.

శేఖర్ ఎటో వెళ్ళడానికన్నట్లు పైకి లేచేడు.

తన్మయి కూడా లేచి నిలబడింది బాబునెత్తుకుని.

నువ్వుండు, నేనలా వెళ్లొస్తాను. సాయంత్రం టౌనుకి వెళ్లిపోదాంఅన్నాడు.

ఒక పక్క నించి వీస్తున్న విసురు గాలికి పొయ్యిలో మంట ఆరిపోయి ఇంటావిడ అవస్థ పడ్తూంది.

అన్నం అతి కష్టమ్మీద వండింది.

మూడు గుడ్లు భద్రంగా పట్టుకొచ్చి నీళ్లలో వేసింది.

తన్మయి ఆవిడ చేతుల్లో నుంచి కత్తిపీట అందుకుని ఉల్లిపాయలు గబగబా కోసింది.

పరిచయంగా పొయ్యి దగ్గిర కూచుని కట్టెలు ఎగదోసి పొయ్యి ఊదింది.

మాత్రానికే చాలా ప్రశంసా పూర్వకంగా చూసింది చెన్నమ్మ.

మీ కెందుకమ్మాఅంది.

పర్లేదులేఅని చిన్నగా నవ్వింది తన్మయి.

చెన్నమ్మ ఏవేవో చెప్తూ ఉంది

శేకర్ బాబు అప్పుడప్పుడూ వొస్తాడు మా ఆయిన కాడికి. సెముద్రం మీదికి ఇద్దురూ కలిసి కూడా పొయిన్రంట.”

ఎప్పుడూ మా బెస్త గూడెం లో మేం సేపలే తిందుముపట్నెం పిల్లవి నీకు గుడ్లయినా పెట్టమని  సెప్పి పొయినాడు మా ఆయిన.”

సెముద్రం మీద ఏట ఒక్కో పారి బాగా వచ్చుద్ది. ఒకో పారి పొయ్యుద్ది .”  

మీ వైపు రైళ్లు తిరుగునా? నేనొక్క పారి ఎక్కినా

మాకు పిల్లలు గాలే, పదేండ్లయ్యె పెండ్లయ్యి

ఏవిటేవిటో చెప్పుకెళ్లిపోతూంది చెన్నమ్మ.

అటూ ఇటూ ఇసుకలో దొర్లడానికి విదిలించుకుంటూన్న బాబుని ఒళ్లో కూచో బెట్టుకునే ప్రయత్నం చేస్తూ కష్టపడ్తున్న తన్మయి ఇక లాభం లేక వొదిలింది వాడిని.

పది నిమిషాలలో చుట్టుపక్కల పిల్లాడిలా తయారయ్యేడు.

శేఖర్ వచ్చే సమయానికి తన్మయి పొయ్యి ఊదుతూ ఉంది.

చెన్నమ్మ లోపలికి ఏదో పట్టుకు రావడానికి వెళ్లింది.

వస్తూనే చికాగ్గాఎక్కడికొస్తే అక్కడి వాళ్లతో కలిసిపోవడవేనా?, లేఅన్నాడు చికాగ్గా

బాబుని తీసి ఇసుక దులుపుతూఅలగా దానిలా నువ్వు పొయ్యి దగ్గిర తయారవ్వడం కాకుండా వీణ్ణి కూడా నీలాగే ట్రైనింగిస్తన్నావేంటే?” అని అరిచేడు.

తన్మయి ఆశ్చర్యపోయింది. డబ్బుల్లేని బెస్త పల్లెలో ఇంటామె  డబ్బులున్న అతని యజమాని భార్య కంటే గొప్ప ఆదరం చూపిస్తూంది. డబ్బుల్లేనంత మాత్రానఅలగా జనంఎలా అవుతారు వీళ్ళు? తన దృష్టిలో డబ్బు మనిషికి తిండి పెట్టే కాగితం మాత్రమే. మనుషులకు మధ్య అంతరాలు సృష్టించే అడ్డుగోడ కాదు.  

శేఖర్ తో అదే అనబోయి, అంతలోనే లోపలున్న చెన్నమ్మ ఏమనుకుంటుందో అని, ఒంగి చూస్తూ, చప్పున లేచొచ్చి బాబుని ఎత్తుకుని చీర చెంగుతో తుడిచి, నులక మంచమ్మీద ఒక వైపుగా మాట్లాడకుండా కూచుంది.

చెన్నమ్మ మాటలు విన్నదనుకుంటా. భోజనాలు లోపల వొడ్డించి గుమ్మం అవతల నిలబడింది.

కష్ట పడి వొండిన చెన్నమ్మ అలా అంటనట్లు దూరంగా నిలబడ్డం అన్యాయంగా అనిపించింది తన్మయికి.

చకచకా తిని బయటికెళ్లి చెయ్యి కడుక్కుని, “నువ్వూ తిను చెన్నమ్మాఅంది.

మరో గంటలో ఇంటి ముందు జీపు వచ్చి ఆగింది.

శేఖర్ వెళ్లి  ఏదో మాట్లాడి వచ్చి, “ఇవేళ పడవ రాదంట. మనం అనవసరంగా ఇవేళ ఒచ్చేం. నడుఅన్నాడు.

ఎక్కడికి వచ్చేమో, ఎందుకు వెళ్తున్నామో అప్రస్తుతమయిన తన్మయికి ఇదొక కొత్త అనుభవం.

చెన్నమ్మ జీవిత గాథ ఒక కొత్త కనువిప్పు.

చెన్నమ్మకి పెళ్లయ్యి పది సంవత్సరాలు దాటింది. పిల్లలు లేరు. పుట్టిందీ, పెరిగిందీ బెస్త పల్లెలోనే. తనకి తెలిసందల్లా సముద్రం, చేపల వేట. భర్త పచ్చి తాగుబోతు, తిరుగుబోతు. అతను సముద్రమ్మీదికి వేటకు వెళ్లిన సమయంలోనే కాస్త మనసుకి ఊరట. అతనెంత సంపాదించినా అంతా ఖర్చు పెట్టేస్తాడు. అదే మాసిన చీర బతుకు. ఎన్నేళ్లు గడిచినా అదే జీవితం. తన్మయికి ఎన్నో జవాబుల్లేని ప్రశ్నలు ఒక్క సారిగా మనస్సులో మెదిలేయి

చెన్నమ్మ ఎలా నవ్వుతూ బతకగలుగుతూంది?”

 తన్మయికి ఒక్కటి మాత్రం అర్థమయ్యింది. తన చుట్టూ ఉన్నవి తనకి  సమస్యలు అన్న అవగాహన, అంతకంటే మంచి జీవితం కావాలన్న ఆకాంక్ష లేవు  చెన్నమ్మకిఅంతే

అవన్నీ ఉంటే తనలా అంతర్మథనం తప్పదు. అంటే తనలాంటి వాళ్లకి ఆనందంగా బతికే హక్కు లేదా

టౌనుకి చేరే వరకూ  ఆలోచిస్తూనే ఉంది. బస్సు దిగి రిక్షా ఎక్కేరు

శేఖర్ తో తన చదువు విషయం మాట్లాడినా ఉపయోగం ఉంటుందని నమ్మకం లేదు. ఇక్కడ అతని పని కాగానే అతను వైజాగు వెళ్లినా, తనని వాళ్లింట్లో ధవళేశ్వరంలో వదిలేస్తాడు. విశాఖపట్నానికి చేరేదెలా?” 

రిక్షా ఏవేవో చిన్న వీథి మలుపులన్నీ తిరిగి వెళ్తూ ఒక చోట ఆగింది.

తుప్పుపట్టిన ఇనుప గేటు తీసుకుని వెళ్లేరు. చిన్న డాబా. పక్కన ఇరుకు సందులో నుంచి పైకెక్కితే మేడ మీద ఉన్న ఒకే ఒక్క గది లోకి అడుగు పెట్టేరు. ఇంటి చుట్టూ  ఉన్న చిన్న ఆవరణలో దట్టంగా చెట్లు ఉన్నాయి

మెట్లెక్కుతూ ఉండగా కిందన ఇంటి వాళ్ల అమ్మాయి అనుకుంటా పద్ధెనిమిది, పంతొమ్మిదేళ్లుంటాయేమో. తెల్లగా, బొద్దుగా, చూడచక్కగా ఉంది. శేఖర్ ని చూసి సిగ్గుగా నవ్వి లోపలికి వెళ్లిపోవడం, శేఖర్ హుషారుగా మెట్లెక్కడం గమనించింది.

పైన గదిని అనుకుని వెనక వైపు ఒక బాత్రూము ఉంది.

సామాన్లవీ ఏవీ లేనందువల్ల గది విశాలంగా కనిపిస్తూంది అంతే.

తమ ప్రాంతానికీ, ఇక్కడికీ పెద్దగా తేడా ఏవీ లేదు. ఇళ్ల బయట అవే మురికి కాలువలు. అవే మట్టి వాకిళ్లు

శేఖర్ ఒక గంటలో బయటి కెళ్ళి వస్తూ ఇక చిన్న స్టవ్వు, ఒక రెండు గిన్నెలు, కంచాలు, గ్లాసులు ఉన్న ఒక గోనె సంచీ పట్టు కొచ్చేడు. ఎవరో బాగా వాడేసినవి అవన్నీ.

అమ్మ మొదట నేనొచ్చినపుడు కట్టి ఇచ్చింది. ఇప్పుటికి ఉపయోగానికి వచ్చేయి. కిందన ఆంటీ గారింట్లో పెట్టేను. కాస్త స్నానం చేసి, బాబుని తయారు చెయ్యి. టౌనుహాలులో  కొత్త సినిమా ఆడతంది. పూట హోటలుకి పోయి భోజనం చేద్దాం. మధ్యాహ్నం చేపలమ్మి వండిన కూడు తినలేక చచ్చేను. ఇక మీదట నేనా ఊరు వెళ్లే ముందు ఉదయానే నాకు బాక్సు కట్టివ్వు.” అన్నాడు.

తన్మయి వినీ విననట్టు తలూపడం చూసి  “అసలు తలకెక్కిందా నేను చెప్పింది?”  అని గద్దించేడు.

కిందనింట్లో ఆంటీ గారింట్లో టీ.వీ ఉంది. నీకు కావలసినంత కాలక్షేపం. ఆవిడికి అయిదేళ్ళ కిందటే మొగుడు పోయేడు. ఉన్న ఒక్క గానొక్క పిల్లదే ఆస్తి అంతా…..” దారి పొడవునా ఏవేవో చెప్పుకెళ్లి పోతున్నాడు

తన్మయికి విపరీతంగా అలసటగా ఉంది. వరసగా ప్రయాణం వల్ల బాబు భుజాన నిద్రపోతూనే ఉన్నాడు. కాస్సేపు శేఖర్ కి ఇచ్చినా ఏడుపు మొదలు పెడ్తున్నాడు. ఇప్పుడు సినిమా చూసే ఓపిక లేదు. కానీ గొడవ పడే ఓపిక అంత కంటే లేదు. అందుకే మాట్లాడకుండా అతని వెనక బయలుదేరింది

సినిమా సగంలో నిద్రపోతున్న తన్మయిని భుజం పట్టుకుని కుదిపేడు. బయటికి రాగానేతెరమీద బొమ్మ ఆడతా ఉంటే నీకు నిద్రెలా పడతందే?” విసుగ్గా అన్నాడు

రిక్షా ఏదో చిన్న కాకా హోటలు ముందు ఆగింది. “ఇదుగో నిద్ర మొహం దానా, డబ్బులు ఇస్తన్నాం మనం. ఇక్కడా పడి నిద్ర పోకుండా మొత్తం తిను.” అన్నాడు.

 శేఖర్ మాటలు చెవికెక్కించుకునేలా లేదు తన్మయి మన:స్థితి

 అయినా ఎన్నాళ్ల నుంచో ఆకలితో ఉన్నట్లు తినసాగింది. భోజనం ఎంతో బావుంది. తెల్లని శుభ్రమైన అన్నం. గోంగూర పచ్చడి, రుచికరమైన పప్పూ, కూర, పెరుగు. తన్మయి నెల్లూరు భోజనం అని అంతా గొప్ప చెప్పడం వింది కానీ, ఇదే మొదటి సారి రుచి చూడడం.

భోజనం చాలా బావుంది కదూఅంది అప్రయత్నంగా.

డబ్బులు పారేస్తే ఎందుకు బాగోదు? మంచి భోజనం తిన్నాక మొగోళ్లు భోజనాన్ని మెచ్చుకోవాలి, ఆడోళ్లు అలా వండడం నేర్చుకోవాలిఅని అదేదో జోకన్నట్టు గట్టిగా నవ్వేడు.

రాత్రి చాప మీద నడుం వాల్చగానే శేఖర్  పది నిమిషాల్లో గుర్రు పెట్టడం వింది

తన్మయికి నిద్ర సరిగా పట్టడం లేదు. ఉదయం నించీ ఉన్న అలసటంతా ఇప్పుడు తెలుస్తోందిఅర్థ రాత్రి గదిలో నుంచి బయటికి వచ్చింది

డాబా మీద పిండారబోసినట్లున్న చిన్న వరండాలో చతికిలబడింది. ఆహ్లాదంగా గాలి వీస్తూంది. చుట్టూ చెట్లు గాలికి తలలూపుతున్నాయి.

తన్మయికి మనస్సులో చదువు గురించిన బెంగ రెండింతలయ్యింది

కళ్ళలో నీళ్ల వల్ల వెన్నెల ఆకాశమంతా మసకబారినట్లైయింది. రెండు చేతులూ జోడించి, పైకి చూస్తూ, మనసులోనేమిత్రమా, నన్ను రక్షించుఅని పదే పదే అనసాగింది

***

తన్మయి బయలుదేరే ముందు తల్లికి ఫోను చేసి చెప్పింది

బెంగపడకు. అంతగా నీకు నచ్చకపోతే నాన్నగారిని పంపిస్తాను. వచ్చెయ్యిఅని తల్లి చెప్పిన మాటలు ఊరట నిచ్చినాశేఖర్తో గొడవ పడడం తల్చుకుంటే చిరాకు వస్తూంది.

తన జీవితమేమిటో తనకు తెలీని గందరగోళం పరిస్థితిలోనే పదిహేను రోజులు గడిచేయి.

శేఖర్ పొద్దుటే వెళ్లి రాత్రి పొద్దుపోయే వరకూ ఇంటికి రాడు.

ఇంటావిడ చాలా మంచిది. వచ్చిన మర్నాడే మేడ పైకి వచ్చింది. బాబుని పరిచయంగా దగ్గిరికి పిలిచింది. ఏం  అవసరమైనా మొహమాటం లేకుండా అడగమని తన్మయికి చెప్పింది

వారంలో పిల్లాడు ఆమెకు మాలిమి అయిపోయాడు. పదిహేను రోజుల్లో వాడికి స్నానం కూడా తనే చేయించేటంత చనువు వచ్చేసింది ఆవిడకు.

రోజు శేఖర్ వెళ్లేక, మెట్లు దిగి కిందికి వెళ్లింది తన్మయి.

ఏవిటి తన్మయీ ఎప్పుడూ దిగులుగా ఉంటావు?” అంది ఇంటి యజమానురాలు భాగ్యమ్మ.

ఏం లేదాంటీఅని తల విదిల్చింది తన్మయి.

మా ఇంట్లో టీవీ మోగుతూనే ఉండుద్ది ఎప్పుడూ. నీకు తోచక పోతే కిందికొచ్చి టీ.వీ చూడొచ్చు కదాఅంది. ఏదో తమిళ సీరియలు చూస్తూంది ఆవిడ.

మీకు తమిళం వచ్చా?” అంది తన్మయి ఆశ్చర్యంగా.

తమిళం కొంచెం అర్థం అయ్యిద్ది. మాట్లాడడం అంత బాగా రాదులే. ఇదే సీరియలు తెలుగులో కూడా వచ్చుద్ది. తమిళంలో వచ్చే వారంలో రాబోయే సీరియల్ ఎపిసోడ్  కూడా ఇప్పుడే చూసేస్తాను సస్పెన్సు తట్టు కోలేకఅని నవ్వింది భాగ్యమ్మ.

సీరియలు చూస్తూ  ఉన్నట్టుండి,  “ఆయన ఉండి ఉంటే…” అని కళ్లు ఒత్తుకుంటూఅంతలోనేనిన్ను చూస్తే మా పెద్దమ్మాయి బతికి ఉంటే నీలాగే ఉండుద్దనిపిస్తంది.” అంది

రెప్ప ఆర్పకుండా చూస్తున్న తన్మయి వైపు చూస్తూమాకు పెళ్లయ్యిన వెంటనే పాప పుట్టి పురిట్లోనే భగవంతుడి దగ్గిరికి వెళ్లిపోయింది. తర్వాత అయిదేళ్లకి ఇదిగో అమ్మాయి పుట్టింది. ఈమె పెళ్లి చూసే వరకైనా భగవంతుడు నా భర్తని బతికించలేకపోయాడు. పండగకి మెడ్రాసు పోయి వస్తూంటే ఏక్సిడెంటు ఎత్తుకుపోయిందాయన్ని.” అని నిట్టూర్చింది.

తన్మయి అనునయంగాబాధపడకండి ఆంటీఅంది.

అలా బెంగగా ఉండకు తన్మయీ, మీ అమ్మా వాళ్లతో మాట్లాడాలనుకుంటే మనింట్లోంచి ఫోను చేసుకోఅంది కళ్లు వత్తుకుంటూ.

తన్మయికి ఎంతో సంతోషం వేసింది. దయామయులైన వ్యక్తులు తనకి ఎప్పుడూ అడుగడుగునా ఎదురుపడ్తూనే ఉండడం తన అదృష్టం

ఫోను లో అవతలి నుంచి తల్లి గొంతు వింటూనే గొప్ప ఆనందం, గరగరలాడుతూ దు:ఖమూ  తన్నుకు వచ్చేసాయి తన్మయికి

భాగ్యమ్మ బాబుని ఎత్తుకుని బయటి వరండాలోకి వెళ్లింది.

ఎవరో కరుణ అట, నీ పేరుతో కార్డు వచ్చింది తన్మయీ.” అంది జ్యోతి.

కరుణ పేరు వినగానే మనసు సంతోషంతో ఉరకలు వేసింది తన్మయికి. అంతలోనే యూనివర్శిటీ జ్ఞాపకం వచ్చి బాధతో గొంతు వణికింది.

ఏం రాసేడో చెప్పమ్మాఅంది.

నీకు సెకండ్ ర్యాంక్ వచ్చిందటమ్మా. క్లాసులు ప్రారంభమైనా నువ్వు రాలేదేవిటనిరాసేడు. అంది జ్యోతి.

అడ్రసేవైనా ఉందా కింద?” అంది తన్మయి

లేదమ్మా, పేరొక్కటే ఉంది. అన్నట్లు  వచ్చే వారం మేం తిరుపతి వెళ్తున్నాం. శేఖర్, నువ్వూ కూడా మాతో వస్తే బావుంటుంది.” అంది జ్యోతి

శేఖర్ ని అడిగి చూస్తాను. ఒకవేళ మేం రాలేకపోతేమీరు వెనక్కి వచ్చేటపుడు నెల్లూరులోదిగండి. నేను కూడా మీతో మనూరు వచ్చేస్తానుఅంది ఉత్సాహంగా తన్మయి.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.