“గోడలు”

(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

– శీలా సుభద్రా దేవి

‘‘అంకుల్ ఏం చెయ్యమంటారు? అసోసియేషనుతో మాట్లాడి చెపుతానన్నారు కదా?’’

‘‘ఎవ్వరూ ఒప్పుకోవటం లేదమ్మా’’

‘‘మా ఇంట్లో మేం ఉంచుకోవడానికి అభ్యంతరం ఎందుకండీ!’’

‘‘ఇన్ఫెక్షన్లు వస్తాయని అందరూ అంటున్నారు’’ నసుగుతూ అన్నాడు.

‘‘నేనూ, నా భర్తా కూడా డాక్టర్లం. మాకు తెలియదా అంకుల్ ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఎప్పుడు రావో’’ గొంతులో కొంతమేర దుఃఖపు జీర ఉన్నా కొంత అసహాయతతో కూడిన కోపం ధ్వనించింది.

‘‘…. ఆయన ఏమీ మాట్లాడలేకపోయాడు. స్పీకర్ ఫోనులో వస్తున్న ఆ సంభాషణని వింటోన్న ఇతర సభ్యులు గుసగుసలాడుకోసాగారు.

‘‘పక్కనే ఇంట్లో అలా ఉంటే పూజలూ మళ్ళూ తళ్ళూ చేసుకోడానికి కుదరదు కదా’’ ఒక ఆమె సాగదీసింది.

‘‘నిజానికి పూజలే కాదు వంట కూడా చెయ్యరు ఆ విషయం తెలుసా’’ ఆ సంభాషణ వింటున్న శాస్త్రాలు తెలిసిన ఆమె వ్యంగ్యంగా అంది.

మళ్ళా స్పీకర్ ఫోన్ నుండి దుఃఖ స్వరం వినిపించింది.

‘‘పోనీ… మా యింటి కిందే వున్న మా పార్కింగు ప్లేసులో పెట్టుకోవచ్చా అంకుల్’’.

‘‘మాకిష్టం లేదమ్మా అసోసియేషన్ వాళ్ళంతా అభ్యంతరం చెపుతున్నారు’’.

‘‘మరి ఎట్లా చేద్దామంటారు? తమ స్వంత యింటికి వెళ్ళాలని రెండు రోజులుగా తపన పడ్డారు నాన్న…’’ దుఃఖంతో కాసేపు ఆగి మళ్ళీ…

‘‘….నాన్న ఆత్మశాంతికి ఇప్పుడైనా తేవాలని అనుకున్నాం. ఏదో ఒక సొల్యూషన్ నిర్ణయించండి అంకుల్’’ కంఠం ప్రాధేయపడుతున్నట్లుగా ధ్వనించింది.

‘‘కాసేపాగి అందర్నీ కనుక్కొని చెప్తానమ్మా’’ అన్నాడు అసోసియేషన్ ప్రెసిడెంట్.

‘‘మా అన్నయ్యలు యూ.ఎస్. నుండి, యు.కె. నుండి బయలుదేరుతున్నారు. వాళ్ళు వచ్చేసరికి రెండు రోజులు పడుతుంది. అంతవరకూ ఉంచక తప్పదండి’’. కంఠం కొంచెం ఖచ్చితంగానే ధ్వనించింది.

‘‘ఈ రోజు శుక్రవారం తీసుకొస్తే ఎట్లాగండీ’’ అంది నిత్యపూజారి శారదాంబ.

‘‘కొడుకులు వచ్చేవరకంటే అంతా అయ్యేసరికి రెండు మూడు రోజులు పడుతుంది. మార్చురీలో పెట్టుకోవచ్చు కదా’’ మరొకరు.

‘‘ఇటువంటప్పుడు ఏవో సిద్ధాంతాలన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే ఎలా ఏదో ఒక నిర్ణయం తీసుకోకతప్పదు. ఆయన కూడా అసోసియేషన్ మెంబరు కదా. అందరూ కూడా అంత కఠినంగా ఉంటే బాగుండదు. ఈ రోజు అతను, రేపు మరొకరు కావచ్చు’ అని సమాధానపరచుకొని అందరూ కలిసి పార్కింగు ఏరియాలోనే మరో గేటుకు సమీపంలో స్థలం కేటాయించారు.

కానీ ఇంకా అపార్టుమెంటు సభ్యులు, కుటుంబీకులు ఆ విషయమై తర్జన భర్జన పడుతూనే ఉన్నారు. ఎప్పటెప్పటి సాంప్రదాయాల్నో తవ్వితీస్తూ సాగదీసేవారూ, వాళ్ళతో సన్నిహిత సంబ:ధం ఉన్నవారూ, దిగులు గుండెల్తో పనులన్నీ మానేసి కారిడార్లలో కూర్చుని తదుపరి కార్యాచరణకై చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు. వాటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళు  తలో మాట అందిస్తూ వాద ప్రతివాదాలు చేస్తున్నారు. విసుగు కలిగి సుభాషిణీ మరొకిద్దరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు.

ఆరోజు సాయంత్రానికి రాజారాం భౌతిక దేహాన్ని వాళ్ళ అమ్మాయి, అల్లుడూ, భార్యా మరికొందరు బంధువులూ కలిసి తీసుకొచ్చారు. రెండో గేటు దగ్గర చుట్టూ షామియానా కట్టి ఐస్ బాక్సులో పెట్టారు. ఉండుండి ఏడుపులు వినిపిస్తుంటే ఎనభై అపార్టుమెంట్ల కొత్తగా కట్టిన భారీ భవనం ఒక విధమైన నీరవ నిశ్శబ్దాన్ని నిలువెల్లా కప్పుకొని, భయంకరమౌనంతో శీతలచ్ఛాయ కింద తపోదీక్షలో ఉన్న మౌనిలా అయిపోయింది. సాయంత్రం స్కూలు నుండి వచ్చి కేకలతో ఆట్లాడుకునే అపార్టుమెంట్లలోని పిల్లలందరూ వారి వారి ఇళ్ళల్లో బందీలయ్యారు.

జరుగుతున్న చర్చోపచర్చలు వింటున్న సుభాషిణికి మనసు భారమైపోయింది. కోడలు విశాల ఎప్పటికప్పుడు అపార్టుమెంటులోని లుకలుకలు సుభాషిణికి చెప్తూనే ఉంది.

భౌతికదేహం అక్కడ ఉండడం అనేక ఆలోచనలకు దారితీస్తోంద.

‘‘ఇకపై ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కింద సెల్లార్ లో కమ్యూనిటీ హాలు వాడుకుంటే బాగుంటుందేమో’’ అన్నాడు ఒకాయన.

‘‘అమ్మో అలా వద్దు. ఇంక అటువంటి వాటికే పరిమితమై అటువైపు వెళ్ళాలన్నా, కమ్యూనిటీ హాలులో ఫంక్షన్లు చెయ్యాలన్నా ఒక రకం భయం ఏర్పడిపోతుంది’’ అంది మరొక ఆమె.

‘‘నిజమే’’ చాలామంది ఆమెని సమర్థించారు.

‘‘అసలు వాళ్ళు మార్చురీలో పెట్టి పిల్లలొచ్చాక తీసుకురావచ్చు కదా’’ ఇంకొకరు.

‘‘అదేచెప్పాము. కానీ రాజారాం వారం రోజుల నుండీ యింటికి తీసుకెళ్ళమని పోరుపెట్టాడట’’.

‘‘అయినా వాళ్ళింట్లోనే పెట్టుకోమంటే సరిపోయేది. మనకి కామన్ వాల్ కూడా ఎక్కడా లేదు. అతని ఆత్మకీ శాంతి కలిగేది’’ అప్పుడే అక్కడికి వచ్చిన విశాల అంది.

‘‘అదెలా కుదురుతుంది?’’ గయ్యిమంది ఒకామె.

‘‘అవునండి ఎన్నో లక్షలు పోసి కొనుకున్న ఇల్లు. వాళ్ళకి మాత్రం తృప్తి కలిగించకపోతే ఎలా? ఏదో అనాథప్రేతంలా ఇలా సెల్లార్లలో పెట్టటం బాలేదు’’ నిరసనగా అంది విశాల. ఒకరిద్దరు మాత్రమే విశాలని సమర్థించారు.

రెండో రోజు రాత్రికి గాని విదేశాలలో వున్న పిల్లలు రాలేదు. ఎంతమంది ఎన్ని సిద్ధాంతాలూ, రాద్ధాంతాలూ చేసినా తప్పనిసరి పరిస్థితిలో అందరూ రాజారాం భార్యని కలిసి ఓదార్చారు.

యధావిధిగా మర్నాడు కార్యక్రమాలన్నీ పూర్తి చేసారు. భౌతిక దేహం వెళ్ళిపోయాక అపార్టుమెంట్ల బిల్డింగుకు కొంత మబ్బు విడినట్లు అయినా ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు.

కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత కూడా కొంతమంది మనసుల్లో ఆందోళన పరిస్థితులు సద్దుమణగలేదు.

ఎందుకంటే ఆ బిల్డింగులో ఇంచుమించు సగం అపార్టుమెంట్లలో రిటైర్ అయ్యి, పిల్లలంతా విదేశాల్లో ఉంటే ఇటువంటి కమ్యూనిటీ అపార్టుమెంట్లలో అయితే ఇరుగూ పొరుగూ ఉండి కొంత కాలక్షేపం, మరికొంత భద్రతా ఉంటుందనీ, కష్టానికీ సుఖానికీ పలికే సాయం ఉంటుందనే భావనతో కొనుక్కొని ఉంటున్నవాళ్ళే. కొన్ని ఇళ్ళల్లో విదేశాలలో ఉన్న పిల్లలు ఒక ఇన్వెస్టుమెంటులా కొని తల్లిదండ్రుల్ని ఇక్కడ ఉంచిన కుటుంబాలు కొన్ని. ఆరు నెలలు పిల్లల దగ్గరికి విదేశాలలో, ఆరు నెలలు ఇక్కడా కాలక్షేపం చేస్తున్నవాళ్ళూ చాలామంది ఉన్నారు. మిగతావాళ్ళు లోన్లు పెట్టి అపార్టుమెంటు కొనుక్కున్నవాళ్ళు. అందుకనే యువతరం కుటుంబాలవారికన్నా పిల్లలంతా విదేశాల్లో ఉన్న తల్లిదండ్రులకి గుండెల్లో బెరుకు మొదలైంది. కొత్తగా కట్టిన ఆ అపార్టుమెంట్లలో ఇంతవరకూ ఈ పరిస్థితి ఎదురుకాలేదు. ఇంతవరకూ సామూహిక పూజలు, సంబరాలు, ఉత్సవాలు జరుపుకున్న అనుభవమే ఉంది. ‘ఎప్పుడో తమకు ఆ పరిస్థితి వస్తుందేమో. పిల్లలు వచ్చేవరకూ ఇలా అనాధ ప్రేతంగా ఉండాల్సిందేనా!’ తలచుకంటుంటే చాలామందికి గుండె దడదడలాడటం మొదలైంది. కొంచెం బలహీన మనస్కులు కాస్త అనారోగ్యం బారినపడ్డారు కూడా.

బిల్డింగులో ఈ విషయంపై జరుగుతోన్న చర్చలు వింటున్న సుభాషిణికి కొంత కోపం, కొంత ఆందోళన చుట్టుముట్టాయి. 

‘ప్రపంచం అంతా ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక కుగ్రామం అయ్యిందంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్ పెరిగి వేటికవి ఒక గ్రామంగా మారిపోతున్నాయి. పిల్లలందరూ ఉన్నత విద్యల కోసమో, ఉద్యోగావకాశాల కోసమో విదేశాల బాటపట్టి అక్కడే స్థిరపడిపోవటం, ఇంటినిండా ఖరీదైన వస్తువులు చేరటం ఇదంతా అభివృద్ధే అనుకుంటే, ఈ అభివృద్ధి పథంలో మనుషులు ఒకరికీ ఒకరికి మధ్య గోడలు కట్టుకుని విడిపోతున్నారా? మానవత్వం విధ్వంసం అవుతోంది. మానవ సంబంధాలు బంధుత్వాలు ఛిద్రం అవుతున్నాయి. తల్లిదండ్రులూ, ఆఖరిచూపు అందుకోలేని పిల్లలూ వీరి మధ్య ప్రేమలు యాంత్రికమౌతున్నాయి’.

-ఆలోచిస్తున్న సుభాషిణికి మనసంతా కకావికలమైపోయింది. రాత్రంతా కంటిమీద రెప్పవాలలేదు. కలత నిద్రలో పక్క మీద దొర్లుతూనే ఉంది. అదేవిధంగా మరో అయిదు రోజులు గడిచిపోయాయి.

సుభాషిణి ఒకరోజు రాజారాం భార్యని పరామర్శించటానికి వెళ్ళింది. మోచేతి నుండీ ముంజేతివరకూ రంగురంగుల గాజులు వేసుకుని, జడనిండా పెద్దపూలమాల, మెళ్ళో గుచ్చిన రెండు పేటల నల్లపూసల గొలుసు, పెద్ద కుంకుమ బొట్టుతో అలంకరించుకన్న ఆమెని చూసేసరికి సుభాషిణికి గుండె బరువెక్కింది. బలికి సిద్ధం చేసిన జంతువు కళ్ళల్లో మెదిలింది. అక్కడే స్టూలు మీద దండవేసిన రాజారాం ఫోటో దాని ముందు వెలుగుతోన్న దీపం ఆ పక్కనే మూలగా చాప పరచి వుంది.

‘‘పదకొండో రోజు కార్యక్రమానికి రండి ఆంటీ’’ అంది దుఃఖంతోనే ఆమె.

‘‘ఆ రోజు అంకుల్. నేను అత్యవసరంగా పనిమీద వెళ్ళాల్సి ఉంది. మళ్ళీ వస్తాలే అంటూ లేచింది సుభాషిణి.

‘‘ఎప్పుడైతే అప్పుడు రండి ఆంటీ, కానీ ఆ రోజే ముఖం చూడటం మీకు మంచిదట కదా’’ కళ్ళనిండా నీళ్ళతో, గొంతు నిండా దుఃఖంతో అంది.

‘‘నాకు అలాంటి నమ్మకాలు లేవమ్మా. ఎప్పుడో ఒకరోజు ఇలాగే వస్తాలే’’ అంటూ సుభాషిణి ఆమె చేతిని ఆత్మీయంగా నొక్కింది.

ఆసరా కోసం అన్నట్లు సుభాషిణి చేతులు పట్టుకుంది.

కాసేపు ఆమెతో మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చినా సుభాషిణికి మనసు మనసులో లేదు. పదకొండో రోజు చేయబోయే కార్యక్రమం గుండెల్లోంచి దుఃఖాన్ని కడుపులోకి దేవినట్లయ్యింది. తర్వాత్తర్వాత కూడా ఆ భర్త ఎటువంటివాడైనా అతడిని మర్చిపోనంతగా, మర్చిపోకుండా ఉండేలా ఆ భార్యని శారీరకంగా, మానసికంగా చేసే ఈ చిత్రవధలు ఎప్పటికి మారుతాయి?

ప్రతిఘటించి నెగ్గలేని పరిస్థితుల్లో మనకి నచ్చినా నచ్చకపోయినా మౌనాన్ని ఆశ్రయించక తప్పక పోవడం సుభాషిణి కలచివేసింది. ఈ మార్పు అంత సులభంగా వచ్చేది కాదు. ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ కుటుంబాలలో సైతం ఎదిరించటం కష్టమైన స్థితిలో సమాజంలో మార్పు తేవాలంటే ఒక ఉద్యమం తేవాల్సిందే.

సుభాషిణి యింటికి తిరిగి వచ్చినప్పటినుండీ విశాల రెండు మూడుసార్లు ‘‘అత్తయ్యా ఆమె ఎలా ఉంది?’ అని విశేషాలు అడగాలనుకుని అన్యమనస్కంగా ఉన్న అత్తని కదిలించటం ఇష్టంలేక వూరుకుంది.

అంతలో సడన్ గా విశాలను పిలిచి ‘‘విశాల పదకొండోరోజు సోమవారం చేస్తారట. నువ్వు వాళ్ళింటికి వెళ్ళకు. నేను నా పని చూసుకొని వచ్చాక మరోరోజు మనిద్దరం వెళ్ళి పలకరించి సాంత్వన పరచివద్దాం’’ అంది సుభాషిణి.

విశాల ఆశ్చర్యంగా సుభాషిణివైపు చూసి ‘‘నేనూ అదే అనుకున్నాను. అత్తయ్యా. అందరం అలా పోలోమంటూ వెళ్ళటం నాకూ ఇష్టం లేదు’’ అంది.

‘‘మరొక విషయం విశాలా నేను చనిపోతే అందరికీ ఇబ్బంది కలిగిస్తూ మంచుపెట్టెలో పెట్టి ఇంట్లోనో, అనాధప్రేతంలా సెల్లార్లోనో  పెట్టకుండా నా శరీరంలోని ఏ అవయవమైనా ఎవరికైనా ఉపయోగపడితే ఇచ్చేసి, అటునుంచి అటే బూడిద చేసేయండి’’ నిశ్చలంగా ధ్వనించింది సుభాషిణి కంఠం.

తెల్లబోయింది విశాల. ‘‘అదేమిటి అత్తయ్యా ఆ మాటలు’’ విశాల కళ్ళనిండా గిర్రున తిరుగుతోన్న కన్నీళ్ళు!

****

Please follow and like us:

28 thoughts on ““గోడలు”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)”

  1. ఆధునిక సౌకర్యాలయితే వస్తాయి కానీ మనుషులు మారరు. ముగింపులో అత్తయ్యగారిమాటల్లో ఆధునికత ఆచరణీయం. బాగుంది సుభద్రాదేవిగారూ

    1. మీ స్పందనకు ధన్యవాదాలు మాలతి గారూ

  2. చాలా మంచి కథను అందించారు మేడం. ఇటువంటి పరిస్థితులు చాలా అపార్ట్మెంట్స్ లో చూస్తున్నాము. ఒక సేన్సిటివిటి అనేది మనుషులలో తగ్గిపోతుంది అని అనిపిస్తుంది. ప్రతీ వారికి, ఇటువంటి సమయములోనే తోటి మనిషి సహకారం కావాలని కోరుకుంటారు. కానీ ఆచారాలు, నమ్మకాల పేరుతో వారిని మరింత క్షోభ పెడుతున్నారు. ఇది మారాలంటే ఆలోచనా సరళి మారాలి. చాలా ఆలోచనాత్మక కథను అందించారు, అభినందనలు.

    1. ఆత్మీయ స్పందన కు ధన్యవాదాలు పల్లవీ

  3. మంచి సందేశం ఉన్నకథను అందించారు..ఆచారాల పేరిట మనిషికి మనిషికీ అడ్డుగోడలను ఎలా నిర్మించారో చక్కగా చెప్పారు.మనిషి కాలినడక నుండి అంతరిక్షానికి ప్రయాణించే స్థాయికి చేరుకున్నాడు సమిష్టి.కృషి వలన..అది విస్మరించి..ఈ అడ్డుగోడలు నిర్మించడం అమానుషం! మరోపక్క భర్తను కోల్పోయి బాధపడుతున్న ఆస్త్రీమూర్తిని.ఆచారాల పేరుతో హింసించడం ఇంకా అమానుషం ! సుభాషిణి గారి ఆలోచన నిర్ణయం ఈ కథకి కొసమెరుపు..ఎవరో ఒకరు అడుగు ముందుకు వేస్తేనే కద ప్రగతి !అభినందనలు సుభద్రా దేవి గారూ!💐💐

    1. మీ ఆత్మీయ స్పందన కు ధన్యవాదాలు హైమవతి గారూ

  4. చక్కని సందేశం ఇచ్చిన కథ..కాలం మారింది ..కాలినడక దశ నుండి అంతరిక్షానికి ప్రయాణించే దశకు చేరుకున్నాడు సమిష్టి కృషి వలన.కానీ ఇంత ఎదిగిన మానవుడు చిత్రంగా ఆచారాల పేరుతో మనిషికీ మనిషికీ అడ్డుగోడలు కట్టడం అమానుషం..మరోపక్క భర్త ఎడబాటుతో కుమిలిపోతున్ ఆ స్త్రీమూర్తిని ఆచారాలపేరుతో శిక్షించడం ఇంకా అమానుషం! మార్పు మననుండే మొదలు కావాలని సుభాషిణి పాత్ర ద్వారా చెప్పించడం కథకి కొసమెరుపు ! అభినందనలు సుభద్రా దేవిగారూ!💐💐

    1. చక్కని స్పందన ను తెలియజేసినందుకు ధన్యవాదాలు

  5. గుండెను తడి చేసే ఇలాంటి సాంప్రదాయాలు ఎప్పటికి మారతాయో.. అంతరిక్షంలోకి దూసుకుపోతున్నామనే మహిళలు తమ చుట్టూ జరిగే ఈ తంతును ఎందుకు ఆపటం లేదో.. ఈ గోడలు ఎప్పటికి బద్దలవుతాయో..
    మనసును కదిలించారండీ సుభద్రగారూ..

    1. మీ స్పందన కు ధన్యవాదాలు సుబ్బలక్ష్మి గారూ.ఆరోజు కోసం ఎదురు చూద్దాం

  6. అభివృద్ది చెందుతున్నాం. ఆధునికం అవుతున్నాం. అని చెప్పుకుంటూ అనాగరికంగా ప్రవర్తించడం పెరిగిపోతున్నది.
    కథ చదువుతుంటే ఈ మధ్య
    నాకు తెలిసిన రెండు కుటుంబాలలో మరణించిన వ్యక్తులు, వారిని అపార్ట్ మెంట్ కు తీసుకురావడానికి వీల్లేదన్న అసోసియేషన్ , ఆ కుటుంబాల బాధ అన్నీ కళ్లముందుకొచ్చాయి.
    మన చదువు, సంస్కారం, అభివృద్ది , నాగరికత అక్కరకు రాని ఆచారాలలో బందీ అయిపోతున్నాయేమో..

    1. నిజమే.నీ స్పందన కు ధన్యవాదాలు శాంతిప్రబోధా

  7. ఆధునికత ఎంత పెరిగినా ఆ పదకొండో రోజు ఆనవాయితీ మారట్లేదు‌. ఎవరో ఒకరు మొదటి అడుగు వేయాల్సిందే.
    మా నాన్న గారు చనిపోయినపుడు ఒకరోజంతా ఐస్ బాక్స్ లో ఇంట్లోనే ఉంచేశాము. అది అపార్ట్ మెంటే కానీ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.

    1. మీ ఆత్మీయ స్పందన కు ధన్యవాదాలు లలితా వర్మ గారూ

  8. మనిషి యెంత సౌఖర్యవంతమైన యిల్లు యేర్పాటు చేసుకున్నా ఆఖరి క్షణాల్లోనో మరణించాకో అర్ధంలేని భయాలతో పెట్టే ఆంక్షలు అమానవీయంగా వుంటున్నాయి. గేటెడ్ కమ్యూనిటీ కాలనీలలో కోట్లు కుమ్మరించి కొనుక్కున్నా యీ విధమైన అవమానాలు తప్పడం లేదు. మనిషి కుంచించుకుపోతున్నాడు అర్దంలేని ఆచారాలతో తోటి మనిషిని క్షోభ పెడుతున్నారు. మార్పు రావాలి.. విధి విధానాలు రూపొందించుకోవాలి. ఆలోచనాత్మకమైన కథ. అభినందనలు సుభద్ర గారూ…

    1. ఈ సందర్భంగా మహిళలపట్ల జరిగే ఈ అమానవీయ సాంప్రదాయం మార్చే పరిస్థితి కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు.ఈ గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ళల్లో ఎక్కువ గా చదువుకున్నవారు, ఉద్యోగస్తులే ఉన్నా ఇటువంటి పరిస్థితిలో అంటీముట్టనట్లే ఉంటారు.మీ అమూల్య స్పందనకు ధన్యవాదాలు వనజా తాతినేని గారూ

  9. నమస్తే అండి సుభద్రదేవిగారు మంచి కధను పాఠకులకి అందించారు. జీవితంలో చావు పుట్టుక లు ఎవరి చేతుల్లోను లేవు.బతికిన నాలుగు క్షణాలు నా అనుకొని
    బతకాలి. భూమి మీదకి వచ్చినపుడు ఏర్పడిన బంధాలు పోయేటప్పుడు కొంతమేర వరకు రావటం. ఈ ఆచారాలు కట్టుబాట్లు సంప్రదాయాలు అన్ని మనం ఏర్పరచుకున్నవే.ప్రతి ఒక్కరూ పోవాల్సిన వాళ్ళమే. ఒక మనిషి పోయినప్పుడు ఇన్ని రకాల ఆలోచనలు పరామర్శకి వెళ్ళివచ్చిన అత్తగారు నేను పోయాక అటునుంచి అటే అనటంలో ఎంతో అర్థం స్ఫురిస్తుంది.
    అంతేకదా మనిషి పోయిన తర్వాత ఏమి జరుగుతుందో
    ఆ వ్యక్తికి తెలీదు కాబట్టి బతికిన నాలుగు రోజులు సంతోషంగా బతికేద్దాం.శుభాకాంక్షలు అండి

    1. మీ సుదీర్ఘ స్పందన కు ధన్యవాదాలు యామిని గారూ

  10. చాలా బావుంది సుభద్రా కదా,కథనం. చివరిలొ సుభాషిణి నిర్ణయమింకా బాగుంది..
    అసలు ఈబాడీ డొనేట్ చేయటం బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు.

    ఇక ప్రపంచం తీరు అలాగే ఉంటుంది.ఎదుటి వారి కష్టానికి తెగ వ్యాఖ్యానాలు చేసే వారు తమ కి ఆ పరిస్థితి వస్తే అని ఆలోచించరు.
    చిత్రమైన లోకం..

    స్త్రీ ని తన ప్రమేయం లేని అంశాలకు సంప్రదాయం పేరుతో బాధించే ఈ జబ్బు ఇంత వేగం వదలదు అనిపిస్తుంది నాకు.
    ఈ రోజుల్ల్ స్త్రీ పై ఈ వివక్ష, దోపిడీ, అణచి వేత లకి తోడు భౌతిక దాడులు తీవ్ర స్థాయి లో జరుగుతున్నాయి.ఇది చాలా విషాద కరం.
    ఈ పరిస్థితి మారాలంటే స్త్రీ ల పట్ల ముందు స్త్రీల దృక్పధం కూడా మారాలి..

    మంచి కథ అందించిన నీకు అభినందనలు

    1. నిజమే నీవన్నది.ఈ పరిస్థితి కొనసాగటం లో కొంతవరకూ స్త్రీల బాధ్యత కూడా వుంది.మార్పురావటానికి ఎంతకాలం పడుతుందో మరి.మంచి స్పందనను తెలియజేసినందుకు ధన్యవాదాలు సావిత్రీ

  11. కథ చాలా బాగుంది సుభద్ర గారు.. చాలా వాస్తవికంగా ఉంది.. ఎవరెంత బాధ పడినా ఇలాంటి విషయాలలో అన్నీ పద్ధతి ప్రకారమే కానిస్తారు..

    1. మీ స్పందనకు ధన్యవాదాలు రమాదేవి

  12. ఇది చాలా బాధాకరమైన విషయం.కాలం మారుతున్నా పరిస్థితులకు అనుగుణంగా
    నడుచుకునే మార్గంలో నరనరాన జీర్నిన్చుకుపోయిన మూఢనమ్మకాలు అడ్డు పడుతున్న యి.ఇందులో అక్షరాస్యుడికీ,నిరక్షరాస్యులకు తేడా లేదు.కులాలు/మతాలు వీటికి అధనం.మరి అద్లె ఇన్టిలో వుండే వారి పరిస్థితి వూహించ వచ్చు.
    మంచి అంశాన్ని కథకు ఎన్నుకున్న సుభద్రాదేవి గారికి వందనం.

    1. మీ అమూల్య స్పందనకు ధన్యవాదాలు ప్రసాద్ గారూ

  13. ఆచారం పేరిట, భర్త గతించిన తర్వాత ఆమె అలంకరణ తీసేసే దురాచారాన్ని స్త్రీలంతా ఒక్క మాటపై నిలబడి ఈ కార్యక్రమం వద్దని ఆపాలి. ఇంకా ఎవరో వచ్చి మనల్ని ఈ సమస్య నుంచి బైటపడేయ్యాలని అనుకోవద్దు అనే ఒక చక్కని పురోగమన దిశగా బుద్ధి ప్రచోదనాన్నికలిగించిన ఈ కథ చాలా బావుంది. ‘ఏదో ఒక రోజు మనమూ వెళ్లిపోయేవాళ్లమే’ అన్న ఎరుకతో, లేనిపోని అనుమానాలు వదిలి ఇరుగుపొరుగు వారు పార్థివ దేహం విషయంలో సహానుభూతితో ఉంటే బావుంటుందన్న సందేశమూ ఉందీ కధలో. నలుగురికీ ఉపయోగపడే కథ.

    1. మీ సవివరమైన స్పందనకు ధన్యవాదాలు గౌరీ లక్ష్మి గారూ

  14. మనిషి పోయాక కూడా మనుషుల మధ్య అడ్డు గోడలా

    1. అదేనండీ నాా బాధ.మీ స్పందన కు ధన్యవాదాలు దేవకి గారూ

Leave a Reply to శీలా సుభద్రా దేవి Cancel reply

Your email address will not be published.