మేధోమథనం 

(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

– సౌదామిని శ్రీపాద

మంజరి అవ్వా బువ్వా రెండూ కావాలని అనుకుంది. తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే  ఆమె కెరీర్ లో రాణించాలని కోరుకుంది. ఒక బిడ్డకు తల్లి అవ్వటం ఆమె దృష్టిలో ఒక వరం. ఉద్యోగం తనకి అవసరం కాదు, ఆత్మాభిమానానికి ప్రతీక, ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం. 

కానీ తల్లి కావటమే తన పాలిట శాపంగా మారిందా? తల్లి అయిన ఏడాదికే తన ఉద్యోగ జీవితానికి ఇక ఉద్వాసన పలకాల్సిందేనా? 

తనకి చాలా మంది తల్లుల లాగా పిల్ల బాధ్యత కోసం ఉద్యోగం మానేయవలసిన అవసరం లేదు. 

“ఒక బిడ్డని పెంచాలంటే ఒక గ్రామం మొత్తం తరలి రావాలి” అని ఇంగ్షీషులో ఒక సామెత ఉంది.  అలాగ మంజరిని బిడ్డని  పెంచటంలో ఆమెకు చాలా మంది అండగా ఉన్నారు – అర్థం చేసుకునే భర్త,  ప్రక్కనే ఉండి ప్రోత్సహించే తల్లిదండ్రులు, అత్తమామలు, ఇంట్లో చాలాకీగా పనులు సమర్థించే పని మనిషి, వంట మనిషి..

చిన్నప్పటి నుండి మంజరి చదువులో నెంబర్ వన్. రాష్ట స్థాయి లో ర్యాంక్ లు సాధించిన ప్రతిభాశాలి. ఐఐటి లో పట్టభద్రురాలై ఒక పెద్ద కార్పొరేట్ కంపనిలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఉద్యోగంలో చేరినప్పటి నుండి వరుస ప్రమోషన్లు. ఎప్పటికైనా కంపనీ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలన్నది ఆమె కోరిక.  ఇన్నాళ్ళూ మగవారితో కలిసి చదువుతూ, పని చేస్తున్నా కూడా  తను స్త్రీని అన్న  వివక్షత ఎప్పుడూ  ఎదురు కాలేదు. కానీ తల్లి అయిన తరువాత మొదటి సారి ఈ రోజు అనిపిస్తోంది తాను స్త్రీగా ఎందుకు పుట్టానా అని. 

ఆమె ఏదో దీర్ఘంగా ఆలోచించటం చూసి ఆమె భర్త మనోహర్ వచ్చి ఆమె ప్రక్కనే కూర్చొన్నాడు. 

“ఏమయ్యింది?” ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఆమెను భుజం మీద చేయి వేసి దగ్గరకి లాక్కుంటూ  ప్రశ్నించాడు. 

ఆ రోజు ఉదయం జరిగిన సంఘటన ఆమె అతడి ముందు ఉంచింది. 

****

“మీ ప్రమోషన్ మాట అటు ఉంచండి. పరిస్థితులు చేయి దాటిపోయి మిమ్మల్ని తొలగించక ముందే, మీరే రాజీనామా చేస్తే మంచిది”, అంటూ మంజరి చేతిలో కాగితాలు పెట్టింది, ఆమె మేనేజర్ శ్రీజ. 

మంజరి పొంగుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంది. 

“ఇలా ఎందుకు జరిగింది? మెటర్నిటీ ముందే రావలసిన ప్రమోషన్. నేను మెటర్నిటీ లీవ్ కి వెళ్ళక ముందు ప్రాజెక్టు సక్రమంగా పూర్తి చేసే వెళ్ళాను కదా.  వచ్చిన తర్వాత కూడా నాకు ఇచ్చిన పనిని ఎప్పటికప్పుడు అప్పగిస్తూనే ఉన్నాను.”, మంజరికి ఇలాంటి పరిస్థితిలోకి ఎలా వచ్చి పడిందో అసలు అర్థం కావట్లేదు. 

“మీరు ఐదు గంటల కల్లా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతున్నారని మీ సహోద్యోగుల అభిప్రాయం. వాళ్ళు  రాత్రి పది గంటల వరకు పని చేస్తారు. మరి వాళ్ళతో పోలిస్తే మీరు పని తక్కువ చేసినట్లే కదా..” శ్రీజ వాదన. 

“ఎన్ని గంటలకు ఇంటికి వెళ్ళాను అని కాదు కదండీ. ప్రాజెక్టు ని పూర్తి చేయటానికి ఎంత సమర్థవంతంగా పని చేశాను అన్నది కదా ముఖ్యం. ప్రాజెక్టులో ఎన్ని రకాల సమస్యలు వచ్చాయి, అవన్నీ నేను ఎప్పటికప్పుడు పరిష్కరించలేదా? పాతిక మంది ఉన్న టీంలో మిగిలిన అందరూ మగవాళ్లే. ఇంట్లో అమ్మ లేక భార్య బాధ్యతలు నిర్వహిస్తే వాళ్ళు ఆఫీసులో  అర్థరాత్రి వరకు కాపు కాస్తారు, మధ్యమధ్యలో కాఫీలు, పబ్బులు అంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. నేను ఆఫీసులో ఉన్నంత సమయం శ్రద్ధగా పని చేసి, ఆ రోజు నేను చేయవలసిన పనులన్నీ పూర్తి చేసి మరీ  ఇంటికి వెళ్లిపోతాను. అందువల్ల వాళ్ళతో కలవటానికి కూడా సమయం ఉండదు. ఒక తల్లిగా మీకు ఇవన్నీ తెలిసి కూడా మీరు ఇలా అనటం.. ” మంజరి ఆవేశాన్ని వెళ్లగక్కింది. 

“చూడమ్మా, నువ్వు ప్రాజెక్టు అయితే పూర్తి చేశావు కానీ అందులో తెలివి ఉపయోగించాల్సిన టెక్నికల్ పని అంతా టీం లీడ్  చేశాడుట. ఈ విషయం టీంలో మిగిలిన వాళ్ళు కూడా ఏకీభవించారు. మన అమ్మాయిలకు అలాంటి క్లిష్టమైన టెక్నికల్ విషయాలు అర్థం అవ్వటం కష్టమే. అందుకే కాస్త పై వాళ్ళతో, ప్రక్క వాళ్ళతో మంచిగా ఉండాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు ప్రెసెంటేషన్లు తయారు చేసి పెట్టు అని నీకు ఇది వరకు కూడా చెప్పాను. నువ్వు వినిపించుకుంటే కదా” శ్రీజ సమర్థింపు. 

మంజరి ఇక ఒక నిమిషం కూడా అక్కడ ఉండలేక బయటకు వచ్చేసింది. 

****

“టీంలీడ్ కి వాడే పెద్ద తెలివైనవాడని, ముఖ్యంగా అమ్మాయిలు తెలివితక్కువ వాళ్ళు అన్న బలమైన ఫీలింగ్. అయినా తెలివి అంటే కోడ్ ఒక్కటి చేస్తే సరిపోయిందా? ప్రాజెక్టును లోతుగా అవగాహన చేసుకోవాలి, క్లయింట్లతో వివాదాలు సామరస్యంగా పరిష్కరించాలి. సమస్యల్లో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ తెలివితేటలు కావా? 

వాడి కోడ్ లో తప్పులు ఉంటే నేను వాడికే సమాధానం చేసేదాన్ని. అదే వాడు తన  కోడ్ లో చిన్న తప్పు దొరలినా, టీం అందరికీ మెయిల్ చేసి వేలెత్తి చూపించేవాడు. నా మంచితనాన్ని వాడు అలా అలుసుగా తీసుకునేవాడు. నా దగ్గర సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడైతే మేనేజర్ మన ఆడవాళ్ళకి తెలివి తేటలు ఉండవు అని అనేసిందో, నాకు ఇంక ఏమీ మాట్లాడబుద్ధి కాలేదు. ”  అంటూ మంజరి టీంలీడ్ గురించి భర్త దగ్గర నిప్పులు చెరిగింది. 

ఇవన్నీ విన్న మంజరి భర్త మనోహర్ చిన్నగా నవ్వాడు. 

“ఏంటండీ, నా ఉద్యోగం ఊడిపోయేలా ఉంది అంటే మీకు నవ్వులాటగా ఉందా?” అంటూ మంజరి చిర్రుబుర్రులాడింది. 

“ఏమీ లేదు, చివరలో నీ టీంలీడ్ గురించి చెప్పావు కదా, నువ్వు చెప్పిన విధానానికి నవ్వు వచ్చింది అంతే. మా ఆఫీసులో కూడా అలాంటి ప్రబుద్ధులు కోకొల్లలు. 

ఇది నిజానికి నవ్వులాట కాదు. చాలా గంభీరమైన సమస్య.  చాలామంది చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం అలాంటిది. అమ్మాయిలకు తెలివితేటలు ఉండవు అని తరతరాలుగా నరనరాన జీర్ణింప చేశారు. తాము ఇంట్లో బాధ్యత లేకుండా ఉద్యోగానికి కష్టపడుతూ, ఒక స్త్రీ తల్లి అయ్యాక ఇంట్లో మనులు కూడా చేస్తూ కెరీర్లో తమతో సమానంగా దూసుకొస్తుంటే కొందరికి అసూయగా కూడా ఉంటుంది.  అలాంటి ఆలోచనలు అన్నీ రూపుమాపాలంటే నీ లాంటి వాళ్ళే పూనుకోవాలి” అన్నాడు మనోహర్. 

“అంటే తల్లి అయ్యాక ఆడవాళ్ళు ఉద్యోగంలో రాజీ పడి బ్రతికేయాల్సిందేనా. ఇప్పుడు ఏమి చేయాలి? కిం కర్తవ్యం?” అంది మంజరి. 

“ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఈ ప్రాజెక్టు కాకపోతే నీ సామర్థ్యాన్ని నిరూపించుకునే ప్రాజెక్టు ఇంకొకటి దొరుకుతుంది. అక్కడ నీ సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అది మాత్రమే ఆలోచించు. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా అండగా నేను ఉన్నానని గుర్తుంచుకో”, అని చేతిలో చేయి తీసుకుని చెప్పాడు మనోహర్. 

మంజరి మనసు కుదుటపడింది. మనోహర్ కౌగిలిలో ముడుచుకుపోయింది. 

రెండు నెలల తరువాత

****

“చూడండి, మీ కెరీర్ గ్రాఫ్ బలహీనంగా ఉంది. మీరు ఉద్యోగంలో చేరి ఆరేళ్లు అవుతోంది, అంటే ఇప్పటికీ మీరు మేనేజర్ అవ్వాలి. కానీ మీరు ఇంకా క్రింది లెవెల్ లోనే ఉన్నారు. అందుకే మిమ్మల్ని ఉద్యోగం లోనికి తీసుకోవాలంటే ఆలోచించాల్సి వస్తోంది” ఎన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూ చేసినా ప్రశ్న మాత్రం అదే. 

“సార్, ఆరేళ్లల్లో నేను ఆరు నెలలు మెటర్నిటీ లీవ్ లో ఉన్నాను, తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాను. అందుకనే నా ప్రమోషన్ మీద వేటు పడింది. అది సమంజసమా కాదా అని నేను ఇప్పుడు చర్చించదలచుకోలేదు.  మీరు నా చరిత్ర ని చూడవద్దు. కేవలం నా పని తీరు మాత్రమే చూడండి. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో నా సమాధానాలు  నచ్చితేనే నాకు ఉద్యోగం ఇవ్వండి. నా పనితనం చూసిన తర్వాతే నాకు ప్రమోషన్ ఇవ్వండి”, మంజరి ఈసారి తడుముకోకుండా చెప్పింది.  

“సరే, మీ ఆత్మ విశ్వాసం నాకు నచ్చింది. రేపటి నుండే మీరు ఉద్యోగంలో చేరండి. మీ పనితీరు నచ్చితే ఆరు నెలలోనే మీకు ప్రమోషన్ ఇప్పిస్తాను.” అన్న మాటలకి మంజరి ఆనందంగా మనసులోనే గంతులు వేసింది. ఆయనకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. 

క్రొత్త ఉద్యోగంలో చేరాక మంజరి తన తెలివితేటలను నిరూపించుకోవాలి అన్న తాపత్రయం మానేసింది. తన ప్రాజెక్టుని క్రొత్త కోణంలో ఆలోచించింది. తక్కువ సమయంలో ఉత్తమ ఫలితాలు తీసుకురావటానికి ప్రణాళిక వేసుకుంది. కృత్రిమ మేధస్సుని వాడి ప్రాజెక్టు లో మంచి ఫలితాలు తీసుకువచ్చింది. క్రొత్త సాంకేతిక అంశాల పై పరిశోధన చేసి, పుస్తకాలు ముద్రించినది. దేశం నలుమూలలా కాలేజీలకు వెళ్ళి విద్యార్థులకు కృత్రిమ మేధస్సులో శిక్షణ ఇచ్చింది. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు, కానీ ఆమె బయట మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి తద్వారా కంపనిలో కూడా గౌరవం దక్కించుకుంది. 

అలా అంచెలు అంచెలుగా ఎదుగుతూ,  కృత్రిమ మేధస్సు రంగంలో దేశంలోనే  అత్యంత ప్రతిభాశాలులు అయిన వంద మంది  వ్యక్తుల జాబితాలో తన పేరు చేర్చుకుంది. 

****

అవార్డు ప్రదానోత్సవానికి ముందు ఆమెను పత్రికల వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. 

“ఈ జాబితాలో వంద మందిలో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం?”

“అంటే కృత్రిమమైన మేధస్సు కోసం తాపత్రయ పడటం ఇష్టం లేక”, అని నవ్వింది. 

హాలులో చిరునవ్వులు విరిసాయి. 

“మేధస్సు ఉన్న ఆడవాళ్ళకి  మనదేశంలో కొదవే లేదు. కొన్ని సాంఘిక కారణాలు వల్ల ఆడవారు ఇలా వెనుకబడి పోయారు.

మొదటగా, చిన్నప్పటి నుండి సినిమాలలో, కథల్లో ఆడవాళ్ళని కేవలం అందమైన వాళ్ళుగా, మగవాళ్ళని తెలివైన వాళ్ళుగా అభివర్ణించారు. దాని వల్ల తెలియకుండానే యువకులు, చిన్నపిల్లల మనసుల్లో ఆడవాళ్ళు కేవలం అందమైన వాళ్ళు, తెలివి తక్కువ వారు అన్న ముద్ర పడింది. విచిత్రం ఏమిటంటే కొందరు ఆడవాళ్ళు కూడా ఇదే నిజమని నమ్మటం. 

ఇక తరువాత మన సంస్కృతి, సంప్రదాయం అంటూ ఆడవాళ్ళు అణిగిమణిగి  ఉండాలి, తమ అభిప్రాయాన్ని బయటకు వెల్లడించకూడదు అని చిన్నప్పటి నుండి నూరిపోశారు. దాని వల్ల ఆడవారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లి దాని ప్రభావం ఆఫీసు లో కూడా పడుతుంది. 

ఇక చివరిగా సంసారం, బాధ్యత అంతా ఆడవారిది అని, పిల్లని వదిలేసి ఆఫీసుకి వెళ్తే బాధ్యతారహితమైన అమ్మ అని, అలాగే పిల్లల కోసం త్వరగా ఆఫీసు నుండి వస్తే బాధ్యతారహితమైన ఉద్యోగిని అని ముద్ర వేసి, ఆమె లో ఒక న్యూనతా భావాన్ని సృష్టించారు. దాని వల్ల ఆమె ఇటు ఇంటిని, అటు ఆఫీసుని బలవంతంగా లాగుతూ, తనను నిరూపించుకోవాలనే ప్రయత్నం లో పడింది. 

ఒక గార్గి, మైత్రేయి లాంటి స్త్రీలు జన్మించిన మన భారత భూమిపై ఈ రోజు స్త్రీలు తెలివైన వాళ్ళు అని నిరూపించుకునే దౌర్భాగ్యం పట్టింది.”

“ఉద్యోగంలో ఎదగాలి అనుకునే స్త్రీలకు మీరు ఇచ్చే సందేశం?”

“ఎక్కువ మంది స్త్రీలు పై పదవుల్లో ఉంటే దాని వల్ల కంపనీలకే ఎక్కువ లాభం. ఎలాగంటారా? కంపనీలలో వైవిధ్యత – అంటే ఆడ,మగ కలిసి పని చేసే సంస్థల్లో, ముఖ్యంగా పై పదవుల్లో స్త్రీల భాగస్వామ్యం ఉండే కంపనీల్లో,  లాభాలు చాలా రెట్లు అధికంగా ఉంటాయని చాలా పరిశోధనలలో వెల్లడి అయ్యింది. అయితే సర్వే ప్రకారం మనదేశంలో 85% మంది స్త్రీలు ఉద్యోగంలో ఇప్పటికీ లింగ వివక్షతను ఎదుర్కుంటూనే ఉన్నారు. ఇప్పుడు చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు అందరినీ సమబావంతో ఎలా చూడాలి అనే విషయంలో శిక్షణ ఇస్తున్నాయి. అన్ని సంస్థలలో ఈ మార్పులు రావాలి. 

అలాగే స్త్రీలు కూడా ఆత్మన్యూనత ను వదిలి, పిల్లల బాధ్యతల్లో తండ్రులను కూడా భాగస్వాములను చేయాలి. చివరగా, ఇంట్లో ఉన్నా, ఉద్యోగానికి వెళ్ళినా, పనుల్లో ఎంత సతమతమై ఉన్నా,  తీరిక చేసుకుని మన విజ్ఞాన పరిధిని  పెంచుకోవటానికి రోజూ కొంత సమయం వినియోగిద్దాం. 

మన ముందు తరం స్త్రీలు చేసిన కృషి వల్ల మనం ముందు అడుగు వేశాం. మనం ఇంకొక అడుగు వేస్తే మన భవిష్యత్తు స్త్రీలు ఇంకా ముందుకి దూసుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఇద్దరు కాదు యాభై మంది స్త్రీలు ఆ జాబితాలో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు”.

హాల్ చప్పట్లతో మారుమోగుతూనే ఉంది. 

****

Please follow and like us:

2 thoughts on “మేధోమథనం (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)”

  1. నమస్తే అండి సౌదామిని గారు ముందుగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా బాగుంది మీ కధ మేధోమధనం నచ్చింది మేధస్సుతో విజ్ఞానంతో మహిళలు సాధించలేనిది ఏదీ లేదు. నేటి ఆధునిక యుగంలో అన్నింటా విజయబావుటా ఎగురేస్తున్న
    అతివలు. ఈ మాసంలో అంతరిక్షంలోకి అడుగిడిన అచ్చ తెలుగు అమ్మాయి చదివిన చదువు ఆంగ్లం కధలోకి వెళ్తే ఒక ఉద్యోగిని కుటుంబ బాధ్యతలు పిల్లలు అత్త మామలు భర్త వీరందరి గురించి ఆలోచించి తన విధినిర్వహణలో పనులని చక్కబెడుతూ కంపెని విజయాలు సాధించేలా తనవంతు కృషి చేయాలి. ఇన్ని చేసిన పై అధికారి తో మాటలు ఆడ మగ ఇరువురు సమానం అంటూనే చిన్న పొరపాటు జరిగితే ఉద్యోగం నుంచి తీసెయ్యాల? ఎక్కడ ఏమి జరిగిందో నిమిషం ఆలోచించాలి, భర్త నేను నీ వెంటే నేనున్నాను అనటం చిరునవ్వుతో దగ్గరికి తీసుకోవటం తియ్యని అనుభూతి ఆడది కోరుకునేది ఆ చిన్న ఆనందమే. కవయిత్రి గారు మరో మాట వృత్తిరీత్యా మీరు కంప్యూటర్ ఉద్యోగం ప్రవృత్తి రీత్యా తెలుగుభాష మీద అభిమానంతో రచనలు చేయటం చాల సంతోషం మన భాష గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే. కధలోకి వెళ్తే తన మీద తనకి నమ్మకం వున్న ఏ వ్యక్తి అయినా ఆత్మవిశ్వాసం తో ముందుకి దూసుకొని వెళ్ళగలరు.చదివిన చదువు మేధస్సుతో ఇక్కడ కాకపోతే మరో కంపెనీలో తన ప్రతిభతో తోటి వారిని తనతో కలుపుకుంటూ ఎన్నో విజయాలు కంపెనీకి అందించగలదు ఈ అతివ .ఆడ మగ తేడా లేకుండా
    ఇరువురు సమానమే అనే నేపధ్యంతో సాగితే విజయాలు మన సొంతం.మహిళలని తక్కువగా అంచనా వెయ్యొద్దు మంచి సందేశం గల కధ.మీకు మరోసారి నా అభినందనలు.

    1. యామిని గారు,
      మీ ఆత్మీయ సమీక్షకు ధన్యవాదాలు. మొదట్లో ఇది కేవలం మనకే జరుగుతుందేమో, తప్పు మనలోనే ఉందేమో నని ఆలోచించి ఆగిపోయే ఆడవాళ్లు చాలా మంది. వారిలో ఆత్మ విశ్వాసం నింపటమే నా ఉద్దేశ్యం. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published.