కథా మధురం  

బులుసు సరోజినీ దేవి

 పరకాంతలని వేటాడే  మగాళ్ళ దుష్ట కన్నుకు సర్జరీ చేసిన కథ – కన్ను!

-ఆర్.దమయంతి

ఆరంభం :

ఆమె భర్త –  సంసార నావ నడుపుతున్నాడు. 

ఎలాటి ఒడిదుడుకులు లేకుండా,  ప్రయాణం – ఎంతో సాఫీగా,  హాపీ గా  సాగిపోతోంది.  ఆ సంతోషం లో ఆమె  అలా ఆదమరచి ఓ కునుకు తీసిందో  లేదో, పీడ కలకి మెలకువ వచ్చింది. కళ్ళ ముందు బీభత్సం..తుఫాను కి నావ కంపించిపోతోంది.  ‘ఏమండీ’ అంటూ గావుకేకలు పెట్టింది. నావ నడుపుతూ కనిపించాల్సిన భర్త అక్కడ లేడు. కెవ్వుమంది.  

 పిచ్చిదానిలా పదే పదే భర్తని పిలిచింది. కాదు. అరిచింది. బదులు లేదు. ఆమె కి అర్ధమైపోయింది. భర్త  తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని. బయట సముద్రం లో తుఫాను. లోన సముద్ర తుఫాను. భోరుమంది. నావ మునిగిపోతోంది.   ‘ మునిగిపోనీ.  ఇంకెందుకు నే బ్రతికీ..? ‘  స్థిరం గా అనుకుని, కళ్ళు మూసుకుంది. అంతలో పిల్లలిద్దరూ..’అమ్మా..’ అంటూ భయంతో, భీతితో..వొణికిపోతూ, ఆమెని బలంగా కరచుకుపోఆరు.  వెంటనే ఆమె స్పృహలోకి వచ్చిందాన్లా,  అసంకల్పితం గానే.. ప్రుగుపరుగున నావను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం లో పడింది.   భర్త స్థానంలోకి వచ్చి కుర్చుందే కానీ, ఎటు నించి ఎటు వైపు కి  తిప్పాలో నావని తెలీత్లేదు.. ఏమీ చేతకాని తను?   ఈ నడి సముద్రాన నావ మునిగిపోకుండా,  పిల్లల్ని సురక్షితం గా ఒడ్డుకు చేర్చగలదా? అసంభవం.   ‘ భగవాన్! ఏం చేయమంటావో చెప్పు..నువ్వే దిక్కు..ఇక నువ్వే దిక్కు..’ క్షణ క్షణం గుండె తుఫానౌతుంటే,  మనసు సముద్ర రోదన గా మారిపోతుంటే.. అప్పటి ఆ భయంకర క్షణాలలో  దీన వదనురాలి మానసిక స్థితి ఎలా వుంటుంది? 

ఆ అసహాయురాలికి  చేయూత నివ్వాల్సిన ఈ మనుషులు, ఈ సమాజమూ ..అదే నిస్సహాయతను ఆధారం గా చేసుకుని కబళించాలనుకుంటే అంతకు మించిన అమానుషం కానీ, అమానవీయతా కానీ మరొకటుంటుందా? 

అటు చూస్తే అగాధం..ఇటు చూస్తే అమానుషం. పోనీ ఈ  బ్రతుకే వొద్దనుకునేందుకు తనని నమ్ముకుని, బలం గా చుట్టుకున్న కన్నబిడ్డలు. ఎలా నెట్టుకు రాగలదు   ఆ అబల?   

ఈ కథలో సావిత్రి అగాధ గాధ కూడా అదే!

***

క్లుప్తం గా కథ  ఏమిటంటే : 

సావిత్రి భర్త హఠాత్తుగా మరణిస్తాడు. అతని  ఆఫీసులో ఆమెకి ఉద్యోగం ఇస్తారు.  అప్పటి దాకా గడప దాటని ఆ ఇల్లాలికి  ఆ వాతావరణం అంతా కొత్త గా వుంటుంది.  ఒక పక్కన భర్త పోయిన పుట్టెడు దుఃఖ భారం, మరో పక్కన బ్రతుకడం కోసం ఆఫీసులో జేరడం, అలవాటు లేని ఆఫీస్ వర్క్ ని  నేర్చుకునే ప్రయత్నం ..ఆమె ప్రాణం ఉక్కిరిబిక్కిరైపోతుంటుంది.  

ఇవి చాలవన్నట్టు ఆమె  ఓ ప్రమాదాన్ని పసిగడ్తుంది.  అదేమిటంటే –  మేల్ కొలీగ్స్ ‘ కన్ను ‘ లో పేరుకుంటున్న రంగు పొరల్ని, చూపుల్లోంచి వచ్చి ఒంటికి గుచ్చుకునే సూదుల్ని,  మాటల్లో ద్వందార్ధాల దబ్బనాల్నీ గుర్తిస్తోంది.  

దానికి తోడు సాటి  ఉద్యోగినీల హెచ్చరికలు కూడా ఆమెని భయపెడ్తాయి.  

సరిగ్గా ఇలాటి సంకట పరిస్థి స్తితుల్లోనే చాలామంది ఉద్యోగినీలు ‘ఉద్యోగం మానేద్దాం..’ అని నిర్ణయించుకుంటారు. లేదా మరో జాబ్ వేటలో పడతారు. ఇక్కడ సావిత్రి కి అలాటి చాన్స్ లేదు. ‘ఉద్యోగం సావిత్రి కి పురుష ధర్మమూ,  ప్రాణ రక్షణం కూడా!   ప్రాణం పోయినా ఫర వాలేదు కానీ బిడ్డల కోసం ఈ భృతి ని మానే ప్రసక్తే లేదామెకి.  మరి ఈ హింస ని ఎలా తట్టుకోవడం? ఎలా భరించడం?

‘ ఏం చేయాలి?’ అనే ప్రశ్న కన్నా, ‘ఏం చేసైనా ఈ గండాన్ని దాటి తీరాలి ‘  ఈ చాలెంజింగ్ గా అనుకుంది.   బాగా ఆలోచించింది. ఒక పథకం వేసింది. ఆచరణలో పెట్టింది. గెలిచింది. 

‘ ఇంతకీ  ఏ ఉపాయం తో ఆ అపాయం నించీ బయటపడిందీ?’  అని తెలుసుకోవాలంటే కథ చదవక తప్పదు. 🙂

***

కథలో సావిత్రి ఎదుర్కొన్న సమస్యలు :

ఆఫీసులో అడుగుపెట్టిన ఆమెకి మొదట్లో అంతా సవ్యంగానే కనిపిస్తుంది.

అలా అనిపించడం సహజం. ఎందుకంటే, ఆఫీసూ,ఆ వాతావరణం, కొత్త కావొచ్చు. కానీ, స్టాఫ్ కొత్త వాళ్ళు కాదు. తన భర్త కొలీగ్స్. పైగా, అందులో కొందరు స్నేహితులు కూడా. ఇక్కడే పొరబడతారు ఆడవాళ్ళు. ఆ స్నేహం, గౌరవం, అన్నీ కూడా తన ముందు  భర్త కోటలా నిలబడినప్పటి మాట. ఇప్పుడు కోట లేదు. అందుకే ఆమె మీద వాళ్ళ కన్ను లెన్స్ మార్చుకుంది. దృష్టి మరలి,  వక్ర చూపు విసురుతోంది. 

సమాజం లో వితంతువులు  ఎదుర్కొనే అనేకానేక పెద్ద సమస్యల్లో ఇది తొలి సమస్య.  పెళ్ళి కాని ఆడదాని పట్ల ఒక రకపు కన్ను,  పెళ్లై భర్తని పోగొట్టుకున్న స్త్రీ పట్ల మరో రకపు కన్ను కొందరి మగాళ్ళకుంటుంది.  ఆ వనిత ‘పిల్లలు గల తల్లి’  అని కానీ,  పాపం! భర్త పోయి, కష్టంలో  వున్న ఒక సోదరి ‘ అనే జాలి, దయ, కరుణ  కానీ  శూన్యం. సరే, పోనీయి.  ఆ పాటి మనిషి లక్షణాలు లేకపోతే లేకపోతే లేకపోనీ,  కనీసం ఆమె ఖర్మ కి ఆమె ని వదిలేసినా బావుణ్ను. ఆమె బ్రతుకేదో ఆమె బ్రతికేను.  ఊహు. అలా ఆయితే అతను మృగాడు ఎలా అవుతాడు మరి? 

ప్రతి మనిషిలో మంచి చెడూ;  దేవుడూ రాక్షసుడూ వున్నట్టే, చాలా మంది మగాళ్ళల్లో ఒక ముసుగు కప్పుకున్న మృగాడు కూడా తప్పనిసరిగా వుంటాడు ట.  

గడప దాటి అడుగు బయట పెట్టిన స్త్రీకి అడుగడుగునా మగ గండాలుంటాయని అప్పటి దాకా బొత్తిగా తెలీని సావిత్రి వంటి  అమాయకులకు బ్రతుకు క్షణ క్షణం యమ గండం లానే వుంటుంది. 

మనం పనిచేసే ఆఫీసులో  ఒక కొలీగ్ తో సమస్య వస్తే ఇగ్నోర్ కొట్టేయొచ్చు. ఇద్దరితో వస్తే మూడో వాడితో చెప్పుకుని ఏడ్వొచ్చు. అందరితోనూ వస్తే పై ఆఫీసర్ కి చెప్పి ‘నన్ను  బదిలీ  చేయండి మహా ప్రభో..’  అని మొత్తు కోవచ్చు. కానీ ఆ  బాస్  ‘కన్ను ‘  కీ అదే జబ్బుందని  తెలిసాక  ఇక ఆ ‘విడో ‘ ని ఎవరు రక్షించాలి?  ఆదేవుడు రక్షిం చాల్సిందే!

భర్త పోయిన స్త్రీ పట్ల  కొందరిలో ఒక చెడ్డ అపోహ వుంటుందనీ,   ఆమె పక్క(న)  ఖాళీ అయినట్టు,  అదేదో తనే అర్జెంట్ గా  భర్తీ చేయాల్సిన అవసరం వున్నట్టు లొట్టలేసుకుంటూ ఆత్రపడిపోయే  వెదవాయిలుంటారని..ఆమెకీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అందుకు వారి మాటలు, చేస్టలే సాక్ష్యాలు.  

‘సావిత్రి గారూ! పాపం, ఒక్కరూ ఏం కష్టపడతారు? నేనున్నా మీ కోసం రెడీ గా..’ అంటూ ఒకడు.. 

పనిలేకపోయినా, టేబుల్ ముందుకొచ్చి, బర్రున కుర్చీ లాక్కుని కుర్చుంటూ, ‘ఎందుకు ఇంతగా కష్టపడతారు? నేనో చేయి వేసేదా?  అయినా మీ పని నా పని కాదా?’ అని నర్మగర్భం గా వెకిలి గా నవ్వే రౌడీ ఒక్డు..

 ‘బస్సులో ఎందుకు వెళ్తారు?  ‘మన’ కారులో  ఇంటిదగ్గర దింపుతా అనే వాడొకడు..

‘ఓకే కదండీ?’ అంటూ మాటిమాటికీ అడిగే – ప్రకాషు..

తను వుండంగా ‘కించిత్ బాధ అవసరం లేదంటూ’  అనవసర  భరోసాలు ఇచ్చే – సుందరాంగుడూ..

 ‘రెస్టారెంట్ కి పోదామా?’ అని  ఆశగా అడిగే – గిరిధర్..

‘ఏమైన డబ్బు ఇబ్బందా?’ అన్నిటికీ నన్ను వాడుకోండి..’ అనే కురూపి మోహన్.. – వీళ్లందర్నీ అనుక్షణం ఎదుర్కోవడం అంటే  నిప్పుల గుండం లో బ్రతుకుతున్నట్టె వుంటుంది.

ఇదిలా వుంచి సహ ఉద్యోగినీలు  పరామర్శిస్తూ…’ వాళ్ళు మిమ్మల్ని కూడా అలా అడిగారా  ?’   అని ఆరాలు తీస్తూ, జాగ్రత్త సుమీ  అని హెచ్చరిస్తున్న  మాటలకు సావిత్రి  దిమ్మతిరిగిపోతోంది.

అన్ని జాగ్రత్తలు వెనక మాటలే కానీ, ముందుకొచ్చి, మీకేం భయం లేదు నేనున్నాను అనే వ్యక్తి ఒక్కరూ కనిపించడం లేదామెకి. ఈ పరిస్థితి చాలు, సమస్య వెయ్యింతలై  మింగేసేందుకు.  ఆఫీసు కార్యాలయాలలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలలో ఇది ఒకటి. అంతా రాజకీయ మయం.   

ఇదే తట్టుకోలేని సమస్య అనుకుంటే, మరో విపరీతం వచ్చి, దీన్ని చిన్న గీత గా గా చేసిపోయింది. 

 అదేమిటంటే  – తన సీట్ కి ఒక టాగ్ అతికించి వుంటం, దాని మీద ఒక రేట్ రాసి వుంటం చూసి, అవ్వమానం తో కుంగిపోతుంది. 

ఇక్కడ సిగ్గుతో తలవంచుకోవాల్సింది  స్త్రీ కాదు. ఈ సమాజం. ఇలాటి నీచ  దౌర్భాగ్య దుస్థితి ఏ స్త్రీకీ కలగకూడదు. కానీ దురదృష్టం  ఏమిటంటే – దరిదాపు ప్రతి స్త్రీ ఇంచుమించు ఇవే సమస్యల్ని  ఎదుర్కొంటోంది. ఒక బాస్ తన కింద పని చేసే ఓ నిజాయితీ పరురాలైన ఉద్యోగిని ని గుర్తించి ప్రోత్స హిస్తే గనక ఆ ఇద్దరి పేర్లు రెస్ట్ రూం గోడల మీద రాయబడి వుంటాయి.

పుండు మీద కారం జల్లినట్టు, అదే సమయం లో ఒక కొలీగ్ భార్య నించి బెదిరింపు కాల్ రావవడం తో సావిత్రి మరీ హతాశురాలైపోతుంది.

ఈర్ష్యా ద్వేషాలతో , పగా ప్రతీకారాలు తీర్చుకోడానికి కొందరు  ఆకాశరామన్న ఉత్తరాలను అణుబాంబుల్లా వాడతారు.   

‘ ఆఫీసులో మీ ఆయాన రాసలీలలు మీకు తెలుసా సిస్టర్?   మొగుడు పోయిన  ఆ ‘విడో’   తో మీ ఆయన చాలా క్లోజ్ గా వుంటాడు. వెంటనే మేల్కొని, మొగుణ్ణి కాపాడుకో. లేకపోతే నీ కాపురం మటాష్..’ అని బరికి పడేస్తుంటారు. 

ఫలితం గా ఆమె మొగుణ్ణి రక్షించుకునే ఆత్రం లో  లో పాపం ఈ వితంతువు జీవితం బక్షణ అయిపోతుంది. ఆఫీసులో ఆమె జోలికి పోకుండా ఈ భార్యమణి కంట్రోల్ చేసుకోవాల్సింది మొగుణ్ని కదా? ఆఫీస్ కి ఫోన్ చేసి ఒక ఉద్యోగినిని బెదిరించడం ఎంతవరకు న్యాయం? ఎంతవరకు సబబు? 

లోకం కూడ ఏమంటుందంటే..మొగుడు పోయిన అమ్మనే అంటారు.  అప్పుడే మొదలెట్టిందా? అనో, అయినా అదేం బుద్ధి పిల్లలున్నారన్న జ్ఞానమైనా లేకుండా అనో, నిప్పు లేందే పొగ రాదు గా’ అంటూ దీర్ఘాలు తీస్తూనో మొత్తానికి నేరం ఆమెదే అన్నట్టు ఒక నిందితురాల్ని చేసి మాట్లాడతారు. అపనిందలతో, అపవాదుల పాలు చేస్తారు. పాపాత్మురాల్ని చూసినట్టు చూస్తుంది – లోకం. లోకుల కన్ను అది మరి. 

నిజానికి సావిత్రి  కన్ను అంతా పిల్లల  మీదే వుంటుంది. పసి పిల్లలకి తండ్రి  లేని లోటు ఎలా తీర్చాలన్న  ధ్యాస మీదే కన్నుంటుంది.  యవ్వనం లో భర్త ని పోగొట్టుకున్న ఆడది  తన దుర దృష్టానికే ఏడుస్తుందా? గుడ్డిలో మెల్ల గా  ఉద్యోగం తో  బ్రతికేద్దామన్న చిరు ఆశని కూడా ఆర్పేస్తున్న ఈ కామాంధుల అకృత్యాలకే ఏడుస్తుందా? 

వితంతువులు ఎదుర్కునే ఈ ఈ సమస్యలని ఎవరు తీరుస్తారు ? భర్తని కోల్పోయిన స్త్రీలు –  హార్థికం గా ఆర్ధికం గా మాత్రమే కాదు, ఈ యుధ్ధ పోరాటం లో కూడా  ఒంటరి గానే మిగిలిపోతుంటారు.

సావిత్రి ఒంటరి పోరాటం చేస్తోంది ఆఫీసు అనే కురుక్షేత్రం లో ఒంటరి లేడీ అర్జునిడి లా మారుతూ.. జీవితం అంటెనే యుధ్ధం. గెలవడమే ధ్యేయం. 

అందుకే ఆమె పరిశోధన మొదలైంది.  మూల కారణాలు శోధించడం మొదలు పెట్టింది. –  భర్త  బ్రతికున్నప్పుడు,   తన మీద గల ఆ గౌరవం సన్నగిల్లడానికి కారణం ఏమిటి? అప్పుడు  ఆ కన్ను లో లేని ఈ వక్ర దృష్టి ఇప్పుడింత దుష్టత్వాన్ని అలుముకున్న కారణం ఏమై వుంటుంది? 

మసకేసిన కన్ను కి ఆపరేషన్ వుంది. ఆప్తాలజిస్ట్  కంటి చూపుని సరిచేస్తారు.

కామాంధకారపు పొరలు కమ్ముకున్న ఈ కన్నుకు  ఏ శస్త్ర చికిత్సలు వున్నాయి ? ఈ విశ్వం లో అలాటి చికిత్సలు   వుంటె  ప్రపంచ వ్యాప్తం గా స్త్రీలు ఎంత సుఖపడిపోదురు! 

  పర స్త్రీ మీద కన్ను పడ్డ మగాడి కన్ను దుష్ట కన్ను. ఆమె మీద ఆ దృష్టి పడనే కూడదు. పడ్డాకా, అతను కీచకుడూ కావొచ్చు, రావణాసురుడూ గానూ మారొచ్చు. కామం పిశాచి వంటిది.  అది పట్టుకున్న వాడికి ఉఛ్ఛ నీచాలు  తెలీవు.  కోరుకున్న  స్త్రీ కాదని ఎదిరిస్తే,  వాడు కాలసర్పమై కాటేస్తాడు. నడిరోడ్డు మీద యాసిడ్ పోసి హతమారుస్తాడు. కత్తులు కటారులతో దాడి చేస్తాడు. పెట్రోల్ పోసి తగలబెడతాడు. నిప్పుల్లో తోస్తాడు. నట్టేట్లో ముంచుతాడు. ఎన్ని చదవడంలేదు వార్తల్లో..ఎన్ని చూడ్డం లేదు నిజ జీవితంలో?

పాపం! తాము చేయని తప్పుకి  బలి అయిపోతున్న  అభాగినిలు, అమాయకురాళ్లు ఎందరో! ఈనాడు సమాజం లో స్త్రీ లపై జరుగుతున్న అత్యాచారాలు, భయంకర దాడులు, ఎంత పాశవికంగా వుంటున్నాయో!  

 సావిత్రి తన సమస్యని అంత వరకు రాకుండా కామోసు ఒక ఉపాయం ఆలోచిస్తుంది. అది ఆచరణలో పెట్టే కార్యక్రమాన్ని రూపొందిస్తుంది.

ఆపదల్లో చిక్కుకున్న ఆడది ఎంత చురుకుగా ఆలోచిస్తుందంటే – తన చుట్టూ వున్న అన్ని దారులూ మూసుకుపోయినా ఓ కొత్త దారిని వెదికి పట్టుకోగలగినంత! ఒంటరిగా పోడాల్సి వస్తే ఆమె కె ఆమే ఓ పెద్ద సైన్యమైపోగలదు. ధైర్యం తో ముందడుగేయగలదు.  ముదు తరాల వారికి  మార్గ దర్శి కాగలదు.  అదే స్త్రీ శక్తి.

ఇంతకీ సావిత్రి తను ఎదుర్కొంటున్న కఠిన సమస్యని ఎలా పరిష్కరించుకుంది? ఎవరికీ సధ్యం ఈ  కన్ను ఆపరేషన్ ఎలా పూర్తి చేసి, విజయం సాధించింది?  అనే ఆసక్తి కరమైన ఈ ప్రశ్నలకు జవాబే  ‘కన్ను ‘ కథ.  

సావిత్రి పాత్ర ఔన్నత్యం : 

మనం చదివే చదువు మన జీవితాన్ని చక్క దిద్దుకోవడానికి పనికి రావాలి అనే సూక్తి కి నిలువెత్తు సాక్ష్యం గా నిలుస్తుంది సావితిరి.  ఆమె చదివిన సైకాలజీ శాస్త్ర విజ్ఞానాన్ని – ఆఫీసులో పనిచేస్తున్న మేల్ కొలీగ్స్ కన్ను లో  గల దుష్ట లోపాన్ని సరిచేయడానికి ఒక శస్త్ర చికిత్సలా ఉపయోగించుకుంటుంది. 

విషమ పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు ఒంటరి ఆడది డీలా పడటం, డిప్రెస్ కావడం సహజమే అయినా చీకట్లను చీల్చుకుని ముందుకడుగేయాల్సిన కర్తవ్య కూడా మనదే అంటూ ఎనలేని నూరిపోసిన  పాత్ర – సావిత్రి.

ఏ యుగం లో కానీ, ఆడదాని జీవితం వడ్డించిన విస్తరి ఎప్పటికీ కాదు. ఆమెని మగాడు మాత్రమే కాదు, దేవుడూ పరీక్షలకు గురి చేస్తూనే వుంటాడు. ఆమెకున్న బలమైన శతృ వులు కేవలం మగాళ్ళు మాత్రమే కాదు. కొంతమంది సాటి స్త్రీలు కూడా వుంటారు. ఇంకా, అప్పుడప్పుడు కాలం కూడా. పెళ్ళి తర్వాత జీవితం అంతా సుఖ మయమే అనుకోవడం పొరబాటే. నిజానికి అప్పుడే మొదలౌతాయేమో! స్త్రీలకి – కష్టాలు, కన్నీళ్ళు, అనుకోని సమస్యలను ఎదుర్కోవడాలూ! ఒకప్పుడు పువ్వులల్లిన చేతులతోనే జీవన సమరం కోసం కత్తులు దూయాల్సి రావడం ఎంతైనా ఆశ్చర్యకరం! కానీ సావిత్రి పాత్ర లోంచి ఒక సైనికు రాలు నడచి రావడాన్ని మనం గమనించవచ్చు. భర్త స్థానాన్ని తాను పూరిస్తూ, పిల్లలకి అమ్మలా ప్రేమని పంచుతూనే తండ్రి గా మారి రక్షణ కవచం లా మారడం చూసినప్పుడు – శభాష్ తల్లీ అనిపిస్తుంది. 

దేవుడు  మనిషుల్ని ఎత్తుకెళ్లగలడే  కానీ,  నీలోని ఆత్మవిశ్వాశాన్ని, ఆత్మ గౌరవాన్ని కాదనే నిజాన్ని చాటి చెబుతుంది సావిత్రి. 

ఉద్యానవనం లాటి జీవితాల్ను  –  మరుభూమిగా మార్చడం  ఆ దేవుడికి వస్తుంది. కానీ,  మిగిలిన జీవితాన్ని  పూల వనం గా మార్చుకోవడం మాత్రం ఒక్క స్త్రీకే సాధ్యమౌతుంది. అందుకే ఆమెని  అమ్మ అని పిలుస్తాం. ముగ్గురమ్మల మూల స్వరూపిణి పేరే – స్త్రీ!

సావిత్రి పాత్ర స్వభావ విశ్లేషణలో మనకు దొరికే  ఔన్నత్య లక్షణం సదా అనుసరణీయం అని చెప్పాలి. 

మతలబీ శ్రీలత పాత్ర :

లోకం, లౌక్యం తెలిసిన పాత్ర. లోన కారాలు నూరుతూనే పైకి తీయగా నవ్వుతూ కనిపించే స్త్రీ ఈమె.  ఆఫీసులో తతంగం అంతా ఓ కంట పసిగడుతూ, అలా సావిత్రి దగ్గర వాలి, ఇలా ఆరా లాగి, ఓ సలహా గానో, సూచనగానో  ఓ మాట పడేసి, మళ్లీ అలాగ్గా ఆ మగాళ్ల మధ్య తేలి, నవ్వుతూ చలోక్తులు విసురుకుంటూ నవ్వుల్లో మునిగే భామ ఈమె. ఈ  రంగులు మారే సీతాకోకచిలుక్కి  వ్యక్తిత్వ విలువలంటూ ఏమీ వుండవు. కాలం తో బాటు మారితే తప్పు లేదంటారు. అంత మాత్రాన చెడేదీ వుండదంటారు.  మడి గా వుండాలంటే ఇంట్లో వుండాలి కానీ బయటకెందుకూ రావడం అంటూ  లాజికల్ గా వాదిస్తారు.  మాట వేరు. చేత వేరు. వేషం వేరు. లోపలి అసలు రూపం వేరు. ఇలాటి స్త్రీల వల్ల సమస్యలో  ఇరుకున్న సావిత్రి వంటి వారికి ఎలాటి ఉపకారం కానీ, అండ కానీ సపోర్ట్ కానీ దొరకదు అని నిరూపించిన  పాత్ర. 

పై పెచ్చు – ఆ మగాళ్ళందరూ దుష్టులు. మీరు దూరం గా వుండండి అని చాటుగా చెబుతూనే బహిరం గం గా వాళ్ళతో స్నేహం గా కలిసిపోవడం సావిత్రి కీ మనకీ ఆశ్చ ర్యం  గా అనిపిస్తుంది. కానీ,  ఆమె ధైర్యం గానే అనౌన్స్ చేస్తుంది. ‘నేనూ  నా బజారు పనులకి  వాళ్ళని వాడేసుకుంటా. ‘ అని. సందేశాత్మకమైన పాత్ర స్వభావం కాదు కానీ, మనకు తరచూ తారసపడే స్త్రీలని  శ్రీలత పాత్రలో కనుగొనవచ్చు. 

ఇదీ ఈ నాటి ‘కన్ను’ కథ మీద, కథలోని  స్త్రీ పాత్రల పైన, నా విశ్లేషణ. 

కథా, జీవితం ఒకటే. అందుకే నిజ  జీవితాన్ని  ప్రతిబింబించేలా వుండాలి కథలు, కథల్లోని పాత్రలూ  అని అంటారు.  ఆ కోవకు చెందిన కథే ఈ ‘కన్ను’  కథ కూడా!  తప్పక చదవండి. చదివించండి. నెచ్చెలితో మీ హృదయ స్పందనలను పంచుకోండి.

 

****

 కన్ను!

  (కథానిక)

 – బులుసు సరోజినిదేవి

అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసి సీనియర్ ఇంజనీర్ శామ్యూల్ కి ఇచ్చి వినయంగా నిలబడింది సావిత్రి.

“ఓ !మీరు ఎం.ఏ. సైకాలజీ చేసారా?  గుడ్ .వెరీగుడ్”అని శామ్యూల్ అంటుంటే వచ్చిన అశోక రావు చూసి పలకరింపుగా నవ్వింది. అశోక్ రావు తన భర్త మురళికి క్లోజ్ ఫ్రెండ్. మురళి  హఠాత్ మరణం తో అతని  ఉద్యోగం తనకి వచ్చేవరకు మాట సహాయం చేస్తూ అధికారులకు, తనకి మధ్యవర్తిగా ఉండి త్వరగా జాబ్ వచ్చేట్లు చేసాడు. తనకి ఉద్యోగం రావడం అతడికి వచ్చినట్లు  సంబరం తో చెప్పాడు.   అశోక్ రావు కి కృతజ్ఞతాపూర్వకంగా  నమస్కరించింది సావిత్రి.

ఇప్పుడు శామ్యూల్ ఆఫీస్ వర్క్ నేర్పించే బాధ్యత అశోక్ రావ్ కె అప్పగించాడు. సావిత్రి సీట్ చూపించి ఏమేమి చేయాలో వివరిస్తూ లంచ్ టైం లో కొలీగ్స్ ని పరిచయం చేశాడు.

సుందరమూర్తి అకౌంట్స్ ఆఫీసర్.  పెన్షన్  వగైరాలు చూసేది  గిరిధారి.  జీతభత్యాలు రాసేది శాంక్షన్  చేసేది మందాకిని.   సీనియర్ సెక్షన్ ఆఫీసర్ మోహన్ కాగా మిగిలిన వారు తనలా  క్లరికల్ కేటగిరి గా గమనించింది. రాను రానూ మిగతవారు తెలుస్తారులే అనుకుంది.

తనంతట తాను వర్క్ చేసుకోవడం మొదలయింది. పక్క సీట్లో ప్రకాష్.. మాటి మాటికి “ఓకే కదండీ”అని అడుగుతూ ఉంటాడు. తను తల ఉపుతుంది. రెండు సీట్ల కవతల సుందర మూర్తి ఖాళీ చేసుకుని మరీ వచ్చి మొహమాట పడొద్దని , ఏ డౌట్లున్న క్లారిఫై చేస్తానని చెప్తుంటాడు. అప్పుడప్పుడుమోహన్ ఫాస్ట్ గా వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీని బర్రున లాగి కూర్చుని..

“ఇలా ఇచ్చెయ్యండి. త్వరగా కంప్లీట్ చేసేద్దాం”అంటాడు.

అప్పుడొస్తుంది మందాకిని.

“ఇచ్చెయ్యండి మేడం .. సార్ త్వరగా చేస్తారు”అంటుంది.  ఆమెని చూడగానే టక్కున లేచి వెళ్ళిపోతాడు మోహన్.   ఏదోసంగతిఉందనిపించినాతనకి అనవసర విషయంగా భావించి  పనిలో నిమగ్నమయ్యింది సావిత్రి.

****      

పది రోజులు గడిచాక గిరిధారి  ప్యూన్ వరదరాజు తో తనని కలవమని కబురుపెట్టాడు .

మురళి పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చెయ్యమని చెప్తూ

“మీరు రోజూ సిటీ బస్ లో రావడం చూసాను.  మీరు మొహమాట పడకుంటే మన కారుంది. దింపేస్తాను. ఎంతైనా మా మురళి మిసెస్ మీరు”అన్నాడు  ‘మన’అనే దగ్గర గొంతు తగ్గించి.

సావిత్రి చేదు మాత్ర మింగుతున్నట్టు మొహం పెట్టగానే

“సరే సరే!వెళ్లి రండి”అన్నాడు.

సీట్లోకి వచ్చి కూర్చున్న “మన కారుంది”అనే మాట చెవిలో వినపడుతోంది.

ప్రకాష్ గొంతు వినిపించేవరకు సరిగా ఉండలేకపోయింది.

“ఏంటీ? ఎడ్జస్ట్ కాలేదా ఇంకా? మరేం పర్లేదు. నేనున్నాను మీకు”అన్నాడు.

పది నిముషాల్లో సుందరమూర్తి హడావిడి గా వచ్చి లైఫ్ సర్టిఫికెట్ టైప్ చేసి తీసుకొచ్చినట్టున్నాడు. తానుండగా కించిత్ బాధ పడక్కర్లేదని సంతకం పెట్టించి మరీ తీసుకుపోయి గిరిధారి కి ఇచ్చేసి రావడానికి వెళ్ళాడు. ఈ లోగా లంచ్ టైం అయింది.  శ్రీలత తన సీట్లో నుంచి  సావిత్రి వైపే చూస్తున్నట్టనిపించింది సావిత్రికి. చెయ్యి ఊపింది. తిరిగి చెయ్యి ఊపిందే తప్ప ఎప్పటిలా లంచ్ కి రమ్మని అనలేదు.

సుందరమూర్తి హడావిడిగా వచ్చి

“ఇచ్చేసానండి గిరిధారి గారికి.   లంచ్ కి  కింద రెస్టారెంట్ కి పోదాం రండి. ఈ రోజు నా పుట్టినరోజు. కలిసి విందు ఆరగిద్దాం “అన్నాడు.

” నాకు బయటి ఫుడ్ పడదండి.థాంక్యూ.  పుట్టినరోజు శుభాకాంక్షలు”అంది. విసుగ్గా చూసి వెళ్ళిపోయాడు.

***   

ఆ రోజు కొద్దిగా లేట్ అయింది బస్ టైం కి దొరకక.  పదవగానే  రిజిస్టర్ మోహన్ టేబుల్ మీదకి వెళ్ళిపోతుంది. ఎలా?

రిజిస్టర్ లో సంతకం పెట్టాలంటే మోహన్ దగ్గరికి వెళ్ళాలి. తప్పక వెళ్ళింది. మొహం ఇంత చేసుకుని  కూర్చోబెట్టి తీరిగ్గా కబుర్లు చెప్తూ రిజిస్టర్ లో సంతకం పెట్టించుకుని  .. ముందుకి దగ్గరగా ఒంగి..

“ఇంకా వన్ మంత్ కాలేదు మీరు వచ్చి. ఏదైనా డబ్బు ఇబ్బందా?”  అని జేబులోనుంచి కొన్ని నోట్లు తీసి –

“పర్వాలేదు  ఉంచండి. మనలో మనకేముంది?”అన్నాడు.

“అదేం లేదండి. ఇంటి  పని ఒత్తిడి అంతే!”అని ఒక్క పరుగున వచ్చి తన సీట్లో కూర్చుంది.

శ్రీలత ఫాస్ట్ గా వచ్చి .. నవ్వుతూ పలకరించి..

“మోహన్ లేట్ ఎందుకు అయిందని ఆరాతీసి డబ్బు ఆఫర్ చేసేడా?”అని అడిగింది. అవునని తల ఊపింది.

“గిరిధారి మన కార్లో దింపుతానన్నాడా? “బాంబు పేల్చింది. తలూపింది అయోమయంగా.

“ఈ మోహన్  నన్ను ప్రేమించానని అంటే నిజమనుకున్న. గిరిధారి మనకారు అంటే నిజమేననుకున్న. మోసం చేస్తున్నారు ద్రోహులు”కాలితో నేలని బలంగా తన్ని వెళ్ళిపోయింది.

పావుగంట దాటాక మందాకిని వచ్చింది.

అవే ప్రశ్నలు అడిగి వెళ్ళింది.

లంచ్ టైం లో మందాకిని, గిరిధారి, మోహన్, శ్రీలత నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఉంటే మతిపోయి చూస్తూ ఉండిపోయింది.

మధ్యాహ్నం మూడు దాటాక శ్రీలత మరో సంగతి చెప్పింది.

“అమాయకంగా ఉండకండి. వీళ్ళు బిస్కెట్లు వేస్తారు. మేము అందుకున్నట్టు ఉంటాం. ఒకరోజు విన్నాను వీళ్ళ మాటలు. కాస్త ప్రేమ కురిపిస్తే హాయిగా ఎంజాయ్ చెయ్యొచ్చు. ఆడవాళ్లు కదరా.. ఎవరికి చెప్పుకోరు. పరువు పోతుందని.  ఒప్పుకోలేదూ.. . స్నేహంగా ఉందాం. చే బదులు కైనా పనికి వస్తారు. కానీ ప్రయత్నం మానకూడదు అంటున్నారు. నేనూ అలాగే నా బజారు పనులకి  వాడేసుకుంటా. “అని వెళ్ళిపోయింది.

 మర్నాడు అశోక్ రావు భార్య కాల్ చేసింది.  ఆప్యాయంగా మాట్లాడబోయేలోగా ..

“చూడండి మేడం.  ఎవరికైనా సహాయం చేయడం మంచిదే. అందుకే ఇన్నాళ్లు ఊరుకున్నాను. మీకు ఉద్యోగం వచ్చేసింది గనక ఇక మీదట నా భర్త తో దూరంగా ఉండండి. మీరు ఏమన్నా అనుకోండి నాకే భయం లేదు. ఈ విషయం నా భర్త తో చెప్తే ఆయన గొడవ చేస్తే నేనూరుకోను. ఒంటరి ఆడది మీరే గనక మీ పరువే పోతుంది తప్ప నన్నెవ్వరూ ఏమి అనరు.”అని ఫోన్ పెట్టేసింది.  పెదవి బిగపెట్టి అవమానాన్ని దిగమింగుకుంది సావిత్రి.

సుందరమూర్తి కొడుకు పుట్టినరోజు పార్టీ కి పిలిచాడు.వెళ్లాలా.. వద్ద అనే మీమాంస లో పడింది సావిత్రి.

ఒకసారి భర్త చెప్పిన విషయం గుర్తుకొచ్చింది.

ఒకరోజు సాయంత్రం  కొలీగ్ ఇంట్లో బర్త్  డే పార్టీ ఉందని  ఫామిలీ తో రమ్మని ఆహ్వానించడనీ చెప్తే సంబరంగా వస్తానని అంది.

“ఒద్దులే.. అదేమంత ఆరోగ్యమైన ప్లేస్ కాదు”అన్నాడు.

“జాగ్రత్తగా ఉంటాలే”అంది

“ఒద్దు సావీ.. అక్కడ జరిగే ఉదంతాలు ఇంటి దాకా ఎందుకులే అని ఇన్నాళ్లు చెప్పలేదు. మగాళ్లందరూ ఆడ ఉద్యోగులకు  లైన్ వేసి ఎలాగోలా బుట్టలో పడెయ్యడం, తియ్యని కబుర్లుచెప్పి మాటలతోనే కాటేసే మహానుభావులుంటారక్కడ. ఆ మాటల ఊబిలో చిక్కుకుపోయి మోహాన్ని ప్రేమ అనుకుని పరుగులు పెట్టేఆడవాళ్లు మోసపోయాక గగ్గోలు పెడుతూ కటువుగా కఠినంగా తయారయి టీజింగ్ నేచర్ ని అలవాటు చేసుకుని తన తోటి ఆడవాళ్లనే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఒకసారి అశోక్ రావు తన భార్యని .తీసుకొచ్చాడు . అదే అదనుగా పరిచయాలు పెంచేసుకుని వాళ్ళ ఇంటికి పోయి  ఆమె తో మాట్లాడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే నానా అవస్థలు పడి వదిలించుకున్నాడు.  నువ్వెప్పుడూ వాళ్ళ కళ్ల పడకు.  ఒకవేళ పడినా గంభీరంగా ఉంటే సరిపోతుంది. ఉద్యోగం చేసే ఆడవాళ్లకి సరయిన గౌరవం దక్కడం లేదు . ప్చ్. ” అన్నాడు అనునయంగా.

అటువంటి ప్లేస్ లొనే తను ఉద్యోగం చేయాల్సి వచ్చింది. పిల్లలు గుర్తొచ్చి కళ్లు చెమ్మగిల్లాయి.  భర్త పోయాక అందరూ నెమ్మదిగా  కనుమరుగై పోయారు.

మనసంతా అదోలా ఉంది సావిత్రికి.

వర్క్ ఎంత బాగా చేసినా ఏదో ఒక తప్పు వెతికి చివాట్లు పెడుతున్నాడు మోహన్.

సుందరమూర్తి గుర్రుగా చూస్తున్నాడు. ప్రకాష్ పలకరించడం తగ్గించాడు.

ఒకరోజు కాస్త ముందుగా వచ్చింది  పెండింగ్ లో ఉన్న పని క్లియర్ చేయడానికి.

అప్పటికే అందరూ వచ్చినట్టున్నారు.

సావిత్రి సీట్ కి  ఒక ప్రైస్  టాగ్ అంటించి ఉంది. 2000 అని.  వరదరాజు దగ్గరికి వెళ్లి సిసి కెమెరా ఎటువైపు ఉందని అడిగింది. లేదని చెప్తూ ఎందుకని అడిగాడు వరదరాజు. 

ఏమిలేదని చెప్పి టాగ్ తీసి చింపేసి డస్ట్ బిన్ లో పడేసింది.

మర్నాడు రేటు టాగ్ పెరిగింది. అదీ చింపాక తగ్గింది.

మర్నాడు మరింత తగ్గింది.

ఎవరు ఇలా అల్లరి పాలు చేస్తున్నది?

వారం రోజులు టాగ్స్ లేవు.  అనవసరమైన నవ్వులు వినపడుతున్నాయి.

పది రోజుల తరువాత గిరిధారి పిలుపు. వెళ్ళగానే పెన్షన్ పెరిగిందని చెప్తూ  

“మీరు అదృష్టవంతులు. ఒక పక్క  మీ వారి పెన్షన్, మరొకపక్క మీ ఉద్యోగ  భృతి” అన్నాడు.

చివ్వున తలెత్తింది. టక్కున తల తిప్పేసాడు .

సావిత్రి సీట్లోకి రాగానే..

” మళ్లున్నా .. మాణ్యలున్నా  మంచె మీద  ..”అని పాడుతున్నాడు  ప్రకాష్.

“పాడి ఉన్నా .. పంటలు ఉన్నా పంచుకోను మనిషున్డాలి..” అని గొంతు పెంచాడు. ఎవరో కిసుక్కున నవ్వారు.

హెరాస్మెంట్ స్టార్ట్ అయిందని అర్ధం అయింది సావిత్రికి.  

**** 

మూడు నెలలు అతి భారంగా గడిచాయి. సహనంతో ఉంది సావిత్రి. తాను చదివింది సైకాలజీ.

మనిషి ప్రవర్తనని అర్ధం చేసుకోవడంలో ఇతరులకి సహాయం చేయాలన్న అభిమతం ఉన్నవాళ్లే మనస్తత్వ శాస్త్రాన్ని  చదువుగా ఎన్నుకుంటారనిపించింది. ఎదుటి మనుషుల ప్రవర్తన వల్ల స్త్రీ గా తనని తాను ఎలా రక్షించుకోవాలో కూడా అర్ధం అవుతోంది.

సమయం కోసం ఎదురు చూడడం తప్ప ఇప్పటి పరిస్థితుల్లో తాను మౌనంగా ఉండడమే  శ్రేయస్కరం.

సావిత్రిని  ఆలోచనల్లోంచి  బయట పడేసాడు గిరిధారి సార్ పిలుస్తున్నారంటూ వరదరాజు.

ఎప్పటిలా ముఖం చిట్లించకుండా నవ్వుతూ అభినందనలు చెప్పి మురళి పెండింగ్ ఎరియర్స్ శాంక్షన్ అయ్యాయని చెప్తూ.. పార్టీ అడిగాడు.

నవ్వుతూ ఈ ఆదివారమే  ఒక గెట్ టు గెదర్   ఇస్తానని చెప్పింది సావిత్రి.

*** 

ఆఫీస్ కి దగ్గర్లో ఉన్న రెస్టారెంట్.

ఒక్కరొక్కరుగా వస్తున్నారు.

సావిత్రి పిల్లలు ఇద్దరూ వారిని ఆహ్వానిస్తున్నారు.

అందరూ వచ్చాక..

“నా పేరు రిత్విక్. అన్నాడు మురళి,సావిత్రి ల పెద్ద  అబ్బాయి. చిన్న పిల్లవాడికి ఇంకా మాటలు రావని  వాడి పేరు మధు అని చెప్పి మీ పేరు ? అని అడిగాడు. మోహన్ ని.

పేరు తెలుసుకుని

“రండి మోహన్ మామయ్య.. నాకు ఆఫీస్ లో బోల్డంతమంది మామయ్య లు, పిన్ని లు ఉన్నారట కదా.. మీరందరూనా?  అడిగాడు అమాయకంగా. 

అందరూ  గుతుక్కుమని మొహాలు చూసుకుంటున్నారు.  నవ్వులు పులుముకుంటూ  పార్టీ లో పాల్గొన్నారు.  వరదరాజు రాగానే –

అమ్మా!రాజు మామయ్య వచ్చారు. “అన్నాడు రిత్విక్. అందరి దృష్టి అటు మళ్లింది.

పార్టీ మొదలయింది.

అందరి టేబుల్స్ దగ్గరికి వచ్చి అన్నీ సరిగా అందుతున్నాయో లేదో చూస్తోంది సావిత్రి. ఎవరికి

ఏవి ఇష్టమో అడిగి తెలుసుకుని ఆర్డర్ చేస్తోంది. మందాకిని రిత్విక్ ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తోంది.

“పిన్ని , అదిగో అక్కడ కొండలు ఉన్నాయా? అవి ఇక్కడికి దగ్గరగా ఉన్నట్టు కనపడతాయా? కానీ దగ్గరగా ఉండవు. అలా కనపడతాయి అంతే.. !అన్నాడు ముద్దు ముద్దుగా. అందరూ రిత్విక్ వైపు చూసారు.

నవ్వింది శ్రీలత. 

“అవును నాన్న.. కన్ను  వస్తువునుచూస్తుంది. దానిని మనసు అర్ధం చేసుకుంటుందిఅనుకుంటాం. కానీ ఉన్నది ఉన్నట్టుగావాస్తవ దృష్టి కాకుండా మనం ఊహించుకున్న వాస్తవ దృష్టి తో చూస్తాం. అదే మనసు చేసే గారడి. “అంది.

ఆమె అన్నది అందరికి వినపడుతోంది. చిన్న రెస్టారెంట్.. పైగా నిశ్శబ్దం గా ఉన్నారందరూ.

***** 

సోమవారం.

ఉదయం పది గంటలు.

ఆఫీస్ లో  ఆఫీస్ వర్క్ జరుగుతోంది.

దూరంగా ఉన్న కొండలు  దగ్గరగా లేవిప్పుడు.

*****

రచయిత్రి స్వీయ పరిచయం :

నా పేరు  – బులుసు సరోజినిదేవి.

నివాసం : విశాఖపట్నం

2010 అక్టోబర్ నుంచి రచనలు చేస్తున్నాను.

నా మొదటి కవితకు జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డ్ లభించింది.    ప్రతిష్టాత్మకమైన  జాతీయస్థాయి ఎక్స్ రే  అవార్డ్  లభించింది.  ఆ తరువాత 50 కవితలకి బహుమతులను అందుకున్నాను. 

వ్యాసాలు కూడా రాస్తుంటాను. నా మొదటి వ్యాసం బహుమతిని గెలుచుకుంది. 

ఇలా నా రచనా వ్యాసాంగం కొనసాగుతోంది. 

ఇప్పటి వరకు – 200 కవితలు, 60 బ్లాగ్స్, 30 కధలు రాసాను. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.