నడక దారిలో-7

-శీలా సుభద్రా దేవి

 1965-66 సంవత్సరాలలో దేశంలోనూ, రాష్ట్రంలోనూ,మా ఇంట్లోనూ కూడా అనేక మార్పులు,సంఘటనలూ మైలురాళ్ళలా పాతుకున్నాయి.

       1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధకాలంలో దేశాన్ని ప్రధాని గా నడిపించారు లాల్ బహదూర్ శాస్త్రి .  1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయింది. ఒప్పందం జరిగిన తరువాత రాత్రే తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గుండెపోటుతో మరణించినట్లు వార్త. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యే ఆనే కథనాలు విన్నాము.

       ఆ సందర్భంగా నెలకొన్న రాజకీయ సమీకరణాల్లో ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఆ రోజు స్కూల్ లో ప్రార్థన   సమావేశం లో మొట్టమొదటి మహిళా ప్రధాని గా ఇందిరా గాంధీ గురించి చెప్పారు.తరగతి గదిలో కూడా క్లాసు కి వచ్చిన మాష్టార్లు ఆడపిల్లల కి ప్రత్యేకం గా అభినందించారు.అప్పడు ఆడపిల్లలమంతా మేమే ఆ పదవిని పొందినట్లు పొంగిపోయాము.ఆమె పాలనలో మహిళలకే మైనా ఒనగూడిందా అని ఇప్పుడు ఆలోచిస్తే నేతిబీరకాయలో నెయ్యి చెందమే.

       ఇక రాష్ట్రంలో 1966 అక్టోబర్, నవంబర్ నెలల్లో . ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రజలు ఉద్యమించారు.ఈ ఉద్యమాన్ని అప్పటి నాయకుడు తెన్నేటి విశ్వనాథం ముందుండి నడిపించాడనీ,టి. అమృతరావు, ప్రత్తి శేషయ్య లాంటిే నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారనీ విశాఖ జిల్లా అంతటా ఎన్నెన్నో వార్తలూ,ఎన్నో సంచలనాలు.

        గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి.అమృతరావు 1966 అక్టోబరు 15న విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారనీ జిల్లా అంతటా ఓ విధంగా అట్టుడికి పోయిందని చెప్పొచ్చు.

    ఈ  సందర్భంలో  జరిగిన బందుల్లో( అప్పటికీ విజయనగరం విశాఖ జిల్లా లోనే ఉంది) స్కూలు మూయించటానికి వచ్చిన ఉద్యమకారులతో పాటూ సంఘీభావం గా మేము కూడా మావంతుగా కాసేపు నినాదాలు చేసాము.ఉద్యమంలో భాగంగా 32 మంది ప్రాణాలర్పించి సాధించిన విశాఖ ఉక్కు మాత్రం ఈ నాటి పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు తుప్పు పట్టేలా ఉంది.

    నిజానికి నాకు రాజకీయాలు పట్ల ఆసక్తి ఉండేది కాదు.అయినప్పటికీ దేశంలో కానీ , రాష్ట్రంలో కానీ ఏ సంచలనాలు ఉన్నా డైరీ లో రాసుకునే అలవాటు ఉండటం ఆశ్చర్యమే .అసలు సోషల్ స్టడీస్ పుస్తకం చదివినప్పుడల్లా

     ” ఆ రాణీ ప్రేమ పురాణం

    ఈ ముట్టడి కైన ఖర్చులూ 

    తారీఖు లు దస్తావేజులు 

    ఇవి కాదోయ్ చరిత్ర సారం,”

అనుకునేదాన్ని.అయినా ఏమాటకామాటే సోషల్ లో చాలా మంచి మార్కులే వచ్చేవి.

       ఇక మా ఇంట్లో మా చిన్నన్నయ్య  కథలు అప్పటికే  ప్రచురితం అవుతున్నా ఆ ఏడాది ఆంధ్రప్రభ దీపావళి కథలపోటీలో బహుమతి వచ్చేసరికి ఆ ఊరులో కథకుడు గా గుర్తింపు వచ్చింది.ఆబహుమతి డబ్బు తో రేడియో కొన్నాడు.ఇంక నాకెంత సంబరమో.ఆ రోజుల్లో సాయంత్రం 5-30 కి లలిత సంగీతం ప్రసారం అయ్యేది.అవి తప్పక వింటూ ఆ పాటలు రాసుకుంటూ నేర్చుకునేదాన్ని.అప్పట్లోనే సంగీతం నేర్చుకోవాలని కోరిక మనసుని తొలిచేసింది.

       అన్నయ్య కథలు ప్రచురితం అవుతున్నప్పుడల్లా నాకూ కథలు రాయాలని అనిపించేది.రావిశాస్త్రికి ఏకలవ్య శిష్యుడిగా రాసే అన్నయ్యకథలే కాక,అతను సేకరించే రావిశాస్త్రి,కారా,చాసో,బీనాదేవి పుస్తకాలూ నేను కూడా చదవటం వలన నా ఆలోచనల్లో,నా దృక్పథం లో బాగా మార్పు రావటం నాకే తెలుస్తోంది. మళ్ళా ఇప్పుడిప్పుడే చదువులో కుదురు కున్నాను కదా మళ్ళా ఆగిపోతుందేమోనని భయపడ్డాను.కానీ నాకు తోచిన ఆలోచనల్ని కాగితాల మీద పెట్టి పుస్తకాలు అడుగున దాచేసేదాన్ని.

       ఆరోజుల్లోనే జరిగిన చిన్నక్క వివాహం మరో సంచలనం.కోటబొమ్మాళిలో మా స్కూల్లో మాష్టారు వాసుదేవరావు గారు అప్పటి నుండి అక్కని ఇష్టపడ్డారు.విజయనగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ లో 1962 లో సైనిక్ స్కూలు స్థాపించినప్పుడు ఆయనకి అందులో ఉద్యోగం వచ్చింది.మొదటి నుండి ఆయన హార్దికంగా,ఆర్థికంగా అమ్మకి ఆసరాగా ఉన్నారు.పెద్దక్కయ్య తాను మా ఇంట్లో ఉన్నప్పుడే వారి వివాహం నిశ్చయం చేసింది. విశాఖ పట్నం లో రిజిష్టర్ కార్యాలయం లో వివాహం జరిగింది.వాసుదేవరావుగారి తరపున ఆయన సహోద్యోగులు,మా కుటుంబం మాత్రమే హాజరయ్యాము.ఆ వెంటనే చిన్నక్క కోరుకొండ వెళ్ళిపోయింది.  వర్ణాంతర వివాహం కావటాన కుటుంబ పెద్ద ఒకరు మావంశవృక్షం రాస్తూ తులసివనం  లో గంజాయి మొక్కగా అభివర్ణించారు కానీ తదనంతరం ఆయన కుటుంబంలోనే  వర్ణాంతరమేకాదు మతాంతరం, రాష్ట్రాంతరం ,దేశాంతరం వివాహాలు కూడా జరిగాయి.ముఖ్యంగా మా నాన్నగారి తరపు బంధువులు మా చిన్నక్క కుటుంబాన్ని సంపూర్ణంగా,మాకుటుంబాన్ని పాక్షికంగా దూరం పెట్టారు. ఈ సంఘటన వలన కుటుంబ వ్యవస్థపై ముఖ్యంగా మహిళలపై సంప్రదాయాలు,సమాజం వేసే సంకెళ్ళ ప్రభావం గురించి నన్ను ఆలోచింపచేయటం మొదలు పెట్టింది.

       నా వ్యక్తిత్వాన్ని సానపెట్టటం మొదలు పెట్టింది అప్పుడే.కోటబొమ్మాళి లో ఉన్నప్పుడూ నేను మాష్టారి చెల్లెలుగా గుర్తింపబడినా నన్ను బాధించలేదు.బహుశా అప్పటికి చిన్నపిల్లనేకావటంవలనకావచ్చు.                                                                 ఓ ఇద్దరు ముగ్గురు అన్నయ్య మిత్రులైన స్కూలు మాస్టర్లు మధ్యాహ్నం టిఫిన్ డబ్బాలు తీసుకొని మా ఇంటికి వచ్చి తినేవారు.స్కూలులో నాకు మంచి మార్కులు రావటానికి నేను మాష్టారి చెల్లెల్ని కావటం వల్లే అని కొందరు గుసగుసలు మొదలు పెట్టారు. అది నన్ను చాలా బాధ పెట్టింది.ఇప్పుడు హైస్కూలు చదువు కు వచ్చాను కనుక వయసుతో పాటూ మనసు,ఆలోచన పరిణితి చెందటం నాకే తెలుస్తోంది  .SSLC లో ఫైనల్ పరీక్ష పేపర్లు బయట వేల్యుయేషన్ కి ఎక్కడికో పంపుతే ఎవరో దిద్దుతారుకదా అందులోఎలా అయినా నా తెలివితేటల్ని నిరూపించు కోవాలనే పంతం వచ్చింది.

   అప్పట్లో SSLC లో మార్కులు హిందీలో కలిపి,హిందీ కలప కుండా అని రెండు విధాలుగా  ఫైనల్ లోమార్కులు ఇచ్చేవారు. ఆ విధంగానే పరీక్షల్లో స్కూలు ఫైనల్లో హిందీ కలిపి ఐతే మూడవ స్థానంలో, హిందీ మార్కులు కలప కుండా ఐతే మొదటి  స్థానం  లో  వచ్చాను.

   అప్పటి నుండే నన్ను నేను నిరూపించుకోవడానికి,నన్ను నేను నిలబెట్టుకోవడానికి  అస్తిత్వ పోరాటానికి బీజం పడింది.

*****

Please follow and like us:

5 thoughts on “నడక దారిలో(భాగం-7)”

 1. ”నడకదారి”లో చిన్నారి సుభద్ర పాఠశాల స్థాయిలోనే అప్పటి రాజకీయ, సామాజిక జీవితాన్ని గమనిస్తూ అనేక విషయాలను ఆకళింపు చేసుకున్న తీరు బావుంది. ఆ ఎక్కి వచ్చిన మెట్లు దృఢమైనవి. కంగ్రాచ్యులేషన్స్ సుభద్రాదేవి గారూ.

 2. భలే ఆత్మవిశ్వాసం మీకు . ఎంత సౌమ్యశీలి అనుకునే సుభద్ర గారి తెలుసుకోవడం ఆసక్తిదాయకం.

 3. మీ నడక దారిలో
  ఏడవ దారి చదివాను. చాలా ఆసక్తి కరంగా వుంది. చదివించే విధంగా రాస్తున్నారు.
  ప్రతి వారి జీవితంలో ఎన్నో రకాల ఎత్తు పల్లాలు.
  తప్కవంటాయి,లేదంటే ఒక్కొక్కరిలో ఒక్కోలా.
  అస్తిత్వ పోరాటం లో మీ తదుపరి అంశాల కోసం ఎదురు చూస్తున్టాము.మీకు శుభాకాంక్షలు మేడం.

  1. ధన్యవాదాలు ప్రసాద్ గారూ

Leave a Reply

Your email address will not be published.