“బొమ్మా బొరుసు”

(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

– రావుల కిరణ్మయి

రేవమ్మా…!నా రేవమ్మా..!…ఓ నా రేవతమ్మా….!కేకేసుకుంట గుడిసెలకచ్చిన బీరయ్య,భార్య కనిపించకపొయ్యేసరికి ఇవతలకచ్చి తమ గుడిసెకెదురుగా వాకిట్ల కూసోని బియ్యమేరుతున్న లచ్చవ్వతోని,

అత్తా..!ఓ …అత్తో…!నా అమ్మ రేవమ్మ యాడబోయింది?ఏమన్నసెప్పినాదె?అని అడిగిండు.

ఏమో..!రా అయ్యా…!నేను సూల్లే.

గదేందే,నీకు సెప్పక,నాకు సెప్పక ఈ అమ్మ యాడవోయినట్టు?గుడిసె తలుపు సుత తెరిచేపోయింది.

యాడబోతదిరాయ్య..?ఊరు సర్పంచాయే!ఏం పని మీద వొయిందో!ఎవళ్ళకేంఆపదచ్చిందో..!

నేనంటే పనుంది ఎగిలివారంగనే పక్కూరికి పోయత్తాన.నువ్వు పొద్దు పొద్దున్దాంక వాకిట్లనే పాతరేసినట్టుంటవ్,నువు సూల్లేదానే?మల్ల అడిగిండు.

పాతరేసినా అయిపోవురాయ్య.ఈ బాధలు పడేకంటే.

ఏందే?నేనేదో శాత్రానికంటే నువు గట్లంటవేందే?నీ..యవ్వ..నీ..!అన్నాడు చిరుకోపంగా.

గట్ల ఇరుసుకు పడ్తవేందయ్యా?కడుపు చించుకుంటే కాళ్ళ మీద వడ్తదన్నట్టున్నది.నా పరిస్థితి.నీకు గట్నే అనిపిస్తది.ఎన్నడన్న పుర్సతుగా మంచీ,చెడ్డ అడిగినావయ్య?అంగట్ల తప్పిన పిలగానోలే అమ్మా…అమ్మా…అని పెండ్లాం గురించైతే అడుగుతానవ్ గని.అన్నది.

ఆగాగు..!ఇయ్యాల నీ క్యాలి సక్కగ లేనట్టున్నది.ఇప్పుడే వత్తుండు.అని చెప్పి ,

గుడిసెలకు పోయి రేవమ్మ పాత ఇనుపరేకు డబ్బా సందుగ తీసి బట్టల్లల్ల అడుక్కు ఓ చిన్న కాయిదం పొట్లం పెట్టి మల్ల సందుగ అటకెక్కించి గుడిసె తలుపు దగ్గరికేసి వచ్చి లచ్చమ్మ కాడ గద్దెమీద తువాలతోని దులుపుకొని కూసున్నడు.

ఇగ జెప్పే!ఇంట.అనుకుంట ముఖం మీది చెమటను తుడ్సుకుంటూ.

నా ముచ్చట సరే గని,గుడిసెల ఏం జేసచ్చినవయ్య?గంతల్నే ఏం యాదికచ్చే?అన్నది.

ఆ ..ఏం లేదు.అల్లం బెల్లం ఆకుల సున్నం గని చెప్పు అన్నాడు.

నువ్వు మస్తు మారినావ్ గని ,దాపరికాలు గూడ మొదలు పెట్టినవ్ గదా.అయితమాయే తీ..!నా కొడుకు నన్ను గాదన్ననాడు నాకు బిడ్డసొంటి రేవమ్మ అల్లుడు ఉన్నరనుకున్న గని,అంతా..ఒల్లెక్కలే.అన్నట్టు అని మూతి ముడిచింది.

ఎహే..!నీ దిఇర్గాలు తీసుడాపు.నాకైనా,నీకైనా,బిడ్డయినా,భార్యైనా,రేవమ్మనే.అదే లేకుంటే ఈ బీరయ్య నేతి బీరకాయేనే.అది రాని..! అన్ని సెప్త.అన్నాడు .

అట్లనా..!సరే అదిడ్సి పెట్టు.నా కొడుకు లింగమయ్య పొద్దటీలి ఫోన్ మాట్లాడిండు.ఏందయా ?అంటే,

అవ్వా…!అవ్వా..!నాకీడ ఏం పని దొరుకుతలేదు.జరుగుబాటు గూడ తిప్పలయితాంది.ఇల్లు కట్టిన అప్పేమో..పుట్ట పెరిగినట్టు పెరుగుతనే ఉన్నది.నీ కోడలు సుత వట్టిగనే ఉంటాంది.ఈడ్నేఉంటే ఇగిలిచ్చుడే తప్ప ఏం బర్కతి లేదే అవ్వ.అందుకని నేను దుబాయ్ పోదామనుకుంటా.తెలిసినాయన టిక్కెటిపిత్తనన్నడు గని,పైసలు బాగైటట్టున్నయ్.లచ్చలు గావాలె.అందుకని నీ తాన పైసలేమన్నుంటే ఇయ్యే అవ్వ,మల్ల నేను మంచిగైనంక నియ్యి నీకు పువ్వుల్ల పెట్టి అప్పజెప్తగని అన్నడు.అని బియ్యం చేరగాదానికని లేచి నిలుచున్నది.

అయితే మంచిదేనాయే.ఇయ్యరాదత్త.నీకు ఆడు తప్ప ఎవరున్నరు?అన్నడు.

ఎయ్.నీ ముచ్చట ముద్దుగనే ఉన్నది.నాతానెక్కడియ్ రా..!ఉంటే గింటే మీకు తెలువని సంసారమార మాది?ఇల్లో..ఇల్లో…. అప్పో..అప్పో..అంటాండు.గీ రెండు రేకులర్ర్రలు ఏసినందుకేనానయ్య?వాని నీల్గుడు?ఏమన్న అవ్వ కష్ట పడ్తాందని గిన ఏసినాడయ్య?వాని పెండ్లాం ఇల్లు లేదు ఇర్భాటం లేదు.పశువుల కొత్తమోలే ఉన్నది.ఎర్రలుకేసుడు.పెండేసి ఊడ్చల్లుడు,నాతోని ఆయిత లేదు నేను రానని మొండికేత్తే ఇఇంత బండ వర్సి ఇల్లు దిన్చిండు గని,ఏమన్న ఆయిమన్న టాపు వోసినాడయ్య?నీ బామ్మర్ది?నువ్వు సుత ఆనికే సపోటిత్తానవ్?నన్ను పరాయిదాన్ని జేసి అప్పు పువ్వుల్ల వెట్టి మల్ల ఇత్తనంటాండు.అని కొడుకు మీది కోపమంత చేరుగుడులనే సూపెట్టుకుంట అన్నది.

కాదత్త..!కొడుకేనాయే,కోడలేనాయే.ఇంట్లున్న సోడేమన్న అమ్మయినా ఇయ్యాలె గదనే.ఆపతి అసొంటిది.

ఆ…వాని యావ గూడ గదే.ఇఇంత మేడ మీది బంగారం ఇత్తె కుడువబెట్టుడు గూడ గాదు,మొత్తం అమ్మి ఇల్లు సుత కుదువ బెట్టి ఆ పైసలన్ని ముల్లెగట్టు కొని దేశం బోతడట.ఎవని అవుసు కు ఎవరూ కాపలయ్య?వాడటువోన్గనేనేను గుటుకు మంటే గుంజి అవతల పారేసే దిక్కు సుత ఉండదు.అని దుక్కమచ్చి కొంగుల ముక్కు చీదిన్ది .

అత్తా..!నువ్వు గట్లనకే.మేమంతలేమానే?గట్ల కానిత్తామె?

గా దైర్నమే ఆవగింజంతుండబట్టే ఇట్లున్న.కాకుంటేందిరా?రామసక్కనసొంటి సంసారమంత ఎంగిలి ఇస్తరాకు అయింది.బిడ్డచ్చిన వేళా, గొడ్డచ్చినవేళాఅన్నట్టు కోడలు అడుగు  వెట్టింది.అన్ని కొత్త కొత్త ఎతులు జెప్పి వాని బుద్ది చెడగొట్టి ఎందు పొంద నియ్యకుండ జేసింది.చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత మహదేవాని నేను ఒక్క కొడుకని చేసిన గావురమే నా పీక మీదికి వచ్చింది .ఎన్కటికి నేను సుత మీ మామను కొంగుకట్టుకొని లంకంత కొంపలకెళ్ళి,గుమ్మడి కాయంత సంసారంలకెళ్ళి ఈ ఊరు యేరు తీస్కచ్చిన.అత్త మామ ఉసురు తలిగిందేమో!వాళ్ళ కథే నాకు నా కొడుకు సినిమా లెక్కనే సూపియ్యవట్టే.వాని మాటలన్ని ఒల్లెక్కల మాటలే.అస్సలు ముచ్చటేందంటే  నా కోడలు చెల్లె లగ్గం ఖాయమైందట.ఎంత చెట్టుకు అంత గాలి అని మన తాహతుకు మనం చూస్కోని చేసుకోవాలె గని,ఎవడో నౌకరున్నోడు దొరికిండట.వాళ్లడిగినంత ఇత్తమని ఒప్పుకున్నరట.వాళ్ళు అన్నిచ్చినంకనే లగ్గాలు పెట్టుకున్దమంటాండ్రట.పెద్ద బిడ్డ నే ఏమీ లేనోనికిచ్చినం..అడవిల పారేసుకున్నం.ఈ బిడ్డనన్న ఇల్లాకిలి అమ్ముకోనయినా సరే,ఆ పిలగానికే ఇత్తనని పెద్దల్లుడివైతివి ,నువ్వే ఏమన్న సాయం జెయ్యాలనడిగితే,ఈ ఉబ్బెచ్చులోడు,మామాయే,మరదలాయే అని ఒప్పుకొని ఎంకిపెళ్ళి సుబ్బి సావు కచ్చినట్టు నా కొంపకెసరు వెట్టిండు.అన్నది బియ్యం గిన్నెల పోస్కుంట.

ఇది కూడా నా బామ్మర్డే సెప్పినాడే?

లే..!గింత మంచి ముచ్చట వాడు జెప్తాడయ్య?పాలోల్ల లచ్చక్కకు ఎవలో ఉప్పందిచ్చిండ్రట.దానికాగక నాకు చెప్పింది.కండ్లల్ల వెట్టి కాపాడుకున్నవాన్ని.కడుపున పుట్టినోడన్నసెప్పక పాయే,కోడలు పోతే పోయింది గని.అని సుత మనసు గాబరైతాంది రా.నా కోడలచ్చి చెప్పినా ఇద్దును,నా కొడుకచ్చి చెప్పినా ఇద్దును.నా కొడుకచ్చి చెప్తే నా పానమైనా ఇద్దును.నేను అంత కానీ దాన్నైనానురా?కోడలంటే ఇంటి గోడ లెక్కల గాదు.పునాది లెక్కన ఇల్లు నిలబెట్టేటట్టున్డాలే.ఇంకా మంచిగా సెప్పాల్నంటే రేవమ్మ లెక్క నుండాలే.ఏనాడు ఈ గుడిసెలకచ్చి పడ్డదో,ఏనాడు దాని మెడల నువ్వు పుస్తె గట్టినవో అది గుత్త.ఎన్ని సవరిచ్చుకచ్చింది.ఇద్దరు చెల్లెండ్ల పెళ్ళంటే,అత్త మామ సేతంటే,యారాండ్లు చిన్నదీమె.మేము పెద్దోళ్ళమని దాని మీద పెత్తనం జేసినా,మూసినా గుప్పిట లెక్కనే ఉన్నది గని ఎన్నడన్న గిట్ల,గిట్లని తులనాడినాదిరాయ్య?అన్నది దిగులుగా.

అవే..!అత్తా..!ఈ దేవత ఊపిరిఓత్తెనే గదేనే ఇయ్యాల్ల తెల్లగున్నది.ఆ భాగ్గెం నువ్విచ్చ్చిందేనాయే.కైకిలికని పోయి బాయిల జారి పది ఆయువు పట్టు మీద దెబ్బ తాకి మంచంల వడితే అన్నలు,వదినెలు ఏడోల్లాడ సదురుకొని ఈనెకు బాగు జేపిత్తే ఉన్న ఆస్తంత హారతికర్పూరమైతదని ఊల్లేమున్నది?దుబ్బా కొట్లాడ్తందని మా పాలు మా కియ్యుమని అవ్వ నాయన పీకల కూసోని పాళ్ళు దీస్కోని అమ్మకానికి వెట్టిరి.పట్నం బాట వట్టిరి.పిల్ల నిత్త,కాళ్ళు కడుగుత,నౌకరి ఇప్పించుకుంట పడ్డాక సదివినోడు మనిండ్లల్ల ఎవరున్నరని,ఎన్కెనుక తిరిగిన మేన మామ ఎన్కకు మర్లి సూడపాయె.నోరు వెట్టుకొని అడిగితే,పెండ్లికి ముందే ఇట్లవుడు నా బిడ్డ అదృష్టమనే.తాళి వడ్డంకైతే నా బిడ్డకు ఉరి వద్దట్టవు అనే.గదేందంటే పైకెళ్ళి ఇసొంటోనికి మీ బిడ్డనైతే ఇత్తరా?అని మాటల గునపం గుండెల గుచ్చె.గప్పుడు గాదె ,నువ్వు రేవమ్మను నాకు ముడి వెట్టింది. మంది గూడ మల్లే మొగ్గసొంటి పొల్ల వీన్నెట్ల చేసుకుంటాన్దనిరి.అది నా ఇష్టం కొద్దే చేసుకున్టాన్నని అందరి నోర్లు మూయించె.ఇంకో తాప ఇసోంటి మాటలంటే మంచిగుండదని వార్నింగిచ్చే.అన్నాడు కండ్లళ్ళ నీళ్ళు రాంగ తుడుచుకుంటూ.

అది నువ్వు,మీ అవ్వయ్య జేస్కున్న పున్నెమేరా!తన పాలుకు బీడు వచ్చినా ఆళ్ళ,ఈళ్ళ సలహాలు దీస్కోని మొదటేడు పశువుల కోసం గడ్డి వెట్టిచ్చే.ఓ బర్రెను గొని పాలమ్మి పాల కేంద్రం పెట్టిన్చేదాంక కట్టపడే.ఎద్ధసొంటి మగోడు ఉంది కూడా తానే గొడ్డో లె ఎవుసం మొదలు వెట్టె.దాని కున్న ఆస్తి నువ్వు మేడల గట్టిన ఆ పుస్తెలు,గుండె ల నిండ ప్రేమను,ధైర్నం నింపుతాంటే దాని గొట్టాల గొలుసు పెండ్లి నాడు ఓ వారం,పది రోజులు పెట్టుకున్నదేమో!మళ్ళ కనపడనీయక నువ్వే పెద్ద బంగారమని,వజ్రమని తల్సుకుంట ఇద్దరు పిల్లల పెండ్లిళ్ళు జేసే.మీ అన్నల భూమి వేరే ఎవరూ కొనద్దని తనే గొనె.దాని మంచితనానికి మెచ్చి జనమంతా దాన్ని ఎలచ్చన్ల సర్పంచుగా నిలబెట్టి గెలిపిత్తే ఇంటింటికి పాయఖానా,వాన నీళ్ళు నిలిశేటందుకు,ఇంకుడు గుంతలు,ఇండ్లల్ల,పొలాల గట్లల్ల,చేను,చెల్కలల్ల ఎద వడితే ఆడ చెట్లు పెంచుకుంట ఊరు బాగు కోసం తపం బట్టె.అయినా గుడిసె దీసి ఇంత ఇల్లు ఎసుకోవాల్నన్న ఆలోచన చెయ్యపాయే.ఎందుకట్లంటే గుడిసెల మనిషి మా కట్టాలు తెలుత్తయని,మా మనిషని నన్ను నిలబెడితే ,మల్ల ఇల్లు కట్టుకొని వాళ్లకు అందకుండా పోవాల్నానే అనే.పదవి దిగినంకనే ఏదైనా అని ఆత్మాభిమానం తోని ఊరోళ్ళకు సుత దేవతాయే.

అవునే,అది దేవతవుడే గాక నన్ను బీరిగాడు..బీరిగాడు ..అనుడు మాని బీరయ్య అనేటట్టు నాకింత పరపతి దెచ్చె.గంధం చెట్ల పక్కన గడ్డి పరకుంటే దాన్ని గ్గూడ ఇంత గంధం వాసన అంటుకున్నట్టు.

అవునయ్యా,ఇట్లా నువ్వూ,నేను చెప్పుకుంటవోతే ఇయ్యాల ఒడవని ముచ్చటైతది.

ఔ..ఔ ..ఒక్కటి మాత్రం అచ్చెర సత్తెమే.మావవ ఎప్పుడనేది.ఏ జన్మలోనో మనం దీనికి కన్నా బిడ్డలమయ్యుంటం రా..!ఆ వాసనింకా పోక మల్ల ఇట్లా కోడలై వచ్చినా,తల్లి ప్రేమ పంచుతాందనేది.అన్నాడు.

మరి..నా కోడలుకు,ఇయ్యంకునికి ఏమన్నున్నాదిర?మీ కంటే ఎక్కువ ఎవుసం నాకే ఉండే.చెయ్య శాత గాక పట్నం పోయి ఆగమైతాండ్రు గని.అన్నది.

ఇయ్యాల్రేపు పిలగాన్డ్లేవలు ఎవుసం జేత్తండ్రే.ఏమన్నంటే సదువుకొని నౌకర్లు జేత్తమంటాండ్రు గని…అని అంటాంటే ,

రేవమ్మ పచ్చిపల్లికాయ కొంగు నిండ ముల్లెగట్టుకొని వచ్చింది. వీల్లిద్దర్ని జూసి ,

ఏందుల్ల?ఏమో!తీరిపారి కూసున్నరు?ఏం ముచ్చటేంది?అని,అప్పుడే అంటుకుంటున్న పొయ్యిల పల్లికాయ గుమ్మరిచ్చి ఆన్నే కూసున్నది.

నువ్వు పల్లికాయ టేను పోయినావే రేవమ్మ ?అడిగిండు.

లే..!గీ పల్లికాయ కోసం పని జెడగొట్టుకొని పోతానయ్య?అని ,లచ్చమ్మ బియ్యం కడుగ నీళ్ళుపొ య్యవోతాంటే,

ఏందే?అవ్వ ?ఇంకా బువ్వండుకోలే?అన్నది.

లే..!ఎట్ల వండుతది?నీ బంగారి తమ్ముడు వండుకోనిత్తండా?తిననిత్తాండా?అని బీరయ్య తనకు ఎరికైన ముచ్చటంత జెప్పిండు.

ఇగ ఈ పూట కు మాతోని తిందువుగని,ఇగ కడుగకు.ఏం?మనుషులో ఏందోనే ,అవ్వ.పొద్దటీలి మా బిరయ్య బైలెల్లి అటేటు వొంగనే గిట్లనే గుడిసెల శాపాల కూసోని రోడ్డు మీదకు సూస్కుంట సరపిండి నముల్తాన్నే.ఇంతల్నే మంగక్క కోడలు జమున లేదు,ఆ పోరి కొంగుల ఏంటిదో డబ్బసోన్టిదపట్టుకొని ఏడ్సుకుంట ఉరుకుతాందే.ఇటు జూత్తే నువ్వు గూడ కనపళ్ళే.ఏందీ/పొల్ల ఈమయ్యున్తదని జరంత ఇసొంటచ్చె వరకు దాని బిడ్డ చెడ్డి మీదనే ఉన్నది,అది ఉరుక్కుంట పాలకు గావచ్చు పాయి..పాయీ..అని ఐతే వత్తాందే.ఇదేందో ఉన్నదనుకొని ఆ పిల్లను సత్న సంకలేసుకున్న అడ్డదారిల సందులవడి సక్కగ దాని ముందట నిలబద్దనే.పొల్ల నా సంకల కెళ్ళి దబ్బున జారి పాయీ..పాయీ అంటాంటే,

పాలేక్కదియే?పా ఇద్దరం గలిసి ఇంత మందు తాగుదాం పా.!అని డబ్బా తీసిందే.నాకు గజ్జుమన్న్డే.ఈ పోరి పాడుగాను ఎంత పని జెయ్యటానికి సూత్తాందని డబ్బా గుంజుకొని ఇసిరిపెట్టి పెడేల్ మని చెంప పొంతి ఒక్కటిచ్చిన్నే.ఏమనుకుంటానవ్?సచ్గ్చుదంటే వట్టిగానేనానే.ఈ పోరి నేమ్జేత్తమనుకున్నవ్?నీ కడుపుల పుట్టినందుకు అది అవ్వ లేని పొల్ల,అవ్వను మింగిందని ఎల్ల కాలం నిన్దేలు మొయ్యాల్నానే?గిదేనానే?నీ సదువు,సంస్కారం/అని ఇయ్యర మయ్యార తిట్టి సంగాతెందని అర్సుకుంటే,

ఈ పొల్ల పుట్టిన్కాన్నుండి  ఆడిపిల్లను కన్నవ్?మీ ఒల్లిన్టికాన్నుండి దాని పేరు మీద ఇన్నో అన్నో పైసలు పట్కరా పో..!అని ఆ తాగుబోతు దాని మొగుడు ఒకటే తిట్టుడు ,కొట్టుడట.అత్తమామ,దీని దిక్కెఉన్నరట కని,వాడు ఇంతలేదట.ఇగ ఇది ఇటు పోలేక,ఇటు విఇని తోని ఏగలేక మందు డబ్బా పట్టుకొని ఉరుకుడు పట్టి వెట్టింది.అని ఆగింది.

అయ్యో…!ఎంతాగమవునే?నువ్వు జూడకుంటే అన్నరిద్దరు.

ఆగమా..?ఆగమా ..? ఏం చదువులో ఏమో!బతుకు దైర్నం నేర్పని సదువులు ?ఎన్కటేదో  శాత్రం జెప్పినట్టే చదువుకున్నోని కంటే ఇంకెవరో నయమన్నట్టు ఉన్నది.ఈ తాగుడు జెయ్యవట్టి గూడ మొగోళ్ళు చేతికి రాకుంటయితాండ్రు.మందు బంధు వేట్టియ్యాల్నని కట్టడి జేద్దమనుకున్టాన్నే.ఆ పొళ్ళను ఇంటికి తోల్కవోయి వాన్ని బాగా తిట్టి  ఇంకోసారి గనుక మల్ల ఇసొంటి పిచ్చి పిచ్చి వేశాలేత్తే గృహ హింస,గదేనే గిసోన్టో ళ్ళను దారికి తెచ్చా చట్టం ఒతున్నది.దానికి పట్టిత్తనని చెప్పిన.భయం చేత సంసారాలు నిలబడయ్  బంధాలు మాత్రమే నిలబెడుతయ్ అని ఏం పని లేక వాడిట్ల పిచ్చి ఆలిచనలు పడ్డడన,

రేపు పొలం దున్నేకాడికి రారా.అని నేనే జీతం లెక్క ఇత్తనని పనికి రమ్మన్న.వాన్నో కంట దాన్నో కంట కనిపెట్టుకుంట ఉండాల్నే.అని పల్లి కాయంత అన్చేలకేత్తి గుడిసెలకు వోయింది.

తరువాత ముగ్గురూ అన్నాలూ వెట్టుకొని మల్ల లచ్చమ్మ తానకే వచ్చి కడుపు నిండా డిన్నరు.అటెంక  పల్లికాయ సుత.ఇంతల బీరయ్య గుడిసెల కెళ్ళి సందుగల వెట్టిన కాయిదం పొట్లం పట్కచ్చి రేవమ్మకిచ్చిండు.సూత్తే,గొట్టాల గొలుసు.

పెట్టుకోయే.!బొంనాల పండుగున్నది.ఇగ మల్లెప్పుడు దిఇన్ని కుదువ బెట్టనని గట్టిగ అనుకోని తె చ్చిన్నే.ఎప్పుడు ఇన్ని రోజులల ఏమియ్యలె.ఇయ్యాల దీన్నిఇడిపించుకచ్చిన.కనీసం ఈ ఒక్కటన్నా తృప్తి నాకుండనీయే అన్నాడు.

బీరయ్య చేతులు కళ్ళకద్దుకొని నువ్వు నా మేడల పుస్తె గట్టి నన్నో మా రాణి ని జేసినవ్.ఆడబిడ్డలు,యారాండ్లు,కన్నబిడ్డలు అందరితోని నన్ను సల్లగుందాలని దీవెనలు వెట్టిచ్చినవ్ .నువ్వు లేకుంటే నేనేక్కడిదయ్య?,బంగారం ఇయాలున్టది రేప్పోతది.బంగారమసంటి మనసుండాలే. అది నీకున్నది.నాకది సాలు.రేపే దీన్ని మల్ల కుదువ బెట్టి అవ్వకు పైసలు తెచ్చియ్యి.బాగా బతికిన్దాయే కుదువ బెట్ట్టుడనంగానే ముసలి పాణం తోక్కులాడ్తాంది .అన్నది.

ఇంత మంచితనం గూడ వద్దు బిడ్డా!నా తిప్పల నేను వడ్త గని బీరయ్య చెప్పినట్టు ఇను.అన్నది లచ్చమ్మ.

నా బీరయ్య మనసు తెలిసినదాన్ని కాబట్టే ఇట్లన్న,నామాట ఎన్నడు కాదనడు.ఆయనకు బాగా ఎరికే.పెండ్లాం ,మొగుడు ఒక రూపాయికి ఉండే బొమ్మా బొరుసు లాంటోళ్ళని.ఆ ఇద్దరు కూడున్తనే ఆ సంసారం విలువుంటదని బాగా ఎరికే అని గొలుసు పొట్లం బీరయ్యకే ఇచ్చింది.బీరయ్య రేవమ్మను,దాని మంచితనాన్ని కడుపార గుండెలకత్తుకున్నాడు.                                                    

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.