చాతకపక్షులు  (భాగం-3)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

గీత లేచి పెట్టెలోంచి, చీరే జాకట్టూ, లంగా తీసుకుని బాత్రూంలోకి వెళ్లింది. స్నానం ముగించుకు వచ్చేసరికి, రాధా మాధవులు వచ్చేశారు. ఇద్దరు పిల్లలు వాళ్లకి, వయసులు ఎనిమిదీ, పదీ.

“పిల్లలేరీ?” అనడిగేడు హరి తలుపు తీస్తూ. 

“మా పక్కింటావిడ వాళ్ల పిల్లలతో County fair‌కి తీసుకెళ్లింది వాళ్ల పిల్లలతోపాటు. మధ్యాన్నానికి వచ్చేస్తారు. అందుకే హడావుడిగా ఇటొచ్చేశాం ఆకాస్త టైమునీ సద్వినియోగం చేసుకుందాం అని.” అన్నాడు మాధవు.

గీత వాళ్లని చూసి మనసులోనే లెక్కలు కట్టుకుంటూ, ఓదశాబ్దం పెద్దవారు అనుకుంది. 

మరో అరగంట అయేసరికి సుమతి, టేషు దిగారు. టేషుకి కారు లేదు. సుమతి అతన్ని తీసుకొచ్చింది తనకారులో. ఆవెంట పాణీ, విశ్వం దిగేరు. వీరంతా బ్రహ్మచారులే.

గీత అందరికీ కాఫీలు పెట్టింది. ఆవిడ ఇండియానించి తెచ్చిన మిఠాయిలూ, తను ముందురోజు బజారులో కొన్న కుకీలూ ప్లేటులలో పెట్టి హరి బల్లమీద అమర్చేడు. 

మాధవు కుకీలపళ్లెం పక్కకి తోసేస్తూ, “ఇంతమంచి పుల్లారెడ్డి స్వీటులతో ఆ కుకీలు పెడతావేమిటి?” అన్నాడు. అతనికి తెలుగువంటలంటే జిహ్వ లేచొస్తుంది.

టేషుకి అలాటి పట్టింపులు లేవు. “వేటిరుచి వాటిదే. నీకక్కర్లేకపోతే నువ్వు తినకు” అన్నాడు ఓకుకీ, ఓ లడ్డూ ఒకే చేత్తో పుచ్చుకుని. “అబ్భ, ఇంతమంచి కాఫీ తాగి రెండేళ్లయిందండీ” అన్నాడు కాఫీ చప్పరిస్తూ. 

ఉదయం హరి పెట్టిన కాఫీ గీతకి ఆనలేదు. అంచేత కాఫీపొడి రెండింతలు వేసి, చిక్కగా డికాక్షను తీసి, దానికి తగినట్టు పాలూ, పంచదారా కలిపింది. 

“నువ్వు కూడా గబగబా ఇండియా వెళ్లి, పెళ్లి చేసేసుకునొచ్చేస్తే, ఎంచక్కా రోజూ మంచికాఫీ తాగొచ్చు” అంది సుమతి నవ్వుతూ. 

“నీసలహా బాగానే వుంది కానీ తీరా పెళ్లి చేసుకొచ్చింతరవాత ఆవిడగారు గీతగారంత బాగా కాఫీ పెట్టకపోతే, ఇటుపై నాగతేమీ అని పాడుకోవాలి. రిటర్న్ పాలసీ వుందో లేదో ముందే కనుక్కో” అన్నాడు విశ్వం. 

“పెళ్లిచూపులవేళ ఆవిడచేత కాఫీ పెట్టించి పరీక్షించుకో”అంది రాధ. 

వివాహము అనబడే ఘనమైన విషయాన్ని వీళ్లందరూ అదేదో బొమ్మలాటకింద జమకట్టి హాస్యాలాడడం గీతకి ఆశ్యర్యంగా వుంది. అవమానకరంగా కూడా తోచింది. ఆమాటే అంది. 

“మీకు పెళ్లంటే నవ్వులాటగా వుందే” అని.

సుమతి నవ్వుతూ, “అది కాదండీ. టేషు పెళ్లివిషయంలో ఓ ఫార్ములా తయారు చేసుకున్నాడు. ఓ పెద్ద చిట్టా తయారు చేశాడు తనకి వచ్చిన సంబంధాలన్నీ. వారానికోమారు కూచుని ఆచిట్టా తిరగరాస్తుంటాడు. ఆ అమ్మాయిల అందచందాలూ, విద్యార్హతలూ … వగైరా.. అంటే డాక్టరయితే పిల్లలకి అదేలెండి పుట్టబోయేవాళ్లకి జలుబు చేసినా జొరం వచ్చినా చూసుకోగలదు, లెక్కలమేజరు అయితే ఇన్వెస్టుమెంటులు చూడగలదూ అలా. స్థూలంగా అతని అభీష్టాలు ఆరోజు గ్రహబలాన్నిబట్టి  మారుతూ వుంటాయి” అంది.

టేషు మూతి ముడుచుకుని, “మీకు నవ్వులాటగానే వుంటుంది. పెళ్లంటే నూరేళ్ల పంట గదా. దీర్ఘకాలిక మంచీ చెడూ చూసుకోవద్దా?” అన్నాడు.   

“సరే. ఒంటిగంటవుతోంది. పదండి. చైనీస్ రెష్టారెంటుకి వెళ్దాం” అన్నాడు విశ్వం. 

“ఛ, అదేం కోరికరా. మాయింటికి తొలిసారి వేంచేశారు. లంచిక్కడే” అన్నాడు హరి.

గీత గుండెలు గుభేలుమన్నాయి. 

“నీరెండు గదుల్లోనూ ఆవిడికింకా వంటిల్లేదో తెలిసిందో లేదో అప్పుడే సంతర్పణలేమిట్రా. నాలుగు రోజులు పోయేక మళ్లీ వస్తాంలే” అన్నాడు విశ్వం. 

“భయపడకోయ్. మీచెల్లెమ్మనేం కష్టపెట్టనులే. నేనే చేస్తాను” అన్నాడు హరి. 

రాధ నవ్వింది, “మీ వంటలు చాలానే తిన్నాం. మేం చేస్తాంలెండి. మీరు అటు రాకుండా వుంటే అదే గొప్ప సాయం” అంటూ లేచి వంటగదిలోకి వెళ్లింది, చనువుగా గీతచెయ్యి పుచ్చుకుని. 

సుమతి వారిద్దరినీ అనుసరించింది. 

“అన్నట్టు గణపతిగారేరీ?” అన్నాడు మాధవు.

“అవును సుమా, గణపతిగారు లేనిపార్టీ చక్రాల్లేని బండి. ఉండండి, పిలుస్తాను” అని హరి ఫోను తీశాడు.

మరోపావుగంటలో గణపతి వచ్చేడు మరో ఇద్దరు మిత్రులని వెంటేసుకుని. గీతకి మన శుభలేఖల్లో రాసే బంధుమిత్రసపరివారసమేతంగా అన్న పదబంధం గుర్తుకొచ్చింది. అచ్చంగా మనదేశంలో వున్నట్టే వుంది ఆ పూట ఆవిడకి!

రాధ ఇంట్లో మనిషిలాగే స్వతంత్రంగా ఫ్రిజ్ లోంచి కూరలు తీసి, ఓపక్కన పెట్టి, ఓగిన్నెలో బియ్యం మూడు కప్పులూ, నీళ్లూ పోసి వెనక బర్నరుమీద పెట్టింది. మరోపక్కన బాణలిలో నూనె పోసి, అది కాగుతుండగా, బంగాళదుంపలు చక్రాల్లా తరిగింది బజ్జీలకి. మళ్లీ ఇటుతిరిగి ఉల్లిపాయలు కౌంటరుమీద పెట్టింది తరగడానకి, 

అంతవరకూ ఏదో సినిమాలో వంటచేయు సీను చూస్తున్నట్టు చూస్తున్న గీత తెలివి తెచ్చుకుని, “ఇటివ్వండి. నేను తరుగుతాను” అంది. 

సుమతి అందుకుని, “ఇవాళ్టికి మావంతు. మీరు నవవధువు కదా. ఆమాత్రం గౌరవం మేం వుంచుతాం. ఆ తరవాత కిచెనంతా అచ్చంగా మీదే,” అని రాధచేతిలోంచి కత్తీ, వుల్లిపాయలూ, టొమాటాలూ తీసుకుని తరగడం మొదలుపెట్టింది. 

సుమతి తాను తెచ్చిన కొత్త ప్రెషరుకుకరుకి ప్రారంభోత్సవం చేస్తూ పప్పు పడేసింది. 

గంటలో వంట అయిపోయింది. పులిహోరా, బజ్జీలూ, సాంబారూ అన్నం. బంగాళదుంపల కూరా అప్పడాలూ. 

“మీరు వంట చేసినట్టులేదు, మాయ చేసినట్టుంది కానీ” అంది గీత సుమతీ, రాధా గబగబా అటూ ఇటూ తిరుగుతూ వంట చేసేస్తుంటే. 

“మీకూ వస్తుందిలెండి పాకశాస్త్రప్రావీణ్యం. దేశంలో వున్ననాళ్లూ గిన్నేదో గరిటేదో తెలీనివాళ్లు కూడా ఇక్కడికొచ్చేక ఇట్టే గొప్ప వంటవాళ్లయిపోతారు” అంది సుమతి నవ్వుతూ. 

“మీరు మిరపకాయ బజ్జీలు చేస్తారాండి?” అనడిగేడు గణపతి గీతని.

“ఏం, మీకు ఇష్టమా?” అంది గీత, వచ్చో రాదో చెప్పకుండా. నిజానికి తనెప్పుడూ వంటింట్లో అడుగు పెట్టలేదు. ఇంతకుముందు టేషుకోరిక విన్నప్పుడే కాస్త బెరుకు కలిగింది, హరి కూడా కొంపదీసి అలాగే అనుకుంటున్నాడేమోనని. తన వంటవిద్వత్తు చర్చకిది సమయం కాదు. 

“మిరపకాయబజ్జీలు ఇష్టం కాకపోతే కష్టపడి అయినా అందరూ తినాలండీ. ఆరోగ్యం” అన్నాడు గణపతి.

“ఏంటీ?” తెల్లబోయింది గీత. 

“మిరపకాయల్లో విటమిల్ సీ పుష్కలంగా వుంది. మెదడుకి పదును పెడుతుంది కారం నసాళానికి అంటి. సిగరెట్ అలవాటు మానిపించడానికి ఇది వుత్తమసాధనం” అన్నాడు గణపతి.

“ఎటామిక్ ఎనర్జీ కూడా పుట్టించొచ్చు” అన్నాడు మాధవు.

గీతకి వాళ్లమాటల్లో హాస్యం అంతుబట్టలేదు. వింటూ కూచుంది. ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుంటూ భోజనాలయేసరికి రెండున్నర దాటింది. రాధ గిన్నెలు తీస్తుంటే గీత “నేను తీస్తానులెండి. ఆమాత్రం చేతనవు నాకు. మీరు కూర్చోండి” అంది.

“ఫరవాలేదులెండి. రాధ తీసి పెడుతుంది. మీరు కూర్చోండి” అన్నాడు మాధవు భుక్తాయాసంతో సోఫాలో వెనక్కి వాలి. 

“ఎవరూ వద్దు. నేను చూసుకుంటాను అవన్నీ. పదండి అందరూ” అంటూ హరి అందర్నీ హాల్లోకి తోలేడు. 

గీత మాధవు అన్నమాట ఆలోచిస్తోంది. విచిత్రం. “నేను చేస్తాను” అనడానికీ, “ఆవిడ చేస్తుందిలెండి” అనడానికీ మధ్య తేడా అతను గమనించలేదా, తాను గమనిస్తాను అనుకోలేదా? కానీ అట్టే ఆలోచించలేదు. ప్రయాణపుబడలిక ఇప్పుడు తెలుసొస్తోంది నెమ్మదిగా. కళ్లు మూతలు పడపోతున్నాయి. 

రాధ అది చూసి, “వీళ్లు ఇప్పుడప్పుడే కదలరు. మీరు వెళ్లి పడుకోండి” అంది. 

“ఫరవాలేదండీ. నిద్ర కాదు” అంది గీత పట్టుబడిపోయినందుకు సిగ్గు పడుతూ. 

“ఫరవాలేదనే మేమూ చెపుతున్నామండీ. ఇక్కడ మాకివన్నీ అలవాటే. జట్లాగు అలాగే వుంటుంది నాలుగు రోజులపాటు. వెళ్లి పడుకోండి” అన్నాడు విశ్వం. 

హరి కూడా అదే అనడంతో గీత లేచి పక్కగదిలోకి వెళ్లింది సందేహిస్తూనే. 

మంచంమీద వాలిందో లేదో కళ్లు ఠపీమని మూసుకుపోయేయి. వచ్చిన అతిథులు ఎప్పుడు వెళ్లేరో తనకి తెలీనేలేదు.

రెండోరోజుకి జట్లాగు తగ్గి, ఆ రాత్రి బాగా నిద్ర పట్టింది. కళ్లు తెరవాలని లేదు కానీ వరదలా వెలుగొచ్చి గదంతా కమ్మేసింది.  

“అబ్భ ఎందుకా లైటు, తీసేయండి బాబూ, నాకింకా నిద్రమత్తుగానే వుంది” అంది గీత.

“నాకూ అలానే వుంది కానీ నేనేం అలనాటి సుమతినా సూర్యుణ్ణాపడానికి” అన్నాడు హరి.

“ఒక్క అయిదు నిముషాలు” అంది అతనికి మరింత దగ్గరికి జరగి దుప్పటి మొహంమీదికి లాక్కుని ముడుచుకు పడుకుంటూ.

“సరే, నువ్వు పడుకో. నేను కునికితే మా బాసురుడు కినుక వహించును” అన్నాడు హరి గీత చెయ్యి సుతారంగా తొలగించి, పక్కన పెట్టి.

మరో నాలుగునిముషాలకి గీత నిద్ర తేలిపోయింది. లేచి మొహం కడుక్కుని వచ్చేసరికి హరి కాఫీ పెట్టి, బౌల్లో సీరియలూ, పాలూ పోసుకుని కూర్చున్నాడు బల్లదగ్గర. 

గీత అతనికి ఎదురుగా కూర్చుంది. అతను ఆచల్లటిపాలతో సీరియలు తినడం చూస్తుంటే జాలి ముంచుకొచ్చింది. 

“రేపు ఉప్మా చేస్తాను” అంది 

హరి ప్చ్ అని చప్పరించి “అదే అలవాటయిపోతుంది నీకూనూ” అన్నాడు.

 గీత “నావల్ల కాదు బాబూ సప్తజన్మలెత్తినా” అంది వికారంగా మొహం పెట్టి. 

మొన్నటి సంభాషణలు గుర్తుకొచ్చేయి. “అదేమిటండీ ఆ గణపతిగారు మిరపకాయ బజ్జీలకీ సిగరెట్లకీ ముడి పెడతారు.” అంది కళ్లు చిట్లించి.

“వాడిమొహం. వాడి రిసెర్చి అది. నువ్వే విషయం మొదలెట్టినా మిరపకాయల్లోకే దింపుతాడు.”

“రిసెర్చా?”
”మిరపకాయలలో పోషక గుణాలమీద.”

సూక్ష్మంగా గణపతి కథ ఏమిటంటే, అతను అమెరికా వచ్చి పదేళ్లవుతోంది. అంతకుమున్ను అతని తల్లిదండ్రులు అమెరికాలో వున్నప్పుడు అతను పుట్టేడు. తరవాత అందరూ ఇండియా వెళ్లిపోయారు. అమెరికాలో పుట్టేడు కనక పద్ధెనిమిదో ఏట అతనికి అమెరికను సిటిజనుషిప్పు తీసుకోడానికి అవకాశాలున్నాయి. అది వినియోగం చేసుకోడానికి అతన్ని అమెరికా పంపించేరు. వాళ్లనాన్నగారి పినతంఢ్రి మనవడి తోడల్లుడు అమెరికాలోనే వున్నాడని ఆరా తీసి, వాళ్లింటికి ఆ చిట్టి గణపతిని అంపకాలు పెట్టేశారు. ఆ పి.తం.మ.తో. కూడా కుర్రాడిని ఇంట్లో పెట్టుకుని తప్పకుండా చదివిస్తానని హామీ ఇచ్చేడు. అసలు ఇండియాలో వుండగానే గణపతి తండ్రి అబ్బాయిని వీలయినంత మాలీసు చేసేడు అమెరికాలో నిజమైన సిటిజనుడిగా స్థిరపడడానికి. అయినా గణపతికి అందరిలాగే కొత్తదేశపు ఆచారాలూ వ్యవహారాలూ ఒంట పట్టించుకుని చదువూ వుద్యోగమూ జోడుగుర్రాలస్వారీ చేస్తూ ఓదారికి రావడానికి ఎనిమిదేళ్లు పట్టింది. ప్రస్తుతం స్టూడెంటసిస్టెంటుగా జరుపుకొస్తున్నాడు. అతనికి తగ్గట్టుగానే ఓ ప్రొఫెసరుగారు కూడా దొరికేరు. ఆప్రొఫెసరుగారు చిన్నతనంలో ఆంధ్రాలో కొంతకాలం వున్నారు. ఆయన తండ్రి తెల్లనివాడూ తల్లి తెలుగుతల్లీను. అందుచేత ఆయనకి తెలుగువారన్నా, తెలుగు వంటలన్నా వీరాభిమానం. 

“మనవంటలు నిజంగా తింటారా?” అంది గీత. అంతకుముందు కలిసిన పీటర్ గుర్తున్నా, అలాటివారు ఇంకా వున్నారంటే ఆశ్చర్యంగానే వుంది. 

“అంటాడు. కబుర్లే. గజందూరంలో మిరపకాయ కనిపిస్తే కుండెడు నీళ్లు తాగుతాడు” అంటూ వాచీ చూసుకుని, “నాకు టైమయిపోతోంది. నీతో ఇలా హస్కేసుక్కూచుంటే ఉజ్జోగానికి నీళ్లధారే. నే వెళ్తున్నా. తలుపు రెండు గడియలూ వేసుకో. ఎవరొచ్చినా తలుపు తియ్యకు. అయినా ఎవరూ రారులే. ఎవరైనా తలుపు తట్టినా తియ్యకు. వాళ్లే పోతారు” అంటూ గబగబా సీరియలుబౌలూ, కాపీకప్పు సింకులో పడేసి వెళ్లిపోయేడు. 

గీతకి జట్లాగు వదిలి మెదడు పని చేయడం మొదలయింది. క్రమంగా సంగతులు క్రమేణా తెల్లమవుతున్నాయి. హరిమాటలు అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది. ఎవరూ రాకపోతే తలుపు తీసే ప్రసక్తి ఎందుకు వస్తుంది? భయం లేకపోతే తలుపులు బిగించుక్కూచోడం ఏమిటీ? ఆలోచనలు ఓ కొలిక్కి రాకుండానే మళ్లీ నిద్ర పట్టేసింది. కూర్చున్న సోఫోలోనే వాలిపోయింది.

 

* * * * *

(ఇంకా ఉంది)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.