‘సవ్వడి’ కవితా సంపుటి పై సమీక్ష

   -వురిమళ్ల సునంద

వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేసిన కవుల్లో  బాల గంగాధర్ తిలక్ గారికి ఓ ప్రత్యేక స్థానం ఉందంటారు కుందుర్తి.
వచన కవిత రెండు ప్రధానమైన శైలులతో ప్రయాణం చేస్తుందనీ పూర్వ కావ్య భాషా సంప్రదాయానికి చేరువగా నడుస్తున్న శైలి. మరొకటి వ్యావహారిక భాషా వాదాన్ని జీర్ణించుకుని సమకాలీన ప్రజల హృదయాలకు దగ్గరగా నడుస్తున్న శైలి. ఈ రెంటిలో అత్యధిక కవితలు రెండవ శైలిలో  రాసినా అక్కడక్కడా సంస్కృత భాషా శబ్ధఛాయలు కనబడడం విశేషం.  ఇవి రెండూ   తిలక్ కవిత్వంలో  కనబతాయని, ఆ భావ కవితాచ్ఛాయల బంధం నుండి కొన్ని చోట్ల తిలక్ బయటపడలేదని  కుందుర్తి గారు అంటారు.
 
అందుకేనేమో ఈ కవితా సంపుటికి ముందు మాట రాసిన ఆచార్య కసిరెడ్డి గారు
‘వాత్సల్య స్పర్శ’  లో  
“చరిత్రల రక్త జలధికి/ స్నేహ సేతువు నిర్మిస్తున్నాను రండి” అన్న తిలక్ కవిత్వాన్ని ఉటంకిస్తూ కవయిత్రిని ‘తిలక్ కు కుడి ఎడమలో నిలుస్తుందని అంటారు.
కవయిత్రి జ్యోత్స్న ప్రభ గారి హృదయ ‘సవ్వడి‘ లోంచి అక్షర రూపాన్ని ధరించిన ప్రతి కవితా సామాజిక స్పృహ కలిగి ఉంటాయి. సమాజ గమనంలో వస్తున్న మార్పులు, సంఘటనలు,తానో అధ్యాపకురాలిగా అనుభూతించిన సమయాలు, ప్రకృతి పై గల ప్రేమ, అనుబంధాల పట్ల గల గౌరవం.. ఒకటేమిటి ఇందులో ప్రతి కవిత” అర్థ సౌందర్యంతో కూడిన పదాల కూర్పుతో, ధ్వని మాధుర్యంతో   శైలిలో రాసిన ప్రతి కవిత చదువరులకు అనిర్వచనీయమైన  సంతృప్తి, సంతోషం కలిగేలా తనదైన ప్రపంచంలోకి తీసుకెళుతుంది. తన దృష్టితో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
ముందు మాటలో సినారె గారు ఈ కవితా సంపుటి పేరే సవ్వడి . అది గాడ్పు సవ్వడి, నిట్టూర్పు సవ్వడి… ఇలా
ఇందులో అన్ని రకాల సవ్వడులు ఉన్నాయంటారు. అనుమాండ్ల భూమయ్య గారు కవయిత్రి ఎన్నాళ్ళ నుండో కన్న కలల సవ్వడి.ఈ కవితలు కవయిత్రి హృదయాన్ని, ఊహాశక్తిని తెలుపుతూ నిశ్శబ్ద ప్రవాహమై హృదయాన్ని పలుకరిస్తాయని అంటారు.
మరి మనం  కవయిత్రి హృదయ సవ్వడులను చూద్దాం…
 మొట్టమొదటి కవిత ‘వెన్నెలా! వెన్నెలా!’  ఇది చదువుతుంటే కవితా వెన్నెల ధారల్లో  తడిచి పులకించి పోతాం. వెన్నెల గురించి రాసిన ఈ వాక్యాలు.. “జగన్మోహిని కరార్పిత భాండంలోంచి
జారిపారే అమృత బిందువుల్లా ఎంత అద్భుతంగా ఉన్నావు వెన్నెలా.. ఆ అమృతాన్ని మనకూ పంచుతారు. 
అమ్మా నాన్నల అనురాగం, ఆర్ద్రతతో ,పసిపాపల పాలనవ్వుతో పాటు నాటి నుండి నేటి కవుల రచనల్లోని  మాధుర్యంతో పోలుస్తూ తన శ్వాస,భాష నీవేనంటారు.
నేస్తమా! కవితలో  పర్యావరణ కాలుష్యముతో సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావంతో.. పచ్చని చెట్ల స్థానంలో పెరిగిన అపార్ట్మెంట్లతో నిలువ నీడ లేక కనుమరుగైన  పిచుక నేస్తాన్ని స్వాగతిస్తూ బాల్యంలో తనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ‘ప్రతి ఇంటా ఒక తోటని/ పాపలా పాలించమని అందరినీ ప్రార్థిస్తా…. అంటారు. కవయిత్రి జ్యోత్స్న ప్రభ గారి లా ప్రతి ఇల్లూ తోటయితే తప్పకుండా మళ్ళీ వస్తాయి మన పిచ్చుక నేస్తాలు.
“చీకటి-రోచిర్నివహంలో”
 ఈ కవితలో అనాది ఆధిపత్యాన్ని చీకటితో పోలుస్తారు. ఆధిపత్యం చెలాయిస్తున్న  చీకటి  ఊపిరి పోసుకున్న శ్వాసను వదలదు, ఎంతగా అదిలించి విసిరికొట్టినా వదలని చీకటి పైకి  ఆత్మాభిమాన  సూర్య కిరణాన్ని  ఎక్కు పెట్టగానే.. ‘తమిస్రం తునాతునకలైంది/ వేకువ వెలుగుల్లో/ భళ్ళున పగిలి ముక్కలు ముక్కలుగా… చీకటి”
ఈ ఉదయాన్నిక అస్తమించనివ్వను/…. నా జీవనాకాశం కాదిపుడు శూన్యం/ అది ఉదంచితోజ్వల రోచిర్నివహం” అంటూ ఆధిపత్యం పది ఘట్టనలలో  అణచి వేయబడుతున్న మహిళల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపే కవిత ఇది.
 ‘మట్టి’ ఇప్పటి తరానికి తెలియని మట్టి.. తప్పని సరిగా మనిషికీ మట్టికి ఉన్న బంధమేదో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత.. చారిత్రక, భూగోళ శాస్త్రాలు చదివితే మట్టిలో రకాలు, మట్టి కోసం చేసిన మారణ హోమాలు, ఈ మట్టే  తినే బువ్వనిస్తుంది ప్రాణవాయువు నిచ్చే చెట్లను ఇస్తుంది..
మట్టి విలువ తెలియాలంటే ఓ సైరికుని,ఓ సైనికుడిని, మరో శ్రమ జీవిని అడిగితే తెలుస్తుందంటూ
“మట్టిని ముట్టుకున్నాకే మనిషి మనిషిగా ఎదిగాడు” అని రాసిన వాక్యం మనసుకు తాకి మనమేంటో 
మట్టితో మానవుని బంధమేంటో చెప్పిన కవిత చదివాకా 
మట్టి తల్లిని ప్రేమగా సృజించాలనిపిస్తుంది. మట్టి గోడపై నాలుగు నీళ్ళ చుక్కలు చిలకరించి వెంటనే మట్టి వాసన పీల్చి పులకించి పోవాలని అనిపిస్తుంది.
 “పుట్టగానే/ ఏడడుగులు నడిచిన/ పుణ్యమూర్తి అతడు/.. కొత్త తత్వం కనిపెట్టి/ కన్నీళ్ళకి ఆనకట్టలు కట్టి/ధర్మం, సంఘం,బుద్ధం/ శరణమని అన్నాడు అతడు” ఈ వాక్యాలు చదవగానే ఎవరో తెలిసిపోతుంది  ఆ కరుణా మూర్తి బుద్దుడేనని. అలాంటి తథాగతుని విగ్రహం పై తాలిబన్లు వేసిన బాంబులను నిరసిస్తూ, ఖండిస్తూ.. చివర్లో రాసిన ఈ వాక్యాలు చదివితే నిజంగా వాళ్ళు మనుషులుగా  మనసును ఆత్మ శోధన చేసుకుంటారు.”: అజ్ఞానీ ! ఆ ఓం శాంతి కాంతి జ్వాలల్లో/ మాడి మసే అవుతావో/ పునీతుడవే అవుతావో?.. అంటూనే.. అయినా
అహింసా మూర్తినా నువ్వు అవమానించేది? ఆగామి యుగాలు నిన్ను అసహ్యించుకోవా ? ఆవేదనతో రాసిన కవిత “బహిమియాన్”.
 ఈ కవితా సంపుటి శీర్షిక ‘సవ్వడి‘ కవితలో” శంఖం లాంటి నా హృదయానికి చెవి చేర్చి/ విను నేస్తం/ అలల ఘోష,కలల భాష/ అన్నీ వినిపిస్తాయి/ శబ్ధ విదుడవైతే తప్ప/ ఆ నాదాన్ని అందుకోలేవు… 
నాద కోవిదుడవైతే తప్ప/ ఆ స్వరాలను గ్రహించలేవు….
” హృదయంతో అభ్యాసం చేయ్”…
‘నా ప్రాణ లయలో నిల్చిన/ హృదయ ధ్వని సంగీతం వినిపిస్తాను…..
నా కలల సవ్వడిని/పాటల పరిమళాలను పరిచయం చేస్తాను” ఈ పంక్తులు చాలు కవయిత్రి ప్రకృతి ఆరాధన, సున్నితమైన హృదయ స్పందన..
 మన ఉనికిని తెలిపే భాష,మన మనసును ఆవిష్కరించే అక్షరం గురించి హృద్యంగా .. శతాబ్దాల చరిత్ర తో ,గత వైభవ దీప్తులతో అక్షతంగా నిలిచి వెలిగే తెలుగు అక్షరం గురించి చక్కని చిక్కని భావజాలం.యశః కౌముదులు ప్రతిఫలించే “తెలుగు అక్షరాన్ని” కవిత కవయిత్రి భాషా పటిమకు, పరిశోధనకు మచ్చు తునక.
ఆలూ మగల అనుబంధంలో అప్పుడప్పుడు కాఫీ కప్పులో తుఫాన్ లా అహాలు, పంతాలు పట్టింపులను పెంచుతాయి. ఆ సమయంలోనే ఇద్దరూ త్వమేవా..హమ్ అనుకుంటే సహ జీవన సమభావన సౌందర్యం / సౌహార్థ్రం భాసిస్తుందని భార్యాభర్తల రమ్య జీవిత రహస్యం అందరికీ తెలియాలి” అంటారు. అలా ఇద్దరూ అనుకుంటే ప్రతి ఇల్లూ రసరమ్య గీతమే కదా..
‘ప్రయాణం’లో తన కళ్ళ కెమెరా తీసిన సుందర దృశ్యాలను వర్ణిస్తూ’ ప్రయాణం ఒక అలౌకిక లోకం’ .. ప్రయాణం ఒక కవిత్వం” అంటారు.
నేటి కార్పోరేట్  చదువుల విధానం ఎంత లోప భూయిష్టంగా ఉందో పసితనం స్వేచ్ఛను ఎంతగా హరిస్తుందో.. చదువులో పోటీ, ర్యాంకులు రాలేదని ఆత్మ హత్యలు.. ఇవన్నీ చూసి విని కవయిత్రి హృదయం ఎంతగా క్షోభించిందో… తనతో పాటు మనల్ని కంట తడి పెట్టిస్తారు. వారి కోసం నీతి నిజాయితీ ప్రేమ కరుణ క్షమ పాఠ్యాంశాలు గా, శాంతిని సౌశీల్యాన్ని సూత్రాలుగా, సిద్దాంతాలుగా,మంచినీ మానవత్వాన్ని డిగ్రీలు గా పంచేందుకు
 “మరో బడికి” 
నిన్నూ నీ తోటి వారిని/ అందరినీ ఆహ్వానించాలని ఉంది” అంటారు.
ఉద్యోగం చేసే అమ్మలు బిడ్డలను వదిలి వెళుతూ పడే ఆవేదనను.”అమ్మలు ఉద్యోగం చేయొద్దు” అన్న మాటలు
పదే పదే గుర్తొచ్చి.. వారికి సమాధానం చెప్పలేని దుఃఖాన్ని కవిత్వీకరించిన తీరు చదువుతుంటే ఉద్యోగ మహిళల కన్నుల్లో కన్నీళ్ళు పొంగుతాయి. అసలు కవిత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే వారి ‘జీవన భాష’ కవితని తప్పకుండా చదవాలి…. కవిత్వం… “జీవితమనే గీతానికి తాత్పర్యని” ..ఇపుడే తెలిసింది అంటారు.
 ఇలా… మంచులాంటి మనసును తాకి కరిగి నీరై ప్రవహించేలా చేసే కవితలెన్నో ఇందులో ఉన్నాయి.
అమ్మా నాన్నలకు “నిర్వచనం”,  గుండెలోని మైట్రల్ వాల్వ్ సమస్య ఇబ్బంది పెడుతుంటే తనలోని భావోద్వేగాలను “లయ- శృతి’ గా, తనకు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని కూడా ఓ ప్రేరణగా రాసిన ‘అకుంఠిత గమనం’ లాంటి వాటితో పాటు మాన్య, మాతృభారతి,తోకలేని పిట్ట,,నా పల్లె లాంటివెన్నోసస వస్తు వైవిధ్యంతో సామాజిక స్పృహ కలిగిన  కవితలే. ఇందులో 65 కవితలు ఉన్నాయి.
ప్రతి కవితా పాఠకుల హృదయాలను గెలుచుకునేదే.. కవయిత్రి రచనా పాటవానికి  జేజేలు పలికించేదే.
వారి చైతన్య శీలతకు, వారి రచనా శైలికి మనసా వందనాలు తెలుపుకుందాం.
 
సమీక్షా వ్యాసం
పుస్తకం పేరు:  సవ్వడి( కవితా సంపుటి)
కవయిత్రి; జ్యోత్స్న ప్రభ
ప్రచురించిన సంవత్సరం: మే 2004
వెల:60/రూ
ప్రతులకు:-
విశాలాంధ్ర బుక్ హౌస్,
ప్రజాశక్తి బుక్ హౌస్,
నవోదయ బుక్ హౌస్, దిశా పుస్తక కేంద్రాలు హైదరాబాద్..
 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.