యాత్రాగీతం

నా కళ్లతో అమెరికా

అలాస్కా

-డా||కె.గీత

భాగం-13

 సీవార్డ్  విశేషాలు చెప్పుకునే ముందు తల్కీట్నా నుంచి సీవార్డ్ వరకు ప్రయాణంలో మరిన్ని విశేషాలు చెప్పాల్సి ఉంది. 

తల్కీట్నా నుంచి సీవార్డ్ వెళ్లేదారి మొత్తం సముద్రపు పాయలు భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన తీర ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తాం. 

బస్సు ప్రయాణిస్తున్న రోడ్డుకి ఒక పక్కగా పట్టాలు, మరో పక్క నీళ్లు. 

ఏంకరేజ్ నుంచి మేం అలాస్కా టూరు లో మొదట చూసిన విట్టియర్ వైపుగానే కొంత  దూరం ప్రయాణం చేసాం. 

ఆ రోజు మా రైలు ప్రయాణం చేసిన ప్రపంచంలోనే పొడవైన టన్నెల్ (2.5 మైళ్లు) జ్ఞాపకం వచ్చింది. 

అప్పుడు చూసిన సముద్ర తీరం మొత్తం నీటితో తళతళలాడినట్టు గుర్తు. కానీ ఇప్పుడు మొత్తం బురదమయంగా ఉంది. 

దానికి సమాధానంగా అన్నట్టు బస్సులో డైవర్ కం గైడు అలాస్కాలోని తీర ప్రాంతాల్లో సముద్ర మట్టం ఆటూ పోటుల్లో తేడా దాదాపు 35 అడుగులు ఉంటుందని చెప్పగా విని ఆశ్చర్యపోయేం.

అందుకే ఇక్కడ బెలూగాలు, సాలమన్లు అనే నీటి ప్రవాహానికి ఎదిరీదే చేపలు మాత్రమే నివాసం ఉంటాయట. 

అలాగే మార్గమధ్యంలో కొన్ని చెట్లు కాలిపోయినట్లు, ఉప్పు పట్టినట్లు వింతగా కనిపంచాయి.

1962లో అలాస్కా లో సంభవించిన అతిప్రమాదమైన 9.2 భూకంపం వల్ల సముద్ర మట్టం అమాంతం పెరిగి ఇక్కడి తీర ప్రాంతాన్ని రోజుల తరబడి కప్పివేసిందట. 

అన్ని రోజుల పాటు ఉప్పునీటిలో నానిపోయిన చెట్లు చివికిపోయి ఇప్పటికీ అక్కడక్కడా సాక్షాత్కరిస్తూ ఉన్నాయట.

మార్గమధ్యంలో పర్వతాల కొనలమీద ఒక్కోచోట ఎక్కడా ఒక్క మొక్క కూడా లేకుండా నున్నని రాతి పలకల్లా ఉండడం గమనించాం. శతాబ్దాల తరబడి మంచుతో కప్పబడి ఉన్న గ్లేసియర్లు కరిగిపోయేక బయట పడ్డ పర్వతాలట అవి.

అందుకే అక్కడ ఇప్పటికీ మొక్కలు మొలవడం లేదన్నమాట.  

తల్కీట్నా నుంచి సీవార్డ్ కి చేసిన అయిదారు గంటల ప్రయాణం ఆహ్లాదకరంగా జరిగినా బస్సు సీవార్డ్ లో దిగే సరికి సిరి కి జ్వరం వచ్చేసింది.  

బస్సులో మావి చివరి సీట్లు కావడం, బాత్రూం పక్కనే సీట్లు ఉండడం మొదట చికాకు అనిపించినా సిరికి దారి పొడవునా అస్తమాటూ బాత్రూములోకి తీసుకు వెళ్లాల్సి  రావడంతో మేం అక్కడ కూర్చుని ఉండడమే  మంచిదనిపించింది.

సాయంత్రం సీవార్డ్ చేరేక సిరికి జ్వరం మందు వేసేసరికి అలిసిపోయి నిద్రపోయింది. 

ఈ ప్రయాణంలో ఇంకో అపశృతి ఏవిటంటే సీవార్డ్ చేరేసరికి  నాకు రెండు పాదాల వేళ్ళ మీద అక్కడక్కడా చిన్న నీటి పొక్కుల్లా వచ్చి విపరీతమైన దురద ప్రారంభమయ్యింది.  

ఏదో ఎలర్జీ వచ్చి ఉంటుందని తర్వాత మూడు రోజులకి ఇంటికి వచ్చే వరకు ఫస్ట్ ఎయిడ్ ఏదో చేసి ఓపిక పట్టాను. అయితే తేలిన విషయం ఏవిటంటే అలాస్కాలో మాత్రమే ఉండే బెడ్ బగ్స్ వంటి కొన్ని పురుగులు కుడితే మాత్రమే వచ్చే అంటువ్యాధి అట అది. 

ఇందుకు నాతో బాటూ ఇంట్లో అందరం తలా ఒక క్రీము కొనుక్కుని వారం పాటు కాళ్లకే కాదు, ఒళ్ళంతా పట్టించుకోవలసి వచ్చింది. 

నాకు మరో వారం తర్వాత మొత్తం తగ్గేవరకూ ఆగి అందరం మరో రౌండు డాక్టర్లకి చూపించుకోవాల్సి వచ్చింది. 

దెనాలి నేషనల్ పార్కులో మేం ఉన్న హిల్ రిసార్ట్ లో ఒక విధమైన పాతకాలపు గడ్డి పరుపుల వంటివి ఉండడంతో బహుశా: అక్కడే ఏవో కుట్టి ఉంటాయని నేను అంచనా వేసుకున్నాను. లేదా ప్రయాణమంతా దాదాపుగా చెప్పులు వేసుకుని తిరిగినందువల్ల ఎక్కడైనా ఏవైనా కుట్టి ఉండవచ్చు. ఏదేమైనా అలాస్కాలో ఇటువంటి  బగ్స్ తో జాగ్రత్తగా ఉండాల్సిందే. 

ఇక ఇంతకు ముందు భాగంలో చెప్పినట్టు  సీవార్డ్ లోని హోటలు రిసార్ట్ ఒక పెద్ద అపార్టుమెంటు కాంప్లెక్సు వంటిది. 

ఒక చోటి నించి మరో చోటికి నడవడానికి సమయం పడుతుంది. పూర్తిగా చెక్కతో నిర్మించబడిన పెద్ద కాబిన్ కాంప్లెక్సుల్లో మా బ్లాక్ లో చిట్టచివరి కాటేజీ మాది. అంతవరకు అలాస్కాలో మేం బస చేసిన అన్ని రిసార్ట్ ల కంటే పెద్ద పెద్ద దుంగలతో తయారుచేసిన ఫర్నిచర్ తో  భలే విభిన్నంగా ఉన్న రిసార్ట్   ఇది. 

వరు కూడా హోటలులో ఉండిపోతాననడంతో అలా తిరిగొద్దామని ఊర్లోకి మేమిద్దరం బయలుదేరేం. 

రిసార్టు ఎంట్రైన్సు దగ్గర నుంచి డౌన్ టౌన్ కి షటీల్ సర్వీసు ఉండడంతో అక్కడి వరకు నడిచి అక్కడి నుంచి డౌన్ టౌన్ కి పది పదిహేను నిమిషాల్లో చేరుకున్నాం.

సీవార్డ్ లోని డౌన్ టౌన్ మొత్తం ఒక్కప్పుడు గ్లేసియర్ అట. ఎత్తున కొండ మీద నుంచి సముద్రంలో కలిసేవరకు ఉన్న సహజ సిద్ధమైన రహదారే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మేం నిలబడ్డ చోట కొన్ని వేల, లక్షల సంవత్సరాల కిందట గ్లేసియర్ ఉండేదని తల్చుకోవడానికే ఒళ్ళు గగుర్పొడిచింది.   

****

(ఇంకా ఉంది)

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.