వెలుతురు పండుటాకు 

-నారాయణస్వామి వెంకటయోగి

ఎక్కడినుండో, 
ఎడతెరపిలేకుండా 
దుఃఖధారలు కురుస్తున్నాయి 
కాలమెన్నడూ  మాన్పలేని   గాయాలపై 
 
 శతాబ్దాల తర్వాత  
సుడిగాలుల్లా వీస్తున్న పలకరింపుల్లో 
దుమ్ము కొట్టుకుపోతోంది 
మసకబారిన జ్ఞాపకాల మీదినుంచి 
 
గతంపొరల్లో దాగిన 
శిలాజాల కన్నీటి చారికలనీ , 
గాజుపెంకుల నెత్తుటి మరకలనీ
తడుముకోవాలి,  అరచేతులతో మునివేళ్లతో 
గీరుకుపోయేదాకా, కొత్త గాయాలై మళ్ళీ మళ్ళీ  గుచ్చుకుపోయేదాకా 
 
ఎవరికి  ఏమి తెలుసని    
మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం
 
ఎవరు వింటారనీ  ఎవరికేమి కొత్తగా  అర్థమవుతుందనీ  
రాళ్లకు మళ్ళీ మళ్ళీ తలలు మోదు కోవడం 
 
ఎవరిని అడగొచ్చిప్పుడు ఏది ఎందుకు జరగలేదో 
ఎవరికి వివరించగలమిప్పుడు ఏది ఎందుకు ఎన్నటికీ అర్థం కాదో   
 
మౌనహననాలైన జ్ఞాపకాలు ఇప్పుడు కొత్తగా బాధించేదేమీ లేదు 
గతం అంత అమాయకమైందీ కాదు 
 
 నెమ్మదిగా, నిరంతరంగా స్రవించే నెత్తురెప్పుడు ఆగిందని 
గాయాలు మానడానికి  
 
మునివేళ్ల బ్లేడులతో కన్నీళ్లు ఒత్తు కోవడం ఇప్పుడేమి కొత్తకాదు  కదా 
 
ఏ చూపులు ఎందుకు సడలాయో 
ఏ మాటలెందుకు తూలాయో 
ఏ రహస్యాలు చెప్పకుండానే ఎందుకు  బహిరంగమయ్యాయో 
 
ఏ సంభాషణలు అసలెందుకు  మొదలే కాలేదో 
అయినా  ఎప్పటికీ ఎందుకు పూర్తికాలేదో 
 
ఏ మాటల అర్థాలు ప్రతిసారీ కీకారణ్యాల్లో 
రాలిన ఆకుల మధ్య తప్పిపోయాయో 
 
ఎవరిని అడుగుదామిప్పుడు 
ఎవరున్నారని అప్పుడూ ఇప్పుడూ 
 సమాచారానికైనా  సాక్ష్యానికైనా 
 
సన్నని ఇసుకలా చేతివేళ్ళలోంచి అలవోకగా జారిపోయిన గతకాలం  గురించి కాదు 
ఇంకా గాయపడ్డ గోళ్ళ చివర్ల పచ్చిపచ్చిగా  అంటుకుంటున్న 
 క్షణాల  గురించి మాట్లాడుకోవాలి 
 
వేటికీ ప్రాయశ్చిత్తాలు లేవిప్పుడు ఏవీ ప్రక్షాళన కావిప్పుడు 
మచ్చలేవీ కొత్తగా  మానడమూ ఉండదు 
 
ఎక్కడో ఏ ఆకాశం చివర్లోనో  ఒక సూర్యకిరణం
హతమై రాలిపోతుంది  ప్రతిసారీ 
చీకటి బిలాల్లో ఇరుక్కుపోతుంది 
 
మనమూ అంతే  మన పరిచయము అంతే 
               
ఎప్పుడూ ఇట్లానే  మారువేషాలేసుకునే 
రాలిన వెలుతురు పండుటాకుల్నేరుకుంటూనే   …. 

******

Please follow and like us:

One thought on “వెలుతురు పండుటాకు”

Leave a Reply

Your email address will not be published.