మంత్ర జప ఫలం

-ఆదూరి హైమావతి 

అనగా అనగా అమలాపురం అనే ఊరి పక్కన ఉండే అడవి ప్రాంతాన ఆనందముని అనే ఒక ఆచార్యుడు ఒక ఆశ్రమం నిర్మించుకుని,తన వద్దకు విద్యార్జనకోసం వచ్చిన వారిని శిష్యులుగా స్వీకరించి విద్య బోధించే వాడు. 

   ఆయన వేద వేదాంగాలను కూలంకషంగా ఔపోసన పట్టిన వాడు. విద్యా భోధనలో మంచి నేర్పరని పేరుగాంచిన వాడు. ఆయన శిష్యులు తమ గురువును సేవిస్తూ విద్యాభ్యాసం చేసే వారు.  

    ఆయన ఆశ్రమంలో శిష్యులు ఉదయం కొందరు, మధ్యాహ్నం  కొంద  రూ రెండు విభగాలుగా అడవి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వన మూలికలనూ, అగ్నికార్యానికీ కావలసిన దినుసులనూ, ఓషధీ పదార్థాల నూ , కొన్ని ఓషధులకోసం ప్రతేకంగా  కావలసిన వింత పుష్పాలనూ  ఏరి, వెతికి  తెచ్చేవారు.  

   అమలాపురంలో వాసవుడు అనే ఒక అనాధ  బాలుడు ఉండే వాడు. వాసవుడు చిన్నతనంలో వారూ వీరూ పెట్టినవి తింటూ కాస్త పెరిగి పెద్ద య్యాక, అలా యాచించి తినను ఇష్టపడక , ఎలాగో ఒక గొడ్డలి ఒక ఇంటి వారి వద్ద అడిగి తెచ్చుకుని అడవి లోకి వెళ్ళి ఎండు  కొమ్మలనూ మాత్ర మే కొట్టి ,కట్టకట్టుకుని తెచ్చు కుని ఊర్లో ఎవరికో అమ్మి వారు పెట్టినది తినేవాడు.

   వాడు రోజూ ఊర్లోనుంచీ అడవికి వెళ్ళే దారిలో ఉన్న ఆనందముని ఆశ్రమం ముందునుంచీ వెళ్లవలసి ఉంది. వాసవుడు ఆ ఆశ్రమం ముందు ఒక్క క్షణం ఆగి ఆశ్రమం లోని ఒక రావి చెట్టు క్రింద వున్న అరుగుమీద కూర్చుని  అక్కడ తన విద్యార్థులకు విద్య బోధించే  ఆనందముని ఎదురుగా దూరం నుంచే నేలమీద పడుకుని సాష్టాంగ  నమస్కారం చేసి , ఆయన తనశిష్యులకు బోధించే గణేశ మంత్రం లోని ఒక్కో అక్షరాన్నీ వింటూ గుర్తుంచుకుంటూ ముందుకు సాగిపోయేవాడు. క్రమేపీ వానికి ‘ఓంశ్రీ గణేశాయ నమః ‘  అనే ఒక్క పదం మాత్రమే పలక ను రాగా దాన్ని మాత్రమే రోజంతా జపించుకుంటూ ఉండేవాడు.  

  అలావాడు తనకు దూరం నుంచీ నమస్కరించటాన్ని కొద్ది రోజులకు ఆనందముని  గమనించి దూరం నుంచే తానూ చేయెత్తి అతడిని దీవించే వాడు.అతని శిష్యులు కొద్ది రోజుల తర్వాత తమ గురువు ఎవరిని దీవిస్తున్నారో తెలీక తాము చూసినా వారి చుట్టూతా  పూల మొక్కలు ఆశ్రమంలో ఉండటాన వారికి బయట ఎవరూ కనిపించలేదు.గురువు గారు తమనే దీవిస్తున్నారని భావించి శిష్యులు మౌనంగా ఉండిపోయారు. 

       కొన్ని మార్లు శిష్యులకు వాసవుడు  అడవిలో ఎండు కట్టెల కోసం వెతుకుతూ కనిపించేవాడు.వాసవుడు  వారిని చూసి నమస్కరించేవాడు. ‘తానూ వారిలా చదువుకుంటే ఎంతబావుంటుంది, తనకెవ్వరూ లేరు కనుక ఇలా కట్టెలు కొట్టుకుని బతకాల్సి వస్తున్నది, వెధవ ఆకలికోసం ‘ అనుకునేవాడు. వారిని ‘అదృష్టవంతులు’ అని భావించి నమస్కరించే వాడు.

 వాసవుడు ‘ఓం శ్రీ గణేశాయ నమః  అనేమంత్రాన్ని మాత్రం అనుక్షణం మనస్సులో జపించుకుంటూ ఉండేవాడు.

 అలాకాలం జరిగిపోతున్నది. ఒక సంవత్సరం విపరీతమైన చలితో కూడిన వర్షాలు పడసాగాయి. వాసవునికి ఎండుకట్టెలు దొరకడం కష్ట మైంది.ఒకరోజున అడవి లోపలికి వెళ్ళి  వాసవుడు ఎండు కట్టెలు అతి  కష్టం మీద వెతికి కొట్టుకుని వస్తుండగా వర్షం ప్రారంభమైంది. 

  గబగబా అడుగులేస్తూ కట్టెలమోపు నెత్తిమీద పెట్టుకుని , అది తడిస్తే ఎవ్వరూ కొనరేమో అనే భయంతో వడి వడిగా నడుస్తూ ఆనంద ముని ఆశ్రమం ముందుకు రాగానే  అలవాటు ప్రకారం కట్టెలమోపు క్రిందికి దించి అక్కడున్న ఒక వేపచెట్టు క్రింద ఉంచి ,క్రింద నీరు ఉన్నా లెక్క చేయక పడుకుని ఆనందమునికి సాష్టాంగంగా  నమస్కరించాడు.    

 వర్షం  కారణాన ఆరోజు పాఠాలు లోపలి వసారోలో బోధిస్తున్న ఆనంద ముని  దూరంగా తనకు నమస్కరిస్తున్న వాసవుని చూసి, గబగబా బయ టకు వచ్చాడు. శిష్యులంతా వానలో తడుస్తూ గురువుగారు అలా బయటికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపడ్దారు.

ఆనందముని,  నమస్కరించి పైకి లేచి నిలుచున్న వాసవుని చూసి ” నాయనా! ఎంత అదృష్ట వంతుడివి! నీవు గణేశుని జపం చేస్తున్నావా! ” అని అడిగినదానికి వాసవుడు ” సావీ! తవురు మీ సిస్సులకు సెప్పే మంతరం ఇని  ఇనీ ఒక్కో అచ్చరం పలుకుతా నేర్చుకున్న మంతరాన్ని ఇట్టా ‘ఓం శ్రీ గణేశాయనమః ‘ అంటా నిత్తెం లోలోపల పలక్కుంటా వుంటానయ్యా! యావయినా తప్పు సేసినానా!సావా!” అని అడగ్గా ,

” నాయనా! నీ అంత అదృష్ట వంతుడు లేడు , నీవెనకే వినాయక స్వామి నడుస్తూ నిన్ను కాపాడుతున్నాడయ్యా!  నీకు కనిపించలేదు కానీ ,నేను ఈరోజు నీవు క్రింద పడుకుని నమస్కరిస్తున్నపుడు  గమనించాను. చూడు నాయనా! నీవుకానీ, నీ కట్టెల మోపుకానీ ఇంత వర్షానికీ తడవనేలేదు.అది గణేశప్రభువు నిన్ను అనుగ్ర హించి,కాపాడటం వలన.  ” అంటూ ” నాయనా! నీలాంటి వాడు నాకు శిష్యునిగా ఉంటే నా అదృష్టం గా భావిస్తాను. ఈరోజునుండీ నీవు కట్టెలు కొట్టుకోనక్కరలేదు. నా ఆశ్రమం లో నాశిష్యులతో పాటుగా ఉండి నాదగ్గర చదువుకో !” అంటూ అతడిని చెయ్యిపట్టుకుని లోనికి తెచ్చారు. శిష్యులంతా అతడిని చూసి గుర్తించారు . వారంతా ఆశ్చర్యంగా గురువుగారి చర్యను చూస్తుండగా , ఆనంద ముని ” నాయన లారా! ఇతనుతాను విని నేర్చుకున్న  ఒకే ఒక గణపతి మంత్రం నిత్యం జపించ టాన ఇతనికి గణేశుని అనుగ్రహం లభించిం ది. ఇతని వెనుకే గణేశ ప్రభువు నడు స్తూ ఇతన్ని కాపాడటం నా కళ్ళారా చూశాను. ఈ రోజునుంచీ ఇతనూ మన ఆశ్రమం లో ఉండి విద్యాభ్యాసం చేస్తాడు “అనగానే అంతా  వాసవునికి  ఆహ్వానించి ,లోపలికి గొని పోయారు.

చూసారా!  సహస్ర నామాలూ , లక్షార్చనలూ చేయక పోయినా ఒక్క మంత్రా న్ని భక్తితో నిరంతరం జపిస్తే  వచ్చే ఫలితం. 

                        భగవంతుడు భక్తిని మాత్రమే చూస్తాడు. 

      *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.