షర్మిలాం “తరంగం”

-షర్మిల కోనేరు 

ఒకప్పుడు ప్రపంచం ఎంతో అందంగా ఆశావహంగా కనిపించేది.
ఇప్పుడు అంతా తల్లకిందులైంది .
ఎక్కడ చూసినా వేదన, రోదనలే !
మనుషులు ఏకాంతవాసంలో బతుకుతూ మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు.
నిన్నే బీబీసీ లో ఒక న్యూస్ చూసి చలించిపోయాను.
వైజాగ్ కేజీహెచ్ లో కరోనా పేషెంట్ ఒకామె హాస్పటల్ కిటికీలో నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయింది.
సీసీ కెమేరాలో చూసి సిబ్బంది ఆమెని కాపాడారు.
ఇప్పటికి కేజీహెచ్ లో నలుగురు రోగులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారని బీబీసీ కధనం.
కరోనాతో హాస్పటల్ లో వున్నప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ కనబడక పోవడం, పక్క బెడ్ల మీద పేషంట్లు కళ్ళ ముందే చనిపోవడం చూసి గుండె చెదిరి ఆ నలుగురు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
ఇది తేలికగా తీసుకోవాల్సిన విషయంలా అనిపించలేదు.
మానవాళి ఎదుర్కొంటున్న మానసిక సంక్షోభానికి సంకేతంలా కనిపించింది.
మునుపెన్నడూ ఇంత విపత్తు ఎదుర్కొని వుండం.
మన ముత్తాతల కాలం నాడు డొక్కల కరువు వచ్చి ఆకలిచావులు సంభవించాయని విన్నాం!
కానీ ప్రస్తుతం ప్రతి కుటుంబం సన్నిహితులని పోగొట్టుకుని మానసిక వేదనలో మునిగిపోతోంది.
మన చుట్టూ అసలేం జరుగుతోంది.
మనుగడే ప్రశ్నార్ధకంగా అనుక్షణం భయం గుప్పెట్లో బతకాల్సి వస్తోంది.
ప్రాణానికి విలువ లేని పాడుకాలం దాపురించింది.
ఎవరికీ ధైర్యం చెప్పలేని నిస్సహాత.
ఎక్కడ చూసినా రాలిపోతున్న ప్రాణాలు.
నిర్జీవమైన ఆప్తుల్ని నిస్సహాయంగా కాటికి సాగనంపే దుస్థితి.
ఈ కాలంలో ఎందుకు పుట్టామా అని బాధపడే స్థితి.
ప్రస్తుతం కరోనా మహమ్మారి అంతానికి ఆయుధం సమకూర్చుకోవాలి .
ఆయుధం చేతికి వచ్చే వరకూ మనకి ఆశావహదృక్పథమే శ్రీరామరక్ష.
మనలో గూడుకట్టుకున్న ఈ దిగులు కరిగిపోయే రోజు తప్పకుండా వస్తుంది.
ఆశ అనే దీపం అంధకారంలోనూ ముందుకు నడిపిస్తుంది.
అప్తులనీ హితులనీ సన్నిహితులనీ పోగొట్టుకున్నా ఆ బాధని దిగమింగుకుంటూ
ముందుకు మున్ముందుకు సాగక తప్పదు.
చీకటి తర్వాత వెలుగొస్తుంది .
ఆ వెలుగుల ప్రస్థానానికి ధైర్యమే కరదీపికగా ధరించి కదలాలి !
గతాన్ని వదిలేసి ఈ క్షణం మాత్రమే మనది అనుకుని జీవిద్దాం !
ఈ ప్రతికూల పరిస్థితుల్లో చాలా మంది డిప్రెషన్ కి గురవుతున్నారు.
మానసిక సమస్యలు చుట్టుముడుతున్నాయి.
ఒకరికి ఒకరం ధైర్యం నూరిపోసుకుంటూ బతకుదాం.
క్రిమిపై పోరులో అంతిమ విజయం మనదే !
ఈ లోగా శత్రువుతో పోరాడి అశువులు బాసిన వారికి నివాళులు అర్పించడమే మనం చేయగలిగేది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.